Sunday, February 24, 2019

వాసకసజ్జిక, విరహోత్కంఠిత


వాసకసజ్జిక, విరహోత్కంఠిత




సాహితీమిత్రులారా!

మహాశిల్పిజక్కనకావ్యములోను జక్కనాచార్యుడు నిర్మించిన వసంతమండపమందలి శిల్పముల వర్ణనలో నాయికల ప్రస్తావన యున్నది:

సీ. కనుసన్నల న్మెలఁగు కాంతుండు కడనుండ
          మనమందు నుప్పొంగు మగువ నొకట,
      విభుఁ డేగుదెంచు నా వేళకుం దొడి, సెజ్జ
          సంసిద్ధమొనరించు చాన నొకట,
      వేళకున్ రాకున్న విభునికై మనమందుఁ
          బరితపించుచు నున్న ప్రమద నొకట,
      సంకేతములఁ గాంచి స్వామి తనువందుఁ బొల
          యల్కతోఁ బతి దూఱు నతివ నొకట,
      ఆషాఢమాసాన నన్యదేశస్థుఁడగు
          పతినెంచి కృశియించు పడఁతి నొకట,
      ప్రణయకోపంబుచే వల్లభుని నెడసేసి
          విరహంబుచేఁ గుందు తరుణి నొకట,

తే. ఎదుట నటియించు మల్లిక హృదయమందుఁ
      బొదలఁజేసిన మూర్తులఁ బొదలఁజేసి
      ఱాతియందున రచియించె నాతఁడెపుడు
      క్షతిని గననట్టి శృంగారకావ్య మచట. (మహాశిల్పిజక్కనచరిత్రము 4-73)

ఇట్లు ప్రసిద్ధురాండ్రైన శృంగారనాయికలలో వాసకసజ్జిక, విరహోత్కంఠితలనుగుఱించి క్రింద కొంత విశ్లేషింతును. అంతమున వారి మనోధర్మములను ప్రతిబింబించునట్లుగా నేను వ్రాసిన గీతమును శ్రవ్యమాధ్యమములో ప్రదర్శింతును. ఇదియే ఈవ్యాసముయొక్క ఆశయము.

వాసకసజ్జిక
ప్రియాగమనవేళాయాం మణ్డయన్తీ ముహుర్ముహుః|
కేళీగృహం తథాత్మానం సా స్యాద్వాసకసజ్జికా||

అని విద్యానాథుని ‘ప్రతాపరుద్రీయము’లో వాసకసజ్జికా లక్షణనిర్దేశము. ప్రతాపరుద్రీయమునే అనుసరించిన రామరాజభూషణుని ‘ప్రియాగమవేళ గృహముఁ,దనువు సవరించు నింతి వాసకసజ్జ’ అను నిర్వచనము దీనికి సమముగనే యున్నది. ‘వాసకం వాసస్థానం సజ్జయతీతి వాసకసజ్జా’ అనియు, ‘వాసకే సజ్జా కృతమండనా’ అనియు వాసకసజ్జాపదమునకు గల వ్యుత్పత్తు లీనిర్వచనమును సమర్థించుచున్నవి. కాని ‘స్త్రీణాం వారస్తు వాసకః ’ అనియు నున్నది. ‘స్త్రీని కలిసికొనుటకు పురుషుడేర్పరచుకొన్న వారము వాసకము’ అని దీని కర్థము. ఇది ఈకాలమునందలి ‘Date’ వంటిది. పూర్వము రాజాదిధనవంతులకు బహుభార్య లుండుటచే వారిలో కొందరు స్త్రీలను వారు కొన్ని నిర్ణీత వారములలో కలిసికొనెడివారు. అట్టి వారమే వాసకము. ఆ వాసకమునందు అలంకరించుకొని సిద్ధముగా నుండు నాయిక ‘వాసకసజ్జ (సజ్జిక)’ అని ప్రతాపరుద్రీయవ్యాఖ్యాతలైన కుమారస్వామిప్రభృతులు మఱొక అర్థమును తెల్పినారు. సర్వజ్ఞ సింగభూపాలుడు రసార్ణవసుధాకరములో తనదైన ఈక్రింది శ్లోకమును వాసకసజ్జిక కుదాహరణముగా నిచ్చినాడు.

కేళీగేహం లలితశయనం భూషితం చాత్మదేహం
దర్శం దర్శం దయితపదవీం సాదరం వీక్షమాణా|
కామక్రీడాం మనసి వివిధాం భావినీం కల్పయన్తీ
సారంగాక్షీ రణరణికయా నిఃశ్వసన్తీ సమాస్తే||

తాత్పర్యము: ప్రియుడు తనగృహమునకు వచ్చు వేళ యైనది. ఆసమయమునకు నాయిక తన కేళీగృహమును, లలితమైన (మెత్తనైన, అందమైన) తన శయ్యను, తనను అలంకరించుకొనినది. ఏంతో ఆదరంతో (అనురాగంతో) మాటిమాటికి (దర్శం దర్శం) అతని దారికేసి చూస్తూ సంప్రాప్తమయ్యే వివిధకామక్రీడలను గుఱించి మనస్సులో ఊహిస్తూ, ఉత్కంఠతో (రణరణికయా) నిఃశ్వసిస్తూ ఉండిపోయినది.

ఈక్రింది పద్యంలో రామరాజభూషణుడు పురలక్ష్మికి వాసకసజ్జికాత్వము నాపాదిస్తూ తన కావ్యాలంకారసంగ్రహములో చక్కని ఉదాహరణము నిచ్చినాడు.

చ. యవనచమూసమూహముల నాజి జయించి, యుదగ్రదిగ్జయో
     త్సవవిభవాభిరాముఁడయి సారెకు నోబయనారసింహభూ
     ధవుఁ డరుదెంచులగ్నమునఁ దత్పురలక్ష్మి విభూషితోల్లస
     ద్భవన విశేషయై మృగమదద్రవవాసనఁ దాల్చు నిచ్చలున్.

తురుష్కసేనాసమూహములను యుద్ధములో జయించి, దిగ్విజయవిభూషణుడైన నోబళనరసింహరాజు వచ్చు సుముహూర్తమునకు ఆతని పురలక్ష్మి భవనము(ల)నలంకరించుకొని, కస్తూరీసుగంధయుతయై ముస్తాబయి యుండెనని పురలక్ష్మికి రామరాజభూషణుడు వాసకసజ్జికాత్వము నాపాదించినాడు. ఇట్లు శృంగారనాయికాత్వమును రమ్యముగా నాతడు జడములకును విస్తరించినాడు.

విరహోత్కంఠిత
అనాగసి ప్రియతమే చిరయత్యుత్సుకా తు యా|
విరహోత్కంఠితా భావవేదిభిః సా సమీరితా||

అని రసార్ణవసుధాకరములో విరహోత్కంఠితాలక్షణము గలదు. ‘పతిరాక తడవుండ నుత్కంఠఁ దాల్చునింతి విరహోత్క’ యను నిర్వచనము దీనికి సమముగానే యున్నది. గృహమును, దేహమును చక్కగా నలంకరించుకొని, చెలికత్తెలతో నాయకుని గుణగణములను ముచ్చటించుచు, అతని రాకకై ఎదురుచూచునట్టి వాసకసజ్జిక, అతడెంతకాలమునకును రాకపోవుటచే నుత్కంఠాపూరితయై, అతని విరహమును సహింపలేక విరహోత్కంఠిత యగును. ఇట్లీ ఉభయనాయికల మనఃస్థితులకు స్వాభావికమైన పారంపర్యమున్నది. విచిత్రమును ఉజ్జ్వలమైన వేషము, ఆనందముతో వికసించిన ముఖము, అధికమైనశోభ – వీనితో గూడి వాసకసజ్జిక తన యవస్థ నభినయించవలెనని భరతుడు చెప్పినాడు. అట్లే చింత, నిశ్శ్వాసము, ఖేదము, సఖీసంలాపము, గ్లాని, దైన్యము, అశ్రుపాతము, రోషము, భూషణత్యాగము, రోదనాదులతో విరహోత్కంఠిత తన యవస్థ నభినయించవలెనని భరతుడు తెల్పినాడు.

సంస్కృతములో అమరుకశతకము, పుష్పబాణవిలాసము,గీతగోవిందము మున్నగు ఉత్తమ ప్రణయేతివృత్త సమన్వితములగు గ్రంథములు ఈ శృంగార నాయికల అవస్థలను చక్కగా వర్ణించుచున్నవి. ఉదాహరణకు పుష్పబాణవిలాసములోని విరహోత్కంఠితవర్ణన:

సాస్రే మాకురు లోచనే విగళతి న్యస్తం శలాకాఞ్జనం
తీవ్రం నిశ్వసితం నివర్తయ నవా స్తామ్యన్తి కంఠస్రజః,
తల్పే మాలుఠ కోమలాంగి!తనుతాం హన్తాఙ్గరాగోఽశ్నుతే
నాతీతో దయితోపయానసమయో మాస్మాన్యథా మన్యథాః||

ఒక నాయిక వాసకసజ్జయై గృహమును, తనను, శయ్యను చక్కగా నలంకరించుకొనినది. ప్రియునికై వేచినది. కాని అతడెంతకును రాలేదు. అప్పుడామె కధికసంతాపము, కలవరము కలిగినది. తత్ఫలముగా అశ్రునయనయై, నిట్టూర్పులను నిగిడించుచు తల్పమునఁ బొరలసాగినది. ఇట్లు విరహోత్కంఠితయైన యామెను వారించుచు చెలికత్తె ఇట్లు పల్కినది: ‘కోమలాంగి= ఓ సుకుమారీ ! లోచనే సాస్రే మాకురు= కన్నులలో కన్నీరు గార్చకుము, న్యస్తం =పెట్టఁబడిన, శలాకాఞ్జనం=పులకతో (నాజూకుగా) దీర్చిన కాటుక, విగళతి= కరగిపోవుచున్నది; తీవ్రం= అధికమైన, నిశ్వసితం=నిట్టూర్పును, నివర్తయ=మఱలింపుము (వీడుము), నవాః =క్రొత్తనైన (అప్పుడే కోయుటవల్ల మిసమిసలాడుచున్న), కంఠస్రజః= మెడలోని పూదండలు, తామ్యన్తి=వాడిపోవుచున్నవి; తల్పే=పాన్పునందు, మాలుఠ=పొరలకుము, హన్త=అయ్యో, అఙ్గరాగః= మైపూత (makeup), తనుతాం=పలుచదనమును; అశ్నుతే=పొందుచున్నది; దయితోపయానసమయః= ప్రియాగమనవేళ, న అతీతః= (ఇంకను) మీఱి పోలేదు, అన్యథా=వేఱువిధముగా, మాస్మ మన్యథాః =తలంపకుము (చింతింపకుము).’

ఇది చాలా అందమైన శ్లోకము. ఇందులో సుకుమారి అనునది సాభిప్రాయపదము. భరతుడు చెప్పినటువంటి విరహోత్కంఠితాలక్షణము లీశ్లోకములో పుష్కలముగా నున్నవి. చివరిగా రసభావాను కూలముగా టొరంటోలోని శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు పాడిన మత్కృతమైన యీక్రిందిపాటలో, ముస్తాబు చేసికొని, కేళీగృహము నలంకరించు కొని సర్వసన్నద్ధయై వాసకసజ్జికయైన గోపిక శ్రీకృష్ణునికై వేచి, వేసారి, విరహోత్కంఠితయై, ఖిన్నయై, రోషముతో తన యవస్థను చెలితో విన్నవించుకొనుట ఇతివృత్తముగా నున్నది:

(ఆభేరిరాగం, త్ర్యస్రగతి)

పల్లవి:
ఎంత టక్కరివాడె ఈ నల్లనయ్య
స్వాంతమెల్లను దోచె, ఎంతకూ రాడయ్యె
అ.పల్లవి:
వలపుగొంటినె చాల వనితరో నీయందు
తొలియామమున వత్తు తొందరింపకు మనియె |ఎంత టక్కరి|
చరణం 1:
తొలియామ మేగెను, మలియామ మేగె
చెలువుగా నింగిలో వెలుగులం జిలుకు
కలువరాయడు నన్ను కలగించె కలగించె,
వలఱేడు తూపులం ౙళిపించె ౙళిపించె. |ఎంత టక్కరి|
చరణం 2:
పాన్పుపై జల్లిన పరిమళించెడు విరులు
సౌరభంబును బాయు సమయంబు వచ్చె,
అంగమం దలదిన అంగరాగంబు
కరగి చెల్వును దొఱగు కాలంబు వచ్చె |ఎంత టక్కరి|
చరణం 3:
ఏలరా గోపాల! ఇంత జాగేలరా?
బాస చేసియు రాక బాధింతు వేలరా?
నీవలపుతోటలో పూవూన నీరేయి
దపియించు నీయింతిదరిచేర వేలరా? |ఎంత టక్కరి|
-------------------------------------------------------
రచన: తిరుమల కృష్ణదేశికాచార్యులు, 
ఈమాట సౌజన్యంతో

No comments: