పయోధరాకారధరో హి కందుక:
సాహితీమిత్రులారా!
ఒకమారు ధారాధీశుడైన భోజుడు వ్యాహ్యళికై వెళ్ళగా
బోగమువీథిలో బోగముపడుచుపిల్ల ఒకతె చెవిలో
నల్లకలువ పువ్వు పెట్టుకొని చెండాట ఆడుతూంది
అలా ఆడే సమయంలో కదలికవల్ల చెవిలోని కలువపూవు
జారి కాళ్ళమీద పడింది. అది చూచిన రాజుగారు మనసులో పెట్టుకొని
సభకు వెళ్ళాడు. అక్కడ కవీశ్వరులను కందుకాన్ని వర్ణించమని
కోరగా భవభూతి
ఈ విధంగా వర్ణించాడు-
విదితం నను కందుక! తే హృదయం
ప్రమదాధర సంగమలుబ్ద ఇవ,
వనితాకరతామరసాభిహత:
పతిత: పతిత: పునరుత్పతసి
(ఓ కందుకమా! నీ అభిప్రాయం నాకు తెలిసిపోయింది.
యువతీమణి తనచేతితో
మాటిమాటికి కొట్టుచున్నా కిందపడి కూడ నీవు
ఎందులకు మరల పైకెగురుచున్నావో నాకు తెలిసిందిలే
ఆవిడ కెమ్మోవిపానకమును త్రాగుటకుకదా!)
అని చెప్పెను.
తరువాత మరొకకవి ఈ విధంగా చెప్పాడు
ఏకోऽపి త్రయ ఇవ భాతి కందుకోऽయం
కాంతాయా: కరతలరాగరక్తరక్త:
భూమమౌ తచ్చరణమరీచిగౌరగౌర:
ఖస్థస్సన్ నయనమరీచినీలనీల:
(ఒక కాంత చెండాడుతుంటే ఆ చెండు ఎలావుందంటే -
ఆ కాంతామణి అఱచేత చరచునపుడు ఆ అఱచేయి
ఎరుపుడాలునకు ఎరుపుగను, చేతి దెబ్బ తగిలి నేలమీద
ఆమె కాళ్ళముందర పడినతరువాత ఆమె
కాలిగోళ్ళ తెల్లనికాంతి సోకి తెల్లగను,
పైరెగిరినపుడు ఆమె ముఖము పైకెత్తి చూడగా
ఆ కలువకంటి కన్నుల నీలపుకాంతులతో నల్లనల్లగను
మూడురకములుగా ప్రకాశించుచున్నది.)
అని చెప్పెను.
ఆ తరువాత కాళిదాసు
ఈ విధంగా వర్ణించాడు-
పయోధరాకారధరో హి కందుక:
కరేణ రోషాదభిన్యతే ముహు:,
ఇతీవ నేత్రాకృతి భీతముత్పలం
స్త్రియ ప్రసాదాయ పపాత పాదయో:
(పాలిండ్ల ఆకృతి ధరించినందున ఈ బంతిని
ఈ ఇంతి రోషముతో మాటిమాటికి తనచేతితో కొట్టుచున్నది.
ఇక ఈ కలువకంటి సాదృశ్యము ధరించిన నాకు మాత్రమీమెవలన
ఇలాంటి దండన కలుగకుండునా! అని భయపడి ఆమె చెవిలోపెట్టుకొన్న
కలువపూవు ఆమె కాళ్ళపై పడి ఆమె అనుగ్రహమును కోరుచున్న
దానివలె తటాలున పాదములపై బడెను)
అని వర్ణించెను.
భోజరాజు ఆ ముగ్గురికి తగినవిధంగా
బహుమానములిచ్చెను.
కాళిదాసును మాత్రం
తనమనసులోని విషయాన్ని
చూచినవానివలె చెప్పినందులకు
ప్రత్యేకముగా సన్మానించెను.
No comments:
Post a Comment