Saturday, March 18, 2017

దీర్ఘము, తలకట్టు, పొక్కిలి


దీర్ఘము, తలకట్టు, పొక్కిలి




సాహితీమిత్రులారా!



విజయవిలాసంలో చేమకూరవేంకటకవి
చూపిన అక్షరచిత్రం చూడండి-
యతిగామారి ద్వారకకు చేరిన
అర్జునుడు, సుభద్రను చూచిన
సందర్భములో కవి కూర్చిన చిత్రం
ఈ పద్యం-

కన్నులు దీర్ఘముల్, నగుమొగం బవురా! తలకట్టు తమ్మిపూ
పున్నమ చందమామలకుఁ, బొక్కిలి చక్కదనంబుఁ జెప్పఁ
గా
నున్నదె మేలు బంతులు పయోధరముల్, చిఱు కౌను సున్నయౌ,
నెన్నిక కెక్కు వ్రాఁతఫల మివ్వరవర్ణినికి న్నిజంబుగన్
                                                                     (విజయవిలాసము - 2-104)


కన్నులు నిడుపైనవి(దీర్ఘములు), అవురా - బళీ,
నగుమోగంబు- సహజంగా నవ్వుతూండే ముఖము,
తమ్మిపూ పున్నమ చందమామలకున్ - పద్మమునకూ,
నిండు చందమామకూ, తలకట్టు - పాగ(అనగా వాటిని మించినది),
పొక్కిలి - నాభియొక్క, చక్కదనంబు, చెప్పగా నున్నదె -
చెప్పుటకు వీలగునా (కాదు అని అర్థం) పయోధరముల్ - పాలిండ్లు,
మేలు బంతులు - చక్కని చెండ్లు, చిఱుకౌను - చిన్ననడుము,
సున్నయౌ - లేనిదే, ఈ వరవర్ణినికిన్ - ఈ నారీమణికి, నిజంబుగన్,
వ్రాతఫలము - బ్రహ్మవ్రాసిన వ్రాతయొక్క ఫలము(అదృష్టము),
ఎన్నికకు ఎక్కున్ - అయిశయించును - అని భావం.

దీనిలో వరవర్ణినికిన్ - శ్రేష్ఠమైన అక్షరములు కల కాంతకు -
దీర్ఘములు, తలకట్లు, పొక్కిలి, బంతులు(పంక్తులు), సున్న, 
వ్రాయడం వల్ల(వ్రాతఫలము) కలిగిన ఫలితం - వీటితో
శ్రేష్ఠమైన అక్షరాలు ఏర్పడ్డాయని అక్షర చిత్రాన్ని చమత్కారంగా చెప్పాడు.
గుణింతములో వాడుకునే పదాలను ఇందులో కూర్చి వర్ణించడమే
ఇందులోని అక్షర చిత్రము

No comments: