Tuesday, March 12, 2019

మానవ బంధుత్వ పదాలు


మానవ బంధుత్వ పదాలు


సాహితీమిత్రులారా!

మనం తెలుగులో మానవ బంధుత్వ పదాల గురించి విశ్లేషించి కొన్ని బంధుత్వ పదాలను ఇప్పుడు పరిశీలిద్దాం:

అల్లుడు: అల్లుడు అన్న పదానికి అల్లు వాఁడు, రెండు కుటుంబాలు అల్లుకు పోవడానికి కారణమైనవాడు వంటి వ్యుత్పత్తులు బ్రౌణ్యం, శబ్దరత్నాకరము వంటి నిఘంటువులలో కనిపిస్తాయి. అయితే, అక్క కొడుకును కూడా అల్లుడు అనే అంటారు కాబట్టి ఈ వ్యుత్పత్తి సరైనది కాదని నా అభిప్రాయం. అంతేకాక, తులనాత్మకంగా (comparatively) ఇతర భాషలలోని సజాతి పదాలను పరిశీస్తే, ఈ వ్యుత్పత్తి అంతగా పొసగదని తెలుస్తుంది. కన్నడ భాషలో అళియ అంటే అల్లుడు. తుళు భాషలో అళియె (అల్లుడు), తమిళంలో అళియన్ (మిక్కిలి ప్రేమ కలవాడు) అన్న పదాలు దీనికి సజాతి పదాలు. ఈ పదాలలో ఉన్న మూర్ధన్య ళ-కారం గమనించండి. అల్లిక అన్న అర్థం వచ్చే ‘అల్లు’ అన్న పదాలకు కన్నడ తమిళాదులలో మూర్ధన్య ళ-కారం లేదు. దక్షిణ ద్రావిడ భాషలలో ళ-కారం ల-కారం రెండూ ప్రత్యేక వర్ణాలు. ఒకవేళ అల్లుడు అన్న పదం అల్లు- (అల్లుకుపోవు) అన్న పదానికి సంబంధించిందైతే అందులో ళ-కారం ఉండేది కాదు. కాబట్టి అల్లుడు అన్న పదానికి అల్లుకుపోవడానికి సంబంధం లేదు. బ్రౌన్ కాలానికి ఇటువంటి తులనాత్మక పదజాలం అందుబాటులో లేదు కాబట్టి బ్రౌన్‌ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే, ఈ మధ్యకాలంలో తయారు చేసిన తెలుగు వ్యుత్పత్తి కోశం*లో కూడా అల్లుడు అన్న పదాన్ని అల్లుకుపోవడానికి సంబంధించిన పదంగా వివరించడం ఆశ్చర్యకరమైన విషయం.

అయితే, గోండి భాషలో సన్నే అంటే అల్లుడు. పర్జి భాషలో చల్లునిద్-, కొలామి భాషలో సాల్జిన్ అంటే అల్లుడు, బ్రాహుయి భాషలో సాలుమ్ అంటే అల్లుడు. ఈ భాషలలో ఉన్న పదాది చ-/స-కారాన్ని బట్టి మూల ద్రావిడంలో ఈ ధాతువులో చ-కారం ఉండేదని ఊహించవచ్చు. దక్షిణ ద్రావిడ భాషలలోనూ, తెలుగులోనూ పదాది చ-/స- కారం లుప్తమవ్వడం క్వాచిత్కంగా కనిపిస్తుంది:

చమియు > అవియు, అవిసిపోవు (DEDR 2341)
చవియల్/చావల్ > అవియల్ = దంచిన బియ్యం (DEDR 2391)
చాఱు > ఆఱు (six) (DEDR 2485)
చిరు > ఇరు > ఇరులు = చీకటి (DEDR 2552)
చిల్- > ఇల్ల > లే(దు) (DEDR 2559)
చీంతు (date-palm) > ఈంతు > ఈంచు (DEDR 2617)
చుప్పు > ఉప్పు (salt) (DEDR 2674)
ఈ ఆధారాలను బట్టి అల్లుడు పదానికి సంబంధించిన మూలధాతువు *చళ్- అని మనం పునర్నిర్మాణం చెయ్యవచ్చు. హింది మొదలైన భాషలలో కనిపించే సాలే (బావమరిది) కూడా ఈ పదానికి సంబంధించిందేనని ఊహించవచ్చు. మళయాళం భాషలో అళియన్ అంటే బావమరిది.

మగ/ఆడ: తమిళంలో ఆడవర్ అంటే మగవాళ్ళు అనర్థం; మగళిర్ అంటే మగువలు అని అర్థం. ఆ ఆడవరికీ మన ఆడవాళ్ళన్న పదానికీ ఏమైనా సంబంధం ఉందా అని అవినేని భాస్కర్ గారు సందేహం వెలిబుచ్చారు.

ఆడవన్/ఆండవన్ అన్న పదాలకు, ఆడ/ఆండ పదాలకు సంబంధం లేదు. అవి రెండు వేర్వేరు ధాతువులనుండి వచ్చాయి. ఆడ అన్న పదానికి మూలం ఆండ అన్న పదం. కొండ భాషలో ఇప్పటికీ ఆండు అంటే స్త్రీ. మన సాహిత్యంలో కూడా పూర్వం ఆఁడ అనే రాశారు. తెలుగు భాషాపదాల్లో అరసున్న చాలావరకు ఆ పదాల్లో ఒకప్పడు నిండుసున్నతో పలికేవారని సూచిస్తుంది. తెలుగులో దీర్ఘము మీది అనునాసికము లుప్తమవ్వడం మనకు తెలిసిన ధ్వని పరిణామమే!

తోంట > తోఁట > తోట
మూండు > మూఁడు > మూడు
ఏండు (year) > ఏఁడు > ఏడు
ఆండు > ఆఁడు > ఆఁడ
ఇప్పటికీ, బహువచనాలలో కనిపించే ఏండ్లు, ఆండ్రు (స్త్రీలు, భార్యలు) మొదలైనవి వాటి పూర్వ రూపాలలో ఒకప్పుడు నిండుసున్న ఉండేదన్న అభిప్రాయాన్ని ధ్రువపరుస్తున్నది.

ఆడవన్/ఆండవన్ పదాలు *యాణ్డ- (to rule, to own) అన్న ధాతువు నుండి వచ్చాయి. అయితే, య-కారముతో ప్రారంభమయ్యే మూల ద్రావిడ ధాతువులు తెలుగు వంటి దక్షిణమధ్య ద్రావిడ భాషలలో ఏ-కారంగా మారితే, తమిళాది దక్షిణ ద్రావిడ భాషలలో ఆ-కారంగా మారాయి కాబట్టి మనకు ఈ రకమైన అయోమయం ఏర్పడుతుంది.

కొన్ని ఉదాహరణలు:

యాఱు ‘river’ > ఆఱు (తమిళం) – – ఏఱు (తెలుగు)
యాన ‘elephant’ > ఆనై (త.) – – ఏనుగు (తె.)
యాೞು ‘to cry’ > ఆೞು (త.) – – ఏೞು(చు) > ఏడుచు (తె)
యాట ‘ram, she-goat’ > ఆటు (త.) – – ఏట (తె.)
యాణ్ట- ‘to rule, to be the master’ > ఆణ్డ-> ఆణ్డవన్/ఆడవన్ => ruler, God – – ఏలు (తె.) => ఏలిక (ruler)
కాబట్టి తమిళంలో ఆణ్డవన్/ఆండవన్ అంటే తెలుగులో ఏలిక అని అర్థం. దానికి ఆడ పదానికి ఏ సంబంధం లేదు.

ఇక మక-/మగ- అన్న ధాతుప్రయోగాలు సంతానానికి (కొడుకు/కూతురు) వాడినట్టు ఇతర భాషల ద్వారా మనకు తెలుసు. కన్నడ, తమిళాదులలో మగ+అన్ఱు = మగన్ఱు అంటే మగబిడ్డ, మగ+ అళు- = మగళు అంటే ఆడబిడ్డ. మగన్ఱు అన్న పదంతెలుగు భాషలో మనకు ‘కొడుకు’ అన్న అర్థంలోనే కాకుండా, పురుషులందరికీ వర్తించే విధంగా మారిపోవడం, అంతేకాక మగడు అంటే భర్త అన్న అర్థంలో స్థిరపడిపోవడం తెలుగులో విశేషం.

మగడు/పెళ్ళాం: మగ- శబ్దం నుండి మగడు అన్న అర్థం సాధించడం పైన చూశాం. పెళ్ళాం అన్న పదం స్త్రీ అన్న అర్థం ఉన్న *పెణ్- అన్న మూల ధాతువునుండి వచ్చింది. పెండిలి/పెండ్లి అన్న పదం కూడ *పెణ్- అన్న పదానికి సంబంధించిందే. పెనిమిటి అంటే *పెణ్- + *మేటి/మిటి = స్త్రీ పై అధికారి/స్వామి అంటే భర్త.

మనుమడు/మనుమరాలు: మనుమ- అన్న పదాంశానికి -అండు అన్న పురుషవాచక ప్రత్యయము, -ఆలు అన్న స్త్రీ వాచక ప్రత్యయము జతచేయడం ద్వారా ఈ పదాలను సాధించవచ్చు. అయితే, మనుమ- అన్న పదాంశం మను- (= జీవించు, వృద్ధి నొందు) అన్న ధాతువుకు సంబంధించిందో కాదో అంత సులభంగా వివరించలేం. నిజానికి మఱు- అన్న ఉపసర్గకు మగండు (కొడుకు) అన్న ధాతువు చేర్చడం ద్వారా మఱుమగండు అయ్యిందని, అది మనుమండు గా ఆపై మనుమడుగా రూపాంతరం చెందిందని చెప్పడం సులభం. తమిళంలో మేనల్లుడిని మరుమకన్ లేదా మరుమాన్ అని అంటారు.

వియ్యంకుడు/వియ్యంకురాలు: వియ్యము అన్న పదం పెళ్ళికి సంబంధమైనది. నెయ్యము, కయ్యము లాగా ఇది కూడా ద్రావిడ పదమేనని అనిపిస్తుంది కాని, వివాహ- అన్న సంస్కృత పదం వియాహా అని వియ్యఆ అన్న ప్రయోగాల రూపంలో ప్రాకృతంలో కనిపించడంతో ఇది వివాహ- శబ్దభవమనే చెప్పుకోవాలి. నెయ్యము అన్న పదం కూడ స్నేహ- అన్న సంస్కృతపదం నుండి నిష్పన్నం చేసే వాదాలున్నాయి. దాని గురించి మరెప్పుడైనా.

సడ్డకుడు/సడ్డకురాలు: తెలంగాణాలో తోటి అల్లుడిని సడ్డకుడు/షడ్డకుడు అని, తోటి కోడలును సడ్డకురాలు అని అంటారు. దీనికి మూలం సంస్కృతం లోని సడ్ఢకః- శబ్దం అని చెబుతారు కానీ సడ్ఢకః అన్న పదానికి ధాతువును సంస్కృతంలో వివరించడం కొంచెం కష్టం. ఈ పదానికి అసలు మూలం మరో దేశభాష అయ్యే అవకాశం ఉంది.

ఆశ్చర్యార్థకాలను, హర్షాతిరేకాలను, బాధను దుఃఖాన్ని తెలిపేటప్పుడు బంధుత్వ పదాలను వాడడం ద్రావిడ భాషల ప్రత్యేకత అని మీకు తెలుసా? దెబ్బ తాకితే ‘అమ్మో!’ అంటాము. జాలి చూపడానికి ‘అయ్యయ్యో!’ అంటాము. అలాగే ఆశ్చర్యానికి ‘అబ్బో!’ అంటాము. పని పూర్తి కాగానే ‘అమ్మయ్య!’ అని నిట్టూరిస్తాము. ఏదైనా వింత విషయం చెప్పి బుగ్గలు నొక్కుకోవడానికి ‘ఔరా, అమ్మక్కచెల్లా’ అని అమ్మను, అక్కను, చెల్లిని తలచుకుంటాము. ‘అన్నన్నా ఎంతమాట!’ అంటాం. అలాగే, ‘అమ్మో’, ‘అబ్బో’, ‘అబ్బా’, ‘అబ్బబ్బా’, ‘అబ్బే’, ‘అయ్యబాబోయ్’, ‘అయ్యారే’ అంటూ తల్లిదండ్రులను తలచుకుంటూనే ఉంటాం.

దీని గురించి మా వేలూరిగారు ఎప్పుడూ చెప్పే సరదా కథ: మాస్కోలో ఒకసారి ఒక తెలుగువాడు స్విమ్మింగ్ పూల్ పక్కనుండి నడుస్తూ వెళ్తూ కాలు జారి స్విమ్మింగ్ పూలులో పడ్డాడట. వాడికీత రాదు. పడగానే వాడు భయంతో పెద్దగా “వామ్మోవ్, నాన్నోవ్, చస్తినోవ్” అని అరిచాడట. అక్కడే ఉన్న ముగ్గురు రష్యన్లు గబగబ వచ్చి వాణ్ణి రక్షించి పైకి తీశారట. ఆ తర్వాత వాణ్ణి అడిగారట: “సరే గానీ, నీకు మా పేర్లెలా తెలుసు?”
---------------------------------------------------------
రచన: సురేశ్ కొలిచాల, 
ఈమాట సౌజన్యంతో

No comments: