Tuesday, February 5, 2019

శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన


శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన





సాహితీమిత్రులారా!

ఆంధ్ర మహాకవులు సంస్కృతం నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి సంస్కృతంలోకి కావ్యబంధాన్ని పరివర్తించేటప్పుడు యథోచితంగా తమతమ ప్రతిభావ్యుత్పత్త్యభ్యాసాలకు అనురూపమైన సంవిధానంతో నిర్వహించటమే గాని, విమర్శకుల పరిశీలన నిమిత్తం ఆ పరివృత్తికై తాము అనుసరించిన విధివిధానంలోని ఒక్కొక్క శిక్షాప్రణీతాన్ని గురించి పేరుపేరున పేర్కొన్నట్లు కనబడదు. భాషాంతరీకరణంలో వారు అనుసరించిన శాస్త్రీయమార్గాలేమిటి? గంభీరార్థనిబంధాలను ప్రసన్నపదబంధాలుగా రూపొందించేందుకు వారు చేసిన ప్రాతిపదిక కృషిస్వరూపం ఏమిటి? అందుకు మార్గదర్శకసూత్రాలు ఏమున్నాయి? మూలంలో తమకు అంగీకర్తవ్యం ఏదో, అనంగీకర్తవ్యం ఏదో వారు నిర్ణయించినప్పటి సహృదయలీలకు ప్రమాణాలేమిటి? అని మూలకారుని హృదయావిష్కరణయత్నంలో తాత్పర్యబోధార్థమై వారు ఆచరించిన అనుష్ఠానక్రమాన్ని బోధ్యబోధకతర్కపరిష్కారంతో వివరించినవారు లేరు.

తెలుగులో ఆ ప్రకారం తన అనువాదసరణిని సవిస్తరంగా పేర్కొన్న ఒకే ఒక్క మహాకవి శ్రీనాథుడని ప్రసిద్ధి. శృంగార నైషధం కావ్యపరిసమాపనవేళలో (8-202) ఆయన చెప్పిన మాటలివి:

“…మామల్లదేవీ నందనుండును, శ్రీహీర రోహణాచలరత్నప్రరోహంబును, చింతామణి మంత్రచింతనఫలంబును, గన్యాకుబ్జరాజాస్థానరంగ మంగళాభరణంబును, గౌడవిజయ కావ్యకర్తయు, గవిచక్రవర్తియు, ఖండన గ్రంథకారుండును, వైతండిక కమలషండవేదండంబును నగు భట్టహర్షమహాకవీశ్వరుండు గవికులాదృష్టాధ్వపాంథుం డొనర్చిన నైషధశృంగారకావ్యప్రబంధవిశేషంబు నశేషమనీషిహృదయంగమంబుగా – శబ్దం బనుసరించియు, నభిప్రాయంబు గుఱించియు, భావం బుపలక్షించియు, రసంబుఁ బోషించియు, నలంకారంబు భూషించియు, నౌచిత్యం బాదరించియు, ననౌచిత్యంబుఁ బరిహరించియు – మాతృకానుసారంబునం జెప్పఁబడిన యీ భాషానైషధకావ్యంబు…”

దురదృష్టవశాత్తు, ఈ నిర్దేశికకు వేదము వేంకటరాయశాస్త్రుల వారు అమోఘమైన తమ సర్వంకషా వ్యాఖ్యలో అర్థాలను వ్రాయలేదు. అందువల్ల, విమర్శకులు చర్చింపవలసిన ఆవశ్యకత ఏర్పడింది.

తొలినాటి విమర్శకాభిప్రాయాలు
‘ఈ వచనంలో చెప్పబడినది శ్రీనాథుని అనువాదవిధానం,’ అని అభ్యూహించి, ఆ విశేషాలను సర్వాంగీణపరిశీలనతో ముమ్మొదట వ్యాఖ్యానించినవారు శ్రీ కందుకూరి వీరేశలింగం గారు. 1887 నాటి తమ తెలుగు కవుల చరిత్రలో (మొదటి సంపుటం) వారు పైని చూపిన శ్రీనాథుని వచనాన్ని పేర్కొని, ‘శబ్దం బనుసరించి’ అన్న దళానికి గాను సంస్కృతాంధ్రాల నుంచి మూడు ఉదాహరణలను ఇచ్చారు. సువర్ణదణ్డైకసితాతపత్త్రిత, జ్వలత్ప్రతాపావలికీర్తిమణ్డలః – అన్న నైషధీయ చరితం (1-2) లోని శ్లోకానికి తెలుగులో, తపనీయదండైకధవళాతపత్రితోద్దండతేజఃకీర్తిమండలుండు (1-46) అని ఉన్న అనుసరణను పేర్కొని,

“ఇందు ‘సువర్ణ’ యనుటకు ‘తపనీయ’ యనియు, ‘సిత’ యనుటకు ‘ధవళ’ యనియు సంస్కృతపదములకు సంస్కృత పర్యాయపదములు వేసి గణయతిప్రాసముల కనుకూలముగా దీర్ఘసమాసమును జేయుట తప్పఁ దెనిఁగించిన దేదియు లేదు. కడపట ‘కీర్తిమండలః’ అనుదానిని ‘కీర్తిమండలుం’ డని తెనుఁగు విభక్తితోఁ గూర్చుటమాత్రమే యిం దున్న తెలుఁగు.”

అని వివరించారు. మూలంలోని గమికర్మీకృతనైకనీవృతః (2-40) అన్న సమాసానికి (గమి=గమనమునకు – కర్మీకృత (కర్మ కాకయుండి) కర్మగా చేయఁబడినది అయిన – నైక=పెక్కు – దేశములు గలవాఁడను – అని వేదము వారి వ్యాఖ్య) ‘అనేకదేశములను తిరిగినవాఁడనై’ అనే అర్థాన్నిచ్చే సమాంతరవాక్యాన్ని వ్రాయక, గమికర్మీకృతనైకనీవృతుఁడనై (2-21) అని అక్షరాక్షరం తెలుగు చేయటాన్ని విమర్శించారు.

“మార్పేమియుఁ జేయక తుదను విభక్తిప్రత్యయమైన డువర్ణమును మాత్రము చేర్చి తెనుఁ గనిపించెను.”

అని వ్రాశారు. మన్దాక్షమన్దాక్షరముద్ర ముక్త్వా(3-61) అని ఉన్నదానికి తెలుగులో, రమణి మందాక్షమందాక్షరంబు గాఁగ (2-64) అని (రమణి=సుందరి యైన దమయంతి … మందాక్ష=సిగ్గుచేత – మంద=సందిగ్ధార్థము లయిన – అక్షరంబు గాఁగన్=పదములు గలదిగా – అని వేదము వారి వ్యాఖ్య) యథాతథంగా చేయబడిన అనుసరణను ప్రస్తావించి,

“ఇందును మూలములోని పదములలో మార్పేమియు లేక తెలుఁ గగుటకు కడను బువర్ణము చేర్పఁబడెను.”

అని వివరించారు. ఇటువంటి శబ్దానుసరణల వల్లనే, ‘నీ డు-ము-వు లను నువ్వు తీసుకొని, మా నైషధాన్ని మాకివ్వు!’ అని వెక్కిరించినట్లుగా జనశ్రుతి ఏర్పడివుంటుందని అన్నారు.

‘శబ్దం బనుసరించి’ అంటే, మూలంలోని శబ్దసంపుటిని ఉన్నదున్నట్లుగా తీసుకోవటం – అన్న అర్థాన్ని వీరేశలింగం గారు తొలిసారిగా చెప్పారన్నమాట.

‘అనౌచిత్యంబుఁ బరిహరించి’ అన్న దళానికి అనుప్రయుక్తమైన అర్థాన్ని ఊహించినవారు కూడా వీరేశలింగం గారే. అనౌచిత్యాన్ని పరిహరించానని చెప్పుకొన్నప్పటికీ కవి అశ్లీలములు, అనౌచిత్యములు అయినవాటిని శ్రీనాథుడు వ్రాయక మానలేదని చెబుతూ వారు శృంగార నైషధంలోని ‘అవ్వలి దిక్కు మో మయి ప్రియంబున’ అని 6-113లో ఉన్న ఒక పద్యాన్ని ఉదాహరించారు. బహుశః ఆ రోజులలో అటువంటివి అనౌచిత్యాలుగా పరిగణింపబడలేదేమో! అని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘అనౌచిత్యంబును పరిహరించి’ అంటే, మూలంలోని అశ్లీలములు, అనౌచిత్యప్రాయములు, ప్రకరణోచితం కానివి అయిన భాగాలను అనువాదంలో విడిచిపెట్టడం – అన్న అర్థాన్ని వీరేశలింగం గారు తొలిసారిగా చెప్పారన్నమాట.

‘భావం బుపలక్షించి’ అన్న దళాన్ని ఆ పేరిట ప్రస్తావింపకపోయినా, శ్రీనాథుడు మూలంలోని భావాన్ని మనోహరంగా తెలుగుచేసిన ఒక పద్యాన్ని వీరేశలింగం గారు ఉదాహరించారు. నైషధాంధ్రీకరణం సర్వజనశ్లాఘాపాత్రంగా ఉన్నదని, అంతటి గుణవిశేషాన్ని కలిగి ఉండటం వల్లనే శృంగార నైషధానికి పంచకావ్యాలలో ఒకటిగా ప్రశస్తి ఏర్పడమే గాక, వాటిలో అగ్రగణ్యంగా భావింపబడుతున్నదని మనసారా మెచ్చుకొన్నారు. వీరేశలింగం గారు ప్రవేశపెట్టిన ఈ అర్థాన్వయం అచిరకాలంలోనే సాహితీవేత్తల ఆమోదాన్ని పొందింది. సాహిత్యవిమర్శగ్రంథాలలోనూ, వ్యాఖ్యలలోనూ, వ్యాసాలలోనూ అవిరళమైన ప్రాచుర్యానికి నోచుకొన్నది.

1913లో గురజాడ శ్రీరామమూర్తి గారి కవిజీవితములు పరివర్ధితపాఠం అచ్చయింది. అందులో శృంగార నైషధ గ్రంథంలోని శయ్యాదికాన్ని చర్చించే సందర్భంలో వారు శ్రీనాథుని అనువాదాన్ని గురించి ఈ మాటలను వ్రాశారు:

“ఇది సంస్కృతమునకు సరియైన తెనుఁ గని చెప్పఁదగి యున్నను నక్కడక్కడ నుభయభాషలకును జాతీయభేదము లైనచో మాత్రము కొన్ని మార్పులు కాన్పించు. ఆ మార్పులు చేయక చెప్పుటయే సులభము. అయినను అట్లు చెప్పిన నాంధ్రభాషలో నది రసహీన మౌ నని యెంచి శ్రీనాథుఁ డట్టిపట్లను మిక్కిలి మెలకువతోఁ దెనిఁగించుచు వచ్చెను. అవి సంస్కృతమాతృకను దగ్గర నుంచుకొని పరిశీలించినంగాని స్పష్టములు కావు. అటుగావున వాని నిప్పుడు వివరింపక సమముగాఁ దెనిఁగించిన యొక శ్లోకమును పద్యమును నిట వివరించెదను :-

శ్లో. అధిగమ్య జగత్యధీశ్వరా, దథ ముక్తిం పురుషోత్తమా త్తతః
       వచసామపి గోచరో న య స్స, త మానంద మవిందత ద్విజః. (నైషధము ౨. సర్గము)

గీ. అట్లు పురుషోత్తముం డైనయతనివలన, ముక్తిఁ గాంచిన యాద్విజముఖ్యుఁ డెలమి
       డెందమునను వాక్కున కందరాని, యధికతర మైన యానంద మనుభవించె.”

గురజాడ శ్రీరామమూర్తి గారు స్పష్టంగా చెప్పకపోయినా, వారి వ్యాఖ్య వీరేశలింగం గారి అన్వయానికి ప్రతిబింబమని తెలుస్తూనే ఉన్నది. సంస్కృతమునకు సరియైన తెనుఁగు అన్నది ‘శబ్దం బనుసరించి’ అన్న దళాన్ని అనుసరిస్తున్నది. ‘అనౌచిత్యంబుఁ బరిహరించి’ అన్న వాడుకకు పర్యాయానువర్తనగా వారు విస్తృతార్థంలో జాతీయభేదము అన్న సరికొత్త పదబంధాన్ని ప్రయోగించారు. అనౌచిత్యపరిహరణతోపాటు భావోపలక్షణం, అభిప్రాయఘటనం మొదలైనవన్నీ ఇందులో అంతర్భవించాయి. సర్వవిధాల మూలవిధేయమైన అనువాదమే ఆచరణీయమైనా, జాతీయభేదం వల్ల కొన్ని మార్పులను చేయక తప్పదని నమ్మినవారు. ‘మార్పులు చేయక చెప్పుటయే సులభము,’ అని అందువల్లనే అన్నారు. ‘రసంబుఁ బోషించి,’ ‘మాతృకానుసారంబున,’ అన్న భావాలకు వ్యాఖ్యగా – ఆంధ్రభాషలో నది రసహీన మౌ నని యెంచి శ్రీనాథుఁ డట్టిపట్లను మిక్కిలి మెలకువతోఁ దెనిఁగించుచు వచ్చెను. అవి సంస్కృతమాతృకను దగ్గర నుంచుకొని పరిశీలించినంగాని స్పష్టములు కావు, అని వ్రాశారు.

1913లో వేదము వేంకటరాయశాస్త్రి గారి శృంగార నైషధ సర్వంకషా వ్యాఖ్య వెలువడింది. అప్పటికే బహుధా ప్రసిద్ధమై ఉన్న ఈ అర్థపరంపర వారికి పూర్ణసంతృప్తిని కలిగింపలేదని ఊహింపవలసి ఉన్నది. అయితే, యథాయోగ్యమైన అర్థనిర్ణయం వారికి ఆ రోజులలో తోపలేదని సైతం భావింపవలసి ఉంటుంది. భిన్నాభిప్రాయులైతే ఏ సంగతీ నిష్కృష్టంగా చెప్పేవారే. అందుచేత ఈ భాగాన్ని విడిచివేశారు. పీఠికలో ‘శృంగార నైషధ విమర్శలేశము’ అన్న ఉపశీర్షిక క్రింద పైని (8-202) లోనిదిగా పేర్కొన్న వచనాన్ని ఉదాహరించి, మహాకవి అనువాదపద్ధతిని వివరించారు. అందులో 1) కల్పనలో ఇమిడిక కోసం పునరుక్తులను వదలివేయటం, 2) పూర్వోత్తరాలలో ప్రత్యేకప్రయోజనం లేని శబ్దసంపుటిని తెనిగింపకపోవటం, 3) రసభావాల స్వారస్యాన్ని మరింత చమత్కారంగా అనువదించటం, 4) రసధ్వని విషయమై జాగరూకతను వహించటం, 5) అలంకార రామణీయకాన్ని అతోధికంగా పెంపొందించటం, 6) తరచు మూలానుగుణంగానో, మూలాతిరిక్తంగానో, మూలాని కంటె మనోహరంగానో అనువదించటం వంటి అంశాల వివరణలతో శ్రీనాథుని ప్రతిభను వేయినోళ్ళతో ప్రశంసించారు. ఔచిత్యపరిపాటినే గాని అనౌచిత్యపరిహరణాన్ని గురించి ప్రస్తావింపలేదు. సంస్కృతమూలాన్ని ఉన్నది ఉన్నట్లుగా గణయతిప్రాసాదులకైన చిన్నచిన్న మార్పులతో తెలుగులో అవతరింపజేయటాన్ని ఉదాహరించి, ‘శబ్దానుసారముం బరమావధిం బొందించినాఁడు’ అని మెచ్చుకొన్నారు. పీఠికలో ఇంత విస్తృతంగా వ్రాసిన తర్వాత మళ్ళీ వ్యాఖ్యానం ఎందుకనుకొన్నారో, అన్వయవిషయకమైన సంతృప్తి కలుగలేదో కాని, అష్టమాశ్వాసంలో దీనికి అర్థాలను వ్రాయలేదు. పీఠికలోనూ ఒక్కొక్క దళాన్నీ వేర్వేరుగా వివరింపలేదు.

శ్రీనాథ వాఙ్మయాభిమానులైన అనంతరీయ విమర్శకులందరూ ఈ అన్వయక్రమాన్ని అంగీకరించారనే చెప్పవచ్చును. చాగంటి శేషయ్యగారు ఆంధ్ర కవితరంగిణిలో (ఐదవ భాగం) దీనినే పునరుక్తం చేశారు. వీరేశలింగం గారు చూపినవాటికి మరికొన్ని ఉదాహరణలను చేర్చి అభిధేయార్థాలను విపులీకరించారు. ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సాహిత్యచరిత్రను బోధిస్తుండిన రోజులలో ఈ అనువాదపు సూత్రీకరణ కళాశాలలలో సువ్యాప్తమైంది. అధ్యాపకులు దీనినే అనుసరించారు. 1971లో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారు ప్రచురించిన తమ బృహత్పరిశోధనగ్రంథం శ్రీనాథుడులో దీనికి పటిష్ఠమైన తర్కసంగతితోడి సోదాహరణాన్వయం ఉన్నది. 1972లో నేను కళాశాలలో బి.ఎ విద్యార్థిగా ఉండినప్పుడు శ్రీనాథవాఙ్మయాన్ని అధికరించి విశేషకృషి చేసిన మా ఆచార్యులు మాకు ఆ ప్రకారంగానే పాఠం చెప్పేవారు. లక్ష్మీకాంతం గారి ఆంధ్ర సాహిత్య చరిత్ర వారి మరణానంతరం చాలా ఆలస్యంగా 1974లో అచ్చయింది. అందులో ఈ అర్థసంవాదం కనబడుతుంది.

“ఆంధ్రీకరణ పద్ధతులు”
స్థూలదృష్టికి శ్రీనాథుని సూత్రీకరణంలో మొత్తం ఏడు ప్రధానమైన దళాలున్నాయి. అవి 1) శబ్దాన్ని అనుసరించటం, 2) అభిప్రాయాన్ని కూర్చటం, 3) భావాన్ని ఉపలక్షించటం, 4) రసాన్ని పోషించటం, 5) అలంకారాన్ని భూషించటం, 6) ఔచిత్యాన్ని ఆదరించటం, 7) అనౌచిత్యాన్ని పరిహరించటం. ‘మాతృకానుసారంబున’ అన్న ప్రతిజ్ఞ వీటన్నింటికి ఏకాన్వయంగా అనువర్తిస్తుంది.

డా. కొర్లపాటి శ్రీరామమూర్తి గారు 1992లో అచ్చయిన తమ తెలుగు సాహిత్య చరిత్ర (ద్వితీయభాగం) లో వీటి సత్త్వనియతిని మరొక్కసారి వివరించారు. శబ్దం బనుసరించి – అంటే మూలశబ్దానుసరణమని; సంస్కృతంలోని పరిభాషాపదాలను, ప్రౌఢపదబంధాలను, రీతిసుభగాలైన సమాసకుసుమావళులను యథాతతంగా తెలుగు పద్యగద్యాలలో ప్రయోగించటమని – విశదీకరించారు. అభిప్రాయంబు గుఱించి – అంటే అభిప్రాయఘటనమని; దాని అర్థం శ్రీహర్షుడు సంస్కృతంలో తన వ్యుత్పత్తిని ప్రదర్శించిన స్థలాలలోనూ, శ్లేషలను ఘటించిన చోట్లలోనూ, సుదీర్ఘవర్ణనాకీర్ణంగా విస్తరించిన సన్నివేశాలలోనూ కథాప్రతిపాదితమైన అభిప్రాయాన్ని శ్రీనాథుడు తెలుగుచేయటం, అని వీరి వివరణ. భావం బుపలక్షించి – అంటే భావోపలక్షణమని; మూలంలో తరచుగా ప్రయుక్తమైన కేవలవ్యుత్పత్తిప్రదర్శనను వదిలిపెట్టి, అనువాదానికి లొంగని శ్లేషలను విడిచివేసి, వర్ణనీయాంశాల అతివేలతను వీలైనంత తగ్గించి, రసోపస్కారకమైన ముఖ్యాభిప్రాయాన్ని మాత్రమే ఆంధ్రీకరణలో కూర్చటమని నిరూపించారు. రసంబుఁ బోషించి – అంటే రసపోషణమని; ఆలంబనవిభావములైన నాయికానాయకుల, ఉద్దీపనవిభావములైన యౌవనభూషణచేష్టాదుల, తటస్థోద్దీపనవిభావములైన మలయానిలచంద్రాదుల, సాత్త్వికభావములైన స్తంభాదుల, స్థాయిభావములైన రత్యాదుల వర్ణనం – అన్నారు. అలంకారంబు భూషించి – అంటే అలంకారభూషణమని; మూలంలోని అలంకారాలను ఒకప్పుడు యథాయథంగా సంతరించటం, మరొకప్పుడు అన్యధాకరించటం, సరిక్రొత్త అలంకారాలను కైసేయటం, అమూలకాలంకారాలను ప్రకల్పించటం, అని వివరించారు. ఔచిత్యం బాదరించి – అంటే ఔచిత్యసమాదరణమని; రససిద్ధమైన కావ్యానికి స్థిరమైన జీవితాన్ని ప్రసాదించేది ఔచిత్యం కనుక, క్షేమేంద్రుని ఔచిత్యవిచారచర్చలో చెప్పబడిన విధంగా అనువాదంలో ఔచిత్యభేదాలన్నింటిని పాటించటం – అని చెబుతూ, ఆ ఔచిత్యభేదాలను ప్రస్తావించారు. అనౌచిత్యంబుఁ బరిహరించి – అంటే అనౌచిత్యపరిహారమని; మూలంలో అనుచితములైనవాటిని, ప్రకరణోచితం కానివాటిని అనువాదంలో విడిచివేయటం, అన్నారు. ఈ ప్రతిపాదనలు అన్నింటికీ ఆయా ప్రకరణాలలో ఉదాహరణలను ప్రదర్శించారు. ఇవన్నీ సాహిత్యవిద్యార్థులకు సుపరిచితాలే.

ఈ అర్థవల్లిని ఇదే విధంగా పర్యాయానువర్తనలతో ప్రపంచించినవారు ఇంకా పెక్కుమంది ఉన్నారు. శతశః ఉదాహృతులను కలిగిన అనేక గ్రంథాలున్నాయి. వాటిలో 1977లో వెలువడిన డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారి శ్రీనాథుని సాహిత్యప్రస్థానము అన్న పరిశోధనగ్రంథం ప్రశస్తమైనది.

మొత్తంమీద ఈ అన్వయక్రమంతో విభేదించినవారు లేరనే చెప్పాలి.

శ్రీనాథుని నిర్వచనంలో ‘మాతృకానుసారంబున’ అంటే, మాతృకలో ఉన్న చందాన – అని అర్థం. దీనిని శ్రీరామమూర్తి గారు విశదీకరింపలేదు. ఆ విషయాన్ని గురించి తర్వాత చర్చిద్దాము.
తథ్యమిథ్యావివేచన
ఈ అర్థాన్వయంలో ఉన్న లోపమల్లా ఒక్కటే. ‘మాతృకానుసారంబున’ అన్న నిరుక్తిని అంగీకరిస్తే – ఉపరినిర్దిష్టసూత్రంలో ‘ఔచిత్యం బాదరించి, అనౌచిత్యంబుఁ బరిహరించి,’ అన్న రెండు దళాలకు ప్రవేశం ఉండదు. అనువాద కవి ఔచిత్యానౌచిత్యాల విషయంలో తనకు గల అభిరుచిభేదం వల్ల స్వాతంత్ర్యాన్ని వహిస్తూనే, లాంఛనప్రాయంగా మాతృకానుసారితను ప్రకటించటం భావ్య మనిపించుకోదు. మాతృకానుసరణం మార్పును సహింపదు. అసలు మాతృకావిధేయుడైన కవికి తాను అనువదిస్తున్న కావ్యం అనౌచిత్యబంధురమన్న సంకోచం ఉండటమే ఆశ్చర్యకరం. అందులోనూ శ్రీనాథుడు. శృంగారసన్నివేశం అనగానే అశ్లీలమనీ, సుశీలమనీ; అనౌచిత్యమనీ, ఔచిత్యమనీ పృథగ్వివక్ష కలగటం ఆయన స్వభావమేనా? అంతగా పరిహరింపవలసినన్ని ఔచిత్యప్రత్యుదాహరణలను సమీకరించిపెట్టుకొని, వాటిని పరిహరించానని చెప్పటమూ, అందుకు ప్రత్యామ్నాయంగా ఔచిత్యాన్ని ఆదరించానని పేర్కొనటమూ తన కావ్యప్రశస్తికి దోహదం చేయవని స్ఫురింపనంతటి అసంవిదుడు కాడు కదా.

‘ఔచిత్యాన్ని ఆదరించాను’ అని ప్రకటించాడు సరే, లోకోత్తరమైన ఒక మహాగ్రంథాన్ని అనువాదం చేస్తున్న ఏ కవైనా, మూలంలోని అనౌచిత్యాన్ని నేను పరిహరించాను – అని చెప్పుకోవటం ఎక్కడైనా ఉంటుందా? ఔచిత్యాన్ని ఆదరించినందువల్లనే కదా, అనువాదానికి నైపథ్యానుసంజనం ఏర్పడింది? కావ్యంలో ఎప్పుడైనా లోలోపల ఏవైనా అనౌచిత్యాలు కనబడితే, కవులు వాటిని అనువదింపక వదిలివేస్తారు. లేదా, ఎంతో కొంత మార్చివేస్తారు. అంతే కాని, నేను ఇందులోనుంచి అనౌచిత్యాలను తొలగించివేశాను – అని కావ్యాంతంలో చెప్పరు.

నిజానికి శ్రీహర్షుని నైషధీయచరితంలో లాక్షణికులు సాహిత్యశాస్త్రరీత్యా అనౌచిత్యములు అని నిర్ధారించి చెప్పదగిన కావ్యదోషాలు అసలు లేనే లేవు. ఆయన తనకాలం నాటి మహావిద్వాంసులలో అగ్రశ్రేణికుడు. వేదార్థాన్ని నిర్ణయించేందుకు సాధనములైన అధికరణలన్నింటిని సాధించిన నైయాయికుడు. తత్త్వశాస్త్రాన్ని ఆమూలచూడంగా అధ్యయనించిన దార్శనికశేఖరుడు. ఖండనఖండఖాద్యము వంటి బృహద్గ్రంథాన్ని వినిర్మించి, అద్వైతవేదాంతానికి ప్రతిపక్షస్థానీయములైన సిద్ధాంతాలను, న్యాయవైశేషికాలలో అవ్యక్తుల వాదోపవాదాలను తుత్తునియలు చేసి తార్కికచక్రవర్తియై కాలాతీతవిఖ్యాతి గడించిన మహాపండితుడు. ఈశ్వరాభిసంధిని కల్పించి, శాంకరీయదర్శనానికి చెప్పలేనంత బలాన్ని చేకూర్చిన విద్వత్తల్లజుడు. శాస్త్రార్థసభలలో పులిమీసాలకు ఉయ్యాల కట్టుకొని ఊగిచూపిన ధీరవతంసుడు. సందర్భం వచ్చినప్పుడు పాణినీయాన్ని సైతం ఆటపట్టింపగల శబ్దశాస్త్రకోవిదుడు. ప్రవృత్తినివృత్తిధర్మాలను బోధించే శ్రుతిస్మృతిపురాణాలను, పూర్వోత్తరమీమాంసలను, నిఘంటువులను, శిక్షా జ్యౌతిష తురీయపురుషార్థ కళా చతుర్వర్గ గజ తురగ ఖడ్గాది లక్షణగ్రంథాలను, సర్వశాస్త్రసమాహారమైన అలంకారశాస్త్రాన్ని సామగ్రీసమగ్రిమతో స్వాయత్తీకరించికొని సమ్యగ్దృష్టిని అలవరచుకొన్న మహనీయుడు.

అటువంటి మహాత్ముడు తర్కకర్కశమైన తన వాగ్ధోరణిని లలితలావణ్యవిలాససంపదలు సొంపారే కమనీయ కావ్యసీమలకు మళ్ళించటమే ఆశ్చర్యం. వస్తుస్వీకరణలో, నాయక చిత్రీకరణలో, రసపోషణలో ఆలంకారికులు కళ్ళు పెద్దవి చేసుకొని చూడవలసిన అపూర్వమైన మహాకావ్యాన్ని కల్పించినవాడు ఆయన. తాను కల్పిస్తున్నది ‘కవికులాదృష్టాధ్వపాన్థ’మైన మహాకావ్యమన్న ఆత్మప్రత్యయం కలవాడు. అందులో రసస్వరూపావగాహన లేని ఆధునికపాఠకుల దృష్టిలో అసమీచీనమని భావింపబడుతున్న శృంగారసన్నివేశాల పౌష్కల్యం ఉన్నమాట నిజమే. ఆ చిత్రీకరణ యోగ్యతాదూరమైన రసవిరుద్ధాచరణం కానే కాదు. గడిచిన ఇన్ని వందల సంవత్సరాల కాలంలో ఆసేతుశీతాచలపర్యంతమైన లాక్షణికప్రపంచం ఏనాడూ ఆయన కవితను ఉచితిమ లోపించిన కావ్యదోషప్రకరణంలో చేర్పలేదు. అటువంటి కావ్యంలో అనౌచిత్యశంక లేశమాత్రమైనా శ్రీనాథునికి ఎందుకు కలుగుతుంది? ఏ ఔచిత్యం లోపించిన శృంగారకల్పనలను పరిహరించానంటున్నారో, అంతకు పదింతలు మీ రచనలలో ఉన్నాయి కదా! అని ఒకవేళ సభాసదులంటే ఏమని సర్దిచెబుతాడు? మూలంలోని అనౌచిత్యాలు పరిహరణీయాలని భావించిన తర్వాత – ఆ అన్నింటినీ పరిహరింపక – వాటిలో కొన్నింటిని పరిహరించి, కొన్నింటిని ఎందుకు అట్టేపెట్టారు? వీటిలో లేని అనౌచిత్యాలు వాటిలో ఏమున్నాయి? అని ప్రశ్నిస్తే ఏమని సమర్థిస్తాడు? నన్నయగారు భారతానువాదానికి పూనుకొని, వ్యాసమహర్షి రచనలోని ‘ఔచిత్యం బాదరించి, అనౌచిత్యంబుఁ బరిహరించి,’ నేను తెలుగు చేస్తున్నాను – అంటే విమర్శకుల స్పందన ఎట్లా ఉంటుందో ఊహించండి. ఇది సర్వజనశిరోధార్యమైన వ్యాసుల వారి మహాభారతం కాదు, అనౌచిత్యబంధురమని విశేషంగా చెప్పవలసిన శ్రీహర్షుని నైషధం సంగతి అంటారేమో – ఏమండీ, అంతగా అనౌచిత్యాలను పరిహరించి తెలుగు చేయవలసిన పుస్తకాన్ని మీరిప్పుడు తవ్వి తలకెత్తుకోవటం దేనికి? అని అడిగితే ఏమని సమాధానం చెబుతాడు? కవికులం ఎన్నడూ కనీవినీ యెరుగని మార్గంలో తొలిసారి నడిచి చూపినవాడు (కవికులాదృష్టాధ్వపాంథుండు) అని ఒకవైపు మెచ్చుకొంటూనే, యజ్ఞకర్త అయిన ‘భట్ట’హర్ష మహాకవీశ్వరుడు అని ఒకవైపు అంటూనే, అంతటి మహాకవి రచనలో మీరు అనౌచిత్యాలను పరిహరింపవలసివచ్చిందా? అని అడిగితే సమాధానం ఏమిటి?

‘రసంబుఁ బోషించి’ అని వివక్షితార్థాన్ని ఒక్కమాటలో సూత్రీకరించాడు. తన అనువాదం ఆ కావ్యమంతటా పరచుకొనివున్న రసవత్తకు పుష్టిని కూర్చుతుందన్నమాట. ఆ పుష్టి కావ్యగతాలైన రసభావాల ఉద్దీప్తి వల్ల, ఔజ్జ్వల్యం వల్ల చేకూరుతుంది. సర్వాంతర్వర్తనీయమైన ఆ విధమైన రసపోషణనైమిత్తికమైన మహావాక్యాన్ని శీర్షణ్యంగా నిలిపిన తర్వాత, ఆయన వంటి మహావిద్వాంసుడు – కావ్యంలో అనౌచిత్యానికంటె రసభంగహేతువైనది మరొకటి లేదని, ప్రసిద్ధౌచిత్యబంధసంయుతమైన కావ్యమే రమణీయమని ధ్వన్యాలోకంలో ఆనందవర్ధనుడు చెప్పిన అనౌచిత్యాదృతే నాన్య ద్రసభఙ్గస్య కారణమ్ అన్న సామాన్యప్రమాణం తెలియనివానివలె రసభంజకమైన అనౌచిత్యాన్ని పరిహరిస్తానని, రసజీవితభూతమైన ఔచిత్యాన్ని సమాదరిస్తానని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం ఉండదు.

అసలు విషయం: మూలంలో రసప్రాతికూల్యాన్ని ఆరోపించితే గాని, అనౌచిత్యస్థాపనం జరగదు. అది అనువాదానికై ఉత్సవిస్తున్న మహాకవి మనస్సులోని పరిభాష కాదు. శృంగారసన్నివేశం అనౌచిత్యమని పరిహరింపవలసిరావటం శ్రీనాథుని స్వభావం కాదు. శృంగారేతరములై ఆధునిక విమర్శకులచే విమర్శనీయాలైన అనౌచిత్యాలు శ్రీహర్షుని రచనలో లేవు.

ఒకసారి ‘మాతృకానుసారంబున’ అన్న తర్వాత శబ్దానుసరణం, అభిప్రాయఘటనం, భావోపలక్షణం అందులో అంతర్భవించేవే కాని, ప్రత్యేకించి ధర్మోపమంగా పేర్కొనవలసిన ఆవశ్యకత ఉండదు. ఆవశ్యకత లేకపోయినా, భావికవులకు ఉపదేశార్థం చెప్పాడని సరిపెట్టుకోవాలి. ‘శబ్దం బనుసరించి’ అని ప్రకటించినవాడు – రసవిహీనములే అనుకొందాము, అనుసరణకు లోగని కేవల సాంకేతికములే అనుకొందాము – శాస్త్రార్థాలను కొన్నింటిని కలుపుకొని, అటువంటివే మరికొన్నింటిని ఎందుకు త్రోసిపుచ్చినట్లు? మూలంలోని విశిష్టపదబంధాలను, సమస్తవాక్యాలను అనువాదంలో సముచిత మనిపించినప్పుడు ఏ కవైనా, ఎక్కడో అక్కడ యాథాయథ్యంతో ప్రయోగించటం జరుగుతూనే ఉంటుంది. ఏ మహాకవి కావ్యాన్ని తీసుకొన్నా మూలంలోని శబ్దాన్ని అనుసరించిన భాగాలు కనబడుతూనే ఉంటాయి. అది కాదని, మూలంలో వాణీగుణోదయతృణీకృతపాణివీణానిక్వాణయా (11-82) అని ఉంటే – వాణీగుణోదయతృణీకృతపాణివీణానిక్వాణ యగు (5-75) అని అనుసరించటం; రశ్మిగ్రాహిగరుత్మదగ్రజసమారబ్ధా విరామభ్రమౌ (21-147) అని ఉంటే – రశ్మిగ్రాహిగరుత్మదగ్రజసమారబ్ధా విరామభ్రమిన్ (8-155) అని విభక్తులను మార్చి తెలుగులోకి తేవటం ఏదో ఒక గొప్ప విశేషమైనట్లు, అదేదో ఆంధ్రీకరణశిల్పంలో తన ప్రత్యేకత అయినట్లు, ఉన్నదున్నట్లుగా ‘శబ్దం బనుసరించి’ వ్రాశాను అని చెప్పుకోవటం శ్రీనాథుని వంటి మహాకవికి గర్వకారణం అవుతుందా?

కావ్యంలో అలంకారముల కల్యాణాంగత్వం ప్రస్ఫుటమే అయినా, సర్వాంగీణమైన ‘రసంబుఁ బోషించి’ అన్న వెంటనే ‘అలంకారాన్ని భూషించి’ అని విశేషించే ఆవశ్యకత ఉండదు. అలంకారము, భూషణము, అన్న శబ్దాల క్రమపరిగతి, అలఙ్కారై ర్గుణై శ్చైవ బహుభిః సమలఙ్కృతమ్, భూషణై రేవ విన్యస్తై స్త ద్భూషణ మితి స్మృతమ్, అన్న నాట్యశాస్త్రనిరుక్తిని స్మరింపజేయదు. నిర్దోషం గుణవ త్కావ్య మలఙ్కారై రలఙ్కృతమ్, రసాన్వితం కవిః కుర్వన్ కీర్తిం ప్రీతిం చ విన్దతి, అన్న భోజరాజు వాక్యార్థానికి అది సంస్మారకం కాదు.

మహాలాక్షణికుడైన శ్రీనాథుడు సందిగ్ధాంశభూయిష్ఠమైన ఇటువంటి పొందిపొసగని నిర్వచనంతో అనర్ఘమైన తన అనువాద విధానాన్ని సూచించి ఉండడు.

ఏ విధంగా చూసినా అన్వయింపని అర్థసంగతి ఇది.

“మాతృకా” శబ్దార్థం
ఇప్పుడు వాక్యంలోని ‘మాతృకానుసారంబున’ అన్న వ్యపదేశాన్ని మరికొంత విమర్శించి చూద్దాము. మాతృక అన్న శబ్దానికి ఈనాటి వలె ఒకప్పుడు, భాషాంతరీకరణకై గ్రహించిన మూలము – అన్న అర్థస్ఫూర్తి లేదు. కావ్యాలను వేరే ఒక దేశభాష నుంచి సంస్కృతంలోకి అనువాదం చేయవలసిన అవసరం (గుణాఢ్యుని బృహత్కథను సోమదేవుడు కథాసరిత్సాగరంగా పరివర్తింపవలసివచ్చిన ఒకే ఒక్క సందర్భంలో తప్ప – అదీ శ్రుతలబ్ధమైన కథకే గాని, తొలినాటి పైశాచీ ప్రతికి అచ్చమైన సంస్కృతానువాదంగా కాదు) పూర్వకాలంలో కలుగలేదు కనుక, మూలభాషలోని రచన అన్న అర్థంలో సంస్కృతంలో ఒక పదం పుట్టివుండదు. సంస్కృతం నుంచి దేశభాషలలోకి అనువాదాలు చేసిన ఆంధ్ర తమిళ కన్నడ కవులెవరూ, మేము భాషాంతరీకరణకై గ్రహించిన మూలభాషలోని రచన – అన్న భావంతో పూర్వం ఈ మాతృకా శబ్దాన్ని ప్రసిద్ధంగా ప్రయోగించినట్లు కనబడదు. మాతృకమ్ – మాతు రాగతే = తల్లినుంచి సంక్రమించినది; మాతృకా – సప్తమాతృషు – ఏడుగురు మాతృకలు; గృహాక్షరే = గృహవాస్తుకు సంబంధించిన ఒకానొక బీజాక్షరము; ఉపమాతరి = పాలిచ్చి పోషించిన దాది; మాతరి = తల్లిగారు; దేవీ భేదే = ఒక దేవత; ఈశ్వర్యామ్ = పార్వతి; వర్ణమాలాయామ్ = ఆదిక్షాంతవర్ణమాల; కరణే = కరణభేదము; స్వరే = స్వరము – అని నిఘంటువులు. ఇంకా కొన్ని అర్థాలున్నాయి. ఏ విధంగా చూసినా ‘మాతృకానుసారంబున’ అంటే, మూలమైన సంస్కృతనైషధాన్ని అనుసరించిన – అన్న అర్థం ఏర్పడదు.

పూర్వోత్తర సంహిత
శృంగార నైషధం కావ్యాంతంలో ఈ అనువాద సూత్రీకరణాంశానికి ముందువెనుకలలో ఉన్న భాగాన్ని పూర్తిగా చదివితేనే గాని పాఠకులకు దీని వాస్తవమైన ఆంతర్యం ఆవిష్కృతం కాదు. అందువల్ల కొంత సుదీర్ఘమే అయినా ప్రకృతాధికరణంలో దానినిక్కడ ఉదాహరిస్తున్నాను. కథాంతంలో నలుడు, ‘కల్యాణపరంపరాభివృద్ధి గావించుఁ గాత మీ విశ్వమునకు,’ (8-201) అని పరమేశ్వర స్తోత్రపూర్వకంగా మంగళాశాసనం చేస్తాడు. పరమేశ్వరునికి పుష్పాంజలిని సమర్పిస్తాడు. అప్పుడు ఈ వచనానికి (8-202), ఆ తర్వాతి సీస పద్యానికి (8-203) ప్రసక్తి కలిగింది:

కథోపసంహారము

“అనుచు, నిజవంశమకుటమాణిక్యం బైన రోహిణీరమణునకు రమణీసమేతంబుగాఁ బుష్పాంజలి సమర్పించి, యంగుళీయకమణిప్రభాసందోహంబు చంద్రికాప్రవాహంబుపై వెల్లిగొన భూవల్లభుండు పాణిపల్లవంబులు మొగిడ్చి ఫాలభాగంబునం గీలుకొలిపె; ని వ్విధంబున నా దంపతు లనురాగసంపద పొంపిరివోవం బ్రాజ్యంబు లగు రాజ్యసుఖంబు లనుభవించుచుండిరి; తత్కాలంబునం జాతుర్వర్ణ్యంబు నిజధర్మంబుఁ దప్పక మెలంగె; వాత జ్వ రాగ్ని క్షు త్పిపాసా వ్యాధి తస్కర భయంబు లుడిగెఁ; బర్జన్యుండు గాలంబుఁ దప్పక వర్షించె; దేశంబులు ధనధాన్యసమృద్ధంబు లయ్యె; సురభు లమృతంబులు గురిసెఁ; దరువులు పుటకపుటకంబుగ మధుస్యందంబుఁ జెందె; సకలజనంబులు పరమానందంబు నొందిరి.

కావ్యోపసంహారము

మామల్లదేవీ నందనుండును, శ్రీహీర రోహణాచలరత్నప్రరోహంబును, చింతామణి మంత్రచింతనఫలంబును, గన్యాకుబ్జరాజాస్థానరంగ మంగళాభరణంబును, గౌడవిజయ కావ్యకర్తయు, గవిచక్రవర్తియు, ఖండన గ్రంథకారుండును, వైతండిక కమలషండవేదండంబును నగు భట్టహర్షమహాకవీశ్వరుండు గవికులాదృష్టాధ్వపాంథుం డొనర్చిన నైషధశృంగారకావ్యప్రబంధవిశేషంబు నశేషమనీషిహృదయంగమంబుగా శబ్దం బనుసరించియు, నభిప్రాయంబు గుఱించియు, భావం బుపలక్షించియు, రసంబుఁ బోషించియు, నలంకారంబు భూషించియు, నౌచిత్యం బాదరించియు, ననౌచిత్యంబుఁ బరిహరించియు మాతృకానుసారంబునం జెప్పఁబడిన యీ భాషానైషధకావ్యం బాపస్తంబసూత్ర! భారద్వాజ(స)గోత్ర! యుభయకులపవిత్ర! దానవిద్యాసత్త్ర! నెల్లూరి తూర్కరాజపౌత్త్ర! మామిడి పెద్దనామాత్యపుత్త్ర! పెదకోమటి వేమభూపాల కరుణాపాత్ర! వినయవివేకసాహిత్య! సింగనామాత్య! నీవు కృతినాయకుండవుగాఁ బుణ్యశ్లోకుండు నలుండు కథానాయకుండుగా విలసిల్లు నాచంద్రతారార్కంబు.

సీ. నలచక్రవర్తి పుణ్యశ్లోకుఁ డగుటను, దమయంతి పతిదేవతావతంస
      మగుట న ప్పరమభవ్యపురంధ్రి పురుషుల చరితంబు సత్కావ్యసరణిఁ గూర్చి
      చింతామణీ మంత్రసిద్ధుం డుపాధ్యాయభట్టహర్షుండు వాక్ప్రౌఢి మెఱయఁ
      జెప్పిన నైషధ శృంగారకావ్యంబు దెలియఁ జెప్పితి నాంధ్రదేశభాష

గీ. ని మ్మహాకృతిఁ బఠియించు నెవ్వఁ డేని
      యాతఁ డపగత కలిదోషుఁ డగుచుఁ గాంచు
      నాయురారోగ్యవిమలవిద్యావివేక
      భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు.”

ఇందులో, కథోపసంహారము, కావ్యోపసంహారము, అన్న శీర్షికలు వ్రాతప్రతులలోనివి కావని చెప్పనక్కరలేదు. అవి శృంగార నైషధ సర్వంకషా వ్యాఖ్యలో వేదము వేంకటరాయశాస్త్రి గారు సందర్భోచితంగా ఉంచినవి. పాఠకులు ఈ భాగాన్ని శ్రద్ధగా చదివినప్పుడు కథోపసంహారం చివరనున్న ‘సకలజనంబులు నానందంబు నొందిరి,’ అన్న పరిసమాపకవాక్యంతో కావ్యం మంగళాంతం అయిందని సులభంగానే అర్థమవుతుంది. ఆ తర్వాత నిక్షిప్తమై ఉన్న కావ్యోపసంహారము, ఈ వచనంలో అసంగతంగా వచ్చి చేరినదన్న అనుమానం కలుగుతుంది. ‘సకలజనంబులు నానందంబు నొందిరి’ అని కథను ముగించిన తర్వాత శ్రీనాథుడు, సీసపద్యంలో, నలచక్రవర్తి పుణ్యశ్లోకుడు కావటం వల్ల, దమయంతి పతివ్రత కావటం మూలాన – ఆ పుణ్యదంపతుల చరిత్రను సత్కావ్యంగా మలిచి చింతామణీమంత్రసిద్ధుడైన శ్రీహర్షుడు సంస్కృతంలో చెప్పిన నైషధీయ చరితాన్ని తెలుగువారికి నేను శృంగార నైషధంగా తెలియజెప్పాను, అనటంలో ఒక క్రమపరిగతి, ఔచిత్యం ఉన్నాయి. వేంకటరాయశాస్త్రి గారు చూపలేదు కాని, ఈ సీసపద్యానికి మూలం నైషధీయ చరితం పధ్నాలుగవ సర్గ 89వ శ్లోకంలో ఉన్నది:

భవద్వృత్తస్తోతు ర్మదుపహితకణ్ఠస్య కవితుః
ముఖాత్పుణ్యైః శ్లోకై స్త్వయి ఘన ముదేయం జనముదే
తతః పుణ్యశ్లోకః క్షితిభువనలోకాయ భవితా
భవా నాఖ్యాతస్సన్ కలికలుషహారీ హరి రివ.

అంతకు ముందు 88వ శ్లోకంలో శ్రీహర్షుడు ‘నారీతి విదితా’ (ఉత్తమ పతివ్రత అని ప్రసిద్ధురాలైనది) అని, 90వ శ్లోకంలో ‘కిఞ్చిత్త్వయా నహి పతివ్రతయా దురాపం’ (పతివ్రతవైన నీచే పొంద శక్యం కాని కోరిక ఏముంటుంది) అని కూడా వ్రాశాడు. శ్రీనాథుడు ఈ వాక్యశకలాలను సంగ్రహించి, నలచక్రవర్తి పుణ్యశ్లోకుఁ డగుటను, దమయంతి పతిదేవతావతంస, మగుట న ప్పరమభవ్యపురంధ్రిపురుషుల చరితంబు సత్కావ్యసరణిఁ గూర్చి అని ప్రకరణోచితంగా తెలుగుచేశాడు. కర్కోటకస్య నాగస్య దమయన్త్యా నలస్య చ, ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్ అని ప్రసిద్ధమై ఉన్న శ్లోకాన్ని తెలుగుచేసి, ఇ మ్మహాకృతిఁ బఠియించు నెవ్వఁ డేని, యాతఁ డపగతకలిదోషుఁ డగుచుఁ గాంచు, నాయురారోగ్యవిమలవిద్యావివేక, భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు అన్నాడు.

కావ్యోపసంహార వచనం చివర ‘పుణ్యశ్లోకుండు నలుండు కథానాయకుండుగా’ అని నాయకనిర్దేశం చేశాడు. చేసిన వెంటనే పునరుక్తిపూర్వకంగా అదే ఎత్తుగడతో, నలచక్రవర్తి పుణ్యశ్లోకుఁ డగుటను – అన్న సీసపద్యాన్ని ఉపక్రమించే వీలుండదు. అది శ్రీనాథుని వంటి మహాకవి రచనాపద్ధతి కాదు. ‘చింతామణి మంత్రచింతనఫలంబును’ అని శ్రీహర్షకవి మామల్లదేవీ శ్రీహీరుల మంత్రచింతనఫలం అని ముందొకసారి చెప్పిన తర్వాత, సీసంలో తద్విరుద్ధంగా ‘చింతామణీ మంత్రసిద్ధుండు’ అని చెప్పవలసిరాదు. దానివల్ల శ్రీహీరుడు, శ్రీహర్షుడు ఇద్దరూ చింతామణీ మంత్రోపాసకులే అన్న ఉభయాన్వయం పొందుపడదు. భట్టహర్షమహాకవీశ్వరుం … డొనర్చిన నైషధశృంగారకావ్యప్రబంధవిశేషంబు … (మాతృకానుసారంబునం) జెప్పఁబడిన యీ భాషానైషధకావ్యంబు, అన్న తర్వాత – ఆ వెంటనే దానినే పునరుక్తం చేసి, భట్టహర్షుండు వాక్ప్రౌఢి మెఱయఁ, జెప్పిన నైషధ శృంగారకావ్యంబు దెలియఁ జెప్పితి నాంధ్రదేశభాష, అని వ్రాయవలసి ఉండదు.

శృంగార నైషధం కథోపసంహార వచనంతో కథాభాగం ముగిసి, సింహావలోకన సీసపద్యంతో మొత్తం కావ్యం పరిసమాప్తం కావలసి ఉండగా – మధ్యలో ఈ కావ్యోపసంహార వచనభాగం వచ్చి చేరినట్లు అర్థమవుతుంది. దానిని తొలగిస్తే వాక్యాన్వయం సౌష్ఠవపూర్వకంగా సరిపోతుందని తేటతెల్లమవుతుంది.
అనువాద విషయ సూత్రీకరణం
ఈ కావ్యోపసంహార వచనంలో అనువాద విషయ సూత్రీకరణ భాగానికి ముందున్న విశేషణాలన్నీ శ్రీహర్షుని నైషధీయ చరితంలోని వివిధస్థలాలలో చెదురుమదురుగా ఉన్నవే కాని, నవీనకల్పితాలు కావు. నైషధీయ చరితంలోని మొదటి సర్గ చివరనున్న 145వ శ్లోకంలో, శ్రీహర్షం కవిరాజరాజిమకుటాలఙ్కారహీర స్సుతం, శ్రీహీర స్సుషువే జితేన్ద్రియచయం మామల్లదేవీ చ యమ్, తచ్చిన్తామణిమన్త్రచిన్తనఫలే శృఙ్గారభఙ్గ్యా మహా, కావ్యే చారుణి నైషధీయచరితే, అని ఉన్నదానిని ఆంధ్రీకర్త యథాతథంగా స్వీకరించాడు. ‘మామల్లదేవీ నందనుండు’ అని తల్లిగారి పేరును ముందుంచాడు. కవిరాజసమూహము యొక్క శిరఃకిరీటాలంకారమైన హీరము (వజ్రమణి) – అని తండ్రిగారికి అన్వయించే విశేషణాన్ని పుత్త్రునికి అనువర్తించి, ‘శ్రీహీర రోహణాచల రత్నప్రరోహంబు’ (శ్రీహీరులవారనెడి రోహణ పర్వతమున కలిగిన రత్నపు మొలక) అన్నాడు. గ్రంథాంతంలో ఉన్న కవిప్రశస్తి లోని 4వ శ్లోకమైన ‘తామ్బూలద్వయ మాసనం చ లభతే యః కాన్యకుబ్జేశ్వరాత్’ (కన్యాకుబ్జ రాజ్యాధిపతి నుండి ముఖ్యాసనము, తాంబూలద్వయము అను అగ్రపూజాగౌరవమును పొందినవాడు) అన్న వాక్యాన్ని కవితాత్మకంగా ‘కన్యాకుబ్జరాజ ఆస్థానరంగ మంగళాభరణంబు’ అని తెలుగుచేశాడు. ఏడవ సర్గ చివరనున్న 106వ శ్లోకంలోని ‘గౌడోర్వీశకులప్రశస్తి భణితి’ ఆధారంగా ‘గౌడవిజయ కావ్యకర్త’ అని వ్రాశాడు. ఈ గౌడవిజయము అన్నది ఆంధ్రీకర్త స్వతంత్రించి అన్యధాకృతంగా పెట్టిన పేరు. శ్రీహర్షుడు తన రచన గౌడోర్వీశకులప్రశస్తి అని మాత్రమే చెప్పాడు. గౌడవిజయము అని చెప్పలేదు. పుస్తకం దొరకలేదు. ‘ఖండనగ్రంథకారుండు’ అన్నది నైషధీయ చరితం ఆరవ సర్గ చివరనున్న 113వ శ్లోకంలోని ‘ఖణ్డనఖణ్డతోఽపి’ అన్న దళం నుంచి గ్రహించి వ్రాయబడినది. పదవ సర్గ చివరనున్న 137వ శ్లోకంలోని ‘తర్కే ష్వసమశ్రమస్య’ అన్నదానిని గ్రహించి, ‘వైతండిక కమలషండ వేదండంబు’ అని వ్రాశాడు. వాది-ప్రతివాదులు పక్ష-ప్రతిపక్ష స్థానాలలో నిలిచినప్పుడు ప్రతిపక్షస్థాపనాహీనమైన వ్యర్థజల్పానికి వితండ అని పేరు. వాదబలంతో స్వకీయమైన సిద్ధాంతస్థాపనకు పూనుకొనక కేవలం వైరిపక్షంపై నిందాలాపాలకు పాల్పడటం అన్నమాట. వితండావాదం చేసేవారు వైతండికులు. అటువంటి వైతండిక కమలషండానికి వేదండం (వైతండికులనే తామర మొత్తాలను చీల్చిచెండాడే ఏనుగు) వంటివాడు తర్కేషు=షట్తర్కములయందు, అసమశ్రమః=నిరుపమానంగా కృషిచేసినవాడు శ్రీహర్షు డన్నమాట. ఎనిమిదవ సర్గ చివర 109వ శ్లోకంలో శ్రీహర్షుడు, …కవికులాదృష్టాధ్వపాన్థే మహా, కావ్యే చారుణి వైరసేనిచరితే (కవికులము ఏనాడూ చూచియెరుగని సరిక్రొత్త మార్గమునందు నడచిన చారుతర మహాకావ్యమగు వీరసేనపుత్త్రుడైన నలునియొక్క చరిత్రమునందు) అని నైషధీయ చరితానికి విశేషణంగా చెప్పినదానిని శ్రీహర్షునికే అన్వయించి, ‘కవికులాదృష్టాధ్వపాంథుండు’ అన్నాడు. ఖండనఖండఖాద్యంలో ‘ఇతి కవితార్కికచక్రవర్తి శ్రీహర్షకృతే’ అని ఉన్న ముఖ్యవ్యవహారాన్ని బట్టి ‘కవిచక్రవర్తియు’ అని ప్రయోగించాడు.

కాగా, ‘చింతామణి మంత్రచింతనఫలంబును’ అని ఇక్కడ శ్రీనాథుడు వ్రాసినది మాత్రం చింత్యమని ఒప్పుకోక తప్పదు. పైని ఉదాహరించిన మొదటి సర్గ చివర 145వ శ్లోకంలో ఉన్న తచ్చిన్తామణిమన్త్రచిన్తనఫలే శృఙ్గారభఙ్గ్యా మహా, కావ్యే చారుణి నైషధీయచరితే అన్న భాగం నైషధీయ చరితానికి అన్వయించినట్లు శ్రీహర్షునికి అన్వయింపదు. తత్=ఆ శ్రీహర్షునియొక్క, చింతామణి మన్త్ర=చింతామణి అను బీజాక్షరసంపుటితోడి మంత్రమును, చింతన=ఉపాసించుటకు, ఫలే=ఫలితమైన; శృంగారభంగిని కలిగిన చారుతర నైషధీయ చరిత మహాకావ్యమునందు – అని అన్వయం. శ్రీహర్షుడు చింతామణి మంత్రోపాసన చేసి దేవతానుగ్రహాన్ని సాధించినవాడే కాని, ఆయన చింతామణి మంత్రచింతనఫలం కాదు. చింతామణి మంత్రచింతనఫలం శారదానుగ్రహకృతమైన నైషధీయ చరితమే గాని శ్రీహర్షుడు కాడు. మామల్లదేవి కాని, శ్రీహీరుడు కాని, తదుభయులు కాని చింతామణి మంత్రాన్ని ఉపాసించినందువల్ల జన్మించినవాడని ప్రబంధకోశాదులలోని కథలో లేదు. అందువల్ల శృంగార నైషధ పాఠం –

‘మామల్లదేవీ నందనుండును, శ్రీహీర రోహణాచలరత్నప్రరోహంబును, గన్యాకుబ్జరాజాస్థానరంగ మంగళాభరణంబును, గౌడవిజయ కావ్యకర్తయు, గవిచక్రవర్తియు, ఖండన గ్రంథకారుండును, వైతండిక కమలషండవేదండంబును నగు భట్టహర్షమహాకవీశ్వరుండు గవికులాదృష్టాధ్వపాంథుం డొనర్చిన చింతామణి మంత్రచింతనఫలం బగు నైషధశృంగారకావ్యప్రబంధవిశేషంబు’

అని కాని,

‘చింతామణి మంత్రచింతనఫలంబుగ మామల్లదేవీ నందనుండును, శ్రీహీర రోహణాచలరత్నప్రరోహంబును, గన్యాకుబ్జరాజాస్థానరంగ మంగళాభరణంబును, గౌడవిజయ కావ్యకర్తయు, గవిచక్రవర్తియు, ఖండన గ్రంథకారుండును, వైతండిక కమలషండవేదండంబును నగు భట్టహర్షమహాకవీశ్వరుండు గవికులాదృష్టాధ్వపాంథుం డొనర్చిన నైషధశృంగారకావ్యప్రబంధవిశేషంబు,’

అని కాని ఉండాలి. అయితే వచనంలో ఆ ప్రకారంగా లేదు. అంతే కాదు. శ్రీహర్షుడు చింతామణీ దివ్యమాతృకామంత్రోపాసకుడన్న భావానికి ఉపబలకంగా శృంగార నైషధం అవతారికలో (1-16) ఈ పద్యం ఉన్నది:

కవిరాజరాజిశేఖరహీరముకుటంబు శ్రీహీర కలశాబ్ధిశిశిరకరుఁడు
మామల్లదేవీ కుమారరత్నంబు చింతామణీ మంత్ర చింతనపరుండు
కవికులాదృష్టాధ్వగమనాధ్వనీనుండు కాశ్మీరనృపసభాకమలహేళి
ఖండనగ్రంథ సంగ్రంథ కర్కశబుద్ధి షట్తర్కమర్మైకచక్రవర్తి

భట్టహర్షుండు ప్రౌఢవాక్పాటవమున
నెద్ది రచియించె బుధలోకహితముపొంటె
నట్టి నైషధ సత్కావ్య మాంధ్రభాష
ననఘ! యొనరింపు నా పేర నంకితముగ.

ఇందులో, ‘కవిరాజరాజిమకుటాలఙ్కారహీరః’ అన్నది ‘కవిరాజరాజిశేఖరహీరముకుటంబు’ (కవిశ్రేష్ఠుల వరుసయొక్క సిగదండయైన వజ్రకిరీటము – అని వేదము వారి వ్యాఖ్య) అని శ్రీహీరునికి అన్వయించే విశేషణం శ్రీహర్షునికి అన్వయం గాను, ‘సుతం, శ్రీహీర స్సుషువే … మామల్లదేవీ చ యమ్’ అన్నది ‘శ్రీహీర కలశాబ్ధిశిశిరకరుఁడు, మామల్లదేవీ కుమారరత్నంబు’ గాను, ‘తచ్చిన్తామణిమన్త్రచిన్తనఫలే’ అన్నది ఉన్నదున్నట్లుగా ‘చింతామణీ మంత్ర చింతనపరుండు’ గాను అనువాదమై ఉన్నది. ‘కవికులాదృష్టాధ్వపాన్థే’ అన్నది శ్రీహర్షునికే అన్వయింపబడి, ‘కవికులాదృష్టాధ్వపాంథుండు’ అని తెలుగులోకి వచ్చింది. ‘ఖణ్డనఖణ్డతోఽపి, తర్కే ష్వసమశ్రమస్య,’ అన్న దళాలే విస్తరింపబడి, ‘ఖండనగ్రంథ సంగ్రంథ కర్కశబుద్ధి, షట్తర్కమర్మైకచక్రవర్తి,’ అని అనువాదమైంది.

కనుక, శృంగార నైషధం కథోపసంహార వచనంతో కథాభాగం ముగిసి, సింహావలోకన సీసపద్యంతో మొత్తం కావ్యం పరిసమాప్తం కావలసి ఉండగా – మధ్యలో ఈ కావ్యోపసంహార వచనభాగం వచ్చి చేరినట్లు అర్థమవుతుంది. దానిని తొలగిస్తే వాక్యాన్వయం సుష్ఠుగా సరిపోతుందని తేటతెల్లమవుతుంది.

ఆ విధంగా సమ్మతం కాని పక్షంలో కావ్యోపసంహార వచనాన్ని యథాతథంగా నిలిపి, దానికి ముందు ‘ఇట్లు’ అన్న వాక్యోపక్రమాన్ని చేర్చుకొని (ఇట్లు మామల్లదేవీ నందనుండును, శ్రీహీర రోహణాచలరత్నప్రరోహంబును …), ‘చింతామణి మంత్రచింతనఫలంబును’ అన్న దళాన్ని ‘చింతామణి మంత్రచింతనపరుండును’ అని దిద్దుకోవలసివస్తుంది. అప్పుడు పునరుక్తమన్న కారణంతో సలక్షణంగా రచితమైన (8-203) లోని సీసపద్యాన్ని తొలగింపవలసి ఉంటుంది.

శృంగార నైషధ రచనా కాలం
శ్రీనాథుడు క్రీస్తుశకం 1360 ప్రాంతాల జన్మించాడనుకొంటే, 1372లో (±) చిన్నారి పొన్నారి చిఱుతకూఁకటినాఁడు మరుత్తరాట్చరిత్రను చెప్పాడు. 1376 (±) నాటి నూనూఁగు మీసాల నూత్నయౌవనమున శాలివాహన సప్తశతి రచన జరిగింది. నిండు జవ్వనంబున శృంగారనైషధాన్ని ఆంధ్రీకరించాడు. అది క్రీస్తుశకం 1394-1395ల నడిమికాలం మాట. పూర్తయినది బహుశః 1395 (±) నాటికి కావచ్చును.

సంస్కృతంలో నైషధీయ చరితం శ్రీహర్ష మహాకవి కృతి. ఆయన క్రీస్తుశకం 12వ శతాబ్ది ఉత్తరార్ధంలో కన్యాకుబ్జ (కనౌజ్) పాలకుడైన జయంతచంద్రుని ఆస్థానంలో ఉన్నాడు. క్రీస్తుశకం 1306 నాటి మేరుతుంగాచార్యుని ప్రబంధచింతామణి, 1348 నాటి రాజశేఖరసూరి ప్రబంధకోశం ఆయన జీవితచరిత్రను వివరిస్తున్నాయి. ప్రసిద్ధములైన ఆ విశేషాలను ఇక్కడ పేర్కొనటం లేదు. నైషధీయ చరితం పైని అప్పటికే వెలసి వ్యాప్తిలో ఉన్న చారిత్రవర్ధనుని తిలక వ్యాఖ్య (± క్రీ.శ. 1230), విద్యాధరుని సాహిత్య విద్యాధరీ వ్యాఖ్య (± క్రీ.శ. 1260), చాండూ పండితుని నైషధ దీపికా వ్యాఖ్య (క్రీ.శ. 1297) లలో ఏ ఒక్కటీ శ్రీనాథునికి ఉపలభ్యమైనట్లు కనబడదు. శ్రీనాథుడు ఆ వ్యాఖ్యలను చూచిన అన్వయాలు శృంగార నైషధంలో కనబడవు. ఆ వ్యాఖ్యలలో ఏ ఒక్కటీ అప్పటికింకా దక్షిణదేశం లోనికి అడుగు పెట్టలేదని భావింపవలసి ఉంటుంది. క్రీ.శ. 1380-1385ల నడుమ ఉదయించిన నరహరి పండితుని దీపికా వ్యాఖ్య ఆయనకు సమకాలికం కనుక దానిని చూచివుండడు. నరహరి పండితుడు తన దీపికా వ్యాఖ్యలో శ్రీహర్షుని నైషధీయ చరితానికి వ్యాఖ్యలేవీ లేవని వ్రాశాడు. అసంనిధా వన్యనిబన్ధనానాం కదాపి కుర్యా దుపకార మేతత్, తరఙ్గిణీనాం తరణే రభావే తుమ్బీఫలేనాపి తరన్తి పూరమ్ అని సరిపెట్టుకొన్నాడు. వేరే వ్యాఖ్యానాలు దగ్గర లేకపోవటం ఒకవిధంగా మేలే, నావ దొరకకపోతే సొరకాయ బుర్రను పట్టుకొని నదిని దాటక తప్పదు కదా! అన్నాడు. శ్రీనాథుడు తనకు పూర్వం వెలసిన వ్యాఖ్యలను చూచివుండనటానికి సమకాలికుడే పేర్కొన్న ఈ మాట మరొక ఆధారం.

మల్లినాథసూరి జీవాతు వ్యాఖ్య అప్పటికింకా రచింపబడలేదని ఆయన అనువాదం చెప్పకనే చెబుతున్నది. లేక రచితమైనప్పటికీ, ఆ విషయం తెలియనందువల్ల చూడలేదేమో. దానిని చూచివుంటే నిజానికి శృంగార నైషధం స్వరూపమే వేరే విధంగా ఉండేది. అందువల్ల ఎటువంటి వ్యాఖ్యాసాహాయ్యమూ లేకుండానే అనువాదానికి సాహసించినట్లున్నది. వామనభట్టబాణుడైనా నలాభ్యుదయ కావ్యరచనాకాలానికి నైషధీయచరితానికి వెలసిన వ్యాఖ్యలను చూచినట్లు లేదు. ఆ రోజులలో మహాప్రసిద్ధికి నోచుకొన్న కాళిదాసీయ నలోదయ వామనభట్టబాణ నలాభ్యుదయాలకు ప్రతిస్పర్ధిగా అటువంటిదే నలచక్రవర్తి యొక్క జీవితకథను కలిగి, మహాప్రౌఢమైన కావ్యంగా రాజసభలలో పేరెన్నిక గన్న శ్రీహర్షుని నైషధీయ చరితాన్ని తెలుగు చేయాలని శ్రీనాథుడు ఉత్సవించి ఉంటాడు. చేతిలో ఏ వ్యాఖ్యానమూ లేనందువల్ల – దేశమంతటా తలకొక్కతీరుగా ఉన్న వ్రాతప్రతులలో కొన్నింటినైనా సేకరించి, తన అనువాదయజ్ఞానికి అంకురార్పణను చేసివుంటాడు. శ్రీహర్షుడు సర్వశాస్త్రపారంగతుడైన మహాపండితుడు. కవితార్కికచక్రవర్తి. నైషధం లోకోత్తరపాండిత్యనిర్భరమైన రచన. మునుపెన్నడూ లేని వినూత్నసంవిధానంతో సంస్కృతంలో కూర్పబడిన అతిప్రౌఢమైన ఆ మహాకావ్యాన్ని ఇంకా పొంగి చల్లారని వయస్సులో ఉన్న శ్రీనాథుడు కేవలం వ్రాతప్రతులపై ఆధారపడి వ్యాఖ్యావిరహితంగా అర్థం చేసుకోవటం, దానిని ఆంధ్రీకరించా లనుకోవటం సామాన్యకృత్యాలు కావు. ఒకపాటి పాండిత్యం కలవారికి కలలోనైనా సంకల్పింపరాని మహోద్యమం అది. చిరంతనమైన యశస్సే ప్రాణమనుకొనే కవులు ఏటికెదురీది గట్టెక్కగలిగిన సులభకార్యం కాదు. అందులోనూ శ్రీహర్షుడు బుద్ధిపూర్వకంగానే కావ్యమంతటా గ్రంథగ్రంథులను నిక్షేపించాడు. సజ్జనులు (విద్వాంసులు) వాటిని గురుముఖంగా విప్పటం నేర్చుకొని రసోర్మికలలో మునిగి తేలాలని కావ్యాంతంలో నొక్కి వక్కాణించాడు. అటువంటి కావ్యాన్ని తెలుగుచేయటం వల్లనే శ్రీనాథునికి సాహిత్యలోకంలో అజరామరమైన సుస్థితి ఏర్పడింది. సృష్టికి ప్రతిసృష్టి చేసి, ‘ఆంధ్రభాషానైషధాబ్జభవు’డను అని హరవిలాసంలో (1-8) సగర్వంగా చెప్పుకొన్నాడు. కల్పించినాఁడవు గాఢపాకం బైన హర్షనైషధకావ్య మాంధ్రభాష అని భీమేశ్వర పురాణం (1-28) లోనూ, పలుకుతోడై తాంధ్రభాషామహాకావ్యనైషధగ్రంథసందర్భమునకు అని అని సరస్వతీ ప్రార్థన లోను, ఆంధ్రనైషధకర్త యంఘ్రియుగ్మమునందుఁ దగిలియుండెను గదా నిగళయుగము అని జీవిత చరమసంధ్యాసమయంలోనూ అందువల్లనే ఆజీవితం స్మరించుకొన్నాడు.

సాహిత్యంలో కొత్తగాలులు వీస్తున్న రోజులవి. క్రీస్తుశకం 1375-1376 సంవత్సరాల నడిమికాలంలో పెదకోమటి వేమారెడ్డి హాలుని గాథాసప్తశతి సంకలనం నుంచి ఒక నూరు గాథలను ఎన్నుకొని సప్తశతీసార మన్నపేరిట తన భావదీపికా వ్యాఖ్యను వెలయించాడు. అలంకార ప్రస్థానానికి, ధ్వనిప్రస్థానానికి, రీతిగుణానికి, శబ్దధర్మానికి, అర్థరామణీయకానికి, రసవత్తకు, లోకస్వభావచిత్రణకు భవ్యాదర్శమైన మహారచనమది. అప్పటికింకా ఆయన చందవోలులోనే ఉన్నాడు. రాజాస్థానప్రవేశం చేయదలచిన శ్రీనాథుడు దానిని ముందుంచుకొని, పీతాంబర భువనపాలాదుల వ్యాఖ్యల సాయంతో అన్వయించుకొని, ఆయనకు వినిపించేందుకు హాల శాలివాహన గాథాసప్తశతిని తెలుగు చేశాడు.

క్రీస్తుశకం 1390-1395 ప్రాంతాల పెదకోమటి వేమారెడ్డి దృష్టి సంస్కృతవాఙ్మయంలో సుప్రసిద్ధమైన అమరు శతకం వైపు మళ్ళింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడో సాహిత్యచింతామణి నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టినట్లున్నాడు. ఆ రచన దీర్ఘకాలం సాగి వుంటుంది. ఆ కృషి అమరు శతకాన్ని వ్యాఖ్యానించేందుకు దోహదకరమై ఉంటుంది. తన వైదుష్య రసజ్ఞతలు పరిఢవిల్లే అద్భుతావహమైన వ్యాఖ్యకు ఉపక్రమించి, శృంగార దీపిక అన్న పేరుతో 1395 నాటికి దానిని పూర్తి చేశాడు. కాళిదాసు అభిజ్ఞానశాకుంతలం, దండి కావ్యాదర్శం, తనదే కాబోలును త్రిపురాసుర సింధువు, ధనంజయుని దశరూపకం, భరతముని నాట్యశాస్త్రం, అమరసింహుని నామలింగానుశాసనం, ఎవరి రచనమో తెలియని నీతివాక్యామృతం, పాణినీయం, కాత్యాయన వృత్తి, పతంజలి మహాభాష్యం, భోజరాజు సరస్వతీకంఠాభరణం, కొక్కోకుని రతిరహస్యం, ఇంకా ఎన్నో రచనలనుంచి ఉదాహరణలను ప్రదర్శించాడు. అది శ్రీనాథుడు శృంగార నైషధానువాదాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసి, ఇతిశ్రీ వ్రాయబోతున్న తరుణం కాబోలు. వేమభూపాలుని ఈ శృంగారదీపికా వ్యాఖ్యను ఆ పరిసమాపనవేళలోనో, కావ్యాన్ని ముగించివేసిన తర్వాతనో చూసి ఉంటాడు. పెదకోమటి వేమారెడ్డి కూడా దేశమంతటినుంచి అమరు శతకం వ్రాతప్రతులను, తనకు పూర్వం వెలసిన రుద్రమదేవకుమార అర్జునవర్మాదుల వ్యాఖ్యానాలను సంపాదించి, రసదీర్ఘిక అయిన తన వ్యాఖ్యకు శ్రీకారం చుట్టాడు. రుద్రమదేవకుమార అర్జునవర్మాదుల పాఠంలో ఉన్న శ్లోకాలను కొన్నింటిని ప్రక్షిప్తాలుగా పరిహరించి, వ్రాతప్రతులలోనుంచి వ్యాఖ్యేయములుగా తనకు ఔచిత్యవంతములని తోచిన సరికొత్త శ్లోకాలను తీసికొన్నాడు. శృంగార దీపికా వ్యాఖ్యాదిని ఆయన మాటలివి:

మూలశ్లోకాన్ సమాహృత్య ప్రక్షిప్తాన్ పరిహృత్య చ
విధత్తే విదుషా మిష్టాం టీకాం శృంగారదీపికామ్.
అవతారోఽథ సంబన్ధోఽభిప్రాయో భావలక్షణమ్
నాయికా తదవస్థాశ్చ నాయకశ్చ తతో రసః.
అఙ్గాని కైశికీవృత్తే రలఙ్కార స్తతః క్రమాత్
ఇ త్యేతాని ప్రవక్ష్యన్తే యథాసమ్భవ మఞ్జసా.

ఇది 1959లో పుణే లోని ఓరియంటల్ బుక్ ఏజెన్సీ వారి పక్షాన సి.ఆర్. దేవధర్ పండితుని సంపాదకత్వంలో అచ్చయిన అమరు శతకం ప్రతినుంచి ఉదాహరిస్తున్న పాఠం. రెండవ శ్లోకంలో దేవధర్ అవతారోఽథ అన్న పాఠాన్ని స్వీకరించారు కాని, అడయారు థియొసాఫికల్ సొసైటీ వారి సంస్కృత లిఖితగ్రంథసంచయంలో ఉన్న ప్రతిలో అర్థావబోధః అన్న రూపం ఉన్నది. దేవధర్ గారు దానిని స్వీకరింపలేదు. నిజానికి అదే ఉండవలసిన అసలు పాఠం. భావిముద్రణలలో దిద్దుకోవాలి. రెండవ శ్లోకంలో ‘నాయికా తదవస్థాశ్చ’ అన్న తావున ‘నాయికా తదవస్థా చ’ అని, ‘నాయికా స్తదవస్థాశ్చ’ అని పాఠాంతరాలున్నాయి. ‘నాయకశ్చ తతో రసః’ అన్నచోట వ్రాతప్రతులలో ‘నాయకశ్చ తథా రసః’ అన్న పాఠం ఉన్నది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత, వేమభూపాలుని అమరు శతకం శృంగారదీపిక అవతారికలోని శ్లోకపాఠం ఇదని నిర్ధారింపవచ్చును:

మూలశ్లోకాన్ సమాహృత్య ప్రక్షిప్తాన్ పరిహృత్య చ
విధత్తే విదుషా మిష్టాం టీకాం శృంగారదీపికామ్.
అర్థావబోధ స్సంబన్ధోఽభిప్రాయో భావలక్షణమ్
నాయికా తదవస్థాశ్చ నాయకశ్చ తతో రసః.
అఙ్గాని కైశికీవృత్తే రలఙ్కార స్తతః క్రమాత్
ఇ త్యేతాని ప్రవక్ష్యన్తే యథాసమ్భవ మఞ్జసా.

(అమరు శతకం మూలంలో ఉండదగిన శ్లోకాలను స్వీకరించి, ప్రక్షిప్తాలను పరిహరించి, విద్వాంసులకు ప్రీతిపాత్రమైన శృంగారదీపిక అనే పేరుగల టీకను పెదకోమటి వేమారెడ్డి సమకూర్చుతున్నాడు. ఇందులో శబ్దార్థబోధం, కర్త్రాది కారకాన్వయం, కవిహృదయావిష్కారం, భావములయొక్క లక్షణనిరూపణం, సంయోగవిప్రలంభాదుల యందు నాయికానాయకుల అవస్థాభేదాల వర్ణనతోడి రసపోషణం, కైశికీ కావ్యవృత్త్యంగముల వివృతి, అలంకారముల నిరూపణం అన్న అంశాలు తత్తదుచితములైన చోట్ల చెప్పబడుతున్నాయి.)
శ్రీనాథుని అనువర్తనం
వేమభూపాలుని శృంగారదీపిక నుంచి శ్రీనాథుడు ఈ భాగాన్ని స్వీకరించి శృంగార నైషధంలో చేర్చుకోవటానికి ముఖ్యమైన కారణం కావ్యానువాదానికి తనముందు ప్రామాణికములైన మేలి ప్రతులు లేవన్న సంకోచమే. వ్యాఖ్యలేవీ లభించినట్లు లేదని కూడా అనుకొన్నాము. క్రీస్తుశకం 1240 (±) ప్రాంతాల శ్రీహర్షుని నైషధీయ చరితం తొలిప్రతి ఘూర్జర దేశంలోని ఢోలకాన్ని పరిపాలిస్తున్న వీరధవళుని అమాత్యుడైన వస్తుపాలుని వద్దకు చేరిందని చరిత్ర. అక్కడి నుంచి ఉత్తరదక్షిణాలకు, పూర్వపశ్చిమాలకు దేశమంతటా ప్రతులు వ్యాపించాయి. శ్రీనాథుడు అనువాదం మొదలుపెట్టే నాటికి ఎన్ని తరాల నాటి ప్రత్యంతరాలు ఎటువంటి పరస్పరభేదాలతో అవతరించాయో తెలియదు. అసంతృప్తికరమైన పాఠక్రమం ఆయనను వేధించివుంటుంది. ఉన్నంతలో మాతృకానుసారంగా చెబుతున్నానని స్పష్టీకరించాడు.

‘మాతృక’ అంటే తన యెదుటనున్న తాళపత్ర ప్రతి అన్నమాట.

భావదీపికలో నుంచి శ్లోకభావాలను తీసుకోవటం వల్ల – తన్నిమిత్తంగా వేమభూపాలుని సంతోషపెట్టడం కూడా సంభవమే కాని, అది అంత ప్రధానకారణమై ఉండదు.

శృంగారదీపికలో ‘అర్థావబోధము’ అని స్థగితమైన దళాన్ని శ్రీనాథుడు శబ్దం బనుసరించి అని తిరగవేసి తెలుగుచేశాడు. ఋషీణాం పునరాద్యానాం వాచ మర్థోఽనుధావతి అని కదా సంప్రదాయం. వాగధీనః అర్థో భవతి అని ఉత్తరరామచరితంలో వీరరాఘవీయ టీక. గోవును అనుసరించి నడిచే గోవత్సం వలె విశదార్థబోధకై మూలంలోని శబ్దాన్ని అనుగమిస్తాడన్నమాట. తాను ఎన్నుకొన్న శబ్దము యొక్క స్ఫోటసిద్ధిహేతుమత్త్వం చేత మూలంలోని అర్థాన్ని సుబోధం చేయగల విధంగా పాఠాలను ఎన్నుకొంటాడు. ‘సంబంధము’ అంటే – కర్త, కర్మ, కరణము, సంప్రదానము, అపాదానము, అధికరణము అన్న షట్కారకాలను గూర్చి అన్నమాట. ఆ కారకాన్వయప్రస్తావం వ్యాఖ్యానకర్తకే గాని తనకు అనవసరమని వదిలివేశాడు. ‘అర్థావబోధ స్సంబన్ధః’ అని అన్వయిస్తే, అది శబ్దార్థముల నిత్యయుక్తికి బోధకం అవుతుంది. నిత్యః శబ్దార్థసంబన్ధః అని రఘువంశ వ్యాఖ్యలో మల్లినాథసూరి. మూలంలోని శబ్దాన్ని అర్థవంతంగా అన్వయించుకోవటం. అది పాఠనిర్ణయ విషయం. యాథాతథ్యంతోడి శబ్దానుసరణమన్న ఆంధ్రీకరణ సిద్ధాంతం కాదు.

అభిప్రాయమును కూర్చటం అంటే శాబ్దబోధం వల్ల ధ్వన్యమానమైన కవిహృదయాన్ని క్లేశరహితంగా ఆవిష్కరించటం. లాక్షణికపరిభాషలో దీనికి ధ్వననవ్యాహారము అనిపేరు. వర్ణనీయాంశముల దీర్ఘత కథానుస్యూతికి అడ్డుతగిలినప్పటి తాత్పర్యకథనం. వక్తృప్రౌఢోక్తిసిద్ధమైన అభిప్రాయాన్ని తన మాటలలో (కవిప్రౌఢోక్తిసిద్ధంగా) అనువదించి చెప్పటం, మూలంలోని కథనోద్దేశాన్ని వ్యాఖ్యానప్రాయములైన తన మాటలతో వివరించి చెప్పటం అన్నమాట. ఇది క్షేమేంద్రుని ఔచిత్యవిచారచర్చలోని అభిప్రాయౌచిత్యానౌచిత్యాలకు అనువర్తించటం కవి ఉద్దేశం కాదు. మూలములోని ప్రతిపాదితార్థాన్ని సువ్యక్తం చేయగల పాఠాలను ఎన్నుకొని మూలమునకు వ్యాఖ్యానప్రాయంగా ప్రపంచింపగలనన్న సూచన. శృంగారదీపికలో, ఇత్యభిప్రాయః అని ప్రసక్తములైన వాక్యాలన్నీ శ్రీనాథుని ఈ నిర్వచనానికి కరదీపికలు.

భావమును ఉపలక్షించటం అంటే రసములను నిష్పాదింపజేసే నాయికా నాయక హృదయనిష్ఠములైన రత్యాదిచిత్తవృత్తులను, మన్మథాద్యవస్థలను నోరారా వర్ణింపగల పాఠాలను ఎన్నుకోవటం. వేమభూపాలుడు వాత్సల్యము, స్నేహము, భక్తి మొదలైన భావాలను సైతం రత్యాదిగణంలో సమీకరించాడు. ఆ క్రమంలో కావ్యార్థాన్ని ఆస్వాదింపజేసే సమస్త భావప్రపంచాన్ని శ్రీనాథుడు తన పాఠంలో ఉపలక్షించాడని ప్రతీయమానం. ఈ భావోపలక్షణము అన్న సంజ్ఞ కూడా వేమభూపాలుడు ప్రవేశపెట్టినదే.

ఆ నైపథ్యానుసంజనతోనే, ‘తతో రసః’ అన్న వేమభూపాలుని మాటను, రసంబుఁ బోషించియు అని తెలుగు చేశాడు. అది నైషధీయ చరితంలో ప్రతీతమైన శృంగార రసమును పరిపోషింపగల అత్యుత్తమములైన పాఠాలను ఎన్నుకొంటానన్న తాత్పర్యంతో చెప్పినది.

అలంకారమును భూషించటం అని శ్రీనాథుడు వ్రాసినది మరింత లోనారసి చూడవలసిన మాట. వేమభూపాలుడు ఈ అలంకార ప్రస్థానాన్ని గురించి ఎంతో గాఢమైన పరిశోధన చేశాడు. అలంకారముల రసోపయోగితను మూలమట్టంగా పరిశీలించాడు. తన సాహిత్యచింతామణిలో ఆ సారనవనీతాన్ని ప్రోదిచేశాడు. పునరుక్తవదాభాసాన్ని శబ్దాలంకారాలలో చేర్చాడు. మమ్మటుని కావ్యప్రకాశాన్ని అనుసరించాడు కాని, పూర్తిగా శిరసావహింపలేదు. అందులో లేనివి ఎన్నో చెప్పాడు. విచిత్రాలంకారాన్ని, ప్రశ్నోత్తరికాలంకారాన్ని తనదైన పరిభాషలో వివరించాడు. రుయ్యకుని అలంకారసర్వస్వం నుంచి గ్రహించి పరిణామోల్లేఖాలను అభినవంగా వ్యాఖ్యానించాడు. అనుకల్పాన్ని (ముఖ్య ముక్త్వాథ గౌణోక్తి రనుకల్ప ఇతి స్మృతః), యుక్తిని (దుర్ఘటార్థస్య ఘటనా) సరిక్రొత్తగా అలంకార ప్రకరణంలో పేర్కొన్నాడు. విద్యాధరుని ఏకావళిని చదువుకొన్న ఫలితంగా తత్కరాన్ని అలంకారంగా ప్రవేశపెట్టి, రససిద్ధికి ఆ తత్కరాలంకారము యొక్క భూషణాంగత్వాన్ని నిరూపించాడు. సాహిత్యచింతామణి అచ్చుకానందువల్ల అపూర్వమైన అందులోని లక్షణపరంపర విమర్శకుల దృష్టికి రాలేదు. దీనిని ముందుంచుకొని నైషధీయచరితంలోని అలంకారాలను శృంగారనైషధంతో సమన్వయించి, ఈ దళము యొక్క సార్థకతను విశదీకరింపవలసి ఉంటుంది. రసపోషణలో అంగమైన వాగర్థాలంక్రియతను విశేషించి చెప్పటం తన కావ్యానికి ప్రాణశక్తిని ప్రసాదించిన ఉక్తివైచిత్రిని నిరూపించేందుకే అని అర్థం చేసుకోవాలి. భట్ట శ్రీహర్షుని వంటి భూషణార్థి రచనలోని అలంకారాన్ని తాను గౌరవిస్తా డన్నమాట. అందుకే, కామోపభోగాలై ప్రవర్ధిల్లే శృంగారోచితవృత్తులను సాలంకారంగా అభివర్ణించాడు. నలుడు దమయంతి మందిరప్రవేశం చేసినప్పుడు విజ్ఞాన-రూప-శోభాది గుణవర్ణనలతో నర్మగర్భాన్ని చిత్రించి నాయికా నాయకుల అన్యోన్యానురాగాన్ని ప్రకాశింపజేశాడు. ఇవన్నీ లోతుగా పరిశీలించి వ్యాఖ్యానింపవలసిన వృత్త్యంగాలు. తాను స్వీకరించిన పాఠంలో వాటి ప్రతిఫలనం ఉంటుందని ప్రతిపాదించాడు.

ఔచిత్యాన్ని ఆదరించటం అంటే (మూలశ్లోకాన్ సమాహృత్య) పరిపరివిధాలుగా ఉన్న వ్రాతప్రతులలో నుంచి ప్రకరణోచితమైన మేలిపాఠాన్ని (మూలపాఠాన్ని) ఎన్నుకోవటం.

అనౌచిత్యాన్ని పరిహరించటం అంటే (ప్రక్షిప్తాన్ పరిహృత్య చ) ఉపలబ్ధమైన పాఠపరంపరలో రసప్రతీతికి భంగహేతువై, అపార్థస్ఫోరకమైన పాఠాన్ని స్వీకరింపకపోవటం.

ఈ ప్రత్యుక్తనియమావళిలో ఎక్కడైనా పొరపాటు సంభవిస్తేనో? అందుకే, మాతృకానుసారంబున అన్నాడు. తాళపత్ర ప్రతులను వ్రాసేవారు తమ లేఖనానికి సరిక్రొత్త జన్మనిచ్చిన మూలప్రతిని మాతృక అని వ్యవహరించటం ఉన్నది. అదే ఇటీవలి కాలంలో అర్థవిస్తృతిని పొంది, మూలభాషలోని రచన అన్న రూఢిని సంతరించుకొన్నది. అంతే కాని, మాతృక అంటే, కవియొక్క అనువాదానికి మూలమైన రచన, అన్న అర్థం మునుపటి రోజులలో లేదు. వేమభూపాలుని వ్యాఖ్యను ముందుంచుకొని, అందులో వలె నైషధీయ చరితానికి లభించిన ప్రత్యాధారితంగా, తదనుసారంగా పాఠనిర్ణయం చేసికొని రచన సాగించానని చెప్పాడు.

అందుకు అతీతంగా ఆంధ్రీకరణశిల్పమని విమర్శకులు భావించినవన్నీ యాదృచ్ఛికాలు. వేమభూపాలుని శృంగార దీపికను చూడకపోవటం వల్ల స్థితగతిచింతనగా ఏర్పరచుకొన్న అభిప్రాయాలు. విమర్శకుల అర్థవిస్తృతిఫలాలు కావచ్చును గాని, వాస్తవంగా మహాకవి ఉద్దేశించిన అర్థాలు కానేరవు.

అనుబంధ జ్ఞాపిక
ఈ వ్యాసంలో ప్రతిపాదింపబడినట్లు కావ్యోపసంహార వచనభాగం సందేహాస్పదమని నిర్ణయించేందుకు ముందు మరొక్క వివాదాస్పదమైన విషయాన్ని కూడా మనవిచేయవలసి ఉంటుంది. శృంగార నైషధం ఆరవ ఆశ్వాసంలో స్వయంవరానంతరం (6-25) భారతీదేవి నలుని ఉద్దేశించి చెప్పినట్లుగా ఈ క్రింది పద్యం ఉన్నది:

కలియుగంబునయందుఁ గాశ్మీరభూమిలో మత్పీఠమున ధరామరుఁడు వుట్టు
శ్రీహీరుఁ డనఁగ శేషాహి యంశంబున; నతఁడు మామల్లదే వ్యాఖ్య యైన
తన భార్యయందు చింతామణీ మంత్రచింతనఫలంబుగ నొక్క తనయుఁ గాంచుఁ;
గల్పించు నతని కాకాశవాగ్దేవి తా శ్రీహర్షుఁ డనియెడి చిహ్ననంబు;

వాని కీరేడు విద్యలు వచ్చియుండు;
వాఁడు ఖండనకారుఁడు; వాఁడు సుకవి;
కావ్యముఖమున వానిచేఁ గలుగు నీకు
నిర్మలం బైన సత్కీర్తి నిషధరాజ!

ఇది అవతారికలో చెప్పబడిన విషయానికీ, ప్రబంధకోశంలో రాజశేఖరసూరి చెప్పిన కథకూ, లోకప్రసిద్ధమైన కథానకానికీ, 8-203లో నిబద్ధమైన ‘కవిరాజరాజిశేఖరహీరముకుటంబు’ అన్న సీసపద్యానికీ విరుద్ధంగా ఉన్నది. శ్రీహర్షం కవిరాజరాజిమకుటాలఙ్కారహీర స్సుతం, శ్రీహీర స్సుషువే జితేన్ద్రియచయం మామల్లదేవీ చ యమ్, తచ్చిన్తామణిమన్త్రచిన్తనఫలే శృఙ్గారభఙ్గ్యా మహా, కావ్యే చారుణి నైషధీయచరితే,అన్న భాగాన్ని (ఆదిశేషుని అవతారమైన) శ్రీహీర పండితుడు చింతామణి మంత్రాన్ని ఉపాసించి, తత్ఫలంగా మామల్లదేవి యందు మహావిద్వాంసుడైన కొడుకును కన్నాడని (ఆకాశవాణి ఆ కొడుకుకు శ్రీహర్షుడని పేరుపెట్టిందని) – శ్రీనాథుడు వేరొక కథను విన్నాడని ఊహింపవలసి ఉంటుంది. కావ్యోపసంహారవచనం (8-202) లోని ‘చింతామణి మంత్రచింతనఫలంబును’ అన్న దళం దీనితో అనువర్తనీయంగా ఉన్నదన్నమాట.

సరస్వతీ ప్రసంగరూపమైన ‘కలియుగంబునయందుఁ గాశ్మీరభూమిలో మత్పీఠమున ధరామరుఁడు వుట్టు’ అన్న ఈ పద్యానికి నైషధీయ చరితంలో విహితమైన మూలమేదీ లేదు. దానిని తొలగించితే కథాసన్నివేశానికి గాని, సంభాషణల క్రమపరిగతికి గాని ఎటువంటి భంగపాటూ ఉండదు. కాకపోతే, కలియుగంబునయందుఁ గాశ్మీరభూమిలో మత్పీఠమున ధరామరుఁడు వుట్టు, శ్రీహీరుఁ డనఁగ శేషాహి యంశంబున; నతఁడు మామల్లదే వ్యాఖ్య యైన, తన భార్యయందు చింతామణీ మంత్రచింతనఫలంబుగ నొక్క తనయుఁ గాంచు, అన్న శ్రుతవిరుద్ధమైన ఈ కథాభాగాన్ని గ్రంథస్థం చేసిన కవి, కావ్యోపసంహార వచనం, 8-202లోని ‘చింతామణి మంత్రచింతనఫలంబును’ అన్న దళాన్ని గ్రంథస్థం చేసిన కవి – ఒకరని, అవతారిక లోని (1-16) పద్యాన్ని, 8-203లోని పద్యాన్ని వ్రాసిన కవి ఒకరని నిశ్చయించాలి. శృంగార దీపికను చదువుకొన్న శ్రీనాథునికే తప్ప వ్రాతప్రతుల స్వస్థితికి నిరూపకంగా కావ్యోపసంహార వచనాన్ని కూర్పవలసిన అవసరం వేరొకరికి ఉండదు. దానిని నిలిపితే పునరుక్తిప్రాయమైన సింహావలోకన సీసపద్యాన్ని కావ్యం నుంచి తొలగింఛాలి. సీసపద్యాన్ని తొలగించితే కావ్యోపసంహార వచనంలో పైని సూచించిన మార్పులను చేసుకోవాలి. సరస్వతీ ప్రసంగంలోని పద్యాన్ని కూడా తొలగించివేయాలి.

వ్రాతప్రతులను సరి చూసి, పునఃపరిష్కరిస్తే గాని ఈ పాఠభేదాల విరోధపరిహారం సాధ్యపడదు. అప్పుడైనా శ్రీనాథుని వాక్యం వ్రాతప్రతులను గూర్చిన వివరణమే తప్ప అనువాద విధానానికి సంబంధించిన సూత్రీకరణం కాదన్న ప్రతిపాదనలో మార్పుండదు. అనౌచిత్యముల ప్రస్తావన ప్రక్షిప్తములను గూర్చిన విషయమే తప్ప క్షేమేంద్రోపదిష్టమైన రసప్రాతికూల్యసిద్ధాంతానికి నిర్దేశకం కాదు.

శ్రీనాథుడు కావ్యోపసంహార వచనంలో తన ఆంధ్రీకరణవిషయాన్ని సిద్ధాంతింపలేదని ఈ ప్రసంగఫలితాంశం.
----------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: