Monday, May 23, 2016

వంచయన్ గిరిసుతాం గంగాధర: పాతువ:


వంచయన్ గిరిసుతాం గంగాధర: పాతువ:

సాహితీమిత్రులారా!

ఈ సంవాదం గమనించండి.
పార్వతి ప్రశ్నకు పరమేశుని
సమాధానాలు ఎలా ఉన్నాయో? గమనించండి.


మౌలౌ కిం సు? మహేశ! మానిని! జలం. కిం వక్త్రం? అంభోరుహం.
కిం నీలాలక వేణికా? మధుకరీ, కింభ్రూలతా? వీచికా.
కిం నేత్తే? శఫరౌ, కిము స్తనయుగం? ప్రేంఖత్ రథాంగద్వయం
సాశంకా మితి వంచయన్ గిరిసుతాం గంగాధర: పాతువ:

పార్వతి - పరమేశా నీతలపై నున్నదెవరు?
శివుడు - అభిమానవతీ (శ్లిష్ట వక్రోక్తితో) నీరు(జలం) సుమా(గంగ)
పా.- ఏదో ముఖంలాగా కూడా అక్కడ కన్పడుతోంది అదేమిటి?
శి.- ఆ నీటిలో మొలిచిన కమలము(అంభోరుహము) సుమా!
పా.- అదేమిటండీ నల్లని వెంట్రుకలతో జడమాదిరిగా కూడా కనపడుతోంటే?
శి.- ఔను, అది ఆ పద్మాలలోని, తేనెను ఆస్వదింప వచ్చిన తుమ్మెదల గుంపు.
పా.- అయితే, తీగలవలె కనుబొమ్మలు కూడా కనబడుచున్నాయేమిటి?
శి.- ఏమీలేదు. ఆ నీటిలోని తరంగాలు(అలలు) సుమా!
పా.- రెండు కళ్లు కూడా కనపడుతుంటే వాటినేమిటి దాస్తారు?
శి. - అబ్బే! అవి ఆ నీళ్లలోని చేపలు సుమా!
పా. - గుండ్రంగా రెండు కుచాలు(స్తనాలు) కూడా ఉన్నాయండీ?
శి.- ఔను! ఆ జలంలో తిరుగుచున్న చక్రవాక పక్షులజంట.

      ఇలా అసూయతో అనుమాన పడిన,
ఆ అంబకు(పార్వతికి) నర్మగర్భంగా, అలంకారిక సాంప్రదాయానుసారంగా,
వక్రోక్తులతో సమాధానమిచ్చి సరిపెట్టిన
ఆ గంగాధరుడు (ఈశ్వరుడు) మనందరిని రక్షించుగాక.!

No comments: