Friday, June 16, 2017

అల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద


అల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద 




సాహితీమిత్రులారా!


సమస్య: 
అల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్.


ఏల్చూరి మురళీధరరావుగారి పూరణ-

ఒక అందాల నటి ప్రక్కన నాయక పాత్ర కాకపోతే -
 కనీసం ఆమె చెంత నిలిచి ఉండే ఏ చిన్న వేషమైనా 
వేయనిమ్మని ప్రాధేయపడుతున్న ఒక చిన్న నటుని మాటలు.

పల్లవపాణి! యో మృదులపల్లవపాద! మనోహరాకృతీ! 
సల్లపనామృతాతిసరసం బగు నాంధ్రుల చిత్రసీమలో 
సల్లలితాంబరాంతరలసన్మణిమంజులతారకామణీ! 
చల్లని తీయవెన్నెలల జా లెసలారఁగ నివ్వటిల్లు సం
ఫుల్లశశాంకమండలము పోడిమి మీఱఁగ నెయ్యురాలవై
పల్లవితత్వదుజ్జ్వలకృపాపరిపాటినిఁ బల్కరించి మే
నెల్ల ముదంబునం బులకరింపఁగ నెమ్మిక సేతు వంచు నేఁ 
బెల్లగు నాసఁ జేరితిని - పేరిమి నీ సరసన్ నటింపఁగా;
నుల్లమునందుఁ జేర్చి నను నొక్క నిమేషము నిల్వనిమ్ము! న
న్నుల్లస మొప్ప నె ప్పగిది నొప్పరికింపకు; నిన్ను వేడు న
న్నల్లన నొల్లఁ జెల్లు నొకొ! నాయక వేషము గానిచో, సరే!
యెల్ల వితంబులైన వేషముల నే ధరియింపఁగ సిద్ధ మయ్యెదన్,
ప్రల్లద మాడఁబో; నొకరి పాత్రము మేలని చూడఁబోను; నేఁ
గల్లరి నయ్యెదన్; మనికి కాపరి నయ్యెద; తాత నయ్యెదన్;
మల్లరి నయ్యెదన్; మఱఁది నయ్యెదఁ; దండ్రిని, మామ నయ్యెద;
న్నల్లుఁడ నయ్యెదన్; మగఁడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్.



No comments: