Thursday, March 9, 2017

చిత్రకవిత్వంలో - గతిచిత్రం -1


 చిత్రకవిత్వంలో - గతిచిత్రం -1సాహితీమిత్రులారా!


చిత్రకవిత్వంలోని అనేక రకాలలో
గతిచిత్రం ఒకటి.

గతి అంటే నడక
నడకలోని చిత్రం
గమనించటమే
ఇందులోని చిత్రం.

ఒకమాట ముందుకే గాదు
వెనకకూ అలాగే ఉంటే
మనము అది చిత్రంగా
గుర్తిస్తాం కదా
జలజ - కనక - కటక - నళిన - భద్రేభ - ముల్
సఖియ కంఠ-కాంతి-జఘన-చరణ-
గమనములకు సాటిగానక తన వృత్తి
ఎదిరి పూర్వరూప పదమునందె

నాయిక కంఠ, కాంతి, జఘన, చరణ, గమనములతో
జలజ, కనక,కటక, నళిన, భద్రేభ - ములు
పోటీ పడినవట అవి ఎంత ప్రయత్నించినా!
వాటికి సాటిరాలేక తలక్రిందులుగా పోరాడి కూడ
పూర్వరూపంలోనే ఉన్నాయట.
 కారణం ఏమిటంటే ఆ పదాలన్నీ
అనులోమంగాను ప్రతిలోమంగాను ఒకటే
ఇది ఆమె సౌందర్య పరాకాష్ఠ తెలపటమే.

జలజ, కనక,కటక, నళిన, భద్రేభ - అనే పదాలు
అనులోమంగాను ప్రతిలోమంగాను ఉండటం వల్ల
ఇది గతిచిత్రం.

అదే పద్యపాదమైతే
అది ఇంకా చిత్రం
పులుపు, జలజ, వికటకవి - ఇలాంటి పదాలు
ముందుకు వెనక్కు ఒకలాగే చదువుతాం కదా!
పాదభ్రమకం కూడ అలాగే

పాదభ్రమకము-
ఈ పద్యం చూడండి-
ఇది శ్రీమాన్ వైద్యంవేంకటేశ్వరాచార్యులవారి
సంపాదకత్వంలో వెలువడిన
అధ్యాత్మరామాయణంలోనిది-

ఇది సుందరకాండలోని ఆశ్వాసాంతంలో
కాణాదం పెద్దన సోమయాజిగారు హనుమంతుడు
లంకకువెళ్ళి తిరిగి వచ్చిన సందర్భంలో కూర్చడం
ఒక విశేషం-

శ్రీరత మహిమతరశ్రీ
సారసవనయ శహితాహి శయనవసరసా
ధీరశమ సోమ శరధీ
మార పరకమాన్యధన్య మాకరపరమా


మొదటిపాదంలో 9 అక్షరాలున్నాయి
శ్రీరత మహిమతరశ్రీ
అందులో నడిమి అక్షరం 5వది - హి
దాన్నుండి మళ్ళీ వెనక్కు
అవే అక్షరాలొచ్చేలా చేశాడు కవి

అలాగే రెండవపాదంలో  17 అక్షరాలున్నాయి.
సారసవనయ శహితాహి శయనవసరసా
వీటిలో మధ్యన ఉన్న అక్షరం 9వ అక్షరం - తా
దీనితరువాతనుండి అక్షరాలను వెనుకకు కూర్చాడు

3వపాదంలో మొత్తం అక్షరాలు 9
ధీరశమ సోమ శరధీ
అందులో 5వ అక్షరం సో
దాన్నుండి వెనుకకు కూర్చాడు

4వపాదంలో మొత్తం అక్షరాలు 15
మార పరకమాన్యన్య మాకరపరమా
అందులో మధ్యఅక్షరం 8వది - 
దీన్నుండి వెనుకకు అక్షరాలను కూర్చాడు
దీనివల్ల ఇది పాదభ్రమకంగా మారుతున్నది.

శ్రీరత మహిమతరశ్రీ
సారసవనయ శహితాహి శయనవసరసా
ధీరశమ సోమ శరధీ
మార పరకమాన్యన్య మాకరపరమా


 అనులోమ ప్రతిలోమపాదం-

అనులోమము అనగా మొదటినుండి చివరకు,
ప్రతిలోమం అనగా చివరినుండి మొదటికి.
అనులోమప్రతిలోమపాదం అంటే
ఒక పాదం మొదటినుండి చివరకు మళ్ళీ చివరనుండి మొదటికి గల పాదం.
ఒకపాదం మొదటినుండి చివరకు రాసినది ఒకటవ పాదం.
 అదేపాదాన్ని చివరనుండి మొదటికి రాసిన అది రెండవ పాదం.
ఇదేవిధంగా మూడవ పాదం తిప్పిరాస్తే అది నాలుగవ పాదం ఏర్పడుతుంది.
ఈ విధంగా కూర్చబడిన శ్లోకం లేదా పద్యం అనులోమ ప్రతిలోమపాదం.

వేదాంతదేశికులవారి
పాదుకాసహస్రంలోని
ఈ శ్లోకం చూడండి.

రామపాదగతాభాసా
సాభాతాగదపామరా
కాదుపానఞ్చకాసహ్యా
హ్యాసకాఞ్చనపాదుకా
                        (పాదుకాసహస్రము -919)


(శ్రీరాముని పాదాలను ఆశ్రయించిన బంగారు
పాదుక స్వీయకాంతితో మిక్కిలి ప్రకాశించేది.
దేవతలను వారి విరోధుల వల్ల కలిగే
మానసిక వ్యాధులనుంచి రక్షించేది.
పాదుకలను ఉపాసిస్తూ జ్ఞానానుష్ఠానాలు
లేని పామరజనులకు వ్యాధులు రాకుండా సుఖాన్ని కలిగించేది.
చతుర్ముఖ బ్రహ్మచేత, ఆరాధించబడే శ్రీరంగనాథుడు
సూర్యవంశస్థుడైన ఇక్ష్వాకు మహారాజుకు ప్రసాదించడం వల్ల
పాదుకలు అయోధ్యకు చేరుకొన్నది.
అయోధ్యలో సూర్యునికన్నా
ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ ఉండింది.)

ఈ శ్లోకంలోని మొదటి పాదాన్ని
చివరనుండి మొదటికి చదివిన
2వ పాదము వస్తుంది.
అలాగే 3వ పాదం చివరనుండి చదివిన
4వ పాదం వస్తుంది.
కావున ఇది అనులోమ ప్రతిలోమపాదశ్లోకం 
అనబడుచున్నది.
ఇక్కడ అలంకారశిరోభూషణే శబ్దాలంకారంలోని
32వ శ్లోకం ఉదహరించుకుందాం.

రంగవానరతం దేవం
వందేతం రనవాగరం
హారిదాన హితోమేయో
యోమేతోహి నదారిహా

(ఎవరు నిష్కల్మషదాటులకు మేలు చేస్తారో,
పరిమితిలేని ప్రభావం కలవాడో,
నిత్యశత్రువులయిన అరిషడ్వర్గాన్ని నాశనం చేస్తారో,
లక్ష్మిదేవి చేత ఆశ్రయించబడిన వాడో అట్టి
శ్రీరంగక్షేత్ర వాసాసక్తుడైన శ్రీరంగనాథుని ముందుగా
రసాత్మకమైన వాక్కులుగల కవినై
నేను నమస్కరిస్తున్నాను.)

ఈ శ్లోకంలో 1వ పాదం చివరనుండి చదివిన రెండవ పాదం ఏర్పడుచున్నది.
అలాగే 3వ పాదం చివరనుండి చదివిన 4వ పాదం ఏర్పడుచున్నది.
ఈ విధంగా ఏర్పడేదాన్ని అనులోమ ప్రతిలోమపాదం అంటారు.


No comments: