Saturday, March 4, 2017

సరసుడు కాడొ? జాణ


సరసుడు కాడొ?  జాణ




సాహితీమిత్రులారా!


ఒక వనిత, మరో వనిత భర్తతో కాపురం
చేస్తూనే వ్యభిచరించడం చూచింది.
వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఈ పద్యం
సంభాషణ చిత్రమిది-

మొదటి వనిత అడుగుతుండగా
రెండవ వనిత సమాధానం చెబుతోంది

సరసుడుకాడొ? జాణ, రతిసంపదలేదొ? సమృద్ధి, రూపమో?
మరుని జయించురూపము, మోహ? మసమానమె, ఇన్నియు కల్గి జారవై
తిరిగెదవేల? బాల! అతి ధీరవు ప్రౌఢవు, నీవెరుంగవే?
నెరగృహమేధియన్ పలుకు నీచము దోచె, కొరంత దే సుమీ!

ప్రశ్న- సరసుడుకాడొ?  
            (ఓసీ నీ భర్త రసికుడుకాడా)
సమాధానము -  జాణ
                             (కాకేమి గొప్పనేర్పరి)
ప్ర- రతిసంపదలేదొ?
        ( మగతనంలేదా)

స- సమృద్ధి
     (అది చాల ఎక్కువగానే ఉన్నది)

ప్ర- రూపమో?
       (అందంగాలేని వికారియా)

స-  మరుని జయించురూపము
     (అబ్బే అందంలో మన్మథుని జయించినవాడే)

ప్ర-  మోహ? 
        (మరివలపో)

స- మసమానమె
       (అదిీ అధికమే)
ప్ర- ఇన్నియు కల్గి జారవై తిరిగెదవేల?
       (అయితే అన్నివిధాలా సరైనవాడైతే నీవుమాత్రం
            వ్యభిచారిణివిగా తిరగడానికి కారణం)
స- బాల! అతి ధీరవు ప్రౌఢవు, నీవెరుంగవే?
       (నీవు చాల తెలివిగల దానవు, ప్రౌఢవు ఇక ఆమాత్రం నీకు తెలియదా)

    నెరగృహమేధియన్ పలుకు నీచము దోచె, 
     కొరంత దే సుమీ!
       (కేవలం భర్త మాత్రం కావడమే త్పప్పుగా నాకు కనిపిస్తోంది)



(ధీర - భర్తపై వచ్చిన కోపాన్ని స్పష్టంగా చెప్పక, 
      వ్యంగ్యంగా ప్రకటించే నాయిక
ప్రౌఢ - సంపూర్ణ యౌవనంలో ఉన్నది, 
       శృంగార విషయాలు బాగాతెలిసినది)

No comments: