తలకట్ల కందం
సాహితీమిత్రులారా!ఒక పద్యంలో కేవలం తలకట్లనే ఉపయోగించి కూర్చిన దాన్ని తలకట్ల పద్యం అంటారు.
అది కందపద్యం అయితే తలకట్లకందం అంటాము. ఇది కేవలం తెలుగులో మాత్రమే కలదు.
అంటే కేవలం "అ" - స్వరాన్ని ఉపయోగించి పద్యాన్ని కూర్చటం.
దీనికి ఉదాహరణగా పోకూరి కాశీపతిగారి
"సారంగధరీయం"(త్ర్యర్థి కావ్యం)లోనిది.
గజచర్మ వసన కనదం
గజమదహర యచలసదన గరళగళ లస
ద్గజవదనజనక యస్మ
ద్భజనం బరయం గదయ్య భయమడఁప దయన్ (2-125)
(ఏనుగు తోలును ధరించినవాడా! ప్రకాశమానమైన మన్మథుని
గర్వమును హరించినవాడా! పర్వతనిలయుడా!
విషమును కంఠమునందుగలవాడా!
మనోజ్ఞమైన వినాయకునికి తండ్రివైనవాడా!
ప్రేమతో నాభయం తగ్గేందుకు
నాసేవను ఓ అయ్యా చూడగదవే.)
ఈ పద్యంలో దేనికి కూడా తలకట్టు తప్ప
వేరే గుణితము లేదుకదా!
కావున
ఇది తలకట్లకందం.
No comments:
Post a Comment