Sunday, September 25, 2016

విధవాగమనం విశేషకార్యం


విధవాగమనం విశేషకార్యం


సాహితీమిత్రులారా!

కొన్ని విన్నప్పుడు అర్థం బాహ్యానికి ఒకలా
ఆంతరంలో మరోలా ఉంటాయి.
వీటిని గూఢ చిత్రాల కోవకు చేరుస్తాము.
అలాంటి ఒక శ్లోకం చూడండి-

విధవాగమనం విశేషకార్యం
విబుధానా మపి వీరవైష్ణవానామ్
విధవాగమనేన దాశరథ్యో:
గలితో2 భూత్కిల నాగపాశబంధ:

విధవ అంటే భర్త మరణించిన స్త్రీ.
ఆమె మరొక పురుషునితో కలవటం ఆమెకూ,
కలిసిన పురుషునికి పాపమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
అయితే ఇందులో విధవాగమన శబ్దం శ్లేషను
ఆధారంగా చేసుకొని గూఢత్వాన్ని సంతరించుకుంది.

వీరవైష్ణవులైన పండితులకు కూడ విధవాగమనం ముఖ్యమైన కార్యం
(ఇక్కడ విధవ అంటే విధవ అయిన స్త్రీని పొందటం ముఖ్యం అని పైకి కనిపిస్తూంది)
పూర్వం రామరావణ యుద్ధంలో సమ్మోహనాస్త్రంతో మూర్ఛ పొందిన
రామలక్ష్మణులకు విధవాగమనంతో నాగపాశబంధనం నుండి విముక్తి కలిగిందికదా!
అంటే వి - పక్షి, ధవ - ప్రభువు అయిన గరుడుని, ఆగమనం - రాక,
విధవాగమనం - గరుత్మంతునిరాక.
అంటే ఇక్కడ గరుత్మంతుడు రావడం వల్ల
రామలక్ష్మణులకు నాగపాశబంధం తొలగిపోయింది
కావున వైష్ణవులకు విధవాగమనం విశేషకార్యమయింది.

No comments: