వీరుఁడిల లేఁడు ప్రతి రఘువీరుఁడొకఁడె (పేరడీ)
సాహితీమిత్రులారా!
ఈ పద్యం విజయవిలాసంలో చేమకూర వేంకటకవి
అర్జునుని గూర్చి చెప్పినది చూడండి-
పాఱఁజూచినఁ బరసేన పాఱఁజూచు
వింటి కొరగిన రిపురాజి వింటి కొరగు,
వేయునేటికి నల పాండవేయుసాటి
వీరుఁడిల లేఁడు ప్రతి రఘువీరుఁడొకఁడె
(విజయవిలాసము 1-94)
అర్జునుడు కొంచెం తీక్షణంగా చూశాడంటే చాలు,
శత్రుసేనలు పలాయనం చిత్తగిస్తాయి.
వుిల్లు ఎత్తుకోవడానికి వంగితేచాలు ,
శత్రువులు వీరస్వర్గానికి దారితీస్తారు.
ఆ అర్జునునితో సాటి అని చెప్పదగినవాడు
ఒక్క దశరథరాముడేగాని వేరొకడు లేడు- అని భానం.
దీనికి అభాగ్యోపాఖ్యానంలో వీరేశలింగంగారి
వ్యంగ్యానుకరణ చూడండి.
చేరినిల్చిన వంటయిల్ చేరి నిల్చు
గాన వచ్చినఁ బరువెత్తి కానసొచ్చు
డంబుమీరిన భట సమూహంబు తోడ
సాటియౌదురె మానవకోటి నెవరు
ఇది ఆ పురంలోని వారి శౌర్యపరాక్రమాలను
వర్ణిస్తూ చెప్పిన పద్యం
ఇటువంటివారితో ఎవరూ సాటిరారు,
వీరికివీరే సాటి అనడంలో ఎవరికీ విప్రతిపత్తి లేదు
అనే అర్థంలో ఈ పద్యం రాశారు.
No comments:
Post a Comment