Monday, July 17, 2017

భోగి మట్టిన వానిఁ భోగిఁ జుట్టినవాని


భోగి మట్టిన వానిఁ భోగిఁ జుట్టినవాని




సాహితీమిత్రులారా!


కావ్యాలంకార సంగ్రహము లోని
ఈ పద్యం చూడండి-
ఇది నాయక వంశ వర్ణనలోనిది-

భోగి మట్టినవానిఁ భోగిఁ జుట్టినవాని
        భోగిఁ బట్టినవానిఁ బోలనేర్చుఁ
దమ్మిఁ దాల్చినవానిఁ దమ్మి దొల్చినవానిఁ
        దమ్మి మొలిచినవానిఁ దారసించు
మృగము నుంచినవాని మృగముఁద్రుంచినవాని
        మృగముఁ బొంచినవాని మీఱఁజాలుఁ
గొండ నెక్కినవానిఁ గొండ జెక్కినవానిఁ
        గొండగ్రుక్కినవానిఁ గొదవసేయు
భరణభూతిజవప్రభాబాహుశక్తి
మతికళాశౌర్యసత్యశుంభత్ప్రభావ
భోగగాంభీర్యగుణములఁ బుడమి నేనృ
పాలకులు సాటి యాతిమ్మపార్థివునకు
(కావ్యాలంకారసంగ్రహము - 1 - 64)

ఇందులో సీసపద్యంలోని ప్రతిదానికి సమాధానం
గీతపద్యంలో క్రమాలంకారం కూర్చారు.
దీన్ని గూఢచిత్రంగాను
ప్రహేలికగాను తీసుకొన వచ్చును.

భోగి మట్టినవాడు - విష్ణువు
భోగి చుట్టినవాడు - శివుడు
భోగి బట్టినవాడు - గరుత్మంతుడు

తమ్మిదాల్చినవాడు - సూర్యుడు
తమ్మిదొల్చినవాడు - అభిమన్యుడు
తమ్మిమొల్చినవాడు - బ్రహ్మ

మృగమును ఉంచినవాడు - చంద్రుడు
మృగమును త్రుంచినవాడు - రుద్రుడు
మృగము బొంచినవాడు - రాఘవుడు

కొండ నొక్కినవాడు - అగస్త్యుడు
కొండ చెక్కినవాడు - ఇంద్రుడు
కొండ గ్రుక్కినవాడు - సముద్రుడు

ఈ భూప్రపంచంలో తిమ్మరాజును
విష్ణువు - భరణ శక్తి, శివుని భూతి
గరుత్మంతుని జవములతో పోల్చవచ్చు
సూర్యుని కాంతితోను అభిమన్యునిబాహుశక్తితోను,
బ్రహ్మదేవుని బుద్ధి(మతి)తోను, చంద్రుని కళాశక్తితోను,
రుద్రుని శౌర్యముతోను, రాఘవుని సత్యసంధతతోను,
అగస్త్యుని శుంభత్ప్రభావంతోను, ఇంద్రుని ఐశ్వర్యంతోను,
సముద్రుని గాంభీర్యంతోను పోల్చవచ్చుగాని ఏ ఇతరరాజుతోను
పోల్చలేము - అని భావం

No comments: