Monday, June 12, 2017

ఏకచక్రము బండినెక్కువాడెవ్వడు?


ఏకచక్రము బండినెక్కువాడెవ్వడు?




సాహితీమిత్రులారా!


పొడుపు పద్యం విప్పండి-


ఏకచక్కముబండినెక్కువాడెవ్వడు?
                       ఒడలెల్ల గనులైన యెడయడెవడు?
మఱ్ఱియాకున బండు కుఱ్ఱవాడెవ్వడు?
                      శివుని యౌదల జేరి చెలగునెవడు?
సమతమై సర్వభూతములనేలునెవడు?
                      వాయు భక్షణచేసి బ్రతుకునేది?
అఖిల జీవనంబుల కాధారమగునేది?
                     కొమరారమారుని గుఱ్ఱమేది?
కంధి దాటి లంక గాల్చిన మృగమేది?
క్షితినిజల్లబడగ జేయునేది?
అరయనన్నిటికిని నక్షర ద్వయమున
నొక్క యుత్తరంబె నొసగవలయు


ఈ పద్యంలో 10 ప్రశ్నలున్నాయి
పదింటికి రెండక్షరాలుగల పదమొక్కటే
సమాధానంకావాలి-

సమాధానాలు-

1. ఒకే చక్రం గల బండిపై ఎక్కి తిరిగేవాడెవరు? 
   - హరి(సూర్యుడు)
2. దేహమునిండా కన్నులుగలవాడెవరు?
   - హరి(ఇంద్రుడు)
3. మఱ్ఱియాకుపై పరుండు బాలుడెవరు?
   - హరి(శ్రీకృష్ణుడు)
4. శివుని శిరసుపై చెన్నొందువాడెవరు?
   - హరి(చంద్రుడు)
5. సర్వప్రాణులను సమానంగా పాలించువాడెవరు?
   - హరి(యముడు)
6. గాలిని మేసి బ్రతికేది ఏది?
   - హరి (పాము)
7. సర్వప్రాణులకు ముఖ్యాధారమైనదేది?
   - హరి (వాయువు,గాలి)
8. మన్మథునికి సుందరమైన వాహనమేది?
   - హరి (చిలుక)
9. సాగరముదాటి లంకాదహనం చేసిన మృగమేది?
   - హరి (కోతి, హనుమంతుడు)
10. భూమిని చల్లబరచునది ఏది?
    - హరి (వాన)

హరి అనే పదానికి నిఘంటువుల్లో అనేక అర్థాలున్నాయి.
హరి- విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, యముడు, సింహం,
          గుఱ్ఱం, కోతి, పాము, వాయువు, కిరణం, కప్ప, యుద్ధం,
          అగ్ని, శివుడు, నీరు, చిలక, పచ్చనిది, బంగారు వర్ణంకలది,
          దొంగ, మంచి ముత్తెము, కడిమిచెట్టు, హరిగంధం,   
          కుంకుమపూవు, అగరు, చందనము మొదలైనవి.

No comments: