దిక్కులు, పక్కలు
సాహితీమిత్రులారా!
1. దిక్కులు
ప్రాచ్యవాచీ ప్రతీచ్యస్తాః పూర్వ దక్షిణ
పశ్చిమాః ఉత్తరా దిక్ ఉదీచీ స్యాత్
ప్రాచీ (తూర్పు), అవాచీ (దక్షిణ), ప్రతీచీ (పడమర), ఉదీచీ (ఉత్తర) అని నాలుగు దిక్కులని అమరం చెబుతోంది. అలాగే, ఈ నాలుగు దిక్కులకు మధ్య నాలుగు మూలలు. ఈ ఎనమిదింటికీ కలిపి ఎనమిది దిక్పాలకులు. ఈ దిక్పాలకుల వివరాలు కూడా అమరంలోనే ఆ తరువాతి శ్లోకంలో వివరిస్తారు.
ఇంద్రో వహ్నిః పితృపతిర్ నిరృతో వరుణో మరుత్
కుబేర ఈశః పతయః పూర్వాదీనామ్ దిశాం క్రమాత్
ఇంద్రుడు తూర్పు దిశకు అధిపతి. అగ్ని ఆగ్నేయానికి అధిపతి. యముడు దక్షిణానికి అధిపతి కాగా, నిరృతి నైరృతి దిశకు అధిపతి. వరుణుడు, పశ్చిమానికి, వాయువు వాయవ్యానికి అధిపతులు. ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశానుడు అధిపతులు.
నాలుగు దిక్కుల ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది, కానీ, ఆగ్నేయ, నైరృతి, వాయవ్య, ఈశాన్య మూలల ప్రస్తావన ఋగ్వేద సంహితంలో కనిపించదు. ఇంద్రుణ్ణి నాలుగు దిక్కులనుండి ఆవాహనం చేస్తూ పిలిచే ఈ శ్లోకం ఋగ్వేదసంహితలోని 8వ మండలంలోని నాలుగవ సూక్తంలోనిది.
యదింద్ర ప్రాగ్ అపాగ్ ఉదఙ్ న్యగ్ వా హూయసే నృభిః ।
సిమా పురూ నృషూతో అస్యానవేఽసి ప్రశర్ధ తుర్వశే ॥ (ఋగ్వేదం 8.4.1)
ఓ ఇంద్రుడా! ఫ్రాక్ (తూర్పు), అపాక్ (పశ్చిమ), ఉదఙ్ (ఉత్తర), న్యగ్ (పల్లపుదిశ = దక్షిణ) దిక్కులనుండి నిన్ను నరులు పిలుచుచున్ననూ, ఓ శ్రేష్టుడా, తుర్వశుని వద్దకు స్తోతృ ప్రేరితుడవై రమ్ము!
నాలుగు మూలలకు అధిపతులుగా వర్ణించబడే అగ్ని, నిరృతి, వాయువు, ఈశానుడు మొదలైన దేవతలు ఋగ్వేదంలో ప్రముఖమైన దేవతలే అయినా, నాలుగు మూలల ప్రస్తావన మాత్రం ఈవేదంలో కనిపించదు. నిజానికి ఈ దేవతల పేర్ల మీదుగానే నాలుగు మూలాల పేర్లు వచ్చాయని మీరంతా ఈ పాటికే కనిపెట్టేసి ఉంటారు.
అగ్ని (వృద్ధి రూపం) > ఆగ్నేయ
నిరృతి (వృద్ధి రూపం) > నైరృతి
వాయు (వృద్ధి రూపం) > వాయవ్య
ఈశాన (వృద్ధి రూపం) > ఈశాన్య
ఇక ప్రధానమైన నాలుగు దిక్కుల విషయానికి వస్తే, దిక్కులపేర్లలో ఆసక్తికరమైన పదం దక్షిణం. ఇండో-యూరోపియన్ భాషలన్నింటిలోనూ దక్షిణ దిశకు సంబంధించిన మాటలు సాధారణంగా కుడిచేతికి సంబంధించినవి కావటం విశేషం. సంస్కృతంలో దక్ష-/దక్షిణ- అంటే బలం కలిగిన- నేర్పుగల- కుడివైపు- అన్న అర్థాలు ఉన్నాయి. ఇంగ్లీష్‌లో నేర్పరితనము, నిపుణతను సూచించే dexter, dexterity, dexterous మొదలైన పదాలు ఈ ధాతువుకు సంబంధించినవే.
సంస్కృతంలో దక్షిణ హస్తం అంటే కుడిచెయ్యి. సూర్యుడు ఉదయించే తూర్పు వైపు నిలుచుంటే కుడి వైపు ఉండే దిక్కు కాబట్టి దక్షిణ దిశకు ఆ పేరు వచ్చింది. పాత ఐరిష్ భాషలో కూడా dess- అంటే కుడివైపు, దక్షిణ దిశ అన్న రెండు అర్థాలు ఉన్నాయి. అలాగే, వెల్ష్ భాషలో deheu- అంటే దక్షిణ దిశ, కుడివైపు అన్న రెండు అర్థాలు కనిపిస్తాయి. ఈ ఆధారాలను బట్టి ఇండో-యూరోపియన్ భాషలు మాట్లాడే వారు దిక్కులను సూచించడానికి సూర్యుడు ఉదయించే తూర్పుదిశ ప్రధానమైన దిశగా భావించేవారని మనం ఊహించవచ్చు. అందుకే ఇక్కడ ఇచ్చిన భారత ఉపఖండపటాన్ని తూర్పుదిక్కు ప్రధాన దిశగా ఉండేట్టుగా తిప్పి ఉంచామని పాఠకులు ఈపాటికే గ్రహించి ఉంటారు.
కుడివైపు దిశ దక్షిణమైతే, ఎడమవైపు దిశ ఉత్తరం కావాలి కదా? అయితే, సంస్కృతంలో ఉత్తర దిశను సూచించే పదాలకు ఎడమ- పదాలకు సంబంధం లేదు. కానీ, ఇరానీ భాషలో ఫోక్లా- అంటే ఉత్తరం, క్లే- అంటే ఎడమ-. అలాగే, వెల్ష్ భాషలో గోగ్లెడ్- అంటే ఉత్తరం, క్లెడ్- అంటే ఎడమవైపు. జర్మానిక్ భాషలలో *నూర్థ- అంటే North. కానీ ఉంబ్రియన్ భాషలో నెర్తు- అంటే ఎడమ- అని అర్థం.
సంస్కృతంలో ఉత్- అన్న ఉపసర్గ ఎత్తైన, ఉన్నతమైన- అన్న అర్థాలను సూచిస్తుంది. గాంధారం నుండి గంగానదీ తీరందాకా ఉత్తరాన కనిపించే మహోత్తుంగ హిమాలయ పర్వతాలు ఆ దిశకు కొండగుర్తుగా పనికివస్తాయి కాబట్టి ఇండో-ఆర్య భాషలలో ఉత్తర దిశను సూచించే ఉత్తర-, ఊదీచి- వంటి పదాలు ఎత్తైన- అన్న అర్థాలనే ధ్వనిస్తాయి.
ఇండో-యూరోపియన్ భాషలు మాట్లాడే వారికి తూర్పు ప్రధాన దిశ అనుకున్నాం కదా! కాబట్టి తూర్పు దిశను వారు ప్రాక్-దిశ, లేదా ప్రాచీన దిశ అని, పూర్వ దిశ అని పేరు పెట్టుకున్నారు. ఈ దిశకు సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న దిశ ప్రతీచీన దిశ లేదా, పశ్చాత్ దిశ.
ఇక దిక్కులకు సంబంధించిన అచ్చ తెలుగు పదాలను పరిశీలిస్తే మనకు వాడుకలో తూరుపు, పడమర అన్న రెండు దిక్కులకు మాత్రమే అచ్చతెలుగు పదాలు కనిపిస్తున్నాయి. అయితే, మిగిలిన ద్రావిడ భాషలను పరిశీలిస్తే ఉత్తరానికి వడ-, దక్షిణానికి తెన్– అన్న పదాలు మూలద్రావిడ భాషలో ఉండేవని మనం ఊహించవచ్చు.
పడమర– అన్నది మూలంలో *పడఞాఱు- లేదా *పడ-పల కావచ్చు. తమిళం, తోడా మొదలైన భాషలలో ఞాఱు- (న్యాఱు) అంటే వెలుగు, సూర్యుడు అన్న అర్థాలున్నాయి. కన్నడలో నెసఱు అంటే సూర్యుడు. మలయాళం భాషలో పడిఞాఱు అంటే అస్తమించే సూర్యుడు. కన్నడ భాషలో పడునేసఱు అంటే కూడా అస్తమించే సూర్యుడే. పడిపోయే సూర్యుని దిక్కు అని చెప్పటానికి వాడే *పడఞాఱు అన్న పదం తెలుగులో పడనాఱు గాను, ఆపై పడమరగాను మారి ఉండవచ్చు. తమిళంలో పడఞాఱు అంటే పశ్చిమమే.
అయితే, దీనికి మరో వ్యుత్పత్తికూడా ప్రతిపాదించవచ్చు. -పల అంటే వైపు. లోపల-, వెలుపల- అన్న పదాల్లో పల- అన్నది దిక్సూచి ప్రత్యయమే. అయితే, ద్రావిడభాషలలో అచ్చుల మధ్య -ప- కారం, -వ-కారంగా మారడం బహుళంగా కనిపిస్తుంది. కాబట్టి, ఈ పదం తెలుగులో కొన్నిచోట్ల -వల అన్న ప్రత్యయంగా కూడా కనిపిస్తుంది. ఆవల, ఈవల, ఎవ్వల, ఇటీవల మొదలైన పదాలలో వల- అన్నది -పల ప్రత్యయానికి మరో రూపమేనని నా అభిప్రాయం. కన్నడ భాషలో పడవల్- అంటే పడమర దిక్కు. ఒకవేళ తెలుగులోని పడమర- కన్నడ భాషలోని పడవల్-కు సంబంధించిందైతే పడ-పల- అన్న పదం పడవల- గానూ, ఆపై పడమర గాను పరిణామం చెందిందని ఊహించవచ్చు.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ప్రఖ్యాతి చెందిన బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రకాశ్ పడుకోణె, బాలీవుడ్ తార అయిన ఆయన కూతురు దీపికా పడుకోణె – వీరి ఇంటిపేరు ఒక గ్రామనామం. పడుకోణె అన్నది ఉడిపి జిల్లాలోని కుందాపుర తాలూకాలోని ఒక గ్రామం. పడమర దిక్కున ఉన్న ఒక కోన (< *కోణ) అన్నది ఈ ఊరిపేరుకు అర్థం. అయితే, వీరిద్దరి ఇంటిపేర్లను పడుకోన్, పడుకొన్, పడుకోణ్ అని పలు రకాలుగా వార్తాపత్రికల్లోనూ, ఇంటర్నెట్లోను రాస్తూ ఉండడం మనకు కనిపిస్తుంది. చిత్రమైన విషయమేమిటంటే దీపికా పడుకోణె స్వయంగా తన పేరును దీపికా పడుకోన్ అని చెప్పుకుంటుంది. 1991లో ప్రకాశ్ పడుకోణె రిటైరయినప్పుడు బెంగుళూరులోని కన్నడ టీవీలు, వార్తాపత్రికలు అతని పేరును ప్రకాశ్ పడుకోణె అనే రాసినట్టు నాకు బాగా గుర్తు. బ్రౌణ్యంలో తూరుపు అన్న పదానికి వ్యుత్పత్తిని వివరిస్తూ తూరు- to enter అన్న వివరణ కనిపిస్తుంది. ఈ వివరణ నాకు అంత సబబుగా అనిపించదు. తూరు-/తూరుపు- అన్న పదానికి ఇతర ద్రావిడ భాషల్లో దిక్కుకు సంబంధించ అర్థాలు కనిపించవు. తూరు- అంటే తమిళ, కన్నడ భాషలలో దూరు-, దూర్చు అన్న అర్థాలే కనిపిస్తాయి. ఱ- తో పాదాలను చూస్తే, తూఱ్ఱు- అంటే ధాన్యాల పొట్టు అన్న అర్థంతో పాటు, పొట్టును తూర్పాఱపట్టడమనే అర్థం కూడా కనిపిస్తుంది. అంటే ఆ పదం నిజానికి తూఱు + పాఱబట్టు = తూఱుపాఱబట్టు, అంటే, ధాన్యం పొట్టు పోయేటట్టుగా చేయుడం. అందుకు తూఱుపాఱబట్టు- అన్న పదానికి తూరుపు దిక్కుకు ఏ సంబంధం లేదని చెప్పవచ్చు. అయితే, కన్నడ భాషలో కనిపించే తూళిసు- అన్న పదానికి వెదజల్లు, విస్తరించు అన్న అర్థాలు, గొండి భాషలో తూరానా- అన్న పదానికి వ్యాపించు, విస్తరించు, పుట్టు అన్న అర్థాలు కనిపిస్తాయి. తెలుగులో తూరుపు అన్నది ఈ పదాలకు సంబంధించిందేమోనని నా అనుమానం.
కన్నడంలోను, తుళు భాషలోనూ మూడు-, మూడలు- అంటే పుట్టు, ఉదయించు అన్న అర్థాలతో పాటు తూరుపుదిక్కు అన్న అర్థం కనిపిస్తుంది. తమిళంలో ఎೞುవాన్- అంటే ఉదయించు వైపు, తూరుపు; పడువాన్ అంటే పడమర దిక్కు. *ఎೞು- అన్న ద్రావిడ మూలధాతువుకు తెలుగు రూపం రేగు- కాబట్టి పడమర లాగా, రేమర- అన్న పదం పూర్వ-తెలుగు (pre-Telugu)లో ఉండి ఉండాలి, కానీ అటువంటి పదానికి ఏ రకమైన ఆధారాలు లేవు.
తెలుగులో తెన్– అన్న పదం దక్షిణ దిక్కును సూచించడానికి వాడిన దాఖలాలు లేవు. తెన్ను- అంటే దారి అన్న అర్థం, తెమ్మెర అంటే చల్లగాలి, మలయమారుతము అన్న అర్థాలే గాని తెన్ను అంటే ‘దక్షిణం’ తెమ్మెర అంటే ‘దక్షిణపు గాలి’ అన్న అన్న అర్థాలు తెలుగులో కనిపిచవు. అయితే, తమిళంలో తెన్ఱల్ అంటేనూ, కన్నడంలో తెఙ్‌గాలి అంటే దక్షిణపు గాలి అన్న అర్థం ఉంది కాబట్టి తెమ్మెర అంటే ఒకప్పుడు తెలుగులో కూడా ‘దక్షిణగాలి’కి, తెన్ను అన్నది ‘దక్షిణదిశ’కు సమానార్థాలుగా ఉండేవని ఊహించవచ్చు. తెంకాయ-/టెంకాయ అంటే ‘దక్షిణపు కాయ’ అన్న వ్యుత్పత్తి అర్థం చెప్పిన వారు ఉన్నారు కానీ ఆ వ్యుత్పత్తి కొంత ప్రశ్నార్థకమే (తెంకాయలో తెన్- దక్షిణదిశ అయితే, మరి మలయాళం లోనూ, తమిళంలో కూడా దీన్ని తెంకాయ్, తెంగంకాయ్- అని ఎందుకంటారు? తేమ్-/తేన్- అంటే తియ్యదనం కాబట్టి తెంకాయ్ అంటే తీపికాయ అని దీనికి వ్యుత్పత్తి చెప్పిన వారున్నారు). కన్నడలో తెంక- అంటే దక్షిణ దిశ. తమిళంలో తెన్-, తెఱ్కు-, తెక్కు- అంటే దక్షిణ దిశ. గొండిలో తెల్-ఙార్ అంటే దక్షిణం.
వడ– అంటే ఉత్తరదిక్కు అన్న అర్థం కూడా తెలుగు ప్రయోగాలలో కనిపించదు. హిమాలయాలకు వాడే అచ్చతెలుగు పదమైన వడఁకుఁగొండను బహుశా ‘ఉత్తరపు కొండ’ అని వివరించవచ్చు. అలాగే, వడఁకుత్రోవ అంటే ఉత్తరపథం, లేదా ఉత్తరాయణం. తమిళంలో వడక్కు- అంటే ఉత్తరదిశ. వడుగర్- అంటే ఉత్తరదేశస్థులు, ముఖ్యంగా తెలుగువారు. కన్నడంలో బడ- అంటే ఉత్తరం. బడగరు- అంటే ఉత్తర దేశస్థులు. ఈ రకమైన తులనాత్మకమైన ఆధారాలతో పూర్వ తెలుగులో ఒకప్పుడు వడ- అంటే ఉత్తరం అన్న అర్థం ఉండేదని ఊహించవచ్చు.
అయితే, వడగాలి అంటే ఉత్తరపు గాలి కాదు; వడదెబ్బ అంటే ఉత్తరపు దెబ్బ కాదు. ఈ పదాలు వడలు- అంటే వాడిపోవు అన్న ధాతువుకు సంబంధించినవి. వడియు- అంటే ఎండిపోవు-, బక్కచిక్కు-; బడుగు- అంటే బక్కచిక్కిన; వటించు- అంటే పస్తుపడు- మొదలైన పదాలన్నీ ఈ ధాతువుకు సంబంధించినవే. వడగాలి అంటే ఎండ కలిగించే వేడిగాలి. వడదెబ్బ అంటే ఎండదెబ్బ. ఉత్తరదిశను సూచించే వడ- అనే ధాతువుకు ఈ ధాతువుకు నాకు తెలిసినంతవరకూ ఏ సంబంధమూ లేదు.
అలాగే, అప్రాచ్యుడు అంటే ప్రాచ్యదేశానికి చెందనివాడు అని కొంతమంది వివరిస్తుంటారు. పశ్చిమదేశంనుంచి భారతదేశానికి వచ్చిన వారు, భారతీయ సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించేవారిని అప్రాచ్యులు అని నిందావాచకంగా ఈ పదాన్ని ప్రయోగిస్తారని వారి వివరణ. నిజానికి, అప్రాచ్యుడు అనేది అప్రాశ్యుడు అన్న పదానికి మరో రూపం. ప్రాశ- అంటే భోజనము, ప్రాశించు- అంటే భుజించు అన్న అర్థాలున్నాయి. అన్నప్రాశన మనందరికీ తెలిసిందే. అప్రాశ్యుడు అంటే పఙ్క్తియందు భుజింపఁదగనివాఁడు అని బహుజనపల్లి శబ్దరత్నాకరము చెబుతుంది. అంతేకాని, అప్రాచ్యులు అంటే పాశ్చాత్య దేశానికి చెందినవారు అన్నది జానపదవ్యుత్పత్తి.
2. పక్కలు
“కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్,” అన్నాడో సినీకవి. అయితే, అనేక మానవ సమాజాల్లో కుడిచెయ్యిని మంగళప్రదమైనది గానూ, ఎడమచెయ్యిని అమంగళకరమైనదిగా భావించడం కనిపిస్తుంది. ఇంతకు ముందు మనం చర్చించుకున్నట్టుగా ఇండో-యూరోపియన్ భాషలలో కుడిచేయి అంటే దక్షిణహస్తం అని, దక్ష- అంటే నేర్పుగల, బలం కలిగిన- అన్న అర్థాలున్నాయి. లాటిన్ భాషలో ఎడమ అన్న అర్థంలో వాడే పదం sinister. అదే పదానికి వక్రమైన-, చెడ్డ, దుష్ట- అన్న అర్థాలున్నాయి. ఈ పదం ఫ్రెంచి, ఇంగ్లీష్ మొదలైన భాషల్లో contrary, false; unfavorable, malice అన్న అర్థాల్లో స్థిరపడిపోయింది. ఇంగ్లీషులో వాడే లెఫ్ట్ (left) అన్న పదం పాత ఇంగ్లీషులో weak, foolish అన్న అర్థంలో వాడే lyft పదానికి సంబంధించింది. ఇంగ్లీషులో కుడి- అన్న అర్థంలో వాడే రైట్ (right) అన్న పదం సరైనది, బలమైనది అని ప్రాటెకంగా వివరించ నక్కరలేదనుకుంటాను.
సంస్కృతంలో కుడిచెయ్యిని దక్షిణహస్తం అని అంటరాని చెప్పుకున్నాం. ఎడమ చెయ్యికి వాడే వామ– అన్న పదానికి ఎడమ- అన్న అర్థంతో పాటు చెడ్డ, నీచమైన, తుచ్ఛమైన, వంకర అన్న అర్థాలు ఉన్నాయి. శాక్తేయమతంలో దక్షిణాచారం, వామాచారం అని రెండు విధాలు. శవాలతో, శ్మశానంలో చేసే క్షుద్రమైన తంత్ర విద్యాలకు వామాచారం అని పేరు. ఋగ్వేదంలో రుద్రుడిని వామదేవుడని వర్ణిచడం కూడా కనిపిస్తుంది. అయితే, వామ- అంటే అందమైన అన్న అర్థం కూడా కనిపిస్తుంది. వామాక్షి- అంటే అందమైన (వంకర?) కన్నులు కలది.
ద్రావిడ భాషలలో కుడిచేయికి పలుభాషలో కనిపించే సామాన్య పదం వల-కయ్. ఇక్కడ వల- అన్నది బల- అన్న పదానికి తొలి రూపం (సంస్కృతంలో బల- అన్న పదం అనార్య భాషలనుండి ఎరువు తెచ్చుకున్నదేనని కొంతమంది సంస్కృత భాషావేత్తల అభిప్రాయం). వల-కయ్ అంటే బలమైన చెయ్యి అని అర్థం. తమిళంలో వలన్-కయ్ అంటే కుడి చెయ్యి. కన్నడలో బల-కెయ్, తుళు భాషలో బలత-కై. తెలుగులోనూ మహాభారతంలో నన్నయ్య, తిక్కనాదులు ‘వల’ ‘వలపల’ అన్న పదాలే తప్ప ‘కుడి’ అన్న పదం ఎక్కడ వాడినట్టుగా దాఖలాలు లేవు.
కీచకుని మందిరానికి వెళుతూ ద్రౌపది చేసుకున్న అలంకారాన్ని (makeup) తిక్కన వర్ణించిన పద్యం చూడండి:
వలపలిదిక్కున కించుక
మలగంగా దుఱుమిడి కుఱుమాపుడు బుట్టం
బలవడ గట్టి జరఠ వ-
ల్కలమున నెవ్వీగు చన్నుగవ గప్పి తగన్. (భారతము, విరాట. 1.291)
వలపల– అన్న పదానికి సంబంధించిందే ఇంకో పదం వలపలగిలక. వలపలగిలక- అన్నది సంయుక్తాక్షరాలలో రేఫ- రాయడానికి పూర్వకాలం తెలుగు లిపిలో ఉపయోగించిన సంకేతానికి పేరు. ఉదాహరణకు ధర్మ- అన్న పదాన్ని రాయడానికి మనం ప్రస్తుతం ర-కారానికి మ-ఒత్తు ఇస్తూ రాస్తున్నాం కదా. అయితే, పూర్వకాలంలో దీన్ని దేవనాగరి లిపిలో లాగా ಧರ್ಮ- అని రాసేవారు. ఈ రకమైన రేఫ- సంకేతం కుడి వైపున ఉండే గిలక లాగా ఉంటుంది కాబట్టి ఆ సంకేతాన్ని వలపలగిలక అంటారు. ముద్రణ యంత్రాలు వచ్చిన తరువాత జరిగిన లిపి సంస్కరణలలో సమరూపత (uniformity) కోసం వలపలగిలకను ప్రింటు పుస్తకాలలో వాడకపోవడం చేత దీని ఉపయోగం బాగా తగ్గిపోయి తెలుగు లిపిలో ఈ సంకేతం దాదాపు కనుమరుగైపోయింది.
ఇక కుడికి వ్యతిరేకపడమైన ఎడమ– పదం గురించి విచారిద్దాం. ఎడ- అంటే దూరం, gap. ఎడమ- చెయ్యి అంటే బలమైన కుడిచేయ్యికి దూరంగా ఉన్న చెయ్యి. తమిళంలో ఇడై-, కన్నడ, తుళు భాషలలో ఎడ-, కొడగు భాషలో ఎడతె- అన్నవి ఇవే అర్థాల్లో వాడుతారు. తెలుగులో వర్ణవ్యత్యయం (metathesis) వల్ల ఎడ- డే-గాను, ఎడపల డాపల గాను మారింది. గొండీ భాషలో ఎడమను డేమ అంటారు. తెలుగులో మహాభారతంలో డాపల- అన్న ప్రయోగాలే ఎక్కువగా కనిపించినా, అనతికాలంలోనే అది దాపల-గా పరిణామం చెందింది.
పటుశరముల మీఁదికి డా-
పటికిన్ వలపటికి నపరభాగమునకు ముం
దటికిఁ జదల నడపె సము-
త్కట రయమున శిరముఁ గందుకక్రీడగతిన్. (భారతము, ద్రో. 4.)
అయితే, వలపల, డాపల/దాపల అన్న పదాలను కాదని శ్రీనాథుని కాలం నుండి తెలుగు కావ్యాలలో కుడి, ఎడమ అన్న ప్రయోగాలే అధికంగా కనిపించడం మనం గమనించవచ్చు. కానీ ‘వల’ ‘డా-/దాపల’ అన్న శబ్ద ప్రయోగాలు పూర్తిగా కనుమరుగు కాలేదు. ఉదాహరణకు అన్నమయ్య ఈ పాటలో వలపల, దాపల అన్న ప్రయోగాలు చూడండి:
వలపల దాపలాను వడిగా గొసరె నిన్ను
చెలియ విన్నపములు చెవి సోకేనా? 25-241
మనం ఇప్పుడు వలచేయికి సమానంగా అమితంగా వాడుతున్న కుడి- అన్న పదానికి వ్యుత్పత్తి మన నైఘంటికులు చెప్పకపోయినా ఆధునిక భాషశాస్త్రం యొక్క తులనాత్మక ఆధారాల ద్వారా కనిపెట్టవచ్చు. ప్రముఖ భాషావేత్త ఎమెనో కుడిచెయ్యి అంటే కుడుచు+చెయ్యి అన్న అర్థాన్ని ప్రతిపాదించి సశాస్త్రీయంగా నిరూపించాడు.
కుడుచు అంటే తిను, తాగు అన్న అర్థాలు తెలుగులో ఉన్నాయి. తమిళంలో సోఱు/చోఱు అంటే ఉడికిన అన్నం. వారు కుడి-చెయ్యిని చోఱ్ఱుకయ్ అంటే ‘తినే చెయ్యి’ అంటారు. మలయాళంలో చోఱ్ఱుకయ్‌తో పాటు చోత్తుకయ్ అని కూడా వినిపిస్తుంది. మధ్య ద్రావిడ భాషలయిన నాయికిలో కుడి చెయ్యిని తిందకెయ్, గడబలో తియన్-కీ, గొండిలో తింద-గయ్, ఖురూఖ్ భాషలో తిన-ఖేఖ్ఖ అంటారు.
కుడుచు- అంటే ఆధునిక తెలుగు భాషలో తాగు-, చీకు-, పానము చేయు- అన్న అర్థాలు ఉన్నా, ప్రాచీన తెలుగులో తిను, భుజించు అన్న అర్థాలే ప్రధానంగా ఉండేవని కావ్యప్రయోగాల ద్వారా మనం ఊహించవచ్చు. ఉదాహరణకు, మహాభారతం ఆదిపర్వంలో బకాసురుడు తన కోసం బండిలో తెచ్చిన ఆహార పదార్థాలన్నీ భీముడే తింటున్నాడని చూచి కోపంతో ఇలా అంటాడు:
చనుదెంచి ముందట శకటంబు పైనుండి ఓడక కుడుచుచునున్న భీము
దవ్వుల జూచి “నిత్యము నాకు నియమించి కొనివచ్చు కూడేలా కుడిచెదీవు?
కడు క్రొవ్వి రేకచక్రంబువారల కేనింత ఎల్లిద మేల యైతి? (భారతము ఆది 6.295)
‘నాకోసం నియమించిన కూడును నువ్వెందుకు కుడుస్తున్నావు,’ అని కోపంగా బకాసురుడు భీముని వీపును పొడిచాడట. ఇక్కడ ‘తిండి, ఆహారము’ అనే అర్థంలో వాడిన కూడు- అన్న పదం కూడా కుడు- అన్న ధాతువుకు సంబంధించినదేనని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా.
కుడిమట్టు అంటే కంచము, భోజనపాత్ర. పూర్ణం నింపి వేయించిన తీపి భక్ష్యాలను కుడుములు అంటారు. వినాయకచవితికి భక్తితో గణపతికి అర్పించే ఉండ్రాళ్ళను కూడా కొన్ని ప్రాంతాలలో కుడుములు అంటారు. కుడుచు- అన్న అకర్మకక్రియకు సకర్మకక్రియారూపం అయిన కుడుపు- అంటే తినిపించు-, తాగించు-. నామవాచకంగా కుడుపు అంటే తినే ఆహారపదార్థమే. మన అందరికీ సుపరిచితమైన “కడుపెంత తా కుడుచు కుడుపెంత దీనికై/ పడని పాట్లనెల్ల పడి పొరలనేలా” అనే అన్నమయ్య కీర్తనలో కుడుచు అన్న క్రియకు తిను- అన్న అర్థం, కుడుపు అన్న పదానికి భోజనం అన్న అర్థం స్పష్టమే కదా!
ఈ రకమైన తులనాత్మకమైన ఆధారాలతో తెలుగులో కుడి-చెయ్యి అన్న పదానికి అర్థం తినే-చెయ్యి (కుడుచు-చెయ్యి) అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
అలాగే, కుడి చేతికి తెలుగులో అంబటిచేయి, ఈగిచేయి అన్న పర్యాయపదాలున్నాయి. అంబటి- అంటే ఆహారం, గంజి అన్న అర్థాలున్నాయి కదా. అంబటిచెయ్యి అంటే ఆహారపు చెయ్యే. ఈగిచెయ్యి అంటే దానం కానీ, బహుమతి గాని ఇచ్చుచేయి.
కుడిచేయి అంటే తినేచెయ్యి అన్న అర్థం లాగే, ఎడమ చెయ్యికి ఇతర ద్రావిడ భాషల్లో కనిపించే పీ-కయ్, పీచ్చంగై (పియ్యి చెయ్యి = అశుద్ధము కడిగే చెయ్యి) అన్న పదాలు కనిపిస్తాయి. కానీ, తెలుగు భాషలో ఎడమచేయ్యికి ఈ రకమైన పదాల వాడకం ఎక్కడా మనకు కనిపించదు. అయితే ఎడమ చెయ్యికి సమానార్థకాలుగా తుంటచెయ్యి (విరిగిన చెయ్యి, బలహీనమైన చెయ్యి), పుఱ్ఱచెయ్యి (వ్యర్థమైన, పనికిరాని చెయ్యి), ఱొడ్డచెయ్యి (వంకర చెయ్యి) అన్న పదాల ప్రయోగం కనిపిస్తుంది.
----------------------------------------------------------
రచన: సురేశ్ కొలిచాల,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment