Thursday, September 1, 2016

యజ్ఞోపవీతం పరమం పవిత్రమ్


యజ్ఞోపవీతం పరమం పవిత్రమ్


సాహితీమిత్రులారా!

ఒకమారు భోజుడు కాళిదాసు పురవిహారం
వెళ్ళగా ఒక వేదపండితుడు తన శిష్యులకు
ఉపనిషత్తులు సంత చెప్పుచుండెను.
అప్పుడు ఆ వీథిన వెళ్ళే మహారాజునకు
అణో రణీయాన్ మహతో మహీయాన్ -
అనే ఋక్కు వినిపించెను.

మరికొంత దూరం పోయాక మరొక ఉపాధ్యాయుడు
తన శిష్యునకు యజ్ఞోపవీత మంత్రమును చెప్పుచుండగా
యజ్ఞోపవీతం పరమం పవిత్రమ్ - అనే వాక్యం వినిపించెను.
ప్రక్కనే ఉన్న కాళిదాసును
ఆరెంటిని కలిపి సమన్వయం చేయమని కోరెను.
దానికి కాళిదాసు ఈ విధంగా చెప్పాడు.

అణో రణీయాన్ మహతో మహీయాన్
మధ్యం నితంబశ్చ యదంగనాయా
తదంగనాలింగనకుంకుమార్ద్రం
యజ్ఞోపవీతం పరమం పవిత్రమ్

(ఏ అంగన నడుము అణువులో పరమాణువో
అనగా అంత సూక్ష్మమైనదో,
నితంబము(పిరుదులు) మహత్తులో మహత్తు
అనగా అంత గొప్పదో, అట్టి అంగనను
ఆలింగనము చేసికొన్నపుడు ఆ అంగన కుచపాళిపై
రాచుకొని ఉన్న కుంకుమగంధము తగిలి తడిసిన
యజ్ఞోపవీతమేదో అదియే పరమపవిత్రమైనది - అని బావం.)

అని చెప్పాడు.
అది విన్న వీర రసికశిఖామణి భోజరాజు కాళిదాసు రసజ్ఞతకు,
ఔచిత్యానికి విలువలేని సంతోషంతో విశేష పారితోషికాన్ని
బహూకరించి కవిని సత్కరించాడు.

No comments: