అక్కరలు
సాహితీమిత్రులారా!
పరిచయము
తెలుగు ఛందస్సులో పద్యములను మూడు విధములుగా వ్రాయవచ్చును, అవి – వృత్తములు, జాతులు, ఉపజాతులు. వృత్తములలో ప్రతి పాదములో ఒక నియమిత పద్ధతిలో గురు లఘువులు అమర్చబడి ఉంటుంది. ఇట్టి వృత్తములకు అక్షరసామ్య యతి లేక వడి, ప్రాస ఉంటాయి. ఈ వృత్తముల లక్షణములను ఎనిమిది మూడక్షరముల గణములతో, నాలుగు రెండక్షరముల గణములతో, గురు లఘువులతో వివరించుటకు వీలవుతుంది. చంపకోత్పల మాలలు, శార్దూల మత్తేభ విక్రీడితాది వృత్తములను తెలుగు కవులు ఎక్కువగా వాడినారు. జాతి పద్యములను మాత్రా గణములతో, అంశ లేక ఉప గణములతో వివరించ వీలవుతుంది. కందము, ఉత్సాహ, రగడలు మాత్రాగణ నిర్మితములైతే, ద్విపద, తరువోజ, అక్కరలు మున్నగునవి ఉపగణ నిర్మితములు. వృత్తములవలె జాతి పద్యములకు కూడ యతిప్రాసలు ఉంటాయి. ఉపజాతులలో ప్రాస ఐచ్ఛికము. అక్షరసామ్య యతినైనా, ప్రాసయతినైనా వాడవచ్చును. వీటిలో ఉపగణములను వాడుతారు. సీసము, ఆటవెలది, తేటగీతి మున్నగునవి ఉపజాతులు. ఈ వ్యాసములో తెలుగులో అరుదుగా వాడబడిన అక్కరలను గుఱించి చర్చిస్తాను.
అక్కరలను తెలుగుభాషలో వృత్తాలకు ముందే వాడినారు. నన్నయ భారతానికి ముందు, నన్నెచోడుని కుమారసంభవానికి ముందే శిలాశాసనములలో అక్కరలలో పద్యాలు చెక్కబడ్డాయి. అక్కరలు కన్నడము, తెలుగు – ఈ రెండు భాషలలో ఉన్నాయి. బహుశా రెండింటిలో ఒకే సమయములో వీటిని వాడియుంటారు. అక్కరల వివరాలను తెలిసికొనడానికి ముందు, ఈ అక్కరలలో వాడే గణములను గుఱించి మనము తెలిసికోవాలి. ద్విపదాదులలో సూర్య గణములను, ఇంద్ర గణములను వాడుతారన్న విషయము మనకు తెలిసినదే. అదనముగా చంద్ర గణములను కూడ అక్కరలలో వాడుతారు. తెలుగు ఛందస్సులోని సూర్య, ఇంద్ర, చంద్ర గణములు కన్నడ ఛందస్సులోని బ్రహ్మ, విష్ణు, రుద్ర గణములలోని చిన్న మార్పులు మాత్రమే. ఆ గణముల వివరములను క్రింద ఇస్తున్నాను. ఇట్టి గణముల నిర్మాణరీతిని ఒకప్పుడు వివరించియున్నాను.
బ్రహ్మ గణములు లేక రతి గణములు – 4 – UU, UI, IIU, III
సూర్య గణములు – 2 – UI, III
విష్ణు గణములు లేక మదన గణములు – 8 – UUU, UUI, UIU, UII, IIUU, IIUI, IIIU, IIII
ఇంద్ర గణములు – 6 – UUI, UIU, UII, IIUI, IIIU, IIII
రుద్ర గణములు లేక బాణ గణములు – 16 – UUUU, UUUI, UUIU, UUII, UIUU, UIUI, UIIU, UIII, IIUUU, IIUUI, IIUIU, IIUII, IIIUU, IIIUI, IIIIU, IIIII
చంద్ర గణములు – 14 – UUUI, UUIU, UUII, UIUU, UIUI, UIIU, UIII, IIUUI, IIUIU, IIUII, IIIUU, IIIUI, IIIIU, IIIII
బ్రహ్మ, విష్ణు, రుద్రగణములలో ఎఱ్ఱ రంగుతో ఉండే రెండు గణములను తొలగిస్తే మనకు సూర్య, ఇంద్ర, చంద్ర గణములు లభిస్తాయి. కన్నడ ఛందస్సు వివరాలను తెలిపేటప్పుడు బ్రహ్మ, విష్ణు, రుద్ర గణములని వివరించినప్పుడు తెలుగులో అవి సూర్య, ఇంద్ర, చంద్ర గణములకు సమానమని తెలిసికోవాలి. కన్నడములో మొదటి ఛందోగ్రంథమును వ్రాసిన నాగవర్మ బ్రహ్మ, విష్ణు, రుద్ర గణములని వాడినా, తఱువాత సంస్కృతములో కన్నడ ఛందస్సు గుఱించి వ్రాసిన ఛందోనుశాసన కర్త జయకీర్తి బ్రహ్మ, విష్ణు, రుద్ర గణములను రతి, మదన, బాణ గణములని పేర్కొన్నాడు. బ్రహ్మ గణములు, రతి గణములు ఒక్కటే, అదే విధముగా విష్ణు మదన గణములు, రుద్ర బాణ గణములు ఒకటే.
అక్కరలు
అక్కరలు ఐదు విధములు. ఎక్కువ నిడివి గల దానికి ఏడు గణములుంటే, చాల చిన్నదానికి మూడే గణాలు ఉన్నాయి. అక్కరల వివరాలను క్రింది పట్టికలో చూడవచ్చును. గణములను సూర్యేంద్రచంద్ర గణములుగా తెలిపినా కూడ, అవి బ్రహ్మ(రతి), విష్ణు (మదన), రుద్ర (బాణ లేక శర) గణములకు తుల్యములైనవి.
సంఖ్య కన్నడము తెలుగు సంస్కృతము గణములు యతి
1 పిరియక్కర మహాక్కర మహాక్షర సూ/ఇం/ఇం/ఇం/ఇం/ఇం/చం 5
2 దొరెయక్కర మధ్యాక్కర సమానాక్షర ఇం/ఇం/సూ/ఇం/ఇం/సూ 4, 5
3 నడువణక్కర మధురాక్కర మధ్యాక్షర సూ/ఇం/ఇం/ఇం/చం 4
4 ఎడెయక్కర అంతరాక్కర అంతరాక్షర సూ/ఇం/ఇం/చం 4 లేక 3 అంత్య
5 కిరియక్కర అల్పాక్కర అల్పాక్షర ఇం/ఇం/చం 3
అక్కర అనే పదము అక్షరము అనే సంస్కృత పదానికి వైకృత రూపము. కొందఱు (రామాయణ కల్పవృక్షములో శకటరేఫమే ఉన్నది) అక్కఱ అని శకటరేఫముతో దీనిని వాడుతారు, అది సరి కాదనియే నా అభిప్రాయము.
శిలాశాసనములలో అక్కరలు
1. పిరియక్కర శాసనము
ఛందశ్శాస్త్రములో ఐదు విధములైన అక్కరలు ఉన్నా, అందులో కన్నడములో పిరియక్కర (మహాక్కర), తెలుగులో మధ్యాక్కర (దొరెయక్కర) మాత్రమే కావ్యములలో వాడబడినవి. కన్నడములో త్రిపదల పిదప అక్కరలు ప్రాచీనమైనవి. తెలుగులో త్రిపదల వాడుక లేదు. అక్కరలు, తదితర ఉపజాతులైన సీసము, గీతులతో ప్రారంభ దశలో తెలుగు కవులు వాడియుండవచ్చును. ఆ కాలపు కావ్యములు లేకున్నా, అప్పటి శిలాశాసనములు దీనికి ఒక నిదర్శనము. కన్నడములోగాని, తెలుగులోగాని ఈ శిలాశాసనాలన్ని పదవ శతాబ్దము నాటివి. శ్రావణబెళగొళలో క్రీ.శ. 982 కాలపు శాసనములో ఒక పిరియక్కర (మహాక్కర) శాసనము గలదు. తఱువాతి కాలములో అక్కడే ఇదే ఛందస్సులో మఱి కొన్ని శాసనాలు కూడ వ్రాయబడ్డాయి.
శ్రావణబెళగొళ పిరియక్కర (మహాక్కర) శాసనము (క్రీ.శ. 982.)
బళసువేఱువ సుళివగల్వింతపచారణదోషమల్లదె పొట్టవ
ట్టళెగె సమనాగె గిరియ కోల్ముట్టి మిగులుం నెలలుమణమీయదింతొం
దళవియొళ్ బరపొఱగొళగెడదొళం బలదొళం కడు గడు పిన్నెబర్ప
వళయందప్పదె చారిసువోజెయం రట్టకందర్పనంతావం బల్లం
(రట్టకందర్పునివలె ఎవరికి అతి వేగముగా లోపల, బయట, కుడివైపు, ఎడమవైపు దోషములు లేకుండ వలయమును చుట్టకుండ, ఎక్కకుండ, వెను దిరుగకుండ బంతిని బడితెతో సరిగా కొట్టడానికి వీలవుతుంది?)
క్రీ.శ. 991 నాటి వెంకయచోడుని దొంగలసాని శాసనములో ఒక మహాక్కర ఉన్నది. అందులోని మొదటి రెండు పంక్తులు (తఱువాతి పంక్తులు నా ప్రతిలో సరిగా ముద్రించబడ లేదు)
వెంకయా చోళ మహరాజు తెంకణాదిత్యుఁడు కొమరు రభీముండు వుసి
ఇల్ల రాళ్మనీ ధర్మ మాచంద్రార్కతారకంబును వర్ధిలుచునుండు
ఇందులో యతి లేదు, చంద్రగణములో మొదటి పాదములో ఒక మాత్ర ఎక్కువగా ఉన్నది, రెండవ పాదములో ఒక మాత్ర తక్కువగా ఉన్నది, ఐనా ఇది మహాక్కర అనడములో సందేహము లేదు.
2. మధ్యాక్కర శాసనము
తెలుగులో యుద్ధమల్లుని బెజవాడ మధ్యాక్కర శాసనము చాల ప్రసిద్ధి కెక్కినది. ఇది క్రీ.శ. 930నాటిది. అనగా మనకు లభించిన అక్కరల శాసనాలలో ఇది అతి ప్రాచీనమయినది. శ్రావణబెళగొళలోని కన్నడ మహాక్కర (పిరియక్కర) శాసనపు కాలము క్రీ.శ. 982. బెజవాడ శాసనాన్ని మొట్టమొదట జయంతి రామయ్యపంతులుగారు పరిశీలించారు. అందులో ఐదు పద్యములు సంపూర్ణముగా, ఆఱవ పద్యములో ఒక అసంపూర్ణ పాదము ఉన్నాయి. ఈ శాసన స్తంభములను రెండవ చిత్రములో చూడనగును. క్రింద ఇవ్వబడిన పద్యములు ఆ కాలపు తెలుగు లిపిలోని పద్యములను చదువుటకు సహాయకారిగా నుండును. దాని పాఠము:
యుద్ధమల్లుని బెజవాడ శిలాశాసనము (క్రీ.శ. 930.)
స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల – సత్యత్రిణేత్ర
విస్తర శ్రీయుద్ధమల్లుఁ డనవద్య – విఖ్యాత కీర్తి
ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువనా-భరణుండు సకల
వస్తు సమేతుండు రాజ సల్కి భూ-వల్లభుం డర్థి … 1
పరగంగ బెజవాడఁ గొమరసామికి – భక్తుఁడై గుడియు
నిరుపమ మతి నృపధాముఁ డెత్తించె – నెగిదీర్చె మఠము
గొరగల్గా కొరులిందు విడిసి బృందంబు – గొనియుండువారు
గరిగాక యవ్వారణాసి వ్రచ్చిన – పాపంబు గొండ్రు … 2
వెలయంగ నియ్యెట్టు డస్సి మలినురై – విడిసినఁ బ్రోలఁ
గల తానపతులును రాజు పట్టంబు – గట్టిన పతియు
నలియఁ బైవారల వెల్వరించిన – నశ్వమేథంబు
ఫల ముపేక్షించిన లింగమడిసిన – పాపంబు దమకు … 3
జననుత చేఁబ్రోలనుండి బెజవాడ – జాత్రకు వచ్చి
త్రినయన సుతుఁ డొండు సోటు మెచ్చక – తివిరి యిన్నెలవ
యనఘుండు సేకొని యిందుఁ బ్రత్యక్ష-మైయున్న నిచ్చ
గని మల్లఁ డెత్తించె గుడియు మఠమును – గార్తికేయునకు … 4
రమణతో బెజవాడ కెల్ల బెడఁగును – రక్షయుంగాను
దమ తాత మల్లపరాజు నేరడు – దాను గట్టించెన్
గ్రమమున దానిక కలశ మిడ్డట్లు-గా మొగమాడు
నమరంగ శ్రీయుద్ధ మల్లుఁ డెత్తించె – నమితతేజుండు … 5
తన ధర్ము వొడఁబడి కాచు నృపులకుఁ – ద … 6 (అసంపూర్ణము)
ఇందులో గమనింప దగిన ఒక ముఖ్యమైన విషయము, ఐదవగణముతో ఉండే మధ్యాక్కర యతి. దీనిని తఱువాత చర్చిస్తాను. మఱొకటి – కన్నడ శాసనములోగాని, తెలుగు శాసనములోగాని పాదాంత యతి పాటించబడినది. అంతేకాక, బెజవాడ మధ్యాక్కర శాసనములోని మధ్యాక్కరలలో వడి స్థానమువద్ద కూడ పదచ్ఛేదము కనబడుతుంది.
మహాక్కర
అక్కరలలో మొదటిది మహాక్కర, కన్నడములో పిరియక్కర. పిరి అనగా చాల పెద్దది అని అర్థము, ఇప్పుడు దీనిని హ-కారముతో హిరి అని ఉచ్చరిస్తారు. నేను అన్ని అక్కరలకు వేఱువేఱు లక్షణగ్రంథములనుండి వివరణలను ఇస్తాను. దీనికై నేను ఎన్నుకొన్న పుస్తకములు – కన్నడములో మొదటి నాగవర్మ (సుమారు క్రీ.శ. 990) వ్రాసిన ఛందోంబుధి, జయకీర్తి (సుమారు క్రీ.శ. 1000) సంస్కృతములో వ్రాసిన ఛందోనుశాసనము, తెలుగులో మల్లియ రేచన (సుమారు క్రీ.శ. 1100) వ్రాసిన కవిజనాశ్రయము, విన్నకోట పెద్దన (సుమారు క్రీ.శ. 1400) వ్రాసిన కావ్యాలంకారచూడామణి, అనంతామాత్యుడు (సుమారు క్రీ.శ. 1430) వ్రాసిన ఛందోదర్పణము. తెలుగులో మూడు గ్రంథములను ఎన్నుకోవడానికి కారణము – అన్ని పుస్తకాలలో ఒకే లక్షణాలు లేవు, అందువల్ల.
మొదలొళజ గణం కుందదె బక్కత్తమెయ్దు గణంగళె విష్ణువక్కుం
తుదియొళెంబ తాణదొళెల్లియుం కందర్పరిపు గణం నెలసి నిలక్కె
పదదొళెరడెంబ సంఖ్యెయొళాఱఱొళజ గణం సమవాయమప్పొడక్కుం
సదమళేందునిభాననే కర్తృవినిష్టదినరిది పిరియక్కరం – నాగవర్మ ఛందోంబుధి, 302
ఆదౌ రవిగణో మధ్యేఽత్ర స్మరగణపంచక మంతే తు బాణగణః
పాదేష్విహ రతిర్వా ద్వితీయే తుర్యే చ స్థానే తన్మాహాక్షరాఖ్యమ్
పాదాది ప్రభృతీతి కేవలం స్మరగణా షట్కంచ బాణాంతం కేచిదాహుః
పాదే పాదేఽత్ర ప్రతిగణమపి యతిర్లక్ష్యతే సర్వేషామక్షరాణామ్ – జయకీర్తి ఛందోనుశాసనం, 7.8
అమరఁ బ్రావళ్లు రెండునాఁ జెలఁగి నా-ల్గగు చోట విరతి, యాదిత్యు మీఁద
నమరపతి రెండు మూఁడు నాల్గైదు నా-ఱగు తావులను నిల్పి సొబగుమీఱ
నమరజేయుచుఁ జంద్రు నేడగు చోట – నదికిన యేడు గణములలోనఁ
గ్రమము తప్పక యప్పాటఁ బెద్దయ-క్కర మొప్పుఁ గవిజనాశ్రయుఁడు – రేచన కవిజనాశ్రయము, జాత్యధికారము, 25
వారిజాప్తుండు పంచేంద్రగణములు – వనజారియును గూడి వెలయుచును
నారయ రెండవ నాలవ చోట్ల – నర్కుండయిననుం దనర్చుచుండ
గోరి యవ్వడి పంచమగణమునఁ – గూడి మొదల నిలుపంగ నగు
సారమై ప్రాసవడి సప్తగణములు – సాఁగ మహాక్కర మతిశయిల్లు – విన్నకోట పెద్దన, కావ్యాలంకారచూడామణి, 8.53
ఆదివార మాదిగ ననుక్రమమున – నన్ని వాసరముల నొక్కినుండు
నాదితేయాదినాథు ళేగురు నల-రారంగ నొక్క సుధాకరుండు
నాది హరిఁ గొల్వ రెండును నాలుగు – నగు వాసరంబున నర్కుఁడైన
నాదరంబున నెడపొచ్చు నని మ-హాక్కరం బలుకుదు రార్యు లెల్ల – అనంతుని ఛందోదర్పణము, 3.40
వీటి సారాంశము ఏమనగా – (1) ప్రతి పాదములో ఏడు ఉపగణములు (అంశ గణములు) ఉంటాయి, అందులో మొదటిది సూర్య (బ్రహ్మ లేక రతి) గణము, తఱువాత ఐదు ఇంద్ర (విష్ణు లేక మదన) గణములు, చివర ఒక చంద్ర (రుద్ర లేక బాణ) గణము. రుద్ర (చంద్ర) గణము ఎప్పుడు అంతములోనే ఉంటుంది. (2) నాగవర్మ రెండవ, ఆఱవ గణములు బ్రహ్మ (సూర్య) గణములుగా ఉండవచ్చుననెను. (3) జయకీర్తి రెండవ, నాలుగవ గణములు రతి (బ్రహ్మ లేక సూర్య) గణములుగా నుండవచ్చునని అంటాడు. (4) అంతే కాక మొదటి రతి (బ్రహ్మ లేక సూర్య) గణమునకు బదులు మదన (విష్ణు లేక ఇంద్ర) గణమును ఉంచి కూడ వ్రాయవచ్చును, అప్పుడు చివరి బాణ (రుద్ర లేక చంద్ర) గణము తప్ప మిగిలినవన్ని మదన (విష్ణు లేక ఇంద్ర) గణములే. (5) జయకీర్తి మఱొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు – మహాక్షరము(పిరియక్కర లేక మహాక్కర) నందలి ప్రతి గణము ఒక పదముగా విఱగాలి. ఇది ఈ ఛందస్సు గానయోగ్యతను చాటుతుంది. (6) రేచన ఒక సూర్య, ఆఱు ఇంద్ర గణములు పాదములో ఉంటాయన్నాడు. అంతే కాక ‘అప్పాట’ అని ఈ ఛందస్సు సంగీతాన్ని తెలిపినాడు. తెలుగు ఛందస్సు కాబట్టి ఐదవ గణముతో అక్షరసామ్య యతి ఉందన్నాడు రేచన. (7) పెద్దన కూడ జయకీర్తివలె రెండవ, నాలుగవ గణములు సూర్య గణములుగా నుండవచ్చునని చెప్పాడు. ఇతని లక్షణ పద్యములోని రెండవ పాదములో మొదటి మూడు గణములు ఇంద్ర గణములు, నాలుగవ గణము సూర్య గణము. (8) అనంతుడు కూడ రెండవ, నాలుగవ గణములు సూర్య గణములై యుండవచ్చును అన్నాడు.
మహాక్కరకు ఉదహరణములు:
పై వివరణలను చదివినప్పుడు మనకు బోధపడునదేమంటే – ఒక పద్యపు లక్షణములు కాలక్రమేణ వికసిస్తుందని, ఇప్పుడు మనము పుస్తకాలలో చదివే లక్షణాలతోనే అది మొట్టమొదటినుండి ఉందనుకొనడము పొరపాటు. మహాక్కర ఛందమును పూర్వ కవులెవ్వరు తమ తెలుగు కావ్యాలలో వాడలేదు. ఒక్క విశ్వనాథ సత్యనారాయణ మాత్రమే తన కల్పవృక్షములో ఉపయోగించారు. క్రింద మహాక్కరకు కొన్ని ఉదాహరణములు –
బీరదళవియ నన్నియ చాగద శాసనం చంద్రార్కతారంబరం
మేరు నిల్వినం నిలవేళ్కుం కావ్యక్కె తానిత్తం శాసనదగ్రహారం
సార మెంబినం పెసరిట్టు తానీయె హరిగన ధర్మభండారవంతె
సారమాదుదు బిట్టగ్రహారమా బచ్చె సాసిరదొళం ధర్మపురం – పంపకవి భారత, 14.56
పై పద్యము కన్నడములో విక్రమార్జునీయము అనబడే పంప భారతములోనిది. ఇందులో కవికి భారత రచనకై అరికేసరి దానముగా ఇచ్చిన ధర్మపురము అనే గ్రామము, ఆచంద్రతారార్కముగ ఉంటుందని చెప్పబడినది. ఇప్పుడీ గ్రామము ఎక్కడుందో తెలియదంటారు. ఈ పద్యము పిరియక్కర (మహాక్కర) సామాన్య లక్షణములతో నున్నది. పంపకవి వ్రాసిన ఆదిపురాణములోని క్రింది పద్యములో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో నాలుగవ గణము లన్నియు బ్రహ్మ గణములు. ఇంద్రగణములు కాని గగము, స-గణములను ఇక్కడ గమనించవచ్చును. ఇందులో జైన మతములోని ఆది తీర్థంకరులను గుఱించిన వర్ణన గలదు.
ఈగళ్ నీనిర్దు నోనిసె నోంతు మహాబళం లలితాంగం వజ్రజంఘం
భోగ భూమిజం శ్రీధరదేవం సువిధి నరాధిప నచ్యుతేంద్రం
సాగరాంతం నెలనెనితనితుమం చక్రదిం బెసకెయ్సి వజ్రనాభి
యాగి సర్వార్థసిద్ధియొళ్పట్ట భరతదొళిన్నాదిదేవనప్పొం – పంపకవి, ఆదిపురాణం, 2.44
విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన మహాక్కరను క్రింద చదువవచ్చును. వారు బహుశా ఈ ఛందస్సు గీయమానమని అనుకొన్నారనుటలో సందేహము లేదు. abab పద్ధతిలో అంత్యప్రాసను ఉంచారు ఈ పద్యాలలో (కోడళ్ళు-కావళ్ళు, ఇచ్చెదము-పుచ్చెదము, బొమ్మ-కొమ్మ, నల్వురును, ఎల్లరును). మొదటి పద్యములో ‘మీరును’కు బదులు ‘మీరు’ అని ఉండాలనిపిస్తుంది. మన్నించి|రేని మీ|కుఁ గోడళ్ళు మఱియు సాధులు | పానకా|ల కావళ్ళు అనే ఉత్తరార్ధ భాగములో ‘కుఁ గోడళ్ళు, ల కావళ్ళు’ చంద్ర గణములు కావు.
మా ధరాపతి సుత ధరాసుత మీరును – మన్నించిరేని మీకుఁ గోడళ్ళు
భూధరేంద్రులు బహుశాలులు మీకుఁ – బుత్రికారత్నమ్ము నిచ్చెదము
సాధుమూర్తు లనుగ్రహింపుఁడు రస-సాధులు పానకాల కావళ్ళు
సీధువుల్ గొని యనుమతించిన మీకు – సీతమ్మ నర్పించి వుచ్చెదము – విశ్వనాథ సత్యనారాయణ, శ్రీమద్రామాయణకల్పవృక్షము, బాల, ధనుస్, 357
ఓసి ఓసి యయోధ్య రామయ్య తా – నొక్క విల్విఱిచి చందిరపు బొమ్మ
కోస ముత్తెమ్ముఁగొని తెచ్చి నాఁడంట – కోడళ్ళొకేసారి నల్వురును
రాసులై పున్నెములు గుంపులై మూఁగి – రాజుగారి వరించినఁటవె కొమ్మ
యోసి రావేరావే యంచు మూఁగినా – రూరి ముత్తైదువ లెల్లరును – విశ్వనాథ సత్యనారాయణ, శ్రీమద్రామాయణకల్పవృక్షము, బాల, కళ్యాణ, 136
మహాక్కరను ఎలా వ్రాయాలి?
గీతులు అనే ఒక వ్యాసము నందలి ఒక ముఖ్యమైన ప్రతిపాదన ఏమంటే గీతులలో పదములను గణములకు తగ్గట్లు ఎంచుకొంటే ఆ గీతి గానయోగ్యముగా ఉంటుందని. మహాక్కర విషయములో జయకీర్తి స్పష్టముగా ఇలా చెప్పాడు: పాదేపాదేఽత్ర ప్రతిగణమపి యతిర్లక్ష్యతే సర్వేషామక్షరాణాం.
గణవిభజన – రతి/మదన/మదన/మదన/మదన/మదన/బాణ
పాదే|పాదేఽత్ర| ప్రతిగణ|మపి యతి|ర్లక్ష్యతే| సర్వేషా|మక్షరాణాం
[కన్నడములో గగము ఒక రతి (బ్రహ్మ) గణము (తెలుగులోని సూర్య గణములా), మ-గణము ఒక మదన (విష్ణు) గణము (తెలుగులోని ఇంద్ర గణములా)]
అనగా ప్రతిపాదములో ప్రతిగణమునకు పదచ్ఛేదయతి అక్కరలో ఉంటుంది అని దీనికి అర్థము. ఆ కాలములో మహాక్కరను పాడుకొనేవారేమో? రేచన కూడ ప్రత్యేకముగా ఈ ఛందస్సును పాట అని నొక్కి చెప్పినాడు. జయకీర్తి సుమారు క్రీ.శ. 1000 కాలములో జీవించాడు. క్రింద అట్టిదానికి ఒక ఉదాహరణము. ఇందులో సూర్యేంద్రచంద్ర గణములకు తగ్గట్లుగా పదములు వాడబడినవి. పదములు ఒక గణమునుండి ఇంకొక గణములోనికి చొచ్చుకొని పోవు. జయకీర్తి కాని, నేను కాని ఇలా ఎందుకు చెప్పామంటే కన్నడ, తెలుగు భాషలలోని చిన చిన్న పదములను దేశి ఛందస్సులో ఉపయోగించి ఇట్టి ఛందోబంధములకు గానయోగ్యతను చేకూర్చ వీలగును.
మహాక్కర – సూ/ఇం/ఇం/ఇం – ఇం/ఇం/చం
నీవు లేనిచో జీవమ్ము లేదురా – నీవెగా నాజీవ రాజీవము
నీవు లేనిచో రావమ్ము లేదురా – నీవెగా నాజీవ సంగీతము
నీవు లేనిచో భావమ్ము లేదురా – నీవెగా నాజీవ చైతన్యము
నీవు లేనిచో నేనేమి కాదురా – నీవెగా నాజీవ సర్వస్వము
మహాక్కరకు ఇతర ఛందస్సుల సామ్యము.
మహాక్కర – త్రిపది: పిరిఅక్కర (మహాక్కర) బహుశా త్రిపదినుండి జన్మించినదని కర్కి భావిస్తారు. కన్నడ త్రిపదికి గణములు – వి/వి – వి/వి // వి/బ్ర/వి/వి // వి/బ్ర/వి. క్రింద కన్నడ త్రిపదికి ఒక ఉదాహరణము –
ఈ మహాక్కర యెట్లు – భూమిపై జనియించె
నేమమ్ము లేమొ – నేనెఱుంగను గదా
యేమి యా తీరు – లెట్లుండు
ఇందులో రెండవ, మూడవ పాదములలో మొత్తము ఏడు గణములు కలవు. అట్టి రెండు పాదములను చేర్చి గణముల స్వరూపమును మార్చినప్పుడు పిరియక్కర (మహాక్కర) పుట్టి ఉంటుందని వారి అభిప్రాయము. రెండవ, మూడవపాదములను ఒకటిగా వ్రాసినప్పుడు గణముల స్వరూపము ఇలాగుంటుంది – వి/బ్ర/వి/వి – వి/బ్ర/వి. దీనిని బ్ర/వి/వి/వి – వి/వి/రు గా మార్చితే అది పిరియక్కర (మహాక్కర – సూ/ఇం/ఇం/ఇం – ఇం/ఇం/చం) పాదము అవుతుంది.
పై ఉదాహరణములోని రెండవ, మూడవ పాదములు చేర్చి వ్రాసినప్పుడు ఇలాగుంటుంది – నేమమ్ము లేమొ నేనెఱుంగను గదా యేమి యా తీరు లెట్లుండు
పై పాదమును ఇలా వ్రాస్తే అది ఒక మహాక్కర పాదము అవుతుంది – నేమమ్ము లవేమొ నేనెఱుంగను గదా – యేమియో యా తీరు లెట్లుండునో
ఇప్పుడిది యతిలేని ఒక మహాక్కర పాదము అవుతుంది. ఇది ఒక ఊహ మాత్రమే. దీనికి ఆధారాలు తక్కువ. కాని పాత ఛందస్సుల పాదాలను కలిపి కొత్త ఛందస్సులను కల్పించడానికి సంస్కృతములో కూడ ఉదాహరణములు ఉన్నాయి.
మహాక్కర – సీసము: పిరియక్కరకు (మహాక్కరకు) సీస పద్యమునకు సంబంధము ఉంటుందేమో అని కర్కి అభిప్రాయ పడ్డారు. ఎరికల్ ముత్తురాజు మాలెగుడిపాడు శాసనము (క్రీ.శ. 575) లో సీసపద్య పాదములుగా గుర్తించబడినవి రెండు క్రింద ఇస్తున్నాను –
శ్రీ ఎరికల్ముతు రాజుల మరుమన్న / ఎళెరి పాళక ఇరుపది యది
ఎనుమఱున్తుడ్ల రాచమానంబు నా / ఇచ్చిన దత్తి దీఱచ్చు వాన్ఱు
ఇందులో మొదటి పాదములోని ఐదవ గణము ఇంద్రగణమునకు బదులు సూర్య గణము. అదే విధముగా రెండవ పాదములో మొదటి గణము ఇంద్ర గణమునకు బదులు సూర్య గణము. ప్రారంభ దశలో సీస పద్యమునకు గణముల మార్పు ఉండేదేమో? మహాక్కరలోని చివరి చంద్ర గణమును (రుద్ర గణమును) రెండు సూర్య గణములుగా (బ్రహ్మ గణములుగా) వ్రాయ వీలగును. అంతేకాక, జయకీర్తి మహాక్షరములో (మహాక్కర లేక పిరియక్కర) మొదటి ఆఱు గణములు అన్నియు మదన (ఇంద్ర లేక విష్ణు) గణములుగా నుండ వచ్చునని తెలిపాడు. అప్పుడు మహాక్కర పాదము సీసపు పాదమునకు సరిపోతుంది. క్రింద మహాక్కర లక్షణములతో సీసమువంటి ఒక పద్యము. దీనిని నేను మహా-శీర్షకము అని పిలిచాను. ఇందులో నేను మహాక్కర రెండు అర్ధములకు ప్రాసయతిని ఉంచాను. –
మహాశీర్షకము – సూ/ఇం – ఇం/ఇం // ఇం-ఇం – చం
నీల గగనమ్ము – నిండెగా నక్షత్ర
మాలలన్ జిత్రమై – మాయమ్ముగా
నేల నిద్రించె – నింగియున్ నిద్రించె
నాలమందల గంట – లాగిపోయె
వేళ యిప్పుడే – వేవేగ కనుమూయ
జాలమ్ము వలదయ్య – శయ్య పిల్చె
లాలి పాడెదన్ – లలితాంగ మెల్లఁగా
నాలించి నిదురించు – మందమ్ముగా
మహాక్కర – షట్పద: షట్పదికికూడ పిరియక్కర మూసగా ఉండవచ్చునని కర్కి అభిప్రాయ పడ్డారు. తెలుగు లక్షణగ్రంథములలో కవులు వాడని ఎన్నో ఛందస్సులు ఉన్నాయి. అందులో షట్పద కూడ ఒకటి. కన్నడములో ఎన్నో షట్పదులు ఉన్నాయి. కాని తెలుగులో ఒక షట్పద మాత్రమే ఉన్నది. దానికి ప్రతి పాదములో ఆఱు ఇంద్ర గణములు, ఒక చంద్ర గణము. రెండేసి గణములకు ప్రాసయతి, చివరి చంద్రగణముతో ఐదవ గణముతో సామాన్య యతిని ఉంచుతారు కొందఱు. మహాక్కరలో మొదటి సూర్య గణము తప్ప మిగిలిన గణములు అన్నియు ఈ షట్పద గణములే. కాబట్టి మహాక్కరను కూడ ఒక షట్పదలా వ్రాయ వచ్చును –
మహాక్కర-షట్పద – సూ/ఇం // ఇం/ఇం // ఇం/ఇం – చం
నీవు లేకున్న
జీవన వారాశి
నే విధమ్మై యిందు – నీఁదెదనో
నావ నాదన్న
నీవెగా నాకెప్డు
దీవిలో వెలుఁగొందు – దీపమెగా
భావ మందుండు
రావమై రంజిల్ల
దేవగాంధారియై – తీయఁగ రా
నీవె నాదేవి
నీవె నా హర్షమ్ము
నీవె నా లోకమ్ము – నిక్కముగా
మహాక్కర – తేటగీతి: మహాక్కరలోని మొదటి సూర్య (బ్రహ్మ లేక రతి)గణమును ఇంద్ర (విష్ణు లేక మదన) గణముగా చేసి చివరి చంద్ర (రుద్ర లేక బాణ) గణమును రెండు సూర్య గణములుగా చేసినప్పుడు మనకు సీస పద్యము లభిస్తుంది. మహాక్కరలోని రెండవ, నాలుగవ గణములను ఇంద్ర గణములకు బదులు సూర్య గణములుగా వాడే వారు, కొన్ని పద్యాలలో. పంప కవి నాలుగవ గణమును బ్రహ్మ గణముగా (సూర్య గణముగా) వాడినట్టి ఉదాహరణమును ఇంతకు ముందే చదివాము. ఇప్పుడు ఒక ప్రయోగము చేద్దాము. నాలుగవ గణమును సూర్యగణముగా చేద్దాము, యతిని నాలుగవ మఱియు ఏడవ గణముతో నుంచుదాము. అలా వ్రాసిన ఒక పద్యము క్రింద ఇస్తున్నాను. ఇప్పుడు మహాక్కర పాదానికి గణములు సూ/ఇం/ఇం – సూ/ఇం/ఇం – చం. మొదటి మూడు గణములవలె తఱువాతి మూడు గణములు కూడ. అంతే కాక సూ/ఇం/ఇం – చం అంతరాక్కర (వివరాలు తఱువాత) గణములు కూడ. ఇలా ఒక సౌష్ఠవము జనించినది పాదములో. క్రింది ఉదాహరణములో యతి, ప్రాస యతి రెంటిని ఉంచినాను. చంద్ర గణమును రెండు సూర్య గణములుగా చేసినాను. ఇప్పుడు రెండవ భాగము తేటగీతి పాదము అయినది! తేటగీతి ఇలా పుట్టినదా? మొట్ట మొదటి తేటగీతి సీసమునకు ఎత్తుగీతిగా సుమారు క్రీ.శ. 600 కాలపు శిలా శాసనములో ఉన్నది. సీసము, తేటగీతి ఈ రెండు మహాక్కరనుండి పుట్టినవా?
మహాక్కర – సూ/ఇం/ఇం – సూ/ఇం/ఇం – చం
కాన రాకుండ నున్నావు
కాన లేకుండ నున్నాను – కమలనేత్ర
మానసమ్మందు నుంటివే
మానసమ్మందు నుంటినో – మానవేంద్ర
వాన ధారగా రమ్మిందు
ప్రాణ పీయూష మందిమ్ము – ప్రాణనాథ
నేను నీతోడురా యెప్డు
నేను నీనీడరా యెప్డు – నిఖిలమందు
ఇందులోని అంతరాక్కర / తేటగీతి –
కాన లేకుండ నున్నాను – కమలనేత్ర
మానసమ్మందు నుంటినో – మానవేంద్ర
ప్రాణ పీయూష మందిమ్ము – ప్రాణనాథ
నేను నీనీడరా యెప్డు – నిఖిలమందు
మహాక్కర గర్భకవిత్వము:
మహాక్కర ఛందస్సు తెలుగులో ఇటీవలి విశ్వనాథ సత్యనారాయణ తప్ప మఱే కవి వాడలేదు. ఐనను, మహాక్కరను కొన్ని వృత్తములలో గర్భితము చేయ వీలగును, అదే విధముగా కొన్ని వృత్తములను మహాక్కరలో గర్భితము చేయవచ్చును. క్రింద కొన్ని ఉదాహరణములు –
1) మాతృక – మహాక్కర, తనయ – మత్తేభవిక్రీడితము
మహాక్కర – సూ/ఇం/ఇం/ఇం – ఇం/ఇం/చం
శారద నిను నే నిష్టతఁ గొల్చెదన్ – సరసతన్ నీరేజపత్రేక్షణా
తారిణి నిను హృన్మందిరమందు సం-తసముతో నే నిల్పితిన్ మూర్తిగా
ధారుణి ఘన మాధుర్యము నిండఁగాఁ – దరళమౌ కావ్యార్థ మీయంగ రా
యారయ విన విందౌ నవగీతముల్ – హరువుగా విన్పింతు ఛందమ్ముగా
గర్భిత మత్తేభవిక్రీడితము – స/భ/ర/న/గ – త/త/గ 20 కృతి 298676
నిను నే నిష్టతఁ గొల్చెదన్ సరసతన్ – నీరేజపత్రేక్షణా
నిను హృన్మందిరమందు సంతసముతో – నే నిల్పితిన్ మూర్తిగా
ఘన మాధుర్యము నిండఁగాఁ దరళమౌ – కావ్యార్థ మీయంగ రా
విన విందౌ నవగీతముల్ హరువుగా – విన్పింతు ఛందమ్ముగా
2) మాతృక – మహాక్కర, తనయ – కందము
మహాక్కర – సూ/ఇం/ఇం/ఇం – ఇం/ఇం/చం
మనసున దలతున్ నిను నే ననయము ప్రే-మమయుఁ డనుచు ననఘా వరదా
కనులకు సొబగై నిలువన్ బ్రణమిలెదన్ – గమలనయన వర మియ్యగ రా
అణువణువులలో వరదా నిను గన న-త్యతిశయముగ నిశిలో వెదుకన్
గనబడవుగదా నిను నే గనుగొను టె-క్కడయొ యెఱుఁగఁ గలనా యిలపై
గర్భిత కందములు –
మనసున దలతున్ నిను నే
ననయము ప్రేమమయుఁ డనుచు – ననఘా వరదా
కనులకు సొబగై నిలువన్
బ్రణమిలెదన్ గమలనయన – వర మియ్యగ రా
అణువణువులలో వరదా
నిను గన నత్యతిశయముగ – నిశిలో వెదుకన్
గనబడవుగదా నిను నే
గనుగొను టెక్కడయొ యెఱుఁగఁ – గలనా యిలపై
3) బంధుర – మహాక్కర
బంధుర – న/న/న/న/స/భ/భ/భ/గ 25 అభికృతి 14368768
మహాక్కర – III IIII IIII IIIU – UII UII UIIU
లలిత నటనలఁ బలుపలు సొబగులన్ – లాస్యము జేతును రా త్వరగా
లలిత రవములఁ బలుపలు స్వరములన్ – రాగము పాడెద రా త్వరగా
లలిత పదములఁ జదువఁగఁ గవితలన్ – వ్రాసెదఁ జక్కఁగ రా త్వరగా
లలిత హృదయము కన నినుఁ దలఁచెదన్ – రంజిలి రాజిల రా త్వరగా
4) మాతృక – పద్మనాభ వృత్తము, తనయ – మహాక్కర
పద్మనాభ – (త)7/గగ యతి (1, 13) 23 వికృతి 149797
రారమ్ము నక్షత్ర మార్గమ్ము వెల్గించి – రాజిల్లె నా చంద్రు డా నింగిపైనన్
రారమ్ము రత్నాల దీపమ్ము నేనుంతు – రమ్యమ్ము నిశ్శబ్ద మీరాత్రి గాదా
రారమ్ము కమ్మంగ భోజ్యమ్ము నేనిత్తు – రంజిల్లఁ దాంబూల మందిత్తు నేనున్
రారమ్ము రాగాల గానమ్ము నాలించ – లాలింతు నింద్రించ వేళయ్యెగాదా
ఇందులోని మహాక్కర – UI UUI UUI UUI – UUI UUI UUIU
రమ్ము నక్షత్ర మార్గమ్ము వెల్గించి – రాజిల్లె నా చంద్రు డా నింగిపై
రమ్ము రత్నాల దీపమ్ము నేనుంతు – రమ్యమ్ము నిశ్శబ్ద మీరాత్రిగా
రమ్ము కమ్మంగ భోజ్యమ్ము నేనిత్తు – రంజిల్లఁ దాంబూల మందిత్తు నేన్
రమ్ము రాగాల గానమ్ము నాలించ – లాలింతు నింద్రించ వేళయ్యెగా
మధ్యాక్కర
ఈ ఛందస్సును గుఱించి చర్చించడానికి ముందు దీని పేరును గుఱించి చర్చించాలి. తెలుగు ఛందస్సులోని అక్కరలకు ఆ పేరులను ఎవరు పెట్టారో అనే విషయము మనకు తెలియదు. మనకు లభించిన తెలుగు లక్షణగ్రంథములలో కవిజనాశ్రయము మొదటిది, కాబట్టి రేచనయే ఈ నామకరణము చేసినాడని ఊహించాలి. జయకీర్తి దీనిని సమానాక్షర అని పిలిచాడు. మహాక్షర మహాక్కరగా, అంతరాక్షర అంతరాక్కరగా, అల్పాక్షర అల్పాక్కరగా చెలామణి అవుతుండగా, సమానాక్షర మధ్యాక్కరగా, మధ్యమాక్షర మధురాక్కరగా మారింది తెలుగులో. సంస్కృతములో ఐదు అక్కరలలో మధ్యన ఉండేది కాబట్టి తెలుగు మధురాక్కరను మధ్యమాక్షర అని, కన్నడములో నడువణక్కర (నడుమ ఉండునది) అని పిలుస్తారు. కాని సంస్కృతములోని మధ్యమాక్షర తెలుగులో మధురాక్కర అయినది. సంస్కృతములోని సమానాక్షర తెలుగులో మధ్యాక్కర అయినది, పాండవులలో భీముడు మధ్యముడైనట్లు! ఇది ఎవరి దోషమో కాని, శతాబ్దాలుగా తెలుగు ఛందస్సు దీనిని భరిస్తూ ఉన్నది! ఏది ఏమైనా, మనము మధ్యాక్కర అనే దీనిని పిలువవలసి వస్తుంది.
చంద్ర (రుద్ర లేక బాణ) గణములు లేని ఒకే ఒక అక్కర మధ్యాక్కర (దొరెయక్కర లేక సమానాక్షర). మహాక్కర గణ సంఖ్యకన్న ఇందులో ఒకటి తక్కువ, అనగా ఇందులో పాదమునకు ఆఱు గణములు ఉంటాయి. అంతే కాదు, ఆ గణముల అమరికలో ఒక సౌష్ఠవము కూడ ఉంది – సూ/ఇం/ఇం – సూ/ఇం/ఇం (బ్ర/వి/వి – బ్ర/వి/వి లేక ర/మ/మ – ర/మ/మ). రెండు అర్ధ పాదములలో గణముల సమానత్వము ఉన్నందువలన దీనికి జయకీర్తి సమానాక్షర అని పేరు పెట్టినట్లు అనిపిస్తుంది. క్రింద లక్షణ-లక్ష్య పద్యములను చదువవచ్చును –
సరసిజోదర గణ మెరడజనుమల్లి నెరెదిక్కె, మత్తం
సరసిజోదర గణ మెరడజనుమక్కె, గణము మాఱక్కుం
సరసిజలోచనే దొరెవెత్త గణదిం దొరెవెత్త పెసరిం
దొరెయాగి సందుదు దొరెయక్కర మిద నఱివుదీ తెఱదిం – నాగవర్మ ఛందోంబుధి, 303
రతిపతిగణయుగ్మాద్రతితః స్మరయుగం రతిరపి చ పునః
ప్రతిపాదం వర్తతే యస్మింస్తత్సమానాక్షరనామ
శ్రుతికాంతమక్షరదక్షైరావృత మసగాఖ్యకవినా
ప్రతిపాదితం నను కర్ణాటకుమారసంభవకావ్యే – జయకీర్తి ఛందోనుశాసనం, 7.7
సురరాజు సురరాజు గూడి – సూర్యుతో నొడఁబడి మఱియుఁ
గర మొప్ప నిప్పాట నాఱు – గణముల మధ్యాక్కరంబు
విరచింపఁ బంపెఁ బ్రావళ్లు – వెలయఁ గవిజనాశ్రయుండు
సురుచిరంబుగను సుశబ్ద – శోభితం బగునట్లు గాఁగ – రేచన కవిజనాశ్రయము, జాత్యధికారము, 26
వరుసతో దేవేంద్ర సూర్య – వజ్రి రవుల …
విరచించి నాలన పట్టు – విశ్రాంతి సదనంబు చేసి
తరబడిఁ దప్పక చెప్పఁ – దగునండ్రు మధ్యాక్కరంబు
కరవాల భైరవు పెంపు – గణషట్కమున నుతియింప – విన్నకోట పెద్దన, కావ్యాలంకారచూడామణి, 8.54
ఓజతో నిద్దఱింద్రులు – నొక్క యాదిత్యుండు మఱియు
రాజితంబుగ నిద్ద ఱమర – రాజులు నొక్క సూరుండు
పూజింతు రత్యంత భక్తిఁ – బుండరీకాక్షు ననంతు
భ్రాజిల్లు బుధులు మధ్యాక్క-రంబు నొప్పారఁ బల్కుదురు – అనంతుని ఛందోదర్పణము, 3.41
పై పద్యముల సారాంశ మేమంటే – (1) ప్రతి పాదములో మధ్యాక్కరకు వరుసగా ఇం/ఇం/సూ – ఇం/ఇం/సూ గణములు ఉంటాయి. తెలుగులో యతి నాలుగవ గణముతో. (2) జయకీర్తి అసగకవి కన్నడములో వ్రాసిన కుమారసంభవ కావ్యములో ఈ ఛందస్సు ఉన్నదన్నాడు. కాని ఆ కావ్యము ఇంతవఱకు దొఱక లేదు. కన్నడములో ఈ అక్కరకు ఉదాహరణము ఇంతవఱకు కనుగొనబడలేదు.
కావ్యములలో మధ్యాక్కర:
ఇంతకు ముందే ఇది యుద్ధమల్లుని బెజవాడ శాసనములో ఉపయోగించబడినదని తెలిపాను. తఱువాత నన్నయభట్టు, ఎఱ్ఱాప్రగడలు భారతములో మధ్యాక్కరను ఉపయోగించారు. దానికి పిదప మధ్యాక్కరను ఇటీవల విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షములో, విశ్వనాథ మధ్యాక్కరలలో ఉపయోగించినారు. క్రింద వీటి కన్నిటికి ఉదాహరణములను చదువవచ్చును.
అని ననివృత్తులై పుణ్యచరితులై – యాత్మప్రబోధ
వినిహితచిత్తులై సర్వధర్మార్థ-విదు లయి తృప్తి
దనరెడు రాజర్షివరులకును యోగ-ధరులకు సాధు
జనులకు గతి నీవ నిత్యకారుణ్య – సర్వశరణ్య – శ్రీమదాంధ్రమహాభారతము, అరణ్య, 1.134 (ద్రౌపది కృష్ణునిపై పాడిన పద్యము ఇది.)
ఆరాజు గుణములు నాకెఱంగించి – నట్టులు నన్ను
నర్జునకు నెఱింగించి కరుణ నా-యందు గావింపు
మారంగ ననుడు నిషధదేశంబున – కరిగి యాహంస
వీరసేనజునకు దాని గుణరూప – విభవముల్ సెప్పె – నన్నయ భారతము, అరణ్య, 2.22
అసదృశతేజుఁడు బ్రాహ్మ-ణానీకవిహితుఁడై డాఁగి
వసుమతియందు నధర్మ-వర్తులై యున్న మ్లేచ్ఛులను
మసలక నిజశక్తిఁ జేసి – మడియించి ధర్మంబు నిలిపి
వసునిభుం డొనరించుఁ బేర్మి – నాజిమేధము నిష్ఠ యొప్ప – ఎఱ్ఱన భారతము, అరణ్య, 4.310
అవధారు శ్రీరామచంద్ర – యసుర రా-జైన మా యన్న
యవమానపఱచి నన్నంపె – నచటు నీ-కంతిష్టమైన
తవిలి యాతనితోడఁ జావు – తరలిపో – దనుజావశదుఁడ
యవుర నీమోము జూపకుము-రా యిట – నంచును దనకు – శ్రీరామాయణ కల్పవృక్షము, సుందర కాండము, సంధ్యాఖండము – 309
దయగల్గెనేని బంగారముం జేతు – తాకినయంత
దయలేదయేని భస్మీకరింతువు – తాకినయంత
అయయొ నినుంజూచి భయపడవలెనా – ఆచుకోవలెన
ప్రయత ధీనిలయ శ్రీకాళహస్తీశ్వ-రా మహాదేవ – శ్రీకాళహస్తి శతకము – 4
పై పద్యములలోని కొన్ని విశేషములు: (1) యుద్ధమల్లుని బెజవాడ శాసనాలలో మధ్యాక్కరకు యతి ఐదవ గణపు మొదటి అక్షరముతో ఉన్నది, ఉదా. స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల – సత్యత్రిణేత్ర. (2) నన్నయ కూడ తన పద్యములలో ఇలాగే యతి నుంచినాడు, ఉదా. ఆరాజు గుణములు నాకెఱంగించి – నట్టులు నన్ను. (3) నన్నయ కొన్ని చోటులలో గగమును, స-గణమును సూర్య గణముగా కైకొన్నాడు. కన్నడములో గగము, స-గణము బ్రహ్మ గణములు, కాని తెలుగులో అవి సూర్య గణములుగా వర్జింపబడినవి. ఉదా. ఆరంగ |ననుడు ని|”షధదే”|శంబున | – కరిగి యా|హంస. ఈ పాదమును “ఆరంగ ననుడు ని”షధ వి”షయమునకరిగి యాహంస అని సవరణ చేసినారు. ఈ విషయముపైన ఎన్నో వాదాలు జరిగాయి, దీనిని సూచించుటకు మాత్రమే ఇక్కడ దీనిని ప్రస్తావించినాను. (4) ఎఱ్ఱన భారతములో ఒకే ఒక మధ్యాక్కరను వ్రాసినాడు. అందులో యతిని నాలుగవ (నన్నయలా ఐదవ కాదు) గణపు మొదటి అక్షరముతో నుంచినాడు, ఉదా. వసునిభుం డొనరించుఁ బేర్మి – నాజిమేధము నిష్ఠ యొప్ప. కవిజనాశ్రయము మున్నగు లక్షణ గ్రంథాలలో కూడ ఇలాగే సూచించబడినది. అనగా కవిజనాశ్రయము నన్నయ పిదప, ఎఱ్ఱనకు ముందు వ్రాయబడినదని అనుకోవచ్చును. (5) విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షములో నాలుగవ, ఐదవ గణముల మొదటి అక్షరములతో యతి నుంచెను, అనగా అతడు రెండు యతులను ఉంచెను, ఉదా. అవధారు శ్రీరామచంద్ర – యసుర రా-జైన మా యన్న. (6) కాని అతడు తాను వ్రాసిన మధ్యాక్కర శతకములలో నన్నయలా ఐదవ గణముతో యతి నుంచెను, ఉదా. ప్రయత ధీనిలయ శ్రీకాళహస్తీశ్వ-రా మహాదేవ. బహుశా నన్నయ పైన వారికున్న ప్రగాఢ భక్తి విశ్వాసాలేమో?
మధ్యాక్కర యతి:
మధ్యాక్కరను గుఱించి వ్రాసేటప్పుడు, దాని యతిని తప్పక చర్చించాలి. ప్రశ్న – శాసనాలలోవలె, నన్నయవలె ఐదవ గణముపైననా లేక లాక్షణికులవలె, ఎఱ్ఱనవలె నాలుగవ గణము పైననా?
(1) పాదములోని రెండు అర్ధ భాగముల గణ స్వరూపము ఒకటై ఉన్నందువల్ల పాద మధ్యములో ఉంచితే బాగుంటుందన్న విషయము పారదర్శకమే. సంస్కృతములో దీని పేరు సమానాక్షర, అనగా పాదములో సమానత్వము ఉన్నది దీనికి. దీనిని నిరూపించడానికి జానపద గేయాలు కూడ ఉన్నాయి. వేటూరి ప్రభాకర శాస్త్రిగారు తమ తల్లి పాడగా మధ్యాక్కర ఛందస్సువంటి పాటను విని యున్నానని చెప్పినట్లు సంగభట్ల నరసయ్య ‘తెలుగు మెరుగు’లోని వ్యాసమునందలి విషయాన్ని ఎత్తి చూపారు. ఆ పాట –
అంతట రాముల వారూ – అంగన సీతను గూడీ
సంతస మందుచు వేగా – స్వపురమునకు చనుదెంచీ
తమ్ములతోడను గలసీ – నెమ్మది రాజ్యము లేలే
ధర్మముతో ప్రజ లెల్లా – తామర తంపర లైరీ
ఇందులో గమనించదగినవి, యతి లేక ప్రాసయతి పాద మధ్యములో నున్నది. సూర్య గణమును పొడిగించి గగము, స-గణము వలె చేసినారు (కన్నడములోని బ్రహ్మ గణములవలె). అక్షరాలను పొడిగించుకొని చతురస్రగతిలో పాడుకొనవచ్చును. అదే విధముగా పంచమాత్రల ఇంద్ర గణములను ఉపయోగిస్తే ఖండ గతిలో పాడుకొనవచ్చును.
(2) పాదములోని సౌష్ఠవమును విఱుగగొట్టుటకై యతిని ఐదవ గణముపైన ఉంచినారని పాటిబండ మాధవశర్మ అంటారు.
(3) రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మధ్యాక్కర పాదమును ఆఱు మాత్రల రూపకతాళములో పాడుకొనుటకు వీలుగా ఐదవ గణముతో యతిని కలిపారని ఊహించారు.
(4) సూర్యదేవర రవికుమార్ మధ్యాక్కర పాదములోని ఆఱు గణములను 2-2-2 గా విడదీసినప్పుడు యతిని ఐదవ గణముపైన ఉంచవలసి వస్తుందని అభిప్రాయ పడ్డారు. అలాగైతే మూడవ గణముపైన ఎందుకు ఉంచరాదో? క్రింద పాదములను 2-2-2 గణములుగా విఱిచి మూడవ, ఐదవ గణముతో యతులను ఉంచి నేను వ్రాసిన మధ్యాక్కరలను పరిశీలించండి –
వదనము జూడఁగ – వారిజాక్షికిన్ – వంతలు తగ్గు
సదమల పురుషుని – సన్నిధానము – స్వర్గపు నిగ్గు
తధిమిత యంచును – దడల నెడఁదయుఁ – దాళము వేయ
ముదములె యెపుడును – మోహనాంగుని – మ్రోల ను మాయ
మనసున మల్లెల – మాల లూఁగెనే – మత్తులు నిండ
తనరఁగ నభమున – తళుకు లాడెనే – తారల దండ
కనుగవ కింపుగఁ – గదలు గాలిలోఁ – గౌముది సొంపు
ప్రణయము లొలుకుచుఁ – బల్లవించ నీ – వలపులె యింపు
సూర్య గణములకు బదులు బ్రహ్మ గణములను (UI, III, UU, IIU) ఉపయోగించి వ్రాసినప్పుడు రెండేసి గణములకు తొమ్మిది మాత్రలతో వ్రాయ వచ్చును. అట్టి దానికి ఒక ఉదాహరణము –
ఆనంద మయ్యెను – హరి నీ గానమ్ము – నాలించ నిజమై
వేణూ రవమ్ముల – వినఁగా జనియించెఁ – బ్రేమమ్ము నదియై
ధేనువు లట నిల్చె – స్థిరమై తినకుండ – తృప్తితో వనిలో
వానగా స్వరములు – వడితో ముంచఁగాఁ – బ్రణయమ్మె ధరలో
(5) గిడుగు సీతాపతి పాదమును 4-2 గణములుగా విఱిచినప్పుడు మొదటి భాగము ద్విపదవలె ఉంటుందని, అందువలన అలా చేసినారేమోనని అభిప్రాయ పడ్డారు. ఈ విషయాన్ని పరిశీలించి నేను మధ్యాక్కరను ద్విపదవలె రచించినాను. క్రింద నా ఉదాహరణములలో యతిని నాలుగవ మఱియు ఐదవ గణములతో నుంచినాను, అంతే కాక నాలుగవ గణమునకు ఆఱవ గణమునకు అంత్యప్రాసను ఉంచితే పాడుకొనుటకు బాగుంటుందా అని ఆలోచించి అలా వ్రాసినాను –
మధ్యాక్కర –
మనసెందుకో నేఁడు మైన-మై మారె – మౌనమై జారె
కనులెందుకో నేఁడు కలలు-గా మారెఁ – గవితగా పారె
నిను జూచినప్పుడే నేను – నీకంటి – నీవు నాకంటి
వనజాక్షి రమ్ము నా బ్రదుకు – భారమ్ము – వ్యధలు ఘోరమ్ము
ఇందులోని ద్విపదలు –
మనసెందుకో నేఁడు – మైనమై మారె
కనులెందుకో నేఁడు – కలలుగా మారె
నిను జూచినప్పుడే – నేను నీకంటి
వనజాక్షి రమ్ము నా – బ్రదుకు భారమ్ము
మధ్యాక్కర –
నీవేగదా నాదు నెనరు – నేస్తమ్ము – నిండు ధైర్యమ్ము
జీవమ్ములో నాదు సిరుల – శిల్పమ్ము – చిత్ర రూపమ్ము
రావేల ప్రేమికా రమణ – రాజిల్ల – రవము శోభిల్ల
భావనా నదిలోన బదము – పాడంగఁ – బలుకు లాడంగ
ఇందులోని ద్విపదలు –
నీవేగదా నాదు – నెనరు నేస్తమ్ము
జీవమ్ములో నాదు – సిరుల శిల్పమ్ము
రావేల ప్రేమికా – రమణ రాజిల్ల
భావనా నదిలోన – బదము పాడంగ
మధ్యాక్కరను గుఱించి చాల విషయములు దోనెపూడి లక్ష్మీకాంతమ్మ వ్రాసిన మధ్యాక్కరలు అనే ఒక సిద్ధాంత గ్రంథములో చర్చించబడినవి.
(6) ఆదికవి నన్నయను, శాసనకవులను ధిక్కరించాలి అంటే కవిజనాశ్రయ కర్తకు ధైర్యము ఉండాలి. ఇప్పటిలా కాక ఆ కాలములో సంప్రదాయములను ధిక్కారము చేయడానికి ధీమా తక్కువ. ఇక్కడే చంపకోత్పలమాలలు సహాయమునకు వస్తాయి. ఈ మాలికా వృత్తములలో యతి స్థానమునకు ముందు ఇం/ఇం/సూ గణములు, యతి స్థానము పిదప కూడ ఇం/ఇం/సూ గణములు ఉన్నాయి. అనగా మధ్యాక్కరను ఈ మాలికావృత్తములలో గర్భితము చేయవచ్చును. చంపకోత్పలమాలలలో చివరి మూడు అక్షరములను తొలగిస్తే అవి మధ్యాక్కరలు అవుతాయి. యతి ఈ మాలికా వృత్తముల యతియే. నాలుగవ గణముపైన మధ్యాక్కరలో యతిని ఉంచడానికి ఈ మాలికా వృత్తాల గణ యతుల అమరిక కారణమేమో? కావాలనే ఇక్కడ నేను మధ్యాక్కర యొక్క నాలుగవ, ఐదవ గణములపై యతి నుంచినాను. క్రింద ఒక ఉదాహరణము –
ఉత్పలమాల –
రాధిక, మానస మ్మలరి – రంజిల రాగము పాడు రమ్యమై
వేదనఁ దాళఁగా నగునె – వేగము వీణియ మీటు ప్రేమతో
మోదము నీయఁగా నిపుడు – మోహిని ముందర రమ్ము పూలతో
నాదరి నవ్వుచున్ బలుకు – నాదము నాకగు సొమ్ము భవ్యమై
మధ్యాక్కర –
రాధిక, మానస మ్మలరి – రంజిల – రాగము పాడు
వేదనఁ దాళఁగా నగునె – వేగము – వీణియ మీటు
మోదము నీయఁగా నిపుడు – మోహిని – ముందర రమ్ము
నాదరి నవ్వుచున్ బలుకు – నాదము – నాకగు సొమ్ము
మాతృక – ఉత్పలమాల
తనయ – మధ్యాక్కరలోని ఒక ప్రత్యేకత
మధ్యాక్కర – కందము: మధ్యాక్కరకు గణములు వరుసగా రెండు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము, తదుపరి మఱల రెండు ఇంద్ర గణములు ఒక సూర్య గణము. యతి ప్రస్తుతము నాలుగవ గణముగా అంగీకరించబడినది. క్రింద మధ్యాక్కరను కందములో రెండు విధములుగా గర్భితము చేసినాను. మొదటి విధములో ఒకటిన్నర కంద పద్యములలో నాలుగు మధ్యాక్కర పాదములు గలవు. రెండవ రీతిలో ప్రతి కందపద్య పాదములోని మొదటి మూడు చతుర్మాత్రలలో మధ్యాక్కరలోని మొదటి మూడు గణములను గర్భితము చేసినాను. క్రింద రెంటికి ఒక్కొక్క ఉదాహరణము –
మొదటి విధము –
కవనము వ్రాయంగ నిదియె
కవి కవకాశమ్ము నిజము, – కవనపు ఛంద
మ్ము విమల కమలాప్తునివలె
ఛవి నిడ,సువిశాల భావ – సరముల సొబగుల్
శ్రవణముల కొదవ, భువనము
నవమై వెలుఁగును ముదములు – ననలుగ నలరన్
కవనము వ్రాయంగ నిదియె – కవి కవకాశమ్ము నిజము,
కవనపు ఛందమ్ము విమల – కమలాప్తునివలె ఛవి నిడ,
సువిశాల భావ సరముల – సొబగుల్ శ్రవణముల కొదవ,
భువనము నవమై వెలుఁగును – ముదములు ననలుగ నలరన్
రెండవ విధము –
ప్రేమకు నామమ్ము క్షమత
ప్రేమకు నామమ్ము మమత – హృదయమునందున్
ప్రేమకు నామమ్ము భ్రమత
ప్రేమకు నామమ్ము సమత – ప్రియులకు నెపుడున్
ప్రేమకు నామమ్ము వలపు
ప్రేమకు నామమ్ము దలఁపు – ప్రియతయు ధరపై
ప్రేమకు నామమ్ము గలపు
ప్రేమకు నామమ్ము పిలుపు – ప్రీతియు నిజమై
ప్రేమకు నామమ్ము క్షమత – ప్రేమకు నామమ్ము మమత
ప్రేమకు నామమ్ము భ్రమత – ప్రేమకు నామమ్ము సమత
ప్రేమకు నామ్మము వలపు – ప్రేమకు నామమ్ము దలఁపు
ప్రేమకు నామమ్ము గలపు – ప్రేమకు నామమ్ము పిలుపు
బ్రహ్మ, విష్ణు గణములతో మధ్యాక్కరలు: మధ్యాక్కర పాడుకొనడానికి ఒక అందమైన ఛందస్సు. జానపద గేయాలలో సూర్య గణమును పొడిగించే తీరును మీకు ఇంతకు ముందే ఒక పాట ద్వారా వివరించాను. గగము, స-గణములతో వ్రాస్తే మధ్యాక్కర అందముగా ఉంటుంది పాడుకోడానికి. మాలినీ వృత్తములా దీనికి కూడ పాద మధ్యమునకు, పాదాంతమునకు అంత్యప్రాసను ఉంచవచ్చును. క్రింద ఒక రెండు ఉదాహరణములు –
కవనాల నల్లితిన్ నీకై – కావ్యమ్ము వ్రాసితిన్ నీకై
భవనాలఁ గట్టితిన్ నీకై – పలు దివ్వె లుంచితిన్ నీకై
నవగీతఁ బాడితిన్ నీకై – నాట్యమున్ జేసితిన్ నీకై
భువనాల దొర మోహనాంగా – ముద మీయ రా వేగ రంగా
ఎందుకే నీకింత అందం – ఏమిటో ఈ ప్రేమ బంధం
ఎందుకే విరహాల తాపం – ఎందుకే నాపైన కోపం
ఎందుకే మోహాల మాయ – ఏమిటో శోకాల లోయ
ఎందుకే ఈ అగ్ని జ్వాల – ఎందుకే ఆర దీ కీల
తల్లీ నిన్ను దలంచి నేను – ధ్యానమ్ము సల్పెదను గదా
యుల్లంబందున నిల్చి నాకు – నుత్సాహ మీయ రమ్ము సదా
కల్లోల మ్మయె డెంద మిందు – కలహంసవాహనా వాణీ
ఫుల్లాబ్జాక్షీ వేద నిలయా – పూర్ణచంద్రముఖి గీర్వాణీ
(ఇందులోని ప్రథమ గణము విష్ణు గణమైన మ-గణము)
మధురాక్కర
ఐదు విధములైన అక్కరలలో మధురాక్కర మూడవది. నిజముగా యిదియే “మధ్యాక్కర”. కన్నడములో దీని పేరు నడువణక్కర, నడుమ నుండే అక్కర అని. సంస్కృతములో జయకీర్తి దీనికి స్పష్టముగా మధ్యమాక్షర అని పేరు నుంచినాడు. కన్నడములో దీనికి ఉదాహరణములు లేవు. తెలుగులో దీనిని నన్నయ, ఎఱ్ఱనలు వ్రాసారు. మహాక్కరకు ఏడు గణములు, మధ్యాక్కరకు ఆఱు, మధురాక్కరకు ఐదు గణములు పాదములో. లక్షణ లక్ష్య పద్యములు క్రింద –
జళజసంభవ గణమక్కె మొదలొళే నడువె మూఱుం
జళరుహోదర గణమక్కె కామాంతక గణమక్కుం
తిళకదంతిరె తలెయొళే బందిక్కె కామబాణా
వళియ పాంగెయ్దె గణమక్క నడువణక్కరకె సఖీ – నాగవర్మ ఛందోంబుధి, 304
ప్రథమే రతిరేవ మన్మథః స్యాద్ద్వితీయే తృతీయేఽ
ప్యథ చతుర్థే బాణగణస్తు పంచమస్థాన ఏవ
ప్రథితం లక్షణమితి యస్య తన్మధ్యమాక్షరాఖ్యాం
ప్రథిథం కర్ణాటమాలతీమాధవ ప్రభృతికావ్యే – జయకీర్తి ఛందోనుశాసనం, 7.6
రవి దివిజరాజ గీర్వాణ-రాజ దేవాధిదేవ
కువలయప్రియు లిప్పాటఁ గూడ – నేను గణములు
నవిరళముగఁ బ్రావడి మధు-రాక్కరంబు ధరలోనఁ
గవిజనాశ్రయుం డెఱిఁగించెఁ – గవుల కింపు జనియింప – రేచన కవిజనాశ్రయము, జాత్యధికారము, 27
తరణి వాసవ త్రితయంబు – ధవళ భానుయుతి నొంద
నిరతి విశ్రాంతి నాలవ – నెలవున నింపుమీఱ
సరస మధురార్థములఁ జెప్పఁ – జను మధురాక్కరంబు
వరుసఁ బంచగణములను – వాలి కృతుల వెలయు – విన్నకోట పెద్దన, కావ్యాలంకారచూడామణి, 8.55
రవియు నింద్రులు మువ్వురు – రాజొకండును కలసి
రవిసుధాకరలోచను – రాజితాననసరోజు
రవికులేశుఁ గొలుతు రని – ప్రస్తుతింతురు ధరిత్రి
నవిరళంబగు మధురాక్క-రాఖ్యచే సత్కవులు – అనంతుని ఛందోదర్పణము, 3.42
వీటి సారాంశము – (1) ప్రతి మధురాక్కర (నడువణక్కర లేక మధ్యమాక్షర) పాదములో వరుసగా ఒక సూర్య (బ్రహ్మ లేక రతి), మూడు ఇంద్ర (విష్ణు లేక మదన), ఒక చంద్ర (రుద్ర లేక బాణ) గణములు ఉంటాయి. యతి నాలుగవ గణముతో నుండును. (2) కన్నడములోని మాలతీమాధవ కావ్యములో ఈ అక్కరను వాడారు అని జయకీర్తి చెప్పినా, ఆ కావ్యము ఇప్పుడు అలభ్యము.
కావ్యములలో మధురాక్కర:
తెలుగులో దీనిని నన్నయ, ఎఱ్ఱన, ఇటీవల విశ్వనాథ సత్యనారాయణ తప్ప మిగిలిన కవులు ఈ అక్కరను వాడలేదు. నన్నయ ఒక మధురాక్కర, ఎఱ్ఱన రెండు వాడగా, సత్యనారాయణ లెక్కకు లేనన్ని వాడారు కల్పవృక్షములో. క్రింద కావ్యములందలి ఉదాహరణములు –
తనర జనకుండు నన్నప్ర-దాతయును భయత్రాత-
యును ననఁగ నింతులకు మువ్వు – రొగిన గురువులు వీర
లనఘ యుపనేత మఱియు ని-రంతరాధ్యాపకుండు
ననఁగ బురుషున కియ్యేవు – రనయంబును గురువులు – నన్నయ భారతము, ఆది, 4.49
కనకమృగ మట్లు చను దవ్వు-గాఁ ద్రిప్పి తెచ్చుటకు
వనజముఖి నేకతమ శూన్య-వనమున యందునిచి
వెనుక ననుజుండు వచ్చిన- విధమునకు మదిలోన
ననఘుఁ డెంతయు వగచుచు – నరిగె నాశ్రమమునకు – ఎఱ్ఱన భారతము, అరణ్య, 6.352
దండకారణ్య దేశంబు – తరులతా సాంద్ర భూమి
గండశైల ప్రచండంబు – ఘనఝరీ తరణ దుష్ట
మండజాత మృగానేక – హల్లీసకోగ్ర దృశ్య
ముండసురియ లసాధ్యంబు – లుగ్ర జంతువులు వనిని – విశ్వనాథ సత్యనారాయణ శ్రీరామాయణ కల్పవృక్షము, కిష్కింద, సమీకరణ, 112
మధురాక్కర గర్భకవిత్వము:
మధురాక్కరను మన కవులు ఉపయోగించకపోయినా, మధురాక్కర చాయలు కొన్ని వృత్తములలో మనకు కనబడుతుంది. ఇందులో మొదటిది నిజముగా అపూర్వమైనది. అందులో రెండు జాతులు, ఒక వృత్తము ఉన్నాయి. క్రింద కొన్ని ఉదాహరణములు –
1) తరలి – మధురాక్కర
తరలి – భ/స/న/జ/న/ర 18 ధృతి 97249
మధురాక్కర – UI IIIU IIII – UII IIUIU
(ఉత్సాహ – UI III UI III – UI III UIU)
ఎందుఁ జనితివో ప్రియతమ – యెప్పుడు నను గాంతువో
ముందు నిలువరా మనసున – మోదపు టల పొంగఁగా
సుందరమగు నీ మొగమును – జూడఁగ నిట వేఁచితిన్
వంద విరులు నా వలపుల – వల్లరి నలరారుఁగా
(ఇది ఒక త్రివేణీసంగమము, ఇందులో రెండు జాతులు, ఒక వృత్తము ఉన్నాయి)
2) దేవరాజ – మధురాక్కర
దేవరాజ – న/ర/న/జ/భ/స 18 ధృతి 125912
మధురాక్కర – III UIU IIII – UIU IIIIU
మధురమైన నీ దలఁపుల – మాధవా మరిగితిరా
వ్యధలతోడ నిన్ బిలిచితి – బంధమున్ మఱచితివా
కథల నెన్నియో తెలిపెదఁ – గంజలోచన వినరా
సుధల ధారనీ కొసఁగెద – సుందరా సునయన రా
3) మాతృక – మాలిని, తనయ – మధురాక్కరలోని ఒక ప్రత్యేకత
మాలిని – న/న/మ/య/య 15 అతిశక్వరి 4672 III III UU – UIU UIUU
ప్రణయపథములో ప్రా-రంభ పాదమ్ముగా రా
వనజనయన నీ భా-వమ్మె డెందమ్ములోనన్
వినతు లొసగెదన్ వే-వేగ మాలించ రారా
స్వనము వినెదరా సా-క్షాత్కరించంగ రావా
ఇందులోని మధురాక్కర – సూ/ఇం/ఇం/ – ఇం/చం III III UU – UIU UIU
ప్రణయపథములో – ప్రారంభ పాదమ్ముగా
వనజనయన నీ – భావమ్మె డెందమ్ములో
వినతు లొసగెదన్ – వేవేగ మాలించ రా
స్వనము వినెదరా – సాక్షాత్కరించంగ రా
4) మాతృక – మత్తకోకిల, తనయ – మధురాక్కరలోని ఒక ప్రత్యేకత
మత్తకోకిల – ర/స/జ/జ/భ/ర 18 ధృతి 93019 UI UII UI UII – UI UII UIU
మత్తకోకిల పాడఁగా మది – మత్తుతో మునిగెన్ గదా
చిత్తమందునఁ జిందులే సిరి – చిందులాడెనుగా సకీ
నృత్తమాడెను పుష్పముల్ హృది – నిండె మోదముతో చెలీ
మెత్తగా మధురధ్వనుల్ మెల – మెల్లఁగా మెదలెన్ గదా
ఇందులోని మధురాక్కర సూ/ఇం/ఇం/ – ఇం/చం UI UII UIU – IIUI UIIU
మత్తకోకిల పాడఁగా – మది మత్తుతో మునిగెన్
చిత్తమందునఁ జిందులే – సిరి చిందులాడెనుగా
నృత్తమాడెను పుష్పముల్ – హృది నిండె మోదముతో
మెత్తగా మధురధ్వనుల్ – మెల మెల్లఁగా మెదలున్
మధురాక్కర – మధురగీతి:
మధురాక్కరలోని చివరి చంద్ర (రుద్ర లేక బాణ) గణమును రెండు సూర్య (బ్రహ్మ లేక రతి) గణములుగా చేసినప్పుడు మనకు తేటగీతివంటి ఒక గీతి లభిస్తుంది. తేటగీతిలో సూర్య గణముల మధ్య రెండు ఇంద్ర గణములుంటే ఇందులో మూడు ఇంద్రగణములు ఉంటాయి. అనగా మధురాక్కరతో మనము తేటగీతిలాటి ఒక గీతిని సృష్టించ వీలగును. మధురాక్కరనుండి జనించిన ఇట్టి గీతికి నేను ‘మధురగీతి’ అని పేరుంచాను. క్రింద మధురగీతికి ఉదాహరణములు –
మధురగీతి – సూ/ఇం/ఇం – ఇం/సూ/సూ 6 మరకత 50
ఏల రావేల నాతోడ – నీవేళ నుండి యాడ
ఏల రావేల మాయింటి – కీవేళ పదము పాడ
ఏల రావేల ప్రేమలో – నీవేళ ముదము చూడ
ఏల రావేల మనమింక – నేకమై చేరి కూడ
చూడు మా చందమామను – సుందరాకాశమందు
నేఁడెగా నిండు పున్నమి – నింగి వెన్నెలకుఁ గొల్ను
వాఁడు సూడంగ వచ్చును – వలపు పుష్పమ్ము పూచు
మేడ యౌనొక్క స్వర్గము – మేదినిన్ మోదమీయ
కలల సరసిలో నీదెను – కలహంస యలలమీద
నలలు మెలమెల్ల సవ్వడి – నందమై నింపె వేగ
వలపు మందిరమ్మందున – వల్లకిన్ మీటు మింక
తెలుఁగు నుడులతోఁ బాడుము – తీయఁగ మధురగీతి
అంతరాక్కర
అక్కరలలో నాలుగవది అంతరాక్కర. దీనికి కన్నడములో ఎడెయక్కర అనియు, సంస్కృతములో అంతరాక్షర అనియు పేరులు. తెలుగులోని అంతరాక్కర పేరు అంతరాక్షరనుండి వచ్చినదనుటలో సందేహము లేదు. అంతరాక్కరకు ప్రతి పాదములో నాలుగు గణములు. క్రింద లక్షణ లక్ష్య పద్యములను ఇచ్చాను.
వనజసంభవ గణమక్కె మొదలొళత్తల్
వనరుహోదర గణ యుగళ మదక్కె రు-
ద్రనదఱంత్యదొళ్ బందిక్కె, నాల్కె గణ
వినితె వనితె కేళ్ ఎడెయక్కరక్కినిసుం – నాగవర్మ ఛందోంబుధి, 305
యదితు రతిగణః పాదాదౌ పాదమధ్యే
మదనగణయుగం పాదాంతే బాణగణమ్
తదిదమంతరాక్షరమక్షరజ్ఞా గీతం
విదితమార్హతే కర్ణాటేశ్వరకథాదౌ – జయకీర్తి ఛందోనుశాసనం, 7.5
ఇన సురేంద్ర చంద్రంబు – లిప్పాట వచ్చి
పొనరి యుండంగఁ బ్రావళ్లు – పూర్వ భంగి
నన గణంబులు నాలుగిం-టం బెనంగ
ననుపమానాంతరాక్కర-మయ్యె రేచ – రేచన కవిజనాశ్రయము, జాత్యధికారము, 28 (జయంతి రామయ్య పంతులు ప్రతి)
ఇనుఁడొకఁడు సురేంద్రయుగ – మిందుం డొక్కడుం
బొనరియుండఁ బ్రావళ్లు – పూర్వంబు గాదు
ననఁగ నాల్గింట యతి త్రి-కాంత్యంబు వర్ణ
మనుపమానాంతరాక్క-రాఖ్యంబు రేచ – రేచన కవిజనాశ్రయము, జాత్యధికారము (వావిళ్ల ప్రతి)
కమలమిత్రుండు సురరాజ – గణయుగంబు
కమలశత్రునితోఁ జెంది – కందళింప
నమరుఁ బ్రావళ్లు నర్థంబు – నతిశయిల్ల
నమలమగు నంతరాక్కర – మబ్ధి సంఖ్య – విన్నకోట పెద్దన, కావ్యాలంకారచూడామణి, 8.56
ఇనుఁ డొకండును నింద్రు – లిద్దఱు(ను) నొక్క
వనజవైరియుఁ గూడి – వైభవ మొనర్ప
గనకవస్త్రుని గృత్త-కైటభుని గొలుతు
రనుచుఁ జెప్పుదు రంత-రాక్కర బుధులు – అనంతుని ఛందోదర్పణము, 3.43
వీటి సారాంశము అంతరాక్కర (ఎడెయక్కర లేక అంతరాక్షర) ప్రతి పాదములో ఒక సూర్య (బ్రహ్మ లేక రతి) గణము, రెండు ఇంద్ర (విష్ణు లేక మదన) గణములు, చివర ఒక చంద్ర (రుద్ర లేక బాణ) గణము ఉంటాయి. గణముల అమరిక నిస్సందేహము, కాని తెలుగులో దీని యతి స్థానము చర్చనీయాంశము. రేచన కవిజనాశ్రయములో రెండు విధములైన లక్షణ పద్యములు ఉన్నాయి. జయంతి రామయ్య పంతులు ప్రతిలో మొదటి పాదములోని యతి మూడవ గణపు చివరి అక్షరమైతే మిగిలిన పాదములలోని యతి నాలుగవ గణపు మొదటి అక్షరము. అంతేకాక గణముల అమరిక తేటగీతి వలెనే. విన్నకోట పెద్దన వ్రాసిన కావ్యాలంకారచూడామణిలో యతి స్థానము చంద్రగణపు మొదటి అక్షరమే. అంతే కాక అబ్ధి సంఖ్య (చతుస్సాగరము) అని కూడ చివరి పాదములో యతి గుఱించి ప్రస్తావించబడినది. పెద్దన అంతరాక్కర లక్షణ పద్యము కూడ ఒక తేటగీతియే.కాని వావిళ్లవారు ప్రచురించిన కవిజనాశ్రయపు (నిడదవోలు వెంకటరావు పరిష్కర్త?) ప్రతిలో వేఱొక పద్యము ఉన్నది. అందులో యతిని మూడవ గణపు చివరి అక్షరముగా పేర్కొనబడినది. గణముల అమరికలో ఇది కూడ ఒక తేటగీతియే, కాని యతి తేటగీతి ముందక్షరము పైన. నాకేమో ఇది సందేహాస్పదముగా నున్నది. ఎందుకంటే కవిజనాశ్రయకర్తకు తఱువాతి వాడైన పెద్దన నాలుగవ గణముపైన యతి నుంచగా, పెద్దనకు పూర్వము వ్రాసిన రేచన ఏ విధముగా ఇట్టి లక్షణములను చెప్పి ఉంటాడు? అనంతుడు మాత్రము మూడవ గణపు చివరి అక్షరమునే యతిగా పేర్కొన్నాడు. జాత్యుపజాతులలో యతి ఎప్పుడు ఉప (అంశ) గణపు మొదటి అక్షరముగానే ఉంటుంది. అలాగైతే ఒక గణపు చివరి అక్షరమును యతిగా పేర్కొనడము వింతగానే ఉన్నది. చివరి చంద్ర (రుద్ర లేక బాణ) గణమును రెండు సూర్య (బ్రహ్మ లేక రతి) గణములుగా వ్రాస్తే, అంతరాక్కరకు, తేటగీతికి భేదముండదు. నాలుగవ గణపు మొదటి అక్షరము తేటగీతి నాలుగవ గణపు మొదటి అక్షరము అవుతుంది. అనగా తేటగీతి అంతరాక్కరలకు ఒక అభేదత్వము సిద్ధిస్తుంది. అట్టి సమానత్వమును తొలగించుటకై మూడవ గణపు చివరి అక్షరమును యతిగా ఉంచారు అనే వాదము ఒకటి ఉన్నది. ఏది ఏమైనా నా ఉద్దేశము నాలుగవ గణపు మొదటి అక్షరమనియే. కాని తెలుగు లాక్షణికులు మూడవ గణపు చివరి అక్షరమును యతి స్థానమని నిర్ణయించినారు. అంతరాక్కరను కవులు ఉపయోగించకపోయినా ఈ వాదము మాత్రము ఇలాగే ఉంటుంది.
కావ్యములలో అంతరాక్కర:
జయకీర్తి కర్ణాటేశ్వరకథ అనే కావ్యములో అంతరాక్కరలు ఉన్నాయి అన్నాడు కాని, ఆ కావ్యము ఇంతవఱకు దొఱకలేదు.
కరజమెరడఱిం బెక్కు పాయ్వా పాంగినిం
త్వరితదిం పెగలనొత్తు గుహ్యాసనదిం
దిరుతె కర్ణమూలమనె చుంబిసె బాలెగె
సురిగుం కామాంబు నిశ్చయ మిదనఱిగె – చంద్రరాజ విరచిత మదనతిలకం, 7.5
(చేతులతో భుజములను నొక్కి గుహ్యావయవమును ముద్దిడగా యువతికి మదన రసమూరును.)
భూమిధరములునిత్య- పుష్పితము లొప్పు
భూమి పరిమళభరిత-ములు స్పృహ లీను
భూమిజంబులు వస్త్ర-ములు సమర్పించుఁ
గామధేనువు నేయు – కైసేతలట్లు – విశ్వనాథ సత్యనారాయణ, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింద, సమీకరణ, 254
అంతరాక్కర గర్భకవిత్వము:
1) మత్తభృంగ – అంతరాక్కర
మత్తభృంగ – భ/జ/త/న/లగ 14 శక్వరి 7983 UIII UIU – UIII IIU
అంతరాక్కర – UI IIUI UU-I IIIIU
మాధవునిఁ జూడఁగా – మన్మథుని వలలో
బాధపడుచుంటి నే – భావముల కలలో
నాదముల లాలిలో – నాన యరుణిమలో
వేదమయెఁ బ్రేమయే – వేవెలుఁగు జిగిలో
(దీని లయ వనమయూరపు లయ వంటిదే)
2) స్రగ్విణి – అంతరాక్కర
స్రగ్విణి – ర/ర/ర/ర, 12జగతి 1171 UIU UIU – UIU UIU
అంతరాక్కర – UI UUI UU-I UUIU
శ్యామలాంగా హరీ – సాయమీవే గదా (శ్యా-య)
భామ నే రత్న మా – భావ వారాశిలో (భా-వ)
భూమిపై దివ్వెగా – మోము భాసించుఁగా (భూ-ము)
స్వామి నీ యందమౌ – వాసమున్ జూపరా (స్వా-స)
(అంతరాక్కర యతులను కుండలీ కరణములలో చూపినాను)
3)మందాక్రాంతము – అల్పాక్కర
మందాక్రాంతము – మ/భ/న/త/త/గగ 17 అత్యష్టి 18929 UUUU – IIIIIU – UIU UIUU
నీవేగా నా – నిఖిలము గదా – నీ నగుల్ చింద రారా
నీవేగా యీ – నదికి నలలై – స్నేహితా వేగ రారా
నీవేగా నా – నిశికి శశియై – నెన్నడన్ వెల్గ రారా
నీవేగా నా – నెనరు, విధికిన్ – నిర్ణయ మ్మేమియోరా
అంతరాక్కర – సూ/ఇం/ఇం/చం – UI IIII UU-I UUIU
నా నిఖిలము గదా నీ -నగుల్ చింద రా
యీ నదికి నలలై స్నే-హితా వేగ రా
నా నిశికి శశియై నె-న్నడన్ వెల్గ రా
నా నెనరు, విధికిన్ ని-ర్ణయ మ్మేమియో
4) అంతరాక్కర – ద్విపద
అంతరాక్కర – సూ/ఇం/ఇం/చం, మూడవ గణపు చివరి అక్షరము యతి, ద్విపద – ఇం/ఇం – ఇం/సూ
ముద్దుగా నింగిలో – మోము చంద్రునిది (ము-ము)
సద్దు లేకుండెరా – చంచలమ్ము నిశి (స-చ)
ఇద్దర మ్ముండఁగా – నీయిలన్ శుభము (ఇ-ఇ)
వద్దురా నశ్రువుల్ – భవ్య మీ బ్రదుకు (వ-వ్య)
(అంతరాక్కర యతులను కుండలీ కరణములలో చూపినాను)
5)అంతరాక్కర – తేటగీతి
అంతరాక్కర – సూ/ఇం/ఇం/చం, మూడవ గణపు చివరి అక్షరము యతి, తేటగీతి – సూ/ఇం/ఇం – సూ/సూ
రేపు వచ్చెద నంటిరి – రేపు నేఁడు (రే-రి)
జ్ఞాపకమ్ము లేదొ సరస – సంధ్య వీడె (జ్ఞా-స)
నా పసిఁడి వెన్నెలయును న-న్యాయ రీతి (ఆ-అ)
నాపయింబడె విరహాన – నలఁత చెంద (నా-న)
మనము కరుగదా ప్రియతమా – మఱచిపోవ (మ-మా)
తనువు వేచెను నీకు త-త్తరముతోడ (త-త)
నినుఁడు గ్రుంకెను చూడు మీ – హృదయమంత (ఇ-ఈ)
ఘన తమిస్రము నిండెఁగా – కరుణ లేదొ (ఘ-గా)
(అంతరాక్కర యతులను కుండలీ కరణములలో చూపినాను)
అల్పాక్కర
అక్కరలలో చాల చిన్నది అల్పాక్కర.పాదమునకు ముచ్చటగా మూడే గణములు. దీనిని కన్నడములో కిరియక్కర అంటారు, సంస్కృతములో అల్పాక్షర అంటారు. లక్షణ లక్ష్య పద్యములను క్రింద ఇచ్చాను-
పొడెయలరిర్బరుం మొదలొళిక్కె
జడెయ శంకర నొర్బం తుదియొళిక్కె
మడది కేళ్ మూఱు గణమెసెదిక్కె
గడ, కిఱియక్కరక్కిదె లక్షణం – నాగవర్మ ఛందోంబుధి, 306
అంగజగణయుగాద్ బాణగణే
సంగతే ప్రతిపాద మల్పాక్షరమ్
శృంగారపిండాదికావ్యేషు తత్
సంగీతం కర్ణాటకే ప్రసిద్ధం – జయకీర్తి ఛందోనుశాసనం, 7.4
ఇంద్రుండు మఱియొక్క – యింద్రుఁ గూడి
చంద్రుతో నొడబడి – చనిన సత్క
వీంద్రు లల్పాక్కరం – బిది యందురు
చంద్రాస్య కవిజనా-శ్రయకవీంద్రా – రేచన కవిజనాశ్రయము, జాత్యధికారము, 29
సుమనఃపతియుగము – సోముండును
నెమకంగఁ బ్రావళ్లు – నిండి మీఱ
గమనీయ విభవంబు – గాంచు నెప్డు
రమణీయ మల్పాక్క-రము కృతుల – విన్నకోట పెద్దన, కావ్యాలంకారచూడామణి, 8.57
ఒగి నిద్దఱింద్రులు – నొక విధుండు
జగతీధరుని పదా-బ్జములు గొల్తు
రగణిత భక్తి నం-చభినుతింప
నెగడు నల్పాక్కర – నియతితోడ – అనంతుని ఛందోదర్పణము, 3.44
వీటి సారాంశము ఏమనగా అల్పాక్కర (కిరియక్కర లేక అల్పాక్షర) ప్రతి పాదములో రెండు ఇంద్ర (విష్ణు లేక మదన) గణములు, ఒక చంద్ర (రుద్ర లేక బాణ) గణములు ఉంటాయి. యతి మూడవ గణమైన చంద్రగణముతో.
కావ్యములలో అల్పాక్కర -సంస్కృతములో శృంగారపిండ మనే కావ్యములో అల్పాక్కరలు ఉన్నాయని జయకీర్తి చెప్పెను, కాని ఆ కావ్యము అలబ్ధము. తెలుగులో మడికి సింగన ఒక అల్పాక్కరను వ్రాసెను. అది (శ్రీ మురళీధరరావు గారి సౌజన్యముతో) –
మీ రిందు శంబరు – మెచ్చి చూడ
నారూఢి నే నొక్క – హయము నెక్కి
దూరించి పో వన -దుర్గభూమి
భారంబుగాఁ జొచ్చె – వాజి వేగ – మడికి సింగన, యజ్ఞ వాసిష్ఠ రామాయణము, 2.223
పున్నాగ కాంతార-ముల్ పొన్నలున్
పొన్నారి గేదంగి – పూదోటలున్
సన్నని వకుళాగ్ర – సంతానముల్
క్రన్న గవేషించి – కాంచి రండు – విశ్వనాథ సత్యనారాయణ, శ్రీమద్రామాయణ కల్పవృక్షము, కిష్కింద, సమీకరణ, 165
అల్పాక్కర – గర్భకవిత్వము:
అల్పాక్కర మూడు గణములతో ఉండే చిన్న పద్యమైనా, వినడానికి సొంపుగా ఉంటుంది.ఒక విధముగా చూస్తే మొదటి సూర్య గణము లేని తేటగీతి వంటిది, లేదా సీసములోని కుఱుచ పాదమువంటిది, లేదా ఆటవెలదియందలి సరి పాదము వంటిది. క్రింద కొన్ని ఉదాహరణములు –
1) అల్పాక్కర – సీసకగీతి
అల్పాక్కర – ఇం/ఇం/చం, సీసకగీతి – ఇం/ఇం – సూ/సూ
తల్పముల్ పిలచెరా – తామసమ్ము
స్వల్పమ్ము వలదురా – సారసాక్ష
అల్పమ్ము గాదురా – హర్ష మిందు
శిల్పమ్ము వేఁచెరా – చేర రార
2) అల్పాక్కర – వెలఁదిగీతి
అల్పాక్కర – ఇం/ఇం/చం, వెలఁదిగీతి – సూ/సూ/సూ – సూ/సూ
వేదమంత్రములను – విధిగఁ బాడ
నాద బిందు చయము – నదిగఁ బాఱు
శ్రీద మదియు నెప్డుఁ – జెవుల కింపు
మోద మిచ్చు నమృత-మో యనంగ
3) మానిని – అల్పాక్కర యుగ్మము
మానినికి సామాన్యముగా రెండేసి భ-గణములకు యతి నుంచుతారు. నన్నయాదులు మూడు యతులకు బదులు ఒక్కదానినే ఉంచినారు. కాని మానినీవృత్తములో ఇంతవఱకు ఎవ్వరు చెప్పని ఒక చిత్రము ఏమంటే, ఈ వృత్తములో మొదటి పది అక్షరములకు, చివరి పది అక్షరములకు గురు లఘువుల అమరికలు ఒక్కటే. అంతే కాదు, ఈ పది అక్షరములు అల్పాక్కరకు కూడ సరిపోతాయి. మానినికి 11వ అక్షరముతో అక్షర సామ్య యతి, ఒకే అమరికగల రెండు భాగములకు ప్రాసయతిని ఉంచి వ్రాసినప్పుడు మానినిని చక్కగా పాడుకొనవచ్చును. మధ్య ఉండే రెండు లఘువులు ఈ రెండు భాగములను కలిపే వంతెనగా ఉంటుంది. క్రింద మానిని-అల్పాక్కరలు –
మానిని – (భ)7/గురువు, 22 ఆకృతి 1797559
UII UII * UIIU – II – UII UII * UIIU
ఈ గుర్తు (-) మానిని యతులు
ఈ గుర్తు (*) అల్పాక్కర యతులు
అల్పాక్కర – UII UII * UIIU
అందము చిందుచు* నాడుదమా – హరి –
ముందర భక్తిగ* మ్రొక్కుదమా
కుందపు మాలలఁ* గ్రుచ్చుదమా – గురు –
వందితు గాథలఁ* బాడుదమా
చందన గంధము* చల్లుదమా – స్వర –
సింధువులన్ బలు* చేర్చుదమా
నందజుతో నిట* నవ్వుదమా – నవ –
సుందరమూర్తికిఁ* జొక్కుదమా
ఈ లయ తనకు ‘అటవీ స్థలములు కడుగుదమా – చెలి – వట పత్రమ్ములు కోయుదమా’ అనే పాటను జ్ఞప్తికి తెచ్చిందని శ్రీమతి సుసర్ల నాగజ్యోతి రమణ గారు చెప్పారు. అనగా అల్పాక్కరలో సంగీతము ఉన్నది.
మిశ్రాక్కర
అక్కరలలో ఏడు నుండి మూడు వఱకు గణములు ఉన్నాయి. ఒక పాదము ఒక విధమైన అక్కరతో, తఱువాతి పాదము అంతకంటె ఒక గణము తక్కువైన అక్కర పాదముతో పద్యములను వ్రాస్తే, అన్ని పాదములు ఒకే విధముగా నుండకుండ పద్యములో ఒక వైవిధ్యము గోచరిస్తుంది. మిశ్రాక్కరలు, వృత్తములలోని అర్ధసమ వృత్తముల వంటివి, లేదా సీసములోని నిడుద, కుఱుచ పాదముల వంటివి, లేదా ఆటవెలదిలోని రెండు పాదముల వంటివి. అలా వ్రాసిన మిశ్రాక్కరలకు క్రింద కొన్ని ఉదాహరణములు –
1) మధురాక్కర-అంతరాక్కర
ఈ వసంతమ్ములోఁ బూవు – లెటు చూడ కనువిందురా
తావిలో గాలిలో నాకు – తల త్రిప్పెరా
నీవు రాకుండ నేనుంటి – నెనరుతో నిట నొంటిగా
నీవు లేకుండ నేనుండు – టెటు జంటగా
2) అంతరాక్కర-అల్పాక్కర
ఏమి మాయయో యీవేళ – హృదయమ్మునే
ప్రేమతో నిండించి – ప్రియమాడెనే
స్వామి వచ్చునో యీరేయి – వరమీయఁగా
నామానసమ్మందు – నడయాడఁగా
3)అంతరాక్కర – అల్పాక్కర – ఆటవెలఁది
రమ్ము వేగము శుభ రా-త్ర మరుగుదెంచె (ర-రా)
బమ్మరపడ జ్యోత్స్న – పల్లవించె
చిమ్ము సుధలను విరచిం-చి కవనమాల (చి-చిం)
కొమ్ము ముదము నూఁగి – కుసుమడోల
(ఆటవెలఁది యతులు కుండలీకరణములలో నున్నవి)
అక్కరల సారాంశములు:
అక్కరలు జాతికి చెందినవి. ఇవి సూర్యేంద్ర చంద్ర (బ్రహ్మ విష్ణు రుద్ర లేక రతి మదన బాణ) గణములతో శోభిల్లునవి. జాతులు కావున ప్రాస నియతము. తెలుగులో యతి కూడ ఉన్నది. మూడింటిలో (మహాక్కర, మధురాక్కర, అంతరాక్కర) మూడు విధములైన గణములు ఉన్నాయి. రెంటిలో రెండువిధములైన గణములే – మధ్యాక్కరలో సూర్యేంద్ర గణములు, అల్పాక్కరలో ఇంద్ర చంద్ర గణములు. తెలుగులో చంద్ర గణములు లేని మధ్యాక్కరను ఆదికవి నన్నయ విశేష ఛందస్సుగా వాడినాడు. నవీన యుగములో విశ్వనాథ సత్యనారాయణ మధ్యాక్కరకు, ఇతరములైన అక్కరలకు సముచిత స్థానమును ఇచ్చెను. మధ్యాక్కర, అంతరాక్కరల యతి స్థానము తెలుగులో చర్చనీయాంశములైనవి. తెలుగు కవులకు ఎందుకో ఈ అక్కరలు నచ్చలేదు. జయకీర్తి సంగీత పరముగా దీనికి చాల ఉన్నత స్థానాన్ని ఇచ్చినాడు. రేచన కూడ ఈ ఛందస్సుల లక్షణములను వివరించేటప్పుడు “పాట” అని వీనిని పేర్కొన్నాడు. శాసనములలోని అక్కరల యందలి పదముల విఱుపులు కూడ పాటలలోవలెనే ఉన్నాయి. ఇన్ని మంచి గుణములు ఉన్నను, కన్నడములో గాని తెలుగులో గాని అక్కరలను కవులు నిరాకరించినారు. మహాక్కరకు సీస పద్యమునకు పోలికలు ఉన్నవి. ఎన్నో అందాలతో ప్రకాశించే సీసమున్నప్పుడు మహాక్కరకు స్థానము లేకపోయినది. అదే విధముగా కన్నడములో మహాక్కర (పిరియక్కర) స్థానమును షట్పదలు ఆక్రమించాయి. తెలుగులో అంతరాక్కర స్థానమును తేటగీతి ఆక్రమించినది. అంతరాక్కర, అల్పాక్కరలతో ఉండే ఒక మిశ్రాక్కర చాయ ఆటవెలదికి సరిపోతుంది. అంతే కాక, ఎన్నో వృత్తములలో అక్కరల చాయలు కనిపిస్తున్న సంగతి పైన ఉదాహరించిన గర్భకవిత్వము ద్వారా నేను నిరూపించినాను. అనగా, అక్కరలను మనము వాడకపోయినా, అది ఒక అంతర్వాహినిగా వేఱు రూపాలలో, మారు వేషాలలో తెలుగు కావ్యాలలో ప్రవహిస్తున్నది. విశ్వనాథ సత్యనారాయణ ఉత్సహించినట్లు మిగిలిన కవులు కూడ పూనుకొంటే అక్కరలను పునరుద్ధరించుటకు వీలవుతుందని నా గట్టి నమ్మకము. మూడు విధములైన అక్కరలను, తేటగీతిని గర్భితము చేసిన ఉత్పలమాల వృత్తముతో ఈ వ్యాసమును ముగిస్తున్నాను –
ఉత్పలమాల –
ఏమని జెప్పుటో ననల – బృందము సొంపన నవ్వె నారి హా
యామని వచ్చెఁగా వనికి – నందములో విభవమ్ము హెచ్చె సు-
శ్యామల మయ్యెఁగా నెనరు – చందము లొప్పెనె నిండి యాడఁగా
సీమలఁ జేరెఁగా మనసు – చిందిడె నాయమ మాట వల్కఁగా
ఉత్పలమాలలోని మధ్యాక్కర –
ఏమని జెప్పుటో ననల – బృందము సొంపన నవ్వె
యామని వచ్చెఁగా వనికి – నందములో విభవమ్ము
శ్యామల మయ్యెఁగా నెనరు – చందము లొప్పెనె నిండి
సీమలఁ జేరెఁగా మనసు – చిందిడె నాయమ మాట
ఉత్పలమాలలోని తేటగీతి –
ననల బృందము సొంపన – నవ్వె నారి
వనికి నందములో విభ-వమ్ము హెచ్చె
నెనరు చందము లొప్పెనె – నిండి యాడ
మనసు చిందిడె నాయమ – మాట వల్క
ఉత్పలమాలలోని అంతరాక్కర –
ననల బృందము సొంప-న నవ్వె నారి
వనికి నందములో వి-భవమ్ము హెచ్చె
నెనరు చందము లొప్పె-నె నిండి యాడ
మనసు చిందిడె నాయ-మ మాట వల్క
ఉత్పలమాలలోని (యతి లేని) అల్పాక్కర –
బృందము సొంపన – నవ్వె నారి
యందములో విభ-వమ్ము హెచ్చె
చందము లొప్పెనె – నిండి యాడ
చిందిడె నాయమ – మాట వల్క
--------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment