Friday, September 9, 2016

సుమతీ! కి పేరడీ కుమతీ!


సుమతీ!  కి  పేరడీ  కుమతీ!


సాహితీమిత్రులారా!




సుమతీ శతకాన్ని కుమతీ శతకంగా పేరడీ
ఇతిశ్రీగారు రాశారు. ఇతిశ్రీ ఎవరోకాదు
ఆచార్య పుల్లెల రామచంద్రుడుగారు.
వారి కొన్ని పేరడీ కుమతీ పద్యాలను చూద్దాం.

అడిగిన ప్రశ్నలు చెప్పని
మిడిమేలపు టీచరులతొ మెలగుకంటెన్
వడిగొని ట్యూషను వెట్టుక
బడి ప్యాసవ వచ్చుగాదె వసుధను కుమతీ!

లంచము పంచక తినకుము
కొంచెంబేనైన చేతగొనకుము సుమ్మీ
లంచంబు పట్టువానికి 
కించిత్తుగ రాల్చకున్న కీడగు కుమతీ!


అధరము తడిసీ తడియక
మధురమ్మగు కాఫిజుర్రి మరి సిగరెట్టున్
ప్రథమముననె ముట్టించెడు
విధమేపో లైఫులోని విజ్ఞత కుమతీ!

బ్లేడును చూడని ముఖమును
బీడీ సిగరెట్ల కంపు వీడని ముఖమున్
కోడిములు చెప్పు ముఖమును
బూడిద కిరవైన పాడు బొందిర కుమతీ!

No comments: