Thursday, February 7, 2019

దశావతారస్తుతి


దశావతారస్తుతి





సాహితీమిత్రులారా!


లాక్షణికులు తాము సృష్టించిన పద్యములకు (వృత్తములకు, జాతులకు, ఉపజాతులకు) ఉంచిన పేరులు ఏ విధముగా వచ్చాయో అనే విషయాన్ని గుఱించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఒకే వృత్తమునకు ఎన్నో పేరులు ఉండడము, ఒకే పేరుతో వేఱువేఱు వృత్తములు ఉండడము సామాన్యము. చంపకమాలకు ఎన్ని పేరులో – చంపకమాల, చంపకమాలిని, చంపకావళి, పంచకావళి, ధృతశ్రీ, శశివదన, సరసి, సిద్ధి, సిద్ధక, చిత్రలత, చిత్రలతిక, రుచిర, తుమ్మెదకంటు, పూలపాన్పు. మనకు తెలిసిన ఈ చంపకమాలనే కాదు, పాదమునకు పది అక్షరాలు ఉండే పంక్తి ఛందములోని UIIUU – UIIUU గురులఘువుల 199వ వృత్తమును కూడ చంపకమాల అంటారు. వృత్తములు మ, భ, జ, స, న, య, ర, త అనే ఎనిమిది మూడక్షరముల గణములతో, నాలుగు రెండక్షరముల గణములతో (గల, లగ, లల, గగ), రెండు ఏకాక్షర గణములతో (గ, ల) నిర్మింపబడుతాయి. తెలుగు ఛందస్సులో గలమును హ-గణమని, లగమును వ-గణమని పిలుచుట వాడుక.

ఔ-కారాన్ని రెండు గణములకు వాడుట పింగళుని కాలము నుండి ఉన్నది. ఉదా. చంద్రావర్తా నౌ నౌ స్ అనగా చంద్రావర్తకు గణములు – న న న న స. హేమచంద్రుడు అచ్చులను గణముల సంఖ్యలను సూచించుటకు, హల్లులను పాదముల విఱుపును సూచించుటకు వాడినాడు. ఉదా. సీ తోటకం, అనగా తోటకమునకు నాలుగు స-గణములు (సీ స-గుణింతములో నాలుగవది). మఱొక ఉదాహరణ: వసుధార – నుర్ గౌ వసుధారా ఙైః, అనగా వసుధారకు ఐదు నగణములు, రెండు గురువులు, యతి ఐదు అక్షరముల తఱువాత (ఙ హల్లులలో ఐదవ అక్షరము). ఇట్టి ఉపయోగము వలన సూత్రాలలో క్లుప్తతను సాధించడానికి వీలవుతుంది. కాని వృత్తనామములకు ఈ సూత్రమును పాటించినట్లు లేదు. నరమనోరమ వృత్తము నందలి గణములైన న-ర ఈ సూత్రమునకు సరిపోవును, కాని అది కాకతాళీయమని నా తలంపు. రేచన నుండి తెలుగు లాక్షణికులు ఆ-కారముతో నుండు అక్షరములను రెండు గణములుగా పరిగ్రహించిరి. ఉదాహరణకు కవిజనాశ్రయములో తోదకమునకు లక్షణములు, లక్ష్యము- జలరుహవక్త్ర, న-జాయగణంబుల్ / వెలయగ దోదక – వృత్తము జెప్పున్. అనగా, జలరుహపు గణములైన న-జ-జ-య నజాయగా చెప్పబడినది. హిందీ ఛందస్సులో లక్ష్యముల మొదట గణాక్షరములను (ఏ అచ్చుతో నైనా సరే) వాడిరి. క్రింద ఒక ఉదాహరణము –

సుభ రీ నా మయి లాగతీ విలసతీ మత్తేభవిక్రీడితా
మతి ఓఛీ జస ధారతీ తస రహై భారావహా పీడితా
తిమి మూఢా సబ దేహ భూషణ సజే భావై నహీఁ కామినీ
పియ భక్తీ బిన వ్యర్థ జన్మ జగ మేఁ హై ఘోర సంతాపినీ

ఉన్నతాసనములు వద్దు, గతి లేదు, శోభ లేదు, మదించిన ఏనుగుతో ఆట వంటిది. మనసు చంచలమైనది, దేనిని ధరించునో, అట్లు ఉండును, భారమును మోయుచు బాధపడుదానా. భావము లేక దేహము భూషణమనుకొన్నచో నీవు మూఢవు. కామినీ ప్రియభక్తి వినా జగములో జన్మము వ్యర్థము గదా, ఓ ఘోర సంతాపినీ!

అదే విధముగా సందర్భానుసారముగ దుష్యంతుడు శకుంతలను సభకు ఆహ్వానించమని తన మంత్రితో చెప్పు సమయములో మత్తేభవిక్రీడిత ఛందస్సులో (స-భ-ర-న-మ-య-వ) తెలుగులో నేనొక పద్యమును వ్రాసియున్నాను –

సభ రానిమ్ము యువాంగినిన్ రయముగా, – సద్ధర్మనిష్ణాతుడౌ
శుభయోగీంద్రు ననుంగు కూతురికి నీ – సుస్వాగత మ్మిమ్ము, యీ
ప్రభు వే వేళల సత్యసంధుడు ప్రజన్ – రక్షించు తా మఱ్వకన్
నభ మందెప్పుడు రంగులన్ వెలుగు యా – నక్షత్రముల్ సాక్షిగా

వృత్తపు పేరులోనే గణములు ఉండేటట్లు సృష్టించే తలంపు నాకు సుమారు ఏడు సంవత్సరాలకు ముందు జనించినది (ఛందస్సు గ్రూపులో 1, 2 చర్చించి ఉన్నాను.) ఆ తఱువాత తోచినప్పుడల్లా ఇలాటి వృత్తములను సృష్టిస్తూ ఉన్నాను. అందులో చాలవఱకు ఏ లక్షణగ్రంథములో కూడ లేని క్రొత్త వృత్తములే. కొన్ని ప్రసిద్ధమైన వృత్తములకు ఇలా పేరుంచినప్పుడు ఒక గొప్ప అనుభూతి కూడ కలిగినది, ఉదా. మాయా – వైశ్వదేవి, యమనసంభవ – శిఖరిణి, భృంగ – మానిని, లీలామయా – మాలిని మున్నగునవి. ఇప్పటికి సుమారు 120 సార్థకనామవృత్తములను కల్పించియున్నాను. ఈ మధ్య ప్రతివాదిభయంకర శ్రీనివాస్‌పై వ్రాసిన వ్యాసములో పి.బి.ఎస్ కూడ ఇలాటి వృత్తములను కల్పించినారని చదివి ఆనందించినాను.

సార్థకనామవృత్తముల సృష్టిలో నేను పాటించిన కొన్ని నియమములను చెప్పడము అవసరము.

పదములలో మ, భ, జ, స, న, య, ర, త, వ, హ, గ, ల అక్షరములను మాత్రమే ఉపయోగించవలెను, ఉదా. రామ వృత్తమునకు గణములు – ర-ర-మ. అక్షరములకు ఒకటినుండి 13 వఱకు సంఖ్య విలువలు ఈ అచ్చులతో సరిపోతాయి – అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ, ఔ. ౠ కారమునకు విలువ నివ్వలేదు.
అనుస్వారమునకు విలువ లేదు, రంభ అనే వృత్తమునకు గణములు ర-భ, ర-మ-భ కాదు. ఎందుకంటే నేను అనుస్వారమును ఒత్తుగా పరిగణించలేదు.
నేను తెలుగు అక్షరమాల ప్రకారము అక్షరములను గ్రహించినాను, దేవనాగరి లిపిలోవలె కాదు. స్త్రీ అనే వృత్తమునకు గణములు – స-స-స-స-త-ర, ఇదే దేవనాగరి లిపిలో స-త-ర-ర-ర-ర అవుతుంది.
ఈ రచన ముఖ్యోద్దేశము శ్రీవిష్ణుమూర్తి యెత్తిన దశావతారములను సార్థకనామవృత్తములలో వర్ణన చేయడము. శ్రీజయదేవకవిలా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి అవతారములను దశావతారములుగా ఎన్నుకొన్నాను. చివర ఈ అన్ని రూపములను హరి (శ్రీకృష్ణుని) యవతారముగా భావించినాను. ఇందులో మత్స్య, వరాహ, నరసింహ, వామన, రామ, హరి అవతారములకు ఏ చిక్కు లేకుండ సార్థకనామవృత్తములను కల్పించవచ్చును. మిగిలిన అవతారములకు వాటికి సరిపోయే పర్యాయపదములను ఎన్నుకొన్నాను: కూర్మ – వృత్త, పరశురామ – భార్గవ, బలరామ – హలి, బుద్ధ – సుగత, కల్కి – హయవాహన. ఇట్లు ఎన్నుకొన్న పదములతో భక్తిపూర్వకముగా వ్రాసిన క్రింది సార్థకనామవృత్తాంతర్గత దశావతారస్తుతిని ఇక్కడ మీకు అందిస్తున్నాను.

మత్స్య లేక లీఢాలర్కః – మ త స య UUU UUI – IIU IUU యతి (1, 7)
12 జగతి 737
వేదమ్ముల్ గాపాడ – విషరాశిలోనన్
శోధించన్ జొచ్చేను – సురులెల్ల వేఁడన్
సాధించే నద్దాని – చర మత్స్యమై స-
మ్మోదమ్మై విశ్వమ్ము – బులకించెఁ గాదా

వృత్త – జ ర జ ర య ర గల IU IU IU IU IU IU IU UUI UUI యతి (1, 11)
20 కృతి 595286
సురాసురుల్ నిరంతరమ్ముగా – సుధన్ భుజించన్ బోరు సల్పంగ
గిరిన్ ఖజమ్ము జేయ నెంతయో – ఘృణాళువై వృత్తమ్ముగా మోసి
హరించి పంచె సోమమున్ సురల్ – హసించ నయ్యెన్ మోహినీదేవి
వరించె నా రమన్ దరించఁగా – వసించె క్షీరాబ్ధిన్ వదాన్యుండు

వరాహ – య య య ల IU UIU UIU UI యతి (1, 6)
10 పంక్తి 586
హిరణ్యాక్షుఁ డా – హేమఁ దా బట్టి
హరించన్ వరా-హమ్ముగాఁ ద్రవ్వి
విరాడ్రూపుఁడై – వ్రేసి రక్షించె
ధరాదేవి నా – దంష్ట్రమం దుంచె

నరసింహ – న ర స స స గల III UIU IIU IIU IIU UI యతి (1, 10)
17 అత్యష్టి 79576
అసురసంధ్యవేళ నిజ-మ్మపురూపపు రూపమ్ము
వసుధఁ దాల్చె సర్వ దిశా-వలయమ్ములు గంపిల్ల
నసకులాఁడు దైత్యు విరా-ణ్ణరసింహుఁడు ఖండించె
పసి నిసుంగుఁ గాచెఁ గదా – పరమాత్ముఁడు నిత్యుండు

వామన – జ మ భ ల IU IU UUU III, యతి (1, 6)
10 పంక్తి 902
ద్విపాదముల్ భూ-ధృత్వమ్ములను
త్రిపాద మంటున్ – క్రిందుండు తల
నపారవిజ్ఞుం – డా వామనుఁడు
అపారభక్తుం – డా దాత బలి

భార్గవ – భ భ ర ర UII UII UIU U IU యతి (1, 7)
12 జగతి 1207
రాముఁడు తల్లికి – ప్రాణ మిచ్చేనుగా
రాముని గొడ్డలి – రాజులన్ జంపెగా
రాముఁడు భర్గుని – ప్రాభృత మ్మందెగా
ప్రామిడి కంతము – భార్గవుండే గదా

రామ – ర-ర-మ UIU UIU UUU
9 బృహతి 19
రామ, సత్యప్రసూనారామా
రామ, భూమీజరాగగ్రామా
రామ, సంగ్రామభీమా శ్యామా
రామ, లోకాభిరామా ప్రేమా

హలి లేక క్షుత్ – భ లల UI III
5 సుప్రతిష్ఠ 31
నీలవసన
బాలక పశు-
పాలక పరి-
పాలక హలి

సుగత – స స స స స మ ల IIU IIU IIU IIU IIU U UUI యతి (1, 10)
19 అతిధృతి 276188
భవమందున దుఃఖమెగా – భవమందున మోహమ్మే యెప్డు
భవమందున వాంఛలెగా – భవమందున మారుండే యెప్డు
భవమందున బాధల కా – బదులన్నది నిర్వాణమ్మౌను
భువిపై సుగతుం డిదియే – ముగితంచనె బుద్ధుండై తాను

హయవాహన – భ త ర భ లల UI IUU IU IU UI III యతి (1, 10)
14 శక్వరి 15527
వాహిని యయ్యెన్ జగమ్ము – బాపమ్ములకును
దాహము మీఱెన్ ధనాశ – ధాత్రిన్ జెఱచెను
మోహము నిండెన్ మదాన – మున్గెన్ భువి, హయ-
వాహన క్రౌర్యం బడంచు – భద్ర మ్మొసగఁగ

హరి – ర య య లగ UI UIU UIU UIU యతి (1, 6)
11 త్రిష్టుభ్ 587
కామ మోహనా – కంసనాశా హరీ
శ్యామసుందరా – సామగీతాకృతీ
భామినీపతీ – పార్థసూతా ప్రభూ
ప్రేమమందిరా – విశ్వరూపా విభూ
----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాటసౌజన్యంతో

No comments: