Saturday, September 3, 2016

శివశిరసి శిరాంసి యాని రేజు


శివశిరసి శిరాంసి యాని రేజు


సాహితీమిత్రులారా!

పూర్వం ఒక బెస్తవాడు నర్మదానదిలో చేపలు పట్టుచుండగా
ఒక పెద్ద మడుగులో ఒక శిలాశాసనము వలకు తగులుకొని వచ్చింది.
దాని మీద అక్షరాలు కొన్ని కనిపిస్తున్నయి కొన్ని సరిగా కనిపించటంలేదు.
దాన్ని చూచిన బెస్తవాడు ఇదేదో శిలాశానంలా ఉంది  దీన్ని రాజుగారికి
చూపించాలని దాన్ని రాజు దగ్గరికి తెచ్చి సమాచారమంతా వివరించాడు.
దాన్ని చూచిన భోజరాజు పూర్వం హనుమంతులవారు శ్రీమద్రామాయణం వ్రాసి దాన్ని
ఈ మడుదగులో నిక్షేపించాడని వాడుక కలదు. కాబట్టి దీన్ని దానికి సంబంధించినదేమో అని
వెంటనే పరిశోధింప చేయాలని ఆలిపి తెలిసిన లేఖకులను పిలిపించి లక్క పోయించి
పరిశీలించగా దానిలో

అయి ఖలు విషమ: పురాకృతానాం
భవతి హి జంతుషు కర్మణాం విపాక:
(అయ్యో నిజంగా పూర్వకర్మములు
ప్రాణులకు క్రూరముగ కదా పరిణమించును ! )

అని ఒక శ్లోకంలోని రెండు పాదాలు తేలాయి. దాన్ని చదివిన భోజుడు
మిగిలిన రెండు పాదాలు ఏమై ఉంటాయో పూరించమని
సభలోని కవీశ్వరులను అడిగాడు.
దానికి భవభూతి ఈవిధంగా పూరించాడు.

క్వ ను కులమకలంకమాయతాక్ష్యా:?
క్వ చ రజనీచరసంగమాపవాద:?
(సీతాదేవి యొక్క నిష్కళంకమగు వంశ మెక్కడ రావణాసురుని
తోటి సంబంధము కలిగెను అనెడి అపవాదమెక్కడ)
అని చెప్పాడు. దానికి భోజుడు దీనిలో
ధ్వనిదోషమున్నదని దాన్ని ఈ విధంగా చదివాడు-

క్వ జనకతనయా?  క్వ రామజాయా?
క్వ చ దశకంధరమందిరే నివాస?
(జనక మహారాజకు కూతురై,
శ్రీరామచంద్రునికి భార్యయైన సీతమ్మవా రెక్కడ?
రావణాసురుని ఇంటనుండుటెక్కడ?)
అని చెప్పి దీనిలో కవిహృదయం ఏమై ఉంటుందో చెప్పమని కాళిదాసుని కోరాడు.
దానికి కాళిదాసు -
శివశిరసి శిరాంసి యాని రేజు
శ్శివ! శివ!! తాని లుఠంతి గృధ్రపాదై:
అయి ఖలు విషమ:  పురాకృతానాం
భవతి హి జంతుషు కర్మణాం విపాక:
(శివుని శిరముపై, ఏతలలు ప్రకాశించునో ఆతలలు
శివ!శివా! గ్రద్దలకాళ్ళచే దొరలుచున్నవి.
కావున అయ్యో పూర్వకృత కర్మలు ప్రాణికోటికి క్రూరములుగ కదా
పరిణమించుచున్నవి అనగా పూర్వం రావణుడు తన తలలు నఱికి
వానితో శివుని పూజచేసి మెప్పించెననియు అలాంటి తలలు ఇపుడు
క్రిందపడి గ్రద్దలు తన్నగా దొరలుచున్నవని - భావము)

తరువాత మళ్ళీ పరిశోధించగా  కాళిదాసు చెప్పినట్లే ఉండెనట.
అందుకు భోజుడు కాళిదాసును చాల సత్కరించెను.

No comments: