Wednesday, September 21, 2016

మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం


మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం


సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి
ఇందులో అన్నీ పుణ్యక్షేత్రాలున్నట్లున్నను
అందులో నాయికా వర్ణనకూడ ఉన్నది.

మధ్యం విష్ణుపదం కుచౌ శివపదం వస్త్రం విధాతు: పదం
ధమ్మిల్లస్సుమన: పదం ప్రవిలసత్కాంచీ నితమ్బ స్థలీ
వాణీ చేన్మధురా ధరో2రుణ ధర: శ్రీరంగ భూమిర్వపు
స్తస్యా: కిం కథ యామి భూరి సుకృతం మాన్యాసదా నిర్జరై:

ఈ శ్లోకం ఒక నాయికను వర్ణించే శ్లోకం.
ఇందులో శ్లేషను ఆధారంగా తీసుకొని
శరీరఅవయవాలను పుణ్యక్షేత్ర
సంబంధమైనవిగా ఒక అర్థం,
శృంగార పరంగా మరొక అర్థం కనబడుతుంది.

పుణ్యక్షేత్ర సంబంధమైన అర్థం-
మధ్యం - నడుము, మిష్ణుపది - వైకుంఠము, కుచౌ - స్తనములు,
శివపదం - కైలాసం, వక్త్రం - ముఖం, విధాతు: పదం - బ్రహ్మలోకం,
ధమ్మిల్ల: - కొప్పు, సుమన: పదం - దేవతల లోకం,
నితంబస్థలీ - మొలప్రదేశం,
ప్రవిల సత్కాంచీ - ప్రకాశించే కాంచీ పట్టణం, వాణీ - నోరు,
మధురా - మధురా పట్టణం, అధర: - క్రింది పెదవి,
అరుణధర: - అరుణాచల క్షేత్రం, వపు: - శరీరం,
శ్రీరంగభూమి: - శ్రీరంగక్షేత్రం, తస్యా: - ఆమె యొక్క,
భూరి సుకృతం - పుణ్యాన్ని, కిం కథ యామి? - ఏమి చెప్పుదును,
నిర్జరై: - దేవతల చేత, సదా - ఎల్లపుడు, మాన్యా - పూజింప తగినది.


వీటికే శృంగార సంబంధమైన అర్థం -
విష్ణు పదం - ఆకాశం(నడుము శూన్యము) , శివపదం - కైలాస పర్వతము
(స్తనాలు పర్వాలవంటివి), ముఖము బ్రహ్మ జన్మస్థానమైన పద్మమువంటిది,
సుమన: పదం - పూవులకు స్థానం (కొప్పు  పుష్పాలు ధరించినది),
నితంబస్థలీ - నడుముభాగము కాంచి(ఒడ్డాణం)తో ప్రకాశిస్తున్నది.
వాణీ మధురా - వాక్కు తీయగా ఉంటుంది,
అధర: అరుణధర: - పెదవి ఎరుపురంగు కలిగినది,
శరీరము, శ్రీరంగభూమి: - లక్ష్మీదేవికి నాట్యవేదిక,
నగలతో ఆమె శరీరం సంపదకు నెలవుగా ఉన్నది. - అని భావం.

No comments: