Sunday, February 17, 2019

తెలుగు భాషా ప్రాచీనత


తెలుగు భాషా ప్రాచీనత





సాహితీమిత్రులారా!

మొదట్లోనే కొన్ని సంశయాలు మనలో ఉన్నాయి. తెలుంగా? తెనుంగా? తెలింగా? ఆంధ్రమా? అంధకమా? ఈ పదాలను గూర్చి పూర్వం భాషాశాస్త్ర పరిశోధకులు చర్చించియున్నారు. ఈ పదాలు ఒక దేశాన్ని, ఒకే ప్రజను, ఒకే భాషను తెలిపేవిగా ఉండటమేకాకుండా పోలిక యేమాత్రము లేనట్టి–తెలింగ, ఆంధ్ర అనే రెండు పేర్లు తెలుగువారికి ఉండటం మరీ విచిత్రం. ఈ సంశయాలకు సరైన సమాధానం కుదర్చటానికి లోగడ అనేక ప్రయత్నాలు జరిగాయి. చారిత్రక దృక్పథంతో ఈ క్రింది పరిశీలన జరుగుతోంది.

సాధారణంగా ముందు స్థల నామాలు, ప్రాంత నామాలు, నదుల పేర్లు, కొండలపేర్లు ఇంకా స్థిరంగా వుండేవాటికి పేర్లు అచట స్థిరనివాసం చేసుకొన్న ప్రజలు పెట్టుదురు. వాటిని బట్టి ఆ ప్రజలకు కొంత దగ్గరగా ఆ పేర్లే జాతి వాచకంగానో భాషా వాచకంగానో స్థిరపడును. ఇందుకు విరుద్ధంగా కూడా కొన్ని పేర్లు గనవచ్చును. జనులు అక్కడక్కడ ఒక ప్రాంతంలో వ్యవసాయం చేసుకొంటూ స్థిరనివాసాలు ఏర్పచుకోవటం ముఖ్యము. అప్పుడే భాష యేర్పడును. ఈ విధముగా ఆంధ్రప్రదేశ్‌లో పూర్వకాలంలో గల కొన్ని ప్రాంత విభాగాలను పరిశీలిస్తే తెలింగము, ఆంధ్రము అనెడి రెండు ముఖ్య విభాగాలు గనవచ్చును. వీటిలో తెలింగము ప్రాచీనతరమై క్రమంగా గోదావరికి దక్షిణంగా కొంత విశాల ప్రాంతాన్ని తెలియచేసే పేరుగా రూఢియయ్యెను. రంగును బట్టి కృష్ణానదిలో ప్రవహించే నీరు కొంత నల్లగా వుండుట బట్టి నూతనశిలాయుగం నాటి ప్రజలు దాన్ని ‘నల్లబెణ్ణ’ అని పిలిచినట్లు, గోదావరిని ‘తెల్లబెణ్ణ’ అని పిలిచినట్లు తెలుస్తోంది. పెన్న అంటే నది. ఒక పల్లవ శాసనంలో చేజఱ్లలో కృష్ణానది ‘సితేతరబెణ్ణ’ అంటే తెల్లది కానట్టి నల్లని నీరు ప్రవహించే నది అని పేర్కొనబడెను. దీనిని బట్టి సితబెణ్ణ తెల్లని నీరు ప్రవహించే నది మఱియెక పెద్ద నదియున్నట్లు తెలుస్తోంది. అది గోదావరియే. దాని తీరంలో తర్వాత వచ్చిన పండితులు ధవళేశ్వరమనే శివలింగాన్ని ప్రతిష్ఠించారు. గోదావరిని బౌద్ధజాతక కథలో తెలివాహ అని పేర్కొనిరి. ఆ నదిని దాటి దక్షిణంగా ఆంధ్రనగరం కలదని అందులో చెప్పబడెను. కరీంనగరు జిల్లాలో కోటిలింగాల అనే ప్రాచీన నగరమే ఆ కథలో చెప్పబడిన ఆంధ్రనగరమని యిటీవల పరిశోధనల వల్ల తెలుస్తోంది. తెలివాహ నదికి (గోదావరి నదికి) దక్షిణ ప్రాంతము తెలింగము.

మాట్లాటే భాషగా (Spoken language) తెలుగు క్రీపూ. రెండువేల నాటికి కలదు.

కొన్ని ఊళ్ళపేర్లు: చొల్లంగి, మున్నంగి, తేలంగి, పోరంకి, అద్దంకి మొదలైనవి.

కొన్ని కొండల పేర్లు: నల్లగొండ, వెలికొండ, ఎఱ్ఱగొండ మొదలైనవి

కొన్ని పనిముట్ల పేర్లు: నాగల, కాడి, మేడి, కడవ, ముంత, మూకుడు మొదలైనవి.

కొన్ని నదుల పేర్లు: నల్లబెణ్ణ (కృష్ణ), తెల్లబెణ్ణ (గోదావరి), చెయ్యేఱు, ముసేఱు, అలేఱు, ఏలేఱు, కొల్లేఱు, కుదేఱు, గుణ్ణేఱు, నాగులేఱు మొదలైనవి. బండి ‘ఱ’ వచ్చే పదాలన్ని ప్రాచీన కాలంనాటి పదాలే.

కొన్ని గింజలు: గింజ, గుంజ, ఆళ్లు, చోళ్లు, రాగులు, కొఱ్ఱలు మొదలైనవి

కొన్ని పశువులు: గొడ్లు, ఆవు, ఎద్దు, గొఱ్ఱె, మేక మొదలైనవి.

చుట్టరికాలు: నాన్న, తల్లి, బిడ్డ, కూతురు, కొడుకు, పోరి, పోరగాడు.

ఇంకా – ఎండ, వాన, వాగు, వంక, కోన, కాన, పులు (గడ్డి), చెఱుకు, ఇట్లాంటి మాటలన్నీ నూతన శిలాయుగానికి చెందిన తెలింగ ప్రజలు వాడిన పదాలు. వారి అవసరాలు కూడా తక్కువే కనుక వారి పదాలు కూడా తక్కువే. ఈ పదాల్లో మనం ముఖ్యంగా గమనించతగిన పదాలు కొన్ని అప్పటికే తెలింగ భాషలో ఇతర భాషల నుండి వచ్చిచేరినట్లు తోస్తుంది. నాగలి, కాడి, మేడి అనే ముఖ్యమైన వ్యవసాయ పనిముట్లు అసలు తెలింగ పదాలని చెప్పజాలము. నాగలి అనే పదం లాంగల అనే సంస్కృత పదానికి పూర్వకాలం నాటి నాంగల అనే ప్రాకృత పదానికి తద్భవంగా తెలుగు నాగలి అయింది. బరువును బుజాన ఒక కఱ్ఱకు తగిలించి మోసేదాన్ని పూర్వం ప్రాకృతంలో ఖారి అనేవారు. అదే తెలుగులో కాడి-గా మార్పుచెందెను. మేడి అనేది గొడ్డును కట్టేసే కొయ్యగుంజ అని సంస్కృతంలో అంటారు. అదే తెలుగులో నాగలిని ఇటు అటు తప్పిపోకుండా కావలసినట్లు తిప్పుకొనే సాధనంగా తెలుగు మేడి అంటాము. వ్యవసాయానికి ముఖ్యమైన ఈ పనిముట్లు బౌద్ధుల రాక పూర్వమే తెలుగులో వాడబడినట్లు తోస్తుంది. వీటికి పర్యాయపదాలుగా అచ్చతెలుగు పదాలు ఏవో మనకు తెలియదు. బౌద్ధులు క్రీపూ. 4-3 శతాబ్దాల్లో కదా తెలుగుదేశంలోకి విస్తారంగా వచ్చింది. ఇలాగే బౌద్ధుల రాకకు పూర్వమే కొన్ని ప్రాకృతపదాలు తెలుగులో చేరాయని భావించాలి. అయినప్పటికి కొన్ని అచ్చతెలుగు పదాలుగా కొన్ని జంట పదాలు కనిపించును. గింజ-గుంజ, మొలకెత్తు ప్రాణంగలది గింజ, కేవలం జడమైంది గుంజ. వంక – నీరు పారెడి పెద్ద పల్లపు త్రోవ, లంక – వంకలో ఏర్పడిన దిబ్బ. కొండ-కోన (కొండల నడుమన పల్లపు సందు). ఇట్లా దగ్గరి సంబంధాలు కల కొన్ని జంటపదాలు ఇతర భాషల్లో కూడా కనిపించును.

కొన్ని మూల పదాలు, విభక్తి ప్రత్యయాలు, బహువచన ప్రత్యయం ‘లు’ మొదలయిన ముఖ్యభాషా పదజాలం కొంత, వాక్య నిర్మాణానికి కావలసిన విధానాలు వారికి చేతనయినంత మటుకు కూర్చుకొన్నారని ఊహించాలి. ఇందులో కొన్ని సరిహద్దుల్లో గల అన్యభాషా పదాలు చేరుచుండెను. వాటిలో ద్రావిడ పదాలు, కన్నడ పదాలు, మహారాష్ట్ర పదాలు, ఒరియా పదాలు చేరుతూ ఉండెడివి.

పైన చెప్పిన ఇంగ, ఇంగి, ఇంకి, అంక, అనే అంతరములు కల స్థలనామాలు కొన్ని కోస్తా ప్రాంతంలో కనిపించును. కలింగ, తెలింగ, రేలంగి, చొల్లంగి, కోరంగి, వేంగి, మున్నంగి, అద్దంకి, పోరంకి, తాడంకి, ఈరంకి మొదలయినవి అట్టి ప్రాచీన స్థలనామాలు. వీటిలో కొన్నిటికి అర్థము తెలియదు. కొన్నింటికి చెప్పవచ్చును. ఉదాహరణకు చోళ్లు ఎక్కువగా పండించిన చోటు చొల్లంగి, రెల్లు బాగా పెరిగినచోటు రేలంగి, మున్ను అంటే మొదటి నివాసస్థానం మున్నంగి, హద్దుగానున్న చోటు అద్దంకి, తాళ్లు బాగా పెరిగిన చోటు తాడంకి, వేయి (అనేకం) స్థావరాలు గల ప్రదేశం వేంగి, తెల్లబెణ్ణ (గోదావరి) హద్దుగా కల దేశం తెలింగ. కలింగను గూర్చి ఇప్పుడు చెప్పలేము. కలింగ-తెలింగ ఒకే ప్రాచీనతను తెలుపుచున్న ప్రదేశనామాలు. కలింగము తెల్లబెణ్ణకు ఉత్తరంగాను, తెలింగము దానికి దక్షిణంగాను గల ప్రదేశనామాలు. ఇట్లాంటి జంట ప్రదేశాలు తోసల-కోసల (దక్షిణ కోసల), అంగ-వంగ వంటివి. ఇవి సాధారణంగా ఒకదాని పక్కనే మఱియొకటి యుండును. అట్లాగే కలింగ-తెలింగ. రంగులను బట్టి కొండల పేర్లు మనకు తెలుసు –నల్లగొండ, వెలిగొండ, యెఱ్ఱగొండ. వీటిలో కొన్ని ఆయా ఊళ్ల పేర్లుగా కనిపించును. నదులను బట్టి దేశాల పేర్లు ఆ ప్రజల పేర్లు అచ్చటచ్చట కనిపించును. సింధు నదినిబట్టి సింధురాష్ట్రము, సింధిప్రజలు, సింధిభాష ప్రసిద్ధము. అట్లా తెల్లబెణ్ణ (గోదావరి)ను బట్టి తెల్లింగము (తెలింగము), తెలింగదేశము, తెలింగ ప్రజలు, తెలింగ భాష యేర్పడెను. ఇవి యెప్పుడో నాలుగువేల సంవత్సరాలకు పైబడిన కాలంలో నూతనశిలాయుగం నాటి ప్రజలు పెట్టుకొన్న పేర్లు. ఇప్పుడు కూడ నదులనుబట్టి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా మొదలైనవి మండలాల పేర్లుగా పెట్టుకొన్నాం గదా. ఇంతకు, ఇంగ, అంగి అనే పదాంతములను గూర్చి కొంత తెలుసుకోవాలి. ఆటవిక జాతులవారు ఈ పదాంతములను అప్పటి జనులు నివసించే ప్రదేశాలను నిర్దేశించేవారని కొందరు భాషావేత్తలు చెప్పుదురు (సెల్వెన్ లెవి మరికొందరు – ప్రి ఆర్యన్ అండ్ ప్రి ద్రావిడియన్ ఇన్ ఇండియా. ఫ్రెంచి భాష నుండి ఇంగ్లీషు అనువాదం ప్రబోధచంద్ర గూర్చి – 1929 పుటలు 99-). అంటే ఊరు అనే అర్థంలో ఇంగ, అంగి అనే పదాంతాలను ఆనాటి ప్రజలు కొన్నింటిని వాడేవారని తెలుస్తోంది.

భాషకు పదాలతోపాటు విభక్త్యంతాలు, వాక్య నిర్మాణం కూడా ముఖ్యము. కొన్ని వస్తువుల పేర్లను బట్టి పదజాలాన్ని కొంత ఊహించగలము. అట్లా వాక్య నిర్మాణాన్ని గూర్చి ఊహించలేము. అందుకు ముఖ్యంగా వ్రాత పూర్వకంగా ఆధారాలు దొరకాలి. క్రీస్తు పూర్వం ముడో శతాబ్దంనాటి మౌర్య చక్రవర్తి అశోకుడు వ్రాయించిన శిలా లిపులే మొదటి లిఖిత నిదర్శనాలుగా తెలుస్తోంది. అంతకుముందు కూడా ఆపస్తంబుడు, బోధాయనుడు, చావరి వంటి వారు రచించిన వైదిక సూత్ర వాఙ్మయం లభిస్తున్నప్పటికి అది తెలుగు భాషకు సంబంధించినది కాదు. అశోకుని నాటి ధర్మలిపులు ఉత్తరదేశానికి చెందిన ప్రాకృత భాషకు చెందినవి. కాగా అంతకు కొంచెం ముందు-వెనకదిగా చెప్పబడిన గుంటూరు జిల్లాలోని భట్టిప్రోలు స్తూపంలో దొరికిన స్పటికపు బరిణెల మీదనున్న అక్షరాలలో కొన్ని అచ్చతెలుగు ఆనవాళ్ళు కనిపిస్తున్నవి. వాటిలో ఇప్పటి తెలుగు ‘ళ’ అక్షరం భట్టిప్రోలు అక్షరానికి పరిణామమే. అలాగే ద అనే అక్షరము. హల్లుల పైన ఉండే తలకట్టుకు మూలము భట్టిప్రోలు శాసనం నాటి తెలుగక్షర ఛాయలు అంతరించెను. ఈ విధంగా క్రీస్తు పూర్వం మూడోశతాబ్దం నాటికి తెలుగుభాషకు అశోకుడి నాటి బ్రాహ్మీలిపి కంటే కొంత భిన్నంగా వేఱొక లిపి ఉండేదని తోస్తోంది (ఎ.పి. ఇండికా – బూలర్ వ్యాసం పు. 360) కాని ఆ లిపితో వ్రాయబడిన శాసనాలు బౌద్ధయుగంలో వచ్చిన బ్రాహ్మీలిపిలో కలిసిపోయి ప్రాకృత భాషలో వ్రాయబడిన శాసనాలే మనకు లభిస్తున్నాయి. ఈ పరిణామానికి పూర్వపు దశను గురించి ఆచార్య సాళ్వకృష్ణమూర్తిగారు వారి హిస్టరి ఆఫ్ తెలుగు లిటరేచర్ అనే గ్రంథంలో విపులంగా చర్చించిరి.

బౌద్ధయుగము: క్రీపూ. 3వ శతాబ్దం నుండి క్రీశ. 4వ శతాబ్దాంతం వరకు బౌద్ధ మత వ్యాప్తివల్ల తెలుగుదేశంలో వచ్చిన అనేక మార్పులలో భాషలో ప్రాంతీయపదాలు చాలా వచ్చిచేరుట, బ్రాహ్మీలిపి స్థిరపడుట ముఖ్యమయినవి. క్రీపూ. మూడు-రెండు శతాబ్దుల నాటి నుంచి వ్రాయబడిన అమరావతి శాసనాలను పరిశీలిస్తే కొన్ని గ్రామాల పేర్లు, కొందరు వ్యక్తుల పేర్లు, జాతుల పేర్లు విడిస్తే మిగిలిన భాగమంతా పాలీభాషలోనో వేఱొక ప్రాకృత భాషలోనో ఉండును. అప్పుడప్పుడే వ్రాతకు వీలైన తెలుగుభాష బౌద్ధ ప్రాబల్యం వల్ల అణగారిపోయి కొంచెం చదువనేర్చిన, వ్రాయనేర్చిన విద్యావంతుల్లో అశోకచక్రవర్తి ప్రవేశపెట్టిన బ్రాహ్మీలిపి ప్రాకృతభాషలలోకి వ్యాపించి, జనసామాన్యంలో తెలుగు మాట్లాడు భాషగా మిగిలియుండెను. కొన్ని వందల పాళీపదాలు తెలుగులో ప్రవేశించి తత్సమాలుగా, తద్భవాలుగాను రూపొందెను. శ్రీ చీమకుర్తి శేషగిరిరావుగారు తమ తెలుగులో పాళీపదాలు అనే పుస్తకంలో అలాంటి 239 పదాలను సంగ్రహించారు. ఇంకా అనేక పదాలు కలవు.

గౌతమ బుద్ధుడి ఆదేశానుసారంగా ప్రజలు మాట్లాడే భాషలో ధర్మబోధన జరగాలి అనే సూచనను బట్టి కొన్ని పిటక గ్రంథాలు అంధక (తెలుగు), తమిళ భాషల్లోకి అనువదించబడినట్లు క్రీశ. 4వ శతాబ్దినాటి బుద్ధఘోషాచార్యుడు తన పపంచసూదని యను వ్యాఖ్యాన గ్రంథంలో చెప్పినట్లు శ్రీ శేషగిరిరావుగారి పుస్తక పరిచయ వాక్యాల్లో వ్రాసిరి. బౌద్ధయుగంలో అంధక భాష ఒకటి ఆనాటి గ్రాంథికభాషగా రూపొందినట్లు తెలుస్తోంది. ఆ గ్రంథాలుగాని ఆ భాషకాని మనకు లభ్యమగుటలేదు. కాగా హాలసాతవాహన చక్రవర్తి సంకలనం చేసిన గాథాసప్తశతిలో అనేక తెలుగు పదాలను శ్రీ తిరుమల రామచంద్రగారు తమ గాథా సప్తశతిలో తెలుగు పదాలు అను పుస్తకంలో (హైదరాబాదు, 1988) చూపించారు. అలాగే గుణాఢ్యుడనే సాతవాహన చక్రవర్తి ఆస్థానవిద్వాంసుడు రచించిన బృహత్కథ యనెడి గ్రంథంలో కూడా కొంత ప్రాచీన తెలుగు ఛాయ కలదని పరిశోధకులు భావించిరి. ఆ గ్రంథము కూడా దొరకదు.

బౌద్ధులకాలం నాటి అంధక భాషలోని వాఙ్మయం నశించెను. కాగా సాతవాహన చక్రవర్తులు కొందరు క్రీశ. 1, 2 శతాబ్దులలో తమ టంకసాలలందు కొన్ని నాణాలను ప్రాకృత-తెలుగు భాషలలో తమపేర్లతో ముద్రించిరి. వాటి అనుకరణను గూర్చి డా. ఇ. కార్తికేయశర్మగారు తమ సాతవాహన కాయినేజ్ అనే గ్రంథంలో చూపిరి. ఆనాడు షష్ఠీ విభక్తి ప్రత్యయం ‘కు’ అని యుండెను. యొక్క – అనే ప్రత్యయము తరువాత కాలంలో వచ్చింది. పులుమావి అనే సాతవాహనరాజు ఇచ్చిన నాణెముపైన ‘పులిమావి యొక్క’ (నాణెము) అనుటకుగాను ‘పులుమావికు’ అని యుండెను. ప్రాకృతంలో పులుమావిస అని యుండును. అలాగే సాతకణిస అనే ప్రాకృతానికి సాతకణికు అని – కు అనే షష్ఠీ విభక్తి ప్రత్యయమును వాడిరి. దీనినిబట్టి సాతవాహనుల కాలం నుండి క్రీస్తు శకారంభకాలం వరకు ప్రాకృత, సంస్కృత పదాల నుండి తెలుగులో అనుకరిస్తూ వ్రాయటం కూడ జరిగేదని తెలుస్తోంది.

గాథాసప్తశతి క్రీశ. 1వ శతాబ్దం నాటి సాతవాహన హాలుడు సంకలనం చేసింది. ఇందులో కొన్ని తెలుగు పదాలు ప్రాకృతంలోకి మార్చబడియున్నవి. వాటిలో అత్త, పొట్ట, అద్ద, తుష్ట (నెయ్యి), వెంటి (గడ్డి చుట్ట), ఓ (సంబోధన వాచకం), వోడ (అంగ వైకల్యముగల, అవిటి, వోటికుండ ఇత్యాది ప్రయోగాల్లో); మ ఇల (మలినమైన) తీర (తీరిక); చోజ్జం (చోద్యం); పలాలు (గింజలు లేనట్టి గడ్డి). ఇట్లాంటివి అనేక పదాలు తెలుగు పద ఛాయలు గలవని శ్రీ తిరుమల రామచంద్రగారు చూపెట్టిరి. ఇంకా తెలుగు సంస్కృతికి సంబంధించిన నాటకాలు, గేయాలు మొదలయినవికూడా గాథాసప్తశతిలో ప్రస్తావింపబడినట్లు వారు చూపిరి.

క్రీశ. 4వ శతాబ్దం మధ్యకాలం నుండి భారతదేశ సంస్కృతిలో గొప్ప మార్పువచ్చెను. గుప్త చక్రవర్తులు మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు పరాక్రమశాలురై సామ్రాజ్యనేతలవ్వడమే కాక జైన, బౌద్ధముల ప్రాబల్యం వల్ల క్షీణించనున్న పౌరాణిక మతమును ఉద్ధరించడానికి పండితుల ద్వారా పురాణ వాఙ్మయమును జన సామాన్యమునకు అందించుటకై అనేక విధములుగా ప్రయత్నించిరి. ఆ ప్రయత్నములోని భాగముగానే సముద్రగుప్తుడు ఆంధ్రదేశముపై దండయాత్ర సాగించి అనేకమంది చిన్న చిన్న రాజులను తొలగించి సాలంకాయన, పల్లవ రాజ్యాలను మాత్రము నిలబెట్టి వారి ద్వారా తాము చేబట్టిన పురాణధర్మ వ్యాప్తికై దోహదమిచ్చిరి. అందులో భాగంగా బౌద్ధుల పాలీభాషను తొలగించి సంస్కృత భాషను ప్రోత్సహించిరి. దాని ఫలితంగా తెలుగుదేశంలో ప్రాకృత శాసనాలు వేయించుట అంతరించి సంస్కృత శాసనాలు వ్రాయించుట, బౌద్ధ స్తూపాల నిర్మాణం పోయి పౌరాణిక దేవుళ్లకు ఆలయాలు నిర్మించుట యెక్కువయ్యెను. అనేక గ్రామాల పేర్లు సంస్కృతీకరింపబడెను. అనేక వందల సంస్కృత పదాలు తత్సమాలుగా, తద్భవాలుగా తెలుగుభాషలో చేరెను. పూర్వపు అచ్చతెలుగు పదాలకంటే యీ కొత్త పదాలే అధికమయ్యెను. నిజానికి మనమిప్పుడు అచ్చతెలుగు పదాలలో మాట్లాడలేమనిపిస్తుంది. నన్నయభట్టు పెట్టిన వరవడిలోనే తరువాత కవులందరూ తమ రచనలు సాగించిరి. అదే విధంగా తాళ్లపాక, రామదాసు, త్యాగరాజు వంటి మహావాగ్గేయకారులు తెలుగుభాషకొక చెప్పలేనంత సొంపుదనాన్ని అన్ని విధాలుగా సమకూర్చిరి.

‘ఆంధ్రత్వమాంధ్రభాషాచ నాల్పస్య తపసః ఫలం’ అని అప్పయదీక్షితులు వంటి మహావిద్వాంసుడి పొగడ్తకు పాత్రమయింది ఆంధ్రభాష (అంటే తెలుగుభాష).

ముగింపు:

క్రీస్తు పూర్వం కనీసం రెండువేల సంవత్సరాల క్రిందటనే తెలింగము మాట్లాడు భాషగా ఉండేది. భట్టిప్రోలు శాసన కాలానికి, అంటే క్రీపూ. 3వ శతాబ్దం నాటికి తెలింగమును అజంత భాషగా వ్రాతకు అనుకూలంగా చేసుకొనిరి. బ్రాహ్మీలిపి పోలిన మఱియొక లిపి యుండెనని కూడా బూలర్ అభిప్రాయపడెను. వ్రాత భాషగా రూపొందించుటకు చాలా ప్రయత్నము చేసినట్లు ప్రాచీన తెలుగు శాసనాలు సూచిస్తున్నవి. ప్రాకృత – సంస్కృత ప్రభావాలవల్ల అనేక పదాలు తెలింగభాషలో చేరి అంధక, లేక ఆంధ్రీ అనబడిన ఆంధ్రభాష అను వ్యవహారము బౌద్ధ సంపర్కము వల్ల వచ్చెను. ఎన్ని మార్పులు వచ్చినా అజంతత్వాన్ని వదులుకోకుండ సహజమైన సొంపుదనాన్ని నిలుపుకొన్నారు ఆనాటి తెలింగులు. అంటే ‘వనం’ అనే సంస్కృత పదాన్ని ‘వనము’ అని అజంతంగా వ్రాసేవారు. ఈ విధంగా సాహిత్యానికి, సంగీతానికి అనువైన భాషగా రూపొందింది తెలుగు. ఇప్పుడు మఱల తిరోగమన మార్గంలో పయనిస్తున్నాము.
----------------------------------------------------------
రచన: పి. వి. పరబ్రహ్మశాస్త్రి, 
ఈమాట సౌజన్యంతో

No comments: