Monday, March 18, 2019

యథార్థ చక్రం – 2


యథార్థ చక్రం – 2



సాహితీమిత్రులారా!

ఆధారం: అశ్వఘోష విరచిత సౌందర నందం (సంస్కృత మూలం)
నిన్నటి తరువాయి...................

నందుడి రథం బుద్ధుని కుటీరం వైపుగా వెళుతోంది.

బుద్ధుని కుటీరం సమీపంలో అనేకమంది కపిలవస్తు ప్రజలు బుద్ధుని చుట్టూ గుమిగూడారు.

తథాగతుని ఆశీర్వచనాల కోసం భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేస్తున్నారు.

నందుడు దూరం నుండే బుద్ధుడ్ని చూసాడు. రథం దిగి వడి వడిగా అటువైపుగా వెళ్ళాడు. ప్రజల మధ్యనుండి బుద్ధుడు తన కుటీరం లోపలకి వెనుదిరిగాడు.

పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బుద్ధుని అనుసరించాడు.

నందుని రాకను బుద్ధుడు గమనించనట్లుగా ముందుకు నడుస్తున్నాడు. ఒక్క ఉదుటన నందుడు బుద్ధుని దాటి ముందుకెళ్ళి పాదాలపై మోకరిల్లాడు.

మోకాళ్ళపై వంగి రెండు చేతులెత్తి నమస్కరించి గద్గద స్వరంతో, మరదలు ఇచ్చిన భిక్షని స్వీకరించమని ప్రాధేయ పడుతూ –

” ఓ సాధుశ్రేష్టుడా ! మా పై కటాక్షించి భిక్షకై మీరు రాజమందిరం రావడం గమనించనందుకు మా పొరపాటును క్షమించండి. నా తప్పుని తెలుసుకొని, స్వయంగా మిమ్మల్ని రాజమందిరం తోడ్కొని పోవడానికై విచ్చేసాను. నాపై కరుణించి మా ఆతిధ్యాన్ని స్వీకరించండి. అపరాహ్ణ వేళ కావస్తోంది. మేమిచ్చే భిక్షను స్వీకరించండి.” అంటూ పలికాడు.

పశ్చాత్తాప భరితమైన నందుడి స్వరం విని ఒక్కసారి నందుడి కేసి చూసాడు బుద్ధుడు.

ఈ వేళకి ఇక ఆహార కార్యక్రమం లేదన్నట్లుగా సంజ్ఞ చేసాడు.

మంచిది అనుకుంటూ బయల్దేరాడానికి సిద్ధమయ్యాడు నందుడు. బయల్దేరేముందు బుద్ధుడికి పాదాభివందనం చేసి చేతులు జోడించాడు.

మందస్మిత వదనంతో మౌనంగా బుద్ధుడు బిక్షాపాత్రని నందుడి చేతిలో ఉంచాడు.

తేజోవంతమైన తధాగతుని చూపు నందుణ్ణి కట్టిపడేసింది.

నిశ్చేష్టుడై మౌనంగా బుద్ధుని కేసి చూస్తూ ఉండిపోయాడు. అనుగ్రహార్థం శుభసూచికంగా బుద్ధుడు తన చేతిలో ఉంచిన భిక్షా పాత్రకేసి చూసాడు నందుడు.

విషయం అర్థమయ్యింది.

తనకోసం ఎదురుతెన్నులు చూసే తన నెచ్చెలి గుర్తుకొచ్చింది.

ప్రియురాలి వ్యామోహంతో పరాశ్రితుడైన నందుడి మనసులో విషయ వాసనల బీజం తొలగించాలని సంకల్పించాడు బుద్ధుడు.

తన వెనుకనే రమ్మన్నట్లుగా చూపిస్తూ విహార వాటిక వైపుగా నడిచాడు.

దుఖపూరితమైన వదనంతో నందుడు గతిలేనట్లుగా బుద్ధుణ్ణి అనుసరించాడు.

అప్పుడు బుద్ధుడు బాధాతప్తుడైన నందుడి కేసి ఓ లిప్త కాలం చూసి, చక్రాంతమైన హస్తాన్ని నందుడి శిరస్సుపై ఉంచాడు.

ఒక్కసారి నందుడి వళ్ళు జలదరించింది. ఏదో తెలియని అతీత శక్తి తననాక్రమించుకుందన్న విషయం ఇంకా అవగతం కాలేదు.

దయాస్వరంతో బుద్ధుడు ఇలా అన్నాడు.

” ఓ ప్రియనందనా ! దుఖ హేతువైన కాలం నిన్ను ఆక్రమించుకోక ముందే నీ మనస్సుని శాంతి మార్గం వైపు లగ్నం చేసుకో ! ఎందుకంటే ఈ జగత్తులో ప్రతీ ప్రాణినీ మృత్యువు కాలసర్పంలా కాటేయక మానదు. కనుక స్వప్న భరితమైన సుఖోపభోగాలనబడే విషయ వాసనల వైపు మొగ్గే మనస్సుని అదుపు చెయ్యి. గాలి తాకిడికి కుదురులేని అగ్నిలా విషయవాసనలతో మనస్సు నిలకడ కోల్పోతుంది. మనిషికి శ్రద్ధని మించిన ధనంలేనట్లుగానే సుఖాలలో అధ్యాత్మికత మించిన సుఖం లేదు. అన్ని దుఖాలలో అవిద్యా రూపమైన జీవితం మించిన దుఖం మరొకటి లేదు. ఇంద్రియార్థ పూరితమైన ఈ మనస్సుని స్వాధీన పరచుకో ! నీ మనస్సు నీకు లొంగి ఉండాలి కాని కోరికలకి బానిస అవ్వడం ఎంత అనుచిత్యమో ఆలోచించు. ప్రాపంచిక సుఖాల గోడలు కూల్చి ముక్తి మార్గాన్ని చూడు. ప్రేమ అనే బంధం లో చిక్కుకోకు. ఎంత చవిచూసినా ప్రేమ తృష్ణ తీరదు. ప్రేమ, అనురాగం,వ్యామోహం – ఈ మూడూ లేని జీవితం అత్యంత సుఖప్రదాయమైనది. ప్రియమైన వారి వియోగం తప్పదు. దుఖం ఆవరించక మానదు. ఇది అనివార్యం. పాములుపట్టే వాడు చేతిలో పాముని చూసి భయపడనట్లుగా కోరికల సర్పాన్ని చూసి భయపడకూడదు. యోగాభ్యాసము, తత్వజ్ఞానం ఉన్న మనిషి మృత్యువుని చూసి చలించడు. కనుక ఈ సంసారం నుండి బంధ విముక్తుడివి కమ్మనమని ఈ దీవన ! ”

దయాళువైన బుద్ధుని ప్రవచనాలు విని, బాధాతప్తుడైన మనస్సు తో నందుడు ‘ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది’ అన్నట్లుగా శిరస్సు వంచాడు. మౌనమే అతని భాషగా మిగిలింది. అంతా లీలలా జరిగిపోతోంది. తను మాత్రం ఇక్కడా అడ్డు చెప్పలేకపోతున్నాడు.

అజ్ఞాన బంధ విముక్తుణ్ణి చేసే నిమిత్తమై నందుణ్ణి సన్యాస యోగ్యుడిగా తలచి ప్రేమపూర్వక హృదయుడై బుద్ధుడు పరివ్రాజక దీక్ష కై ఆనందుడనే ప్రియ శిష్యుణ్ణి ఆదేశించి వెళ్ళిపోయాడు.

ఆనందుడు తనని సమీపించగానే, తను సన్యాసం స్వీకరించను అని నందుడు తెగేసి చెప్పాడు.

ఆనందుడు ఈ నందుడి అభిప్రాయాన్ని తధాగతునికి వెంటనే విన్నవించాడు. బుద్ధుడు విషయం తెలుసుకొని మరలా నందుణ్ణి కలుస్తాడు.

” ఓ నందనా ! వ్రతపాలనాముఖులైన మన సోదరులైన ఎంతో మంది రాజ కుటుబీకుల్ని చూసి కూడా నీ మనస్సు మారలేదా? విషయ వాంఛలనుండి బయటకు రాలేవా? సంసార సుఖాలు ఈ మృత్యువుకి అతీతం కావు. మనస్సుని ఆవరించుకున్న కోరికలు వదిలి జ్ఞాన మార్గం వైపు మళ్ళించాలని అనిపించడంలేదా? నాలుగు వైపులా నిప్పంటుకున్న గృహంలో నిద్రించే వ్యక్తిలా నువ్వు ఈ కోరికల జ్వాలని తప్పించుకోలేవా? మూర్ఖత్వాన్ని మించిన మృత్యువు లేదు. అజ్ఞానాన్ని మించిన దుఖం మరొకటి ఉండదు. ”

బుద్ధుని ధర్మ ప్రవచనాలను విన్న నందుడి మనస్సు చలించింది.

బుద్ధుడు సూటిగా నందుడి కళ్ళలోకి చూసాడు. ఆ ఒక్క చూపే నందుడ్ని మరోసారి కట్టిపడేసింది.

బుద్ధుడ్ని కాదనే ధైర్యం కోల్పోయాడు నందుడు. తధాగతుని కాదనే స్థైర్యం లేక ఆ బోధనల ప్రభావానికి తలొగ్గాడు నందుడు.

“మీరు ఆశించినట్లుగానే జరుగుగాక!” అంటూ ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు నందుడు.

తనలో మానసిక పరివర్తన వచ్చిందోలేదో నందుడికి తెలియదు. అయిష్టతని ప్రకటించే శక్తిని కోల్పోయింది అతని మనసు.

అనంతరం ఆనందుడు కేశఖండనాదికం ప్రారంభించాడు. అది జరుగుతుంటే నందుడి కన్నులు అశ్రుపూరితాలయ్యాయి. తన శరీరంపై ప్రేయసి రాసిన చందన చర్చితాలు చూసి అతను దుఖం ఆపుకోలేకపోయాడు.

రాలిన కేశాల్లా కోరికలు బరువైన కన్నీళ్ళకి దోసిలొగ్గాయి.

*****************

ఇక్కడ రాజమందిరంలో –

నిరీక్షణలో అలసి పోయింది సుందరి. నిరీక్షణని మించిన నరకం లేదని అనుభవం చూపిస్తోంది.

కిటికీకి తన నిరీక్షణని వ్రేలాడేసింది. తన ప్రియ నందుడి పాద శబ్దం కోసం ఆమె చెవులు ఆత్రంగా వెతుకుతున్నాయి.

ఎదురుచూపులో జ్వలించిపోయింది సుందరి. చందన చర్చితాలు ఆరిపోయాయి. నిరీక్షణ శంక గా రూపాంతరం చెందుతోంది.

కిటికీ వద్ద నుంచుని నుంచుని కాళ్ళు నొప్పి పుట్టాయి. ఉన్నదున్నట్లుగా పడక మీద వాలిపోయింది. అడ్డదిడ్డంగా పడుక్కుంది. సగం జారి వ్రేలాడుతున్నాయి పాద రక్షలు.

ఒక చెలికత్తె అటుగా వచ్చింది. హాడావిడిలో పాదం త్రొటిల్లింది. ఆ చప్పుడికి ఒక్కసారి చివాలున లేచింది సుందరి. నందుడు వచ్చాడేమో అనుకొంది.

హతాశయై మరలా మంచమీద కొచ్చి వాలింది. చిగురాకుల్లాంటి చేతుల్లో ముఖం ఉంచుకొని ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు శోకసముద్రంలో మునిగిపోయాయి.

ఒక్కసారి స్త్రీ మనస్తత్వం పెల్లుబికింది. తన పాదాక్రాంతుడై నిరంతరమూ తన సాంగత్యంలో మునిగితేలే పతి గుర్తొచ్చి అనేక విధాల మనసు రోదించింది.

‘ఈ చందన చర్చితాలు తడి ఆరకముందే నీ సమక్షంలో ఉంటానని ‘ మాట ఇచ్చిన పతికి, మాట తప్పి తనను మించిన గొప్ప రాచ కార్యం ఏమొచ్చింది?

క్షణం కూడా విడిచి ఉండలేని అతను జాము గడియలు దాటినా రాలేదంటే ఏమిటి? నందుడికి తనపై విరక్తి కలుగలేదు కదా? మన్మధుడిలాంటి నందుడు నా కంటే అందగత్తె కంట బడ్డాడా? ఆమె అతన్ని వశం చేసుకొందా? ఈ లోపున నన్ను మరచిపోయాడా? పరిపరి విధాల మనసు శంకిస్తోంది.

తను అలంకరించుకుంటుంటే అద్దం పట్టుకొని సావధానంగా నిలబడ్డాడు. ఇప్పుడు అదే వ్యక్తి మరొక భామకి అద్దం పట్టుకొని నిలబడుతున్నట్లయితే అతనికీ అతని చంచల మనస్తత్వానికీ ఓ నమస్కారం.

అందరి పురుషుల్లా నందుడు కూడా మామూలు పురుషుడే ! ప్రేమించడం, పరిత్యజించడం అందరిలా అతనీకీ ఆ గుణం అబ్బిందా? సుందరిలో అసహనం పరాకాష్టకి చేరుకొంది. నందుణ్ణి పలురకాలుగా శపిస్తోంది. సుందరి విలపిస్తుంటే పరిచారికలు విలవిలాడిపోతున్నారు.

” ఓ రాకుమారీ ! అనవసరంగా మీ పతని దూషించవద్దు. నిన్ను వదిలే పరకాంత వైపుగా నీ ప్రియుడు వెళ్ళలేడు. ” అంటూ సావధాన పరుస్తూ –

” నీ సమక్షంలోనే ఆయన జీవితకాలం వెళ్ళబుచ్చాలన్న సంకల్పం నందుడిది. నీ సంతోషమే ఆయన సంతోషం గా జీవించే అతన్ని బుద్ధ భగవానులు దీక్ష ఇచ్చి సన్యాసిగా మలిచారు. ”

ఆ మాటలు విని సుందరి గుండె పగిలిపోయింది. సన్యసించారు అన్న పదం ఆమెకు పిచ్చెక్కేలా చేసింది. ఆమె రోదిస్తూ ఒక్కసారి నేలపై ఒరిగిపోయింది.

ఏద్చి ఏడ్చి ఆమె ముఖ ఎర్ర బారింది. అమ్మెకొక్కసారి పిచ్చెక్కినట్లయ్యింది. అరుస్తూ, రోదిస్తూ, విలపిస్తూ ఆమే ఆ రాజమందిరం దద్దరిల్లేలా ప్రవరితిస్తోంది.

సుందరి ప్రవర్తన చూసి పరిచారికలు హడలిపోయారు. వారిలో వయసు పైబడిన ఒక పరిచారిక సుందరిని అనుయాయించింది.

“నువ్వు ఓ రాజర్షి పత్నివి ! నువ్విలా దుఃఖించడం సబబు కాదు. ఓకవేళ నువ్వు అన్నట్లుగా ఏ పర స్త్రీ వ్యామోహంలో నందుడు పడితే నువ్వు ఏడ్చినా అర్థంవుంది. నీ భర్త ముక్తి మార్గం వైపు పయనించాడు. అతనికి ఏ కష్టం రాకుండా తధాగతుడు రక్షిస్తాడన్న నమ్మకం నా కుంది. నువ్వు రాజర్షి పత్ని వే కాదు – పతివ్రత కోవలోకి చెందే దానివి. విలపించి ప్రయోజనం లేదు ” అంటూ ఓదార్చేరు.

“అంతే కాదు. నిన్ను విడిచి నీ పతి ఉండలేడు. నీకోసం తప్పకుండా వెనక్కి వస్తాడు. ఇది సత్యం ! అతను ఆ ఆశ్రమంలో ఎక్కువ కాలం గడపలేడు ” సుందరి కాస్తా ఆశ కల్గించేలా చెప్పారు.

నందుడు తననుండి దూరం వెళ్ళిపోయాడన్న బాధతో సుందరి విలపిస్తూ మూర్ఛిల్లి పడిపోయింది.

అక్కడ – ఆ బౌద్ధా రామంలో నందుడి మనస్సు పరిపరి విధాల ఆక్రోశిస్తోంది.

తను సుందరి ముందు అద్దం పట్టుకోవడం, ఆమె చిలిపి చేష్టలు, ఆమె దొంగ కోపం, తనని పట్టించుకోనట్టి నటన, ఇవన్నీ అతని కళ్ళముందు మెదులుతున్నాయి.

మరలా తన శేష జీవితంలో సుందర్ని కలుస్తానా అని అనుకున్నాడు. అతని ఆలోచన నిజం అవుతుందని ఆ క్షణం అతనికి అనిపించలేదు. కానీ ఆ క్షణం అతనికి తెలియదు సుందరే నందుడికి మార్గదర్శకురాలవుతుందని. బహుశా సుందరి కలలో కూడా ఆ ఊహ తట్టి ఉండదు.
(ఇంకా ఉంది)
----------------------------------------------------------
రచన: సాయి బ్రహ్మానందం గొర్తి, 
ఈమాట సౌజన్యంతో

No comments: