Tuesday, February 19, 2019

స్మృతిలో…


స్మృతిలో…




సాహితీమిత్రులారా!


“పదండి… ఇవాళ మీకో అపురూపమైన మనిషిని పరిచయం చేస్తాను,” కథకులు శ్రీపతి. 1992 అక్టోబరు, ఓ ఆదివారం ఉదయం.

శ్రీపతి– పుల్లెల చలపతిరావు అన్న అసలు పేరుతో, ఎనభైలలో ఓ ఐదారేళ్లపాటు ఆకాశవాణి ఢిల్లీలో తెలుగు వార్తలు చదువుతూ గడిపారు. అలా ఆయనకు ఢిల్లీ నగరమూ మనుషులూ బాగా తెలుసు. శ్రీపతిగారితోనూ నాకు ఆమధ్యే పరిచయం. సంకోచాలు విడిచిపెట్టి సాహితీ సమమనస్కుల కోసం వెదుకులాడుతోన్న సమయమది. శ్రీపతితో పరిచయం ఆ అన్వేషణ ఫలితమే.

“ఎవరాయనా?”


“రంగారావుగారు. వేంకటేశ్వరా కాలేజ్‌లో ఇంగ్లీషు చెపుతూ వుంటారు. ఇంగ్లీషులో కథలూ నవలలూ రాస్తున్నారు. ఫౌల్‌ ఫిల్చర్ అనే నవల ఆమధ్య పెంగ్విన్‌వాళ్ళు వేశారు…”

గుర్తొచ్చింది. నాలుగయిదేళ్ళ క్రితం ఆ నవల రావడం, ఇండియా టుడే లాంటి పత్రికల్లో దాని గురించి విపులమైన, ప్రశంసలు నిండిన, రివ్యూలు రావడం… అప్పుడే, ‘ఎవరీ రంగారావూ’ అన్న కుతూహలం కలగడం, కాలక్రమంలో మరుగునపడిపోవడం.

వేంకటేశ్వరా కాలేజి స్టాఫ్ క్వార్టర్లలో ఓ గంభీరమైన ఆచార్యులవారు కనబడతారని కాస్త సంకోచిస్తూ వెళితే, పసిపిల్లాడిలా నవ్వుతూ ఓ బక్క పలచని ఐదడుగుల రెండంగుళాల కళ్లజోడు మనిషి ‘విజయా! ఎవరొచ్చారో చూడూ!’ అంటూ తలుపు తెరిచారు. సంబరంగా లోపలికి పిలిచారు.

ఆ మొదటి కలయిక సమయంలో ఆయనకు ఏభై ఆరు, నాకు ముప్పైతొమ్మిది. వయసు అంతరం తెలియని పాతికేళ్ల స్నేహం మాది. అక్షర అనుబంధమది. మొన్న మార్చి 13న పుట్టపర్తిలో ఎనభైరెండేళ్ల వయసులో తన పసితనాన్ని వెదుక్కుంటూ వెళ్లిపోయేవరకూ కొనసాగింది మా అనురాగ బంధం.

“అమరేంద్రా! రావిశాస్త్రి కథ ఏదయితే బావుంటుందీ? చాసో విషయంలో ‘ఏలూరెళ్లాలి’ అని నిర్ణయించేశాను.” ఫిబ్రవరి 1994, రాత్రి పదిగంటల సమయం!

పెద్ద కథకులిద్దరూ రెండు నెలల వ్యవధిలో వెళ్లిపోయిన సమయమది. అప్పటికి ఏడాదిగా నేనూ, రంగారావుగారూ, హిందీ అనువాదకులు లక్ష్మీరెడ్డిగారూ తరచూ కలుసుకోవడం సాగుతోంది. తెలుగు సాహిత్యం వెళ్ళవలసినంతగా ఇతర భాషలలోకీ, ఇంగ్లీషులోకీ వెళ్ళడంలేదన్న వేదనను కూడా మేం పంచుకొంటోన్న సమయం. వెళ్లిపోయిన అపురూప కథకులకు నివాళిగా వారి కథల్ని హిందీ ఇంగ్లీషుల్లోకి అనువదించి ప్రచురించాలని…

“ఆరు సారా కథల్లో ఏదయినా బావుంటుంది.”

చివరికి ఆయన ‘వర్షం’ ఎంచుకొన్నారు. తన అభిరుచికీ అభిప్రాయాలకూ సరిపడే కథను తీసుకొన్నారాయన. ఆ రెండు కథలూ అపుడు దుగ్గిరాల సుబ్బారావుగారి సంపాదకత్వంలో కేంద్ర సాహిత్య ఎకాడమీ వెలువరిస్తోన్న ఇండియన్ లిటరేచర్ అన్న పత్రికలో వెంటనే వచ్చాయి. అప్పటికే రంగారావుగారు గీతా ధర్మరాజన్ వాళ్ల కథ సంకలనం కోసం 1993లో మధురాంతకంగారి ‘రాతిలో తేమ’ను అనువదించి వున్నారు…

అక్షరాలే తప్ప ఆస్తులు బొత్తిగా లేని సామాన్య కుటుంబానికి చెందిన మనిషి వాడ్రేవు పాండురంగారావు. భీమవరం ప్రాంతం మనిషి. ‘ఇంగ్లీషు మీద చిన్నప్పట్నించీ విపరీతమైన వ్యామోహం’ ఉన్న మనిషి. భాషా చదువూ అంటే ఎంత ఇష్టం ఉన్నా, విద్యార్థిగా ఎంతగా రాణించినా, హైస్కూలు చదువుతో విద్యను పక్కనబెట్టి–ఆ మార్కుల వల్ల చేతికందిన సెంట్రల్ గవర్నమెంటు వారి టెలిగ్రాఫిస్టు ఉద్యోగాన్ని అందుకొన్న మనిషి. అవి 1950ల నడుమ దినాలు.


“నాకు భాషంటే ఎంత అభిమానమంటే ఉద్యోగంలో చేరాక కూడా దాన్ని వదిలిపెట్టలేదు. హిందూ దినపత్రికను అక్షరం విడిచిపెట్టకుండా క్షుణ్ణంగా చదివేవాడిని. భాషలోని సౌందర్యం, పట్టువిడుపులు, ఒడుపు ఒంటబట్టించుకొనేవాడిని,” అన్నారాయన మా పరిచయపు తొలి దినాల్లో. తన ప్రయత్నాన్ని హిందూ చదవడం దగ్గరే ఆపలేదు. చదువు కొనసాగించారు, సాయంకళాశాలలో. అందుకు అనుగుణంగా ఉంటుందని ఉద్యోగాన్ని విశాఖపట్నానికి తరలించారు. డిగ్రీ అయింది. విశ్వవిద్యాలయం ఆంగ్ల శాఖాధిపతి శ్రీనివాస అయ్యంగార్ దృష్టిలో పడ్డారు. ఉద్యోగం వదిలిపెట్టి చదువుమీదే దృష్టిపెట్టమని ప్రోత్సహించారా అయ్యవారు. రంగారావు సాహసించారు. తన ఆశలూ కోరికలూ నెరవేరే అవకాశాన్ని సృష్టించుకొన్నారు. తాను విపరీతంగా అభిమానించే ఆర్.కె. నారాయణ్ సాహిత్యం మీద పరిశోధన చేశారు. డాక్టరేట్ అందుకొన్నారు. ఆరేడేళ్ల వ్యవధిలో టెలిగ్రాఫిస్టు కాస్తా ఆంగ్లభాషాచార్యులు అయ్యారు. 1964లో అప్పుడే ఢిల్లీలో వెలసిన శ్రీ వేంకటేశ్వరా కాలేజ్‌లో ఇంగ్లీషు లెక్చరరుగా చేరారు.

ఆంగ్ల భాష, ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీలు డాక్టరేటు, ఆర్.కె. నారాయణ్, ఆ సాహిత్యాన్నే ప్రతిరోజూ బోధించడం–ఇవి చాలవూ ‘రాయాలీ రాయాలీ’ అనే కోరిక కలగడానికీ! దానికి తోడు తనదైన మట్టివాసన నిండిన అతి సామాన్య నేపథ్యం, బడుగు జీవితాలతో సాన్నిహిత్యం, ప్రపంచమన్నా మనుషులన్నా ప్రేమ– గొప్ప కాంబినేషన్ ఏ రచయితకైనా!

‘నవల నవల అంటున్నావు. వద్దు. ముందు కథలు రాయి. అవి పెద్ద పత్రికల్లో ప్రచురించు. అలా నీ పేరు కాస్త పదిమందికీ పరిచయమయ్యాక అపుడు ఎవరైనా నీ నవల చూస్తారు. ముందే నవల అంటే ఎవరూ ముట్టుకోరు’ అని సలహా ఇచ్చారట ఖుష్వంత్ సింగ్. ఆయనతో అప్పటికే రంగారావు మెట్టుమెట్టుగాఅక్షర అనుబంధం నిర్మించుకొనివున్నారు.

ఆ సలహా పాటించారాయన. తెలుగు పల్లెల గురించి కథలు రాశారు. అపుడపుడే కనుమరుగవుతోన్న ఆంగ్లో ఇండియన్ జీవితాల గురించి రాశారు. తాను అపుడపుడు విన్న కుల దాష్టీకపు క్రూరత్వాల గురించి రాశారు. ‘ఆరో ఆడపిల్లలు’ అంటూ ఉన్నత స్థాయి హాస్యస్ఫూర్తి గల కథలు రాశారు. అవన్నీ ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాంటి పత్రికల్లో 70లలోనూ 80లలోనూ వచ్చాయి.

అపుడు ఉపక్రమించారు నవలా రచనకు.

ఫౌల్ ఫిల్చర్ (Fowl filcher) 1987, పెంగ్విన్ ఇండియా.

అతి చక్కని ఆంగ్ల భాషలో రాసిన పదహారణాల తెలుగు నవల…

పల్లెసీమలు, ప్రేమలు, ద్వేషాలు, క్రౌర్యాలు, అనురాగాలు, పట్టణాలకు వలసలు, చదువంతగా రాని పల్లెటూరి కుర్రాడు గుండెధైర్యమే పెట్టుబడిగా జీవితపు సోపాన పటం ఎక్కెయ్యడం, పెద్దపాము చేతికి చిక్కి అంతరించిపోవడం… శృంగారంతో సహా నవరసాలనూ సమర్థవంతంగా పండించిన నవల అది.

ఎన్ని కథలు గొప్ప పత్రికల్లో వచ్చినా నవలకు ప్రచురణ కర్త దొరకడం అంత సులభం కాలేదు. అప్పటికే రంగారావుగారి మీద గురి కుదిరి ఉన్న ఖుష్వంత్ సింగ్ పూనికతో అపుడే ఇండియాలో తమ కార్యకలాపాలను మొదలెడుతోన్న పెంగ్విన్ వాళ్లు 1987లో ప్రచురించారా నవలను, తమ తొలి భారతీయ ప్రచురణగా!

పాఠకులను ఆకట్టుకొంది. విమర్శకుల ప్రశంసలు అందుకొంది. రెండుమూడు ముద్రణలు పొందింది. పదిహేనూ ఇరవై వేల కాపీలు చెల్లాయి.

మరో రెండేళ్ళకు, 1989లో ఆయన కథల సంపుటి ది ఇండియన్ ఇడిల్ అండ్ అదర్ స్టోరీస్ (The Indian Idyll and Other Stories) పేరుతో రవిదయాళ్ వాళ్లు వేశారు.


ఫౌల్ ఫిల్చర్ వచ్చిన ఏడేళ్లకు, 1994లో డ్రంక్‌తంత్ర (Drunk Tantra) అన్న నవల పెంగ్విన్ ద్వారానే వెలువరించారు రంగారావు. విద్యారంగంలోని విపరీత ధోరణులను అనితర సాధ్యమైన వ్యంగ్యవైభవంతో ఎండగట్టారాయన ఈ నవలలో.

బ్రిటిష్ వాళ్లు భారతదేశంలో అడుగుపెట్టడం, ఆక్రమించడం, స్థానిక జీవితాలు గుర్తించలేనంతగా మారిపోవడం– ఈ నేపథ్యంలో క్రిష్ణా గోదావరీ నదుల ప్రాంతంలో ఆ చారిత్రక పరిణామాలను చిత్రిస్తూ మూడు నవలలు రాయాలని సంకల్పించారు రంగారావు. అందులో మొదటి నవల ది రివర్ ఈజ్ త్రీ క్వార్టర్స్ ఫుల్ (The river is three quarters full) 2001లో పెంగ్విన్ ద్వారానే వచ్చింది. మిగిలిన రెండు నవలలూ ఈ-పుస్తకాలుగా వచ్చాయనుకొంటాను.


తాను ఆరాధించే ఆర్. కె. నారాయణ్ మీద రాసిన పరిశోధనా గ్రంథాన్ని మరింత విస్తరించి రాసి ఓ సమగ్ర గ్రంథంగా ప్రచురించాలన్నది రంగారావుగారి చిరకాల వాంఛ. తన పరిశోధన అరవైల నాటి తొలి సంవత్సరాలలోనే ముగిసినా, డాక్టరేట్ వచ్చినా, ఆ విషయం మీద తన పరిశోధనను జీవితాంతం కొనసాగించారు రంగారావు. సరి అయిన పాఠకులకు ఆర్. కె. నారాయణ్ సాహితీ జీవితాన్ని పరిచయం చెయ్యాలన్న లక్ష్యంతో పేరున్న ప్రచురణకర్తల కోసం శతథా ప్రయత్నించారు. ఔత్సాహిక ప్రచురణకర్తలు అడిగినా ఇవ్వననేశారు. చివరికి రంగారావుగారి తపస్సు ఫలించింది. 2017 ఆరంభంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఇండియా వాళ్లు ఆ పరిశోధనాఫలాన్ని ఆర్. కె. నారాయణ్–ది నావెలిస్ట్ అండ్ హిస్ ఆర్ట్ అన్న పేరిట ప్రచురించారు. ఈలోగా 2004లో కేంద్ర సాహిత్య ఎకాడెమీవాళ్ల కోసం ‘భారత సాహితీ నిర్మాతలు’ సీరిస్ క్రింద ఆర్. కె. నారాయణ్ మోనోగ్రాఫ్ రాసి అందించారు రంగారావు.

ఆంగ్ల నవలా రచన రంగారావుగారి మొట్టమొదటి సహచరి అన్నమాట నిజమేగానీ –

“ఇవాళ సాహిత్య అకాడెమీలో అనంతమూర్తి కనిపించి కోప్పడ్డారు. మీ భాష గురించి ఎవరికీ తెలియడం లేదు. అందుకు నీలాంటివాళ్ళే కారణం అన్నారు. నిజమేననిపించింది…” 1994 తొలినాళ్ళలో ఓ రోజు రంగారావు చెప్పారు.

‘తనకున్న సమయమంతా సొంత ఆంగ్ల రచనల కోసమే కేటాయించాలి. అనువాదాలు పెట్టుకొంటే అదో యజ్ఞమవుతుంది. బయటపడటం కష్టం’ అన్నది అప్పటిదాకా రంగారావుగారి ఆలోచనారీతి. ఆ ధోరణి మారడానికి అనంతమూర్తి మందలింపు కేటలిస్టుగా పనిచేసింది. మధురాంతకం, చాసో, రావిశాస్త్రిల కథలు అనువదించిన అనుభవం పుణ్యమా అని తెలుగు కథాసాగరంలో మంచి మాణిక్యాలు ఉన్నాయి అన్న స్పష్టమైన ఎరుక రంగారావుగారికి అప్పటికే కలిగింది.

ఈ లోపల ఆయనకు యూజీసీ వారి రెండేళ్ల సీనియర్ ఫెలోషిప్ వచ్చింది. కాలేజీ పాఠాల పనిలేకుండా రెండేళ్లపాటు తన రచనా వ్యాసంగం మీదే దృష్టిని పెట్టే అవకాశం! అందులో ఒక ఏడాది తెలుగు కథల కోసం కేటాయిద్దామని నిర్ణయించారాయన. 1910 నుంచి 1960 మధ్యన వచ్చిన క్లాసిక్ తెలుగు కథలను గుర్తించి, ఎన్నిక చేసి, అనువదించి, ప్రచురించే ప్రయత్నం ఆరంభించారు. పెంగ్విన్ వారిని సంప్రదించి వారి అంగీకారాన్ని సాధించారు.

గత రెండేళ్ల సాన్నిహిత్యం పుణ్యమా అని ఆయన నిర్మిస్తోన్న కథావారధిలో నేనూ లక్ష్మీరెడ్డీ ఉడతలమయ్యాం. ఈలోగా మా బృందంలో చేరిన లియోసా సంపత్‌కుమార్, తోలేటి జగన్మోహనరావు– అంతా కలిసి అయిదుగురం.

“ఈ పుస్తకం కోసం సమకాలీన రచయితలను కాకుండా వెనుక తరం వాళ్లను తీసుకుంటున్నారేమిటీ?” అని అడిగాను.

“అమరేంద్రా, మన కథలు అంతగా బయటకు వెళ్లలేదు. ఒకటి రెండు ప్రయత్నాలు జరిగినా విషయం ఇంకా ఆరంభ దశలోనే ఉందనిపిస్తోంది. ఈ తరం కథకులు ఇంకా కొంతకాలం ఆగగలరేమో గానీ మొదటితరం గొప్ప రచయితల సంగతేవిటీ? శ్రీపాద, చలం, శ్రీనివాస శిరోమణి, చింతా దీక్షితులు, వేలూరి, విశ్వనాథ, బుచ్చిబాబు, కొడవటిగంటి– వీళ్లను ఇంగ్లిష్ చెయ్యడం అవసరం కదా! ఈ తరం కథల అనువాదానికి కొంతమందైనా ముందుకు రావచ్చు. అప్పటి కథల విషయంలో ఎవరు ముందుకు వస్తారూ? నేనే ఆపని చేద్దామనిపించింది.” ఉన్నతమైన ఆలోచన.

కథల ఎంపికకు నాలుగైదు నెలలు! నా దగ్గర ఉన్న అలనాటి రచయితల కథా సంకలనాలో పాతిక ముప్ఫై కారులో వేసుకువెళ్లి ఆయన ఇంట్లో దించిరావడం నాకింకా గుర్తు. అన్నీ చదివారాయన. శ్రీపతి, మునిపల్లెరాజు, మధురాంతకం, వాకాటి, కేతు, రాచపాళెం, కాళీపట్నం– తనకు తెలిసిన అందర్నీ సంప్రదించారు. నేను మద్రాసు వెళ్లినపుడు ఆయన దూతగా ఆరుద్రని కలవడం, కొన్ని కొన్ని విషయాలలో ఆరుద్ర అభిప్రాయాలూ సలహాలూ సేకరించి రంగారావుగారికి అందించడం బాగా గుర్తు.

అనువాదాన్ని కూడా ఆషామాషీగా తీసుకునే మనిషి కాదాయన.


విశ్వనాథ రాసిన ‘ఏమి సంబంధం?’ కథలో ‘సదస్యం’ అన్న పెళ్లి సంప్రదాయానికి చెందిన మాట ఉంది. అది మా అయిదుగురిలో ఎవరికీ పూర్తి అవగాహన లేని సంప్రదాయం. శ్రీపతికీ కొరుకుడు పడలేదు. ‘కొత్త సంస్కృతిని గురించి తెలుసుకోవాలని అనువాదాలు చదవడానికి సిద్ధపడే పరభాషా పాఠకులకు ఈ సంప్రదాయాలు అందించడం అనువాదకుని ధర్మం’ అన్న సూత్రం పాటించి రంగారావు ఎక్కడలేనివాళ్లనూ సంప్రదించారు. చివరికి మంజుశ్రీగారనుకొంటాను, సమగ్ర వివరం అందించారు. ‘నేను ఎన్నుకొన్నవి తెలుగుదనం బాగా ఉన్న కథలు. తెలుగుదనం కోల్పోకుండా వాటిని ఇంగ్లీషు చెయ్యాలి. మూల కథకు అన్యాయం జరగకుండా, లక్ష్య పాఠకులకు న్యాయం కలిగేలా అనువదించడం చాలా కష్టమైన పని. అయినా చెయ్యాలిగదా…’ అన్నారాయన. ఈ లక్ష్య శుద్ధి పుణ్యమా అని ఏడాది అనుకొన్నది దాదాపు రెండేళ్లు పట్టింది ఆ క్లాసిక్ తెలుగు షార్ట్ స్టోరీస్ వెలువడడానికి!

“మనకు మంచి సాహిత్యం ఉంది. అనువాదాలు లేకపోవడం వల్ల తెలుగులో చెప్పుకోదగ్గ సాహిత్యం లేదన్న భావన ఇతర భాషలవారిలో ఉంది. చలం ‘వితంతువు’ చదివినవాళ్లు మా భాషలో ఇప్పటికీ ఇలాంటి కథలు రాలేదన్నారు. నా ప్రయత్నం ద్వారా మనవాళ్లకు అవసరమైన గుర్తింపు తెస్తున్నానన్న సంతృప్తి కలుగుతోంది…”

సంతృప్తే కాదు, సాఫల్యతా సాధించిందా క్లాసిక్ కథల పుస్తకం.


ఈ అనువాదయజ్ఞం ముగిసి మళ్లా ఆయన తన స్వీయ రచనలలో మునిగిపోయినా సమకాలీన రచయితల్ని బయటవాళ్లకి పరిచయం చెయ్యటం అన్న బాధ్యతను మరచిపోలేదాయన. 2006లో మునిపల్లె, తోలేటి, డాక్టర్ వి. చంద్రశేఖరరావు, పి. సత్యవతి లాంటి సమకాలీన రచయితల కథలతో దట్ మాన్ ఆన్ రోడ్ అన్న మరో సంకలనాన్ని పెంగ్విన్ ద్వారానే వెలువరించారు. ‘నా కథ నా పేరేమిటి?ని అనువదించి నా పేరు పదిమందికీ తెలిసేలా చేశారు రంగారావుగారు. ఆ అనువాదం పదవ క్లాసు పుస్తకంలో పాఠమయింది,’ అని మొన్న గుర్తు చేసుకొన్నారు పి. సత్యవతి.

క్లాసిక్ కథల అనువాదం మరో అనుకోని పరిణామానికి దారితీసింది.

ఆ అనువాదాల పుణ్యమా అని వాటి గురించి చర్చించడానికి మేం నలుగురం- నేను, లక్ష్మీరెడ్డి, తోలేటి, సంపత్ తరచూ రంగారావుగారింట చేరేవాళ్ళం. అలా కలవటం, సాహితీ విషయాలు గంటల తరబడి ముచ్చటించుకోవడం అదో అలవాటుగా పరిణమించింది. ఆ కలయికకు రూపురేఖలు ఇవ్వాలనిపించింది. ఢిల్లీలోనే ఉన్న మరో పదిమంది సాహితీ ప్రియులను కలుపుకొన్నాం. నెలనెలా ఎవరో ఒకరింట్లో ఒక ఆదివారం కలుసుకోవడం, రోజంతా సాహితీ విషయాలు, చర్చలు, స్వీయ రచనా పఠనాలు– కుటుంబాలకు కుటుంబాలే తరలివచ్చిన కాలమది. కొన్నాళ్లు గడిచాక ఆ బృందానికి ‘సాహితీ వేదిక’ అనే పేరు పెట్టుకొన్నాం. 1997లో జరిగిన కథ 1996 ఆవిష్కరణా కథా సదస్సుల నుంచి 2018 మార్చి 4న జరిగిన ‘తెలుగులో ఆత్మకథలు’ సెమినారు దాకా సాహితీ వేదిక కార్యకలాపాలు సాగిపోతున్నాయి. అందుకు కారకులు వ్యవస్థాపక సభ్యులు వాడ్రేవు పాండురంగారావు.

రంగారావుగారితో ముడివడిన మరో మంచి జ్ఞాపకం: 1996లో జనవరిలో విజయవాడలో అప్పాజోస్యుల ఫౌండేషన్‌వారు తమ మూడవ వార్షిక సదస్సులో కథారచయితల సదస్సు నిర్వహించడం, దానికి నన్నూ రంగారావుగారినీ ఢిల్లీ నుంచి ఆహ్వానించడం.

మధురాంతకం రాజారాంగారికి ప్రతిభా పురస్కారం, దానితోపాటు ఒక ‘కథా సదస్సు’. ఆ కథా సదస్సుకు తిరుమల రామచంద్ర, అల్లం శేషగిరిరావు, మునిపల్లెరాజు, వాకాటి, భరాగో, తురగా జానకీరాణి, మహీధర రామమోహనరావు, బలివాడ కాంతారావు, ఎన్నార్ నంది, పోలాప్రగడ, శశిశ్రీ– అంతా కలిసి ముప్పై నలభై మంది ఆహ్వానితులు. సదస్సులో ఉపసదస్సులాగా మేమున్న మనోరమా హోటల్లో రంగారావుగారితో ఇష్టాగోష్టి. అంతమంది తెలుగు రచయితలను కలుసుకోవటం రంగారావుగారికి అదే మొదటిసారి. పదిహేను నిముషాలపాటు ఆయన తన నేపథ్యం గురించి, ఇంగ్లీషు రచనల గురించి, తెలుగు కథల అనువాదం గురించీ క్లుప్తంగా, ఆర్ద్రంగా, అర్థవంతంగా వివరించారు. ‘క్లాసిక్ కథలు చేశారు, ధన్యవాదాలు. సమకాలీన కథలనూ అనువదించండి. తెలుగు సాహితీ లోకం మీకు రుణపడి ఉంటుంది…’ అని కథకులందరూ కోరారానాడు. చెప్పుకొన్నాంగదా, మరో పదేళ్లకు ఆ కోరికా తీర్చారు రంగారావు.

స్వతహాగా రంగారావు సాత్వికుడు. మృదుభాషి, మితభాషి. నమ్మకాల పరంగా సంప్రదాయవాది. కానీ కొత్త గాలుల కోసం అనునిత్యం కిటికీ రెక్కలు తెరచి ఉంచే మనిషి.

ఎంత సాత్వికుడయినా పట్టుదల విషయంలో ఆయన ఉడుముకే పాఠాలు నేర్పగలరు. తాను నమ్మిన విషయం కోసం ఎంత దూరమైనా, ఎంత కాలమైనా వెళ్లగల మనిషి. ఆంగ్ల పాలన నేపథ్యపు నవలల కోసం ఆయన చేసిన పరిశోధన, కృషి నాబోటివాళ్ళకు ఆశ్చర్యం కలిగించేవి. అనువాదాల విషయంలో ఆయనకున్న పట్టుదల ఒకోసారి మాకే చాదస్తం అనిపించేది; కానీ అనువాదం పూర్తయ్యాక ఆ ఫలితాన్ని చూసి ఆయన కన్నా మేము ఎక్కువగా సంతోషించేవాళ్లం.


అతి సరళమైన జీవితం రంగారావుగారిది. ఏమాత్రమూ ఆడంబరం లేని వస్త్రధారణ, గాంభీర్యమంటే తెలియని చూపులు పలకరింపులు, కొత్తవాళ్లతో కూడా మనసువిప్పి మాట్లాడే నైజం, అవతలి మనిషిలోని ప్రతిభను చటుక్కున గుర్తుపట్టగల నైపుణ్యం (‘ఈయనలో గొప్ప విజ్ఞానముందండీ!’ 1998లోననుకొంటాను, చినవీరభద్రుడుగారిని వారింటికి తీసుకువెళ్ళి ఓ గంట గడిపినపుడు), తనను తాను ఎక్కువగా అంచనా వేసుకోకపోవడం, స్వంత లాభం కొంతయినా మానుకొని పదిమందికీ పనికొచ్చే పనులు చెయ్యడం- ఇవిగదా మనిషి లక్షణాలు!

రిటైరయిన తర్వాత 2000 నాటి తొలి సంవత్సరాలలో ననుకొంటాను ఆయన నివాసాన్ని పుట్టపర్తికి మార్చారు. అక్కడ తన బోధన కొనసాగించారు. అప్పటికే వాళ్ళ పిల్లలు ముగ్గురూ పెద్దవాళ్లయిపోయి తమ తమ జీవితాలలో స్థిరపడి ఉన్నారు. సహచరి విజయలక్ష్మి కూడా పుట్టపర్తి సేవాకార్యకలాపాలలో అతి చురుగ్గా పాల్గొనే మనిషి. మనిషి భౌతికంగా దూరమయ్యాక మా కలయికలూ తగ్గాయి. రెండుమూడుసార్లు బెంగళూరులో ఆయన చిన్నబ్బాయి ఇంట్లో కలిశాను. రెండుమూడుసార్లు పుట్టపర్తి వెళ్లి ఒకపూటో ఒకరోజో వాళ్లతో ఉండి వచ్చాను. మా కలయికల మధ్య ఏళ్ల తరబడి ఎడబాటు ఉన్నా, కలసిన ప్రతిసారీ అవలీలగా 1993నాటి దారాలను అందిపుచ్చుకొని అనుబంధంలో కొత్త కొత్త కలనేతలు సృషించుకొనేవాళ్లం. 2013లో వచ్చిన నా పుస్తకాలు – ఆత్మీయం, సాహితీయాత్ర – చూసి “అమరేంద్రా! మాకు ఇప్పటివరకూ తెలిసిన అమరేంద్ర వేరు. ఈ పుస్తకాల్లో కనిపిస్తోన్న సాహితీమూర్తి వేరు. గుర్తించడంలో ఎంత పొరబాటు జరిగిందీ!” అంటూ దంపతులిద్దరూ హర్షం వ్యక్తపరిచారు. “నా క్లాసిక్ తెలుగు స్టోరీస్ మీద వచ్చిన రెవ్యూలన్నిటిలో నీది కనీసం రెండో స్థానంలో ఉంటుంది.” అని మరో కితాబూ ఇచ్చారాయన!

మళ్ళీ వాళ్లను కలిసింది 2017 ఫిబ్రవరిలో.

అంతకుముందే ఆయనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అంచేత భౌతికంగానూ మానసికంగానూ నలిగిపోయిన రంగారావుగారు కనిపిస్తారనుకొన్నాను. అదేం లేదు. అదే పసిపిల్లాడి చిరునవ్వు, ఉత్సాహం, తాత్విక ధోరణి.

“జీవితమంతా నాకు ఇష్టమయిన పనుల్లో శ్రమ అన్నమాటను దగ్గరకు రానివ్వకుండా కృషి చేశాను. గాడ్ ఈజ్ రియల్లీ గ్రేట్. నా అర్హతకు మించిన సాఫల్యాలు అందించాడు. ఐయామ్ ఎ హాపీమ్యాన్. నో రిగ్రెట్స్, నో కంప్లయింట్స్. ఆరోగ్యమంటావా, వయసులో వచ్చే సమస్యలను మనం అంగీకరించాలి. గౌరవించాలి. మనకాలం ముగిశాక సంతోషంగా వెళ్లిపోవాలి.”

“ఆర్థికంగా సమస్యలేమీ లేవుగదా…”

“భలేవాడివే! నా అవసరాలు పరిమితం. ఆరోగ్యం సంగతి సాయి చూసుకొంటారు. పిల్లలెలానూ ఉన్నారు. నాకొచ్చే జీతంలో మా ఖర్చులకు సగం చాలు. మిగిలిన సగమూ ఇక్కడ చదువుకొనే ఆర్థిక వనరులు లేని పిల్లలకు ఇస్తున్నాం.” యథాలాపంగా చెప్పారాయన.

గంటా రెండుగంటలు కబుర్లు చెప్పుకొన్నాం ముగ్గురం. నా చిరకాల కోరిక– ఆశ్రమ ప్రాంగణంలో ఒక రాత్రి గడపటం– తన స్నేహితుల సాయంతో చక్కని గది సంపాదించి నా కోరిక తీర్చారు. ఆ సాయంత్రం నాతోపాటు ఆశ్రమ ప్రాంగణమంతా తిరిగి చూపించారు. పదిమందికీ పరిచయం చేశారు. నాలో ఉత్సాహాన్ని నింపారు.

మర్నాటి ఉదయం మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లి శెలవు తీసుకున్నాను.

అదే చివరిసారి అనుకోలేదు!!
----------------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

No comments: