Wednesday, February 6, 2019

వీరశైవులు: ఒక పరామర్శ


వీరశైవులు: ఒక పరామర్శ





సాహితీమిత్రులారా!

వెల్చేరు నారాయణరావు, జీన్ రాఘేర్ యొక్క శివా’స్ వారియర్స్ అనే ఆంగ్ల పుస్తకపు పరిచయ అధ్యాయాన్ని తెలుగులో అనువదించమని ఈమాట సంపాదకులు కోరడం జరిగింది. ఈ అధ్యాయంలో బసవ పురాణాన్ని పరిచయం చేస్తూ కవి పాల్కురికి సోమనాథుని పాండిత్యము, కావ్యశైలి, మొదలైన విషయాలే కాకుండా, వీరశైవం గురించి, వారి ఆవిర్భావం, బ్రాహ్మణ ధర్మానికి వీరశైవానికి తేడాలు మరియు విభేదాలు, బసవని కాలము, సోమనాథుని కాలముల నాటి సామాజిక పరిస్థితులు మొదలైనవి ప్రస్తావించబడ్డాయి.

నాకు తెలిసినంతమట్టుకు వెల్చేరు నారాయణరావు కానీ, జీన్ రాఘేర్‌ కానీ ఆచరణ పరంగా వీరశైవులు కారు. వారు పరిశీలించిన గ్రంథాలలో వారికి అర్థం అయిన దాన్ని బట్టి స్వీయ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ అధ్యాయాన్ని అనువదించేటప్పుడు ఈ వ్యాసంలో వారి ప్రస్తావనలను, అభిప్రాయాలను మార్చకుండా ఉన్నదున్నట్లు అనువదించాను. అయితే అనువంశికంగా వీరశైవాన్ని పొందిన నాకు కొన్ని విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాటిని కారణాలతో సహా పాఠకుల ముందు ఉంచవలసిన అవసరం ఉందనిపించి ఈ వ్యాఖ్యానాన్ని వ్రాస్తున్నాను.

వీరశైవం యొక్క ప్రాచీనత్వము
వీరశైవము ఆగమ ప్రాతిపాదికమైన శైవమతము. శైవాగమములన్నీ శివుడు పార్వతికి ఉపదేశించినవి. వీరాగమములో పార్వతీదేవి శివున్ని ఈ విధంగా అడిగింది:

వామాః పాశుపతాశ్చైవ కాలాముఖ మహావ్రతాః, కాపాలా భైరవ శ్శాక్తా స్స్రావకా యోగధారణాః ॥
శైవా బహువిధాశ్చైవ వైష్ణవాః పాంచరాత్రకాః, వైఘాసనా కులాః కౌలా స్తత్సంభేదాస్తథా ఉమే ॥
సాంఖ్యాశ్చ లాకులాశ్చైవ తథా హంస పరాయణాః, ఏతే సమయినస్సర్వే అన్యోన్య కలహప్రియాః
ఏతాన్ సర్వాన్ పరిత్యజ్య వీరశైవం వదాస్యమే ॥ (వీరాగమము)

శైవములో పాశుపతము, కాలాముఖము, మొదలైన రకరకాల భేదములు ఉన్నవి. అంతేగాక శైవ, వైష్ణవ మతములు మొదలైనవి పరస్పరము కలహించుకుంటూ ఉంటాయి. వీటన్నింటిని పరిత్యజించి వీరశైవాన్ని బోధించమని కోరింది.

శైవం చతుర్విధం జ్ఞేయం సమాసాచ్ఛృణు షణ్ముఖ
సామాన్య మిశ్రకం శైవం శుద్ధం వీరం యథాక్రమం ॥ (వాతూలాగమము)

వాతూలాగమము ప్రకారము శైవము నాలుగు విధాలుగా ఉపదేశించబడింది – సామాన్యము, మిశ్రకము, శుద్ధము, వీరశైవము. ఈ శైవాలను వివరించే శ్లోకాలు వాతూలాగములో ఉన్నా, ఇక్కడ సంక్షిప్తంగా తెలుపుతున్నాను

సామాన్యశైవులు లింగము దర్శించినప్పుడే పూజిస్తారు. వీరు విభూతి ధరించి శివభక్తుల పట్ల గౌరవంతో ఉంటారు, నిత్య శివార్చన ఉండదు
మిశ్రశైవులు శివ, విష్ణు, శక్తి మొదలైన అన్ని దైవములను పూజిస్తూ, శైవముతోపాటు మిగిలిన ఆచారములు కూడా పాటిస్తారు. అందరు దేవతలు శివలింగము నుండి వచ్చారని నమ్ముతారు
శుద్ధశైవులను శివద్విజులు, ఆదిశైవులు అంటారు. వీరు శివున్ని మాత్రమే దేవునిగా భావిస్తారు. మిగిలినవారు శివుని నుండి వచ్చారని నమ్ముతారు. కౌశిక, కశ్యప, భారధ్వాజ, అత్రి, గౌతమ ఋషులు ఆదిశైవానికి ఆచార్యులు. శుద్ధశైవులు సాలగ్రామలింగాన్ని స్వార్ధము కొరకు, గ్రామలింగాన్ని పరార్థము కొరకు పూజిస్తారు. వీరు లింగమును కరస్థలము (అరచేతిలో) పూజించరు. కేవలం శివకుటుంబాన్ని మాత్రమే పూజిస్తారు.
ఏక ఎవాஉయ మస్మిన్ హి సర్వేஉస్మిన్ జగతీతలే విశేష ఈరతే యస్మాద్వీర ఇత్యభిదీయతే ॥
శివేన సహ సంబంధం శైవమిత్యుదితం బుధైః ఉభయోస్సంపుటీ భవా ద్వీరశైవ మితి స్మృతం ॥
శివార్థార్పితజీవత్వా ద్వీరతంత్ర సముద్భవాత్ వీరశైవ సమాయోగా ద్వీరశైవ మితి స్మృతం ॥ (వాతూలాగమము)

వీరశైవులు భూతములన్నింటిలో శివుడొక్కడేయని, శివునితో ఆత్మకు నికట సంబంధము కలిగించుకొని, జీవత్వము శివునికర్పించి శివజీవైక్యయుక్తులై వీరతంత్రమును అనుసరించు వారై ఉంటారు. “శివలింగం కరాద్యంగే వీరశైవస్తు ధారయేత్” అను విధిచొప్పున లింగధారణ చేసుకొందురు. ఈ మతము శైవములన్నింటిలో ఉత్కృష్టమైనదిగా చెప్పబడింది

వీరశైవ సిద్ధాంత శిఖామణి వీరశైవులకు గీత. ఇది శివాజ్ఞతో త్రేతాయుగంలో త్రిలింగదేశంలోని (తెలుగుదేశం) కొలనుపాకలో సోమేశ్వర లింగము నుండి అయోనిజుడై ఆవిర్భవించిన జగద్గురు రేణుకాచార్యుడు అగస్త్యమునికి ఉపదేశించడం జరిగింది. ఈ ఊరు ఇప్పుడు వరంగల్ జిల్లాలో కొలంపాకగా పిలువబడుతుంది. అక్కడ రేణుకుడు ఉద్భవించిన సోమేశ్వరలింగము ఈనాటికి పూజలందుకుంటుంది. ఈ గీతను శివానంద శివాచార్యుడు గ్రంథరూపంలో వ్రాసాడు. ఈ గ్రంథంలోని ప్రతి అధ్యాయంలో

శ్రీశివగీతేషు, సిద్దంతగామేశు, శివాద్వైతవిద్యాయాం, శివయోగశాస్త్రే, శ్రీరేణుకాగస్త్య సంవాదే వీరశైవ ధర్మనిర్ణయే, శ్రీ శివయోగి శివాచార్య విరచితే, శ్రీ సిద్ధాంత శిఖామణౌ

అని వీరశైవ ధర్మము నిర్ణయించబడింది. ఇష్టలింగ ధారణ మొదలైన వీరశైవుల పద్ధతులు, ఆచారాలు, ఆరు స్థలాలలో ఎదుగుతూ శివునిలో ఐక్యమయ్యే విధానము తెలుపబడ్డాయి. కామికాది వాతులాంతమైన ఇరవై ఎనిమిది శైవాగమములలోని ఉత్తర భాగములో ప్రతిపాదించబడిన వీరశైవ ధర్మమంతా ఈ గ్రంథంలో ఒక్కచోట క్రోడీకరించబడింది.

అనునిత్యము ఇష్టలింగధారణ చేసే వీరశైవులను లింగాయతులని, లింగధారులని కూడా అంటారు. ఈనాడు కర్ణాటకలో లింగాయతులు సంఖ్యాపరంగా ప్రముఖమైన సమాజము. తెలంగాణా ప్రాంతంలో లింగాయతులు కూడా గణనీయంగా ఉన్నారు.

వీరశైవము యొక్క ప్రాచీనత్వమును నిరూపించడానికి శైవాగములనుండి అనేక వివరాలను చూపగలము. అయితే “Siva’s Warriors” పరిచయ అధ్యాయంలో రచయితలు శైవాగమాలను పరిశీలించకుండా, వీరశైవులను బసవన్న కాలమున వృత్తికారుల బ్రాహ్మణ వ్యతిరేకత వల్ల పుట్టిన సమాజముగా పరిచయం చేసారు. ఈ అభిప్రాయము వీరే కాకుండా చాలామంది వేరేవారు కూడా ప్రచారం చేసారు. కొందరు రచయితలు వ్యక్తంచేసే ఇలాంటి అభిప్రాయాలు, ప్రచారం నిజమని నమ్మి కొన్నాళ్ళ క్రితం లింగాయతులు కర్ణాటకలో తాము హిందువులముకామనే ప్రస్తావన తీసుకురావడం పాఠకులు గమనించే ఉంటారు. రచయితలు ఊహాత్మకంగా చేసే సిద్ధాంతాలు, వారి స్వీయ అభిప్రాయాలు ఇలాంటి విపరీతమైన పరిణామాలకు దారి తీస్తాయి. ఈ విషయంలో రచయితలతో ఏకీభవించక పై ఉదాహరణలతో వీరశైవుల విశ్వాసాన్ని వివరించవలసి వచ్చింది.

వీరశైవుల శివుడు
వీరశైవులు శివున్ని ప్రధాన దైవంగా కొలుస్తారు. అయితే వీరి నమ్మకములో శివునికీ మిగిలిన స్మార్తులు, మిశ్రమ శైవులు మొదలైన హిందువులు అర్థం చేసుకునే శివునికీ వ్యత్యాసం ఉంది.

సాధరణంగా నేటి హిందువులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను త్రిమూర్తులను, దుర్గా, లలితా రూపములలో దేవిని ముఖ్య దేవతలుగా పూజిస్తారు. అలా కొలిచే హిందువులకు శివుడు అంటే త్రిమూర్తులలో ఒకడు, లయకారకుడు. వారి ఉద్దేశ్యములో శివుడు నామరూపలతో ఉంటూ లయకృత్యము చేసే పరబ్రహ్మము యొక్క ఒకానొక సగుణ స్వరూపము మాత్రమే. శివుడు, విష్ణువు, దేవి అందరూ కూడా ఒకే నిర్గుణ పరబ్రహ్మ నుండి ఉద్భవించినవారని, సమానులని, వాళ్ళలో బేధము లేదని, ఎవరికి ఇష్టం వచ్చిన స్వరూపాన్ని వారు సగుణ రూపములో పూజించి నిర్గుణ పరబ్రహ్మమును చేరవచ్చని విశ్వసిస్తారు.

వీరశైవులకు మాత్రం “శివుడు” అంటే సంపూర్ణమైన పరబ్రహ్మమునకు నిర్వచనము. శివుడే నిర్గుణ స్వరూపము. ఓంకారము, పరబ్రహ్మము, శివుడు, లింగము పరమాత్ముని నిర్గుణత్వానికి, నిరాకార బ్రహ్మమునకు ప్రతీకలు. వీరశైవులు ఈ నిర్గుణ బ్రహ్మన్ని గురువు ద్వారా ఇష్టలింగముగా, అంటే తమ స్వంత లింగముగా, పొంది ఆ లింగాన్ని అనునిత్యము తమ శరీరముపై ధరించి శివున్ని ఆ లింగముగానే పూజిస్తారు. ఇతరమైన ఆరాధనలన్నీ వీరికి నిషిద్ధములు. నిర్గుణ బ్రహ్మమైన శివలింగము నుంచే మిగిలిన ప్రపంచము అంతా ఉద్భవిస్తూ, లయము చెందుతూ ఉంటుందని వీరు నమ్ముతారు.

శివుడు అనబడే ఈ పరశివబ్రహ్మము తన స్వేచ్ఛాశక్తితో, భోక్త అయిన జీవునిగా, భోజ్యమైన జడ ప్రపంచముగా, ప్రేరకుడైన మహేశ్వరునిగా మారుతాడు. వీరశైవులకు బ్రహ్మ, విష్ణ్వాది దేవతలు గాని, మానవులు, పశుపక్ష్యాదులు అన్నీ కూడా జనన మరణములకు లోనయ్యే జీవులే. వారి వారి ఉపాదులను బట్టి, వారి జీవిత కాలము ఉంటుంది. నామరూపలతో ఉండి వికారములకు లోనయ్యే బ్రహ్మ, విష్ణువులు నిర్గుణ బ్రహ్మమైన శివునికి సమానులు కారు. ఈ దేవతలంతా శివారధన చేస్తూ తమ కర్తవ్య నిర్వహణకు కావలసిన శక్తులను పొందుతూ, తమ జీవనాంతములో శివునిలో ఐక్యమయ్యే జీవులు. ఈ నిర్గుణబ్రహ్మమైన శివుడు, లీలావిశేషముగా సగుణ రూపము దాల్చినప్పుడు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులను పంచముఖములు కలిగిన సదాశివునిగా, శక్తివిశిష్టుడై ఉంటాడు. ఈతడే మహేశ్వరునిగా, రుద్రునిగా పరిణమిస్తాడు. ఈ శివుని సగుణ రూపములు కూడా వీరశైవులకు బ్రహ్మవిష్ణ్వాది ఇతర దేవతలకన్నా ఉత్తమ స్థానములో ఉంటాయి. సైద్ధాంతపరంగా వీరశైవులు ఇతర సంప్రదాయాలను ద్వేషించరు, పట్టించుకోరు. వీరశైవంలో శివుడు సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము అనే పంచకృత్యాలను నిర్వహించే పరిపూరణమైన ఏకదైవము, అంతే గాని మిగిలిన హిందువులు అనుకునే విధంగా కేవలం ఒక కార్యము చేసే లయకారకుడు కాదు.

వీరశైవుల ఆచారాలు
వీరశైవుల ముఖ్య ఉద్దేశ్యము శివ-జీవ ఐక్యము. వీరి నిత్యాచరణలన్ని ఈ జీవన్ముక్తి సంబంధించినవై ఉంటాయి. దీనిని వీరు లింగాంగ సామరస్యమని అంటారు. తాము ధరించే ఇష్టలింగాన్ని, తమ శరీరముతో సమానంగా చూసుకుంటూ, ఎల్లప్పుడు లింగధారులై త్రిసంధ్యలలో లింగాన్నే పూజిస్తూ ఉంటారు. చాతుర్వర్ణములలో ఉండే యజ్ఞోపవీతము, గాయత్రితో కూడిన సంధ్యావందనము వీరికి వర్తించదు. వీరికి ముఖ్య పద్దతులు అష్టావరణాలు, పంచాచారలు.

గురు, లింగ, జంగమ, విభూతి, రుద్రాక్ష, పంచాక్షరి మంత్రము, పాదోదకము, ప్రసాదము అనేవి వీరు నిత్యము విడువకుండా పాటించే అష్టావరణములు.
లింగాచారము, సదాచారము, శివాచారము, గణాచారము, భృత్యాచారము అనేవి వీరి ఆచారాలు
గురువును, శివలింగాన్ని, శివయోగి అయిన జంగమయ్యని సమానంగా కొలుస్తారు. గురు, లింగ, జంగమాల పాదోదకాన్ని, ప్రసాదాన్ని సమానంగా భావించి స్వీకరిస్తారు.

శివభక్తి ఉన్నవారెవరైనా గురువు ద్వారా ఇష్టలింగ దీక్షను పొందవచ్చును. గురువు శిష్యుని పరీక్షించి దీక్షను ఇస్తాడు. శివభక్తి, ఆత్మజ్ఞానము కోసము తపన, విషయముల పట్ల విరక్తి ఉండటం ఈ పరీక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యములు. ఇక్కడ భక్తిని మాత్రమే పరిగణిస్తారు కానీ వారి వర్ణాన్ని కాదు.

అయితే వీరశైవంలో ఉన్నవారికి ఈ దీక్ష వంశపరంగా కూడా ఇవ్వబడుతోంది. శిశువు పుట్టక మునుపే తల్లి గర్భానికి లింగధారణ చేస్తారు. జన్మించిన తరువాత పదకొండవరోజు శిశువునకు లింగధారణ చేయించి మంత్రోపదేశం చేస్తారు. ఆనాటి నుండి ఆ జీవి వీరశైవునిగా పెంచబడతాడు. తదనంతరం యుక్తవయస్సులో గురువుద్వారా దీక్ష ఇవ్వబడుతుంది. ఈ దీక్షలో గురువు శివుని కళాశక్తిని లింగములో ప్రవేశపెట్టి, హస్తమస్తక సంయోగముతో శిష్యునిలో శివశక్తిని ప్రేరేపిస్తాడు. ఈ దీక్ష తీసుకున్న వెంటనే గతజన్మల పాపపుణ్యములన్నీ నశిస్తాయని వీరశైవుల నమ్మకము. ఆనాటి నుండి శిష్యుడు/శిష్యురాలు నిత్య ఇష్టలింగధారియై, త్రిసంధ్యలలో శివపూజని ఆచరిస్తూ, తనవలె వీరశైవ దీక్షలో ఉండే వారిని వివాహమాడి, గురువాక్కును పాటిస్తూ, జంగమలను కొలుస్తూ, శరణసాంగత్యములో ఉంటూ జీవనం గడుపుతాడు. వీరి ప్రతిచర్య శివారాధన, జంగమారాధనలతో ముడిపడి ఉంటుంది; తాను ఆచరించే ప్రతి కర్మ శివార్పణా భావంతో చేస్తూ, కర్మలంపటానికి దూరంగా ఉంటాడు.

వీరశైవులకు అగ్నిష్టోమాది క్రతువులు, యజ్ఞయాగాదులు, శివేతర దేవతారాధన, ఇతర దేవతల వ్రతములు, ఇష్టలింగేతర ప్రసాద స్వీకరణ మొదలైనవి నిషిద్ధములు. వీరశైవ దీక్షను స్త్రీపురుషులకు సమానంగా ఇస్తారు; అందుకే వీరశైవ స్త్రీలు కూడా శివలింగ, భస్మ, విభూతి, రుద్రాక్షలు ధరిస్తారు. చాలా మంది వీరశైవ శరణులు, వచనకర్తలు స్త్రీలే. స్త్రీలు కూడా త్రిసంధ్యలలో శివలింగార్చన చేయాలి. పంచ సూతకములు వీరశైవులకు ఉండవు. శివలింగధారణతో వీరు నిత్యశుద్ధులు. నెలసరి రజోసూతకము ఉండదు కాబట్టి, ఆ సమయంలో కూడా ఇష్టలింగారాధన చేయవలసి ఉంటుంది. ప్రసవ సూతకము కూడా ఉండదు.

వీరశైవులు ఇతర హిందువులవలే వర్ణవ్యవస్థను పాటించరు. ఒకవేళ ఇతర వర్ణములో ఉన్నవారు శివభక్తి కలిగి, గురువు ద్వారా వీరశైవ దీక్షను స్వీకరిస్తే వారు పూర్వాశ్రయ ధర్మములు, పూర్వకర్మాచరణము విడువవలసి ఉంటుంది. వీరశైవంలో విశుద్ధులు, ప్రకృతులు అని మనుషులను రెండు విధములుగా పరిగణిస్తారు. శివసంస్కారము పొందినవారు విశుద్ధులు. ఇతరులు ప్రాకృతులు లేదా భవులు. శివభక్తి ఉంటే చాలు వారు బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, వైశ్యులైనా, శూద్రులైనా, అంత్యజులైనా, మ్లేచ్ఛులయినా వారిలో హెచ్చు తగ్గులు ఎంచరాదని వీరి విశ్వాసము. శివభక్తి ఉన్న అంత్యజుడైనా బ్రాహ్మణుని కన్నా గొప్పవాడేనని సిద్ధాంత శిఖామణి చెబుతుంది.

అనునిత్యం శివనామ స్మరణలో ఉంటూ, లింగధారియైన జీవునికి మరుజన్మ ఉండదని, జీవించి ఉండగానే జీవన్ముక్తి, లేదా జీవితాన్తములో లింగైక్యము కలుగుతాయని వీరశైవుల దృఢవిశ్వాసము. అందుకే వీరశైవుడు లింగైక్యము చెందాడు అంటారేగాని, పరమపదించడం, మరణించడం, స్వర్గస్థులవ్వడం వంటి మాటలు వాడరు. పిండప్రధానము చేయరు. లింగైక్యము చెందిన వీరశైవున్ని ధ్యానముద్రలో కూర్చోబెట్టి, అభిషేకించి, ఇష్టలింగాన్ని చేతిలో పెట్టి సమాధి చేస్తారు. అగ్ని సంస్కారము చేయరు. యజ్ఞోపవీతాన్ని, అగ్నిష్టోమాది కృతువులను విస్మరించే వీరశైవధర్మము కారణాగమములో “అత్యాశ్రమ” ధర్మమని ప్రకటించబడింది. ఇలాంటి విషయాలలో వీరశైవ ఆచారములు సన్యసించిన వారితో సమానంగా ఉంటాయి.

వీరశైవులకు ఐదు పీఠాలు ఉన్నాయి. ఇవి రంభాపురి (బాలెహొన్నూరు), ఉజ్జయిని, శ్రీశైలము, కాశి, కేదార పీఠాలు. ఆయా ప్రాంతాలలో ధర్మప్రచారం చేయడానికి ఒక్కో పీఠానికి పీఠాధిపతి నియమితమై ఉంటారు. వీరశైవుల ఐదు గోత్రములైన వీర, నంది, భృంగి, వృషభ, స్కంద వారి గురుపీఠాన్ని బట్టి ఉంటుంది.

వీరశైవులంటే రచయితలు వర్ణించినట్లు శివ సైనికులు (Siva’s Warriors) కారు. ఈ సిద్ధాంతంలో మతోన్మత్తమైన యుద్ధము చేయాలని చెప్పబడలేదు. సిద్ధాంత శిఖామణి ప్రకారము:

వీశబ్దే నోచ్యతే విద్యా శివాజీవైక్య బోధికా ।
తస్యామ్ రమంతే యే శైవా వీరశైవస్తుతే మతాః ॥ సిద్ధాంత శిఖామణి

శివ-జీవ ఐక్యమును బోధించే విద్య వీరశైవంలో “వీ” శబ్దాన్ని, అటువంటి విద్యలో ఏ శివభక్తులు రమిస్తున్నారో దానికి “ర” అక్షరము అని నిర్దేశించబడింది. ఈ గ్రంథంలో ఒక్కచోట మాత్రం శివున్ని నిందించేవారిని వీలయితే కొట్టాలని, లేదా వాదించి ఓడించాలని, రెండూ చేయలేనివారు ఆ ప్రదేశం విడిచి వెంటనే వెళ్లిపోవాలని ఉంది. మిగిలిన గ్రంథమంతా శివాజీవైక్య మార్గాన్ని బోధిస్తుంది తప్ప, యుద్ధాన్ని భోదించదు. కాబట్టి వీరశైవులు అనే పదానికి “Siva’s Warriors” అనే పేరు కూడా అంగీకార యోగ్యము కాదు. ఈ అధ్యాయాన్ని తెలుగులో అనువదించడం మొదలుబెట్టినప్పుడు నేను ఈ ఆంగ్ల పదాలకు “శివ సైనికులు” అని అనువదించి, తరువాత రచయితలు వీరశైవులు అనే పదాన్ని ఆంగ్లంలో “Siva’s Warriors” అని వాడారని గ్రహించి పేరు మార్చాను. వీరశైవమును ఆచరించేవారు తమని తాము సైనికులుగా/యోధలుగా అసలు ఊహించరు. కాలక్రమేణా కొందరు రాజులు, తత్సంబంధమైన క్షాత్రధర్మమును పాటించేవారు వీరశైవాన్ని స్వీకరించడం జరిగింది. అలాంటి వారు శస్త్రాలు ధరించే యోధలు అనడంలో తప్పులేదు. కానీ అందరు వీరశైవులు సైనికులు లేదా యోధలు కారు.

శరణులు
వీరశైవాన్ని పాటించే శివభక్తులను శివశరణులు అంటారు. శరణులు గొప్పవారని నమ్మి ఇతర శరణులను సేవించుకుంటారు. ఇతర శరణులు కనబడితే “శరణు శరణార్థి” (ఇతర శరణులను శరణు వేడడం) అని అభివాదము చేసుకుంటారు. శివగణాలందరూ శరణులే; గణాధీశులైన వీరభద్ర, నంది, భృంగి, వృషభ, స్కందులను తమ గురువులుగా కలిగి వారి గోత్రాలను పొంది వారిని గురువులుగా కొలుస్తారు. అందుకే వీరశైవానికి శరణసాంప్రదాయమని ఇంకో పేరు.

వీరశైవ జంగమలు
ఇష్టలింగధారణ చేసి, శివున్ని నిర్గుణోపాసన చేస్తూ, శివధర్మాన్ని ప్రచారం చేసే శివయోగులను జంగమలు అంటారు. ఈ జంగమ సంప్రదాయం భరతభూమిలో అన్నిచోట్లా ఉన్న ఆనవాళ్లు ఉన్నాయి. ఉత్తర భారతంలో కొంతమంది రాజులకు వీరే గురువులు. ఈ జంగమ సంప్రదాయం ఎంత పురాతనమో కర్ణాటకఆంధ్ర దేశాలతో సంబంధంలేని నేపాలదేశంలోని జంగమల వ్యాసాన్ని ఇక్కడ చదవండి.

ఆంధ్రదేశంలోను చాలామంది జంగమలు ఉండేవాళ్ళు. అయితే కాలక్రమేణా ఇతర మతాల ప్రాబల్యంవల్ల వీరి ఉనికి నేడు చాలామందికి తెలియదు. ఈనాటి ఆంధ్రలో అయితే జంగమలు అంటే గంగిరెద్దులను ఆడించే బుడబుక్కలవారేమో అనుకుంటారు; అందుకే ఇప్పుడు ఎవరైనా జంగమలు ఉన్నా వారు తమనితాము శైవ బ్రాహ్మణులమని లేదా ఇతర విధాలుగా పరిచయం చేసుకుంటున్నారు. చాలామంది తమ ఉనికిని మరచి, ఆచారాలను వదిలేసి, ఇతర మతాల ప్రభావంతో తమ ఆచారాలను విస్మరించి మిశ్రమ శైవము వంటి అన్యమతాలకు మారిపోయినారు. కర్ణాటకలో, తెలంగాణా ప్రాంతంలో మాత్రం జంగమలు గురువులుగా ఈనాటికి పౌరోహిత్యం చేస్తూ పూజలు అందుకుంటూ ఉన్నారు.

జంగమలు వీరశైవంలో గురుస్థానములో ఉంటూ, శరణులకు మార్గదర్శనము చేస్తూ, లింగాయతులకు పౌరోహిత్యము చేస్తూ ఉండే సమాజము. మన తెలుగు ప్రాంతములో శ్రీశైలము, వేములవాడ, మొదలైన ప్రముఖ శైవక్షేత్రాలలో పౌరోహిత్యము చేసేది జంగమలే. వీరభద్రుని ఆలయాలలో అర్చకత్వం వహించేవారు కూడా జంగమలే. అంతేగాక హిమాలయాలలోని కేదార క్షేత్రము కూడా వీరశైవ జంగమ పీఠము యొక్క ఆధ్వర్యములోనే ఉంది. కాశీలో జంగమ మఠము ప్రముఖమైన మఠము.

ఈ జంగమలు 12వ శతాబ్దానికి చెందిన బసవని కాలముకన్నా అతి ప్రాచీనులు. బసవపురాణము ప్రకారము, కల్యాణకటకములో బసవడు లక్షాతొంభయ్యారు వేల జంగమలకు నిత్యసంతర్పణ చేసేవాడని సోమనాథుడు వర్ణించాడు. ఇది అతిశయమని అనుకున్నా కూడా, జంగమలు ఆనాటికి చాలామంది ఉండేవారని స్పష్టమవుతుంది. ఇక ఇతిహాసాలను పరిశీలిస్తే ఆనాటికి జంగమలు అత్యంత పూజ్యనీయులని అర్థమవుతుంది. రావణుడు సీతాదేవిని అపహరించడానికి వచ్చినప్పుడు, నమ్మకము కలిగించే వేషాన్ని వెయ్యాలి కాబట్టి ఇతరత్రములు గాక జంగమ వేషాన్ని ధరించాడు. సీతాదేవి గీత దాటవలసి వచ్చింది. అంటే ఆనాడు జంగమలను ఎంత భక్తిశ్రద్దలతో గౌరవించేవారో అర్థమవుతుంది. మహాభారతంలోను దానానికి పాత్రులెవరని ధర్మజుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా లింగధారుల విషయం ప్రస్తావనకు వస్తుంది.

అయితే “Siva’s Warriors” పరిచయ అధ్యాయంలో రచయితలకు జంగమలు, ఇతర లింగాయితులకు బేధము తెలిసినట్లు లేదు. వారి కథనంలో జంగమలు బసవని కాలంలో ఇతర కులాల నుండి వీరశైవం స్వీకరించినవారిగా చెప్పుకొచ్చారు. వారి అభిప్రాయము తప్పని నా వాదన.

వీరశైవులు, దేవాలయాలు
వీరశైవులు దేవాలయాలను నిరసిస్తారని “Siva’s Warriors” పరిచయ అధ్యాయంలో రచయితలు చెప్పుకొచ్చారు. దీనిని ఒప్పించడానికి భూస్వాములు-వృత్తికారుల మధ్య విభేదాలు, కుడి-ఎడమ కులాలంటూ రకరకాల ఊహాజనితమైన సంబంధములేని విషయాలను జోడిస్తూ, వీరు దేవాలయ వ్యతిరేకులని పెద్ద కథనాన్నే రాసుకొచ్చారు. ఈ విషయంలో కొన్ని వాస్తవాలను చర్చించుకోవడం అవసరం. కొంత మంది వీరశైవులు కూడా దేవాలయాలను బసవన్న నిరసించాడని అనుకుంటారు.

వీరశైవ సిద్ధాంత శిఖామణి ప్రకారం ఇష్టలింగేతర స్థావరలింగ ప్రసాదాన్ని ముట్టుకోవద్దని చెప్పడం వాస్తవం. అయితే వెంటనే ఆ తరువాతి శ్లోకంలో గుడిని, భక్తులనూ రక్షించడానికి ప్రాణాలైనా అర్పించాలని ఉంటుంది! అంటే అది గుడి వ్యతిరేకత కాదు అని అర్థమవుతుంది. ప్రతి సంప్రదాయంలో కొన్ని నియమాలు ఉంటాయి; ఇక్కడ నియమం గురుణాదత్తమైన ఇష్టలింగానికి వీరశైవులు ఇవ్వవలసిన గౌరవమర్యాదలు. వీరశైవులకు ఇష్టలింగమే శివుడు; అందులో శివుడు ఎల్లపుడూ ఉంటాడు. మాములుగా పూజకు చెందిన ఉపచారాలలో ఆవాహనం (అంటే దేవున్ని ఆహ్వానించడం) ఒకటి. అయితే వీరశైవులు శివపూజ చేసేటప్పుడు శివుని ఆవాహన ఉండదు. ఎందుకంటే ఇష్టలింగములో గురువు ప్రవేశపెట్టిన శివుడు ఎల్లప్పుడూ కొలువై తమతో ఉంటాడని వీరి నమ్మకము. అందువల్ల ఇష్టలింగము వీరికి అన్నింటికన్నా ముఖ్యము. కాబట్టి గుడిలోని శివలింగాన్ని పూజించడం కాకుండా విధిగా వీరు ఇష్టలింగ పూజను చేయవలసి ఉంటుంది.

రచయిత “ఉల్లవారు శివాలయ మడవారు” అనే బసవ వచనాన్ని దేవాలయ వ్యతిరేకతకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అయితే ఈ వచనంలో బసవన్న చెప్పాలనుకునే విషయం అంతంలో “స్థావరక్కలి వుంటు జంగమక్కలివిళ్ల” అనే ముగింపును అర్థం చేసుకుంటే తెలుస్తుంది. దేవాలయంలోని స్థావర లింగంలో మంత్ర సంస్కార ప్రభావంతో శివుడు నివసిస్తాడు. అదే జంగమ రూపములో శివుడు ఎల్లవేళలా ఉంటాడని సిద్ధాంత శిఖామణిలో తెలుపబడింది. ఇదే విషయాన్నీ బసవడు తన వచనంలో “స్థావరక్కలి వుంటు జంగమక్కలివిళ్ల” అని ముగించాడు. అంతేగాని రచయిత అర్థంచేసుకున్నట్లు ఈ వచనం దేవాలయ వ్యతిరేకతను సూచించేది కాదు.

ఒకవేళ రచయిత ఉటంకించినట్లు బసవన్న గుడిని వ్యతిరేకిస్తే, అవసాన దశలో, కూడలసంగమము అనే క్షేత్రంలో గడిపి ఆ గుడిలోని శివునిలో ఎందుకు ఐక్యమయ్యాడు? ఈనాటికి కూడలసంగమంలో బసవడు ఐక్యమైన శివలింగాన్ని వీరశైవులు కొలుస్తారు. బసవని అక్క నాగమ్మ మాత్రం తన ఇష్టలింగంలో ఐక్యమైంది. ఇక ఆనాటి ప్రముఖ శరణులైన అల్లమ ప్రభువు, అక్కమహాదేవి, సిద్దరాముడు శ్రీశైలానికి వచ్చారు. అక్కమహాదేవి వసించిన గుహలు ఈనాటికీ శ్రీశైల ప్రాంతములో దర్శించుకునే స్థలం. తపించి అలసిన సిద్ధరాముణ్ణి శివుడు లోయలోకి దూకకుండా చేయిపట్టుకు కాపాడినట్లు విశ్వసించే చోటు ఈనాటికీ ప్రసిద్ధము. వీరశైవుల శూన్యసిద్ధాంతాన్ని రచించి, బసవని అనుభవమంటపమును నడుపుతూ శూన్యసింహాసనాన్ని అధిరోహించిన అల్లమ ప్రభువు కూడా శ్రీశైలమునే చేరాడు. బసవనితో సహా ఎంతోమంది వచనకర్తలు తమ వచనాలలో ఒక ప్రముఖ దేవాలయానికి సంబంధించిన శివున్నే ఉద్దేశించి వచనాలు వ్రాసారు. ఉదాహరణకు బసవన్న వచనాలు “కూడలసంగమ దేవా” అని, అక్కమహాదేవి వచనాలు “చెన్న మల్లికార్జునా” అని, సిద్దరామేశ్వరుని వచనాలు “కపిలసిద్ధ మల్లికార్జునా” అని అంతమవుతాయి.

బసవ పురాణంలో ఒక ఘట్టంలో బసవడు శివప్రసాదాన్ని స్వీకరించడానికి కేవలం శరణులే అర్హులు అని ప్రకటిస్తాడు. అది విన్న బోయలు రాజుతో మొరపెట్టుకుంటారు. అప్పుడు బసవడు రకరకాల విషాలను శివునికి నివేదించి దాన్ని ప్రసాదంగా తీసుకోమని అంటాడు. బోయ లందుకు భయపడగా, ఆ విషాన్ని శరణులకందరికి వడ్డించి తానూ స్వీకరిస్తాడు. ఆ విషం శరణులను ఏమి చేయలేదని నిరూపిస్తాడు. ఈ ఘటనలోని విషాహారమువంటి విషయాలను అతిశయమని పక్కకుపెట్టినా, ఆనాడు బసవడు, శరణులు దేవాలయాలలో ముఖ్యమైన పాత్ర పోషించే వారనేది మాత్రము ఖఛ్చితంగా అర్థమవుతుంది. వీటన్నింటినీ పరిశీలిస్తే రచయితలు అభిప్రాయపడినట్లు వీరశైవులు దేవాలయ వ్యతిరేకులు కారు అని అర్థమవుతుంది.

అయితే కొన్ని వచనాల్లో గుళ్ళకు వెళ్లే వీరశైవులను నిందించడం, ముఖ్యంగా సిద్దరాముని వచనాలలో కనబడుతుంది. దీనిని అర్థంచేసుకోవాలంటే వీరశైవ సిద్ధాంత శిఖామణిలో చెప్పబడిన స్థావరలింగ ప్రసాద స్వీకరణ నిషేధాన్ని, అన్యదేవతారాధన నిషేధాన్ని పరిగణలోకి తీసుకొని అర్థంచేసుకోవాలి. సిద్ధాంత శిఖామణి ప్రకారము ఒక్కసారి శివలింగ దీక్ష స్వీకరించిన వీరశైవుడు గురు ప్రతిపాదిత లింగోపాసన కాకుండా పూర్వాశ్రయ ధర్మాలను వీడకపోతే, “ఆరూఢ పతితుడని”, “కుకవి” అని పిలువబడతాడు. అలా వీరశైవము స్వీకరించిన వారు అన్యదేవతారాధన చేయకూడదని, అలాంటి దేవాలయాలకు వెళ్ళేవారిని ఈ వచనాలలో నిరసించినారని నిర్ణయించవలసి ఉంటుంది. అంతేగాని శ్రీశైలము, కూడలసంగమము, కాశి, కేదారమువంటి శైవక్షేత్రాలకు వెళ్లకూడదని కాదు.

వీరశైవం, వేదము, కర్మకాండ
వీరశైవం వైదిక మతమని సిద్ధాంత శిఖామణిలో చెప్పబడింది.

వేదం నుండి కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనా కాండ (భక్తి) వచ్చాయని అందరు ఒప్పుకుంటారు. వేదము నిర్గుణబ్రహ్మము (వీరశైవుల శివుడు) మూలమని ఒప్పుకున్నా, అన్ని దేవతల ఉపాసనా మంత్రములు ఉంటాయి. ఎవరెవరి ఉపయోగాన్ని బట్టి వేదాన్ని వారు స్వీకరిస్తారు. వీరశైవులు వేదంలోని రుద్రాధ్యాయమును మాత్రమే పారాయణకు ముఖ్యంగా వాడుకుంటారు.

వీరశైవం భక్తిజ్ఞాన యోగము. ఆదిశంకరుడు మండలమిశ్రతో వాదించినట్లుగానే వీరశైవులు కూడా కర్మకాండను పాటించరు. ఉదాహరణకు నూరు యాగాలు చేస్తే ఇంద్రపదవి, స్వర్గప్రాప్తి వంటి విషయాలు వీరశైవులకు అనవసరము. అశాశ్వతమైన స్వర్గాన్ని అస్సలు పట్టించుకోరు. ఉపనిషత్తులను పాటించే వేదాంతులు కూడా అంతే. అద్వైతులవలె కర్మకాండకు వెసులుబాటు కల్పించలేదు. కర్మకాండ మోక్షానికి పనికిరాదని అంగీకరించినా మిశ్రమ ధర్మంగా ఉండే స్మార్తసంప్రదాయం కర్మకాండను ప్రోత్సహాహిస్తుంది; కాబట్టి చిన్న చిన్న కోరికలుండే వారందరికీ వర్తిస్తుంది. వీరశైవం కేవలం శివ-జీవైక్యమును కాంక్షించే ముముక్షువులకు మాత్రమే పనికివచ్చే ధర్మము. అది తేడా!

వీరశైవ వచనాల్లో కూడా వేదవ్యతిరేకత కనబడుతుంది. కానీ ఆ ఉటంకాలు కర్మకాండకు మాత్రమే పరిమితం. ఉదాహరణకు “వేదము మేక చావుకు వచ్చింది” అని బసవవచనంలో ఉంటుంది. యజ్ఞంలో బలి ఉంటుంది కాబట్టి దాన్ని సంపూర్ణంగా వ్యతిరేకించారు వీరశైవులు. కాలక్రమేణా యజ్ఞంలో బలి ఇవ్వడం బ్రాహ్మణులూ మానేశారు; అది తరువాతి విషయం.

వీరశైవము బ్రాహ్మణ వ్యతిరేక ధర్మమా?
వీరశైవము బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని అడ్డగించడానికి మిగిలిన భుస్వామ్యేతర కులాల చేత మొదలుపెట్టబడిన మతమని “Siva’s Warriors” పరిచయ అధ్యాయంలో రచయితల మరో అభిప్రాయము.

ఈ విషయంలో బసవన్న కథలోకి వెళ్లి చూస్తే కొంచం స్పష్టత దొరుకుతుంది. బసవన్న కుటుంబంలో అందరూ బ్రాహ్మణులే. అందులో కొందరు కర్మకాండకు ప్రాముఖ్యమిస్తే, ఇంకొందరు భక్తికి ఇచ్చారు. బసవన్న పుట్టినప్పుడు అతనిని దీవించాడానికి జంగమయ్య ఇంటికి వస్తాడు. అతనిని బ్రాహ్మణులైన బసవని తలిదండ్రులు ఆరాధిస్తారు. అతని మాటలను శిరసావహిస్తారు. బసవనికి శివదీక్షనిస్తాడు ఆ జంగమయ్య. అంటే ఆనాటి లింగధారులైన జంగమలను బ్రాహ్మణులు గౌరవించి కొలిచేవారని అర్థమవుతుంది.

బసవన్న తండ్రి బ్రాహ్మణ్యాన్ని, భక్తినీ కలిపి చూడాలనుకున్నాడు. బసవనికి ఒడుగు చేయాలని తాపత్రయపడ్డాడు. బసవన్న అది కుదరదని చెబుతాడు. బసవన్న మేనమామ మాత్రం తన కూతుర్ని ఒక శివభక్తునికి మాత్రమే ఇస్తానని ప్రతిజ్ఞ చేసాడు. అంటే బ్రాహ్మణులలో కూడా కర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని పాటించేవారుండేవారని అర్థం అవుతుంది. అయితే వీరశైవాన్ని స్వీకరించిన బ్రాహ్మణులైనా, అంత్యజులైనా, ఇతర ఏ కులాలలో పుట్టినవారైనా, దీక్షా సంస్కారము జరిగిన తరువాత తమ బ్రాహ్మణ్యాన్ని, ఇతర పూర్వధర్మాన్ని వదలవలసి ఉంటుంది. బసవడు అదే చేస్తాడు. ఒడుగును చేసుకోనని తన తండ్రితో తర్కించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఈ తర్కములో శివదీక్షను ముందే పొందినందున బహుదేవతారాధనను నిరసించడం, యజ్ఞోపవీతంతో కర్మలంపటంలో పడనని, శివమంత్రము తప్ప ఇతరములు తగవని తండ్రితో స్పష్టంగా వాదిస్తాడు. అంటే ఆనాటి బ్రాహ్మణులలో కూడా కొందరు ఆగమప్రతిపాద్యమైన వీరశైవాన్ని, వారి ఆచారాలను పూర్తిగా అర్థం చేసుకోలేదనేది స్పష్టమవుతుంది.

తరువాత వీరశైవులలో అందరూ సమానులని తెలియజెప్పడానికి పుట్టుకతో అంత్యజులైనా శివశరణులైన వారిని తండ్రి, తల్లి, పెదనాన, తాత మొదలైన వారిగా చెప్పుకుంటాడు. తాను మిగిలిన బ్రాహ్మణేతర కులాలలలో పుట్టినా శరణులలైన వారికి భృత్యుడనని చెప్పుకుంటాడు. అలాగే నడుచుకుంటాడు. ఇవ్వన్నీ బసవని వచనాల్లోనూ కనబడతాయి. బసవడు తప్పు చేసినప్పుడు శరణుల చేత నిందించబడి వారి క్షమాపణలు కోరుకుంటాడు.

వీరశైవాన్ని బసవన్న తన గురువు ద్వారా పొంది ఆనాటి పరిస్థితులను చక్కబెట్టడానికి భక్తులైన చాలామంది పామరులకు పంచాడు. వారిని ప్రోత్సహించాడు. అంతేగాని రచయిత అనుకుంటున్నట్లు ఇది ఉన్నట్లుండి బ్రాహ్మణ వ్యతిరేకతే లక్ష్యంగా వచ్చిన కొత్త మతం కాదు. అప్పటికే అవైదికములు, నాస్తికములుగా నిరసించబడే బౌద్ధ, చార్వాక, జైన మతములు తీవ్రంగా దూషించబడుతుంటే, ఆనాటి కాలంలో వేదవిరుద్ధము లేదా ఆగమ విరుద్ధములైన పనులు చేసి సమర్థించుకోవడం చాలా కష్టము. బసవన్న ఈ ధర్మాన్ని ఆగమ సంప్రదాయబద్దంగా పొందాడు కాబట్టే అతని ధోరణి నచ్చకపోయినా ఎవ్వరూ అణగదొక్కలేకపోయారు. అప్పటి కొంతమంది బ్రాహ్మణులకు ఈ మార్పు నచ్చక రాజుకి చాడీలు చెప్పి వీరశైవుల వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు. సిద్ధాంత శిఖామణిలో మాత్రం ఎక్కడా బ్రాహ్మణవ్యతిరేక ప్రస్తావన ఉండదు. అంటే బసవన్న కాలంలో రాజకీయ ఘర్షణ కారణంగా, అధికారము చేతులు మారడంవల్ల బ్రాహ్మణులకు వీరశైవులకు వ్యతిరేకత క్రొత్తగా మొదలైందని గ్రహించాలి. అది పాల్కురికి సోమనాథుని బ్రాహ్మణ వ్యతిరేకతకు అసలు కారణము.

బసవని కాలంలో బ్రాహ్మణులతో సహా అన్యమతస్తులు కూడా చాలామంది వీరశైవం స్వీకరించారు. వీరశైవులకు బ్రాహ్మణులు పూజారులు కారు; జంగమలు పూజ్యులు. అంటే ఇక్కడ బ్రాహ్మణాధిపత్యము, పూజ్యత్వముపోయాయి. ఆగమాలు తెలిసిన బ్రాహ్మణులకు ఇది తప్పు కాదని తెలిసినా, ఇతర బ్రాహ్మణులకు నచ్చకపోవడానికి అసలు కారణం ఆధిపత్యం పోవడం. అంతవరకూ ఊరూరా తిరుగుతూ తమ ప్రచారమేదో తాము చేసుకొనే జంగమలు ఉన్నటుండి బ్రాహ్మణుల స్థానాన్ని పొందారు. జంగమలంటే రచయిత చెప్పనట్లు తక్కువకులం వారు కాదు. శివుని ముఖం నుంచి ఉద్భవించిన, పంచాచార్యుల పీఠాల ప్రొత్సాహంతో లింగధారులై శైవాగమములను ప్రచారము చేసే మొదటి వీరశైవులు. ఇదివరకు చెప్పినట్లుగా బసవన్నకన్నా ముందే వీరు దేశంలో అన్నిచోట్లా ఉన్నారు. వీరి ధర్మాన్ని ఎవరికైనా ఇవ్వడం శాస్త్రం ఒప్పుకుంటుంది కాబట్టి బసవన్న దాన్ని వాడుకున్నాడు. సామాన్యులకు దీక్షనిచ్చాడు. గుడిలోకి పోనివ్వకపోతే పోనీ మీ ఇష్టలింగానికి పూజించుకోమన్నాడు. ఇది ఘర్షణకు కారణం.

ఒక సన్యాసి ఏవిధంగా అయితే వర్ణాశ్రమాలను, అగ్నిహోత్రాన్ని త్యజిస్తారో, వీరశైవులూ అంతే. శివేతర విషయములేవి వారికి పట్టవు; రకరకాల దేవతలను ఆరాధించి వారి సంపదలకు ఆశపడనివారు, కేవలం ముముక్షువులై మిగిలిన పురాణేతిహాసములన్నీ పక్కనబెట్టి, వాటిలోని చిన్నదేవతలతో మాకు పనిలేదని, స్వర్గనరకాదులతో సంబంధం లేకుండా, కేవలం పరబ్రహ్మ తత్వమైన నిర్గుణోపాసనని మాత్రమే నమ్మేవారిని, వేదసమ్మతమైన సనాతన ధర్మము పాటించే వారిగానే గుర్తించవలసి ఉంటుంది. కేవలం వర్ణాశ్రమములను పాటించే బ్రాహ్మణ ప్రోక్తమైన విధానం మాత్రమే సనాతన ధర్మమనేది ఒక అపోహ.

అగ్నిష్టోమాది క్రతువులు, యజ్ఞోపవీత నిషిద్ధము, బలి నిషేధం, కర్మకాండ నిషేధం వంటివి ఆగమాలు గ్రహించని బ్రాహ్మణులకు తమ సంప్రదాయాలకు విరుద్ధంగా అనిపిస్తాయి. ఇలాంటి కారణాలవల్ల బ్రాహ్మణులకు వీరశైవులంటే పడకపోయినా, చాలామంది శివభక్తి కలిగి ఆత్మజ్ఞాన వివేచనము కలిగిన బ్రాహ్మణుల చేత వీరశైవం స్వీకరించడం జరిగింది; బసవన్నలాగా వారు జంగమలను, శరణులను పూజించడము కూడా జరిగింది.

అందుచేత రచయితలు అనుకున్నట్లుగా వీరశైవము బ్రాహ్మణ వ్యతిరేక మతముగా ప్రారంభమైనది కాదని, తరువాతి పరిస్థితుల వల్ల బ్రాహ్మణులకు, వీరశైవులకు విభేదాలు ఏర్పడ్డాయని గ్రహించాలి.

ఇక్కడ ఒక విశ్వాసము కూడా ఉటంకించవలసి ఉంటుంది. ఆదిశంకరునికి రేణుకాచార్యుడు గురువుగా మారి (రేవాణ సిద్ధుని రూపంలో లింగంలోనుంచి ఉద్భవించి) చంద్రమౌళీశ్వర లింగం ఇచ్చారనేది వీరశైవులు నమ్ముతారు. స్మార్తులు మాత్రం శివుడు కైలాసంలో ఇచ్చాడంటారు.

ఈ వ్యాఖ్యానంలో వీరశైవ ధర్మాన్ని పరిచయం చేస్తూ, “Siva’s Warriors” పరిచయ అధ్యాయంలో రచయితలతో ఏకీభవించని విషయాలలో నాకున్న భిన్నాభిప్రాయాలను ఆధారాలతో తార్కికంగా స్పష్టం చేసాను. పాఠకులకు ఈ విషయాల్లో ఏవైనా ప్రశ్నలుంటే నన్ను సంప్రదించవచ్చును.

కృతజ్ఞతలు
వీరభద్రప్ప ముచ్చండి
----------------------------------------------------------
రచన: వీరభద్రప్ప ముచ్చండి, 
ఈమాట సౌజన్యంతో

1 comment:

durgeswara said...

Adbhutam swami mee vivarana