స్వాధీనపతిక, ప్రోషితభర్తృక
సాహితీమిత్రులారా!
కావ్యరసములలో శృంగారమును రసరాజముగా లాక్షణికు లంగీకరించి యుండుట సర్వజనవిదితమే. ఇట్టి శృంగారరసమునకు ఆలంబనములు నాయికానాయకులు. నాయికానాయకుల యొక్క చక్షుష్ప్రీతి, మనస్సంగములవల్ల కలుగు మనోవికారమే రూఢమై శృంగారరసముగా పరిణమించును. దీనికి పరిసరములందలి సురభిళానిల సుందరోద్యాన చంద్రికాదిసన్నివేశములును, పరస్పరాభిహితమైన ఆహార్యాంగహార చేష్టాదులును ఉద్దీపకములుగా లాక్షణికులు గుర్తించినారు. ఇవన్నియు అనురక్తులైన నాయికానాయకుల అనుభవ మందున్నవే. వీనినే లాక్షణికులు సిద్ధాంతీకరించినారు. నాయికావిషయప్రసక్తిలో ఆసక్తికరమైన విషయము అష్టవిధశృంగారనాయికావర్గీకరణము. ఇది నాయికా తాత్కాలిక మనోధర్మవర్గీకరణమే కాని, నాయికాప్రకృతివర్గీకరణము కాదు. అనగా ఒకే నాయిక తత్తత్కాలమనోధర్మము ననుసరించి, ఈ అష్టవర్గములలో ఏదో యొక వర్గమునకు చెందియుండుననుట. కావ్యాలంకారసంగ్రహములో ఈ శృంగారనాయికల లక్షణము లిట్లు చెప్పబడినవి:
సీ.వరుఁడు కైవసమైన వనిత స్వాధీనభ
ర్తృక; ప్రియాగమవేళ గృహముఁ,దనువు
సవరించు నింతి వాసకసజ్జ; పతిరాక
తడవుండ నుత్కంఠఁ దాల్చునింతి
విరహోత్క; సంకేత మరసి, నాథుఁడు లేమి
వెస నార్తయౌ కాంత విప్రలబ్ధ;
విభుఁడన్యసతిఁ బొంది వేఁకువ రాఁ గుందు
నబల ఖండిత; యల్క నధిపుఁ దెగడి
గీ. అనుశయముఁ జెందు సతి కలహాంతరిత; ని
జేశుఁడు విదేశగతుఁడైనఁ గృశతఁ దాల్చు
నతివ ప్రోషితపతిక; కాంతాభిసరణ
శీల యభిసారికాఖ్యయై చెలువు మెఱయు.
(అనుశయము=పశ్చాత్తాపము)
పై పద్యములో ఈ అష్టవిధనాయికల పేర్లు సాంద్రమైన (Bold)అక్షరములతో గుర్తింపబడినవి. కడచిన రెండు ఈమాట సంచికలలో వాసకసజ్జికా, విరహోత్కంఠితా, ఖండితా, కలహాంతరితాలక్షణములను కొంత వివరించినాను. ఇప్పుడు స్వాధీనపతికా, ప్రోషితభర్తృకా అను నాయికలను గుఱించి వివరించి, వారి మనోధర్మములను ప్రతిబింబించునట్లుగా నేను వ్రాసిన గీతములను శ్రవ్యమాధ్యమములో ప్రదర్శింతును. ఇదియే ఈ వ్యాసము యొక్క ఆశయము.
స్వాధీనపతిక
యస్యా రతిరసాస్వాదముదితో దయితస్సదా|
సదైవాస్తే తయా సాకమేషా స్వాధీనభర్తృకా||
ఉద్యాన సలిలక్రీడా కుసుమాపచయక్రియా|
ఆపానకేళిః శక్రార్చా వసంతమదనోత్సవాః||
స్వాధీనభర్తృకాయాః స్యుర్విలాశ్చైవమాదయః|
అని శారదాతనయుని భావప్రకాశికలో స్వాధీనపతికాలక్షణము. రతిరసాస్వాదనచే ముదితుడైనవాడును, ఎల్లప్పుడు తనతో సహచరించు వాడును గల దయితుడు (భర్త) కలిగినది స్వాధీనపతిక, అని దీని కర్థము. ‘అట్టినాయిక ఉద్యానవన విహరణమందును, జలక్రీడయందును, కుసుమాపచయమందును, పానగోష్ఠియందును ఆసక్తురాలై యుండును. ఇంద్రపూజయందును, వసంతమదనోత్సవముల యందును నుత్సుకురాలై యుండును’ అని తన కధీనుడై తన కనుసన్నలలో మెలగు పతి గల యామెయొక్క విలాసక్రియలు పైశ్లోకములలో పేర్కొన బడినవి. గమనిక: ఇచ్చట భర్తృపదమునకు అనుకూలుడైన ప్రియుడని అర్థము చెప్పవలెను. ఏలనన లక్షణగ్రంథములలోను, కావ్యములలోను స్వీయకే కాక పరకీయాదులకు గూడ స్వాధీనపతికా, ప్రోషితపతికావస్థలు చెప్పబడినవి.
భరతుని నాట్యశాస్త్రములో స్వాధీనపతికాలక్షణ మిట్లున్నది:
సురతాతిరసైర్బద్ధో యస్యాః పార్శే తు నాయకః|
సాన్ద్రామోదగుణప్రాప్తా భవేత్ స్వాధీనభర్తృకా||
నాయకుడు సురతాతిరసబద్ధుడై, తన చెంతనుండగా నధికమైన హర్ష-సౌభాగ్య-అభిమానాదులను కలిగియుండునది స్వాధీనపతిక అని దీని కర్థము. ‘స్వాధీనః భర్తా పతిర్వా యస్యాః సా స్వాధీనభర్తృకా పతికావా (=తన కధీనుడైన భర్త లేక పతి గల్గిన స్త్రీ)’ అని స్వాధీనభర్తృక లేక పతికకు వ్యుత్పత్తి. కావ్యాలంకారసంగ్రహములోని ‘వరుఁడు కైవసమైన వనిత స్వాధీనభర్తృక’ అను రామరాజభూషణుని నిర్వచనము దీనికి సరిపడుచున్నది. ఇందులో ‘సదా=ఎల్లప్పుడు’ అను కాలనిర్దేశము లేదు. ఇదియే సరియైనదిగా దోచుచున్నది. ఏలనన స్వాధీనపతికాదిశృంగార నాయికాలక్షణములు తత్కాలావస్థాభేదములే కాని శాశ్వతస్వభావలక్షణములు కావు. అందుచేత దక్షిణనాయకుడు సైతము తత్కాలములో నాయికకు పరిపూర్ణముగా వశుడై యుండవచ్చును. అట్టి నాయిక స్వాధీనపతిక కావచ్చును. శ్రీకృష్ణుడు దక్షిణనాయకుడైనను జయదేవుని గీతగోవిందములో రాధకు విధేయుడైనవానిగనే చిత్రింపబడినాడుగదా! పారిజాతాపహరణములోను
శా. ఏయేవేళల నేసరోజముఖి యేయేలీలలం గోరుఁ దా
నాయావేళల నాసరోజముఖి నాయాలీలలం దేల్చి యే
చాయం జూచినఁ దానయై మెలఁగుచున్ సౌఖ్యాబ్ధి నోలాడు భో
గాయత్తుండయి పెక్కురూపముల మాయాకల్పనాచాతురిన్
అని ముక్కుతిమ్మన శ్రీకృష్ణుని మాయాశక్తిచేత బహురూపములు ధరించి, అష్టమహిషుల కనుకూలుడైన భర్తగా వర్ణించినాడు. వారందఱి కతడు స్వాధీనుడైన పతిగనే భాసించినాడు. అందుచేతనే అతడు పారిజాతమును రుక్మిణి కొసగెనను వార్త విన్నంతనే సత్యభామ అతనిని పరాధీనుడైన వానిగా దలంచి నిందించినది. అతడు తన కధీనుడుగా నుండినప్పుడు ఉభయులు నెరపిన విలాసక్రియల నీక్రిందివిధముగా స్మరించుకొని పరితపించినది:
సీ. కలలోన నైన నవ్వులకైన నామాట జవదాఁట వెఱచునో చంద్రవదన!
యేపదార్థంబు నాయెదుటఁ బెట్టక మున్న యెవ్వారి కొసఁగడో యిగురుఁబోడి!
చెలులు నాతో నేమి చెప్పుదురో యని లంచంబు లిచ్చునో చంచలాక్షి!
తోడిచేడియలు నాతోడివంతులకు రా సయిరింపఁజాలఁడో సన్నుతాంగి!
తే. యరమరలు లేని కూరిమి ననఁగి పెనఁగి,
కొదలు దీఱని కోర్కులఁ గూడి మాడి,
కపట మెఱుఁగని మమతలఁ గలసి మెలసి,
యున్న విభుఁడిట్లు సేయునే యోలతాంగి! – పారిజాతాపహరణము 1-94.
పై పద్యములో నాయిక కధీనుడైన పతియొక్క స్వభావము చక్కగా వర్ణింపబడినది. ఇందులో అనగి పెనగి, కూడి మాడి, కలసి మెలసి యను జాతీయముల ప్రయోగముతో ‘ముద్దుపలుకుగా’ నీపద్యమును ముక్కుతిమ్మన తీర్చిదిద్దినాడు. అట్లు పరస్పరాధీనులై వారు కావించిన కేళీవిలాసములను సత్యభామ యీక్రిందివిధముగా గుర్తుచేసికొనుచున్నది:
సీ.కృతకాద్రికందరాకేళీ నిగూహనవేళా పరస్పరాన్వేషణములు,
పోషితమాధవీపున్నాగపరిణయోత్సవ కల్పితానేకసంభ్రమములు,
చాతురీనిర్జితద్యూతపణాదాన కలితచేలాంచలాకర్షణములు,
సాయంసమారంభచక్రవాకద్వంద్వ విరహావలోకన విభ్రమములు,
తే. సాంద్రతర చంద్రికాకేళి చంక్రమములు,
విధుశిలామయవేదికా విశ్రమములు,
ఫలకచిత్రిత నిజరూప భావనములు,
మఱచెనో కాక రుక్మిణిమాయఁ దగిలి. – పారిజాతాపహరణము 1-95.
వివరణ: పూర్వము ధనికుల ప్రమదావనములలో కృత్రిమశైలము లుండెడివి. ఇట్టి శైలకందరములలో దాగుడుమూతలాడుటలు, ఉద్యాన వనములో బెంచుకొన్న బండిగురివెందతీగకు పొన్నచెట్టునకు చేసిన వివాహసంరంభములు, పణము లొడ్డి యాడిన అక్షక్రీడల అవసానమున పణము చెల్లింపుమని చేలాంచలములను బట్టి లాగుటలు, సాయంకాలమున ఆసన్నమగు విరహము నెంచి తమిదీర్చుకొనుచున్న చక్రవాకదంపతులను సానురాగముగ జూచుటలు, పండువెన్నెల రాత్రులందలి వెన్నెలయాటలు, (చల్లనైన) చంద్రకాంత శిలావేదికలందు (ఒరసికొని కూర్చుండి) విశ్రమించుటలు, పరస్పరరూపములు పలకలయందు జిత్రించుకొని, వాని యందచందములను సవిలాసముగా భావించుటలు – ఇవన్నియు మున్ను పరిపూర్ణముగ శ్రీకృష్ణుడు తనకు వశుడై యున్నప్పుడు, అనగా తాను స్వాధీనపతికయైనప్పుడు, చేసినట్టి విలాసకార్యములు – ఇప్పుడు రుక్మిణి మాయలోబడి వాటి నన్నిటిని విస్మరించుచుండెనా యని సత్యభామ పలవించినది.
అమరుక, గీతగోవింద, పుష్పబాణవిలాసాదిగ్రంథములలో ఇట్టి నాయికానాయకుల స్వభావముల చిత్రించు అందమైన ఉదాహరణము లెన్నియో యున్నవి. పుష్పబాణవిలాసములోని ఈక్రింది శ్లోకమును చూడుడు:
శేతే శీతకరోఽమ్బుజే, కువలయద్వన్ద్వాద్వినిర్గచ్ఛతి!
స్వచ్ఛా మౌక్తికసంహతి, ర్ధవళిమా హైమీం లతామఞ్చతి||
స్పర్శాత్ పఙ్కజకోశయో రభినవా యాన్తి స్రజః క్లాన్తతామ్|
ఏషోత్పాతపరమ్పరా మమ సఖే! యాత్రాస్పృహాం కృన్తతి||
ఈ అందమైన శ్లోకమునకు నా భావానువాదము:
ఉ. నీరజవైరి యబ్జమున నిద్రను బూనె, సుమౌక్తికావళుల్
కైరవయుగ్మమందొదవె, కాంచనవల్లిక తెల్లనయ్యె, నం
భోరుహకుట్మలంబులను బూలసరంబులు దాఁకి మ్లానతం
గూరెను, దుర్నిమిత్తములు గూడఁగ నిట్టులఁ బోవమానితిన్.
వివరణ: నాయికావిధేయుడైన నాయకు డొకడు హఠాత్తుగా తన ప్రయాణమును మానుకొన్నాడు. దానికి కారణ మేమి యని ప్రశ్నించు తన సఖునితో నతడిట్లు పలుకుచున్నాడు. శీతకరః=చంద్రుడు, అమ్బుజే=కమలమునందు, శేతే=శయనించుచున్నాడు; స్వచ్ఛా మౌక్తిక సంహతిః =స్వచ్ఛమైన ముత్యముల సమూహము, కువలయద్వన్ద్వాత్=కలువలజంటనుండి, వినిర్గచ్ఛతి=వెలువడుచున్నది; హైమీం లతామ్ = బంగారుతీగెను, ధవళిమా=తెల్లదనము, అఞ్చతి=పొందుచున్నది; పఙ్కజకోశయోః=పద్మకుట్మలములయొక్క, స్పర్శాత్=తాకిడివల్ల, అభినవా స్రజః = (అప్పుడే కూర్చిన) పూలదండలు, క్లాన్తతామ్=వాడుటను, యాన్తి=పొందుచున్నవి; సఖే=ఓ మిత్రమా! ఏషోత్పాతపరమ్పరా = ఈ దుర్నిమిత్తముల వరుస, మమ =నాయొక్క, యాత్రాస్పృహాం=ప్రయాణేచ్ఛను, కృన్తతి= ఛేదించు (చంపు)చున్నది.
కమలవిరోధియైన చంద్రుడు కమలములోనే పరుండుట, కలువలజంటనుండి మంచిముత్తెములు రాలుట, (హఠాత్తుగా ) బంగారుతీగె తెల్లవాఱుట, పద్మకుట్మములను తాకగనే క్రొత్తనైన పూదండలు వాడిపోవుట, ఇట్టి దుశ్శకునములు పొడసూపినవి. అందుచేత శ్రేయస్కరము కాదని నాప్రయాణము నాపికొంటిని. అనగా, నాయకుని ప్రయాణవార్తను వినగానే స్వాధీనపతిక కావున నాతని విడిచి యుండలేని నాయిక తన చేతిలో మోము నానించుకొని సంతాపమును బూనినది. అనగా పద్మమువంటి ఆమె చేతిలో చంద్రునివంటి యామె ముఖము విశ్రమించినది. ఇది యొక సంతాపసూచకభంగిమ. కలువలజంట(వంటి ఆమె కన్నుల)నుండి మంచిముత్తెములు (అనగా శోకబాష్పములు) రాలినవి. బంగరుతీగె (వంటి ఆమె మైదీగె హఠాత్తుగా) పాలిపోయినది. (విరహతాపముచే వేడెక్కిన యామె తనువందలి స్తనములనెడి) కమలపుమొగ్గలను తాకగనే మెడలో వేసికొన్న క్రొత్తనైన పూదండలు వాడిపోయినవి. ఇట్లు తన యెడబాటువార్త ఆమెను అత్యంతఖిన్నురాలిని జేయుటచేత ప్రయాణము నాపికొంటి నని నాయకుడు తెల్పుచున్నాడు. నాయికకు పరిపూర్ణముగా వశుడైన నాయకునికిని, అట్లు స్వాధీనపతిక యైన నాయికకును నిది మంచి ఉదాహరణము.
ఇట్లే స్వాధీనపతికయైన రాధిక తనకు పరిపూర్ణముగ వశవర్తుడైన కృష్ణునిచేత సురతాంతమున సింగారపుటూడిగములు చేయించుకొనుట జయదేవుని గీతగోవిందమునందలి ఈక్రింది శ్లోకములో చక్కగా చెప్పబడినది:
రచయ కుచయోః పత్త్రం, చిత్రం కురుష్వ కపోలయోః|
ఘటయ జఘనే కాఞ్చీ, మఞ్చ స్రజం కబరీభరే||
కలయ వలయశ్రేణీం పాణౌ, పదే కురు నూపురౌ|
ఇతి నిగదితః, ప్రీతః పీతామ్బరోఽపి తథాఽకరోత్||
దీనికి నా భావానువాదము:
చ. స్తనముల పత్త్రభంగములఁ జక్కగఁ దీర్పుము; చెక్కులందునన్
గొనబుగ నుంచు చిత్రకము; కొప్పునఁ బెట్టుము పూసరంబులన్;
ఘనజఘనానఁ గాంచికను, కంకణనూపురముల్ కరాంఘ్రులం
దొనరఁగఁ గూర్పుమన యోషిత కట్టులె చేసెఁ గృష్ణుఁడున్.
వివరణ: గాఢమైన సురతాంతమున స్తనముల నలంకరించుకొన్న పత్త్రభంగములు, చెక్కుల నున్న చిత్రకములు, కొప్పున గైసేసిన పూసరములు, పాదములందలి యందెలు, కరములందలి కంకణములు, జఘనమునందలి మొలనూలు విశ్లథములు, విశ్లిష్టములు నైనవి. అట్టి రూపముతో బయటి కేగుట యసంభవము. అందుచే వానిని పునారచనము చేయుమని స్వాధీనపతికయైన రాధిక శ్రీకృష్ణుని కోరినది. అతడు పరిపూర్ణ విధేయతతో, ప్రేమతో యథోక్తముగా నామె నలంకరించినాడు. ఇటువంటి స్వాధీనభర్తృకోదాహరణమే రసార్ణవసుధాకరములోని ఈక్రింది శ్లోకములో నున్నది:
సలీలం ధమ్మిల్లే దరహసితకహ్లారరచనాం|
కపోలే సోత్కంపం మృగమదమయం పత్త్రతిలకమ్||
కుచాభోగే కుర్వన్ లలితమకరీం కుంకుమమయీం|
యువా ధన్యః సోఽయం మదయతి చ నిత్యం ప్రియతమామ్||
దీనికి నా భావానువాదము:
చ. చెలువుగఁ గేశపాశమునఁ జెంగలువల్ గయిసేసి, వేడ్క రం
జిల మృగనాభిపత్త్రమయచిత్రకముల్ రచియించి చెక్కులన్,
వలుదపుగుబ్బలందునను వ్రాసి వరాన్వితపత్త్రరేఖలన్,
చెలిని సతంబు సంతసిలఁజేసెడు ప్రౌఢుఁడె ధన్యుఁడౌగదా!
వివరణ: కేశపాశము=కొప్పు; మృగనాభిపత్త్రమయచిత్రకముల్ = కస్తూరితోబెట్టిన పత్ర్రముల తిలకరేఖలు; ‘మృగనాభి ర్మృగమదః కస్తూరీ’ అని అమరకోశము. వరాన్వితపత్త్రరేఖలన్ = కుంకుమతో గూడిన మకరికాదిపత్త్రరేఖలను. వర మనగా కుంకుమపువ్వు. ‘కాశ్మీరజన్మాగ్నిశిఖం వరం బాహ్లీక పీతనమ్’ అని అమరము. ఈకాలపు స్త్రీలు ‘eye shadow’, ‘blush’ వంటి వాటితో అంగసంస్కారం (makeup) చేసికొనినట్లు పూర్వము స్త్రీలు చెక్కిళులపై, స్తనములపై మకరికాదిరూపములలో కస్తూరీకుంకుమాదులతో రేఖలను రచించుకొనెడివారు. ఇట్టి రేఖలకే పత్త్రభంగములు లేక పత్త్రకము లని పేరు. ఇట్లు కొప్పునందు చెంగలువల నలంకరించి, కస్తూరీచిత్రరేఖలను కపోలములందు, కుంకుమ పత్త్రభంగములను స్తనములందును దీర్చి, ప్రియురాలిని సంతసింపజేయునట్టి యువకుడే ధన్యుడు గదా యని పైశ్లోకమున కర్థము. ఇట్లు ప్రియునిచే చేయించుకొను నాయిక స్పష్టముగా స్వాధీనపతికయే.
వశీకృతపతియైన స్వాధీనపతిక సంతుష్టాంతరంగయై యుండుట సహజమే. నాట్యనాటకాదులలో నిట్టి నాయిక ఉజ్జ్వలవస్త్రభూషణాంచిత వేషము, ప్రమోదవికసితాననము, అధికమైన శోభ – వీనితో తన యవస్థను నిరూపింపవలెనని భరతుడు తెల్పినాడు.
శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు పాడిన మత్కృతమైన ‘చాలులే ప్రియురాల’ అను ఈ పాట స్వాధీనుడైన కాంతుని అనురక్తిని ప్రతిబింబించునది.
చాలులే ప్రియురాల (మాండ్ రాగం)
పల్లవి:
చాలులే ప్రియురాల చాలునివె చాలు
పదవులేలా, సంపదలు నాకేల?
అ.పల్లవి:
వలపునిండిన నీదు వాల్చూపుచాలు
మంగళారతులయి మలసినం జాలు |చాలులే|
చరణం 1:
లలితంపు కరముల న్నళినంపు చెల్వలను
మెలమెల్ల రవి దట్టి మేల్కొలుపు సమయాన
గలగలా మ్రోగు నీ గజ్జెలందెల రవమె
ఎలమితో నెదనెల్ల కలగింప జాలు |చాలులే|
చరణం 2:
వలపూని జంటలై జలములం దూగుచు
అలవోకగా సాగు హంసమిథునము గాంచి
పులకించు నీలోన దులకించు భావాల
వెలయించు నీమోము వీక్షించుటే చాలు |చాలులే|
చరణం 3:
కమలాల చుంబించు భ్రమరాల దిలకించు
నిను గాంచి నీమోము నీరజంబే యంచు
గాటంగ నేతెంచు తేటులకు వెఱచి
గాటముగ నను నీవు కౌగిలించుటె చాలు |చాలులే|
చరణం 4:
నాయాత్మనిలయాన నానంద మెసగ
నిశ్చలంబుగ నీవు నివసించుటే చాలు
నీయాత్మముకురాన నిరతంబు నామూర్తి
గాంచుచుండెడి నిన్ను గాంచుటే చాలు |చాలులే|
ప్రోషితభర్తృక
అనురక్తుడైన వల్లభుఁడు తన కనుసన్నులలో మెలగుచుండగా సుఖాసక్తయైన స్వాధీనపతిక అతడు ప్రవాసమున కేగగా ఖిన్నయగుట సహజమే. ఇట్టి నాయికకే ప్రోషితపతిక లేక ప్రోషితభర్తృక = (ప్ర+ఉషిత=ప్రవాసగతుడైన, భర్తృక=భర్త(పతి)గలది) అని పేరు. ఇట్లు స్వాధీనపతికాప్రోషితపతికలకు సహజమైన పారంపర్యమున్నది. సింగభూపాలుని రసార్ణవసుధాకరములో ప్రోషితభర్తృకాలక్షణ మిట్లున్నది:
దూరదేశం గతే కాన్తే భవేత్ ప్రోషితభర్తృకా|
అస్యాస్తు జాగరః కార్శ్యం నిమిత్తాదివిలోకనమ్||
మాలిన్యమనవస్థానం ప్రాయః శయ్యానిషేవనమ్|
జాడ్యచిన్తాప్రభృతయో విక్రియా కథితా బుధైః||
వివరణ: పతి దూరదేశమున కేగి సమయమునకు రాకున్నను, రాజాలకున్నను విరహముచే ఖిన్న యగునది ప్రోషితభర్తృక. ఇట్లు విభునికై పరితపించు నాయిక జాగరము (నిద్రలేమి), శరీరకృశత్వము, పత్యాగమనసూచకశుభశకునవిలోకనము, మలినవేషము, అస్థిరత, జాడ్యము, చింత, ముహుః శయ్యాపతనము – ఇటువంటి చేష్టాపరంపరలచేత తన ఖిన్నతను ప్రదర్శించుచుండును. రామరాజభూషణుని ‘నిజేశుఁడు విదేశగతుఁడైనఁ గృశతఁ దాల్చు నతివ ప్రోషితపతిక’ అను లక్షణము దీనిలో నంతర్భాగముగనే యున్నది.
పైలక్షణములలో ప్రియుడు దూరదేశగతుడు కావలెనను నిర్దేశమున్నది. అట్లుగాక ప్రియుడు దూరదేశమున కేగునను వార్త విన్నంతనే నాయిక ఖిన్నురాలు గావచ్చును. ఇట్టి నాయిక నవమశ్రేణికి చెందిన ప్రవత్స్యత్పతిక (ప్రవత్స్యత్=ప్రవాసమునకు వెడలుచున్న, పతిక= ప్రియుడు గలది) యగునని కొందఱు లాక్షణికులు తెల్పుచున్నారు. కాని అగ్రిమక్షణములో కాంతుడు ప్రవాసమున కేగునని తెలిసినను, ఏగుచున్నను (అనగా ప్రయాణములో నున్నను), ఏగినను కలుగు విరహావస్థలు తుల్యములు గనుక ప్రోషికపతికానిర్దేశము ఈ మూడవస్థలకు వర్తింపజేయవలె ననియు, అందుచేత ‘ప్రవత్స్యత్పతికా’ యను నవమశృంగారనాయికానిర్దేశ మనవసరమనియు, అది ప్రోషితభర్తృకావస్థా భేదమే యనియు శృంగారమంజరీ, శృంగారామృతలహరీ గ్రంథకర్తల అభిప్రాయము. ఇదియే సమంజసముగా దోచుచున్నది. ఈ ప్రవత్స్యత్పతికావాదమునకు మూలమైనదీ క్రింది అమరుకశతకములోని శ్లోకము:
ప్రస్థానం వలయైః కృతం, ప్రియసఖై రస్రై రజస్రం గతం|
ధృత్యా న క్షణ మాసితం, వ్యవసితం చిత్తేన గన్తుం పురః||
యాతుం నిశ్చిత చేతసి ప్రియతమే సర్వే సమం ప్రస్థితం|
గన్తవ్యే సతి జీవిత! ప్రియసుహృత్సార్థః కిముత్సృజ్యతే||
దీనికి నాభావానువాదము:
చ. వలయము లూనె పైనము, నవారిగఁ బాఱుచుఁ బోవు నశ్రువుల్,
నిలువక పోవసాగె ధృతి, నిర్గతమయ్యెను మున్నె చిత్తమున్,
ౘలమున దూరయానమును సల్పెడువానినిఁ గూడి యిట్లు వా
రలు సనుచుండఁ జిక్కితివి ప్రాణమ! చేరక నీదుమిత్రులన్.
అర్థవివరణ: ప్రియుని ప్రవాసవార్తను విన్నంతనే ఆమె తనువు కృశించినది. ఆమె చేతియందలి కంకణములు జారిపోయినవి. కన్నీరు నిరంతరముగా (అజస్రం) కారిపోయినది. ధైర్యము క్షణమాత్రము నిల్వలేదు. వానికి ముందే మనస్సు పోయినది, అనగా మనోవేదన కలిగినది. ఆ వెళ్ళబోవుప్రియునితో అతనికి మిత్రములైనట్లుగా ఇవన్నియు బయలుదేరినవి. ఒక్క ప్రాణము మాత్రమే ఆమెలో మిగిలియున్నది. ఓప్రాణమా! నీవును నీకు మిత్రసమానులైన వారితో బోవక ఎందుకున్నావు? అని యామె ప్రశ్నించుచున్నది. ఈయవస్థ ప్రవాసవార్త విన్నంతనే కల్గుటవల్ల ఈ నాయిక ప్రవత్స్యత్పతికగా నుదాహరింపబడినది.
పుష్పబాణవిలాసములోని ఈక్రింది శ్లోకములోను నాయిక ప్రవాసోన్ముఖుడైన నాయకునితో కల్గబోవు విరహావస్థను తెల్పుచున్నది.
ఏతస్మిన్ సహసా వసన్తసమయే ప్రాణేశ దేశాన్తరం|
గన్తుం త్వం యతసే, తథాపి న భయం తాపాత్ ప్రపద్యేఽధునా||
యస్మాత్ కైరవసారసౌరభముషా సాకం సరోవాయునా|
చాన్ద్రీ దిక్షు విజృమ్భతే రజనిషు స్వచ్ఛామయూఖచ్ఛటా||
దీనికి నా భావానువాదము:
ఉ. ఈ ననకారునం దెటకొ యేఁగఁగనెంతు వతర్కితంబుగా
నైననుఁ బ్రాణనాథ! విరహాగ్నికి భీతిల నేను – చంద్రికా
నూనసుషీమయామినులు, నూతనకైరవగంధహర్తయై
పూని సరస్సుశైత్యమును పొందుగ వీఁచు సమీరుఁ డుండఁగన్.
వివరణ: వసంతకాలము వచ్చినది. అది ప్రేయసీప్రియుల కత్యంతోద్దీపనకారకము. అట్టి సమయములో ప్రియుడు దేశాంతరమున కేగ దలంచి నాడు. ఆమె అనుచున్నది: ‘ఓ ప్రాణనాథ! నీవనాలోచితముగా విదేశమేగుటకు నిశ్చయించినావు. కాని తజ్జనితమైన విరహతాపమునకు నేనేమీ భయపడను. ఏలనన పండువెన్నెలతో చల్లనైన రాత్రులు, ఆరాత్రులందు సరస్సులందు విరిసిన తెల్లకలువల గంధమును హరించి వీచు చల్లని మరుత్తులు ఉండనే యున్నవి.’
లోకమునందు తప్తమైన వస్తువునకు శీతలవస్తువు తాకిన తాపవినిమయమువల్ల తప్తవస్తువు చల్లబడుట స్వాభావికము. చల్లని వెన్నెల, శీతలసురభిళమారుతములు తాపోపశమనసమర్థములని, అందుచేత తనకు తాపభయము లేదని పైకి స్ఫురించు అర్థము. కాని అంతరార్థము దీనికి విపరీతమైనది. విరహతాప మొక వింతతాపము. శీతలచంద్రికావాతములు దానిని అతిశయింపజేయునే కాని అల్పమొనరింపవు. అందుచేత ఆమె మాటల కంతరార్థ మిట్లున్నది – ‘ప్రాణేశ=ప్రాణనాథ’ అను సంబోధనముచే, నీకధీనమైన నాప్రాణములు నీవు పోవ నీతోనే వెడలిపోవును. అందుచేత నిన్ను విడిచి నేనుండలే ననుచున్నది. ‘అస్మిన్ వసంతే = ఈ ననకారులో’ అని ఎత్తుకోవడంవల్ల ఈవసంతం అన్ని విధముల ప్రేమికుల కుద్దీపనకరము, అది నీవు గణింపక ‘సహసా = అతర్కితంబుగా=అనాలోచితముగా’ పోవుటకు నిశ్చయించితి వనుచున్నది. అన్యకార్యవ్యాసంగమున పగలు గడచినను, రాత్రు లొంటరిగ గడపుట దుర్భరమగును. నిండుపున్నమ రాత్రులు, ఆరాత్రులందు వీచు కైరవపరీమళభరితములైన శీతలవాయువులు విరహతాపము నధికము చేయును. అవి నీవు వెడలగనే విజృంభించి నా ప్రాణమునే తీసివేయును. ప్రాణ ముండినగదా తాపభయముండుట. అందుచేత నాకు తాపభయము లేదనుచున్నది. ప్రవాసవార్తాశ్రవణమాత్రము చేతనే విశ్లేషణాసౌఖ్యము ననుభవించుచున్నది కనుక ఈనాయిక ప్రవత్స్యత్పతిక. ఇట్టి నాయికకే అమరుకమునుండి మఱొక్క చక్కని ఉదాహరణము:
లగ్నా నాంశుకపల్లవే, భుజలతా న ద్వారదేశేఽర్పితా|
నో వా పాదయుగే స్వయం నిపతితం, తిష్ఠేతి నోక్తం వచః||
కాలే కేవలమమ్బుదాలిమలినే గన్తుం ప్రవృత్తః శఠ|
స్తన్వ్యా బాష్పజలౌఘకల్పితనదీ పూరేణ రుద్ధః ప్రియః||
దీనికి నా భావానువాదము:
ఉ. ద్వారము నడ్డుకోఁగ భుజవల్లులు సాఁచదు; కొంగు లాగఁగా
నేరదు; కాళ్లపైనిఁ బడనేరదు; పోవలదంచుఁ బల్కఁగా
నేరదు; కాని దాఁటి చన నేరని యశ్రునదిన్ గృశాంగి తాఁ
గారిచె మబ్బుచాల్పొడము కాలమునన్ విభుఁ డేఁగనెంచినన్.
వివరణ: వర్షాకాల మప్పుడప్పుడే ప్రవేశించుచున్నది. అందుచేత అది కేవలము ‘అంబుదాలిమలినకాలము =మేఘములనల్లదనము గల్గిన కాలము’గా నున్నది. అనగా మేఘము లేర్పడినవి గాని ఇంకను వర్షారంభము కాలేదని అర్థము. దీనిని నేను ‘మబ్బుచాల్ పొడముకాలము’ అన్నాను. వర్షాకాలమునందు ప్రియుని విరహము స్త్రీల కత్యంతక్లేశకారణ మగునని కవుల సంప్రదాయము. దీనినే కాళిదాసు మేఘసందేశములో ‘మేఘాలోకే భవతి సుఖినోఽప్యన్యథావృత్తి చేతః, కంఠాశ్లేషప్రణయినిజనే కిం పునర్దూరసంస్థే’ అన్నాడు. ఇట్టి సమయములో నాయకుడు దూరదేశ మేగుట కుద్యమించినాడు. ఇట్టి ప్రయత్నమును నివారించుటకు పోవలదని కొంగు బట్టి లాగుట, ద్వారమున కడ్డముగా చేతులు సాచి నిలబడి నిరోధించుట, కాళ్లపైబడి ప్రాధేయపడుట, ‘పోబోకు’మని పలుకుట సామాన్యముగ చేయు యత్నములు. కాని ప్రియుని ప్రవాసవార్త విన్నంతనే కృశాంగియైన ఆనాయిక యివేవియు చేయలేదు. మేఘమలినమాత్రమైన ఆకాలములో మేఘములు వర్షింప లేదు కాని ఆమె మాత్రము నిరంతరముగా అశ్రువుల వర్షించినది. ఆ అశ్రునదిని దాటలేక నాయకు డింటిలోనే చిక్కిపోయినాడు.
చింత, నిశ్శ్వాసము, ఖేదము, హృదయతాపము, సఖీసంలాపము, స్వీయావస్థాపర్యాలోచనము, గ్లాని, అశ్రుపాతము, భూషణత్యాగము, కేశసంస్కారరాహిత్యము, మాలిన్యము, రోదనము, చిత్తానవస్థితి – వీని నభినయించుటచే ప్రోషితభర్తృకావస్థను ప్రదర్శింపవలెనని భరతుడు తెల్పెను. కాళిదాసు మేఘసందేశములోని ఈక్రింది శ్లోకములో చింత, నిశ్శ్వాసము, రోదనము, కేశసంస్కారరాహిత్యము, మలినత్వములు గల ప్రోషితభర్తృక యైన యక్షిణి చెప్పబడినది:
నూనం తస్యాః ప్రబలరుదితోచ్ఛూననేత్రం ప్రియాయా|
నిశ్శ్వాసానా మశిశిరతయా భిన్నవర్ణాధరోష్ఠమ్||
హస్తన్యస్తం ముఖ మసకలవ్యక్తి లమ్బాలకత్వాత్|
ఇన్దో ర్దైన్యం త్వదనుసరణ క్లిష్టకాన్తే ర్బిభర్తి||
దీనికి నా భావానువాదము:
చ. అతితరరోదనంబున మదంగన కందొవ యుబ్బుసూప, నూ
ర్జితమగు వేఁడియూర్పుగమిచే నధరోష్ఠము కాంతి దప్ప, వి
శ్లథకచసంవృతంబు శయసక్తమునైన ముఖంబు నీవు గుం
ఠితమొనరించు నిందుగతి నించుక తోఁపఁగ నుండు దీనయై.
అర్థము: ప్రబలరుదిత = అధికమైన రోదనముచేత, ఉచ్ఛూననేత్రం= ఉబ్బిన కన్నులు గలదియు (ఇచ్చట విషాదజనితరోదనము చెప్పబడినది, అధికముగా ఏడ్చుటచేత కనులు వాచుట స్వాభావికము), నిశ్శ్వాసానామ్=నిశ్శ్వాసములయొక్క, అశిశిరతయా=వేఁడిమివల్ల, భిన్నవర్ణాధ రోష్ఠమ్=కాంతిచెడిన క్రిందిపెదవి గలదియు (ఇచ్చట నిశ్శ్వాసమను లక్షణము చెప్పబడినది. వేఁడియూర్పులు పెదవులపై ప్రసరించుటవల్ల పెదవులు కాంతి దొఱగుట సహజము), హస్తన్యస్తం =చేతియం దుంపబడినదియు, లమ్బాలకత్వాత్=(దువ్వుకొనమిచే) వ్రేలాడు ముంగురులు గలదియు నైన, అసకలవ్యక్తి=కొంతగానే కన్పడుచున్న, తస్యాః ప్రియాయాః ముఖమ్= ఆ ప్రియురాలి ముఖము (ఇచ్చట చింతా, మాలిన్యము అను లక్షణములు చెప్పబడినవి. అఱచేతిలో చెక్కిలి నుంచుకొని చింతించుట, అనాసక్తివల్ల కేశసంస్కారము లేకుండుటచే ముంగురులు ముఖముపై వ్రేలాడుచు ముఖము సాంతముగా గన్పడకుండుట, అందుచే మలినముగాఁ దోచుట సహజము), త్వదనుసరణక్లిష్టకాన్తేః = నీవు (అనగా మేఘుడు) అడ్డుపడుటవల్ల కాంతి దొఱగిన, ఇన్దోః=చంద్రునియొక్క, దైన్యమ్=దీనతను, బిభర్తి నూనం = పొందియుండునని తలచెదను. అనగా అలకలు ముఖముపై పడుటవల్ల పూర్తిగా కానరాని నాయికాముఖము మేఘముచే నడ్డుకొనబడిన చంద్రునివలె నున్న దనుట. ఈసందర్భము లోనిదే కాళిదాసుయొక్క మఱియొక శ్లోకము:
ఉత్సఙ్గే వా మలినవసనే సౌమ్య నిక్షిప్య వీణాం|
మద్గోత్రాఙ్కం విరచితపదం గేయ ముద్గాతుకామా||
తన్త్రీ మార్ద్రాం నయనసలిలైః సారయిత్వా కథంచిత్|
భూయోభూయః స్వయమపికృతాం మూర్ఛనాం విస్మరన్తీ||
దీనికి నా భావానువాదము:
చ. ధృతమలినాంశుకాంకమున నింతి విపంచిక నుంచి మామకాం
చితకులనామగానమును జేయఁగఁ బూనుచు నెట్లొయశ్రుసం
తతిపరిషిక్తతంత్రుల పునశ్శ్రుతి చేయును గాని, స్వీయక
ల్పితములె యైన మూర్ఛనల విస్మరియించుచునుండు మాటికిన్.
అర్థము: హే సౌమ్య=ఓసౌమ్యుడవైన మేఘుడా, (నాప్రియురాలు), మలినవసనే=మలినమైన వసనము గల, ఉత్సఙ్గే=ఒడియందు, వీణాం నిక్షిప్య= వీణ నుంచుకొని, మద్గోత్రాఙ్కం=నా గోత్రనామములతో, విరచితపదం గేయమ్ =రచింపబడిన పదములుగల పాటను, ఉద్గాతుకామా =ఉచ్చైస్స్వరముతో,అనగా దేవయోనులకు మాత్రమే పాడుటకు సాధ్యమైన గాంధారగ్రామములో పాడదలచినదై, నయనసలిలైః =(అట్లు నా స్మరణమువలన వెల్వడిన) కన్నీటితో, ఆర్ద్రాం తన్త్రీమ్ = తడిసిన వీణతీగెను, కథంచిత్=ఎట్లో (ప్రయాసమున), సారయిత్వా=(తుడిచి) శ్రుతి చేసి, స్వయమపికృతాం మూర్ఛనాం = తనచేతనే కల్పింపబడిన స్వరస్థానములను(మూర్ఛనలను), భూయోభూయః=మఱిమఱి, విస్మరన్తీ =మఱచుచున్నదై యుండును. అనగా విరహముచే గల్గిన అవ్యవస్థితచిత్తముచే గల్గిన అనవధానముచే తాను స్వయముగా గల్పించినవైనను ఆమూర్ఛనలను మాటిమాటికి మఱచుచు పాడుచుండుననుట. అశ్రుపాతముచే తడిసిన తంత్రులను మఱిమఱి శ్రుతి చేయ వలసివచ్చుటచే నదియు కష్టసాధ్యముగా నున్నదనుట. ఈశ్లోకములో స్మరణము, మాలిన్యము, చిత్తానవస్థితి, అనవధానత అను ప్రోషితభర్తృకాలక్షణములు చెప్పబడినవి. మేఘసందేశములో నీసందర్భములో యక్షిణియొక్క కృశతను, జాగరణను, ఇష్టవస్తునిరాసమును, నిమిత్త పర్యాలోకనాదులను వ్యక్తీకరించు మఱికొన్ని శ్లోకము లున్నవి. ఆసక్తి గలవారు వీనిని పరిశీలింపవచ్చును. విస్తరణభీతిచే నేనిక్కడ వానిని వివరించుట లేదు.
పెద్దనగారి మనుచరిత్రములో వరూథిని ప్రవరాఖ్యునియందు మోహము వహించినది. కాని ఆతడామెను నిరాకరించి అగ్నిదేవుని ప్రార్థించి స్వస్థానమున కేగినాడు. ఐనను అతనియం దనురక్తి ఆమెకు నిశింపలేదు సరికదా ఆమె ప్రోషితభర్తృకవలె విరహము ననుభవించినది. అంతేకాక ఆమె సహచారిణులైన రంభాద్యప్సరసలు ‘విప్రవరుండు గోలయున్ బాలుఁడు గాన నప్పటికిఁ బైఁబడఁ గొంకెనుగాని వానికిన్ గాలొకచోట నిల్చునె వగన్ మగుడన్ నినుఁ జూచునంతకున్’ అని ఆమెను బుజ్జగించి ప్రవరపునర్దర్శనాశ నామె మనమందు పచ్చగనే యుంచినారు. ఇట్టి విరహావస్థ ననుభవించు నామెకు చిత్తానవస్థితి, ఇష్టవస్తువులయం దనాదరము, తూష్ణీంభావము కల్గినది. దాని నీక్రింది పద్యములో పెద్దనగారు చక్కగా వర్ణించినారు.
సీ. ఘనసారపంక మొక్కలతాంగి దెచ్చిన ముట్టి వ్రేలనె చుక్కబొట్టు వెట్టి,
యింతి యొక్కతె పూవుటెత్తు లెత్తినఁ జూచి విసువుతో నొకకొన్ని విరులు దుఱిమి,
పడఁతి యొక్కతె రత్నపాదుక లిడ నిల్చి తొడుగ కవ్వలికిఁ బోనడుగు వెట్టి,
బాగాలు వెస నొక్క పద్మాక్షి యొసఁగిన వెగ్గలం బని కొన్ని వెడల నుమిసి,
తే. సగము గొఱికినయాకును, సఖులు పిలువ
సగమొసఁగు నుత్తరముఁ, దెల్వి సగము మఱపు
సగము నయి, చింతచే సగ మగుచు నరిగె
నవ్వరూథిని యంతికోద్యానమునకు.
(ఘనసారపంకము=కర్పూరపుగంధము; పూవుటెత్తులు=పూలదొంతులు; బాగాలు=కత్తిరించిన పోకలు)
శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు పాడిన మత్కృతమైన ‘చెలియరో యిది యేమె చేతి మురువులు జారె’ అను ఈ పాట ప్రోషితభర్తృక యైన నాయికావిరహావస్థను ప్రకటించునది.
చెలియరో యిది యేమె (చక్రవాకరాగం)
పల్లవి:
చెలియరో యిది యేమె చేతిమురువులు జారె
ఎడలేక కన్నీరు ఏఱులై పారె
అ.పల్లవి:
సరసుండు వల్లభుడు సద్వర్తనుండు
నను బాసి పరదేశమున కేగు నన్నంత |చెలియరో|
చరణం 1:
నామాటనే యెంచి పూమూటగా నెపుడు
నాపనుపునే పూని నవమాలగా నెపుడు
నాకు ప్రియమును జేయు నాథుడే యెటకొ
చనునన్న వార్తయే శ్రవణాల సోకంగ |చెలియరో|
చరణం 2:
కొలనులో నీదుచు జలకేళి సల్పుచు
వనములం గుసుమాళి పరువంబు మెచ్చుచు
కడలిలో కెరటాల గమనంబు గాంచుచు
విహరింప నాతోడ వేరెవరు రాగలరు? |చెలియరో|
చరణం 3:
తాళగల నేరీతి ధవుని యెడబాటు
తోడులేక కృశించు పాడుకాలము వచ్చె
ఇంతతెలిసినగాని అంతమొందకయుంటి
ఎంతతీపియొకదా ఈపాడు ప్రాణంబు |చెలియరో|
--------------------------------------------------------
రచన: తిరుమల కృష్ణదేశికాచార్యులు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment