ముక్తచ్ఛంద కవిత – కొన్ని మౌలిక సమస్యలు
సాహితీమిత్రులారా!
త్రిదశత్వం అందుకున్న ఈ తరుణంలో ముక్తచ్ఛంద కవిత ప్రధాన ఆధునిక కవితవాహికగా స్థిరపడినట్లు కనిపిస్తోంది. సుదూర భవిష్యత్తు వరకూ ఈ ప్రక్రియ ప్రవర్థితం కాగలదన్న అచంచల విశ్వాసం కలుగుతూన్నది. ఆధునిక యుగ సంబంధమైన కవితా వాణిగా ఈ ప్రక్రియా విశేషం పరిగణింపబడుతోంది.
అయినా పూర్వ యుగ అవశేషాలయిన లాక్షణిక ఛందో బద్ధ కవితలూ (మార్గి) మాత్రాచ్ఛంద కవితలూ (దేశి) వెలువడుతూనే ఉన్నాయి. పూర్వయుగావశేషాలు వర్తమాన యుగంలో సైతం రాజకీయ సాంఘిక ఆర్థిక నైతికాది సర్వరంగాల లోనూ విడువకుండా అంటిపెట్టుకుని ఉండినట్లే, కవితా రంగంలో కూడా పూర్వయుగవైలక్షణ్యం పూర్తిగా తొలగిపోదు. అలా మిగిలి ఉన్నప్పటికి అవి ఆధునిక యుగ ప్రాతినిధ్యాన్ని వహించలేవు.
రచనా వైవిధ్యము
ఈ కవితాప్రక్రియ ఒక ఉద్యమంగా రూపొంద గలుగుతుందా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి. వచనకవితాప్రక్రియ ఒక నిర్ధిష్టమైన కవితా స్వరూపాన్ని సంతరించుకున్నదే కాని, నిర్దుష్టమైన స్వభావాన్ని రూపొందించుకోలేక పోయింది. ఈ ప్రక్రియలో ఆత్మాశ్రయమైన ప్రేమేతివృత్తము, వాస్తవికతాదర్శనతో లోకవృత్త ప్రదర్శనము, మార్మిక భావనా సముచ్ఛయము, మున్నగు అనేక వస్తువులను స్వీకరించి వ్యక్తీకరించడం విశేషంగా కనిపిస్తుంది. కనుకనే, ఈ భావ సంకీర్ణత ముక్తచ్ఛంద మార్గానుగాములలో వైవిధ్యాన్ని (అనైక్యత కాదు) స్థాపిస్తోంది.
ఈ కవితా సిద్ధాంతావలంబకులలో గల ఈ వైవిధ్యం అనూచాన కవితా వాహినిలో నిర్మాణయుతమైన విప్లవాత్మక పరిణామాలను చేకూరుస్తున్నదా? లేక విచ్ఛిన్నకర భ్రష్ట రూపాలను ఉత్పత్తి చేస్తున్నదా? అనే సందేహం కొందరిలో కలుగుతున్నది. ఈ ప్రశ్నకు కూలంకష సమాధానం చెప్పుకుందుకు, ముక్తచ్ఛంద కవితా చరిత్రను స్థూలంగా స్పర్శించవలసి వుంది.
నవయుగారంభం
మూడు దశాబ్దాల క్రితం — మహాప్రస్థాన గీతాలు రచింపబడుతున్న దశలో (1934) ముక్తచ్ఛంద కవితకు ప్రథమ స్వరూపాలు శ్రీశ్రీ చేత ఆవిష్కరింపబడ్డాయి. ఈ ప్రక్రియకు నిర్దిష్టమైన రీతులు (ఆకాశదీపం, ఋక్కులు, సాహసి, ఐ వంటివానిలో) ప్రయుక్తమైనవి. సాహితీసంస్కర్త శ్రీ గురజాడ అప్పారావు కవితలు అల్పసంఖ్యాకంగానే రచించారు. కాని, వానిలోనే ప్రేమకవితామార్గానికి, దేశభక్తి కవితా మార్గానికి, వాస్తవిక కవితా మార్గానికి బీజాక్షరాలు లిఖించారు. అట్లే శ్రీశ్రీ కూడా సమాజ వాస్తవికతను చిత్రించే ముక్తచ్ఛంద కవితలకూ మాత్రాచ్ఛంద స్వరూపంలో విప్లవగీతాలకూ ఆద్యుడై నాంది వినిపించాడు. ఈ ముప్పది సంవత్సరాలలోనూ మూడు స్పష్టమైన కవితావిభాగాలు ద్యోతకమవుతున్నాయి.
ఒకటి:- శ్రీశ్రీ వెనువెంటనే వచ్చిన అనిర్ధిష్ట కవితాయుగం. పురిపండా, శ్రీరంగం నారాయణ బాబు, జరుక్ శాస్త్రి, శిష్ట్లా ఉమా, పఠాభి, సింగరాచార్య, పా.ప. హ్రీ. హ్రీ. పూషా, సంపత్, తిలక్ ప్రభృతులు (1934 – 44) ఈ శ్రేణి లోని కవులు.
రెండు: అభ్యుదయ కవితాయుగం. కుందుర్తి, ఏల్చూరి, రామదాసు, అనిసెట్టి, చిరంజీవి, సోమసుందర్, ఆరుద్ర, రమణారెడ్డి, గంగినేని, అజంతా, బైరాగి, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి ప్రభృతులు (1944 – 54). వీరిలో అధికసంఖ్యాకులు మాత్రాచ్ఛందస్వరూపాలు విరచించినా ప్రతి ఒకరూ ముక్తచ్ఛందాలు రచించడం మానలేదు. (మొదటి తరంలోని శ్రీ తిలక్ తనంత తానుగా ఒంటరిగా ఈ ప్రక్రియతో కవితలు వ్రాసి ప్రచురిస్తుంటే రెండవ తరంలోని కుందుర్తి తెలంగాణ ప్రచురించి హైదరాబాద్‌లో వచన కవితా ఉద్యమాన్ని కేంద్రీకరించాడు.)
మూడు: వచన కవితా యుగం. దీనినే స్వచ్ఛంద కవితా యుగమని కాని ముక్తచ్ఛంద కవితా యుగమని కాని అనడం మరింత నిర్దిష్టంగా ఉంటుంది.దీనిలో తిలక్, కుందుర్తి, మాదిరాజు, అరిపిరాల, కేశవరావు, యాదవరెడ్డి, వరవరరావు మొదలగువారు (1954 – 64) పాత్రధారులు.
అభ్యుదయ కవితా వ్యాప్తి
మూడు దశలలోనూ కూడ వర్తమాన కవిత్వం పండిత భిషక్కుల ప్రాతికూల్యాన్ని ఎదుర్కుంటూనే వుంది. మొదటి దశకంలో యుగపురుషుడైన శ్రీశ్రీ తదనానుయాయులూ ప్రతికూల ఋతుపవనాలకు ఎదురొడ్డి నిలవవలసి వచ్చింది. మొదటి దశాబ్ది చివరి పాదంలో సంప్రదాయవాదుల నిరాదరణ వల్ల శ్రీశ్రీ అనుయాయులు కొందరిలో నిస్తేజం పొడసూపింది. తాము కూడ సంప్రదాయ ఛందస్సులను ప్రయుక్తం చేయగలమన్న శక్తి ప్రదర్శనకు పూనుకోవడం క్షీణలక్షణంగా వ్యాపించింది. మన దేశానికి సహజం కాని అధివాస్తవికతా వాదం వంటివానికి అంటుకట్టి పెంచడం మరొక లక్షణమై ప్రగతి స్తంభించింది. అట్టి దశలో అభ్యుదయ కవితా ఉద్యమం ప్రాదుర్భవించింది. శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలలో ప్రదర్శించిన విహంగేక్షణతో స్థూల రేఖలుగా చిత్రితమైన పీడిత మానవ శ్రేణుల పురోగతిని అభ్యుదయ కవితా యుగం లోని ప్రముఖ కవులందరూ మరింత వస్తు నిర్దేశం తోను, మరింత సూక్ష్మ విశ్లేషణ తోను, మరింత మమేక భాగస్వామ్యత్వం తోను చిత్రించారు. ఈ యుగంలో పండిత విమర్శలకు, పరిగణనకు, పారితోషికాలకూ నిమిత్తం లేని ఆశేష ప్రజాదరణను అభ్యుదయ కవిత సముపార్జించుకోగలిగింది.
నిరంతరాన్వేషణ
కవికి జీవనధాతువైన ప్రతిభ నవనవోన్మేషశాలి. నిరంతర అన్వేషణాశీలి. ప్రతిభకు ప్రయోగశీలత, సాహస యాత్ర, ద్వితీయ ప్రకృతులు. ప్రతిభావంతులైన కవులు పరిణత మనస్కులై ముందంజ వేయడమే గాక పరిపక్వ చేతస్కులై కవితా స్వరూప స్వభావాలలో మార్పులు సైతం ఆపాదించ గల్గుతారు. నిన్నటి కవుల కవితలను నేటి కవులనుసరించడం దోషమైనట్లే నిన్నటి తన కవిత్వాన్ని నేడు అనుకరించడం కూడ దోషమే అవుతుంది. ఒక కవి అనుభవ ప్రవృద్ధు డవుతున్న కొద్ది, విషయజ్ఞాన వ్యుత్పన్నుడవుతున్న కొద్ది కవితారచనలో నూత్న యితివృత్తాన్వేషణకు సంవిధాన చాతురికి పూనుకుంటాడు. లేదా, పూర్వేతి వృత్త స్వీకరణలో సైతం సృజనాత్మకంగా అపూర్వ సంవిధానాన్నీ రీతినీ అనుసంధిస్తాడు. అప్పుడే అతని కవితకు విశిష్టత చేకూరుతుంది.
వర్తమాన లోకంలో బ్రతుకుతున్న మన కవుల లోనే విభిన్న లోకాల లోనూ కాలాల లోనూ నివసిస్తున్న వ్యక్తు లుంటారు. కొందరు కేవలం గతలోక వాసులు. కొందరు వర్తమానులు, మరికొందరు భవిష్యద్దర్శకులు. ఇట్టిది సర్వజనుల లోనూ కనిపించే విభేదమైనట్లే కవులలో సైతం ద్యోతక మయ్యేదే! ఏమైనా కవితా స్రవంతిలో పొడసూపిన విభేదాలు స్థూలంగా రెండు రకాలు: ఒకటి — రీతిగతమైనది (ఫార్మ్), రెండు — విషయ గతమైనది (కంటెంట్). మొదటి విభాగంలో పొడసూపిన మార్పులు ఛందస్సు లోను, లయ లోను, శయ లోను, స్వరూపం లోను స్పష్టమవుతాయి. ద్వితీయ విభేదం: స్వీకృత కవితా వస్తువు లోను, సాంప్రదాయ విచ్ఛిత్తి లోను, ప్రయోగ శీలత లోను, భావనా చిత్రణ (ఇమేజరీ) లోను, కవితాసమయాల లోను, ఉక్తివైచిత్రి లోను ద్యోతకమవుతుంది.
ప్రయోగ ప్రయోజనం
నిజమైన ప్రయోగవాది తన గొంతు వింతగా ఉండాలని కాని, చమత్కారం కోసం కాని, ప్రయోగం చెయ్యడు. కొత్త పద్ధతిలో చెప్పటమొక్కటే తన ప్రయోగానికి ఫలశ్రుతి అనుకోడు. లేదా పఠితలను హడలగొట్టి ఆశ్చర్యం లోను దిగ్భ్రమ లోను ముంచెత్తి కనులు మిరుమిట్లు గొల్పడానికి కూడా ప్రయోగం సాగించడు.
నిన్న రాసిన తన కవితలలో కాని, లేదా ఇతరుల కవితలలో కాని, కానరాని కొండొక అపూర్వగుణమూ ఓజస్సూ ధీశక్తీ హృదయగమత మున్నగు గుణాత్మక లక్షణాల కోసం కవి సాగించే నిరంతరాన్వేషణలో ప్రయోగాత్మక రచనలు వెలువడతాయి. తద్వారానే వ్యక్తిగతంగా ఒక కవికి గాను, సామూహికంగా కవితకు గాని పురోగతి సిద్ధిస్తుంది. కవిత కలిగించే అనుభూతి లోను, ముద్ర లోను అనితఃపూర్వ అభివృద్ధి పరిగణింపబడుతుంది. కవులు అనుసరిస్తున్న కళాత్మక సిద్ధాంతాల లోని అవలక్షణాల ఫలితంగా ప్రేపేపితమైన పిల్లి మొగ్గలు ఆరోగ్యకరమైన ప్రయోగాలుగా గుర్తింప నవసరం లేదు.
నేటి కవుల బాధ్యత
కళాత్మక సిద్ధాంతాలలో నిత్య నూతనమైన మార్పులు గోచరిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ విప్లవ సిద్ధాంతం ఉద్భవించినా అది క్షణంలో నలు దిశలా వ్యాపించే విచిత్ర లక్షణం వర్తమాన యుగాని కున్నది. మేధా సంబంధి సంక్షోభాలు, అనవగాహనలు, కళాత్మక సిద్ధాంతాలలో సైతం పొడసూపి విచిత్ర వాదాలకు దారి తీస్తున్నాయి; ఆధునిక సమాజంలో భావవిప్లవం క్రమ వికాసం చెందకుండా ప్రగతిని సంక్షుభిత పరుస్తున్నాయి. కవులూ కళాకారులూ ఒక సంవిధానాన్ని ఏర్పరుచుకొని తమకు మార్గదర్శకులైన ముందు తరాల ప్రముఖ కవుల, మేధావుల సాధనాజన్యమైన విప్లవ భావేతివృత్తాన్ని పురోగమింప జేయడంలో దర్శనానైశిత్యాన్ని అలవర్చుకోవడం అత్యవసర మవుతున్నది. ముందు తరాల కవుల భావనాసముచ్ఛయాన్ని పురోగమింప చేసే ప్రయత్నంలో కవితా ప్రక్రియలో పేలవత్వం పొడసూపకుండా జాగరూకత వహించాలి. నిస్తేజమైన అనుకరణ విధానాలు దొంగచాటుగా ప్రవేశించకుండా శ్రద్ధ తీసుకోవాలి. ఓజోరహితమైన నినాద ప్రాయ వచనబంధం దురాక్రమణ చేయకుండా కాపాడు కోవలసి ఉంది. శక్తివంతులైన కవుల తదనంతర అనుయాయులు తమ కవితలనీ పరమ బాధ్యతలతో సంరక్షించుకొనక పోతే ప్రతిధ్వనులుగా క్షీణించాల్సి వస్తుంది!
కాలమే చోదక శక్తి
నవ్యత సాధారణంగా నిరాదరణకు గురి కాబడుతుంది. ఈ నిరాదరణ భావాన్ని నవ్య కవితా విమర్శకులూ వ్యాఖ్యాతలూ తృణీకరించ వలసి వస్తుంది. ఇట్టి ప్రతిఘటనలో సౌష్ఠవమైన కళాత్మక సిద్ధాంతాల ఆసరా అవసరమవుతుంది. ఆదర్శాత్మక వర్తమాన సమాజంలో భవిష్యద్దర్శన గల నవశక్తుల అభివృద్ధి కాంక్షించబడుతుంది. ఈ కాంక్షయే కవిత్వాని కొక సంప్రదాయమూ వారసత్వమూ ఘటిస్తుంది. ఐతే, సంప్రదాయానికి అవిభాజ్యమైన ఛాయామాతృకమైన మూఢ విశ్వాసమే జీవ శక్తికి మించినదై భావకల్లోలాన్ని రేపుతుంది. అప్పుడే సంప్రదాయజ్ఞులైన క్రాంతదర్శులు నవ్యత కోసం సాహసోపేతమైన ముందడుగు వేయవలసి వస్తుంది. ఈ ముందడుగులలో ప్రాచీనత కొంత విధ్వంసం కాకనూ తప్పదు. నవ్యతకు కొంత ఉత్తేజం కలుగకనూ తప్పదు! ఈ చక్రగతికి కాలమే చోదక శక్తి!
ఏ వాదాన్ని అనుసరించే కవి అయినా ఆ వాదమే అతని కళా విస్తృతికి ఒక పరిధిని నిర్మిస్తుంది. క్రమశః ఈ పరిధియే అతని పురోభివృద్ధికి అవరోధం కలిగించకుండా చూసుకోవల్సిన అవసరం ఏర్పడుతుంది. తన వాదాన్ని బలపరిచే భావనాపటిమలో నిరంకుశత, నిర్నిరోధకతలు పొడసూపకుండా కాపాడుకోవలసిన బాధ్యత పెరుగుతుంది. తద్వారా సోదాహృతమైన హేతువాద విపులీకరణలో సంకుచితవాదాలు సమసిపోతాయి. సరిగ్గా ఇదే సత్ఫలితం ఈ ముప్ఫై సంవత్సరాలు కవితా సాధన లోనూ సిద్ధించింది.
ఉక్తి వైచిత్రి
ఈ శతాబ్దంలో కవిత్వం పట్ల ఆదరణ ప్రతి దశాబ్ది లోనూ నిర్దిష్టమైన అభివృద్ధిని సూచిస్తున్నది. ప్రతి దశాబ్ది లోనూ ఆధునిక కవితా పురోగతి కొత్త మలుపులు తిరుగుతూ, పాతనుంచి కొంత స్వీకరణ, కొంత నిరాకరణలను సాగిస్తూ పురోగమిస్తున్నది. ఈ శతాబ్దపు తొలి మూడు దశాబ్దాల లోనూ సాధింపబడని ఉక్తివైచిత్రిను, నవ్యతను, విశిష్టభావజాలాన్ని, మలి మూడు దశాబ్దాల ఆధునిక కవిత సాధిస్తూ అమేయాభివృద్ధి గాంచింది. ముఖ్యంగా, ఈ ముప్పదేళ్ళ కవితాచరిత్ర లోనూ విశిష్ట విభాగంగా పెంపొందుతూ వచ్చిన ముక్తచ్ఛంద కవిత తత్పూర్వమెన్నడూ ఆంధ్ర కవిత శతాబ్దాలుగా సాధించుకోజాల నంతటి ఆవేగాన్నీ అంతర్ముఖత్వాన్నీ ఆలోచనామృతాన్నీ సాధించుకోగలిగింది. ఛందస్సులో స్వేచ్ఛను ప్రోది చేసుకుని స్వచ్ఛంద వృత్తాన్ని స్వీకరించడం ద్వారా ఆధునిక మానవుని సమస్త భావాజాలాన్నీ — వైజ్ఞానిక, సారస్వత, సాంస్కృతిక, సామాజిక భావజాలాన్ని — ఒక్క కవితాస్వరూపం లోనే సమన్వయం చేసుకోగలిగింది. నవ్య వ్యక్తికై, ఆధునిక భావవ్యంజనకై అనవరత సాధన ముక్తచ్ఛందానికి జీవన ధాతువైంది. ఈ స్వచ్ఛంద కవిత కవిత్వ స్వరూపంలో వచనానికీ లేదా గద్యకూ సాన్నిహిత్యం నెరపడం వల అటు శుష్కవచన రీతికి జారిపోకుండాను, ఇటు కవిత్వ ఓజస్సును ప్రతిపద నిష్యందిగా వెలార్చునట్లునూ సమ్రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ కవులకు అనివార్యమైంది. కొన్ని రకాల ముక్తచ్ఛంద కవితలు శుష్కవచన రీతిలో రాజకీయ ఉపన్యాసాల వలె మారిపోవడం తప్పడం లేదు. అట్టి రచనలను స్వీకృత వస్తువు లోని వీర వాస్తవికతను, సామాజిక కశ్మల వాతావరణ ప్రకర్షను సాకుగా చెప్పి బలపర్చడమూ కనిపిస్తున్నది. కాని, సర్వదశల లోను వస్తు విన్యాస వైఖరులు, భావవ్యంజనా పద్ధతులు కవితా విమర్శకు నికషోపలాలుగా పరిగణన పొందుతూనే ఉన్నాయి.
వచన కవితను రచించిన కవులలో అసంఖ్యాకులు వ్యక్తీకరణలో కొత్త వయ్యారాలెన్నో సృష్టించారు. ఇతఃపూర్వ మెన్నడూ ఎరుగని అందాలు సంతరించారు. నాగరిక జీవితం లోని కృతకృత్వం అనివార్య మౌతున్నట్లే, తజ్జన్యమైన విషయావిష్కరణలో కూడ కృతకత్వం అనివార్య మౌతున్నది. ఈ ముక్తచ్ఛంద కవులలో ఆధునికత, తత్సంబంధ ఇతివృత్త సేకరణ, ఆవిష్కరణ, సంవిధానము మున్నగునవి తమ అనుభవైకవేద్యాలు, జీవిత సంఘర్షణా జన్యాలు కాకపోవడం వల్ల కొన్ని చోట్ల అయోమయత, సంక్షోభములకు దారి తీస్తున్నాయి. కేవల రీతి గత నవ్యతపై ఆధారపడి భావ వ్యక్తీకరణ సాగించడం వల్ల తమ మనోగత పూర్ణబింబాన్ని పఠిత్రు మనో యవనికపై సజీవంగా ప్రతిబింబించ లేకపోవడం కొన్ని తావుల జరుగుతున్నది.
ముకచ్ఛంద స్వరూపం నిర్దిష్టమైన కవితా జీవవాహిక అయినట్లయితే దానికి నిర్దిష్టమైన కవితానిర్వచనా లుండవలసిన అవసరం వర్తమాన కాలంలో ఎదురవుతున్నది. ఈ ప్రక్రీయకు పుష్టికరమైన లక్ష్యశుద్ధి అవసరమవుతున్నది. అంతర్లయ, ప్రవాహగుణము వంటి బాహ్యలక్షణాల పట్ల సిద్ధిని చేకూర్చుకోవలసి వున్నది. ఛందస్సు భగ్నం కావటం వల్ల గేయగుణం మృగ్యమైంది. గేయగుణం వల్ల శ్రోత చెవులలో కవిత ప్రవేశించగానే హృదయాన్ని వశీభూతం చేసుకుని మెస్మరైజ్ చేసే సద్యస్ఫూర్తి అనుపూర్వికంగా సమకూరేది. అట్టి గుణం లుప్తం కావడంతో శ్రోత హృదయాన్ని మేజిక్ చేసే యితర కవితా గుణాల సంపద పెంచుకోవలసి వస్తున్నది. లోపించిన దాని స్థానే ఏ కళాత్మక లక్షణం అనివార్యమో గుర్తెరుగవలసి వుంది. యిట్టి సర్వ లక్షణాల పట్ల లక్ష్యం కలిగివున్న కవి కావ్య నిర్మాణదక్షుడు కావడంలో సందేహ ముండదు.
సమగ్ర కావ్యాలు
ఏ కవితా స్వరూపం గాని అది సర్వ సుగుణాకరం కాలేకపోతే ఆ సంవిధానం సమగ్రతనూ సౌష్ఠవాన్నీ సాధించుకోలేదు. యిది గుర్తించిన కొందరు ఈ దశాబ్దిలో ఒక జీవితవృత్తాన్ని స్వీకరించి, సమగ్ర కావ్య రచనాధురీణులయ్యారు. యిట్టి కావ్యాలలో తెలంగాణా అనే కావ్యము, ఆశ అనే గేయ నాటిక, సినీవాలి అనే కావ్యము, మేఘరంజని అనే కావ్యము ప్రథమ గణ్యాలు.
వ్యావహారిక భాషాప్రవేశం
నవ్య సాహిత్య పరిషత్ కాలం నాటికే వ్యావహారిక భాషావాదం విజయవంతంగా కాలూనుకొన్నది. తత్సభ్యులందరూ వ్యావహారిక భాషను మౌలికంగా అంగీకరించడం ఒక ప్రాథమిక లక్షణమైంది. కాని, వ్యావహారిక భాష లోని కమ్మని పలుకుబడులు కావ్యాలలో స్వీకృతం కాలేదు. గత శతాబ్ది చివరి రోజుల లోనే రచింపబడిన కన్యాశుల్కం వంటి వాని ప్రబావం కేవలం వచనానికే పరిమితమై ఉండిపోయింది. వ్యావహారిక భాషాప్రయోగాలు నిర్దిష్టంగా చోటు చేసుకున్నది మొదటిసారిగా శ్రీశ్రీ మహా ప్రస్థానం లోనే! ఐతే ఇది బహుళంగా క్రియలకే పరిమితమై ఉండినది. భాష పైన, ఛందస్సులకు జీవనాడిగా మ్రోగే లయజ్ఞానం పైన విశేషాధికారం కలిగిన శ్రీశ్రీ తెలుగు భాష లోని వ్యావహారిక సౌందర్యాలను మితంగానే ఉపయోగించు కోగలిగాడు. ఆకాశ దీపం వంటి రచనలతో విశిష్టంగా ప్రారంభమైన శిష్టజన వ్యావహారిక భాషాప్రవేశం ప్రవర్ధితమై ముక్తచ్ఛంద కవితలలో విశేషంగా చోటు చేసుకుంది. ముక్తచ్ఛంద కవితకు గల విస్పష్ట లక్షణమైన వచన సాన్నిహిత్యం వ్యావహారిక భాషను తప్ప తదన్యాన్ని స్వీకరించడానికి విముఖత వహించింది. వాడుక భాష లోని పలుకుబడులు కవితా గౌరవాన్ని సాధించుకున్న మరుక్షణం నుంచీ సంస్కృత భాషా ప్రాబల్యం ఆధునిక కవితలో అవలీలగా తొలగిపోతూ వచ్చింది.
ఐతే సంస్కృత భాషాభేషజానికి బదులు నిత్య వ్యవహారంలో లేని, కేవల విద్యాధికుల నోళ్ళలో మాత్రమే నలిగే ఆంగ్లభాషా పదాలు కాని, ఆంగ్లపదాలను వికృతీకరించే క్రియాస్వరూపాలు కాని, అధికాధికంగా ఈ కవితలలో ప్రవేశించడం జరుగుతున్నది. ఇట్టి కవితలు ఆంగ్లో-తెలుగు కవితలుగా విలక్షణంగా ఉంటున్నవి.
నేటి తెలుగు పత్రికలన్నింటా కనీసం ఒకటైనా ముక్తచ్ఛంద కవిత ప్రచురింపబడకుండా ఉండటం లేదంటే ఈ ప్రక్రియకు లభిస్తున్న ఆదరణ ఎంతటి నిర్నిరోధకమో అవగత మవుతుంది. ఈ కవితా రచనలో నిర్దిష్ట (ఛందో) లక్షణమంటూ ఉండటం లేదు. వీటిని లాక్షణికంగా ఎలా విశ్లేషించుకోవాలని ఎవరైనా అడిగితే తగిన సమాధానమూ దొరకడం లేదు. కేవల అంతర్లయాబద్ధమైన ప్రవాహగమనం ముక్తచ్ఛందాలకు బాసటగా నిలుస్తున్నది. కొన్ని రచనలలో అదీ కనిపించడం లేదు. కాని, సాధారణంగా ఒక పదసముచ్ఛయాన్నో లేక ఒక పూర్తి పాదాన్నో పునరావృతి చేయడం ఒక సామాన్య లక్షణంగా రూపొందుతున్నది. పొడుగు పొట్టి పాదాల నిర్మాణం ద్వారా కొన్ని నడకలలో ఒక బెడగునూ ఒయ్యారాన్నీ సాధించి చక్షురక్షర సంయోగజనిత సౌందర్యాన్ని సృష్టించగల్గుతున్నాయి. కొన్నిటికి అట్టి శిల్పవైశిష్ట్యమూ కొరవడుతున్నది. కొన్ని ముక్తచ్ఛంద కవితలుగా చెలామణీ అవుతున్న వానిని పాదవిచ్ఛేదం తొలగించి వచనంగా వ్రాసినా పేచీ పెట్టని విధంగా తయారవుతున్నాయి. అనగా వచనం నుంచి కవిత్వాన్ని వేర్పరచే మౌలిక గుణాలు లుప్తమవుతున్నవన్న మాట. అట్టి సందర్భాలలో కవిత్వం సాధించగల పరమ ప్రయోజనమే భగ్నమవుతుంది. యుగయుగాలుగా వచనం నుంచి వేరై విశిష్ట వ్యక్తిత్వంతో సత్వంతో మనగల్గుతున్న కవితా వైలక్ష్యణమే భంజక మవుతున్న దన్న మాట!
కొన్ని సందేహాలు
కొందరాధునికుల లోనే తీరని సందేహాలు పొడసూపుతున్నాయి. యుగయుగాలుగా మానవులు కవితా వాహికగా అనేక మనోహర ఛందస్సులను సృష్టించుకున్నారు. వీని ఆధారంతో మనోహరమైన భావన పఠిత హృదయనాళాలకు చేరుకుని చిరంతన ముద్రను వేయగల్గుతున్నది. యిట్టి అపురూప సంపదను తృణీకరించడం ద్వారా వచనపద్యం పుష్టిని కోల్పోడం లేదా అని! లయబద్ధమైన భావన కవిత్వ మవుతున్నది. అట్టి కవితకు రమణీయ లయబద్ధమైన వాక్యం వాహనంగా అమర నవసరం లేదా అని అడుగుతున్నారు. ఛందస్సుందరమైన ప్రాచీన కావ్యాలను చదువుతున్నప్పుడు కలిగిన ఆనందమూ దీప్తీ సంతృప్తీ వంటి సద్గుణాలన్నీ కేవల వచన పద్యం ద్వారా కలిగించ తగిన ముక్తచ్ఛంద కవితా రచనలు ఎన్నో వెలువడటం లేదా అన్నది సమాధానమే కావచ్చు. పైగా ఆలోచనామయ నూత్న గోళాలను ఈ కవితా ప్రక్రియ సాధించుకోలేదా అన్నది కూడా సౌష్ఠవమైన సమాధానమే. ఐతే ముక్తచ్ఛంద కవితగా ప్రచలితమవుతున్న కొన్ని రచనలు శుష్కవచనాలుగా దిగజారడమే కాక శుష్కస్థితినీ శూన్యగతినీ కూడ పొందుతుండటం సందేహవాదుల శంకలను పెంచకపోదు.
వచన కవితా శక్తి సంపద
శుద్ధ వచనంలో అంతకన్న శక్తివంతంగా అంతకన్న నాటకీయతతో అంతకన్న కళాస్పర్శతో రచించ గల్గిన అవకాశం ఉండి కూడా అటు కళాత్మక వచనమూ కాలేక, ఇటు శక్తివంతమైన కవితా కాలేక కొన్ని కృతులు నిస్సార మవుతున్నవి. కొన్ని రచనలు సంగ్రహ వ్యక్తీకరణ నిమిత్తం కృషి సల్పి సారళ్యతను, అన్వయ క్లిష్టతను, కమనీయతనూ పోకార్చి, అయోమయత నాపాదించుకుంటున్నాయి. ఈవిధంగా ఆత్మవిమర్శ చెప్పుతున్నంత మాత్రంలో అత్యాధునిక కవులు ముక్తచ్ఛంద కవితా ప్రక్రియతో ఆధునిక సాహిత్యానికి చేకూరుస్తున్న అమూల్య సంపదను తృణీకరిస్తున్నానని అర్థం కాదు. ఆధునిక కవిత లయారహిత ఛందో విరహిత పదబంధం ద్వారా కవితా నిర్మాణావకాశాలను ఎంతగానో పరిశోధిస్తున్నది. భాష లోని ప్రతి పదానికీ ఉన్న సహజశక్తిని, నిస్తుల దీప్తిని, అచ్చమైన స్వరూపం ద్వారా ప్రయోగాలు జరిపి వెలికి తీస్తున్నది. అలంకారిక మతాలలో (పొయెటిక్స్) కొత్త కోణాలను విరచిస్తున్నది. కళాసౌందర్య సిద్ధాంతాలలో (ఈస్థటిక్స్) కొత్త కాంతులను విరజిమ్ముతున్నది. కవితా సంవిధానంలో నూత్న లోకాలు జయిస్తున్నది. నన్నయ్యగారి గుణుగు సీసాలలో గాని, పోతన్నగారి గద్యలలో గాని, కృష్ణమాచార్యుని వచనాలలో గాని సాధించుకోజాలని రసభావనా వ్యంజకతను ఈ కవిత సాధిస్తున్నది. స్వచ్ఛంద కవిత ఒక్కటే వర్తమాన యుగీనమైన కవితా వాణిగా ప్రాచుర్యం సముపార్జించుకోంటోంది. తెనుగు కవికి గేయగుణం ఒక్కటే చిరకాలపు టలవాటుగా వ్యాపించిన స్థితిలో ఆపి ఆలోచింపజేసే నవీన భావనామయ సంగీతాన్ని యీ కవిత సాధించింది. ఒకే నిడివీ ఒకే పలుకుబడీ శబ్ద సమన్వయతా కలిగిన యమక గమకాది శబ్దాలంకారాల శుష్కసౌందర్యం నుంచి భావతరంగాలను ఉచ్ఛలింప చేసే నూత్న శక్తిని యీ కవిత పుంజుకోగలిగింది. అనుప్రాసకు గాని, అంత్యప్రాసకు గాని అనవసర ప్రాధాన్యతను తిరస్కరించిందే గాని, ఈ కవిత భూషణా ప్రాయతను నిరసించలేదు. కేవల భాషాభేషజము, పద బాహుళ్యత, సమాస భూయిష్ఠ శబ్ద విన్యాసము, అనవసరపు విరివి వంటివి యుగయుగాలుగా ప్రోగుపడి తెలుగు చెవికి మధురతను కాక బధిరతను ఆపాదిస్తున్నవి. కనుకనే అట్టివాని దురహంకార నిరంకుశ స్వైరవిహారాన్ని ఆధునిక ముక్తచ్ఛంద కవిత త్రోసిరాజన్నది. లయ వల్ల ఛందస్సు వల్ల గమనంలో సాధింపబడిన సరళత్వాన్ని ప్రవాహ గుర్ణాన్నీ స్వచ్ఛంద కవిత వెలివేయదు. ఆ గుణాలను దోషరహితంగా సహజంగా సాధించుకుందుకు కొత్త తెన్ను లెన్నుకుంటున్నది. సంప్రదాయిక ఛందస్సుల పగటి వేషంతోనూ మాత్రాఛందస్సుల నట్టువ నడకలతోనూ పిసరంత కవిత్వం పెద్దగా రాణించి గణాచారియై ఏలుబడి చేస్తూ వచ్చింది. ఈ బాహ్య లక్షణాలను, వేషభాషలను తొలగించుకొని అచ్చంగా, నిసర్గసుందరంగా బయటపడేసరికి ముక్తచ్ఛంద ప్రక్రియకు అసిధారా వ్రతం సిద్ధించింది. ఈ ప్రక్రియలో కవిత్వపు జయాపజయాలు తక్షణమే తెరమరుగు లేకుండా బయట పడిపోయే అవకాశం ఏర్పడటం వల్ల, కవులు తమ కవిత్వానికి కవితా లక్షణముందో లేదో పరిశీలించుకొని జాగ్రత్త వహించవలసిన అవసరం అయాచితంగా ఏర్పడింది. ఒక్కొక్కప్పుడు పర్యాయపదాల ఎన్నికకు కూడా అవకాశం ఉండదు. వాక్య నిర్మాణం శుద్ధవచన పద్ధతి నుంచి కవితా పద్ధతికి (పొయెటిక్ ఆర్డర్) మార్చుకుందుకైనా ఒక్కొక్కసారి వీలుండదు. ఇన్ని అవరోధాలలో కవితాగుణం వర్ధిల్లుతూ సాగాల్సిన యీ ప్రక్రియ సాధిస్తున్న విజయం అపూర్వమైనది.
కవిత్వానికి ఒనగూడిన యీ సిద్ధి నిజానికి ఇతరేతర బంధాల నుంచి సాధించబడిన విముక్తి వంటిది. కనుకనే ఈ ప్రక్రియా విశేషాన్ని ముక్తచ్ఛంద కవిత అని గాని స్వచ్ఛంద కవిత అని గాని అనడం సబబనిపిస్తుంది (ఫ్రీవెర్స్ లేక వర్స్ లిబ్రే). ఏ ఛందస్వరూపంలో రాయబడ్డ కవిత్వంలో నైనా ఉత్తమ కవితలూ, అనుత్తమ కవితలూ అనే విభాజ్యం తప్పనిదే! అట్లే ఈ ముక్తచ్ఛంద కవితలో కూడ ఉత్తమ కవిత, అనుత్తమ కవిత, అయోమయత వంటివి ఉండటంలో ప్రత్యేక దోషం లేదు.
బృహత్కావ్య రచన
తెలుగు కవిత్వంలో పురాణ ప్రబంధ యుగాలు చిరకాలం సాగిపోయాయి. భాషావరోధం వల్ల కావచ్చు. ప్రాచీన యుగాలలో సంస్కృతం లోని నాటకాలను కావ్యాలుగా ప్రబంధించిన బానిసత్వమే కాని నాటకాలుగా అనువదిద్దామన్న స్వేచ్ఛ మృగ్యమై పోయింది. పురాణ ప్రబంధ కావ్యాలలో కవి పరాత్మక భావసమ్యమనంతో కావ్యాలు రచించినట్లు కనిపించినా అది కేవల పరాత్మకత కాదు. అట్లే ఈ శతాబ్దిలో వ్య్కతి స్వేచ్ఛా చైతన్య ప్రాదుర్భావంగా పుట్టిన భావ కవిత కేవల స్వాత్మక (సబ్జెక్టివ్) విషాదానందాలను ప్రకటించేదిగా బహిర్ దృష్టికి కనిపించినా అది కేవల స్వాత్మక కావ్యశ్రేణి కాదు. అందులో సైతం జాతి జీవనాడులలో మ్రోగుతున్న సప్తస్వరాలూ వ్యక్తిపరంగా బహిర్గతమయ్యాయి. అలనాటి భావకవిత్వం నుంచి నేటి ముక్తచ్ఛంద కవిత్వం వరకూ స్వాత్మక (ఆత్మాశ్రయ) కవితా మార్గం తెలుగు భాషను (ఇది ఒక్క తెలుగు భాష ప్రత్యేక లక్షణమే అనుకోవడం పొరబాటు!) విడిచిపెట్టి పోలేదనీ యిది యిలాగే ఉన్నన్నాళ్ళూ మన కవిత్వం ఎదుగూ బొదుగూ లేకుండా ఉండక తప్పదనీ కొంద రాధునిక కవులంటున్నారు. ‘వస్త్వాశ్రయమైనప్పుడే కవిత్వం విజృంభించి కవి ప్రతిభ బైట పడుతుందని’ కూడా వీరంటారు. ‘బృహత్కావ్య నిర్మాణానికి అప్పుడే అవకాశం’ ఉంటుందంటారు. యీ మూడూ మూడు సమస్యలు. స్వాత్మకంగా పైకి కనిపించినదంతా కేవలాత్మాశ్రయమైనదేనా అనే ప్రశ్నకు పైన కొంత సమాధాన మీయబడింది. అట్లే వస్త్వాశ్రయమైనంత మాత్రాన అది కేవలం పరాత్మకమైన (ఆబ్జెక్టివ్) దేననీ భ్రమించ నక్కర లేదని ఆధునికాంగ్ల విమర్శకులు చాలా ప్రతిపత్తులతో పూర్వపక్షం చేశారు. ఏమైనా యిది తార్కిక శక్తియుక్తులపై ఆధారపడిన విషయం. వస్త్వాశ్రయమైనప్పుడు కవిత్వం విజృంభించి కవి ప్రతిభ బైటపడి బృహత్కావ్య నిర్మాణానికి అవకాశ ముంటుందన్నది మరొక సమస్య. వర్తమాన ప్రపంచ దేశాలలో ఏ భాషలోనూ వస్త్వాశ్రయమైన బృహత్కావ్యాలు వెలువడుతున్నట్లు ఈ వ్యాస రచయిత వినలేదు. ఐదేళ్ళ క్రితం చైనాలో పద్యకావ్యాలలో నవలలంటూ వారి సాహిత్య పత్రికలో రెండు మూడు వేశారు. వాటిమీద సైతం అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఇటీవల ఆ దేశపు కవిత్వంలో వస్తున్న పోకడలు తెలియడమే లేదు! కేవల వస్త్వాశ్రయమైనప్పుడే తప్ప కవి ప్రతిభ బయట పడదని (చూ: శ్రీ కుందుర్తి వ్యాసాలు: కొడిగట్టిన సూర్యుడు ముందుమాట) ఆధునికులలో ఒకరంటే వేరొక ఆధునిక కవి (శ్రీ బాలగంగాధర తిలక్: నవతలో వ్యాసం) సాహిత్యంలో ‘కవిత నుండీ కథా నవలా ప్రక్రియలు విడిపోవడం ఒక విశిష్ట పరిణామాన్ని సూచిస్తుంది. కవిత యొక్క నిర్వచనమూ తత్వమూ ఎప్పటికప్పుడు మారుతున్నది. విస్తృతమవుతున్నది. గంభీరమవుతోంది. ఛందస్సు, కవిసమయాలు మొదలగు సంకెళ్ళ నుండి తప్పుకొనిన కవిత ఎలాగ అచ్చమైన రూపం సంతరించుకొంటున్నదో అలాగే కథాసంవిధానమనే అనవసరపు తొడుగుని విప్పుకొని ప్రధాన అనుభూతుల ఆకృతితో దర్శనమిస్తోంది,’ అన్నాడు.
కొడిగట్టిన సూర్యుడు
నిజానికి రెండు వాదాలూ ఎదురెదురుగా నిలచి వైరుధ్యం ప్రకటించుకోవలసిన అవసరం ఉన్నవి కావు. కథన కావ్యం వల్ల తప్పితే ఆధునిక కవిత్వానికి భవిష్యత్తే లేదనే వాదనతో ఒకరు చివరకు లాగితే, వేరొకరు ఆధునిక కవిత అనేక బంధనాలను విసర్జించుకొని అచ్చమైన కవితా స్వరూపంతో నిలబడుతున్నదని, కనుక కథన సంవిధానంతో వస్త్వాశ్రయ కవిత్వానికి తిరోగమిస్తే ముక్తచ్ఛంద కవితాచ్ఛస్వరూపం మైలపడి పోతుందనీ వేరొక కొసకు లాగుతున్నారు. ఈ రెండు వాదాలూ అసలు సత్యానికి రెండు చివరి కొసలనీ, సత్యం ఈ రెండిటీ నడుమ నున్నదేననీ అభిప్రాయపడక తప్పడం లేదు. మొదటివారు తమ ఆశలకు లక్ష్య ప్రాయంగా ప్రాదుర్భవించాయని ఉగ్గడించిన ముక్తచ్ఛంద కథన కవితలు ఏవీ అంత ఆనంద దాయకం గానూ, అంత ఆమోద యోగ్యం గానూ కనిపించడం లేదు. [చాలకాలం క్రిందట రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారు జాస్మిన్ పేరుతో భారతిలో వ్రాసిన ‘మెరుపు మెరిసింది’ అనే రచనలో గాను, ‘అల్పజీవులలు’ అనే నవలలో గాని శీలా వీర్రాజుగారి ‘కొడిగట్టిన సూర్యుడి’లో ప్రదర్శితమైన కవితాశక్తి కన్న తక్కువేమీ ప్రదర్శితం కాలేదు. రాచకొండవారి పై రెండు రచనలూ అనల్ప కవితాశక్తి గల కథన కావ్యాలని చదివితే శ్రీ కుందుర్తి అంగీకరిస్తారు. అట్లే వీరి తెలంగాణా లోనూ, ఆరుద్ర సినీవాలి లోనూ, సోమసుందర్ మేఘరంజని లోనూ కథాత్మకమైన వచన గేయ సాహిత్యానికి జరగని అంకురార్పణ ‘కొడిగట్టిన సూర్యుడి’లోనే జరిగిందని సంతోషించడం గుణాత్మకమైన విమర్శ కానేరదు.]
ఏమైనా కథన కావ్యం విషయంలో తొందరపడి పాక్షిక అభిప్రాయాలను ఏర్పరచుకోవడం అంత ఆరోగ్యకరమైనది కాదు. ఉత్తమ కవితా లక్షణాలతో అట్టివి వెలువడితే స్వాగతం పలకడానికి విమర్శకులు విశుద్ధ హృదయాలతో సంసిద్ధులై ఉండటం ఉభయతారకం. అట్లే కథన కావ్యం రాకపోతే ఆధునిక కవిత ఎదుగూ బొదుగూ లేకుండా ఉండి పోతుందన్న నిరాశ్కు కూడా తావులేదు.
ఈ రెండు విరుద్ధ భావాలనూ సమన్వయం చేసుకోవడం లోనే అసలు సత్యం సాక్షాత్కరిస్తుం దనడంలో సందేహం ఉండనక్కర లేదు. ఈ వాదాన్ని పరిశీలిస్తుంటే వేరొక సందర్భంలో టి. ఎస్. ఇలియట్ అన్నమాటలు జ్ఞాపకం వస్తున్నాయి. “ప్రతివాడు కవిత గురించి మాట్లాడతాడు. కాని ఎవరూ ఒక మంచి కావ్యం రాసి చూపించరు,” అని!
----------------------------------------------------------
రచన: ఆవంత్స సోమసుందర్,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment