Friday, July 28, 2017

భుజగ నేత్రమయిన భూరుహమేది?


భుజగ నేత్రమయిన భూరుహమేది?




సాహితీమిత్రులారా!



శ్రీవేంకటేశ్వర సారస్వత వినోదిని లోని
పొడుపు పద్యం చూడండి-
సమాధానాలు చెప్పగలరేమో-

అరువది యేండ్లలో నణఁగిన యేఁడేది?
            సంఖ్య మూడునకున్న సంజ్ఞయేది?
పైఁడి కనులు కల్గు పక్షినేమందురు?
           భుజగ నేత్రమయిన భూరుహమెది?
శివనామ పూర్వక ప్రవిమల సుమమేది?
           ముందు వజ్రకలుగు మూలికేది?
యెఱ్ఱని కనులతో నెసఁగు పక్షియేది?
           భద్రపూర్వకమైన ప్రసవమేది?
పొన్నగంటి పేరై యొప్పుచున్నదేది?
చిత్రమౌ నేత్రములు గల్గు జీవియేది?
చెప్పవలె "అక్షి" కడపటం జేర్చి చేర్చి
దేవ! శ్రీవేంకటేశ! పద్మావతీశ!


సమాధానాలు-

ప్రతి సమాధానంలో అక్షి అని చివర రావాలి

1. 60 సంవత్సరాలలో ఒకటి - రక్తాక్షి
2. మూడు సంఖ్య సంజ్ఞ - శంకరాక్షి
3. పైడికనులుగల పక్షి - కనకాక్షి
4. నాగసుగంధ చెట్టు - సర్పాక్షి
5. శివుని పేరు ముందున్నపూవు - రుద్రాక్షి (సందెమల్లె)
6. వజ్రం పేరు ముందుగల మూలిక - వజ్రాక్షి(నల్లేరు)
7. ఎర్రని కన్నులుగల పక్షి - తామ్రాక్షి(కోకిల)
8. భద్ర అని పేరుకు ముందుగల పూవు - భద్రాక్షి(తెల్లని పూల మొక్క)
9. పొన్నగంటి పేరై ఉన్నది - మత్స్యాక్షి (పొన్నగంటి మొక్క)
10. చిత్రమైన కన్నులుగల జీవి - చిత్రాక్షి (పావురము)

No comments: