తిక్కన భారతంలో పలుకులపొందు
సాహితీమిత్రులారా!
1. నేపథ్యం
‘శ్రీయన గౌరినాఁబరఁగు…’ అనే పద్యంతో మహాభారత రచనకు ఉపక్రమించాడు తిక్కన మహాకవి. ఈ పద్యంలో హరిహరాత్మకమైన మూర్తిని, ‘పరతత్త్వాన్ని’, కొందరు ‘విష్ణురూపాయనమః’ అంటే, ఆ మూర్తినే మరికొందరు ‘నమఃశివాయ’ అంటారట. కానీ హరిహరనాథుడు ఒకడే దేవుడుకాబట్టి తిక్కన ఒకే నమఃశబ్దాన్ని ప్రయోగించాడు. అది రెండు పేర్ల మధ్యలో పెట్టి రెండింటికీ అన్వయించేట్టు చెయ్యటం తిక్కన కవితాశిల్పానికి మొట్టమొదటి ఉదాహరణ. ఇక్కడే తెలుగు క్రియ వాడవలసి వస్తే ఈసౌలభ్యం సాధ్యం అయ్యేది కాదు.
తిక్కన కవితామహత్వాన్ని కేతన మొదలు శ్రీశ్రీ దాకా అంతా మెచ్చుకొన్నవాళ్ళే. తిక్కనది ‘అపూర్వార్థశబ్దచారుకవిత’ అని కేతన, ‘తనకావించిన సృష్టితక్కొరులచేతంగాదు’ అని ఎర్రన, ‘రసాభ్యుచితబంధం’ అని శ్రీనాథుడు, తిక్కన ‘కవిబ్రహ్మ’, ‘ప్రణుతబహుదేశ కవిరాజి’ అని పిల్లలమర్రి పినవీరభద్రుడు అన్నారు. విశ్వనాథ ‘తిక్కన శిల్పంపుఁదెనుఁగు తోట’గా ఉపమించాడు.
ఒక కవి కవిత్వలక్షణాలను నిర్వచించినప్పుడు, ఆ నిర్వచనాలనే కొలబద్దలుగా తీసుకొని అతని రచనలు ఆ లక్షణాలకు ఎంత సరిపడతాయి అని పరిశీలించటం ఒక విమర్శన పద్ధతి. సుకవిత్వ లక్షణాలను తిక్కన చెప్పినంత వివరంగా మరే తెలుగు కవి చెప్పలేదు. వాటి సారాంశం: ‘వికసించిన పూరేకుల సౌరభాన్ని గంధవహుడు విస్తరింపజేసినట్టుగా, భావానికి అనుకూలమైన ‘పలుకులు’ ఏరుకోటం, ఆ పలుకులను ‘సరిగ్రుచ్చేట్టు’ ఒకదానితో ఒకటి చేర్చటం అనే నేర్పు కవికి ఉండాలి. ‘పలుకులపొందు’ లేకుండా ‘రసభంగం’ చేస్తూ, పాతబడ్డమాటలైనా తననేర్పుతో మనస్సు ‘అలరింపలేక’, ఎవరూ తొక్కని మార్గమే తమ గొప్పతనంగా లోకులు నవ్వేట్టు ప్రవర్తించే కుకవులు దుర్విటులవంటివారు. అర్థానికి సరిపడే మాటలనే ఏరుకోవాలి యతులు, ప్రాసలు ఇష్టం వచ్చినట్టు పులిమి పుచ్చగూడదు. తెలుగు విశేషణాలు సంస్కృత శబ్దాలతో కలిపి వాడితేనే బాగుంటుంది. వీలైనంతవరకు సంస్కృత విశేషణాలు పరిహరించటం తిక్కన ఉద్దేశం.
‘పరిణితి గల కవి సరసులైనవాళ్ళు మెచ్చుకొంటేనేగాని తన కవిత్వం గొప్పదని భావించడు. జాత్యము గాని సంస్కృతం కేవలం అందంగా ఉంటుందని వాడను (ఇక్కడ జాత్యం అంటే సందర్భశుద్ధి గలిగి ఉండటం), శ్రుత్యనురూపంగా ఉందని వేరువేరు అక్షరాలకు ప్రాస వేయను. ‘అలతి అలతి’ తునకలతో కాహళ సంధించినట్టు – లలిత పదాలతో, హృద్యపద్యాలతో కథ ఘటితపూర్వాపరమై ఉండేట్టు అమరుస్తాను’ (ని. రా.5-9, 14-16).
తనను గురించి తానే చెప్పుకుంటూ, ‘అమలోదాత్త మనీష నేనుభయకావ్య ప్రౌఢిఁ బాటించుశిల్పమునంబారగుఁడన్’ అన్నాడు. నిర్వచనోత్తరరామాయణం రాసే నాటికన్నా మహాభారతం రాసే నాటికి తిక్కన వయస్సులోనూ, భావాల్లోనూ చాలా పరిణతస్థితికి వచ్చినట్టు తెలుస్తుంది. శివభక్తుడు, హరిహరనాథ భక్తుడైనాడు. సత్కవుల మెప్పుకు గాక ‘ఆంధ్రావళి’ మోదం కోసం భారతరచనకు ఉపక్రమించాడు. ‘ప్రౌఢులు వచనం లేకుండా పద్యాల్లోనే రాస్తారు’ అన్నవాడు ‘పద్యముల గద్యములన్’ మహాభారతం రాస్తానన్నాడు. ‘శిల్పమునంబారగుఁడన్ గళావిదుఁడ’ నన్నవాడు, ‘నా నేర్చినభంగిఁ జెప్పి వరణీయుఁడ నయ్యెద భక్తకోటికిన్’ అన్నాడు.
తిక్కన రచనలోని స్వతంత్రమైన అనువాద విధానాన్ని, నాటకీయ శైలిని, హరిహరనాథ తత్వాన్ని, తిక్కన వాడే సంస్కృతాంధ్రశబ్దాల పాళ్ళను గురించి ఎందరో రాశారు. ఇదివరకు ఎవ్వరూ చెప్పని తిక్కన రచనావిశేషాలను గురించి ముఖ్యంగా ఈ వ్యాసంలో ప్రస్తావిస్తాను. వైదికమతానికీ సంస్కృతభాషకు ముడిపెట్టి, వీరశైవులు శైవమతంతో పాటు దేశిచ్ఛందస్సులను, జానుతెనుగును ప్రోత్సహించాలనే ఉద్యమం లేవదీశారు. కాని, జానుతెనుగులో రాయాలన్న ప్రతిజ్ఞను నిర్వహించలేకపోయారు. వైదికమతాన్ని హరిహరనాథ సామరస్యరూపంగా బలపరుస్తూ, తెనుగు నుడికారాన్ని మతోద్యమభాగంగా కాక వేరుచేసి తన రచనలో దేశభాషకు ఉదాత్తభావోన్మీలనశక్తి ఉన్నదని తన రచన ద్వారా తిక్కన నిరూపించాడు. మతవిషయంలోనూ భాషా విషయంలోనూ అతివాదులను తిక్కన ఓడించాడు.
2. రచనాశిల్పం
తిక్కన సుకవిత్వ లక్షణాల్లో ఒకటిగా ‘పలుకులపొందు’ను పేర్కొన్నాడు. ఇదొక కొత్త పారిభాషికపదం. కవి చెప్పదలచుకొన్న భావవ్యక్తీరణకు ఏవి అనువైన మాటలు, పదబంధాల్లో ఏమాట ఏమాటతో కలిస్తే ఇది సాధ్యమౌతుంది అనేది కేవలం ప్రతిభావంతుడైన సత్కవికి మాత్రమే తెలుస్తుంది. తన ‘నేర్పు’తో కవి పాతపడ్డ మాటలతో కొత్త పదబంధాలు సృష్టించుకోగలడు. పొడి మాటలు ఎప్పుడూ పాతవే కాని మాటల ‘పొందు’తో సృష్టించే కొత్త కలయికలు రచయిత ప్రతిభావ్యుత్పత్తులను బట్టి, సృజనాత్మక శక్తిని బట్టి అనంతంగా ఉంటాయి. పొడిమాటలు అంకెల లాంటివి. అంకెలకు సూత్రాలుండవు కానీ అంకెల కలయికలకు సూత్రాలుంటాయి. ఆ సూత్రాలవల్ల ఏర్పడే సంఖ్యలు అనంతం, అవి కొత్తవి. పాత మాటలతో కొత్త పదబంధాలను సృష్టించి అపూర్వార్థాన్ని పుట్టించవచ్చు. ‘మెత్త,’ ‘పులి’ పాతమాటలే. కానీ ధర్మరాజును తిక్కన ‘మెత్తని పులి’ అని వర్ణించటంవల్ల దాని ధ్వన్యాత్మకమైన కొత్త అర్థం తెలుగు భాషలో అపూర్వం. ఇది తెలియని విమర్శకులు తిక్కనకు పాతమాటలు / వాడుకలో లేని మాటలు (archaic words) అంటే ఇష్టం లేదని రాశారు.
పదబంధాలు నాలుగు రకాలు: సమాసాలు, శబ్దపల్లవాలు, నుడికారాలు, తదితరాలు. తెలుగు మాటలతో సంస్కృతంలో లాగా దీర్ఘసమాసాలు సాధ్యం కాదు. అవయవాలైన పదాల అర్థంతో కొన్ని సూత్రాలను బట్టి పదబంధం అర్థం అయితే దాన్ని సమాసం అంటారు.
‘అంపపాన్పు’ = అమ్ములతో చేసిన పాన్పు, ‘మట్టిబొమ్మ’ = మట్టితో చేసిన బొమ్మ. ఇది సూత్రబద్ధం కాబట్టి మనం ‘తో-చేసిన’ సంబంధం ఉన్న కొత్తపదాలతో ఎన్నైనా కొత్త సమాసాలు సృష్టించవచ్చు, ఉదా. బంగారపు ఉంగరం, వెండి కంచం, గాజు సీసా, స్టీలు కుర్చీ, మొదలయినవి. సప్తమ్యర్థంలో బావినీళ్ళు (‘లో ఉన్న’), ష్ఠ్యర్థంలో చెరువుకట్ట, కాలి అందె, ముక్కు పుడక (‘కు ఉన్న’, ‘యొక్క’), మొదలయినవి. అవయవార్థాల సముదాయంవల్ల అవయవి అర్థం నిష్పన్నం కాకపోతే అవి నుడికారాలు, ఉదా. పెద్ద ఇల్లు (=పెద్దదైన ఇల్లు) సమాసం; పెద్దమనిషి (పెద్దగా ఉన్న మనిషి కాదు,పెద్దతనంతో ప్రవర్తించే మనిషి) నుడికారం; అలానే మెత్తని పులి, పెట్టని కోట, మొదలైనవి నుడికారాలు (idioms). ఇక శబ్దపల్లవాలు క్రియాపదాలలో అంతమయ్యే నుడికారాలు, ఉదా. కొనియాడు, చనిపోవు, మొదలైనవి. పై రెండు తెగల్లోకి చేరనివి విస్తృతపదబంధాలు (phrases) అనవచ్చు ఉదా. గుర్రములును ఏనుగులు లేని బయలు. ఇలాంటివి కొన్ని సూత్రాలను బట్టి పదాల కలయికతో ఏర్పడిన వాక్యావయవాలౌతాయి. క్రియాజన్య విశేషణాలకు విశేష్యాలు చేరి ఏర్పడే కొన్ని పదబంధాలు ఇప్పటి తెలుగులో: అన్నంతినేచెయ్యి (తృతీయ), అన్నంతినేకంచం (సప్తమి), అన్నంతినేబల్ల (సప్తమి), అన్నంతినేమనిషి (కర్త, ప్రథమ), ఇత్యాదులు. వాక్యావయవాల పరస్పరాన్వయం కూడా ‘పలుకులపొందు’ను బట్టే ఉంటుంది.
2.1 సమాసాలు
మూడు నాలుగు పదాలకు మించిన కలయిక తెలుగులో అరుదు. పూర్వస్థానంలో త్రికం (ఆ ఈ ఏ), నామం, విశేషణం, సంఖ్యావాచకం నియతక్రమంలో ఉండవచ్చు. తెలుగులో విశేషణాలు తక్కువ కాబట్టి, ఎక్కువ సమాసాల్లో నామాలే విశేషణార్థంలో వస్తాయి. తిక్కన వాడినన్ని దేశ్యసమాసాలు మరి ఏ ఇతర తెలుగుకవీ వాడలేదు. (వి = విశేష్యం, విణ. = విశేషణం, నా.విణ. = నామ విశేషణం). తిక్కన భారతం నుంచి ఉదాహరణలు:
అరదంబుల ఇఱుకటంబు (నా. విణ.+ వి.)
అమ్ములవాన (నా. విణ.+ వి.)
అవ్వెడందవాతియమ్ము (త్రి. + విణ.+ నా.విణ. + వి.)
అంపపాన్పు
అంపమూడమంచు
అంపపెనుజీకటి
ఆవులనేయి ‘ఆవుపాలనుంచి తీసిన నేయి’
ఈఁగకాలియంత
ఎరగలిచిచ్చు
ఎఱకలగాలి
కండగరువంబు
కడిందిపగఱు (-మగండు, -మగంటిమి, -మగల్),
కయ్యంపుకడంక (-జూదము, -టలజడి, -నేల, -మాట, -వేడుక, -జోలి, -బులుపు, -వెరవు)
కారెనుపోతు ‘అడవిదున్నపోతు’
చిక్కనిపోటుమానిసి
చిచ్చఱకన్ను
చీరపేను
తమ్ముఁగుఱ్ఱలు (వి. + వి. ద్వంద్వసమాసం)
తెలికన్నుగవ
నలుగడలు
నలుగాలివానఁ (బకక్షులు…) ‘చతుష్పాత్తులలో…’
నిడుఁద్రాట (long rope)
నెత్తురుమడువు (-వఱ్ఱు, -వాన, -వెల్లి, -సోన)
పసరపుటెంపప్రోవులు
పాఁపతూపు ‘నాగాస్త్రం’
పాఁపరమ్ము
పాముటమ్ము
పీనుఁగునంజుడు
పేరడలు (-అడవి, -అలుక, -ఆకలి, -ఉక్కు, -ఉచ్చు, -ఉరము, -ఎలుఁగు, -ఏనుంగులు, -ఓలగము)
పొడుపుగొండ ‘ఉదయాద్రి’
పొత్తినూలిప్రువ్వు ‘పట్టుపురుగు’
పోటుమగలు (-బంటు) ‘యుద్ధవీరులు’
ప్రేలరిమాటలు
ప్రేముడి పలుకులు
మగపాడి ‘శూరులధర్మం’
మెఱుఁగువాలంపగములు
పైవాటిలో కొన్నింటిని సంస్కృతంలో చెప్పటం సాధ్యంకాదు కొన్ని సంస్కతానువాదాలైనా స్వాభావికంగా ఉంటాయి. ఇవన్నీ తిక్కన కాలంలో వాడుకలో ఉన్నవి కాదు. చాలావరకు ఆయన సంస్కృతమూలాలను మరుగు పరిచేట్టు మొదటిసారిగా సృష్టించినవే.
2.2. శబ్దపల్లవాలు
ఇవి క్రియాధాతువులు చివరి అవయవంగా ఉన్న నుడికారాలు. ధాతువుకు ముందున్న భాగం స్వరూపం ఒక్కొక్కప్పుడు అస్పష్టంగా ఉంటుంది, ఉదా. ‘ఆడు’ అనే ధాతువు మూడు అర్థాల్లో పరపదంగా వచ్చినవి:
ఆడు – ‘అను, చెప్పు’ అనే అర్థంతో: ఉల్లసమాడు, కొనియాడు, చెడనాడు, తగనాడు, తెగనాడు, నోనాడు, నోరాడమి, బిరుదులాడు, మాటలాడు, ముట్టనాడు, సరసమాడు.
ఆడు – ‘కదలు’ అనే అర్థంతో: అట్టలాడు, అల్లాడు, ఉరియాడు, కాళ్ళులాడు, చిఱ్ఱుముఱ్ఱాడు, చేతులాడక, చేయాడక, తూగాడు, తూలాడు.
ఆడు – (ముందున్న పదం అర్థంతో కలిసే) ‘పనిచేయు’ అనే అర్థంలో: ఏట్లాడు, కాటులాడు, కొట్లాడు, చించిచెండాడు, చూఱలాడి, జల్లుపోరాడియాడి, జూదమాడు, తునుమాడు, తుఱుమాడు, తూటాడియాడి, పెనఁగాడు, పెనఁగులాడు, పోరాడు, ముద్దాడు, వసంతమాడు, వేఁటలాడు.
శబ్దపల్లవంలో వచ్చే -పడు ధాతువు చేరి ఎన్నో అమూర్తభావాలను తెలిపే క్రియలేర్పడతాయి. ఈ ధాతువు కృద్రూపం-పాటు. నేటి తెలుగులో పడు-పాటుల సంబంధం కొద్ది పదాలకే పరిమితం (non-productive):
అగపడు – అగపాటు
అచ్చెరువడు – అచ్చెరవాటు
అడచిపడు – అడిచిపాటు
అలజడిపడు – అలజడిపాటు
?ఎడఁబడు – ఎడబాటు
ఒడఁబడు – ఒడఁబాటు
?ఒల్లఁబడు – ఒల్లఁబాటు
ఏర్పడు – ఏర్పాటు
కీడ్పడు – కీడ్పాటు
కొందలపడు – కొందలపాటు
చిడిముడిపడు – చిడిముడిపాటు
తిరుగుడుపడు – తిరుగుడుపాటు
తొట్రుపడు – తొట్రుపాటు
తోడ్పడు – తోడ్పాటు
నివ్వెరపడు – నివ్వెరపాటు
మ్రానుపడు – మ్రానుపాటు
వెక్కసపడు – వెక్కసపాటు
వెనుఁబడు – వెనుఁబాటు
వెఱఁగుపడు – వెఱఁగుపాటు
వేర్పడు – వేర్పాటు
ఱిచ్చపడు – ఱిచ్చపాటు
2.2.1 సంస్కృతనామాలకు పరంగా వచ్చిన పడు-పాటులు
కష్టపడు – కష్టపాటు
దుఃఖపడు – దుఃఖపాటు
దైన్యపడు – దైన్యపాటు
భంగపడు – భంగపాటు
వేగపడు – వేగపాటు
2.3 నుడికారాలు
విడి మాటల అర్థం కంటే వాటి కలయిక వల్ల వచ్చే నుడికారం అర్థం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణలు:
ఇనుపగుండియ
ఉల్లికుట్టుమాటలు (?ఉల్లి = మనస్సు)
ఎండకన్ను, వానకన్ను ఎఱుఁగని = అసూర్యంపశ్య
(ఎండకన్ను- వానకన్నెఱుఁగని అనేది తిక్కన సృష్టి)
కన్నాకు
కన్నులపండువు
కఱివేము
కల్లజూదము/సారెలు
కుప్పలు కూరలుగా
గనపలొట్టేనుంగుపై
గుండెకాయ
చలిచీమలు
చలిపందిరి
చిందఱవందఱ
చెలియలికట్ట
తిండిపోతు
పీనుఁగుపెంటలు
పెట్టనికోట
పెడకేలు/-చెవులు/-చేత
పొలిమేర
ప్రాణగొడ్డము
మెత్తనిపులి
మేనల్లుఁడు/-బావ/-మామ/-మఱఁది
మైమఱువు = శరీరాన్ని రక్షించేది, కవచం
రక్కెసతాల్మి
2.4 ఇతర పదబంధాలు
పైవి మూడూ స్థూలంగా సమస్తపదాల కిందికి వస్తాయి. ఇవిగాక పదం కంటె పెద్దవి, వాక్యం కంటె చిన్నవిగా ఉండి, వాక్యావయవాలైన పదబంధాలున్నాయి, ఉదా.
కప్పయెలుంగుఁబాము = కప్పను నోట్లోచిక్కించుకున్న పాము
చూడ్కిసనినయంతదవ్వు
తలిరెసఁగెడునడమామిఁడి చెలువున = చిగుళ్ళు దట్టంగా ఉండి నడుస్తున్న మామడిచెట్టులాగా అందంగా
తావిఁగ్రమ్ము నరవిరిగుత్తి
తేనెపూసినకత్తివి
నీమెచ్చువారవంబుల
నీరుమేపుగలుగునెడకు
పచ్చవిలుతుననుఁగుటంపపొదిలోని బరిగోల
మొఱకుచేనున్నతియ్యపండు
వింజంబాఁకిడినకరణివవింధ్యపర్వతం = సూర్యచంద్రుల గమనాన్ని నిరోధించినట్టు
(ఆఁక + ఇడు)
3. సంస్కృతం, తెలుగు
అమూర్తభావాలకు తెలుగు మాటలు: తిక్కనగారు ఎంత విలక్షణమైన భావాలనైనా దేశ్యశబ్దాలతోనే చెప్తాడు. తెలుగు మాటలతో సాధ్యమైన అభిప్రాయాలకు సంస్కృతం ఎందుకు వాడాలన్న పట్టుదలే గాని ఈ మాటలన్నీ ఆయన కాలంలో వాడుకలో ఉండేవి అనటం హాస్యాస్పదం. ఇదే తత్వం ప్రాచీన తమిళ రచయితల్లోనూ కనిపిస్తుంది. చూడండి, ఉదా.
అతిశయం పెంపు
అసంతృప్తి ఆపోవక ఉనికి
ఆశ్చర్యం వెరగు
ఈర్ష్య ఈసు
ఉద్ధతి ఉబ్బు
ఉపాయం వెరవు
దుఃఖం అలమట
ద్వేషం పగ
ధర్మం పాడి, తగవు
భయం వెఱపు
రాగం/ప్రేమ ననుపు, వలపు
సంకోచం అఱ
సంభ్రమం కొందలపాటు, తొట్రుపాటు
సౌలభ్యం అనువు
శౌర్యం ఏడ్తెఱ
4. శిల్పం, చిత్రలేఖనం
శిల్పి తన భావాలకు, భావనలకు ప్రతిరూపాలను రాతిలోనో, చెక్కలోనో, లోహంలోనో చెక్కడం శిల్పం. చిత్రకారుడు ఒక కేన్వాస్ గుడ్డ, పట్టా, కాయితం, గోడ మీద రంగులను మాధ్యమంగా కుంచెతో రూపకల్పన చెయ్యటం చిత్రలేఖనం. ఈ రెండు కళారూపాల్లోనూ, ద్రష్టభేదాన్ని దృష్టిభేదాన్ని బట్టి తేడాలుంటాయి. శిల్పాన్ని దగ్గరికి వెళ్ళి చూడాలి, చిత్రాన్ని దూరం నుంచి చూడాలి. లేకపోతే అవి అలికినట్టు ఉంటాయి. రెండూ ఒకరకంగా స్థావరకళారూపాలు (static art forms) అనే చెప్పాలి. వాటిల్లో ఉన్న చైతన్యం, జీవకళ, నిర్దిష్ట సన్నివేశానికి నిబద్ధమై ఏదో ఒక క్షణంలో నిలిచిపోయిన (freeze అయిన) స్థితిని సూచిస్తాయి. చలనచిత్రం ఫిల్ములో ఒక ఫ్రేముతో (frame) వీటిని పోల్చవచ్చు. కవిత్వంలో చేష్ట, చైతన్యం ఉంటాయి కాబట్టి శిల్పానికి చైతన్యం ఉంటే ఎలా ఉంటుందో తిక్కన కవిత్వాన్ని బట్టి ఊహించుకోవాలి. ‘ఉభయకావ్య ప్రౌఢిఁబాటించు శిల్పమునన్ బారగుఁడన్’ అంటాడు తన్ను గురించి తిక్కన. ఒక శిల్పఖండాన్ని చూసేకొద్ది శిల్పి కౌశల్యం అర్థమవుతుంది. అలానే ప్రతిపద్యాన్నీ ప్రతిపదాన్నీ మళ్ళీ మళ్ళీ చదివినప్పుడు మనకు కొత్త అర్థాలు, కొత్త అందాలు కనిపిస్తాయి. వ్యర్థపదం ఏదీ కనిపించదు. తిక్కన రచనాశిల్పకౌశలాన్ని ప్రతిబింబించే కొన్ని ప్రక్రియలు, స్థానాలు: పలుకులపొందు, ఉపమాసౌష్ఠవం, నాటకీయశైలి, సార్థకసంబోధనలు, పాత్రల మనోవృత్తిచిత్రణ, మొదలైనవి. వీటిని ముందు ముందు వివరిస్తాను.
5. తిక్కనరచనాశైలి
తిక్కనరచనలో ప్రధానంగా రెండు రచనాప్రక్రియలు కనిపిస్తాయి. అవి కథనాత్మక శైలి, వర్ణనాత్మక శైలి. కథనాత్మక శైలిలో చిన్నచిన్న వాక్యాలుంటాయి పద్యానికి గద్యానికి అంత తేడా కనిపించదు అంటే పద్యపాదాంతంలో పదాలు తెగవచ్చు, తెగకపోవచ్చు.
వర్ణనాత్మక శైలిలో ప్రతిపాదం చివర పదం తెగుతుంది. వర్ణనాత్మక శైలి అలంకార సమ్మర్దంగా ఉంటుంది. కథనాత్మక శైలిలో కొద్దిమాటలతో ఎక్కువ విషయవ్యక్తీకరణ కనిపిస్తుంది ఉదా. కర్ణుడికి సారథిగా వచ్చిన శల్యుడు పాండవపక్షపాతి. ఎన్నిరకాల అతన్ని నిరుత్సాహపరచాలో అన్ని రకాల నిరుత్సాహపరుస్తాడు. దానిలో భాగంగా హంసకాకీయోపాఖ్యానం అనే కథ చెబుతాడు. ఆ ఉపాఖ్యానంలో మొదటి పద్యం:
5.1 కథనాత్మక శైలి
సీ.
అంబుధిలో నొక్క యలఘుతరద్వీప,
మున ధర్మవర్తినాఁజను నరేంద్రు
పురమున నొకవైశ్యవరుఁడధ్వరాదిసత్,
కర్మఠుఁడును శాంతిదాంతియుతుఁడుఁ
గరుణాపరుఁడు దాననిరతుండు ధనధాన్య,
శోభియు బహుపుత్రలాభవిలసి
తుండు నై వర్తించుచుండఁగ నిలు సేరె,
నొక కాకి యతనిపుత్రకులు దాని
తే.
కెంగిళులు పెట్టి కొనియాడ నెలమిఁబెరిగి
క్రొవ్వి కడు మీరి యెట్టిపకక్షులును దన్నుఁ
బోల వనియెడు దుర్మానమునఁ దృణీక
రించి యది పెక్కు భంగుల క్రీడ సలుపు (కర్ణ. 2.54)
ఈ పద్యంలో కథాకథనం ప్రధానం గాని అలంకారాలు (కొన్ని వైశ్యుని గురించిన విశేషణాలు తప్ప) ఏవీ లేవు. ఇలాంటి పద్యాలు కొల్లలు. మరో పద్యం, కురుక్షేత్ర యుద్ధం అంతా అయింతరవాత నారదుడు ధర్మరాజును చూడవచ్చి, కర్ణుడు తన సోదరుడని ముందుగా తెలియక పోవటంవల్ల వచ్చిన ప్రమాదాల్ని గురించి ధర్మరాజు బాధ పడుతున్నప్పుడు, కర్ణుడి మరణానికి ఎన్ని, ఎందరు కారణాలో నారదుడు చెబుతాడు:
చ.
వినుము నరేంద్ర విప్రుఁడలివెన్ జమదగ్నిసుతుండు శాప మి
చ్చె నమరభర్త వంచనముసేసె వరం బని కోరి కుంతి మా
న్చె నలుక భీష్ముఁడర్థరథుఁ జేసి యడంచెఁ గలంచె మద్రరా
జనుచిత మాడి శౌరి విధి యయ్యె నరుం డనిఁ జంపెఁ గర్ణునిన్ (శాంతి. 1.35)
ఈ పద్యంలో తొమ్మిది చిన్నచిన్న వాక్యాలున్నాయి. కర్ణుని చావుకు కారణాలన్నిటినీ ఒక గుక్కలో లయబద్ధంగా చెప్పటం ఉద్దేశం. ఇది కథను చెప్పటానికి తిక్కన అనుసరించిన శైలి. దీన్ని చంపకమాలగా చదివితే కథనం దెబ్బ తింటుంది కథన ప్రధానంగా చదివితే చంపకమాల ఛందస్సు ఎక్కడా గోచరించదు.
5.2 వర్ణనాత్మక శైలి
మరి వర్ణనాత్మక శైలి బహురూపాల్లో కనిపిస్తుంది. ఒక పద్ధతి: పద్యం వచనంలా కాకుండా పద్యంలానే నడుస్తుంది. పైనుదాహరించిన సీసపద్యానికి, ఈ కింది సీసానికి తేడా చూడండి. ఇది ద్రౌపది భీముడితో ధర్మరాజు గొప్పతనం తనకు తెలియనిది కాదని చెప్పుకొనే సందర్భం లోనిది.
సీ.
ఎవ్వనివాకిట నిభమదపంకంబు
రాజభూషణరజోరాజి నడఁగు
నెవ్వనిచారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
నెవ్వనికడకంట నివ్వటిల్లెడుచూడ్కి
మానితసంపద లీనుచుండు
నెవ్వనిగుణలత లేడువారాసుల
కటపటికొండపైఁ గలయఁ బ్రాకు
తే.
నతఁడు భూరిప్రతాపమహాప్రదీప
దూర విఘటితగర్వాంధకారవైరి
వీరకోటీరమణిఘృణవేష్టితాంఘ్రి
తలుఁడు కేవలమర్త్యుఁడే ధర్మసుతుఁడు (విరాట. 2.191)
సీసపద్యం నాలుగు పాదాల్లో మొదటిదిగా వచ్చే ‘ఎవ్వని’ అనే ప్రశ్నార్థక పదంతో తేటగీతి మొదటి పదంగా వచ్చే ‘అతఁడు’తో అన్వయం అతడెవరో పద్యం చివరి ‘ధర్మసుతుడు’ పదంతో అన్వయం. అన్ని సీసపద్య పాదాల చివర ఉన్న క్రియ తద్ధర్మార్థకం. ఇది సంస్కృతంలో ప్రసిద్ధమైన యత్తదర్థక ప్రయోగం.
మరో పద్ధతి: సీసపద్యంలో ప్రతిపాదం చివర వచ్చే అసమాపక క్రియతో తేటగీతిలోని మొదటి క్రియకు అన్వయం కల్పించటం కీచకుడి మనఃప్రవృత్తి తెలిసిన తరవాత అతన్ని చూసినప్పుడు ద్రౌపది పరిస్థితి ఎలా ఉన్నదో తిక్కన ఒక సీసపద్యంలో వర్ణిస్తాడు ఉదా.
సీ.
వెఱవక ననుఁజూచె వీఁడని యెడఁగలు
షించిన నొండొండఁజెమట వొడమ
ననుచితకృత్యంబు లాచరించు
విధాతృ బలిమికి నివ్వెఱపాటు దోఁప
నిచ్చట దిక్కులే రెవ్వరు నాకను
భయమున మేనఁ గంపంబు వుట్టఁ
జేయంగ నేమి యుపాయంబు లేమి నా
ననమున వెల్లదనంబు గదుర
తే.
నున్న పాంచాలి కనుఁగొని యన్నరాధ
ముఁడు వివేకవిహీనుఁడై ముదితుఁడగుచు
మదనవికృతియగాఁ దన మదిఁ దలంచి
రాగసాగరపూరనిర్మగ్నుఁడయ్యె (విరాట. 2.33)
సీసపద్యం నాలుగు పాదాల చివర ఉన్న అన్నంతక్రియలతో తేటగీతి మొదటి ‘ఉన్న’ అనే ధాతుజన్యవిశేషణానికి అన్వయం. ఇలాటివే విరాటపర్వంలోనూ ఇతర పర్వాలలోనూ చాలా సీసపద్యాలు కనిపిస్తాయి. (విరాట. 2.52, 2.118, 2.208, 2.315, 2.360, కర్ణ. 2.24).
ఇది వర్ణనాత్మక శైలిలో తిక్కన పాటించిన ఒక శిల్పప్రక్రియ. చెప్పదలుచుకొన్నదాన్ని కాస్త ఆలస్యం చేసి శ్రోతలకు పఠితలకు ఉత్సుకతను కలిగించటం ఈ రచనాప్రక్రియ లోని విశేషం. శ్రీనాథుడి సీసానికి పునాదులు తిక్కన ఇటువంటి వర్ణనాప్రధానమైన సీసాల్లో కనిపిస్తుంది. శ్రీనాథుడు సీసపద్యంలో ఎక్కువగా ఐదు మాత్రల ఇంద్రగణాలను ప్రయోగిస్తాడు. మరి కొన్ని ఇలాంటివే ఉన్నాయి. వర్ణనల్లో తిక్కన వాడే వాక్య నిర్మాణం వేరు కథనాత్మక శైలిలోనూ సంభాషణ శైలిలోనూ వాడే వాక్య నిర్మాణం వేరు. సంభాషణ శైలిని గూర్చి తరవాత వివరిస్తాను.
మరో ఉదాహరణం – లీలోద్యానంలో విహరిస్తూ కీచకుడు పడ్డ విరహబాధ:
సీ.
ఇంపైన ప్రియ కాన నిచ్చి నిల్చిన మధు
వాదట నాను మత్తాలివిభుని
జెట్టుపల్ పచరించి చుట్టుఁ గ్రమ్మరి మనో
రమ నియ్యకొలుపు మరాళవిభుని
ఫలరస మొండొంటి కెలమిఁ జంచుల నిచ్చు
మెయి చొక్కెడు శుకమిథునములను
గమిఁబాసి తలిరుజొంపమునకు మెయి మెయిఁ
దాకంగఁ జను పికదంపతులను
తే.
జూచిచూచి యుల్లంబున నేచి కోర్కు
లడరఁ జిడిముడిపడు మ్రానుపడు వెడంగు
పడు వెనుంబడుఁ దల్లడపడు దురంత
చింతబారికి నగపడు సింహబలుఁడు (విరాట. 2.306)
పునరావృత్తక్రియలలో ఉన్న లయ వల్ల పదం స్వరూపం లోని ధ్వని, ఉచ్చారణ, వ్యాకరణం ఏకకాలంలో అర్థస్ఫూర్తికి హేతువులౌతాయి. పై పద్యంలో తిక్కన తిర్యక్కులశృంగార వర్ణన కాళిదాసు కుమారసంభవాన్ని జ్ఞప్తికి తెస్తుంది. అటువంటిదే మరో ఉదాహరణ: ద్రౌపది కీచకుడి ఇంటికి మదిర కోసం అతని అక్క పంపితే ఇష్టం లేకపోయినా వెళ్తుంది ఆ సందర్భంలో:
సీ.
దైన్యంబు తలపోఁత తలకొన్నఁ జెలువ
కాననమున వెల్లదనంబు గదిరె
భయరసవేగంబు పైకొని ముట్టినఁ
గాంతకుఁ దనులత కంపమడరె
బెగ డంతకంతకు మిగిలిన నింతికిఁ
బదముల నడఁ దొట్రుపాటు బెరసెఁ
దల్లడం బొందినఁ దన్వికి నవయవం
బులనెల్ల ఘర్మాంబు కళిక లెసఁగెఁ
ఆ.వె.
దలఁకు పుట్టెఁ గొంకు కొలఁదికి మీఱె వె
న్బాటు దోఁచె ముట్టుపాటు దొడరె
వెఱగుపాటు దనికె నెఱనాడె నొవ్వు నె
వ్వగలు వగల నీనె దిగులు వొదివె (విరాట. 2.106)
ఈ పద్యంలో నాలుగు సీసపద్య వాక్యాల్లోనూ ద్రౌపది మానసికస్థితి వల్ల ఏర్పడ్డ శారీరకావస్థలను పెద్దవాక్యాలతో వర్ణించి ఆయా అవస్థలతో సతమతమౌతున్న మనస్సు పడే బాధను చిన్నవాక్యాలతో పునరావృత్తసమనిర్మాణక్రియలతో వర్ణించి ద్రౌపది మూర్తిని కళ్ళకు కట్టినట్టు చూపించటం ఒక శిల్ప విశేషం. మానసికస్థితి వర్ణనకు ఇన్ని దేశ్యశబ్దాలు ప్రయోగించిన మరొక తెలుగుకవి లేడు. ఈ పద్యం తిక్కన వాడిన వ్యాకరణలయ (grammatical rhythm) కు చక్కటి లక్ష్యం.
(3) సమపదనిర్మాణం (కాలార్థకప్రత్యయాలతుల్యత) కలిగి భిన్నక్రియలతో పునరావృత్తమయ్యే చిన్నచిన్న అసమాపకవాక్యాలను కూర్చటం మరో పద్ధతి సింహబలుడైన కీచకుడికి భీముడికి చప్పుడు గాకుండా జరిగిన మల్లయుద్ధాన్ని వర్ణించేటప్పుడు:
కం.
కదియుచుఁ బాయుచుఁబట్టుచుఁ
నదలుచుచుం బడుచు లేచుచడఁగుచు వడిగొం
చొదవెడు కినుకం గడు బె
ట్టిదముగఁ బెనఁగిరి చలంబు డింపక కడిమిన్ (విరాట. 2.348)
మొదటి రెండు పాదాల్లోనూ ఎనిమిది శత్రర్థకక్రియలున్నాయి పద్యం చదువుతున్నప్పుడు వాళ్ళు పట్టే కుస్తీ కళ్ళకు కట్టినట్టు పదగతిలోనే అర్థం ఇమిడి ఉంది. ఒక్కొక్కప్పుడు ధ్వనుల కలయికే అర్థస్ఫోరకమౌతుంది. దీన్ని sound symbolism అంటారు. పోతన గజేంద్రమోక్షంలో విష్ణుమూర్తిని అనుసరించిన లక్ష్మీదేవి సంకోచాన్ని, తొట్రుపాటును అక్షరలయతో ఉన్న పదాల ఎంపికలో చూపిస్తాడు:
కం.
అడిగెదనని కడువడిఁజను
నడిగినఁ దనమగఁడు నుడువ డని నడ యుడుగున్
వెడవెడఁ జిడిముడిఁ దడఁబడ
నడుగిడు నడుగిడదు జడిమనడుగిడునెడలన్ (మహాభాగవతము. 8.103)
ఈ పద్యంలో లక్ష్మీదేవి నడక కనిపిస్తుంది గదూ! తిక్కన అట్టే ఇలాంటి శబ్ద చిత్రాల జోలికి వెళ్ళడు. అక్కడక్కడ ఉచ్చారణ, పదాల ఎంపిక, అర్థం అన్నీ ఒకే తాటి మీద వెళ్ళేట్టు సమీకరించిన (synthesize చేసిన) పద్యాలు కూడా ఉన్నాయి. ద్రౌపది సభలోకి వస్తున్నప్పుడు కీచకుడు ఆమెను తన్నిన సన్నివేశం చూసిన భీముడి స్థితిని వర్ణిస్తూ:
చ.
కనుఁగొని కోపవేగమునఁగన్నుల నిప్పులు రాల నంగముల్
గనలఁగ సాంద్రఘర్మసలిలంబులు గ్రమ్మి నితాంతదంతపీ
డనరటదాస్యరంగవికటభ్రుకుటీచటులప్రవృత్తన
ర్తనఘటనాప్రకారభయదస్ఫురణాపరిణద్ధమూర్తియై
విస్తృతవర్ణనలు అవసరమైన చోట తిక్కన సీసపద్యాన్ని ఎక్కువగా వాడతాడు.
5.3 సంభాషణ శైలి
ఈ రకమైన రచనను కొందరు నాటకీయ శైలి అన్నారు. కాని భాషావిషయంగా ఎవ్వరూ దీన్ని నిర్వచించలేదు. నాటకానికి కథనం కంటె సంభాషణలు ప్రాణం. సంభాషణల్లో సర్వనామాల ప్రయోగం ఎక్కువగా ఉంటుంది. సర్వనామాలకు సందర్భవిరహితంగా అర్థం నిరూపించటం సాధ్యంకాదు. నేను, నువ్వు, అంత, అప్పుడు, ఇప్పుడు, మొదలైన మాటలు మనకు నిర్దిష్ట సందర్భాలు తెలిస్తేగాని అర్థంకావు. ‘నేను’ అంటే తత్కాలంలో మాట్లాడుతున్న వ్యక్తి, ‘నువ్వు’ అంటే తత్కాలంలో సంబోధింపబడే వ్యక్తి అలానే త్రిక (ఆ-ఈ-ఏ) నిష్పన్నమైన అది-ఇది-ఏది, అక్కడ-ఇక్కడ-ఎక్కడ, అప్పుడు-ఇప్పుడు-ఎప్పుడు, మొదలైన శబ్దాల విస్తృతప్రయోగం వల్ల, తత్సంబంధి ప్రత్యయాలు, క్రియారూపాల వల్ల, తిక్కన అనితరసాధ్యంగా నాటకీయత సంపాదిస్తాడు, ఉదా. భీముడు కీచకుణ్ణి చీకటిగదిలో సంబోధించేటప్పుడు అన్న మాటల ప్రయోగం పరిశీలించండి:
తే.
ఇట్టివాఁడవు గావున నీవు నిన్ను
పొగడికొనఁదగు నకట నా పోల్కి యాఁడు
దాని వెదకియు నెయ్యెడ నైన నీకుఁ
బడయవచ్చునె యెఱుఁగక పలికితిట్లు (విరాట. 2.337)
కం.
నా యొడలు చేర్చినప్పుడు
నీ యొడ లెట్లగునొ దాని నీ వెఱఁగెదు న
న్నే యబలల తోడిదిగాఁ
జేయఁదలంచితివి తప్పు సేసితి గంటే (విరాట. 2.338)
కం.
నను ముట్టి నీవు వెండియు
వనితల సంగతికి పోవువాఁడవె యైనం
దనువే పడసిన ఫలమే
కనియెద విదె చిత్తభవవికారము లెల్లన్ (విరాట. 2.339)
మన్మథవికారాల్లో చివరిది మరణం, ‘అది నీకు మూడింద’ని ధ్వని.
తిక్కనకు ‘ఇంతలు, అంతలు,’ అరుదుగా ‘ఎంతలు’ అనే శబ్దాలు చాలా ఇష్టమైనవి. ఇతరకవులు ఈ మాటలు వాడటం అరుదు. ‘ఇంతలు’ అంటే ఇటీవలి కాలంలో జరిగిన సంఘటనలు, ‘అంతలు’ అంటే భూతకాలంలో జరిగిన సంఘటనలు అని ఒక అర్థం. అసంఖ్యాకం, చాలా ఎక్కువ అనేది మరో అర్థం. మామూలు మాటలలో చెప్పటానికి సాధ్యంకాని, అనిర్వచనీయమైన (కష్టాలు, సుఖాలు, మంచి పనులు, చెడ్డ పనులు) అనేది ఇంకో అర్థం. ఉదాహరణలు:
‘దుష్ట చేష్టల సుయోధునుఁడింతలు సేసె…’ (ఉద్యో. 3.4) = ఇన్ని దుష్కృత్యాలు; ‘ఒడ్లకున్ గోచరమట్టె ఇంతలు పనుల్’ (కర్ణ. 1.266) = ఇంతకష్టమైన పనులు; ‘ఈ వెండ్రుకలు వట్టి ఈడ్చిన ఆ చేయి, తొలుతగాఁ బోరిలో దుస్ససేను తనువింతలింతలు తునియలై చెదరి రూ, పఱి యున్నఁగని యుడుకాఱుఁగాక…’ (ఉద్యో. 3.117) = తాను చూపిస్తున్నంత చిన్నచిన్న (ముక్కలు); ‘దుర్ణయవృత్తి దుర్ద్యూతంబు పుట్టించి, యంతలు సేసిన యట్టివారి…’ (ఉద్యో. 1.331), ‘అంతలంతలు దప్పులు సేసితి మని తలంకవలవ దెంతలు సేసినను గౌంతేయ పూర్వజుండు శాంతిసుధానిధి యగుటం జేసి శరణుసొచ్చినం గాచు నని…’ (ఉద్యో. 3.201); ‘అలిగిన భీమఫల్గునులకడ్డము లేమి యెఱుంగు దంతలంతలు పడి వానినీఁగవలదా…’ (ఉద్యో.3.201) = అంతంత కష్టాలు.
తే.
ధార్తారాష్ట్రు లున్మత్తులు, దగినపలుకు
లేల విని సంధిసేయుట కిచ్చగింతు
రెదిరిఁదమ్మున నెఱిఁగిర యేని వార
లంత లంతలు సేయుదురయ్య నాఁడు (ఉద్యో. 4.73)
ఈ శబ్దాలను విశేష్యాలుగానే గాక విశేషణాలుగా గూడా వాడవచ్చు. ‘అంతలంతలు దప్పులు…’ (ఉద్యో.2.244) = అంత చెయ్యరాని తప్పులు; ‘అంతలంతలు మానుసులు మడిసిరి గాని… (ద్రో. 2.187) = చాలాబలవంతులైన వీరులు; ‘అంతలంతలు మేటిమగలు’ (కర్ణ. 3.380) = అంతటి గొప్ప యోధులు.
పై ప్రయోగాలను బట్టి మంచి చెడ్డ అనే రెండురకాల అర్థాలకు ఈ పదాలను ప్రయోగించినట్టు తెలుస్తుంది. ద్రౌపది రాయబారానికి వెళ్తున్న కృష్ణునితో అన్న మాటల్లో సర్వనామాల ప్రయోగంతో సంభాషణ శైలి పరాకాష్ఠను సూచిస్తున్నది:
ఉ.
నీవు సుభద్రకంటెఁ గడు నెయ్యము గారవముం దలిర్ప సం
భావన సేయుదట్టి ననుఁ బంకజనాభ ఒకండు రాజసూ
యావభృథంబునందు శుచియై పెనుపొందిన వేణిఁబట్టి యీ
యేవురుఁ జూడగా సభకు నీడ్చెఁ గులాంగన నిట్లొనర్తురే (ఉద్యో. 3.110)
ఉ.
ఆ సభ కేకవస్త్ర యగు నట్టి ననున్ గొని వచ్చి నొంచు దు
శ్శాసనుఁ జూచుచుం బతు లసంభ్రములై తగు చేష్ట లేక నా
యాసలు మాని చిత్రముల యాకృతి నున్న యెడన్ ముకుంద వి
శ్వాసముతోడ నిన్ గొలువ వచ్చె మనం బదియుం దలంపవే (ఉద్యో. 3.111)
ఉ.
నెట్టన నిట్టియల్క మది నిల్పితి…. (ఉద్యో. 3.118)
6. కృత్తద్ధితవిస్తృతప్రయోగం
క్రియాపదాలతో పర్యవసించే వాక్యాలకు, వాక్యభాగాలకు బదులు వాటి నుంచి ఏర్పడ్డ కృద్రూపాలు ఉపయోగిస్తాడు తిక్కన. కర్తను కర్మను ప్రత్యేకంగా చెప్పదలుచుకోనప్పుడు భావార్థంలో వచ్చే క్రియలను కృత్తులుగా ఉపయోగించటం ఒక చమత్కారం. సుదేష్ణ ద్రౌపదితో అంటుంది:
ఉ.
అక్కట యేను వేడ్కపడి యానెడునాసవ మర్థిఁ దేరఁగా
నొక్క నికృష్టఁ బంపుటకు నోపక చెప్పిన దీని నీవు గో
సెక్కగఁజేసి నిన్ను నతిహీనవిధాననియుక్తఁ జేఁతగా
నిక్కమ యుమ్మలించితిది నెయ్యము తియ్యము కల్మియే సఖీ (విరా. 2.98)
ఈ పద్యంలో ‘నీవు, నిన్ను, ఉమ్మలించితివి’ అని స్పష్టంగా వచ్చేట్టు చెప్పి ‘నేను’ అనేది క్రియాపదంలో ధ్వనించకుండా చూడటం లౌక్యం. నేను నిన్ను ‘అతిహీన విధాన నియుక్తను చేశాను’ అని బాధ పడ్డావు అనే అర్థం వచ్చే క్రియారూపం వాడలేదు. నిజంగా ఈ పనికి నియోగించటానికి కారణం కీచకుడు గాని తాను గాదు. ఆ సంగతి ‘నియుక్తఁజేఁతగా’తో దాటేసింది. ‘మరి ఇది మన మధ్య స్నేహం ఉన్నట్టా, కాదా’ అనే చోట ‘కల్మి’ వాడటంలో ఎవరి మనస్సులో స్నేహం ఉందో ఎవరికి లేదో తెలియని స్థితి ఏర్పడ్డది. తిక్కన పాటించిన శిల్పరహస్యాలలో ఇదొకటి. అలానే సుదేష్ణను కీచకుడు ‘నీకు ద్రౌపదితో ఎంత స్నేహం’ అనటానికి బదులు ‘దీనిపై, నెయ్యము కల్మియే కొలఁది నీమదికి’ అంటాడు ఇలాంటివే ‘పనులకేనుజాల కునికి’, లేకుండట బదులు ‘లేకునికి’, మొదలైనవి.
7. సంబోధనలు
సంబోధనలు చిన్న వాక్యాలు. సంబోధనల్లో శ్రోతకు వక్తకు ఉన్న సంబంధం వ్యక్తమౌతుంది. ఆదరం, గారాబం, ప్రేమ, కోపం లాంటి మనోభావాలు తెలుస్తాయి. వక్త సంబోధన లోనే శ్రోతను కొండెక్కించవచ్చు నేలకేసి కొట్టవచ్చు. సంబోధనలను సాభిప్రాయంగా రాసిన కవులు అరుదు. కాని, తిక్కన రచనాశిల్పంలో సంబోధనల ఎంపిక ఒక విలక్షణతగా స్పష్టంగా కనిపిస్తుంది. మనుచరిత్రలో ప్రవరుడు వరూధినిని మొదట చూసినప్పుడు, ‘ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ’ అని పిలవకపోతే అన్ని చిక్కుల్లో పడేవాడు కాదు. పెద్దన అతని చేత అలా అనిపించటం రాబోయే కథకు ప్రాతిపదిక అయింది. నన్నయకు ఆ దృష్టి ఉంటే గరుత్మంతుడు తల్లిని ‘చెప్పుము దీని పయోరుహాననా’ (భార.ఆది. 2.48) అనేవాడు కాదు. తిక్కన సాభిప్రాయంగానే సంబుద్ధివాచకాలు ఉపయోగిస్తాడు, ఉదా. శల్య సారథ్యం, శల్యుడు కర్ణుణ్ణి ఎలాగైనా నిరుత్సాహపరచాలని అర్జునుణ్ణి ప్రశంసించి కర్ణుణ్ణి తక్కువ చేస్తాడు. సీసపద్యం నాలుగు పాదాల్లో అర్జునుడితో కర్ణుణ్ణి పక్షపాత దృష్టితో పోల్చి, చివరకు
తే.
‘వినుమ సూతతనయ! మనబోటులాతనిఁ
జెఱుతుమనుట నోరి చేటుగాదె’ (కర్ణ. 2.24) అంటాడు.
కర్ణుడు క్రుద్ధుడై, శల్యుణ్ణి ‘క్షత్రియాధమ’ (కర్ణ. 2.47) అంటాడు. తన్ను తక్కువ చేసినందుకు దూషిస్తాడు. మదనోద్విగ్నుడైన కీచకుడితో ద్రౌపది అనే మాటలు:
కం.
నాయున్న బాము తలఁపవ
యీ యొడలీ చీర యిట్టి యేవపుఁ జందం
బో యన్న మదన వికృతిం
జేయు ననుట యెంతయును నిషిద్ధము గాదే (విరా. 2.49)
నేను నీ చెల్లెలి లాంటి దానిననే ధ్వని వచ్చేట్టు ‘ఓ అన్న’ అని సంబోధించి, చెల్లెలిపై కామవికృతి నిషిద్ధం గదా అంటుంది. ఆ తర్వాత ‘కీచకా’ (విరా.2.55) అనీ, అప్పటికీ మారకపోతే ‘వివేకవిహీనా’ (విరా.2.58) అనీ సంబోధిస్తుంది. సుదేష్ణ పని చెప్పినప్పుడు ద్రౌపదిని ‘సఖీ’ (విరా.2.98) అంటుంది. ద్రౌపది భీముణ్ణి ఉబ్బించేటప్పుడు ‘అనిలతనయ’ (విరా.2.175), ‘పావనీ’ (విరా.2.193), ‘వాయుపుత్ర’ (విరా.2.229) అని ప్రోత్సాహకరమైన పిలుపులు వాడుతుంది. ఒక్కొక్కప్పుడు ఏ సంబోధనా లేకుండా మాట్లాడటం గూడా అర్థవంతం అవుతుంది. ద్రౌపది కీచకుడి దగ్గరికి వెళ్ళి, ‘దేవి తృష వుట్టి వారుణిఁ దేరఁబనుప, నరుగుదెంచితిఁ బోయింపుఁడు…’ (విరా.2.116) అన్నది, అతన్ని సంబోధించకుండానే. అవమానపడి తిరిగి వచ్చిన తరవాత సుదేష్ణను సంబోధించలేదు. ధృతరాష్ట్రుడు ఆశ్రమవాసపర్వంలో అరణ్యాలకు వెళ్ళే ముందు ప్రజలను ఉద్దేశించి, ‘పౌరవరులార’, ‘కృపాఢ్యులార’ అంటాడు, వాళ్ళు సందర్భోచితంగా ఆయన్ను ‘అమలినహృదయ’ అని పిలుస్తారు. అభిమన్యుడి చావు వార్త తెలిసిన అర్జునుడు, ‘హా యను, ధర్మరాజతనయా యను, …ఏగతిఁబోవువాఁడ నే, నో యభిమన్యుఁడా’ యను. ‘ధర్మరాజతనయా’ అంటంలో ఆయన కొడుకువైనా నిన్ను రక్షించుకోలేకపోయాడు అనే ధ్వని ఉంది.
పై రచనాప్రక్రియకు విరుద్ధంగా, హరిశ్చంద్రోపాఖ్యానంలో శంకరకవి, చంద్రమతి లోహితాస్యుడి మరణానికి విలపించిన తీరు చూడండి.
మ.
‘అకటా చేరెడు నేలకుం దగఁడె సప్తాంభోధివేష్టీభవత్
సకలద్వీపకలాపభూపమకుటాంచత్పద్మరాగోత్పల
ప్రకటానర్గళ నిర్గళత్కిరణశుంభత్పాదుఁడైనట్టి రా
జకుమారుండు….’ (హరి. 5.86)
అని ఏడుస్తుంది. దీన్ని ‘ఈ తీరునే ఎల్లరామాయణములును వ్రాయఁబడి యున్నచో, నా గ్రంథముల యొద్దకు మనుష్యులననేల తుదకు చెదలు సైతము పోదనుట స్పష్టము’ అని కట్టమంచి రామలింగారెడ్డిగారు విమర్శించాడు (కవిత్వతత్త్వ విచారము, పుట 101).
8. సంస్కృతాంధ్ర పదప్రయోగం
నిర్వచనోత్తర రామాయణం అవతారికలో సుకవిత్వ లక్షణాలు చెప్పే సందర్భంలో తిక్కన ఇలా అంటాడు.
ఉ. జాత్యము గాని నొప్పయిన సంస్కృతమెయ్యడఁ జొన్ప….
ఈ వాక్యాన్ని చాలామంది విమర్శకులు అపార్థం చేసుకొన్నారు. ‘మన నుడికారం కాదు కాబట్టి సంస్కృతాన్ని ఎక్కడబడితే అక్కడ చొప్పించను, అంటే, సందర్భాన్ని బట్టే వాడతాను’ అని ఒక అర్థం. మరో అర్థం ‘ఎక్కడా (‘ఎయ్యెడన్’) చొప్పించను’ అని. ఈ రెండో అర్థం సరైంది కాదు, తిక్కన చాలా చోట్ల సంస్కృతం వాడాడు కాబట్టి, నాకు ఇంకో రకంగా తోస్తుంది. ‘జాత్యము గాని యొప్పయిన సంస్కృతమెయ్యెడఁ జొన్ప’ అన్నది సరైన పాఠమై ఉండవచ్చు. అంటే, తెలుగు నుడికారానికి సరిపడని, సందర్భశుద్ధి లేని (‘జాత్యముగాని’) సంస్కృతాన్ని అందంగా ఉన్నదని (‘ఒప్పయిన’) మాత్రం ఎక్కడా వాడను, అని.
తిక్కన నిర్దిష్ట సందర్భాలలోనే సంస్కృతసమాసాలు వాడతాడనటానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇదొక రచనాశిల్పవిశేషం.
అ) అద్భుతభయానక దృశ్యాలను వర్ణించటానికి దీర్ఘసంస్కృతసమాసాల ప్రయోగం తిక్కనలో కనిపిస్తుంది. కౌరవసేనను చూసిన ఉత్తరుడు సారథి బృహన్నలతో ఇలా అంటాడు.
శా.
భీష్మద్రోణకృపాదిధన్వినికరాభీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్యపటుప్రతాపవిసరాకీర్ణంబు శస్త్రాస్త్రజా
లోష్మస్ఫారచతుర్విధోజ్జ్వలబలాత్యుగ్రంబు దగ్రధ్వజా
ర్చిష్మత్త్వాకలితంబు సైన్య మిది నేఁ జేరంగ శక్తుండనే (విరాట. 4.52)
ద్రౌపది కీచకుడికి తన భర్తల శౌర్యాన్నిగురించి చెప్పి బెదరగొట్టేటప్పుడు:
శా.
దుర్వారోద్యమబాహువిక్రమరసాస్తోకప్రతాపస్ఫురత్
గర్వాంధప్రతివీరనిర్మథనదీక్షా పారగుల్ మత్పతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసన్ గిట్టి గం
ధర్వుల్ మానముఁబ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా (విరాట. 2.55)
ఈ బెదిరింపులకు జవాబుగా కీచకుడు (సింహబలుడు) సమాసరహితమైన తేట తెలుగు మాటలలో (తేటగీతిలో) ఇలా చెప్పాడు.
తే.
అనుఁడు నతఁడిట్టు లనియె నాయతులబాహు
బలముఁజెనయంగ భవదీయ పతులుగాదు
మూఁడు లోకంబులందు నెవ్వారు లేమి
నిక్కువంబింత నమ్ముమో నీరజాక్షి (విరా. 2.56)
ద్రౌపది మాటలను తాను చాలా తేలికగా తీసుకొంటున్న కీచకుడి స్వభావాన్ని ఈ రెంటి పోలికలో పద్యాల ఎంపిక లోనూ మాటల ఎంపిక లోను చాలా అపూర్వంగా తిక్కన ప్రదర్శిస్తాడు.
మరో ఉదాహరణ. ద్రోణుడు బృహన్నలను అర్జునుడుగా గుర్తించి కర్ణుడు మొదలైన వీరులతో అన్నమాట, దుర్యోధన సేన ఓడిపోతుంది అన్న సూచన చేస్తూ:
శా.
సింగంబాకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతారనివాసఖిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్ (విరా. 4.95)
ఆ) ఎక్కువ-తక్కువలకు, చిన్న-పెద్దలకు మధ్య ఉన్న భేదాలు పదవాక్యనిర్మాణంలోనే విశదమయ్యేట్టు సంస్కృతసమాసాలతో ఒకటి, అసమస్తపదాలతో గాని, తెలుగు మాటలతోగాని మరొకటి, నిర్దేశిస్తాడు తిక్కన.
కం.
కరిథసహస్రబలవి
స్ఫురితుఁడగు విచిత్రవీర్యపుత్రుఁ డొక తలో
దరి నూ ఁతగొనియె విధి యె
వ్వరిహీనులఁ జేయఁడకట వక్రుండైనన్ (ఆశ్రమ. 1.40)
వెయ్యి ఏనుగుల బలం గల ధృతరాష్ట్రుడు ఒక అబలను (గాంధారిని) ఊతగా చేసుకొన్నాడు! కర్ణపర్వంలో శల్యుడు అర్జునుడితో కర్ణుణ్ణి పోలుస్తూ చెప్పిన మాటలు:
సీ.
రోషమహాటోపభీషణహరి తోడ
సమరంబునకు హరిణము గడంగి
దానధారాభీలదంతావళము తోడ
సంగ్రామమునకు శశంబు గడఁగి
చండస్వభావోగ్రపుండరీకము తోడ
నాజికి సారమేయంబు గడఁగి
దారుణతుండాతి ఘోరగృధ్రము తోడఁ
గలహంబునకు నురగంబు గడఁగి
ఆ. వె
యడరు నట్లుగాదె యస్త్రకళాసము
జ్జ్వలుఁడు పార్థుతోడ సంగరమున
కీవు గడఁగి యడరుటెల్ల రాధేయ, నీ
కెట్టిబలము నమ్మ నెందు గలదు (కర్ణ. 2.42)
అజేయమైన వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు ఒత్తులున్న అక్షరాలతో దీర్ఘసమాసాలు, దుర్బలవ్యక్తిని గురించి చెప్పేటప్పుడు తేలిక ధ్వనులు, అల్పాక్షరాలు. ఇక్కడ సంస్కృతపద ప్రయోగం ఎంత హృద్యంగా, ఉచితంగా ఉందో ఆలోచించండి. రాధేయ అనే సంబోధన గూడా అర్థవంతం, తిక్కన కవితాశిల్పంలో ఇవి కొన్ని విలక్షణతలు మాత్రమే.
9. ఉపమానసౌష్ఠవం
సామాన్యభాషకు, కవితాభాషకు ఉన్న భేదం ప్రధానంగా అనువైన మాటలను ఏర్చటం లోనూ, కూర్చటం లోనూ ఉంటుంది. ఇంగ్లీషులో దీన్నే ‘selection and combination’ అంటారు. వాటి నిర్వచనం:
“The selection is produced on the basis of equivalence, similarity, dissimilarity, synonymy and antonymy. While the combination, the building up of the sequence, is based on contiguity. The poetic function projects the principle of equivalence from the axis of selection to the axis of combination”.
– [Seymour Chatman & Samuel R. Levin, Essays on Language and Literature, p. 303].
ఒక వస్తువును గురించో, వ్యక్తిని గురించో, సన్నివేశాన్ని గురించో చెప్పదలుచుకొన్న కవికి తత్సదృశానుభవాలు గుర్తుకువచ్చి, సాదృశ్యస్ఫోరక శబ్దాల వాడుక వల్ల వర్ణించే విషయాన్ని ఉద్దీపితం చేస్తాడు. ఉపమ కవితాభాషకు ప్రాణం. సాదృశ్యం, సమధర్మం ఏ పరిస్థితుల్లో ఏయేవస్తువులకు ఎలా ఆరోపించటం సాధ్యమౌతుందో సృజనాత్మకశక్తి గల కవికి తెలుస్తుంది. పోలికలు సామాన్యభాషా వ్యవహారానికి గూడా చేవ నిస్తాయి. మామూలు వాడుకలోనూ మనం తరచుగా వినేవి: ‘పసిగుడ్డు, రెక్కలు కొట్టేసిన పక్షిలా, పనసపండులాంటి పిల్లవాడు, మూకుడు లాంటి మొహం, కాలుగాలినపిల్లి, ముగ్గుబుట్టలాంటి తల, గుమ్మడిపండులాంటి బొజ్జ’ మొదలైన ఉత్ప్రేక్షలు ఒక సంస్కృతికి, సమాజానికి ప్రతిబింబాలు. కవి తాను చూసిన, విన్న, పరిశీలించిన పరిసరప్రపంచం నుంచి ఈ సాదృశ్యాలను స్వాభావికంగా దర్శిస్తాడు. ‘చెంపకు చేరడేసి కండ్లు, కోటేరేసిన ముక్కు, పూచిన తంగేడులా ఉంది’ లాంటివి తెలుగు సంస్కృతికి సహజమైన పోలికలు. స్వతంత్రమైన భావనాశక్తి ఉన్న కవుల కొత్త సాదృశ్యాలను సృష్టిస్తారు. వాల్మీకి కాళిదాసులు ఆ కోవకు చెందిన వారు.
‘పద్మాల్లాంటి కళ్ళు, అరటిబోదెల లాంటి ఊరువులు, తుమ్మెదలగుంపులాంటి జుట్టు’, మొదలైనవి సంస్కృతసాహిత్యంనుంచి వచ్చిన కవిసమయాలు. ‘కవిసమయం’ అంటే ఏది దేంతో సాదృశ్యం కలిగి ఉంటుందో వాటిని ఒక జాబితాచేసి కవిగాండ్లను స్వేచ్ఛగా వాడుకోమని లాక్షణికులు కల్పించిన సంకేతం. స్వతంత్రభావనాశక్తి లేని కవులు అశ్రమంగా వాటిని వాడుకోవచ్చు.
ఉపమానోపమేయసంబంధాన్ని నాలుగు రకాల విశ్లేషించవచ్చు. ఉపమానం గాని, ఉపమేయం గాని, మూర్తం, దృష్టిగోచరం (concrete) కావచ్చు అమూర్తం, అవ్యక్తం, అగోచరం (abstract) కావచ్చు. ఈ రెంటి కలయికతో నాలుగు భేదాలు ఏర్పడతాయి.
ఉపమేయం ఉపమానం
1. మూర్తం (concrete) మూర్తం (concrete)
2. మూర్తం (concrete) అమూర్తం (abstract)
3. అమూర్తం (abstract) మూర్తం (concrete)
4. అమూర్తం (abstract) అమూర్తం (abstract)
ఈ నాలుగు రకాల ఉపమానాలు తిక్కనలో కనిపిస్తాయి. వాల్మీకి ఉపమాచక్రవర్తి. అశోకవనంలో హనుమంతుడు చూసినప్పుడు సీతాదేవి కనిపించిన తీరు ఇరవై, ముప్ఫై అరుదైన ఉపమానాలతో ఆ మహాకవి వర్ణిస్తాడు. ఇవి కవిసమయాలు కాదు. ప్రపంచసాహిత్యంలోనే అలాంటి పోలికలు అరుదు. ‘సీత మలినవస్త్రాలతో ఉంది. ఉపవాసాలతో శరీరం కృశించి ఉంది. అప్పుడప్పుడు ఏడుస్తున్నది. నిట్టూర్పులు విడుస్తున్నది. చుట్టూరా రాక్షస స్త్రీలు కాస్తున్నారు.’ ‘శుక్లపక్షం మొదటి రోజు కనిపించే నెలవంకలా, పొగ ఆవరించిన మంటలా, పద్మాలు లేని సరస్సులా, తన వాళ్ళెవరూ కనిపించకుండా ఉన్నప్పుడు వేటకుక్కలు చుట్టుముట్టిన లేడిలా ఉంది. నాగుబాములా రోజుతున్నది. గుర్తుకు రాని జ్ఞాపకంలా, నశించిన వివేకంలా, సడలిన నమ్మకంలా, ప్రతిహతమైన ఆశలా, విఘ్నాలతో వచ్చిన ఫలసిద్ధిలా, కలత బారిన వివేకంలా, అభూతమైన అపవాదంతో దెబ్బతిన్న కీర్తిలా, అభ్యాసలోపం వల్ల శిథిలమౌతున్న చదువులా, సంస్కారలోపంతో ఉచ్చరించిన మాటకు వచ్చే తప్పు అర్థంలా ఉంది’. సీత దుఃస్థితిని ఇలాంటి అమూర్తాలైన ఉపమానాలతో ఇలా వర్ణించటం ఒక్క ఆదికవికే సాధ్యం. ఇక మూలం (సుందరకాండ, 15వ సర్గలో చూడండి)
తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతామ్ 18
ఉపవాసకృశాం దీనాం నిఃశ్వసంతీం పునఃపునః
దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలామ్ 19
…
సపంకా మనలంకారాం విపద్మామివ పద్మినీమ్ 21
అశ్రుపూర్ణ ముఖీం దీనాం కృశా మనశనేనచ
…
శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణామ్ 23
ప్రియం జనమపశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణమ్
స్వగణేన మృగీం హీనాం శ్వగణాభివృతా మివ 24
…
నిశ్శ్వాసబహుళాం భీరుం భుజగేంద్రవధూమివ 31
శోకజాలేన మహతా వితతేన న రాజతీమ్
సంసక్తాం ధూమజాలేన శిఖా మివ విభావసోః 32
తాం స్మృతీ మివ సందిగ్ధాం ఋద్ధిం నిపతితా మివ
విహతా మివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతా మివ 33
సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషా మివ
అభూతేనాపవాదేన కీర్తిం నిపతితా మివ 34
మలపంకధరాం దీనాం మండనార్హా మమండితామ్
…
ప్రభాం నక్షత్రరాజస్య కాలమేఘై రివావృతామ్ 37
తస్య సందిదిహే బుద్ధి ర్ముహుః సీతాం నిరీక్ష్యతు
అమ్నాయానా మయోగేన విద్యాం ప్రశిథిలా మివ 38
దుఃఖేన బుబుధే సీతాం హనూమా ననలంకృతామ్
సంస్కారేణ యథా హీనాం వాచ మర్థాంతరం గతామ్
-(రామాయణమ్, సుందరకాండ, 15వ సర్గ)
పై శ్లోకాల్లో సీత దైన్యాన్ని, అంటే ఒకరకంగా కళ్ళకు కనిపించేదాన్ని (అమూర్త భావాలతో ఉన్న సీత మూర్తిని) అనన్యసామాన్యమైన అమూర్తోపమానాలతో వాల్మీకి వ్యక్తీకరించాడు. తిక్కనలో పై నాలుగు రకాల ఉపమానాలూ ఉన్నాయి కాని, వీటిలో చాలా తెలుగు సంస్కృతిని, పరిసరాలను ప్రతిఫలిస్తాయి. బహుశా ఇవి అనువాదాలు కాకపోవచ్చు.
ఉపమేయం మూర్తం, ఉపమానం మూర్తం: దీన్ని మూ + మూ గా సంగ్రహిస్తాను. అదేవిధంగానే అమూ + మూ, మూ + అమూ, అమూ + అమూ:
– కాగిన ఎసరులకరణి …. శరనిధులుప్పొంగి (ఉద్యోగ. 4.116) (మూ + మూ)
– డేగఁ/ గనిన పులుగు పిండుకరణి (ప్రజలు చెదరిపోవటం) (శాంతి. 2.374) (మూ + మూ)
– కడుఁదురులు కవిసి కఱచు కరణి యయ్యె (ద్రోణ. 3.263) (మూ + మూ)
(యుద్ధంలో చక్రం గద కొట్టుకొని పొడియై ఆపొడి సేనను తాకినపుడు, కందిరీగలు గుంపుగా వచ్చి వాళ్ళను కరిచినట్టు అనిపించిందట.)
– కీలుకా లెడలింప కెడసిన బొమ్మల/ కైవడి పటుతురంగ వ్రజంబు (ద్రోణ. 3.62) (మూ + మూ)
– ఆలలోని ఆఁబోతులఁబోలి పొలచి/రి (భీష్మ. 1.133) (మూ + మూ)
– పట్టువడ్డ మ్రుచ్చుపగిదిఁ బాంచాలభూ/నాయకుండు (ఉద్యో. 4.381) (మూ + మూ)
– చెలియలికట్టం బోలి నిలువరించి (కర్ణ. 2.151) (మూ + మూ)
– బలుగాలిం గూలు తరువు పోలికంబడిన…. (ద్రోణ. 3.147) (మూ + మూ)
– త్రొక్కంబడిన భుజంగంబు పోలికం బొదివి…. (కర్ణ. 2.323) (మూ + మూ)
– బెబ్బులి లేడికొదమం బొదువు పోలికం బొదివి…. (కర్ణ. 3.205) (మూ + మూ)
– మత్తమాతంగంబులు సింగంపుఁగొదమం బొదువు పోలికన్ (భీష్మ. 2.178) (మూ + మూ)
– ఆఁబోతుం బులి గొనినం బసులు వాఱు పోలికి…. (కర్ణ. 3.372) (మూ + మూ)
– పెనురొంపిలోపలను బ్రుం/గిన ధేనువు నెత్తుపోలికి…. (శల్య. 1.153) (మూ + మూ)
– కడఁగి మంటలో నుఱికిన మిడుత వోలె…. (భీష్మ. 2.62) (మూ + మూ)
– కుమ్మరి కో/లను సారెం బోలితిం దలఁచి చూడు మెదన్…. (ఆను. 1.16) (మూ + మూ)
– మొఱకు చేనున్న తియ్య/పండువెస నాఁచికొనిన నేర్పరియుఁ బోలె (ద్రోణ. 5.243) (మూ + మూ)
– నీఱు గవిసి యున్న నిప్పు వోలె (విరాట. 1.228) (మూ + మూ)
– కంటికిన్ ఱెప్పయుఁబోలె మాటయి…. (ఉద్యో. 4.114) (మూ + మూ)
-పెన్నిధిగన్న పేదవోలెం గృతార్థుండవైతి (ద్రోణ. 5.468) (మూ + మూ)
– పడుచులీకులూడ్చి పట్టియాడెడు నట్టి/పులుగు చందయ్యె (కర్ణ. 1.34) (మూ + మూ)
– వనపాలకుండు తాళఫలంబులు దిగఁద్రోచు చందమున (భీష్మ. 3.64) (మూ + మూ)
– దూదితట్టలపైఁబ్రాకు నగ్నిచందంబున మ్రగ్గఁజేయుచు నగ్గురు దాఁకి (ద్రోణ. 1.79) (మూ + మూ)
– పెక్కాఁబోతులొక్కపులిం జుట్టుముట్టిన చందంబున (ద్రోణ. 2.94) (మూ + మూ)
– బెబ్బులియున్నపొదరు సొచ్చు లేడి చందంబున (విరా. 2.112) (మూ + మూ)
– ఈఁగగరాని యప్పు బో/ లెం దలపోయ వ్రేగయి చలింపకయున్నది యిప్పుడున్ మదిన్ (ఉద్యో. 2.129) (అమూ + అమూ)
– శశిగ్రుంకినట్టి శ/ ర్వరియునుబోల్పఁబట్టగుచు వారిజనాభుఁడులేనిదీనతన్ (మౌసల. 1.92) (అమూ + అమూ)
– సంజననంబు వహ్నిపు / ట్టరణికిఁబోలె తల్లిదెసనైనది (శాంతి. 5.273) (అమూ + అమూ)
– కట్టినచీరయునుం బైఁ/ బెట్టిన చీరయును మౌళి బిగియారంగాఁ/ జుట్టిన చీరయుఁబోలెను/ నెట్టన పొదివినది దేహిని గుణత్రయమున్ (శాంతి. 4.331) (అమూ + మూ)
– చవుటఁ బెట్టిన విత్తుల చందమొంది/ అంకురింపక చెడిపోయె నంబుజాక్ష (ఉద్యో. 3.76) (అమూ + మూ)
– అనఘ మూఢాత్ము చిత్తంబునందు విషయ/ జాలమత్యంత గాఢసంసక్తి నొందు/ లక్కరసము దండాదులఁ జిక్కఁబట్టు/ చందమున దీనిగనుట ప్రశాంతికరము (శాంతి. 5.528) (అమూ + అమూ)
– మానవతులు …. పెనుజోఱ మొగంబునంబడిన చందంబున … అతని యందడిందిన (ద్రోణ. 2.78) (అమూ + మూ)
– కుంభనిక్షిప్తభుజంగంబుల చందంబున నిశ్శ్వాసంబు నిగుడ్చుచున్ (శల్య. 1.10) (అమూ + మూ)
– మున్నీటసొచ్చిన యేఱులచందంబున నడంగిపోవు (ఉద్యో. 2.265) (అమూ + మూ)
– త్రాసులంబోని చిత్తంబులతోడుత (శాంతి. 2.374) (అమూ + మూ)
మనస్సును త్రాసుతో పోల్చటం చాలా విలక్షణమైన ఉపమానం. ‘త్రాసు’ దేశ్యపదం కాదు ‘తరాజూ’ (taraazuu) అనే పర్షియన్ పదానికి తద్భవం. ఇది తెలుగు సాహిత్యంలో కనిపించే మొట్టమొదటి అన్యదేశ్యం. బహుశా ఆ రోజుల్లో తెలుగులో వాడుతున్న పదం కావచ్చు. తూకానికి త్రాసువాడటం మన సంస్కృతిలో ఒక నూతనానుభవం. మనకు కొలతలున్నాయి గాని, తూకాలు లేవు. మహమ్మదీయుల కాలంలో అధికార భాష పర్షియన్. శ్రీనాథుడి కాలం నుంచి అన్యదేశ్యాలు విరివిగా తెలుగు కావ్యాల్లో గూడా ప్రవేశించాయి. తిక్కన సమకాలీన పరిసరాల నుంచి పోలికలు తీసుకున్నాడనటానికి ఇది చక్కని ఉదాహరణం. దీన్ని వాడిన సందర్భం:
సీ.
వ్యవహారశుద్ధి సర్వప్రజాప్రియకారి
యదియ భూపతికి ధర్మాతిశయము
గీర్తియుఁజేయు నక్షీణసత్త్వులు ధర్మ
పరులునునైన భూసురులు నీవు
త్రాసులంబోని చిత్తంబులతోడుతఁ
బ్రజవివాదములెడఁ బక్షముడిఁగి
విని ధనవాంఛమై ధనికుల దెసవ్రాలి
తీర్పక ధర్మంబు తెరువుదప్ప
ఆ. వె
కుండఁ బాడిఁదీర్చి దండింపఁదగునెడ
ననుగుణంపుదండ మాచరింపు
ముఱగఁబలికితేని నుండదుప్రజ డేగఁ
గనిన పులుఁగుపిండు కరణిఁజెదరు (శాంతి. 2.374)
10. గద్యపద్యరచనానిర్ణయం
చిన్నవయస్సులో నిర్వచనోత్తరరామాయణం రాసిన కవిబ్రహ్మ భారతరచన కాలానికి అందరు కవులలాగానే ‘పద్యముల గద్యములన్ రచియించెదన్ గృతుల్’ అన్నాడు. కాని పరిశీలించి చూస్తే ఇది సాభిప్రాయంగానే చేసుకున్న నిర్ణయమనిపిస్తుంది. పద్యాలకు లాగానే గద్యలకు గూడా ప్రయోజనం కల్పించినట్టు నిరూపించవచ్చు. గద్యలు ఈ కింది సందర్భాలలో తిక్కన వాడాడు.
ఇద్దరి మధ్య సంభాషణలో ఒకరు మాట్లాడినవి పద్యాల్లో ఉంటాయి, రెండోవారు మాట్లాడినవీ పద్యాల్లో ఉంటాయి. కానీ వక్తృభేదాన్ని సూచించటానికి గాని, మాట్లాడటం అయిపోయి మరో పని మొదలయ్యేటప్పుడు గాని వచనం ఉంటుంది. ‘అనుటయు నతండు’ (ఆను. 1.15), ‘అనిన నక్కోమలి కిరాతుం జూచి’, ‘అని వెండియు, ‘అని చెప్పె’, ‘అదియునుంగాక’.
రెండు పనులకు మధ్య వ్యవధానం ఉంటే సమయసూచన వచనంలో తెలుస్తుంది. ‘మెలంగుచుండె నట్టియెడ’, ‘సుప్రయోగంబై చెల్లెఁబదపడి’, ‘ఆ సమయంబున’.
ఆశ్వాసాది పద్యం తరవాత, ఆశ్వాసాంత పద్యం తరవాత వచనం ఉంటుంది.
యుద్ధపంచకంలో దీర్ఘమైన యుద్ధవర్ణన విసుగు కలిగించకుండా ఉండటానికి వచనం వాడినట్టు తెలుస్తుంది (చూ. భీష్మ. 1.267 పెద్దవచనం). ప్రత్యేకమైన వీరుల మధ్య జరిగే యుద్ధాన్ని పద్యాల్లో వర్ణిస్తాడు.
అన్నిటికన్నా ముఖ్యంగా కనిపించే ప్రయోజనం మరొకటి ఉంది. రసపోషణ ప్రధానమైన చోట పాత్రల మనఃప్రవృత్తిని బావోద్వేగాన్ని తిక్కన అంచెలంచెలుగా పెంచుకుంటూ వస్తాడు. అవి ఒక పరాకాష్ఠకు (climax) రావటానికి కొన్ని హద్దులేర్పరుచుకొని ఒక్కొక్క హద్దును సూచించటానికి ఒక వచనం ఉపయోగిస్తాడు. అంటే వచనం తరవాత భావోద్వేగం, రసపోషణ మరింత ఉద్ధృతం (intense) అవుతాయి. తిరుపతి కొండమెట్లెక్కేటప్పుడు కొన్ని మెట్ల తరవాత సేద దీర్చుకోటానికి బల్లపరుపుగా విశాలంగా ఉండే మెట్టు వస్తుంది. దాని తర్వాత వచ్చే మెట్లు ఇంకా ఎత్తుగా ఉంటాయి పైసూచించిన వచనాలు గూడా అలాంటివే. ఇటువంటి సందర్భాలు ఎక్కువగా విరాటోద్యోగపర్వాలలో కనిపిస్తాయి. సముద్రంలో ఒక పెద్ద అల వచ్చేముందు చిన్న అల పొడసూపినట్టుంటుంది వచనం. ఉదాహరణలు కొన్ని ఈ కింది విభాగాలలో చర్చిస్తాను.
10.1. ఉద్యోగపర్వం మూడో ఆశ్వాసంలో రాయబారానికి వెళ్తున్న కృష్ణునికి ద్రౌపది తన భంగపాట్లు చెప్పుకుంటుంది. ఇదంతా 100 నుంచి 119 దాకా 20 పద్యాల్లో జరుగుతుంది 100-105 లో ధర్మరాజు మాటలు తనకు కష్టం కలిగించాయని చెబుతూ అయినా ఫరవాలేదు సంధి ప్రయత్నం చెయ్యండి అంటుంది.
అని మఱియు నిట్లనియె. (106)
ఆఱడిఁ బోకయున్…. (107)
వరమునఁబుట్టితిన్…. (108)
తన ఆభిజాత్యాన్ని గురించి మాట్లాడుతుంది.
109. అట్లుంగాక
నీవు సుభద్రకంటె…. (110)
ఆసభకేకవస్త్రయగునట్టిననుం…. (111)
అరయమిఁజేసి కోడలన కప్పుడు…. (112)
ఈ పద్యాల్లో భావోద్వేగం అంతకన్నా ఎక్కువ శ్రుతిలో ఉంటుంది.
113. అని అట్లుగ్గడించి
ద్రౌపది బంధురమ్మయిన క్రొమ్ముడిఁ గ్రమ్మున విడ్చి…. (114)
ఈ పద్యంలో ఇక మాటలతో కాదని చేతల్లోకి దిగుతుంది. తన జుట్టు విప్పదీసి…
115. గోవిందుముందరం బెట్టి యిట్లనియె
ఇవి దుస్స సేనువ్రేళ్ళం, దవిలి… (116)
ఈ వెండ్రుకలు వట్టి యీడ్చిన… (117)
నెట్టన నిట్టియల్క మది నిల్పితి… (118)
119. అనుచు నెలుంగు రాలుపడ నేడ్చిన యాజ్ఞసేనిం…
సహేతుకమైన మాటలతో మొదలై నాలుగు అంచెల్లో ఏడుపు దాకా వచ్చిన ఈ ఘట్టం పోషణలో వచనాలు శిల్పభాగాలుగా కనిపిస్తాయి. ఉత్తరోత్తరప్రకర్షతో పరాకాష్ఠకు చేరిన భావావేశం చివరి మూడు పద్యాల్లో బాగా కనిపిస్తుంది.
10.2. మరొక సన్నివేశం, కర్ణపర్వం మూడో ఆశ్వాసంలో: చేతికిజిక్కిన ధర్మరాజును విడిచి కర్ణుడు దుర్యోధనుణ్ణి కాపాడటానికి వెళ్తాడు. పరాభవంతో ధర్మరాజు తిరిగి శిబిరానికి వెళ్తాడు. ఏమైందో తెలియని కృష్ణార్జునులు ధర్మరాజు క్షేమం కనుక్కోటానికి యుద్ధరంగం విడిచి అతనున్న శిబిరానికి వస్తారు. ఇదంతా కథనాత్మకవచనంలో సాగుతుంది (19, 28). కర్ణుణ్ణి వధించి వచ్చారని వాళ్ళను అభినందించి (మూడు పద్యాల్లో) తాను భయపడి యుద్ధరంగంనించి తిరిగి వచ్చానని చెప్పి, ధర్మజుడు సంతోషంతో అర్జునుణ్ణి పొగడటం మొదలుపెడతాడు.
వెండియు గాండీవి నుద్దేశించి… (32) అర్జునుణ్ణి గుక్క తిప్పుకోకుండా పొగడటం అనూహ్యంగా ఆరుపద్యాల్లో సాగింది.
పదమూఁడు వర్షముల్ పగలును రేయును… ఈ పద్యం చివర ‘నీ యట్టి యనుజు, వలనఁ దేజంబు వడసితి నలఘుచరిత’ (33) అంటాడు.
వెరవును లావు…. (34)
అరుదిది నీవు నొవ్వక మహాబలు కర్ణు వధించి …. (35)
పలికిననేమి…. (36)
అతిగర్వసమున్నతమగు…. (37)
చివరి పొగడ్త పద్యం:
ఈరసమునఁ గదిసి శరా
సారము పైఁగురియ నీవు సక్రోధుఁడవై,
పేరురమున వెస నాటిన
తోరంబగు నారసమునఁద్రుళ్ళి కెడసెనే (38)
కర్ణుడంటే తనకున్న భయాన్ని కచ్చను వెల్లడిస్తూ నువ్వు అతన్ని ఎలా చంపావు అని గుచ్చిగుచ్చి అడిగాడు.
(39) వచనం: ‘అనిన ధర్మనందనునకుఁ బురందర నందనుం డిట్లను….’. ‘తాను సంశప్తకులను, అశ్వత్థామను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పి, కర్ణుడింకా చావలేదు, నిన్ను చూడటానికి వచ్చాం’ అని చెప్పటం పదకొండు పద్యాల్లో సాగుతుంది (40-50).
(51) వచనం: ‘అమ్మనుజపతి గర్ణుండు గుశలియై యుండుట యెఱింగి, యతనిబాణంబుల నొచ్చినవాఁడగుట నలుకగదిరి యక్కిరీటితో నిట్లనియె.’ ఎంత గొప్పగా పొగిడాడో అంతకు మించిన తెగడ్త, అవమానించటం, బండ తిట్లుతిట్టటం.
అతని నిరాశ కోపంగా మారుతుంది: అనిలోఁదెరలుట దొలఁగుట… (52).
ఇక్కడో ప్రసిద్ధమైన పద్యం:
విను కర్ణునకేనోడితి
నన నేటికి నీవు నోడి తనిలజమాద్రీ
తనయులు మున్నే యోడిరి
మనతోఁగూడంగఁ గంసమర్దియు నోడెన్… (53)
ఇది చాలా ఘాటైన పద్యం.
కావున మనమిక…. (54)
కాదేని బిరుదులాడక, సాదులమై …. (55)
నిస్సహాయత నిరుత్సాహాలతో వచ్చిన కోపంతో
(56) వచనం: ‘అని కెంజాయ రంజిల్లు కన్నుల నన్నరు నాలోకించి….’
నీతెఱఁ గిట్టిదేని…. (57)
అని వధించెదఁ గర్ణు…. (58)
పంకజనాభుఁడున్ వినఁగఁబల్కిన …. (59)
వినుమప్పలుకులు సాటిగఁ, గొని…. (60)
దేవతలిచ్చిన తేరునశ్వంబులు …. (61)
చివరకు నువ్వు కుంతి కడుపున బడకుండా ఉంటే బాగుండేది అని, ఆగక…
(62) వచనం: కోపం శ్రుతి మించి (తర్వాత నాలుగు పద్యాలు),
గాండీవాన్ని దూషిస్తాడు… (63-66)
ధర్మరాజును చంపటానికి అర్జునుడు కత్తి దూస్తాడు… (67-69)
కృష్ణుడు నిరోధించి అర్జునుణ్ణి సమాధానపరుస్తాడు.
10.3. ఇంకొక సన్నివేశం, ద్రోణపర్వం, ద్వితీయాశ్వాసం, (225-268). అభిమన్యుణ్ణి అందరూ కలిసి చంపుతారు. ఆ సంగతి అర్జునుడికి తెలియదు, కృష్ణుడికి తెలుసు.
(225) వచనం: అట్లు మర్దించి మగుడనప్పుడు మాధవునాలోకించి…. సంశప్తకులను జంపి కృష్ణార్జునులు తిరిగి వస్తున్నారు. దుర్నిమిత్తాలు కనిపిస్తున్నాయి. ‘నా మనస్సు వికలంగా ఉం’దని అర్జునుడు అంటాడు. (226).
(227) వచనం: అభిమన్యుడు ఎదురు రాలేదు. ఎవరూ మాట్లాడరు….
అలరుమొగముతోడ నభిమన్యుఁడే లొకో
యెదురురాఁడు నాకునెట్టివార్త
చెవులు సోఁకునొక్కొ చేవెట్టి కలఁచిన
భంగిఁ ద్రిప్పికొనఁదొడంగె మనము…. (230)
కృష్ణుడు జవాబు చెప్పడు. ధర్మసుతువిడి దలకరిగెను మోము వెల్లఁదనమునఁగదురన్…. (231)
(232) వచనం: ధర్మరాజు, ఇతరులు ఉన్నచోటికి వెళ్ళి అభిమన్యుడు లేడేమని ప్రశ్నిస్తాడు. జవాబు లేదు. వారి మౌనం వల్ల అభిమన్యుడు యుద్ధంలో హతుడయ్యాడని అర్థం చేసుకొంటాడు. అభిమన్యుని తలచుకొని అర్జునుడు దుఃఖిస్తాడు (233-240).
(241) వచనం: ‘అనుచుఁ జతికిలంబడి ఫల్గునుండు’…. శోకం ఎక్కువై ఇలా విలపిస్తాడు:
హాయను ధర్మరాజతనయా యను నన్నెడఁబాయ నీకుఁజ
న్నేయనుఁ దల్లినేపఁజనునే యనుఁ గృష్ణుఁడు వీఁడె వచ్చె రా
వే యను నొంటివోకఁ దగవే యను నేగతిఁబోవువాఁడ నే
నోయభిమన్యుఁడా యనుఁ బ్రియోక్తుల నుత్తరఁదేల్పవే యనున్… (242)
పై పద్యంలో మొదటి చివరి వాక్యాల్లో ఉన్న ఔచిత్యం తిక్కన రచనాశిల్పానికి గీటురాయి. ఈ పద్యం ఒక అపూర్వమైన కళాఖండం.
(243) వచనం: ‘అని మఱియు ననేకప్రకారంబులం బలవించి యుధిష్ఠురు నాననంబాలోకించి’… చాలా ప్రశ్నలు వేస్తాడు… అభిమన్యుడు చనిపోయిన విధం అడుగుతాడు (244-245).
(246) వచనం: ‘అనిపలికి నిట్టూర్పు నిగిడించి చింతించి….’ మళ్ళీ పాతకథలు గుర్తుచేసుకోని దుఃఖిస్తాడు, ‘ఎలుఁగు’లో గాద్గద్యం ఏర్పడుతుంది (247-252).
(253) వచనం: ‘కౌరవ సైనికుల సింహనాదం విన్నాను. యుయుత్సుడన్నమాటలు విన్నాను. వాసుదేవుడు కూడా విన్నాడు గదా అనుకొని పట్టించుకోలేదు. శోకం కాస్త శ్రుతి మించుతుంది. ఓదార్పు వల్ల దుఃఖం మరింత ఎక్కువై, ‘యుద్ధం ఎలా జరిగిందో చెప్పండి’ అని నిలదీస్తాడు (254-260).
(261) వచనం: ‘అని మఱియును.’ నిజంగా ఈ వచనం అనవసరంగా కనిపించినా భావావేశానికి ఒక హద్దు మాత్రమే. ‘మిమ్మల్ని నమ్మి కొడుకును కోల్పోయాను’ అని వాళ్ళను తూలనాడటం మొదలవుతుంది (262-264).
(265) వచనం: ‘అని యంతకంత కగ్గలించుచు నుమ్మలికంబునం గలంగి యంత నిలువక…’ ఇది ఆవేశం పరాకాష్ఠకు (climax) వచ్చినస్థితి. ఇక తిట్ల పర్వం (266-68). మాటలు మరీ దారుణమౌతాయి.
ఉక్కును నస్త్రబలము మీ
కెక్కడి యది….
(మిమ్మల్ని నమ్మి నాకొడుకును కొల్పోయాను)
…. సింగారమునకుఁగాక
మఱువులును కైదువులు మీకు మానమునకె
ఇంతకంటె పరుషమైన తిట్టు ఉండదు. అంచెలంచెలుగా పరాకాష్ఠ చేరిన ఈ ఘట్టం చదువరులను కలత పెడుతుంది.
10.4 మరో సన్నివేశం. ఆశ్రమవాసపర్వం, ప్రథమశ్వాసంలో 84-97. ఆశ్రమవాసానికి వెళ్ళే ముందు ముఖ్యులైన పురజనులను కొందరిని రప్పించి ధృతరాష్ట్రుడు వారి అనుజ్ఞ కోసం ప్రాధేయపడతాడు. 13 పద్యాల్లో 5 వచనాలున్నాయి. వృద్ధుడైన ధృతరాష్ట్రుడి మాటలకు పౌరులకు కన్నీళ్ళ పర్యంతం అయింది. పశ్చాత్తాపం, ఆత్మనింద, పాండవప్రశంస వల్ల ఇలా జరిగింది. తక్కువ మాటలైనా, ఎంతవారికైనా కనికరం కలిగే ధోరణి. అంతకు ముందు 35 పద్యాల్లో ధర్మరాజుకు ధృతరాష్ట్రుడు రాజనీతిని బోధిస్తాడు (55-80). గద్య లేదు. ఈ తేడా కవితా శిల్పంలో భాగం. పౌరుల్లో ముఖ్యులైన వాళ్ళంతా వస్తారు, వాళ్ళను సంబోధిస్తూ:
సీ.
కౌరవకోటియు మీరుఁబెద్దయుకాల
మనఁగిపెనంగి యన్యోన్యసంభృ
తాధికస్నేహులరై ప్రవర్తించితి
రనఘవర్తనులార వినుఁడు నాదు
పలుకు వృద్ధునకుఁ దపశ్చరణంబున
కై వనంబునకేఁగు కటర్హ కర్మ
ముచితకృత్యంబుల యోజమీరెఱిఁగిన
యదియ కా మది ముదమార మీర
తే.
లెల్ల నాకనుజ్ఞ యిచ్చికానకుఁబుచ్చుఁ
డనుడు సర్వజనులు నశ్రుపిహిత
దృష్టులగుచు గద్గదిక నెలుంగెడలఁగ
నార్తిఁ దోఁపనేడ్చి రధిపముఖ్య (85)
(86) వచనం: విని ధృతరాష్ట్రుడు వారికిట్లనియె.
సీ:
ప్రజ ముదమొందంగఁ బాలించెఁ బుడమి శం
తనుఁ డనంతరము శాంతనవుచేత
రక్షితుఁడగుచు మీరలు ప్రీతిఁబొదల వి
చిత్రవీర్యుండు నిద్ధాత్రి యేలెఁ
బదపడి పాండునృపాలుండు మీరు హ
ర్షింపంగ భూమి రక్షించెఁ బిదప
ధర్మనందనుని చందము మీయెఱింగిన
యది సత్యధర్మాత్ముఁడైన యితని
తే.
ననుసరింపక యన్యాయ మాచరించి
దుర్ణయంబున నిలయేలి త్రుంచెఁ గులము
నుర్విఁ గల భూపతులను దుర్యోధనుండు
వాని దుశ్చేష్టలకు మూలమేన కాదె (87)
పై రెండు పద్యాల్లో ధృతరాష్ట్రుడి వాక్చాతుర్యంతో పాటు నిజమైన పశ్చాత్తాపం వ్యక్తమౌతుంది. ఉపన్యాసం కొద్దిదైనా పౌరులను కదిలించింది.
(88) వచనం: అదిమీ మనంబులం బెట్టక
(89) పద్యం: మహి లెస్సగఁబాలించిన….
(90) వచనం: అనియప్పుడజ్జనంబులమనంబుల లేకున్నను దన కీళ్ళుగ్గడించి…
ఆ.
వృద్ధ కృపణ పుత్రవిరహిత గాంధారి
యీ నెలంతఁ జూచి యైన మీర
లకట కాననమున కరుగుట మేలని
మాకనుజ్ఞ యిండు మాన్యులార…. (91)
(92) వచనం: అని పలికి పాండవాగ్రజుం జూపి….
(93) పద్యం: ధర్మరాజు ప్రశంస…
కం.
ఆరయ నెన్నం డైనను
మీరలు నాకెగ్గు గాఁగ మెలఁగుటలేదో
పౌరవరులార నన్నున్
గారవమున పనుప రయ్య కాననమునకున్…. (94)
(95) వచనం: …అమ్మ హీశ్వరుండు మఱియును… మోడ్పుకేలౌదలఁ గదియించి మిమ్ము వేఁడెదఁ గృపాఢ్యు లార యనుమతి నీయుఁడు మీరు ననుడు వార లుత్తరీయంబులు వదనవినిహితములుగాఁ జేసికొని రోదనము రవంబు లెసఁగ జేసిరి విను ధరణీశవర్య…(96)
గద్య పద్యాలన్నీ కలిసి 13 వాటిలో నాలుగు వచనాలు. ఆ శక్తిమంతమైన చిన్న ఉపన్యాసం చివరకు అందరూ కన్నీళ్ళ పర్యంతమయ్యేట్టు చేసింది. ఇలాంటి సన్నివేశాలెన్నో ఆ దృష్టితో చూస్తే కనిపిస్తాయి.
పైన ఉదాహరించినవి తిక్కన కవితాశిల్పంలో నాకు తోచిన కొన్ని విశేషాలు. ఇంతకు ముందు చాలామంది తిక్కన అనువాద విధానం, పాత్రపోషణ, మనశ్చిత్రవర్ణన, ఛందస్సులు మొదలైనవాటిని గురించి విస్తృతంగా రాశారు. వాటిని గురించి నేనేమీ కొత్తగా రాయదలుచుకోలేదు. కానీ ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. కొద్ది మాటల్లోనే ఒక వ్యక్తి మనోభావాలను, ధైర్య స్థైర్యాలను అపూర్వంగా చిత్రించే శక్తి ఏ కొద్ది కవులకోగాని సాధ్యం గాదు. కర్ణుడి రథచక్రం ఒకటి శాపవశాత్తు భూమిలోకి సగానికి పైగా కుంగిపోతుంది. గుర్రాలు లాగలేకపోతున్నాయి రథం దిగి దాన్ని చేత్తో పైకి ఎత్తితే గాని మళ్ళీ యుద్ధం చెయ్యటం సాధ్యం గాదు. అర్జునుణ్ణి సంబోధిస్తూ కర్ణుడు అంటాడు:
సీ.
అరదంబు చక్రంబు ధరఁ జాలఁ గ్రుంగిన
నెత్తెద నంతకు నేయకుండు
మేను భూమిస్థుఁడు నీవు రథస్థుఁడ
వియ్యెడఁదగవగు నేయకునికి
విరిదలవానిని విరథుని నాయుధం
బిడిన వానిని శూరు లేయ రెందు
మహిని శూరుఁడ వనుమాత్రగా దుత్తమ
కులుఁడవు రణధర్మకోవిదుండ
విట్టినీవు తగినయట్టి భంగిన యని సేయవలయు(న్)….
పై మాటలన్నీ స్థూలంగా కర్ణుడి దైన్యాన్ని అసహాయతను సూచిస్తాయి. నిజంగా కర్ణుడు ఎప్పుడన్నా ఇంత దీనంగా మాట్లాడతాడా అనిపిస్తుంది కానీ ఆ చివరి మాటలు వినండి:
… ఇట్లు సెప్పు టెల్లఁ
బాడి యేర్పడంగఁ బలుకుట గాని గో
విందునకును నీకు వెఱచి గాదు (కర్ణ. 3.351)
‘కర్ణుడిపని అయిపోయిందని అనుకుంటున్నావో ఏమో, యుద్ధధర్మం చెప్పటానికి అలా అన్నాగాని, నిన్ను గోవిందుణ్ణి చూసి భయపడిగాదు’ అంటాడు. ఈ ఒక్క వాక్యంతో కర్ణుడి పాత్రను తిక్కన ఆకాశానికి ఎత్తేశాడు.
11. తిక్కన రూపురేఖలు
తిక్కనను గురించి తన శిష్యులు, ఇతర కవులు చెప్పిన మాటలు:
పుష్పాస్త్రరూపోపమారాజన్మూర్తి, కనకగిరితటీసంకాశవక్షస్థలీభాగుఁడు,
అభిరూపభావభవుఁడు …
సకలాగమార్థతత్త్వవిచారోదారుఁడు,
అనితరగమ్యవాఙ్మయమహార్ణవవర్తన కర్ణధారుఁడు,
మహాకళాకమనీయుఁడు,
నిరర్గళధీమంతుఁడు, అద్భుతమతి, అమితమత్విలాసుఁడు,
మంత్రిమాణిక్యుఁడు, నీతిచాణక్యుఁడు,
దేవేంద్రవిభవుఁడు, పరహితార్థి,
విద్వజ్జనామోదనిపుణుఁడు, సుకవీంద్రబృందరక్షకుఁడు,
సత్యప్రియభాషణుఁడు,
కావ్యకళాజనిభూమి, సారకవితానిర్మాణచాతుర్యుఁడు,
చిత్తనిత్యస్థితశివుఁడు, శ్రీకాంతచరణయుగళకోకనదమధువ్రతుఁడు,
వినయపరుఁడు, కరుణార్ద్ర స్వాంతుఁడు, సత్యభాషణుఁడు, ధర్మనిర్మలుఁడు
పై వర్ణనలను బట్టి తిక్కన ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, మహాకవి, మహాపండితుడు, మహామంత్రి అని అతన్ని అందరూ గౌరవించి ఆరాధించేవాళ్ళని తెలుస్తుంది. కాకతీయ ప్రతాపరుద్రుడి దగ్గరకివెళ్ళి ఆయనను మెప్పించి మనుమసిద్ధి రాజ్యం తిరిగి ఇప్పించాడని ఒక ఐతిహ్యం ఉంది.
తిక్కన లాంటివాడు తెలుగువాడై పుట్టి ‘ఆంధ్రావళిమోదముంబొఁరయునట్లు,’ ‘మహాకవిత్వదీక్షావిధి’తో అపూర్వంగా నిర్మించిన కళాఖండం ఆంధ్రమహాభారతం. ‘తనకావించిన సృష్టి తక్కొరుల చేతం గాదు’ కాబట్టే మరెవ్వరూ తెలుగులో మహాభారతం రాయటానికి పూనుకోలేదు. రామాయణాలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత. దీక్ష పూర్తి అయింది భారతరచన జీవిత పరమావధిగా పెట్టుకున్నాడు. అది నిర్వహించిన తర్వాత శేషజీవితంలో ఏం చెయ్యాలో పాలుపోని అసహాయస్థితి ఏర్పడుతుంది. అందుకనే చిట్టచివరి పద్యంలో చివరిపాదంలో ‘హరిహరనాథ సర్వభువనార్చిత నన్ దయచూడుమిత్తఱిన్’ అంటాడు.
----------------------------------------------------------
రచన: భద్రిరాజు కృష్ణమూర్తి,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment