Sunday, May 22, 2016

పార్వతీ పరమేశ్వర సంవాదం

పార్వతీ పరమేశ్వర సంవాదం


సాహితీమిత్రులారా!

ఈ వింత ఆశీర్వాద శ్లోకం చూడండి.
ఇది సంవాదరూపంలో ఉంది.

కస్త్వం? శూలీ, మృగయ భిషజం? నీలకంఠ: ప్రియే2హమ్
కేక మేకాం కురు? పశుపతి:, నైవ దృశ్యే విషాణే?
స్థాణు: ముగ్ధే!? న వదతి తరు: జీవితేశ: శివాయా:
గచ్ఛాటవ్యాం, ఇతి హతవదా: పాతు వ: చంద్రచూడ:

పార్వతి - ఎవరునీవు?
శివుడు - శూలీ (త్రిశూలాన్ని ధరించే శివుని)
 (శూలీ -శివుడు, కడుపునొప్పిగలవాడు)
పా.- శూలరోగం గలవానివి వైద్యుని వెతుక్కుంటూ వెళ్ళు.
శి.- ప్రేయసీ నేను నీలకంఠుడనే
(నీలకంఠ - శివుడు, నెమలి)
పా.- నీలకంఠవైతే ఒక కేక(నెమలి అరుపు) వేయి.
శి.- నేను నందీశ్వరుడను.
(నందీశ్వరుడు - శివుడు, పశువులకు, గోవులకు ... పతి)
పా.- అయితే పశువులకు కొమ్ములుండాలికదా అవి నీకు కనపడడంలేదే?
శి.- ఓసి మూర్ఖురాలా! నేను స్థాణువును.
(స్థాణువు - శివుడు, కదలని చెట్టు, మొద్దులు..)
పా.- చెట్టు లేదా మొద్దు అయితే మాట్లాడవుకదా! నీవు మాట్లాడుతున్నావే!
శి.- నేను పార్వతికి ప్రాణేశ్వరుడను శివుడను.
(శివా - పార్వతి, నక్క)
పా.- నీవు నక్కవైతే అడవిలో తిరగాలి అక్కడ ఉండక ఇక్కడికెందుకొచ్చావు పో అడవికి పో.

 పార్వతి ప్రశ్నలకు జవాబివ్వలేని చంద్రశేఖరుడు మిమ్మలను రక్షించుగాక!

No comments: