Thursday, February 28, 2019

నౌషాద్‌


నౌషాద్‌



సాహితీమిత్రులారా!

చాలా ఏళ్ళ కిందట నేనెరిగిన ఒక అయోమయపు పెద్దాయనకు నేను చెప్పినదాకా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనేవాడొకడు ఉంటాడని తెలియదు. ఆయన ఎన్నో ఏళ్ళుగా పాటలు విని ఆనందించేవాడు కాని అవన్నీ సుశీలా, ఘంటసాలా తదితరులంతా తమంతట తాముగా “అనుకుని” పాడుతున్న పాటలనుకునేవాట్ట. తరవాతి తరాల శ్రోతలకు మాత్రం వివిధ్‌ భారతి ప్రసారాల ధర్మమా అని ప్రతి సినిమా పాటకూ రచయిత ఎవరో, సంగీత దర్శకుడెవరో తెలుసుకునే అవకాశం కలిగింది. అంతకు ముందు రేడియో సిలోన్‌ ద్వారా పాటలు పాప్యులర్‌ అయాయి కాని ఈ వివరాలు తెలిసేవి కావు. పేర్లు తెలియడంతో బాటు పాటలను రూపొందించేవారి గురించిన సమాచారం కూడా అందుబాటులోకి వచ్చింది. ఉత్తమ సినీ సంగీతదర్శకుడికి సంగీతాన్ని గురించి కేవలం శ్రవ్యపరమైన అవగాహన ఉండడమే కాక సంగీతం దృశ్యపరంగా, భావపరంగా, ప్రేక్షకులపై ఎటువంటి ప్రభావం కలిగిస్తుందో కూడా బాగా తెలుస్తుంది. తన సినిమాలకు తానే సంగీతం సమకూర్చుకున్న మేధావి సత్యజిత్‌ రాయ్‌ ఒక సందర్భంలో సినీ సంగీతం గురించి చెపుతూ “నేపథ్య సంగీతం దర్శకుడు తెర మీద వ్యక్తీకరించదలుచుకున్న విషయాన్ని అండర్‌లైన్‌ చెయ్యాలి” అన్నాడు.

మంచి సంగీతదర్శకుడికి (కనీసం ఆనాటి స్వర్ణయుగంలో) తెలియవలసిన ఇంకా అనేక విషయాలున్నాయి. పాటలో కవి చెప్పదలుచుకున్న భావాలూ, కథలోనూ, సన్నివేశంలోనూ ఇమిడిపోయే ట్యూన్‌ నిర్మాణమూ, గాయనీగాయకుల పటిమను వెలికితీసే ప్రతిభా, వివిధ వాయిద్యాల అనుకూలతలూ, మొత్తంమీద వినేవారికి కలగవలిసిన ఆడియో ప్రభావమూ వీటిలో ముఖ్యమైనవి. ఇవికాక ట్యూన్‌ తన కాళ్ళమీద తాను నిలబడగలగాలి. ఉదాత్తత కోల్పోకుండా, చవకబారు అనిపించకుండా, ఆధునికం అనిపిస్తూనే ప్రజాదరణ పొందాలి. సినిమా ఆడినా ఆడకపోయినా పాట కలకాలం నిలవాలి. (నీలిమేఘాలలో పాట తెలియని తెలుగువారుండరు. బావ మరదళ్ళు సినిమా గురించి ఎంతమందికి తెలుసు?)

2006 మే 5వ తేదీన బొంబాయిలో 87 ఏళ్ళ వయసులో కాలం చేసిన నౌషాద్‌ కొన్ని దశాబ్దాలుగా ఎనలేని గౌరవం పొందాడు. అతను మరణించినప్పుడు అతని జీవిత విశేషాలను గురించి వివరంగా రాయని పత్రిక లేదు. ఏ షారుఖ్‌ఖాన్‌ లేదా అమితాభ్‌ బచ్చన్‌ పెంపుడు కుక్కకో జలుబు చేసినప్పుడు మాత్రమే హడావిడి పడిపోయి, అదొక ముఖ్యవార్తలాగా కవర్‌ చేసే బొంబాయి జర్నలిస్టులందరూ ఏనాడో మరుగునపడిపోయిన నౌషాద్‌ గురించి ప్రత్యేకవ్యాసాలు రాశారు. అందుకు కారణమేమిటి? నౌషాద్‌ను హిందీ సినిమా సంగీతానికి ఆదిపురుషుడనలేం. అందరికన్నా ఎక్కువ పాటలను స్వరపరచాడనీ కాదు. డబ్బు సంపాదనపరంగా కాని, పాప్యులారిటీని బట్టిగాని అతనికి అగ్రస్థానం లభించదు. ఇతర సంగీతదర్శకులలో అతనికున్న ప్రత్యేకత ఎటువంటిది? నౌషాద్‌ జీవితవిశేషాలను చాలా పత్రికలు ప్రచురించాయి కనక వాటి గురించి మళ్ళీ వివరంగా చెప్పుకో నవసరంలేదేమో. అతని సంగీతపు విశిష్టతను గురించి నా అభిప్రాయాలను పంచుకోవడమే ఈ రచన యొక్క ఉద్దేశం. తక్కిన ప్రొఫెషనల్‌ రంగాలలాగే సినిమా సంగీత దర్శకులు ఒకవంక గత వైభవాన్నీ, తమ పాత పాటలకు లభిస్తున్న ఆదరణనూ అస్వాదిస్తారు కాని వర్తమానకాలంలో చేతినిండా పని ఉన్నవాడిదే విజయం అనే భావన వారిని వెన్నాడుతుంది. 85 ఏళ్ళు దాటాక 2005లో తాజ్‌మహల్‌ అనే సరికొత్త సినిమాకి సంగీతాన్నందించిన నౌషాద్‌ అజయ్‌ చక్రవర్తి, హరిహరన్‌ మొదలైనవారి చేత పాడించిన పాటలు ఆనందాన్నీ, ఆశ్చర్యాన్నీ కూడా కలిగిస్తాయి. మియాఁ మల్హార్‌ మొదలైన జటిలమైన శాస్త్రీయ రాగాల్లో ఆయన మధురమైన బాణీలు కట్టాడు.

మనదేశపు సినిమాల్లోని అనేక అవాస్తవిక అంశాల్లో ముఖ్యమైనది సంగీతం. వాస్తవికతను మరిచిపోగలిగితే మన సినిమాపాటలకు సినిమాలతో సంబంధం లేనటువంటి ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. అది ప్రజల సంగీతంగా నిత్యజీవితంలో ఒకప్పటి జానపద సంగీతపు స్థానాన్ని ఆక్రమించేసింది. కొన్ని మంచి సినిమాపాటలు సంప్రదాయ సంగీతాన్ని పోలిన “శాశ్వతత్వం” సంపాదించుకున్నాయి. మనదేశపు సంగీతంతో సంపర్కం కోల్పోనంతవరకూ, లేదా పూర్తిగా విడనాడనంతవరకూ ఇటువంటివాటికి త్వరలో మరుగున పడే ప్రమాదం ఉండదు. మన సంగీత సంప్రదాయాలకు ప్రాంతీయ భేదాలున్నాయనేది తెలిసినదే. రకరకాల భారతీయ భాషల్లోని సినిమా పాటలు ఈ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఇవన్నీ పాత బాణీలకు కొత్త సంగీతరూపంలో కొన్ని దశాబ్దాలనుంచీ దేశంలో ప్రతి మూలకూ శ్రోతలకు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు ప్రతి ప్రాంతంలోనూ ముస్లిం మతస్థులూ, హిందీ, ఉర్దూ భాషలు తెలిసినవారూ ఉండడంతో వీటిలో ఎక్కువ ప్రాచుర్యం పొందినవి హిందీ సినిమాపాటలే. దాదాపు 70 ఏళ్ళ క్రితం టాకీలు మొదలైనప్పటి నుంచీ మన దేశపు సినిమాల్లో సంగీతం ప్రధాన ఆకర్షణ అయింది. మొదట కలకత్తా, తరవాత బొంబాయి, మద్రాసు వగైరా నగరాల్లో పెద్ద ఎత్తున మొదలైన చిత్రనిర్మాణంతో బాటు సంగీతదర్శకులూ, గాయనీగాయకులూ, వాద్యకారులూ అందరూ పేరు సంపాదించి, పరిశ్రమలో ప్రధాన అంశం అయిన సంగీతాన్ని అందించసాగారు. వీరిలో నౌషాద్‌ ముఖ్యుడు.

సినిమా సంగీతానికి పితృసమానుడని అనిల్‌ బిశ్వాస్‌ను ఎవరో పొగడబోతే ఆయన వారిస్తూ ఆ బిరుదుకు నిజంగా అర్హుడైనవాడు ఆర్‌. సీ. బోరాల్‌ అనీ, తనను కావాలంటే పినతండ్రిగా అనుకోవచ్చనీ ఛలోక్తి విసిరాడు. 1937 ప్రాంతాల్లో తానొక యువకుడుగా ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి బొంబాయికి వచ్చినప్పటికే అనిల్‌ బిశ్వాస్‌ సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నాడని నౌషాద్‌ ఒక సందర్భంలో చెప్పాడు. ప్లేబాక్‌ లేని ఆ రోజుల్లో ఔట్‌డోర్‌ షూటింగ్‌ చూడటానికి నౌషాద్‌ కొత్తగా వెళ్ళినప్పుడు ఏదో సినిమాకి ట్రాలీ షాట్‌ తీస్తున్నారట. అక్కడ అనిల్‌ బిశ్వాస్‌ ఆర్కెస్ర్టాని కండక్ట్‌ చేస్తూ, వెనక్కి నడుస్తూ గోతిలో పడ్డాడట. తబలాలూ, హార్మోనియం అన్నీ మెడల్లో కట్టుకుని వాయిస్తూ అందరూ మైక్‌ రేంజ్‌ని దాటకుండా ఉండవలసి వచ్చేదనీ, ప్లేబాక్‌తో ఆ పరిస్థితులు మారాయనీ నౌషాద్‌ వివరించాడు. అతని శకం అటువంటి రోజుల్లో మొదలైంది. అప్పట్లో బెంగాలీ పద్ధతిలో కలకత్తాలో తయారైన సంగీతానిదే పెద్దపీట. కొంత శాస్త్రీయం, కొంత స్థానిక జానపదం, కొంత రవీంద్ర సంగీత్‌ కలిసిన ట్యూన్లు బోరాల్‌, తిమిర్‌ బరన్‌, పంకజ్‌ మల్లిక్‌ మొదలైన నిష్ణాతుల చేతుల్లో జనాదరణ పొందిన సినిమాపాటలుగా అందరినీ ఆకట్టుకోసాగాయి. వీటిలో ఈడుస్తూ, సాగదీస్తున్నట్టు వినబడే బెంగాలీ గాత్రధోరణిని తొలగించినవాడు కె.ఎల్‌.సైగల్‌. తెలుగులో ఘంటసాలలాగా తానున్నంత కాలమూ పోటీ అనేది లేకుండా సాగిన అతని జైత్రయాత్ర అపూర్వమైనది. అప్పట్లో బొంబాయిలో కొందరు పంజాబీ, ఉత్తరాది శైలిలో ట్యూన్లు చెయ్యగలిగిన సంగీత దర్శకులుండేవారు కాని సైగల్‌తో సరితూగగలిగిన గాయకులు లేరు. ఒకప్పుడు హిందీ సినిమా గాయకుల్లో మకుటంలేని మహారాజుగా వెలిగినవాడతను.

యువకుడుగా నౌషాద్‌

కె.ఎల్‌.సైగల్‌ బొంబాయికి తన నివాసం మార్చుకున్నాక 1946లో షాజహాన్‌ చిత్రంలో నటించాడు. దానికి సంగీత దర్శకుడు నౌషాద్‌. అప్పటికే నడివయస్సు పోకడలతో, అనారోగ్యంతో కనిపించే సైగల్‌ ఆ సినిమాలో ఒక కవి పాత్రలో కనిపిస్తాడు. అతని ప్రేమ సఫలం కూడా కాదు. అయినా ఈ నాటికీ ఆ సినిమాలో చెప్పకోదగినవల్లా సైగల్‌ పాటలే. కుర్రతనంలో నౌషాద్‌ బొంబాయి చేరినప్పటికే సైగల్‌ చాలా పెద్ద స్టార్‌. నేను విన్న ఒక ఇంటర్‌వ్యూలో ఏదో సందర్భంలో మొదటిసారిగా తనకు బట్టతలతో కనిపించిన సైగల్‌ను గుర్తించలేకపోయానని నౌషాద్‌ చెప్పాడు. తన పేరు విని విస్తుపోయిన నౌషాద్‌ను చూసిన సైగల్‌ నవ్వి “సినిమాల్లో నువ్వు చూసేది నా విగ్గు నాయనా” అన్నాట్ట. తరవాత షాజహాన్‌ చిత్రం రికార్డింగ్‌కి తాగి వచ్చిన సైగల్‌తో నౌషాద్‌కు నానా ఇబ్బందులూ కలిగాయట. పైగా పాట బాగా రావటానికి సైగల్‌ తన డ్రైవర్‌ను పిలిచి “కాలీ పాంచ్‌” పట్టుకురమ్మన్నాడట. హిందూస్తానీ సంగీతంలో “కాలీ పాంచ్‌” అంటే ఆరున్నర శ్రుతి. సైగల్‌ భాషలో అది “మందు” సీసాకు ముద్దుపేరు. ఆ ప్రయత్నాన్ని వారిస్తూ నౌషాద్‌ ఆ మర్నాడు తాగకుండా రమ్మని సైగల్‌ను బతిమాలుకున్నాట్ట. మైకం లేకుండా పాడిన తన పాటలన్నీ బాగా వచ్చాయని గమనించిన సైగల్‌ నౌషాద్‌తో “నీవంటి యోగ్యుడు నాకు మునుపే పరిచయమై ఉంటే బావుండేది” అన్నాట్ట. ఆ సినిమాలో రూహీ మేరే సప్నోంకీ రానీ అనే పాటలో చివరి పంక్తి సైగల్‌తో పాడతానని కోరిన అప్పటి యువగాయకుడు రఫీ గొంతు కూడా ఆ పాటలో వినిపిస్తుంది. అందులో (సింధు) భైరవిలో సైగల్‌ పాడిన జబ్‌ దిల్‌ హీ టూట్‌గయా అనే పాట సైగల్‌కు ఎంత ఇష్టమంటే ఆయన చివరి కోరిక ప్రకారం అంత్యక్రియల సందర్భంలో నౌషాద్‌ తన ఆర్కెస్ర్టా చేత ఆ ట్యూన్‌ వాయింపించాడట. అస్తమిస్తున్న సైగల్‌ తేజం, ఉదయిస్తున్న నౌషాద్‌ ప్రతిభా కలిసిన అద్భుత సమ్మేళనాన్ని షాజహాన్‌ పాటల్లో మనం చూడవచ్చు.

షాజహాన్‌ చిత్రంలో సైగల్‌

1919లో లక్నోలో జన్మించిన నౌషాద్‌ అలీ కుటుంబంలో సంగీతం ప్రసక్తి ఉండేదికాదు. చిన్నప్పుడు మూకీ సినిమాలకు సందర్భాన్నిబట్టి తెర ఎదుట కూర్చున్న వాద్యబృందం సంగీతం వాయిస్తూంటే అతను ముగ్ధుడై వినేవాడట. హార్మోనియం రిపేర్లతో మొదలైన అతని సంగీతపు పిచ్చి క్రమంగా బలపడటంతో 1937 ప్రాంతాల పద్ధెనిమిదేళ్ళ వయసులో తండ్రిని ఎదిరించి బొంబాయికి పారిపోయి వచ్చేశాడు. అక్కడ కొత్తలో కాలు నిలదొక్కుకునేందుకు అతను చాలా అవస్థలు పడవలసివచ్చింది. ఆ వివరాలన్నీ నౌషాద్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

(http://www.indianmelody.com/naushadarticle1.htm)

పియానిస్టుగానూ, అసిస్టెంట్‌ సంగీతదర్శకుడుగానూ సినిమాల్లో పని మొదలుపెట్టిన నౌషాద్‌కు గురువు వంటివాడు ఖేమ్‌చంద్‌ ప్రకాశ్‌. మహల్‌ చిత్రంలో 1949లో లతా పాడిన ఆయేగా ఆయేగా పాటతో ఈనాటికీ అందరికీ గుర్తున్న ఖేమ్‌చంద్‌ ప్రకాశ్‌ అంతకుముందు కె.ఎల్‌.సైగల్‌ నటించిన తాన్‌సేన్‌ మొదలైన ఎన్నో సినిమాలకు చక్కని సంగీతం అందించాడు. 1950లో తన 43వ ఏటనే చనిపోయిన ఖేమ్‌చంద్‌ ప్రకాశ్‌ సంగీతపు ఛాయలు కొన్ని నౌషాద్‌ పాటల్లో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు మహల్‌లో లతా పాడిన ముష్కిల్‌ హై బహుత్‌ ముష్కిల్‌ అనే పాట ఆ తరవాత బైజూబావ్‌రా కోసం నౌషాద్‌ చేసిన బచ్‌పన్‌కీ ముహబ్బత్‌కో అనే పాటకు మాతృకలాగా అనిపిస్తుంది.

ఖేమ్‌చంద్‌ ప్రకాశ్‌

సితార్‌ విద్వాంసుడైన రవిశంకర్‌ తన పుస్తకంలో “సినిమా సంగీతమంతా తక్కువ రకమైనది కాదు. అందులో నౌషాద్‌వంటి ప్రతిభావంతులు కొద్దిమంది ఉన్నారు” అని రాశాడు. ముగలే ఆజంలో తాన్‌సేన్‌కు బడే గులామలీ చేత ఖయాల్‌ పద్ధతిలో పాడించడాన్ని మాత్రం తప్పుపట్టాడు. పదహారో శతాబ్దంలో ఖయాల్‌ పద్ధతి ఇంకా మొదలుకాలేదనేది తెలిసిన సంగతే. బైజూ బావ్‌రాలో అమీర్‌ఖాన్‌ చేత పాడించినప్పుడు కూడా అదే పొరపాటు జరిగిందని చెప్పవచ్చు. అందులో పతాక సన్నివేశంలో పోటీకి బైజూకు డి.వి.పలూస్కర్‌, తాన్‌సేన్‌కు అమీర్‌ఖాన్‌ పాడారు. టైట్‌ల్‌ సంగీతానికి కూడా అమీర్‌ఖాన్‌ చేత పూరియా ధనాశ్రీ (పంతువరాళిని పోలినది) రాగంలో పాడించారు. షబాబ్‌లో మళ్ళీ అమీర్‌ఖాన్‌ ముల్తానీ రాగంలో ఒక ఖయాల్‌ పాడాడు. ఇవన్నీ నౌషాద్‌ పెద్ద గాయకులతో చేసిన మంచి ప్రయత్నాలు. ఇదికాక నౌషాద్‌ ఆర్కెస్ర్టాలో ఇమ్రత్‌ఖాన్‌, రయీస్‌ఖాన్‌ వంటి మేటి సితార్‌ విద్వాంసులూ, రామ్‌నారాయణ్‌వంటి సారంగీ నిపుణులూ, శివకుమార్‌ శర్మవంటి ఉత్తమ సంతూర్‌ వాయిద్యకారులూ అనేకసార్లు పాల్గొన్నారు. బడే గులామలీని తాను మొదట సంప్రదించినప్పుడు ఆయన పాడటానికి నిరాకరించాడనీ, ముగలే ఆజం దర్శకుడైన కె. ఆసిఫ్‌ మాత్రం తన మొండిపట్టు వదలలేదనీ నౌషాద్‌ ఒక ఇంటర్‌వ్యూలో చెప్పాడు. “ఇదెక్కడి గొడవయ్యా బాబూ, నేను ఏకంగా పాతిక వేలిమ్మని అడుగుతాను, మీ డైరెక్టర్‌ పారిపోతాడు” అన్నాట్ట ఉస్తాద్‌గారు. అయినా నౌషాద్‌ చెప్పినట్టే జరిగింది. కోరినంతా ఇచ్చి ఆసిఫ్‌ ఆయన చేత పాడించాడు.

ఇతర సంగీత దర్శకులకు నౌషాద్‌ అంటే చాలా గౌరవం. 1950లలో హిందీ సినీ సంగీత దర్శకులందరూ ఎక్కడ కలుసుకున్నా నౌషాద్‌ గురించే చెప్పుకునేవారట. సచిన్‌ దేవ్‌ బర్మన్‌ “మేమంతా ట్యూన్లు ఎలా కట్టాలో నౌషాద్‌ను చూసే నేర్చుకున్నాం” అన్నాడు. బర్మన్‌ ఇంటో పనివాడొకడు అస్తమానమూ నౌషాద్‌ పాటలనే కూనిరాగాలు తీసేవాడట. “ఏరా, నీకు నా పాటలు నచ్చవా?” అని అడిగితే “ఇష్టమే కాని నౌషాద్‌ పాటలు ఇంకా ఎక్కువ ఇష్టం” అనేవాడట. అలాగే తెలుగు కంపోజర్ల మీద నౌషాద్‌ ప్రభావం బాగా ఉండేది. సి.ఆర్‌.సుబ్బరామన్‌ లైలామజ్నూలో ఆర్‌. బాలసరస్వతి చేత పాడించిన ఏల పగాయే అనే పాట సాక్షాత్తూ నౌషాద్‌ హిందీ పాటలాగే ఉంటుంది. అలాగే నౌషాద్‌ స్ఫూర్తితో పెండ్యాల తదితరులు చేసిన పాటలు ఎన్నో ఉన్నాయి. వేదికమీద నౌషాద్‌ ఉన్నప్పుడు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ గౌరవంకొద్దీ అతని పక్కన కూర్చోకుండా నిలబడే ఉండేవాడు. ప్రసిద్ధ మలయాళ సినీ సంగీతదర్శకుడు దేవరాజన్‌, కన్నడంలో విజయభాస్కర్‌ కూడా నౌషాద్‌ ప్రభావానికి గురిఅయినవారే.

నావంటి తెలుగువాడు నౌషాద్‌ పాటలు వింటున్నప్పుడు వాటిలో ఎస్‌. రాజేశ్వరరావుకు ఉండిన అద్భుతమైన కల్పనాశక్తీ, ఘంటసాల సంగీతదర్శకుడుగా కనబరిచిన శాస్త్రీయ సంగీత సౌష్ఠవం, పెండ్యాల పాటల్లోని మృదుత్వమూ, మాస్టర్‌ వేణు ఆర్కెస్ట్‌రైజేషన్‌ అన్నీ కలగలిసినట్టుగా అనిపిస్తుంది. “పాటకు ట్యూన్‌ కట్టడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మాబోటివాళ్ళం ప్రతి అక్షరాన్ని గురించీ, స్వరమూ, గమకాలను గురించీ ఎంతో మథనపడతాం” అని నౌషాద్‌ ఒక ఇంటర్‌వ్యూలో చెప్పాడు. అతని ఏ పాట విన్నా అది తెలుస్తూనే ఉంటుంది.

తనకు ఇరవయ్యేళ్ళు నిండకమునుపే సినిమాల్లోకి దిగిన నౌషాద్‌కు సంగీతంలో అంతటి పరిపక్వత ఎలా సాధ్యమయిందోనని ఆశ్చర్యం వేస్తుంది. అతను హిందూస్తానీ సంగీతాన్నీ, జానపదగీతాలనీ, గజల్‌ మొదలైన అంశాలనీ, పాశ్చాత్య రీతులనూ నిత్యమూ అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. నా లెక్కన కేవలం శాస్త్రీయ రాగాల అందాలమీదనే ఆధారపడి మంచి ట్యూన్లు చెయ్యడం అంత విశేషం అనిపించుకోదు. ఎందుకంటే ఆ సౌందర్యాన్ని విద్వాంసులు మరింత బాగా వినిపించగలరు. రాగంలో సామాన్యంగా శాస్త్రీయ విద్వాంసులు తడమని విశేషాలను ఎత్తి చూపగలిగే ప్రజ్ఞ మేధావులైన సినీ సంగీత దర్శకులు కొందరిలో మాత్రమే కనిపిస్తుంది. అలాంటివారిలో నౌషాద్‌ను మించినవారు లేరు. రాగాలూ, జానపదబాణీలూ కూడా సోకని కొన్ని పాటల్లో నౌషాద్‌ గొప్పతనం నాకు మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అమర్‌ సినిమాకు అతను లతా చేత పాడించిన జానేవాలే సే ములాకాత్‌ న హోనే పాయీ అనే విషాదగీతాన్ని వినగానే షూటింగ్‌కని సెట్‌ మీద కొచ్చిన మధుబాల కళ్ళలో నీళ్ళు తిరిగాయట. సామాన్యంగా విషాదభావాన్ని ప్రతిఫలించని యమన్‌ (కల్యాణి) రాగంలోని ఈ ట్యూన్‌ ఎంతో గంభీరంగా పదాల భావాన్ని వ్యక్తీకరించే అద్భుత సంగీత రచన.

సినీ ఆర్కెస్ట్రా రూపురేఖల్లోనూ, రికార్డింగ్‌, నొటేషన్‌ పద్ధతిలోనూ నౌషాద్‌ ఆ రోజుల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు. ఆన్‌ సినిమాకు తొలిసారిగా 100 వాయిద్యాలు ఉపయోగించాడు. పాశ్చాత్యసంగీతాన్ని పరిశీలించి అనేక కొత్తపద్ధతులని ప్రవేశపెట్టాడు. 1950లలో అతను గాత్రం లేకుండా ఉత్త వాయిద్యాలతో కంపోజ్‌ చేసిన ఒక 78 ఆర్పీఎం రికార్డు మా ఇంటో ఉండేది. అందులో దులారీ సినిమాలోది ఒకటీ, స్నేక్‌ డాన్స్‌ అనే మరొకటీ (ఇది రేడియో సిలోన్‌ ఆప్‌హీ కే గీత్‌ కార్యక్రమానికి సిగ్నేచర్‌ ట్యూన్‌గా ఈనాటికీ రోజూ వినిపిస్తుంది) గొప్ప ట్యూన్లుండేవి. ఆర్కెస్ర్టా, ట్యూన్‌ వగైరాల గురించిన అతని విస్తృత అవగాహన వీటిలో కనిపిస్తుంది. అంతేకాక నౌషాద్‌ అనేకమంది గాయనీ గాయకులను సినీరంగానికి పరిచయం చేశాడు. నౌషాద్‌ పాటలద్వారా పైకొచ్చిన వారిలో రఫీ, లతాలే కాక నూర్జహాన్‌, సురైయా, షంషాద్‌ బేగం, మహేంద్రకపూర్‌ తదితరులున్నారు. ఒక పాటల పోటీలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన నౌషాద్‌, అందులో బహుమతి గెలుచుకున్న గాయకుడికి అవకాశమిస్తానని చెప్పడంతో, అన్నమాట ప్రకారం మహేంద్రకపూర్‌ చేత తొలిసారిగా సోహినీ మహివాల్‌ చిత్రంలో పాడించాడు.


నౌషాద్‌, 1982లో భారత్‌కు వచ్చిన నూర్జహాన్‌


నౌషాద్‌, సి.రామచంద్ర తన అసిస్టెంట్‌ మహమ్మద్‌ షఫీతో నౌషాద్‌


పంచరత్నాలు మన్నాడే, రఫీ, లతా, ముకేశ్‌, తలత్‌ మహమూద్‌

1947లో సైగల్‌ మరణం తరవాత ఏర్పడ్డ ఖాళీని వెంటనే భర్తీ చెయ్యగలిగిన గాయకులెవరూ అప్పట్లో లేరు. సైగల్‌ను పోలిన శైలి కారణంగా ముకేశ్‌కు ఆదరణ ఉండేది. ముకేశ్‌కు తారస్థాయిలో అపస్వరాలు పలుకుతాయని నౌషాద్‌కు కొన్ని అభ్యంతరాలుండేవి. అందుకనే అందాజ్‌, మేలా మొదలైన సినిమాల్లో ముకేశ్‌ చేత అతను మంద్ర స్థాయిలో పాడించాడు. ఒక్క “తూ కహే అగర్‌” పాట కోసమని ముకేశ్‌ నౌషాద్‌ ఇంటికి వచ్చి 23 సార్లు రిహార్సల్‌ చేశాడట. అప్పటి కమిట్‌మెంట్‌ అటువంటిది.


ముకేశ్‌, నౌషాద్‌

అలాగే బాబుల్‌ మొదలైన సినిమాల్లో తలత్‌ మహమూద్‌ పాడాడు. అతనికి రికార్డింగ్‌లో కూడా సిగరెట్‌ తాగే అలవాటుండేదట. నౌషాద్‌ సమక్షంలో తానలా అమర్యాదగా ప్రవర్తించి ఉండకూడదని తలత్‌ తరవాతి రోజుల్లో ఒక ఇంటర్వ్యూలో అన్నాడు కూడా. తలత్‌ అంతగా పైకి రాకపోవడానికి ముఖ్యకారణం దిలీప్‌కుమార్‌వంటి హీరోలంతా రఫీని అభిమానించడమే అనిపిస్తుంది. ఎందుకంటే నౌషాద్‌ అతని చేత సాథీ, ఆద్మీ మొదలైన సినిమాలకు పాడించాడు కాని హీరోలు కాదనడంతో ఆ ప్రయత్నాలు విజయవంతం కాలేదు. నౌషాద్‌ దర్శకత్వంలో మన్నాడే, హేమంత్‌ కుమార్‌ రెండు మూడు పాటలు పాడారు. 1975లో సునెహరా సన్సార్‌ అనే సినిమాలో కిశోర్‌కుమార్‌, ఆశా చేత నౌషాద్‌ ఒక పాట పాడించాడుకాని అది రిలీజ్‌ కాలేదు. అలాగే గీతాదత్‌ కూడా అతని పాటలేవీ పాడలేదు. లతా కాక ఆశా భోన్స్లే, సుమన్‌ కల్యాణ్‌పూర్‌ తదితరులు చాలా పాటలే పాడారు. తక్కినవన్నీ మహమ్మద్‌ రఫీవే.



లతా మంగేశ్కర్‌తో ఆశా భోన్స్లేతో


రఫీతో

రఫీతో నౌషాద్‌ సంబంధం చాలా గాఢమైనది. తొలి రోజుల్లో కంపోజింగ్‌ పనిలో ఉన్న నౌషాద్‌ను ఏదో సిఫార్సు ఉత్తరం కోసమని కలవడానికి వచ్చిన రఫీ చాలా వినయంగా నిలబడ్డాట్ట. ఉత్తరం ఇచ్చేసి రిహార్సల్‌లో నిమగ్నుడై చాలా సేపటి తరవాత వెనక్కి తిరిగి చూస్తే రఫీ ఇంకా నిలుచునే ఉన్నాట్ట. ఏమిటని అడిగితే వెళ్ళడానికి బస్సు డబ్బులు కూడా లేవని సిగ్గుపడుతూ చెప్పాట్ట. ఆ విధంగా మొదట్లోనే సహాయపడిన నౌషాద్‌ రఫీ జీవితాన్ని సంగీతపరంగా తీర్చిదిద్దాడనే చెప్పవచ్చు. తారస్థాయిలో అవలీలగా పలికే అతని కంఠాన్ని నౌషాద్‌ అనేక సందర్భాల్లో చక్కగా ఉపయోగించుకున్నాడు. దీదార్‌లో మేరీ కహానీ, బైజూబావ్‌రాలో ఇన్సాన్‌ బనో, దునియా కే రఖ్‌వాలే, షబాబ్‌లో యెహీ అర్‌మాన్‌ లేకర్‌, ముగలే ఆజంలో జిందాబాద్‌ మొదలైన పాటల్లో ఈ విషయం గమనించవచ్చు.

ఇంటర్‌వ్యూల్లో నౌషాద్‌ అస్తమానమూ భారతీయ శాస్త్రీయ రాగాల విశిష్టత గురించి చెపుతూ ఉండేవాడు. తొలిరోజుల్లో సినిమా సంగీతమంతా “మట్లు” ఉపయోగించే పద్ధతిలోనే ఉండేది. శాస్త్రీయ సంగీతపు రాగాలూ వగైరాలన్నిటినీ పాటలకు పనికొచ్చేవిగా పరిగణించే అలవాటుండేది కాదు. బంగారపు గనివంటి సంప్రదాయ సంగీతాన్ని తిన్నగానూ, సమర్థవంతంగానూ సినిమా పాటలకు వాడుకోవచ్చునని రుజువు చేసినది నౌషాదే. ఇందుకు ప్రధానమైన ఉదాహరణలు బైజూబావ్‌రా మొదలైన సినిమాల్లో చూడవచ్చు. గుజరీ తోడీ (ఇన్సాన్‌ బనో), భైరవ్‌ లేదా మాయామాళవగౌళ (మొహే భూల్‌గయే సావరియా), మాల్‌కౌఁస్‌ లేదా హిందోళం (మన్‌తర్‌పత్‌), దేసీ (బైజూ, తాన్‌సేన్‌ల పోటీ పాట), పిలూ (ఝూలే మేఁ పవన్‌ కే) మొదలైన పాటలన్నీ శుద్ధ శాస్త్రీయ రాగాలతో తయారైన పాప్యులర్‌ సినిమా పాటలు. ఇటువంటి ప్రయోగం అంతకు మునుపెన్నడూ జరగలేదని లతావంటివారే అన్నారు. కోహినూర్‌లో మధుబన్‌ మేఁ రాధికా హమీర్‌ రాగంలోని పాట. ప్రతి రాగంలోనూ స్వతహాగా కొంత డ్రామెటిక్‌ ఎలిమెంట్‌ ఉంటుంది. దాన్ని నౌషాద్‌ బాగా వినియోగించుకున్నాడు. ఆ తరవాత అందరూ అదే కాస్తో కూస్తో మొదలుపెట్టారు.

ఇతర విమర్శకులు అతని పాటల్లోని జానపద సంగీతపు అందాలను వర్ణిస్తారు. దీనికి మంచి ఉదాహరణలు మదర్‌ ఇండియా, గంగా జమునా సినిమాలు. విశేష జనాదరణ పొందిన ఆ పాటల్లోని విరుపులూ, వాద్యవిశేషాలూ సినిమాల విజయానికి ఎంతో దోహదపడ్డాయి. అంతేకాక మరుగుపడిపోతున్న కొన్ని జానపద సంగీత శైలులకి జీవం కూడా పోశాయి. శాస్త్రీయ, జానపద సంగీతాలు నౌషాద్‌ విజయరథానికి రెండు చక్రాల్లాంటివి. నౌషాద్‌ చేసిన ఇతర సాంఘిక సినిమా పాటల్లో కూడా ఇవి రెండూ ప్రధానమైన అంశాలే కాని వీటిని మించిన అద్భుత సౌందర్యమేదో వాటిలో కనిపిస్తుంది. ఎందుకంటే వీటిని ఇతర ప్రసిద్ధ సంగీతదర్శకులందరిలోనూ కొంతకొంతగా మనం చూడవచ్చు. నౌషాద్‌కు సమకాలికులై, అతనికన్నా వయసులో పెద్దవారైన ఎస్‌.డి. బర్మన్‌, రోషన్‌, సి. రామచంద్ర తదితరులందరూ శాస్త్రీయ, జానపద రీతుల్లో నిష్ణాతులే. అయితే నా లెక్కన నౌషాద్‌ ట్యూన్లలో వారందరినీ మించిన నిర్మాణ సౌందర్యం ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌ కనిపిస్తుంది. పల్లవి మొదలై, ఇంటర్లూడ్స్‌ తరవాత చరణం, అది తిరిగే మలుపులూ, మళ్ళీ పల్లవికి చేరుకోవడం, అంతా తాజ్‌మహల్‌ గోపురపు ఆకారంలాగా అద్వితీయంగా కొనసాగుతుంది. ఏనాడో ఆన్‌లో అతను లతాచేత పాడించిన ఆజ్‌ మేరే మన్‌మేఁ సఖీ పాట ఎన్ని అందమైన సొంపులతో తిరుగుతుందో చూడవచ్చు. ఇవన్నీ పాత సంప్రదాయాలను యాంత్రికంగా అనుసరించడంవల్ల సాధ్యపడినవి కావు. అనితరసాధ్యమైన నౌషాద్‌ జీనియస్‌ పనిచెయ్యడమే ఇందులో కనిపిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.


నౌషాద్‌తో రాగాల డజన్‌

1. బర్మన్‌, 2. మదన్‌మోహన్‌, 3. రామచంద్ర, 4. జైకిషన్‌, 5. గులాం హైదర్‌, 6. ఖయ్యాం, 7. శంకర్‌, 8. రోషన్‌, 9. గులాం మహమ్మద్‌, 10. అనిల్‌ బిశ్వాస్‌, 11. నయ్యర్‌, 12. హేమంత్‌ కుమార్‌

సినీ సంగీత దర్శకుల్లో పదాలను తాళం మీద అందంగా పేర్చడంలో బర్మన్‌ ఘటికుడు. మన దేశపు ఈశాన్య ప్రాంతాల సంగీతం అతనికి కరతలామలకం. కవ్వాలీలకూ, మాటల అర్థాన్ని ప్రస్ఫుటంగా వినిపించడానికీ రోషన్‌ను మించినవారు లేరు. ప్రజల టేస్ట్‌ శంకర్‌ జైకిషన్‌లకు తప్ప ఎవరికీ తెలియదని ఒకప్పుడు అనిపించేది. చిటికలేసే హుషారు పాటలకు నయ్యర్‌ది పెట్టింది పేరు. నాజూకులూ, వయ్యారాలూ సి. రామచంద్ర సొంతం. గజల్‌ కింగ్‌ మదన్‌మోహన్‌ కూడా సామాన్యుడు కాడు. సలిల్‌ చౌదరి, హేమంత్‌ కుమార్‌ తదితరులు బెంగాలీ సంగీతపు అందాలను గుప్పించగలరు. ఇవన్నీ వేటికవిగా గొప్ప విషయాలే. ఇలా ఎందరో గొప్పవారున్నప్పటికీ పాటలో ఒక రకమైన పరిపూర్ణతను నౌషాద్‌ సాధించినట్టుగా మాత్రం ఎవరూ సాధించలేదు.

ప్రతి పాటనూ పాలరాతి శిల్పంలా మలిచే నౌషాద్‌చేత కొన్ని సందర్భాలకు తగినట్టుగా ఆషామాషీ ట్యూన్లు కట్టించడం కష్టం అయి ఉండవచ్చు. అందుకనే ఇతరుల పాప్యులారిటీకి అతని మేధస్సు ఆటంకం కాలేదు. సినిమాల్లోని వైవిధ్యాన్ని బట్టి అందరికీ అవకాశాలు కలిగాయి. అల్‌బేలా (నాటకాలరాయుడు) వంటి సినిమాలకు రామచంద్రదే తగిన సంగీతం. పైగా అందరికీ అందరితోనూ పొసగదు. ఉదాహరణకు గురుదత్‌ తన సినిమాలోని పాటలన్నీ అకస్మాత్తుగా మొదలవాలని అనేవాట్ట. పాట మొదలవబోతున్నట్టు నేపథ్యసంగీతం ద్వారా ప్రేక్షకులకు ముందుగా తెలియనివ్వకూడదని అతని ఉద్దేశం. బర్మన్‌, నయ్యర్‌ తదితరులంతా అతని సినిమాల్లో ఆ ప్రకారమే చేశారు. నౌషాద్‌ అటువంటి షరతులకు తల ఒగ్గి ఉంటాడా అనేది చాలా అనుమానాస్పదం. బాపూ, ముళ్ళపూడి వెంకటరమణలకు రాజేశ్వరరావు సంగీతమంటే చాలా ఇష్టం. అయినా తమ సినిమాలకు అతన్ని ఉపయోగించుకోలేదు. ఈ విషయం గురించి ఒకసారి నేనడిగితే కె.వి.మహాదేవన్‌ తమతో బాగా సహకరిస్తాడని బాపూ అన్నారు. తమ సంగీతం గురించి పట్టింపులున్న కొందరు సీనియర్‌ కంపోజర్లకు స్వయంగా స్టార్‌ హోదా ఉంటుంది. ఇతరుల నిబంధనలకు వారు సులువుగా ఒప్పుకోరు. నౌషాద్‌ సినిమాల్లో అతనే ముందుంటాడు; పాటలు రాసిన షకీల్‌ బదాయునీది ఎప్పుడూ ద్వితీయ స్థానమే. కథలోని సందర్భాన్ని అనుసరించి, ఒక్క మేరే మెహబూబ్‌ టైట్‌ల్‌ సాంగ్‌లో మాత్రమే నౌషాద్‌ ట్యూన్‌ కవి రచనకు అడ్డురాకుండా కాస్త ఒదిగి ఉంటుంది. సాహిర్‌ లూధియానవీ వంటి మహాకవి రచనలు ధగధగా మెరిసేది మాత్రం రోషన్‌ సంగీత దర్శకత్వంలోనే.

స్వరరచయితగా నౌషాద్‌ “సంపన్నుడు”; కొద్దిలో కిట్టించే కక్కూర్తి రకం కాదు. జవాఁ హై మొహబ్బత్‌ (నూర్జహాన్‌ అన్‌మోల్‌ ఘడీ) మొదలైన పాటల్లో నాలుగు చరణాలకూ నాలుగు వేరువేరు ట్యూన్లు. ఏ పాటలోనైనా మొదటి చరణానికి వాడిన ఇంటర్లూడ్‌ రెండోదానికి మళ్ళీ వాడడు. ప్రతి ఇంటర్లూడ్‌కూ ఒక ఖచ్చితమైన “ఉద్దేశమూ”, స్వరూపమూ ఉంటుంది. చాలామంది కంపోజర్లు స్వరాలను పొదుపుగా వాడుకుంటారు. ఏ రాజ్‌కపూర్‌ సినిమాకో అయితే అద్భుతమైన సంగీతం అందించగల శంకర్‌ జైకిషన్‌వంటివారు ఇతర సినిమాల్లో కేవలం రెండు మూడు స్వరాలతోనే సరిపెట్టిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. ప్రొఫెసర్‌ సినిమాలో వారు స్వరపరిచిన కోయీ ఆయేగా ఆయేగా అనే పాటనూ, దాని చరణాలనూ (రిరిగ సాసా రిరిగ సాసా రిరిగ సాసా ససాసా ఇదే రెండుసార్లు వింటాం. దాంతో చరణం పూర్తవుతుంది!) వింటే ప్రజాదరణ పొందటానికి సంగీత దర్శకులు పెద్దగా శ్రమపడనవసరం లేదని మనకర్థం అవుతుంది. నౌషాద్‌లో ఇలాంటి రాజీ ధోరణి కనిపించనే కనిపించదు. అతని బలహీనతల్లా చవకబారు పాటలు కట్టలేకపోవటమేనేమో.

తరవాతి కాలంలో ఎవరో విలేకరి అతనితో “ఈ రోజుల్లో మీ సత్తా అయిపోయిందనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది” అంటే నౌషాద్‌ కోపంగా “సత్తా అనేది అయిపోవడానికి దుకాణంలో సరుకనుకున్నారా? పాప్యులారిటీ అనేది కాలాన్ని బట్టీ, టేస్ట్‌ను బట్టీ మారుతుంది. మాకు ప్రేరణ సినిమా ద్వారానే కలుగుతుంది. కాస్త ఓపిక పట్టండి. ప్రస్తుతం నేను దిలీప్‌కుమార్‌ స్థానంలో రాజేంద్రకుమార్‌ను ఊహించుకోవటానికి ప్రయత్నిస్తున్నాను” అన్నాట్ట. సినిమాల మ్యూజిక్‌ డైరెక్టరంటే ఎవడో బేండ్‌ మాస్టరనే అభిప్రాయం ఉన్నవాళ్ళని అతను విమర్శించేవాడు. మొత్తంమీద తనది ఒకే మూస ధోరణి కాదని నిరూపించడానికి నౌషాద్‌ సాథీ సినిమాకు విభిన్నమైన పద్ధతిలో కంపోజ్‌ చేశాడు. తనకు నచ్చిన శాస్త్రీయ, జానపద సంగీతాలని వాడనే లేదు. అందులో మృదంగం దరువుతో ముకేశ్‌, సుమన్‌ కల్యాణ్‌పూర్‌లు పాడిన మేరా ప్యార్‌భీ తూహై అనే పాట చాలా జనాదరణ పొందింది. అందులోనే లతా పాడిన మేరే జీవన్‌ సాథీ అనే పాటలో అతి సంక్లిష్టమైన వెస్టర్న్‌ ఇంటర్లూడ్స్‌ ఉపయోగించాడు.

ట్యూన్లలో రాగాల చేత “అందంగా చాకిరీ చేయించుకోవడం” నౌషాద్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వినేవారికి అందులో ఏ రాగం వాడబడిందో, ఆ రాగపు లక్షణాలేమిటో తెలియకపోయినా విని ఆనందిస్తారు. శాస్త్రీయ సంగీతపు అసలు లక్షణం ఇదే; రాగాలు అనగానే బోరు కొడుతుందేమో అనిపిస్తుంది కాని అవన్నీ వినడానికి అందమైనవే. విద్వాంసులు పాడుతున్నప్పుడు మామూలు శ్రోతలకు “చెట్లు అడ్డంగా ఉండడంవల్ల అడవిని చూడలేకపోయిన” పరిస్థితి కలుగుతుందేమో కాని రాగాలను విని ఆనందించడానికి పాండిత్యం అవసరం కాదు. షబాబ్‌లో లతా జోగన్‌ బన్‌జాఊఁగీ తిలక్‌ కామోద్‌ రాగంలో పాడినా, మర్‌గయే హమ్‌ మిశ్ర తిలంగ్‌ రాగంలో పాడినా, ముగలే ఆజంలో బేకస్‌ పే కరమ్‌ కేదార్‌ రాగంలో పాడినా, రఫీ సుహానీరాత్‌ పహాడీ రాగంలో పాడినా వినేవారికి మాత్రం ఏదో మంచిపాట వింటున్నట్టే ఉంటుంది. నౌషాద్‌ పిలూ రాగంలో నదియా ధీరే బహో అనే హిందూస్తానీ ఠుమ్రీని అవే మాటలతో ఉడన్‌ ఖటోలా సినిమాలో జానపద శైలిలో పడవపాటగా ఉపయోగించాడు. అదే రాగాన్ని షబాబ్‌లో చందన్‌కా పల్‌నా అనే జోలపాటగానూ, గంగా జమునాలో నామానూఁ అనే జానపదగీతంగానూ కూడా అద్భుతంగా పలికించిన ఘనుడు నౌషాద్‌. ముగలే ఆజంలోని మోహే పన్‌ఘట్‌పే అనే పాట పిలూ రాగమని చాలామంది పొరబడతారు కాని నిజానికి అది (మధ్యమం నుంచి) గారా అనే రాగం. అలాగే నౌషాద్‌ (సింధు) భైరవి అందాలను లెక్కలేనన్నిసార్లు వాడుకున్నాడు. జానపద రీతిలో తూ గంగాకీ మౌజ్‌ (లతా, రఫీ బైజూ బావ్‌రా), భక్తిపరంగా ఇన్సాఫ్‌ కా మందిర్‌ (రఫీ అమర్‌), గజల్‌ శైలిలో తీర్‌ ఖాతే జాయేంగే (లతా దీవానా), ఆనందగీతంగా తుమ్హారే సంగ్‌ మైఁ భీ చలూంగీ (లతా సోహినీ మహివాల్‌), రొమాంటిక్‌ పద్ధతిలో జాదూగర్‌ కాతిల్‌ (ఆశా కోహినూర్‌) ఇలా ఎన్నో సందర్భాల్లో ఆ రాగాన్ని మరచిపోలేని విధంగా ఉపయోగించాడు. లలిత సంగీతానికి అంతగా పనికిరావనిపించే మార్‌వా (పాయలియా బావ్‌రీ లతా సాజ్‌ ఔర్‌ ఆవాజ్‌), శహానా కానడా (మహలోఁమేఁ రెహెనేవాలే రఫీ, బృందం, షబాబ్‌) మొదలైన రాగాల్లో కూడా పాటలు స్వరపరిచాడు.

వ్యక్తిగత జీవితంలో నౌషాద్‌ది పిల్లాపాపలతో పెద్ద కుటుంబమే. ఆయనకు ఇబ్బంది కలగకుండా ఆయన భార్యే ఇంటి వ్యవహారాలన్నీ చక్కబెట్టేదట. అతను మాట్లాడే పద్ధతి అంతా పాతకాలపు లక్నో మర్యాదలతో ఎంతో చక్కగా ఉండేది. బొంబాయిలో మేమంతా ప్రసిద్ధ వేణు విద్వాంసుడు ఏల్చూరి విజయరాఘవరావుగారి ప్రేరణతో 1979లో రాజేశ్వరరావు నైట్‌ ఏర్పాటు చేసినప్పుడు నౌషాద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడు. సంగీత శిఖరాలనదగిన ఆ ముగ్గురితో షణ్ముఖానందహాలు వేదిక వెలిగినట్టనిపించింది. నౌషాద్‌ ఆప్యాయంగా “నా పాతమిత్రుడు రాజేశ్వరరావు” అంటూ ఆయనను చాలా ప్రశంసించాడు. ఒకరు ఉర్దూలోనూ, మరొకరు తెలుగులోనూ మాత్రమే మాట్లాడగలిగినా వారిద్దరి మాతృభాషా సంగీతమే అనిపించింది.

సంగీతం విషయంలో నౌషాద్‌కు ఆత్మగౌరవం ఎక్కువ. అతనింటో మ్యూజిక్‌ రూమును దేవాలయంలాగా పరిగణించేవాడట. పాడేది ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ట్యూన్‌ విని నేర్చుకోవడానికి ఆ గదికి వచ్చి తీరవలసిందే. నౌషాద్‌కు మొదటి నుంచీ అనారోగ్యమంటే భయం ఉండడంతో నిత్యమూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకున్నాడు. ఒకప్పుడు వేటలోనూ, చేపలు పట్టడంలోనూ ఆసక్తి ఉండేది. తాను స్వయంగా కొంత కవిత్వం రాయగలడు కనక సంభాషణల్లోనూ, ఉపన్యాసాల్లోనూ తన పంక్తులు కొన్ని ఉదహరించేవాడు. కొన్ని సినిమాలకు కథా రచనలోనూ, కొన్ని సినిమాల నిర్మాణంలోనూ పాల్గొన్నాడు. అతను ఏనాడూ ఒకటి రెండు తప్ప ఏకకాలంలో డజన్ల కొద్దీ సినిమాలకు పని చెయ్యడానికి అంగీకరించలేదు. ప్రతి పాటనూ శ్రద్ధగా మలిచి తయారు చేసినవాడతను. పాటలే కాక రీరికార్డింగ్‌లో నేపథ్యసంగీతం కూడా ఎంతో చక్కగా స్వరపరిచేవాడు. గులాం మహమ్మద్‌ పాకీజాకు పాటలన్నీ కంపోజ్‌ చేసి, సగం పని ముగించి చనిపోయాక నౌషాద్‌ సమకూర్చిన నేపథ్యసంగీతం ఎంతో హుందాగా, ప్రస్ఫుటంగా వినిపించింది. సినీ సంగీత రంగంలో నౌషాద్‌ ఉస్తాదోంకే ఉస్తాద్‌.

సుమారు పదేళ్ళకిందట బొంబాయిలో టీవీలో ఆధునిక సంగీతం గురించిన ఒక చర్చ ప్రసారమైంది. అందులో పాత పాటలని సమర్థించిన నౌషాద్‌తో బాటుగా కొత్తగా వినిపిస్తున్న ఎమ్‌టీవీ శైలిలో తప్పులేదని వాదించిన ఒక పాప్‌ గాయని కూడా పాల్గొంది. చాలాసేపు అందరి వాదనా వింటూ మాట్లాడకుండా కూర్చున్న ఒక బట్టతలాయన చివరకు నోరువిప్పాడు. అతనికొక కేసెట్‌ కంపెనీ ఉందట. కొత్త పాటలు అమ్ముడుపోక నష్టం వచ్చినప్పుడల్లా వాళ్ళు పాత పాటల్ని రిలీజ్‌ చేసి, అమ్ముకుని నష్టాలని పూడ్చుకుంటూ ఉంటారట. దాంతో చర్చకు తెరపడింది.

(ఈ వ్యాసంలో పేర్కొన్న నౌషాద్‌ పాటలు చాలా మటుకు http://www.musicindiaonline.com/ అనే వెబ్‌సైట్లో దొరుకుతాయి)
---------------------------------------------------------
రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, 
ఈమాట సౌజన్యంతో

No comments: