తేలిక తెలుగు
సాహితీమిత్రులారా!
“ప్రయోగం పేరిట పవిత్రమైన మన భాషని అభాసు చేస్తావుటయ్యా, ఱావూ!”
– మరొక శంకరశాస్త్రి.
1. తేలిక తెలుగు అవసరం ఏమిటి?
కేలిఫోర్నియా విశ్వవిద్యాలయపు డేవిస్ కేంద్రంలో, ఇరవై ఒకటవ శతాబ్దపు మొదటి దశకంలో, మొదటి సంవత్సరం విద్యార్థులకి ఆరేళ్లపాటు తెలుగు నేర్పేను. ఆ సందర్భంలో తెలుగు రెండవ భాషగా నేర్పడంలో ఉన్న కష్టాలు కొన్ని అర్థం అయాయి. ఈ కష్టాలనుండి గట్టెక్కడానికి రకరకాల చిటకాలు వాడవలసి వచ్చింది. పబ్బం గడుపుకోడానికి వాడిన ఈ చిటకాలు అన్నీ తెలుగువాళ్లు అందరూ ఆమోదిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాని అప్పటి ఆలోచనలని క్రమబద్ధం చేసి ఎక్కడో ఒకచోట రాసి పెట్టాలనే కోరికే ఈ వ్యాసానికి ప్రేరణ.
తరగతిలో సగటున 15 నుండి 20 వరకు విద్యార్థులు నమోదు అయేవారు. వీరి వయస్సు ఇటూ అటూగా 18 ఏళ్లు. వీరిలో భారతీయ సంతతి ఇద్దరో ముగ్గురో ఉంటే, అందులో తెలుగు సంతతి ఒకటో అరో ఉండేవారు. ఈ భారతీయ సంతతిని మినహాయిస్తే, ఈ తరగతిలో ఉన్న విద్యార్థులకి తెలుగు భాష గురించి ఏమీ తెలియదు. ఈ భాషని ఎప్పుడూ విని ఉండలేదు. అంటే వీరికి తెలుగుతో పరిచయం పరమ పూజ్యం. “మీరు తెలుగు తరగతిలో ఎందుకు నమోదు అయేరు?” అని అడిగితే “కేవలం కుతూహలం,” అని కొందరు, “భాషాశాస్త్రం అధ్యయనం చెయ్యాలని ఉంది, అందుకని,” అని మరి కొందరు చెప్పేవారు.
ఈ రకం విశ్వవిద్యాలయపు విద్యార్థులకి తెలుగు నేర్పుతూన్నప్పుడు వారందరూ ఛందోబద్ధంగా కవిత్వం రాయగలగాలని కాని, అటువంటి కవిత్వం చదివి అర్థం చేసుకుని ఆనందించాలని కాని నేను ఎప్పుడూ ఆశించలేదు. తెలుగు వినడానికి వారి చెవులకి తరిఫీదు ఇవ్వడం, నిత్య జీవితంలో పనికొచ్చే తెలుగు పదసంపదని వారికి పరిచయం చెయ్యడం, తెలుగు చదవడం, రాయడం – గీత బాగుంటే, మాట్లాడడం – వస్తే చాలని అనుకున్నాను. ఇది చాల పరిమితమైన గమ్యం. పది వారాల కాల పరిమితిలో, వారానికి రెండు గంటల బోధనతో ఇంతకంటె ఆశించడం అవివేకం అనిపించింది. పరిస్థితులు అనుకూలిస్తే తెలుగు వ్యాకరణంలో ఉన్న ప్రత్యేకతలు ఎత్తి చూపాలని కూడ అనుకున్నాను. ఇటువంటి పరిమితమయిన లక్ష్యంతో నా ప్రయాణం మొదలయింది.
తెలుగు రెండవ భాషగా నేర్పడం అనేది తెలుగు వారికి ఒక కొత్త అనుభవం. మన పిల్లలకి తెలుగు నేర్పబూనుకున్నప్పుడు, అప్పటికే వారికి భాష మీద బాగా పట్టు ఉంటుంది. మనం నిజంగా వారికి నేర్పేది రాయడం, చదవడం, వ్యాకరణం, వగైరాలు – భాష కాదు. అమెరికాలో తారసపడే విద్యార్థులకి తెలుగు నేర్పేటపుడు పరిస్థితి వేరు; ఈ పరిస్థితులకి అనుకూలంగా నేర్పాలి కాని, ‘ఎప్పుడో మా తాతలనాడు పడవలలో ప్రయాణం చేసేం కనుక ఇప్పుడూ పడవలే వాడాలి’ అనే కోణం కుదరదు.
2. తేలిక తెలుగు అంటే ఏమిటి?
ఈ కొత్త తరం విద్యార్థుల మనస్సులని ఆకట్టుకుని, వీరికి తెలుగు నేర్చుకోవాలనే కోరిక పెంపొందించాలన్నదే నా ప్రథమ లక్ష్యం. అందుకని వీరికి ‘తేలిక చెయ్యబడ్డ’ తెలుగుని బోధించాలని నిర్ణయించుకున్నాను. అందుకనే ఈ వ్యాసానికి తేలిక తెలుగు అని పేరు పెట్టేను. మనం ఈ రోజుల్లో నిత్యం వాడే భాషలో ఒక భాగం ఈ తేలిక తెలుగు. గణిత పరిభాషలో చెప్పాలంటే మనం వాడుకునే తెలుగు ఒక సమితి అనుకుంటే తేలిక తెలుగు అందులో ఒక ఉపసమితి.
నేను ఊహించుకుంటూన్న తేలిక తెలుగులో అచ్చులు అయిదు జతలు, ఒక పూర్ణానుస్వారం:
అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఎ, ఏ, ఒ, ఓ, అం
ఇదే విధంగా తేలిక తెలుగులో మొదట నేర్చుకోవలసిన హల్లులు ఇరవయిమూడు:
క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ
అటుపైన:
య, ర, ల, ళ, వ, శ. ష, స, హ, న్ (నకారపొల్లు)
ఈ తేలిక తెలుగు నుండి మినహాయించిన వర్ణాలు ఇవి:
ఋ, ౠ, ఌ, ౡ (అచ్చు లు, లూ) ఐ, ఔ, అః, ఙ, ఞ, ఱ, క్ష, ఁ (అర సున్న.)
ముందస్తుగా ఇక్కడ ఇలా కొన్ని అక్షరాలని మినహాయించినడం వల్ల వచ్చే కష్టసుఖాలని, లాభనష్టాలని ఒక క్రమ పద్ధతిలో పరిశీలిద్దాం. మన విచారణ అచ్చులతో మొదలుపెడదాం.
తేలిక తెలుగులో ఌ, ౡ లు లేవు. వీటి తరఫున వకాల్తా పుచ్చుకుని వాదించేవారు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరనే నా నమ్మకం. ఉదాహరణకి, క్లుప్తం లో ఉండవలసిన ఌ-కారాన్ని ఈ రోజుల్లో అందరూ లు-కారం గానే రాస్తున్నారు. కనుక ఌ, ౡ లని నేను మినహాయించేనని నన్ను ఎవ్వరూ తూలనాడుతారని అనుకోను. వీటిని చాదస్తంగా వాడదామన్నా, లేఖిని వంటి కంప్యూటరు ఉపకరణాలలో ఈ రెండు వర్ణాలకి తావే లేదు.
తేలిక తెలుగులో విసర్గ లేదు; సంస్క్రుత పదాంతాలలో ఇది ప్రత్యయ రూపంలో తరచు వస్తుంది. అలా వచ్చినప్పుడు ఆ విసర్గ లేకుండా తెలుగులో రాసే అలవాటు బాగా వాడుకలోనే ఉంది. కొన్ని ఉదాహరణలు:
బహుశః > బహుశ, బహుశా (చాలవరకు, probably)
క్రమశః > క్రమేణా, క్రమేపీ (వరుసగా, gradually)
జన్మతః > జన్మతా (పుట్టుక నుండీ, congenital)
స్వతః > స్వతహా, స్వతహాగా (instinctively)
ప్రాయశః > ప్రాయశంగా (తరచుగా, frequently)
విసర్గ మాట మధ్యలో వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో తద్భవాలు వాడవలసి రావచ్చు, కొన్ని సందర్భాలలో వర్ణక్రమం కొద్దిగా మార్చవలసి రావచ్చు, కొన్ని సందర్భాలలో వ్యాకరణ సూత్రాన్ని అతిక్రమించవచ్చు, మరికొన్ని సందర్భాలలో ఒక మాటకి బదులు మరొక మాట వాడవలసి రావచ్చు. ఈ దిగువ ఇచ్చిన ఉదాహరణలు అన్నీ శాస్త్రసమ్మతం కాదు కాని ఎక్కువ వాడుకలో ఉన్నవే.
మనఃశాంతి > మనశ్శాంతి
చతుఃషష్టి > చతుష్షష్టి
నమఃకారం > నమస్కారం
తిరఃకారం > తిరస్కారం
అయఃకాంతం > అయస్కాంతం
దుఃఖం > దుఖ్ఖం, దుక్ఖం
అంతఃపురం > అంతహ్పురం, అంతిపురం
అంతఃకరణం > అంతహ్కరణం, అంతరాత్మ, మనస్సు
ప్రాతఃకాలం > ప్రాతహ్‌కాలం, వేకువ, తెల్లవారుజాము
తపఃఫలం > తపోఫలం
వయఃపరిమితి > వయోపరిమితి
కనుక ఎక్కువ కష్టపడకుండా విసర్గని విసర్జించి పబ్బం గడుపుకుంటే ప్రమాదం ఏమీ ఉండదనే నా నమ్మకం.
ఇక ఋ, ౠ ల సంగతి చూద్దాం. మాట మొదట్లో కాని, మధ్యలో కాని ౠ రావడం నా అనుభవ పరిధిలో చూడలేదు. ఋ తో మొదలయే మాటలు నాకు తెలుసున్నంత వరకు నాలుగు: ఋషి, ఋతువు, ఋణం, ఋత్విక్కు. ఇవి సంస్కృతం. తెలుగు మాటలు కావు. వీటిని మనలో చాల మంది అప్పుడే రుషి (లేదా రిషి), రుతువు, రుణం, రుత్విక్కు అని రాసేస్తున్నారు. కనుక ఋ, ౠ లు లేకపోయినా సరిపెట్టుకు పోవచ్చు కాని, ఋ హల్లుతో కలసినప్పుడు వచ్చే వట్రసుడి రూపం లేకుండా ‘సరిపెట్టుకు పోవడం’ అన్ని సందర్భాలలోనూ రాణించకపోవచ్చు; ప్రత్యేకించి, రాసేటప్పుడు కంటికి ఇంపుగా కనిపించకనూ పోవచ్చు. కొన్ని ఉదాహరణలు చూద్దాం.
కృష్ణ-ని క్రిష్ణ అని కొంతమంది, క్రుష్ణ అని కొంతమంది రాస్తున్నారు. ఈ రెండింటిలో క్రిష్ణ-కి కొంచెం ప్రాచుర్యం ఎక్కువ ఉంది. ఈ ప్రాచుర్యానికి కారణం ఇంగ్లీషు వర్ణక్రమం, ఉచ్చారణల ప్రభావం కారణం కావచ్చు.
వట్రసుడి లేకపోతే సంస్కృతం అన్న మాటని సంస్క్రుతం అని రాయాలి. నృత్యం-ని న్రుత్యం అని రాయాలి. నృపుడు-ని న్రుపుడు అని రాయాలి. ఈ రకం ప్రయోగాలు చేసినప్పుడు చెవి ఉచ్చారణ దోషాన్ని పసికట్టలేకపోయినా, రాసినప్పుడు కంటికి కొంచెం ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. కాకపోతే నృపుడు, నృత్యం వంటి మాటలు వాడడం మానేసి వాటి స్థానంలో వాటికి సమానార్థకాలయిన నర్తనం, నాట్యం, రాజు వంటి మాటలతో తేలిక తెలుగు సరిపెట్టుకోవాలి. ఈ మార్పు వల్ల తెలుగుకి వాటిల్లే నష్టం పెద్దగా లేదనే నా అభిప్రాయం.
తేలిక తెలుగులో ఐ, ఔ లు ప్రత్యేక వర్ణాలు కావు; వీటిని అయ్, అవ్ అని రాయవచ్చు. కొన్ని ఉదాహరణలు:
ఐదు > అయిదు
ఐపు > అయిపు
ఐతే > అయితే
అందమైన > అందమయిన
ఖైదు > ఖయిదు
కైవశం > కయివశం
కైవారం > కయివారం
ఔరా > అవురా
ఔను > అవును
కౌగిలి > కవుగిలి
చౌక > చవుక
ఇంగ్లీషు మాటలని తెలుగు లిపిలో రాసినప్పుడు ఐ స్థానంలో అయి రాయవచ్చు కాని కొంచెం క్రుతకంగా ఉన్నట్లు అనిపించవచ్చు:
హైవే > హయివే
ట్రైసికిల్ > ట్రయిసికిల్
డ్రైవ్ > డ్రయివ్
ఈ పద్ధతి సంస్క్రుతపు మాటలలో ‘వృద్ధి సంధి’ వచ్చిన సందర్భాలలో అంత సులభంగా కుదరకపోవచ్చు.
ఉదాహరణకి కౌంతేయుడు-ని కవుంతేయుడు-గా మార్చితే బాగుండదేమో. కౌరవులు అన్న మాటని నా ఆరేళ్ల మనవడు ‘కూరవులు’ అన్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. కాని యౌవనం అని రాయవలసిన చోట్ల మనలో అనేకులు యవ్వనం అనే రాసేస్తూ ఉంటే నవ్వు రావాలి కాని రావడం లేదు. ఎందుకుట? మనం అంతా ఈ తప్పు చేస్తున్నాము కనుక. అందుచేత అక్కడక్కడ కొన్ని సంస్క్రుత పదాలతో ఇబ్బంది వచ్చినా ఐ, ఔ లకి బదులు అయ్, అవ్-లు రాస్తే పరవాలేదనే అనిపిస్తోంది.
ఇప్పుడు హల్లుల నుండి మినహాయించిన అక్షరాలని చూద్దాం. క, ఖ, గ, ఘ ల తరువాత వచ్చే ఙ ని నా జీవితంలో నేను ఎప్పుడూ వాడలేదు. కాని చ, ఛ, జ, ఝ ల తరువాత వచ్చే ఞ ని జ్ఞానం అనే మాటలో నేను తరచు వాడుతూ ఉంటాను, జ్ఞానం, జ్ఞాతి వంటి అతి కొద్ది మాటలు తప్పితే ఞ అవసరం మరెక్కడా కనిపించడం లేదు. కనుక ఞ ని కూడ తేలిక తెలుగులో వాడొద్దు. ఈ అక్షరం లేకుండా జ్ఞానం, జ్ఞాతి మొదలైన మాటల ఉచ్చారణ సూచించడానికి మరొక మార్గం ఉంది; అది తరువాత చెబుతాను.
ఇక మిగిలిన అక్షరాలలో ఱ (బండి ర) సంగతి చూద్దాం. నేను రాసే తెలుగులో ఈ శకటరేఫ ఎప్పుడూ వాడ లేదు. నేను చదివే తెలుగులో అప్పుడప్పుడు కనబడుతూ ఉంటుంది కాని ఱ స్థానంలో ర రాస్తే నన్ను ఎవ్వరూ ఆక్షేపించలేదు. కనుక ఈ అక్షరం కూడ అనవసరమే, కనీసం, నా తేలిక తెలుగులో.
చివరకి మిగిలినది క్ష. ఈ అక్షరం తెలుగు అక్షరమాలలో లేదు కాని అక్కడక్కడ కొందరు దీన్ని ఱ ముందు రాస్తూ ఉంటారు. ఈ అక్షరం హిందీ అక్షరమాలలో ఉంది. తెలుగులో క కింద ష వత్తు రాస్తే క్ష అనే సంయుక్తాక్షరం వస్తుంది. కనుక దీనికి తెలుగు అక్షరమాలలో ఒక స్థానం ఇవ్వక్కర లేదు.
ఇక మిగిలినది అరసున్న. దీని వాడుక తగ్గిపోయింది కనుక దీనిని తేలిక తెలుగులో వాడదలుచుకోలేదు.
ఈ విశ్లేషణ అయిన తరువాత నా తేలిక తెలుగులో మిగిలిన అక్షరాలు ఇవి:
అ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ ఎ, ఏ, ఒ, ఓ, అం
క, ఖ, గ, ఘ
చ, ఛ, జ, ఝ
ట, ఠ, డ, ఢ, ణ
త, థ, ద, ధ, న
ప, ఫ, బ, భ, మ
య, ర, ల, వ, శ, ష, స, హ.
ఈ 42 అక్షరాలతోపాటు కొన్ని లేఖన చిహ్నాలు అవసరం వస్తూ ఉంటాయి.
అచ్చుతో కలపకుండా కేవలం హల్లుని రాయడానికి ఉపయోగపడే గుర్తు – నకార పొల్లు.
ఇదే విధంగా ప్రత్యేక ఉచ్చారణ అవసరమని చెప్పటానికి ఒక కొత్త గుర్తు, ~ (టిల్డా)ని నేను ప్రవేశ పెడుతున్నాను. ఈ గుర్తు కనిపించినప్పుడల్లా అక్కడ సాధారణ ఉచ్చారణ కాకుండా ఒక విలక్షణమైన ఉచ్చారణ ఉంటుందని సూచిస్తుంది, అంతే. కొన్ని ఉదాహరణలు:
బ్రౌన్ సూచించిన ౨ (రెండు గుర్తు) బొత్తాల బల్ల మీద లేదు కనుక, ౘ, ౙ (దంత్య చ, జ) కావలసి వచ్చినప్పుడు, చ మీద, జ మీద, ౨కి బదులు ఈ ~ గుర్తు వాడొచ్చు.
ఇంగ్లీషులో – బేంక్, బేట్, పెన్, వంటి మాటలకి తాలవ్యోచ్చారణ ఉందని చెప్పడానికి బేంకు అని రాసి, ఆ బే మీద ఈ టిల్డా గుర్తు వేయవచ్చు. కాని ఎన్నో ఇంగ్లీషు మాటలకి ఈ రకం ఉచ్చారణ ఉంది కనుక ఈ టిల్డా గుర్తు వేయకపోయినా అది ఇంగ్లీషు మాట అని గుర్తించగానే ఉచ్చారణ తెలుస్తుంది.
విజ్ఞానం వంటి మాటలు రాయవలసి వచ్చినప్పుడు రెండవ అక్షరం అయిన జా మీద ఈ టిల్డా గుర్తు వేసి అక్కడ ప్రత్యేకమయిన ఉచ్చారణ ఉందని సూచించవచ్చు.
అంటే నియమం ఏమిటన్నమాట? కేవలం తేలిక తెలుగులో ఉన్న అక్షరాలతో మనకి కావలసిన ప్రత్యేకమైన శబ్దాన్ని పుట్టించడం కష్టమైనప్పుడు మనకి అందుబాటులో ఉన్న లేఖన చిహ్నాలతో ఆ మాటని రాసి, ‘ఇక్కడ ప్రత్యేక ఉచ్చారణ ఉంది సుమా’ అని హెచ్చరించడానికి ఈ టిల్డా (కాకపోతే మరొక చిహ్నం) వాడమని నా సలహా. అంటే, ఈ టిల్డాకి ఒక నిర్దిష్టమయిన ఉచ్చారణ అంటూ ఏదీ లేకపోవడం ఒక లక్షణం, దాని ‘ఉచ్చారణ విలువ’ అది వాడిన స్థానాన్ని బట్టి మారుతుంది అనేది దీని రెండవ లక్షణం.
కనుక తేలిక తెలుగులో 5 అచ్చుల జతలు, 31 హల్లులు, 3 లేఖన చిహ్నాలు (సున్న, నకారపొల్లు, టిల్డా.) ఇక్కడ పూర్ణానుస్వారాన్ని లేఖన చిహ్నాలలో కలిపి లెక్కిస్తున్నాను.
3. తేలిక తెలుగులో సున్నలు, అరసున్నలు
నేను తెలుగు నేర్చుకోలేదు, ఎవ్వరూ నేర్పలేదు; దానంతట అదే వచ్చేసింది. భాష వచ్చిన తరువాత రాయడం, చదవడం గురుముఖంగా నేర్చుకున్నాను. కనుక తెలుగంటే ఏమిటో బొత్తిగా తెలియని వాళ్లకి తెలుగు నేర్పడంలో ఉన్న కష్టసుఖాలు, తెలుగు నేర్చుకునేటప్పుడు విద్యార్థులు చేసే తప్పులు నా విద్యార్థులకి పాఠాలు చెప్పే సందర్భంలోనే నాకు అవగతం అయేయి. మరొక విధంగా చెప్పాలంటే ఒక భాషని మొదటి భాషగా నేర్చుకోవడం వేరు, రెండవ భాషగా నేర్పడం వేరు. ఈ అధ్యాయం ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకుని చదవండి.
నా విద్యార్థులకి రాతలో ప్రావీణ్యం రాకముందే మాట్లాడడం నేర్పాలని నిశ్చయించుకున్నాను. అందుకని వారికి RTS, లేఖిని, పద్మ వంటి పనిముట్లు వాడడం మొదట్లోనే నేర్పేను. RTS అనేది తెలుగుని ఇంగ్లీషు లిపిలో రాయడానికి ఒక ప్రమాణం. లేఖిని, పద్మ అనేవి RTS ప్రమాణం ప్రకారం ఇంగ్లీషు లిపిలో రాసిన వాక్యాలని తెలుగు లిపిలోకి తర్జుమా చేసే సాఫ్ట్‌వేర్ పనిముట్లు. ఇవన్నీ ఉచితంగా అంతర్జాలంలో దొరుకుతాయి. ఈ కాలపు పిల్లలకి వీటి వాడకం నేర్పడం పెద్దగా శ్రమ లేని పని.
నేను నల్లబల్ల మీద తెలుగులో ఒక మాట రాసి, దాని పక్కనే ఇంగ్లీషు లిపిలో (RTS పద్ధతిలో) దాని ఉచ్చారణ సూచించేవాడిని. అది వారు చూసి, వారివారి కంప్యూటర్లలో లేఖిని ఇచ్చిన పెట్టెలో కాని, పద్మ సూచించిన పెట్టెలో కాని రాసుకుంటే కంప్యూటరు దానిని తెలుగులిపి లోకి మార్చి చూపించేది. దానికి నకలు తీసి Word ఫైల్లో అంటించుకుని దాచుకునేవారు.
ఈ RTS వాడకం వల్ల ఒక ఇబ్బంది వచ్చి పడింది. RTSలో పూర్ణబిందువుని సూచించడానికి M అనే అక్షరం వాడాలి. ఉదాహరణకి, అందరు – అని తెలుగులో రాయాలంటే ఇంగ్లీషు లిపిలో aMdaru అని రాయాలి. ఇక్కడ వచ్చిన చిక్కు సమగ్రంగా అర్థం కావాలంటే ఈ దిగువ కథనం చదవండి.
తెలుగులో రెండు రకాల బిందువులు (లేదా సున్నలు) వాడుకలో ఉన్నాయి. ఒకటి నిండు సున్న లేదా పూర్ణ బిందువు లేదా పూర్ణానుస్వారం. మరొకటి అర సున్న లేదా అర్ధ బిందువు లేదా అర్ధానుస్వారం. నిజానికి, మొదట్లో, తెలుగు భాషలో అరసున్న లేదు; ముద్రణ వచ్చిన తరువాతే అరసున్న అనే లేఖన చిహ్నం వాడుకలోకి వచ్చి చేరింది. ఆధునిక భాషలో అరసున్న ప్రయోగం లేదు; తేలిక తెలుగులోనూ లేదు.
తెలుగు మాటలలో నిండు సున్న చాల తరచుగా వస్తుంది. ఈ రోజులలో మాట చివర ము-వర్ణానికి బదులు నిండు సున్న వాడడం పరిపాటి అయిపోవడంతో నిండు సున్న వాడకం ఇనుమడించింది.
కేవలం బిందువు అక్షరం కాదు; దాని ముందున్న వర్ణంతో కలసి అక్షరం అవుతుంది. అందుచేత నిండు సున్న మాట మధ్యలో వచ్చినప్పుడు ఆ మాటని సున్న ముందు విరచి తరువాత వరసని సున్నతో ఆరంభించి రాయకూడదు.
ఇటాలియన్ లాగే తెలుగు అచ్చులతో అంతమయే మాటల మూట అనిన్నీ, అందుకనే ఇటాలియన్ లాగే తెలుగు కూడ సంగీతానికి అనువైన భాష అనిన్నీ నా విద్యార్థులకి చెప్పేవాడిని. ఆదిలోనే హంసపాదులా అక్కడే పిల్లలు అభ్యంతరం చెప్పేరు. మేం, మనం, వస్తాం, వెళతాం, ఉంటాం, చేస్తాం, ధనం, ఇస్లాం, ముస్లిం, రామబ్రహ్మం, సుబ్రహ్మణ్యం, ఇలా సున్నతో అంతం అయేవన్నీ అనే న్ హల్లుతో అంతం అయినట్లు వారి చెవికి వినపడుతున్నాయే అని వారి సందేహం.
మరొక సందర్భంలో, “తెలుగులో ఎలా రాస్తే అలా ఉచ్చరిస్తాం. ఎలా ఉచ్చరించాలో అలానే రాస్తాం. ఇంగ్లీషులో ఒకే మాటని పలువురు పలు విధాలుగా ఉచ్చరించడానికి సావకాశం ఉంది; ఇంగ్లీషు ఫోనెటిక్ భాష కాదు, తెలుగు ఫోనెటిక్ భాష,” అని చెప్పేను. చెప్పి, నా వాదాన్ని బలపరచుకోడానికి నల్లబల్ల మీద సుద్దముక్కతో ukraine అని రాసి దానిని చదవమంటే కొందరు ఉక్రెయిన్ అనిన్నీ మరికొందరు యుక్రెయిన్ అనిన్నీ చదివేరు. కాని విద్యార్థులకి నా ఉదాహరణ నచ్చలేదు. నా ఉదాహరణకి పోటీగా వారు కందులు అనే మాట తీసుకున్నారు. దీనిని కమ్‌దులు అనాలా? కన్‌దులు అనాలా? నేను కం-ని comeలా పలుకుతున్నా, కందులు-ని కన్‌దులు అని పలుకుతూన్నట్లు వారి చెవికి వినపడుతోందని వారి వాదన.
మనం సున్నతో, లేదా పూర్ణబిందువుతో, కూడిన మాటలు తరచు వాడుతూ ఉంటాం కాబట్టి నా విద్యార్థులు లేవనెత్తిన ప్రశ్నని కొంచెం తరచి చూడవలసిన అవసరం ఉందనిపించింది. పూర్వం, ము వచ్చే చోటల్లా ఇప్పుడు సున్ననే వాడుతున్నాం, రాతలో ము రాసినా సున్ననే పలుకుతున్నాం. దీని వాడుక ఎక్కువ అవడం వల్ల ఒకప్పుడు అజంతంగా వర్ధిల్లిన భాష స్వభావం ఇటీవలి కాలంలో హలంతంగా మారిపోతోంది. తెలుగు అజంత భాష అనడానికి వీలు లేనంతగా తెలుగు స్వరూపం మారిపోతోంది.
శాస్త్రం ప్రకారం తెలుగు భాషలోలో సున్న క, చ, ట, త, ప– లకి, గ, జ, డ, ద, బ– లకి ముందే వస్తుంది. ఉదాహరణకి: వంక, కంచము, గంట, కంత, కంప, కొంగ, గుంజ, కొండ, కంద, చెంబు, వగైరాలు. సున్న తరువాత కచటతపలు, గజడదబలు కాక ఇతర హల్లు ఏది ఉన్నా ఆ మాట తెలుగు మాట కాదని చెప్పవచ్చు. ఉదాహరణకి: సంయమనం, సంవాదం, సంస్కృతం, వంశం, హంస, వగైరాలు.
ఇప్పుడు పైన ఉదహరించిన మాటలని ఎలా ఉచ్చరిస్తామో ఒక సారి చూద్దాం. కంది-ని కంది అని పూర్ణానుస్వారాన్ని నొక్కి మకారంతో పలుకుతామా లేక కన్‌ది అని కాని కన్ది (న కింద ద) అని నకారంతో కాని పలుకుతామా? రాతలో పూర్ణానుస్వారాన్ని వాడినా పలికేటప్పుడు చాల మంది నకారంతో కన్ది అనే అంటారు. ఈ విషయం అమెరికా పిల్లలు పసిగట్టి నన్ను అడిగేసరికి నా సుడి బాగుండి, వేళకి ‘కటపయాది సూత్రం’ స్పురణకి వచ్చి వారికి ఈ విధంగా (తప్పో, ఒప్పో) సమాధానం చెప్పేను:
ఒక్క తెలుగులోనే కాదు, చాల భారతీయ భాషలలో హల్లులని అయిదు వర్గాలుగా విడగొట్టి రాస్తారు: క-వర్గు, చ-వర్గు, ట-వర్గు, త-వర్గు, ప-వర్గు. ప్రతి వర్గులోను అయిదేసి అక్షరాలు ఉంటాయి; అయిదోది అనునాసికం, అంటే, ముక్కుతో పలికేది. ఒక వర్గులోని హల్లు ముందు ఆ వర్గు చివర ఉన్న అనునాసికమే వస్తుంది. కనుక వంక అని రాయవలసి వచ్చినప్పుడు వఙ్క అనిన్నీ, గంట-ని గణ్ట అనిన్నీ, కంత-ని కన్త అనిన్నీ, కంప-ని కమ్ప అనిన్నీ రాయాలి – కటపయాది సూత్రం ప్రకారం. అప్పుడు పరుష సరళాల తరువాత సున్న అవసరం ఉండదు; రాసినట్లే ఉచ్చరిస్తాము కూడ. ప్రాచీన కాలంలోనే ఈ అనునాసికాల వాడకానికి కాలదోషం పట్టి ఆ స్థానంలో సున్న చేరింది. చేరి, ఉచ్చారణలో సందిగ్ధత తీసుకొచ్చింది.
(అవకాశం వచ్చింది కదా అని ఇదే సందర్భంలో) భారతీయ భాషలలో వర్ణమాల అమరిక – అంటే ముందుగా అచ్చులు, తరువాత హల్లులు, వాటిని కూడ ఆషామాషీగా కాకుండా ఒక క్రమ పద్ధతితో, ధ్వని పుట్టే ప్రదేశాన్ని బట్టి కంఠ్యములు (అ, ఆ, క, ఖ, గ, ఘ), తాలవ్యములు (ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, య, శ), మూర్దన్యములు (ట, ఠ, డ, ఢ, ణ, ర, ష), దంత్యములు (త, థ, ద, ధ, న, ల, స), ఓష్ఠ్యములు (ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ) అని అమర్చిన విధం లోని శాస్త్రీయతని ఎత్తి చూపి ఇంగ్లీషు వర్ణమాలలో వచ్చే అక్షరాలు ఆ వరుసలో ఉండడానికి ఒక తార్కికమైన కారణం అంటూ ఏదీ లేదని చెప్పేసరికి వారికి తెలుగు మీద ఒక రకం గురి, గౌరవం కలిగేయి.
4. పదసంపద
భాష మీద పట్టు రావాలంటే వ్యాకరణ సూత్రాల కంటె ముఖ్యమయినది పదజాలం. మనం అయిదేళ్ల వయసప్పుడు ఒకటవ తరగతిలో చేరి తెలుగు నేర్చుకునే వేళకి మనకి తెలుగు పదజాలం మీద మంచి పట్టే ఉంటుంది. అమెరికాలో నా విద్యార్థులకి తెలుగు పదజాలంతో పరిచయమే లేదు. ఈ సమస్యని ఎదుర్కోడానికి నా అనుభవాల మీదనే ఆధారపడవలసి వచ్చింది.
నేను మొట్టమొదట ఉద్యోగం చేసిన ఊరు తమిళ దేశంలోని నేవేలీ. నాకు అప్పట్లో తమిళంతో ఏమాత్రం పరిచయం లేదు. నా స్నేహితుడు ఆనందవికటన్, కుముదం అనే పత్రికలు తెచ్చుకుని చదివేవాడు. ఆ పత్రికలలో వ్యాపార ప్రకటనలు ఉండేవి. లక్సు, రెక్సోనా సబ్బులు, రీటా హెయిర్ ఆయిల్, అమృతాంజనం, ఆస్ప్రో, ఈనోస్ ఫ్రూట్‌సాల్ట్, వంటి పేర్లు తమిళంలో చూసి పక్కపక్కన ఉండే బొమ్మలలో ఉండే ఇంగ్లీషు మాటలతో సరిపోల్చి చూసి, ఎవ్వరూ నేర్పకుండా, నా అంతట నేనే తమిళం ఓనమాలు, గుణింతాలు, రాయడం, చదవడం నేర్చుకున్నాను. రెండు భాషల వ్యాకరణాలూ సమాంతరంగా ఉన్నాయి కనుక ఒక ఇబ్బంది తప్పింది. సినిమా ప్రకటనలు కూడ ఈ ప్రయత్నంలో ఎంతగానో ఉపయోగపడేవి. మన నాగయ్య, సావిత్రి, భానుమతి – వీళ్ల ముఖాలు చూసి, కిందనున్న తమిళం పేర్లు చదివేవాడిని. చుట్టూ ఉన్నవాళ్లంతా, లేచింది మొదలు పక్క మీద మేను వాల్చేదాకా, తమిళం మాట్లాడుతూ ఉంటే వినేవాడినేమో క్రమేపీ మాట్లాడడం కూడ కొద్దికొద్దిగా వచ్చింది – కేవలం నాలుగు నెలలలో! దీనినే ఇంగ్లీషులో ఇమ్మర్షన్ పద్ధతి అంటారుట. నిండా ములిగితే కాని భాష అంటదంటారు. ఆ రోజులలో నేవేలీలో నేను, మరొకడు తప్ప మూడో తెలుగు ముఖం నాకు కనిపించలేదు. తమిళం ఒంటపట్టడానికి ఈ ఒంటరితనం కూడ ఒక విధంగా సహాయం చేసింది.
నేను భిలాయిలో మూడేళ్లు ఉద్యోగం చేసినప్పుడు నా అంతట నేనే పుస్తకాలు చదివి రష్యన్ నేర్చుకున్నాను. రోజల్లా రష్యన్ ఇంజనీర్లతో పని కాబట్టి, అవసరం కొద్దీ మాట్లాడడం వచ్చింది. రాయడం, చదవడం నా ప్రయత్నం వల్ల వచ్చింది. మొదట్లో వాక్యం పూర్తిగా నిర్మించి మాట్లాడలేకపోయినా తోకా (కరెంటు), వప్రషేనియా (ఓల్టేజి), సప్రతివ్లేనియా (రెసిస్టెన్స్) వంటి ముఖ్యమయిన మాటలు వస్తే అంతా ఇంజనీర్లమే కనుక భావం అర్థం అయిపోయేది. తమాషా ఏమిటంటే భిలాయిలో ఉన్న మూడేళ్లల్లో రష్యన్ వచ్చింది కాని హిందీ రాలేదు. దీనికీ కారణం ఉంది. పని నుండి ఇంటికి తిరిగొచ్చిన తరువాత నా సహచరులు, స్నేహితులు, అంతా తెలుగు వాళ్లే! పనిలో ఉన్నంత సేపు రష్యాలో ఉన్నట్లే ఉండేది.
కాని, అమెరికాలో నా విద్యార్థులకి నేను తప్ప మరొక తెలుగువాడు తెలియదు. తరగతి గదిలో కూర్చున్నప్పుడు తప్ప వారికి తెలుగుతో ఎక్కడా సంపర్కం లేదు. ఈ పరిస్థితులలో వారికి ఓనమాలతో పాటు తెలుగు పదజాలం కూడ నేనే నేర్పవలసి వచ్చింది. భాష మీద పట్టు రావాలంటే పదజాలం మీద అధికారం ఎంత ముఖ్యమో అప్పుడు తెలిసింది.
పదజాలం మీద అధికారం రావాలంటే నాకు తెలిసిన మార్గాలు రెండు: ఒకటి నేను చిన్నప్పుడు ఒకటో తరగతిలో నేర్చుకున్నట్లు, అ – అమ్మ, ఆ – ఆవు, ఇ – ఇల్లు, ఈ – ఈగ, … అనుకుంటూ బొమ్మల పుస్తకంలో బొమ్మలు చూస్తూ చదవడం. తరువాత బొమ్మలు లేకపోయినా శబ్దాన్ని అనుకరించే టకటక, బరబర, గడగడ, చకచక, వంటి మాటలు బట్టీయం వెయ్యడం.
భాషతో పరిచయం లేని వాళ్లు భాష నేర్చుకునేటప్పుడు బాగా పని చేసే పద్ధతి మరొకటి ఉంది. విద్యార్థులని ఒక ఊహా ప్రపంచం లోని బజారుకి తీసుకెళ్లడం. అక్కడ ఒక వస్తువు కొనడానికి తెలుగులో ఎలా మాట్లాడడమో నేర్పడం. మరొక రోజు ట్రెయిను టికెట్టో, బస్సు టికెట్టో కొనడం నేర్పడం. ఇలా రకరకాల సందర్భాలు తయారు చేసి ఆయా సందర్భాలలో తెలుగు ఎలా మాట్లాడడమో నేర్పడం. ఈయీ సందర్భాలలో వచ్చే మాటలని ఒక జాబితాలా రాసి వారి చేత ఆ మాటలని పదేపదే వాడమని ప్రోత్సహించడం. అదే సందర్భంలో వ్యాకరణ సూత్రాలని, ఏక వచనం, బహువచనం, లింగ భేదం సూచించడం, మొదలైనవి నేర్పడం. మా విశ్వవిద్యాలయంలో ఇతర దేశాల భాషలు నేర్పే శాఖలు ఉన్నాయి. వారిని సంప్రదిస్తే ఈ పయిన చెప్పిన విధంగా తెలుగు నేర్పమని నన్ను ప్రోత్సహించేరు.
నా విద్యార్థులందరికీ ఇంగ్లీషు వచ్చు కనుక ఇంగ్లీషు పదాలని తెలుగు వాక్యాలలో వాడడం ఎలాగో నేర్పడం తేలిక:
డౌన్‌టౌన్ (కి) వెళదామా?
లంచ్ (ని) తిందామా?
సినిమా (ని) చూద్దామా?
బుక్స్ ఏవి?
ఇలా మొదలు పెట్టిన తరువాత చెప్పేను: “ఇతర భాషల నుండి మాటలు అరువు తెచ్చుకుని వాడడంలో తెలుగు వెనుకాడదు. పూర్వం సంస్క్రుతం నుండి అరువు తెచ్చుకున్నట్లే ఈ రోజుల్లో ఇంగ్లీషు నుండి అరువు తెచ్చుకుంటున్నాము కనుక ఇంగ్లీషు నామవాచకాలు ధారాళంగా వాడండి,” అంటూ ప్రోత్సహించేను. నా ప్రయత్నాన్ని ఎక్కువగా క్రియలమీద, విభక్తి ప్రత్యయాల మీద, సర్వనామాల మీద కేంద్రీకరించేను.
ఈ రోజులలో వాడుకలో ఉన్న తెలుగులో దరిదాపు 50 శాతం వరకు సంస్క్రుతం మాటలు ఉండొచ్చని ఒక అంచనా ఉంది. ఈ మాటలు శతాబ్దాల తరబడి తెలుగులో జీర్ణించుకుపోయాయి కనుక ఏవి తెలుగు మాటలో, ఏవి సంస్క్రుతం నుండి వచ్చేయో చాల మందికి తెలియదు.
ఇలా తెలుగు మీద సంస్క్రుతం వెయ్యేళ్లబట్టి తన ప్రభావాన్ని చూపెడుతోంది. ఇటీవల ఇదే రకమయిన ప్రభావాన్ని ఇంగ్లీషు చూపెడుతోంది. కనుక ఇంగ్లీషు మాటలు, ప్రత్యేకించి నామవాచకాలు, భయపడకుండా వాడేవాళ్లం, తేలిక తెలుగులో. కొన్ని తెలుగు విభక్తి ప్రత్యయాలు, క్రియావాచకాలు నేర్చుకుంటే వాటిని ఇంగ్లీషు నామవాచకాలతో కలిపి వాడితే మరేమీ ఎబ్బెట్టుగా ఉండదని హామీ ఇచ్చేను. ఈ దెబ్బతో నా విద్యార్థులకి తెలుగు పదజాలం మీద అధికారం లేకపోయినందువల్ల కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకోగలిగేను.
5. తత్సమాలు, తద్భవాలు
ప్రతి భాషకూ ఒక ధ్వని వ్యవస్థ ఉంటుంది. ఇతర భాషల నుండి మాటలు అరువు తెచ్చుకున్నప్పుడు అవి మన భాషలో ఇమడకపోతే మన భాషకు అనుగుణంగా మార్చుకుంటాం. కొన్ని సందర్భాలలో పరభాషా పదాలతోపాటు వాటి ఉచ్చారణని కూడ అరువు తెచ్చుకుంటాం. ఉదాహరణకి సంస్క్రుతం నుండి కాని, ఇంగ్లీషు నుండి కాని తెలుగులోకి అరువు తెచ్చుకున్నప్పుడు రెండు పద్ధతులు అవలంబించాం: తత్సమాలు మూల భాషలోని ఉచ్చారణని యధాతథంగా అనుకరించగా వచ్చినవయితే తద్భవాలు మన భాషలోని ఉచ్చారణకి అనుకూలంగా మార్చుకుని తెచ్చుకున్నవి. ఉదాహరణకి సంస్క్రుతం నుండి తెలుగులోకి వచ్చిన కొన్ని తద్భవాలు:
పుణ్యము > పున్నెం
రథము > అరదం
భక్తి > బత్తి
మృత్యువు > మిత్తి
భాష > బాస
ద్యూతం > జూదం
ఇంగ్లీషు నుండి తెలుగులోకి వచ్చి మార్పు చెందిన మాటలకి కొన్ని ఉదాహరణలు:
pension > పింఛను
constable > కనిష్టీపు
hospital > ఆసుపత్రి
ఇవి కొద్ది ఉదాహరణలే అయినా వీటిని బట్టి పూర్వకాలం నుండీ కూడ తత్సమాలకి ఉన్న ఆదరణ తద్భవాలకి లేదేమో అనిపిస్తుంది. అందుకని ఇంగ్లీషు మాటలని తత్సమ రూపంలో వాడేసినా పరవాలేదని ఒక నిశ్చయానికి వచ్చేం.
ఇటీవలి కాలంలో తత్సమాల వాడుక ఎక్కువయింది. ఉదాహరణకి, పూర్వం ఆసుపత్రి అనే మాట విస్తారంగా వాడుకలో ఉండేది; ఈ రోజులలో హాస్పిటల్ అనేవారే ఎక్కువ. ఇంగ్లీషు మాటలు, సంస్క్రుతం మాటలు తెలుగులో తత్సమ రూపంలో విస్తారంగా ప్రవేశించడం వల్ల తెలుగు అజంతం అని చెప్పుకోడానికి వీలు లేకుండా పోతోంది.
మనం నిత్యం వాడే తెలుగులో తెలుగు మాటలతోపాటు సంస్క్రుతం మాటలు, ఇంగ్లీషు మాటలు ఎక్కువగా కలిసిపోతూ ఉంటాయనుకున్నాం కదా. ఇంగ్లీషు మాటలని గుర్తించడం తేలికే గాని, ఏది తెలుగో ఏది సంస్క్రుతమో గుర్తించడానికి కొంచెం అనుభవం, మరి కొంచెం పాండిత్యం ఉండాలి. అలా గుర్తు పట్టగలిగితే తప్పులు దొర్లడానికి సావకాశం తక్కువ.
6. సంధులు, సమాసాలు
కాలప్రవాహానికి ఎంత లొంగినా తెలుగు స్వతహాగా అచ్చులతో అంతం అయే భాష (అజంతం.) అంటే తెలుగు మాటల చివర అచ్చులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక మొదటి మాట అచ్చుతో అంతం అయి తరువాయి మాట అచ్చుతో మొదలయినప్పుడు రెండు అచ్చులు వరసగా రావాలి కదా. కాని తెలుగు మాటలలో రెండు అచ్చులు వరసగా రావు; ఇటువంటి సందర్భంలో సంధి జరుగుతుంది. ఈ సంధి గురించి కొంచెమయినా అర్థం అయితే ఉచ్చారణదోషాలు తగ్గుతాయని నా నమ్మకం. ఉదాహరణకి, హిమాలయ వంటి మాటలని హిమలయా అని అనకుండా ఉండాలంటే అక్కడ జరుగుతూన్న సంధి తెలియాలి.
తెలుగులో సంధి జరగడమంటే మొదటి మాట చివరి అచ్చు లోపించి, రెండవ మాటలోని మొదటి అచ్చు ప్రకాశిస్తుంది. అప్పుడప్పుడు సంధి జరగకపోవచ్చు. సంధి జరగని సందర్భాలలో రెండు అచ్చులకి మధ్య ఒక హల్లు వచ్చి చేరుతుంది. సర్వసాధారణంగా అలా వచ్చి చేరిన హల్లు య అవుతుంది; అప్పుడు దానిని యణాదేశ సంధి అంటారు. తేలిక తెలుగు యణాదేశ సంధిని ప్రోత్సహించదు. కనుక తేలిక తెలుగులో ‘మా ఊరు’ని మాయూరు అని రాయం; మా ఊరు అని సంధి చెయ్యకుండానే రాస్తాం. ఇదే విధంగా పెద్ద ఎత్తున అన్న పదబంధాన్ని పెద్దయెత్తున అని రాయం; పెద్ద ఎత్తున అనే రాస్తాం.
భారతీయ భాషలలో సంధి తరచుగా జరిగే ప్రక్రియ. ఈ సంధి ఇంగ్లీషులో కూడ ఉందని సోదాహరణంగా చూపిస్తాను. ఈ దిగువ ఉదాహరణలు చూడండి.
no + one = none o లోపించింది.
ride + ing = riding e లోపించింది
guide + ance = guidance e లోపించింది
hope + ing = hoping e లోపించింది
entire + ly = entirely e లోపించలేదు
like + ness = likeness e లోపించలేదు
arrange + ment = arrangement e లోపించలేదు
ఈ ఉదాహరణలలో ఉత్తరపదం అచ్చుతో (a, e, i, o, u) మొదలయినప్పుడు, పూర్వ పదం చివర ఉన్న అచ్చు లోపిస్తుంది – తెలుగులో లాగే!
ఇంగ్లీషులో సంధిని పోలిన మరొక ప్రక్రియతో బోలెడు కొత్త మాటలు తయారు చేస్తున్నారు. (ఉదా. smoke + fog = smog, motor + hotel = motel, wiki + encyclopedia = wikipedia). ఇక్కడ రెండు మాటలని జత చేసి, అలా జత చేయగా వచ్చిన సమాసాన్ని కుదించి రాస్తారు. ఈ పద్ధతి ఉపయోగించి తెలుగులో ప్రయోగాత్మకంగా తయారు చేసిన ఉదాహరణలు:
బహుళమైన + అణువు = బణువు (మాలిక్యూల్)
ద్వియాంశ + అంకం = ద్వింకం (బైనరీ డిజిట్ లేదా బిట్)
వ్యాకరణ + కర్తలు = వ్యాకర్తలు.
పదబంధం మరీ పొడుగయిపోతే కేవలం పొడి అక్షరాలతో మాటలు అల్లవచ్చు: కసాగు (కనిష్ఠ సామాన్య గుణిజం), గసాభా (గరిష్థ సామాన్య భాజకం).
7. తేలిక తెలుగు రాతలో నియమాలు
ఏ భాషలోనయినా సరే అన్ని శబ్దాలని పుట్టించడానికి కావలసినన్ని లేఖన చిహ్నాలు ఉండవు. ఉదాహరణకి సంస్క్రుత శబ్దాలని ఉచ్చరించడం కొరకు మనం తెలుగులో ఎన్నో లేఖన చిహ్నాలు ప్రవేశపెట్టేం. వీటిలో చాలవాటిని తేలిక తెలుగులో కూడ వాడుతున్నాం (ఉదా. మహాప్రాణాలు లేక ఒత్తు అక్షరాలు, శ, ష లు). ఇన్ని అక్షరాలు ఉన్నా ఇంగ్లీషు లోని బేంక్ వంటి శబ్దాలని ఉచ్చరించడానికి మరొక సరికొత్త లేఖన చిహ్నం ఉండాలని వాదించేవారు లేకపోలేదు.
పైన నుడివిన సమస్య బొమ్మ అనుకుంటే దానికి బొరుసు సమస్య మరొకటి ఉంది: తెలుగులో కొన్ని శబ్దాలని పుట్టించడానికి ఒకటి కంటె ఎక్కువ పద్దతులలో రాయవచ్చు. ఉదాహరణకి ఇ, ఈ, ఎ, ఏ లని తెలుగులో యి, యీ, యె, యే అనిన్నీ, ఉ, ఊ, ఒ, ఓ లని వు, వూ, వొ, వో అనిన్నీ రాస్తూ ఉంటారు. తేలిక తెలుగులో నియమం ఏమిటంటే – మాట మొదట్లో యి, యీ, యె, యే, వు, వూ, వొ, వో-లు రావు. ఈ నియమం ప్రకారం తేలిక తెలుగులో, యిక్కడ, యెప్పుడు, యేవి, అని రాయకూడదు; ఇక్కడ, ఎప్పుడు, ఏవి అనే రాయాలి. ఉట్టి అని రాయాలి కాని వుట్టి అనే ప్రయోగం కూడదు. దీనినే సూత్రంలా చెప్పాలంటే: అజాది పదాలని హలాదులుగా రాయవద్దు.
ఇదే విధంగా మాట మధ్యలో కాని, చివర కాని ఇ, ఈ, ఎ, ఏ, ఉ, ఊ, ఒ, ఓ-లు రావు. కొన్ని ఉదాహరణలు. తేలిక తెలుగులో ఐ లేదు కనుక పైకం-ని పయికం అని రాయాలని చెప్పేను కదా. ఈ మాటని పఇకం అని రాయకూడదు. ఇదే విధంగా రయితు సరి అయిన ప్రయోగం కాని రఇతు కాదు. మరొక రకం ఉదాహరణ: ఆవు అనే రాయాలి కాని ఆఉ అని రాయకూడదు.
ఒకే మాటలో రెండు అచ్చులు వరసగా రావు. అఇతే, ఆఉ, ఏఓ, మొదలైన పద్ధతిలో తెలుగులో మాటలు రాయకూడదు. వీటిని అయితే, ఆవు, ఏవో, అని రాయాలి.
9. ఒత్తులు
సంస్క్రుతం తెలుగులో వచ్చి కలవడం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అన్నే ఉన్నాయని నా అనుమానం. అలాగని సంస్క్రుతాన్ని విడనాడి అచ్చ తెలుగు వాడమని నేను అడగడం లేదు.
ఉదాహరణకి సంస్క్రుతం తెలుగులో కలియడం వల్ల తెలుగు పదజాలం విపరీతంగా పెరిగింది. ఆ పదజాలంతో పాటు సంస్క్రుత నియమాలు, వర్ణక్రమాలు, వ్యాకరణ సూత్రాలు, వగయిరా తెలుగులో వచ్చి చేరేయి. వీటిని తెలుగు లిపిలో రాయడానికి తెలుగులో కొత్త అక్షరాలు కూడ వచ్చి చేరాయి. ఇలా వచ్చి చేరిన అక్షరాలలో అధిక భాగం ఒత్తు అక్షరాలు లేదా మహాప్రాణాలు.
మనం, ఒత్తు అన్న మాటని రెండు అర్థాలలో వాడతాం. ‘క కింద ర ఒత్తు ఇస్తే క్ర, ష కింద ట ఒత్తు ఇస్తే ష్ట’ వంటి ప్రయోగంలో ఒత్తు అంటే హల్లుకి ఉండే ప్రత్యామ్నాయ రూపం. ‘ప కింద ఒత్తు ఇస్తే ఫ’ అయినప్పుడు ప అల్పప్రాణం, ఫ మహాప్రాణం. ఈ రెండు రకాల ప్రయోగాలని ఒత్తు అనే అంటున్నాను. హల్లులు అచ్చులతో కలసినప్పుడు వాడే గుర్తులని ఒత్తులు అనరు కాని, తేలిక తెలుగులో మనని ఎక్కువగా ఇబ్బంది పెట్టే వట్రసుడిని కూడ ఈ కోవలో చేర్చి మాట్లాడుకుందాం.
నా దగ్గర శాస్త్రీయమయిన గణాంకాలు లేవు కాని ఈ నాడు వాడుకలో ఉన్న తెలుగులో ఎక్కువ వర్ణక్రమదోషాలు దొర్లే సమయం ఒత్తులు ఉపయోగించే సందర్భంలోనే అని నా నమ్మకం.
తెలుగులో ఒత్తక్షరాలు లేవు. సంస్క్రుతం నుండి దిగుమతి అయిన మాటలని తెలుగు లిపిలో రాయడానికని ఒత్తు అక్షరాలని మన వర్ణమాలలో ప్రవేశపెట్టేరు. కనుక ఏ మాటలో ఏ అక్షరానికి ఒత్తు ఉందో తెలియాలంటే సంస్క్రుతంతో పరిచయం ఉండాలి. ఆ పరిచయం లేకపోతే ఒత్తులు ఎక్కడ పెట్టాలో బట్టీయం వెయ్యాలి తప్ప అన్ని సందర్భాలలోను పని చేసే నియమాలు, సూత్రాలు, బండగుర్తులు లేవు. కనుక ఒత్తులు ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టకూడదో చెబుతూ కూర్చుంటే నాకు ఉన్న నియమిత కాలం సరిపోదు. అందుకని తప్పనిసరి సందర్భాలలోనే ఒత్తులు ఉన్న మాటలు వాడి పబ్బం గడుపుకోవలసి వచ్చింది. సంస్క్రుత పదాల వాడుక తగ్గిస్తే ఒత్తుల అవసరం తగ్గుతుంది కదా.
ఒత్తక్షరాల విషయంలో మూడు రకాల తప్పులు దొర్లుతూ ఉంటాయి:
లేని చోట ఒత్తు పెట్టడం: కర్మ కి బదులు ఖర్మ అని, ఉచ్చారణకి బదులు ఉచ్ఛారణ అని రాయడం ఉదాహరణలు.
ఉండవలసిన చోట ఒత్తు పెట్టకపోవడం: బాధ, భేదం, బంధం, వగైరా మాటలలో ఒత్తు ఎక్కడుండాలో చాలమందికి తెలియక తప్పు చోట ఒత్తు పెడుతూ ఉంటారు.
ఒత్తు ఉన్న చోట తప్పు రకం ఒత్తు పెట్టడం: సాధారణంగా త, థ ఒత్తులని, థ, ధ ఒత్తులని, ట, ఠ ఒత్తులని తారుమారు చెయ్యడం ఈ రకం తప్పులకి ఉదాహరణలు. అర్థం, అర్ధం, షష్టి, షష్ఠి వంటి మాటలలో ఒత్తుని బట్టి అర్థం మారిపోతుంది. ప్రథమ, ప్రధమ, విశ్వనాథం, విశ్వనాధం వగైరాలు మరొక జాతి తప్పులకి ఉదాహరణలు.
ఒత్తులని పూర్తిగా మానేసి, సాదకబాదకాలు అని రాస్తే, ఏదోలే, రచయిత విక్రుతి రూపం వాడి ఉండొచ్చు! అని సరిపెట్టుకోవచ్చు కాని, సాదకబాధకాలు అని ఒక చోట ఒత్తు సరిగ్గా రాసి, మరొక చోట రాయకపోతే భండారం బయట పడుతుంది.
ఒక మాటలో ఏ అక్షరానికి ఒత్తు ఉందో అనుమానం వచ్చినప్పుడు అదే ధాతువు నుండి పుట్టిన ఏకోదర పదాలు నెమరు వేసుకుంటే కొంత లాభం ఉండొచ్చు. కొన్ని ఉదాహరణలు: భేదం అనే మాటలో బ-కి ఒత్తు ఇవ్వాలి. ఈ మాటకి ఎక్కడ ఒత్తు పెట్టాలా అనే సంశయం నాకూ వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ భేదం యొక్క ధాతువు నుండి ఏర్పడ్డ సమీప పదాలని ఒక సారి నెమరు వేసుకుంటాను: విభేదం, భేదించు, దుర్భేద్యం, మొదలయినవి. ఇలా మననం చేసుకున్నప్పుడు ఎక్కడ ఒత్తు ఉండాలో సాధారణంగా తెలుస్తుంది. అలాగే బంధం, ప్రబంధం, అనుబంధం, దిగ్బంధం, నిర్బంధం,… ఇలా వల్లె వేసుకుంటూ పోతే ఒత్తు ఎక్కడ ఉండాలో సాధారణంగా నాకు స్పురిస్తుంది.
సాధారణంగా అర్ధ ఎక్కడ వాడాలో, అర్థ ఎక్కడ వాడాలో నాకు అనుమానం వస్తూ ఉంటుంది. ఒక్క సగం అనే భావాన్ని వ్యక్తపరచవలసినప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలోను అర్థ అనే ప్రయోగమే సరి అయినది. అర్ధ అంటే సగం, అర్థ అంటే కోరబడేది. ఈ వివరణతో పదార్థం, అర్థశాస్త్రం, విద్యార్థి, నిరర్థకం, పార్థసారథి, మొదలయిన పదాలన్నిటిలోను ర కింద థ వస్తుంది.
10. వర్ణక్రమదోషాలు, చిటకాలు
ఇంగ్లీషులో వర్ణక్రమదోషాలు రాకుండా కాపాడుకోడానికి నా చిన్నతనంలో నాలుగు చిటకాలు నేర్చుకున్నాను. ఇవి కేవలం చిటకాలు మాత్రమే; సర్వత్రా అన్వయించవు, చాల మినహాయింపులు ఉన్నాయి. కాని ఏ సూత్రం లేకపోవడం కంటె ఏదో ఒక సూత్రం ఉంది కదా అన్న ధోరణిలో ఈ సూత్రాలు తరతరాలబట్టి వస్తున్నాయి.
మొదటి సూత్రం: E after I, except C
EXAMPLES: believe, chief, piece, and thief; deceive, receive.
COMMON EXCEPTIONS: efficient, ancient, weird, height, weight, freight, neither, caffeine, foreign.
రెండవ సూత్రం: Drop the final E, before a suffix beginning with a vowel (a, e, i, o, u), but not before a suffix beginning with a consonant.
EXAMPLES:
ride + ing = riding
guide + ance = guidance
hope + ing = hoping
entire + ly = entirely
like + ness = likeness
arrange + ment = arrangement
COMMON EXCEPTIONS: truly, usable.
మూడవ సూత్రం: Change a final y to i before a suffix, unless the suffix begins with i.
EXAMPLES:
defy + ance = defiance
party + es = parties
pity + ful = pitiful
try + es = tries
try + ing = trying
copy + ing = copying
occupy + ing = occupying
COMMON EXCEPTIONS: journeying, memorize.
నాలుగవ సూత్రం: Double a final single consonant before a suffix beginning with a vowel when both of the following conditions exist:
(a) a single vowel precedes the consonant; (b) the consonant ends an accented syllable or a one-syllable word.
EXAMPLES:
stop + ing = stopping
admit + ed = admitted
occur + ence = occurrence
stoop + ing = stooping
benefit + ed = benefited
delight + ful = delightful
ఈ రకం చిటకాలని మనం తేలిక తెలుగులో తయారు చేసుకోవాలి. మచ్చుకి కొన్ని చూపెడతాను.
తేలిక తెలుగు మాటల మొదట్లో సున్న, నకారపొల్లు, ణ, థ, ళ ఉండవు.
ఒకే మాటలో రెండు అచ్చులు వరసగా ఉండవు.
మాట మొదట ద్విరుక్తం ఉండదు. ద్విరుక్తం అంటే ఒకే హల్లు రెండు సార్లు రావడం. అనగా, క్క, గ్గ, ట్ట వంటి అక్షరాలతో మాటలు మొదలవవు.
పదాదిలో ధకారమే ఉంటుంది, థ కారం ఉండదు: ధనం, ధాన్యం, ధ్వని.
సంయుక్త వర్ణం అంటే రెండు కాని, అంత కంటె ఎక్కువ కాని వివిధ హల్లుల సమాగమం. తేలిక తెలుగులో రెండవ వర్ణం ర-కారం అయినప్పుడు, ఆ ర-కారం లోపించిన రూపాన్నే వాడండి. ఉదాహరణకి కింద, కుక్కు, కొత్త, కొవ్వు, గుడ్డి, తవ్వు, తాగు వంటి ప్రయోగాలనే వాడండి.
కచటతప-లకి థ ఒత్తే ఉంటుంది కాని ధ ఉండదు: అశ్వత్థ.
గజడదబలకి ధ ఒత్తే ఉంటుంది: బద్ధ, బుద్ధ, ప్రసిద్ధ, సిద్ధ, శుద్ధ, సిద్ధాంత.
సకారంతో థ కారమే వస్తుంది, ధ కారం రాదు: స్థితి, స్థాన, అవస్థ, ఆస్థి, స్థూల, స్థితి, స్థాన, అవస్థ, ప్రస్థాన.
చివరగా, మనలో చాల మంది దేముడు అని రాస్తారు. ఇలా రాయకూడదని తప్పు ఎత్తి చూపితే, ఇది మా మాండలికం! అని దబాయిస్తారు. అదే వ్యక్తి దేమాలయం, దైమత్వం, దేమత, అని రాయడే! దేవాలయం, దైవత్వం, దేవత సరి అయిన ప్రయోగాలు కనుక దేవుడు అన్నదే సరి అయినది. మాండలికం ముసుగులో తప్పు రాసి సమర్ధించుకోవడం మంచి అలవాటు కాదు.
11. ప్రత్యయాలు, ఉపసర్గలు
ఏ భాష అయినా పెరిగి పెద్దదవాలంటే కొత్త మాటలు తయారు చేసుకునే సామర్ధ్యం ఉండాలి. ఈ ప్రతిభ సంస్క్రుతానికి ఎక్కువగా ఉంది. సంస్క్రుతము, లేటిన్, గ్రీకు ఒకే మూలం నుండి పుట్టేయని అంటారు కనుక ఇదే రకం ప్రతిభ లేటిన్‌కి, గ్రీకుకి ఉంది. అందుకనే ఇంగ్లీషు లేటిన్, గ్రీకుల మీద ఆధారపడ్డట్లే తెలుగు సంస్క్రుతం మీద ఆధారపడుతుంది. కనుక ఇంగ్లీషులో మనకి తారసపడ్డ కొత్త మాటని తెలుగులోకి అనువదించాలని అనుకున్నప్పుడు ఆ మాట యొక్క మూలం తెలుసుకుంటే ఆ మూలానికి సరితూగే సంస్క్రుత మూలం మనకి దొరుకుతుంది. అప్పుడు సంస్క్రుతం నుండి తెలుగులోకి దింపుకోవడం తేలిక.
పదనిర్మాణానికి ధాతువు మూలం. ఆ ధాతువుకి ఒక అర్థం ఉంటుంది. దానికి ప్రత్యేకమయిన అర్థాలు కల్పించడానికి ధాతువు ముందు ఉపసర్గలు చేర్చుతాం. ఉపసర్గని ఇంగ్లీషులో ప్రిఫిక్స్ (prefix) అంటారు. ప్రి (pre) అన్నదే ఒక ఉపసర్గ. దాని అర్థం ముందు అని కనుక ప్రిఫిక్స్ అంటే, ముందు ఉండేది అని స్వయం బోధకమయిన అర్థం వస్తుంది. మాట చివర చేరేదాన్ని ప్రత్యయం, సఫిక్స్(suffix) అంటారు. మాట చివర చేరేవి కనుక విభక్తులని విభక్తి ప్రత్యయాలు అని కూడ అంటారు.
ఇంగ్లీషులో సర్వసాధారణంగా కనిపించే ఉపసర్గలు 35 ఉన్నాయి. మచ్చుకి కొన్ని ఇంగ్లీషు ఉపసర్గలని చూపిస్తున్నాను:
a – అ , mono – ఏక, pre – ముందు, sub – అడుగున, tri = త్రి
ఇదే విధంగా సంస్క్రుతంలో 22 ఉపసర్గలు ఉన్నాయి. ఉదాహరణకి సంస్క్రుతంలో ప్ర అనే ప్రత్యయం ఉంది. దీనికి మిక్కిలి, మంచి, మొదలయిన అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకి, యోగం అనే ధాతువుకి కూర్చడం, కలపడం, దగ్గరకి తీసుకు రావడం అనే అర్థాలు ఉన్నాయి కనుక ప్రయోగం అంటే బాగా చెయ్యడం లేదా బాగా చేసిన పని. అందుకనే ఇంగ్లీషులో ఎక్స్‌పరిమెంట్ అనే మాటని ప్రయోగం అంటున్నాం. ఈ ప్రయోగం చేసిన వ్యక్తి ప్రయోక్త, అనగా ఎక్స్‌పరిమెంటర్. కంపం అంటే వణకడం కనుక ప్రకంపం అంటే బాగా వణకడం. ఇంగ్లీషులో వైబ్రేషన్ అన్న మాటకి సమానార్థకంగా ప్రకంపం వాడుతున్నాం. క్రియ అంటే ఏక్షన్ (action) అయినప్పుడు ప్రక్రియ అంటే ప్రోసెస్ (process) అవుతుంది. ఇక్కడ, బాగా సాగదీసిన క్రియ – అని చెప్పుకోవాలి. క్రియ అనేది ఒక క్షణంలో జరిగే పని అయితే ప్రక్రియ జరగడానికి కొంత కాలం పడుతుంది. కొట్లాడుకుంటూన్న రెండు దేశాల మధ్య శాంతి భద్రతలు నెలకొనాలంటే జరిగే ప్రయత్నం ఒక రోజులో జరిగేది కాదు కదా? అందుకనే దానిని శాంతి ప్రక్రియ అనొచ్చు (పీస్ ప్రోసెస్).
ఉద్యాపన
ఈ వ్యాసంలో నేను ప్రయోగాత్మకంగా చేసిన పని లోని ముఖ్యమయిన అంశాలని ప్రస్తావించేను తప్ప ఇదే మార్గంలో అందరూ కాకపోయినా కొందరైనా ప్రయాణిస్తారన్న ఆశతో రాసినది కాదు. నా కష్ట సుఖాలని చెప్పుకున్నాను. మన భాష రూపురేఖలు ఎలా ఉంటాయో పాశ్చాత్య విద్యార్థులకి చూపిద్దామనే ఉద్దేశంతో చేసిన ప్రయోగం ఇది. ఈ పది వారాలలోనూ నా విద్యార్థులు తెలుగు నేర్చేసుకుని, కవిత్వాలు అల్లేసేరని నేను బుకాయించినా మీరు నమ్మరని నాకు తెలుసని మీకూ తెలుసు!
---------------------------------------------------------
రచన: వేమూరి వేంకటేశ్వర రావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment