Monday, March 11, 2019

సురపురం


సురపురం




సాహితీమిత్రులారా!


సురపురం. ‘ఏవిటీ పుస్తకం? దేనిగురించీ?’

‘మెడోస్ టైలర్ (Philip Meadows Taylor) అన్న పందొమ్మిదో శతాబ్దపు నైజాం ప్రభుత్వంలోని ఆంగ్ల అధికారి ఆత్మకథ ఈ సురపురం.


‘మెడోస్ టైలరా?! ఎవరతనూ? ఎప్పుడూ పేరు వినలేదే! సురపురం పేరూ విన్న గుర్తులేదు!! ఎక్కడుందా ఊరూ? ఆంగ్ల అధికారి ఆత్మకథకు సురపురం అన్న పేరేవిటీ? విచిత్రంగా ఉందే…’

హైదరాబాద్‌కు నైరుతి దిశలో 250 కిలోమీటర్లు, సింధనూరుకు ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరాన తెలుగు, కన్నడ, మరాఠా దేశాలు కలిసే ప్రాంతంలో, కృష్ణా-భీమ నదుల మధ్య భాగాన ఉన్న అతి చిన్న సంస్థానం సురపురం. ఆ పట్టణం ఇప్పటి పేరు షోర్‌పూర్. ఏభైవేల జనాభా. కర్నాటక రాష్ట్రంలో యాదగిరి తాలూకాలో ఉంది.

మెడోస్ టైలర్ అన్న ఆంగ్ల యువకుడు జీవనోపాధిని వెతుక్కుంటూ 1824లో భారతదేశం వచ్చాడు. కొన్నికొన్ని పరిస్థితులవల్ల తాను ముందుగా అనుకొన్నట్టు ఆంగ్ల వ్యాపార సంస్థలలోనో ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వంలోనో కాకుండా నిజాం ప్రభుత్వ అధికారిగా సురపురం సంస్థానంలో చేరి పదిపదిహేనేళ్లపాటు పనిచేశాడు. ఆరోగ్య కారణాలవల్ల 1860లో- ఏభైరెండేళ్ల వయస్సులోనే – పదవీవిరమణ చేసి స్వదేశం వెళ్లాడు. తన ఆత్మకథను ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అంటూ రాశాడు. 68 ఏళ్ల వయసులో మరణించాడు. ఆ ఆత్మకథకు తెలుగు రూపం సురపురం.

కల్నల్ మెడోస్ టైలర్ 1808లో లివర్‌పూల్‌లో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. తాత మతగురువు. తండ్రి వ్యాపారి. ఆ వ్యాపారం దెబ్బతినగా కుటుంబమంతా ఊళ్లు మారారు. ఇళ్లు మారారు. బీదరికం అనుభవించారు. ఆ ఒడిదుడుకుల మధ్య సాగీసాగని అంటీఅంటని చదువు. కొంతకాలం బోర్డింగ్ స్కూల్లో… అది నచ్చక పారిపోవడం… బాగా చిన్నవయసులోనే ఒక అతిచిన్న ఉద్యోగంలో చేరడం, అందులో రాణించడం, అందువల్ల సహోద్యోగుల అసూయకు గురికావడం, ఉద్యోగం వదిలెయ్యడం… అనారోగ్యం… మళ్లా బాక్సర్ అనే వ్యాపారికి బొంబాయిలో ఉన్న కార్యాలయంలో ఉద్యోగ అవకాశం… ఇండియా ప్రయాణం… పదహారేళ్ల వయసులో బొంబాయి చేరడం…

నాలుగున్నర నెలల ఓడ ప్రయాణం తర్వాత 1824 సెప్టెంబరులో టైలర్ బొంబాయి చేరతాడే గానీ అనుకొన్నట్టుగా బాక్సర్ కంపెనీలో ఉద్యోగం స్థిరపడదు. మూడు నెలల ఊగిసలాట తర్వాత, అప్పటికే అక్కడ పనిచేస్తోన్న ఓ మేనమామ వరస ఉన్నతాధికారి పుణ్యమా అని నిజాం ప్రభుత్వ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఉద్యోగం దొరుకుతుంది. ఔరంగాబాద్‌లో 1824 డిసెంబర్‌లో ఉద్యోగంలో చేరతాడు. వేటాడటం, హిందీ భాష నేర్చుకోవడం, చిత్రలేఖనం, స్థానిక తిరుగుబాట్లను అణచడం, అనారోగ్యం, సర్వేయింగ్ నేర్చుకోవడం, పై అధికారుల నమ్మకం అభిమానం సంపాదించడం, అవకాశాలు అందినట్టే అంది చేజారిపోవడం, కార్యరంగం హైదరాబాదుకు మారడం, ఓ విశాలమైన ప్రాంతానికి పోలీసు సూపరింటెండెంటుగా వెళ్లడం, మరాఠీ తెలుగు కన్నడ భాషలు నేర్చుకోవడం, సున్నితమైన స్థానిక సమస్యలను మానవీయతతో కూడిన చాకచక్యంతో పరిష్కరించడం, అవసరమైనచోట సాహసించడం, అనుకోని పరిస్థితులవల్ల నైజాం ప్రభుత్వపు ఉద్యోగం అయోమయంలో పడటం, మళ్లీ నిలబడటం, నిజాం దృష్టిలో టైలర్ పడడం, నిజాం తమ్ముడు చేసిన తిరుగుబాటును ధైర్యంగా పరిష్కరించడం, సాటి సైనికులంతా ‘మహదేవబాబా’ అంటూ జయజయధ్వానాలు చెయ్యడం, ఆ పేరూ బిరుదూ జీవితాంతం నిలబడిపోవడం– ఇవన్నీ జరిగేసరికి టైలర్ వయస్సు ఇంకా పాతిక నిండనేలేదు. కానీ బాల సైనికుడు యువ అధికారిగా పరిణతి చెందిన సమయమది. హైదరాబాద్‌లోనే ఉండే ఓ ఆంగ్లో ఇండియన్ అధికారి కూతురును పెళ్లిచేసుకొని గృహస్థుడయిన సమయమది.

వ్యక్తిగా ఎంత ఎదిగినా, ఉద్యోగపరంగా ఎన్ని బాధ్యతలు నిర్వహించినా, టైలర్ కుటుంబ జీవితం ఒడిదుడుకులమయం. తనలాగే భార్యకూ నిరంతర అనారోగ్యం. పుట్టిన ఇద్దరు బిడ్డలూ చిన్నవయసులోనే పోవడం… తనకు కూడా నిలకడలేని ఆరోగ్యం… తరచుగా జబ్బుపడటం– పన్నెండేళ్ల కొలువు తర్వాత లెఫ్టినెంట్ నుంచి కెప్టెన్‌గా పదోన్నతి పొందాక పరిస్థితులను చక్కబరచుకోవడం కోసం మూడేళ్ల శెలవు తీసుకొని 1838-40ల మధ్య ఇంగ్లండ్ చేరడం… అప్పటికి పదేళ్ల క్రితమే తాను అనుమానించినట్టు గొలుసు హత్యలు చేసిన ముఠాలవాళ్లు థగ్గులేనని కాలక్రమేణా తేలడం, ఆయా ఘాతుకాల గురించి ఓ వ్యాసం రాయగా దాన్ని చూసినవాళ్లు మరికొన్ని వివరాలు జోడించి నవలగా రాయమని టైలర్‌ను ప్రోత్సహించడం… తనకున్న సమాచారమూ అనుభవాల నేపథ్యంలో కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్ అన్న పుస్తకం రాయడం, దానినో ప్రచురణకర్త స్వీకరించడం… భారతదేశపు స్థితిగతుల గురించీ, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధపు విషయాల గురించీ వ్యాసాలు రాయడం, పుస్తకాలకీ వ్యాసాలకూ ఆదరణ లభించడం, కుటుంబంతో పునఃసంథానం, మరికొన్ని పుస్తకాలు రాయమని ప్రచురణకర్తలు అడగడం, ఇంగ్లండులోని ఉన్నత అధికారులను కలుసుకోవడం, రాణిగారితో ముఖాముఖి– మానసికంగా శారీరకంగా స్వస్థత పొంది తిరిగి భారతదేశానికి తిరిగిరావడం…

భారతదేశానికి తిరిగివచ్చిన కొద్దికాలానికే టైలర్‌కు ఆర్థికంగా రాజకీయంగా ఒడిదుడుకులమయంగా ఉన్న సురపురం సంస్థానానికి నైజాం ప్రభుత్వపు రాజప్రతినిధిగా వెళ్లవలసిన అవసరం వస్తుంది. హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెంట్ కూడా తనమీద నమ్మకముంచి అక్కడికి వెళ్లమని అడిగినపుడు ఆ చిక్కుముడుల సంస్థానానికి వెళ్లడమన్నది ఒక సవాలుగా, ఒక అవకాశంగా తీసుకొని, 1844లో అక్కడికి చేరతాడు మెడోస్ టైలర్.

ఆమధ్యే మరణించిన రాజా, వారసుడిగా ఏడేళ్ల కొడుకు, ఆధిపత్యం కోసం దాయాదుల పోరు, కొడుకు తరఫున సంస్థానాన్ని ఏలసాగిన రాణి ఈశ్వరమ్మ, ఆవిడ నిలకడలేనితనం, దివాళా తీస్తోన్న సంస్థానం, పరిస్థితులను ఒక కొలిక్కి తీసుకువచ్చి టైలర్ ఆ యువరాజుకు పట్టాభిషేకం జరిగేలా చూడటం… ఆ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న బేడర్లు అని పిలవబడే బోయదొరల తిరుగుబాటు, తనకు ముప్పయ్యారేళ్ల వయసులోనే భార్య మరణించడం… రాజకుమారుణ్ని తొలగించేయాలన్న దాయాదుల కుట్రలు, నిబద్ధతతో మెడోస్ టైలర్ వాటిని పూర్వపక్షం చెయ్యడం… రోడ్లు వెయ్యటం, నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం, చెట్లు నాటించడం, పాఠశాలలు స్థాపించడం లాంటి విషయాల్లో దృష్టి నిలపడం… పదేళ్లపాటు ఆ సంస్థానంలో ‘భారతదేశపు జీవన వైవిధ్యాల మధ్య ఒక ఇంగ్లీషు మనిషి జీవితం– మనోజ్ఞమైన అనుభూతి.’

నిజాం ప్రభుత్వం బ్రిటిషువారికి దత్తం చేసిన అయిదు జిల్లాల్లో ఒకదానికి పరిపాలకుడిగా నియమిస్తున్నామని హైదరాబాదులోని రెసిడెంటునుంచి కబురు రాగా సురపురం వదిలి హైదరాబాదు చేరతాడు టైలర్. చివరికి నవ్‌దుర్గ్‌లో నియామకం, వేలవేల చిక్కులున్న ఎల్లలు కూడా స్పష్టంగాలేని 15వేల చదరపు మైళ్ల ప్రాంతాన్ని చిన్న పదాతిదళం సహాయంతో పరిపాలించవలసి రావడం; పరిపాలన, న్యాయవిచారణ, నీటి పారుదల, పత్రికారచన, శాంతి పరిరక్షణ, పన్నుల వసూలు, రోడ్ల నిర్మాణం– ఇలా విరామమెరుగని జీవితంతో, రోజుకు పదిహేను గంటలు పనిచేస్తూ, ఆ పనిని ఆస్వాదిస్తూ… అలా మూడేళ్లు… 1856… ఎప్పుడు వచ్చిందో తెలియని నడివయస్సు! 1857నాటి నేపథ్యంలో ఒడిదుడుకులకు గురి అయిన బిరార్ జిల్లాకు బదిలీ. 1858 నాటికి మళ్లా సురపురంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించుకుంటూ అక్కడికి కమిషనర్‌గా బదిలీ…

ఒకప్పటి పసి రాజకుమారుడు 1857కల్లా విచక్షణ లేని దుస్సాహస యువకుడిగా తిరుగుబాటులో భాగస్వామి అవగా, బ్రిటిషువారు అతగాడిని బందీని చేసి మరణశిక్ష అమలుపరచబోతున్న సమయమది. తన చేతులమీద పెరిగిన రాజకుమారుడ్ని ఉరికంబం నుంచి రక్షిద్దామని టైలర్ ప్రయత్నాలు… స్వాభిమాని అయిన రాజకుమారుడు అందుకు అంగీకరించకపోవడం… అయినా రెసిడెంటు ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం… తన మీద తనకే విరక్తి కలిగిన రాజకుమారుని ఆత్మహత్య. ఏడాదీ రెండేళ్లలో చల్లబడిన 1857నాటి ఉద్రిక్తత.

మళ్లా ఇబ్బంది పెడుతోన్న అనారోగ్యం పుణ్యమా అని టైలర్ రెండేళ్ల శెలవు మంజూరు చేయించుకొని 1860లో ఇంగ్లండ్ వెళతాడు. ‘ప్రజలకు ఇంత చేశావుగదా, ప్రతిఫలం ఏం దొరికిందీ?’ అని ఎవరో స్నేహితులు అడిగితే, ‘నా ఆనారోగ్యం పుణ్యమా అని నేను చెయ్యవలసినంత చెయ్యనేలేదు. అయినా శెలవు తర్వాత తిరిగివెళ్లి ప్రజల మధ్య పనిచేస్తూనే చచ్చిపోవాలని నా కోరిక’ అంటాడు మెడోస్ టైలర్! కానీ రెండేళ్ల శెలవు తర్వాత కూడా తన ఆరోగ్యం కుదుటబడకపోవడంతో ‘భగవంతుని నమ్ముకొని ఉద్యోగానికి రాజీనామా’ఇస్తాడు టైలర్. తన అనుభవాలను తార, రాల్ఫ్ డార్నెక్, సీత, ఎ నోబుల్ క్వీన్ అన్న నవలలుగా 1860లు, 70లలో రాస్తాడు. 1874-75లలో ఆరోగ్యం మరింత క్షీణించగా మార్పు కోసం– బహుశా భారతదేశం అంటే ఉన్న మమత వల్ల కూడా కావచ్చు– 1875 సెప్టెంబరులో హైదరాబాదుకు ప్రయాణం కట్టి, అక్కడో అయిదు నెలలు గడిపి, ఇంగ్లండు తిరుగుప్రయాణం ఆరంభిస్తాడు. ఇంగ్లండు చేరే లోపలే 1876 మే నెలలో 68 ఏళ్ల వయసులో మరణిస్తాడు.

తన జీవితానుభవాలను కల్నల్ ఫిలిప్ మెడోస్ టైలర్ తన అక్షరాలలోనే 1874 వరకూ రాసుకొన్నాడు. 1874-76 సమయపు వివరాల చిట్టచివరి అధ్యాయాన్ని అతని కూతురు ఎలీస్ రాసింది. ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అన్న ఆ ఆత్మకథ 1882లో ప్రచురితమయింది. దానిని జర్నలిస్టు జి. కృష్ణ తెలుగు చేసి 1986లో సురపురం పేరిట ప్రచురించారు. తిరుపతిలోని రాజాచంద్ర ఫౌండేషన్ మళ్లీ 2011లో ప్రచురించారు.

మెడోస్ టైలర్ జీవితమూ సురపురం పుస్తకమూ అనేక విధాలుగా విలక్షణమైనవి.

1757లో ప్లాసీ యుద్ధం (Battle of Plassey) తర్వాత భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ రూపంలో బ్రిటిషువారి పాలన ఆరంభమయింది. మరాఠా దేశం, పంజాబు లాంటి ప్రాంతాల్లో వారి ఆధిపత్యం కొనసాగడానికి మరో యాభై అరవై ఏళ్లు పట్టింది. 1857లో వారి నూరేళ్ల ఆధిపత్యానికి పెనుసవాలు ఎదురయింది. ఆ తర్వాత కానీ వారి సంపూర్ణ సార్వభౌమత్వం స్థిరపడలేదు.

1825-60 నాటి సమయమూ అంటే ఒక సమాంతర రాజకీయ, న్యాయ, విద్యా, పరిపాలనా వ్యవస్థ వేల సంవత్సరాల సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, మత నేపథ్యం గల విశాల ప్రాచ్య భూఖండంలో వేరూని నిలదొక్కుకున్న సమయమన్నమాట. ఆ సమయానికీ ఆయా పరిణామాలకూ ప్రత్యక్ష సాక్షి మెడోస్ టైలర్ ఆత్మకథ సురపురం!

సురపురంలో మొదటగా మనకు రాజా రామ్మోహన్‌రాయ్‌కు సతి నిషేధంలో మద్దతు పలికిన గవర్నర్ జనరల్ లార్డ్ విలియమ్ బెంటిన్క్ (William Bentinck) కనబడతాడు. 1835లో మెడోస్ టైలర్ నీలగిరుల్లో విశ్రాంతి కోసం వెళ్లినపుడు అక్కడే మకాం చేస్తోన్న బెంటిన్క్‌ను కలిసే అవకాశం వస్తుంది. అక్కడే పరిచయమయిన మెకాలే (Thomas Mccaulay) ప్రస్తావన వస్తుంది. బెంటిన్క్ గురించి ‘తనకు అప్పగించిన ప్రభుత్వ వ్యవస్థలో మేధాపటిమను, నీతిని పరివ్యాప్తం చేయడానికి నిరంతర కృషి చేసిన వ్యక్తి.’ అని మెకాలే అనడం కనబడుతుంది. భారతీయులు ఉన్నత నాగరికత కలవారని, వారు ఇంగ్లిష్ వారంతటి వారేననీ 1838లో టైలర్ భావించడం కనిపిస్తుంది.

లార్డ్ వెల్లింగ్‌టన్‌తో మరాఠా యుద్ధం కబుర్లూ, టిప్పు సుల్తాన్ కబుర్లూ చెప్పుకోవడం కనిపిస్తుంది. అలాగే నిజాం దగ్గర మంత్రిగా ఉన్న సూరజ్ ఉల్‌ముల్క్ చనిపోగా అతని మేనల్లుడు సాలార్‌జంగ్ మంత్రి అవడం గురించి తెలుస్తుంది. నిజాం ప్రభుత్వం ఆర్థిక ఒడిదుడుకుల వల్ల కొన్ని జిల్లాలను బ్రిటిషువారికి దత్తం చెయ్యడం, డల్‌హౌసీ ప్రభువు జౌధ్ లాంటి రాజ్యాలను బ్రిటిష్ ప్రభుత్వంలో చేర్చుకున్న వైనం– ఆనాటి అనేక సంఘటనలకు సాక్షీభూతం మెడోస్ టైలర్, అతని జీవిత చరిత్ర. మన దేశ చరిత్రలలో డల్‌హౌసీ ప్రభువు గురించి చిత్రించిన విధానానికి విరుద్ధంగా ‘భారతదేశాన్ని పాలించినవారిలో డల్‌హౌసీ అంతటి ప్రయోజకుడు, విధినిర్వహణా ఆసక్తుడు లేడనే చెప్పాలి. ఏ పథకాన్ని తలపెట్టినా అభ్యుదయకరంగా నిర్వహించేవాడు. భారతదేశంలో నెలకొన్న అన్ని ఆధునిక సౌకర్యాలకూ, ప్రజల అభ్యున్నతికీ అతనే మూలకారకుడు.’ అంటాడు టైలర్.

రచయితగా టైలర్‌లో రెండు పార్శ్వాలు కనిపిస్తాయి: వ్యాసకర్త, నవలాకారుడు. థగ్గులు, భారతీయ విద్యావిధానంలాంటి అనేకానేక విషయాలమీద భారతీయ పత్రికల్లోనూ, ఇంగ్లండ్‌లోని పత్రికల్లోనూ తరచూ రాశారాయన. ఆయన వ్యాసాలు తమ పాఠకులకు నచ్చడంతో టైమ్స్ పత్రిక వారు ఆయన్ను ప్రత్యేక విలేఖరిగా నియమించుకున్నారు. సాలుసరి వరుమానమూ ఏర్పాటుచేశారు.

గ్రంథకర్తగా 1839లో మొదలయిన ఆయన ప్రయాణం పాతికేళ్ళపాటు సాగింది. ఆరోగ్య కారణాలవల్ల 1861లో ఉద్యోగానికి వీడ్కోలుచెప్పినా రచన పట్ల ఆయన అనురక్తి ఏమాత్రం సడలలేదు. వైద్యుల అనుమతితోనే తాను అప్పటికే ఇరవై ఏళ్లనుంచీ మనస్సులో రూపురేఖలు కల్పించుకొంటూ వచ్చిన తార అన్న నవల రాయడానికి పూనుకొన్నారు. మరాఠారాజ్య ప్రాదుర్భావం, వారు ముసల్మానుల మీద దెబ్బదీయడం– అన్న ప్రధాన ఇతివృత్తంతో తార నవల రూపుదిద్దుకొంది. 1869లో అది ప్రచురించబడింది.

అదే ఒరవడిలో మరో మూడు నవలలు రాశారు టైలర్. 1757లో ప్లాసీ యుద్ధంలో గెలుపొందిన బ్రిటిషువాళ్లు క్రమక్రమంగా తమ అధికారాన్ని ఎలా విస్తరించారో ఆ వివరాలను చూపెట్టే నవల రాల్ఫ్ డార్నెల్. 1865లో వెలువడిన ఈ నవల పాఠకుల మెప్పు పొందింది. 1857లో జరిగిన తిరుగుబాటు మూడవ నవల సీత ఇతివృత్తం. ఇది 1874లో ప్రచురితమయింది.

1874-75ల మధ్య అనారోగ్యం బాగా వేధించినా, చాంద్ బీబీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఎ నోబుల్ క్వీన్ అన్న నవల రాశారు. అలాగే 1871లో ఆయన రాసిన ‘విద్యార్థుల కోసం భారతదేశ చరిత్ర ‘(A student’s manual of the history of India) గ్రంథం వెలువడింది. భారతీయ ప్రజలను గురించి ఎనిమిది సంపుటాల గ్రంథావళి రాశారన్న వివరమూ ఆయన ఆత్మకథలో ఉంది. రాయడమే కాకుండా ‘భారతీయులనూ భారతదేశాన్నీ ఇంగ్లండుకు సన్నిహితం చెయ్యాలి’ అన్న ఉద్దేశ్యంతో ఆయన అనేకచోట్ల ఉపన్యాసాలిచ్చారట. ‘భారతదేశ పురాణ సాహిత్యం’, ‘భారత గ్రామీణ ప్రజలు’, ‘కొందరు భారతీయ ప్రముఖులు’, ‘కొందరు భారతీయ ప్రముఖ మహిళలు’ – ఆయన ఉపన్యాసాల కొన్ని శీర్షికలు! ‘నాకు తెలిసిన ప్రజల గురించే రాశాను. గొప్పవారి గురించి రాస్తే జోబులు నిండేవేమో కాని ఆనందం ఉండేది కాదు కదా’ అంటారాయన.

పరిపాలన, రచన ఆయన అభిమాన విషయాలేగావచ్చు కానీ జీవితంలోని అనేక పార్శ్వాలను తడమటం ద్వారా, అనేక రంగాలలో అడుగుబెట్టి విలక్షణమైన కృషి చెయ్యడం ద్వారా తన జీవితానికి అనితర సాధ్యమనిపించే సార్థకతను సంతరించుకొన్న వ్యక్తి కల్నల్ టైలర్.

చిత్రలేఖనం ఆయన్ని చిన్నవయసులోనే ఆకర్షించి చివరిదాకా అనుసరించింది. 1865లో డబ్లిన్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో భారతీయ విభాగాన్ని నిర్వహించారాయన. ఆయనకు భాషలంటే ప్రేమ ఉంది. హిందుస్థానీ, పర్షియన్, మరాఠీ, తెలుగు, కన్నడ భాషలు నేర్చుకొన్నారు. ఒక భాష నేర్చుకొనేటప్పుడు కష్టపడైనా సరే నుడికారం నేర్చుకొని తీరాలి. సంబోధించే తీరుతెన్నులు విధిగా తెలుసుకోవాలి. పాటించాలి అని ఆయన నియమం.

తన బాధ్యతలలో భాగంగా గ్రామాల్నీ పొలాల్నీ సర్వే చేయవలసిన అవసరం వచ్చినపుడు దాన్నో మొక్కుబడి వ్యవహారంలాగాకుండా ఎంతో ఆసక్తితో చేశారాయన. ఆయన అనుసరించిన పద్ధతులు కాలక్రమేణా ఇతర ప్రాంతాలలో కూడా మార్గనిర్దేశం చేశాయి. అలాగే న్యాయవిచారణ కూడా తన బాధ్యత అయినపుడు నిజాయితీ, నిష్పక్షపాతం, నిక్కచ్చితనం- అన్న లక్షణాలను పరికరాలుగా చేసుకొని ఆ బాధ్యతనూ సమర్థవంతంగా ఆయన నిర్వర్తించారు. ఒక పరిపాలకుడిగా తన ప్రాంతాల్లోని సామాన్యుల జీవితాలను మెరుగుపరచడం కోసం జలవనరుల నిపుణుడి అవతారం ఎత్తి తటాకాల, జలాశయాల రూపకల్పనకు పూనుకొన్నారు. విధి నిర్వహణలో నిక్కచ్చితనం, నిర్మొహమాటం, నిజాయితీ, నిష్పక్షపాతం ఆయనకు దీపస్థంభాలయినా స్నేహం, సాయంచేసే గుణం, సామాన్యులతో కలసిపోగలగడం ఆయన జీవ లక్షణాలు.

సురపురం చదివితే ఒక అతి సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనం కనిపిస్తుంది. తనమీద తనకు నమ్మకం ఉన్న మనిషి, తనతోనూ పరిసర ప్రపంచంతోనూ సామరస్యం సాధించిన మనిషి– ఎన్ని గొప్ప పనులూ సాహసాలూ చెయ్యగలడో స్పష్టమవుతుంది. కీర్తీ, తన కృషికి సరిపడే జీతభత్యాలూ తనకు అందకపోయినా అలాంటి నిరాశల గురించి యథాలాపంగా, నిర్లిప్తంగా చెప్పే ఒక స్థితప్రజ్ఞత ఆయన జీవనసూత్రం.


ఇంత విశాలమైన జీవితం గడిపిన ఏ మనిషైనా ఆత్మకథ రాసుకొన్నప్పుడు లీలగానైనా ఆత్మస్తుతీ పరనిందా కనిపించడం సహజం. సురపురంలో వాటి ఆచూకీ దొరకదు. రచన నిండా నిజాయితీ ధగధగలాడుతూ కనిపిస్తుంది. రాసింది 1874లోనే అయినా చదివేటపుడు సమకాలీన రచన అనే అనిపిస్తుంది. నిరాడంబరమైన పదాలు, చిన్న చిన్న వాక్యాలు, పేదలు రైతులు స్త్రీలు జమీందార్లు రాజులు– ఇలా వివిధ వర్గాల మీద సమంజసమైన ఆరోగ్యకరమైన ఆలోచనా ధోరణి, జీవితమంటే సమగ్రమైన సమతౌల్య అవగాహన – ఈ భావనకు దోహదం చేస్తాయి. అదే కాలంలో జీవించి వ్యవహరించిన ఏనుగుల వీరాస్వామిగారి కొన్నికొన్ని భావాలతో (స్త్రీలు, నేరస్తులు…) టైలర్ భావాలను సరిపోల్చినపుడు ఈతని ఆలోచనాధోరణిలోని ఆధునికత తెలిసివస్తుంది.

‘విధి నిర్వహణకై కృషిచేసిన వ్యక్తిననే భగవంతుడు నన్ను సంభావించుగాక…’ అంటారాయన తన ఆత్మకథ చివరి వాక్యంలో. ‘భారతదేశం వెళ్ళేవారందరికీ ఒక మాట చెపుతాను. అక్కడివారిని మర్యాదగా చూడండి. వారు ఏ తరగతివారయినా మర్యాద ఇచ్చిపుచ్చుకోండి. గట్టిగా ఉండండి– క్రూరంగా వద్దు. వారి ఆత్మగౌరవాన్ని కించపరచవద్దు.’ అని హితోక్తి చెపుతారు. ‘ఓర్పుతో పట్టుదలతో పనిచేస్తే అన్ని చిక్కులూ తీరతాయి.’ అన్న అతి చిన్న పరిపాలనా సూత్రాన్ని జీవితాంతం నమ్మి విజయవంతంగా అనుసరించారాయన.

నూటఏభై రెండువందల ఏళ్లనాటి భారతదేశపు జనజీవన చిత్రణ. తెలుగు, కన్నడ, మరాఠా గ్రామసీమలతోపాటు బొంబాయి, హైదరాబాదు లాంటి నగరాల భౌగోళిక సాంస్కృతిక వివరాల దర్పణం. ఆనాటి రాజకీయాల సాధికార పరామర్శ. రూపుదిద్దుకొంటోన్న పాలనావ్యవస్థకు అక్షర రూపం. సంస్థానాధీశులూ, జమీందార్లు, నవాబులు, బోయ యోధులు, రౌడీలు, థగ్గులు, అరబ్బు సైనికులు, యూరోపియన్లు, యూరేషియన్లు నడయాడిన రంగస్థలం సురపురం పుస్తకం. బెంటిక్, మెకాలే, వెల్లింగ్టన్, డల్హౌసీ, నిజాం, సాలార్జంగ్, 1857 తిరుగుబాటు – ఇలాంటి అనేకానేక విషయాల ప్రత్యక్ష సాక్షి…

…సురపురం ఒట్టి ఆత్మకథ కాదు!

సురపురం చదవటమంటే ఒక సామాన్యుని అసామాన్య జీవితాన్ని అతడిని తోడుగా చేసుకొని గమనించడమే!
--------------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

No comments: