Thursday, May 26, 2016

పొడుపు పద్యం


పొడుపు పద్యం


సాహితీమిత్రులారా!

ఈ పొడుపు పద్యం చూచి సమాధానం ఊహించండి.

కరణాల చేతిలో గలుగు నాయుధ మేది?
కానకు గుణమీయఁ గలుగు నేది?
బాలుండు వ్రాతకై పట్టుకొనెడి దదేది?
పరగృహంబునకేది వరలు కప్పు?
యింటి లోపలికేగ నేమిదాటఁగవలె?
భర్తకై యిల్లాలు బఱచునేమి?
శార్కరి నేమని జనులు వాకొందురు?
చెలఁగి మూషక మేమి జేయుచుండు?

నన్నిఁటికి జూడ మూఁడేసి యక్షరములు
నీ వలావల గనసరి నెన్నవలయు
(చిత్త భవ భంగ శివలింగ చిన్మయాంగ
వృషతురంగ శుభాంగ గౌరీశ లింగ)
                                 (అమరాబాదు లక్ష్మయ్య రచన)

దీని సమాధానాలు మూడు అక్షరాల్లోనే ఉండాలి.
సమాధానం నీవల ఆవల అంటే ముందుకు ఒకసారి
రెండవది వెనుకకు తీసుకోవాలి.
ఈ విధంగా గమనిస్తే సమాధానాలు దొరకుతాయి.

1. కరణాల చేతిలో గలుగు నాయుధము ఏది? - కలము
2. కానకు గుణమీయ గలుగు నేది? - ములక (కలము నకు విలోమము)
3. బాలుడు వ్రాతకై పట్టుకొనెడి దదేది? - పలక
4. పరగృహంబునకేది వరలు కప్పు?  - కలప (పలక కు విలోమము)
5. యింటిలోపలికేగ నేమి దాటగవలె? - గడప
6. భర్తకై యిల్లాలు బఱచునేమి?  - పడక (గడప కు విలోమము)
7. శార్కరి నేమని జనులు నాకొందురు?  - గులక
8. చెలగి మూషిక మేమి జేయుచుండు?  - కలుగు(గులక కు విలోమము)

No comments: