"స్తన వస్త్రం పరిత్యజ్య వధూ: శ్వశురమిచ్ఛతి"
సాహితీమిత్రులారా!
శ్రీభగవాన్ రమణ మహర్షులవారిచే నాయనా అని పిలిపించుకున్న
వాసిష్ఠ గణపతిముని తన యౌవన ప్రారంభ దశలో నవద్వీపం వెళ్లి
అక్కడి పండిత పరిషత్తువారి సభలో పాల్గొని ఆశుకవిత,
సమస్యాపూరణ, వ్యాఖ్యాన నైపుణి అద్భుతంగా
ప్రదర్శించి కావ్యకంఠ నిరుదును పొంది
తెలుగువారి విజయపతాకం వచ్చాడు.
అక్కడ ఇవ్వబడిన సమస్య ఒకటి
ఇప్పుడు తెలుసుకుందాం.
"స్తన వస్త్రం పరిత్యజ్య వధూ: శ్వశురమిచ్ఛతి"
- అనేది సమస్య
(అనగా- కుచాలమీది గుడ్డను తీసివేసి కోడలు
మామను కోరుతున్నది.)
దీన్ని పతివ్రతాపరంగా పూరించాలని పృచ్ఛకుని నియమం.
సమాధానం(పూరణ)-
హిడింబా భీమదయితా నిదాఘే ఘర్మపీడితా
స్తన వస్త్రం పరిత్యజ్య వధూ: శ్వశురమిచ్ఛతి
(భీముని భార్య హిడింబ ఆటవిక. ఎండవేళ చెమట
బాధతో ఆమె ఉపరివస్త్రం తొలగించి వావగారైన
వాయువును కోరింది.
అంటే గాలికోసం పై గుడ్డ తీసేసిందని. అర్థం.)
ఇది అనేక అవధానాలలో సమస్యగా ఇవ్వడం జరిగింది.
ఇక్కడ కొన్నిటిని గమనిద్దాం.
1. కుస వస్త్రంబు పరిత్యజించి సతి తా కోరెన్ తమిన్ మామనున్
దీనికి శ్రీ కడిమెళ్ళ వరప్రసాదుగారు
ఈ విధంగా పూరించారు.
శుచి సాహస్రము మిన్ను ముట్టినదియో చోద్యమ్ముగా సూర్యుడే
అచలుండౌచును ఆత ప్రసరణ వ్యాపారమున్ పూనెనో
విచలత్ గాత్రి హిడింబ గత్తమున పెన్వీకుల్ జనింపంగ తత్
కుచ వస్త్రంబు పరిత్యజించి సతి తా కోరెన్ తమిన్ మామనున్
2. శ్వశరునిగోరె సాధ్వి స్తనవస్త్రము తానె త్యజించి అద్దిరా
దీన్ని శాంతిశ్రీ బొత్సాకవిగారు
ఈ విధంగా పూరించారు.
అశమిత భీష్మగ్రీశ్మ సమయంబున ఊష్మభరంబు నోర్వగా
వశమది గాక ప్రాణులకు ప్రాణము త్రాణము వాయుదేవునిన్
విశచరియైన భీము రమణీమణి అల్ల హిడింబ డంబునన్
శ్వశరుని గోరె సాధ్వి స్తనవస్త్రము తానె త్యజించి అద్దిరా
ఏకవి ఏభాషలో పూరించినా
ఈ సమస్య భావము మాత్రం
కావ్యకంఠునిదే చెప్పి ఉన్నారు.
No comments:
Post a Comment