Thursday, March 21, 2019

యథార్థ చక్రం – 3


యథార్థ చక్రం – 3




సాహితీమిత్రులారా!

సంస్కృత మూలం : అశ్వఘోష విరచిత ‘ సౌందర నందం’
నిన్నటి తరువాయి.................

శాస్త్ర ప్రకారం నందుడు భిక్షు వేషధారణ శరీరానికి అలంకరించాడే తప్ప మనసుకి మాత్రం కాదు.

అతని మనస్సంతా సుందరి ఆలోచన్లే ఆవరించుకున్నాయి.

చుట్టూ ఉన్న వసంత శొభ అతని మనస్సుని శాంతింపజేయడం లేదు.

ఆలోచన్లతో మనస్థిమితం కోల్పోయాడు.

సమీపంలో తెల్లని పారిజాత పుష్పాలతో నిండి ఉన్న కొమ్మల మధ్య నుండి వచ్చిన కోయిల స్వరం విని, శ్వేత వస్త్ర ధారియై మధుర గానామృతం చేసే సుందరి అతని మదిని మెదిలింది. నర్తించే మయూరాలు ప్రియురాలి మువ్వల సవ్వడిని తలపింప చేస్తున్నాయి. చుట్టూ ఉన్న వశంత శోభ విరహంతో ఊగిసలాడుతోంది.

‘ నాకోసం కూడా సుందరి ఇలానే తపిస్తూ ఉంటుంది కదా? ‘ అని అనుకొన్నాడు.

అప్రయత్నంగా కన్నీళు వస్తున్నాయి.

అందర్నీ వదులుకొని ఈ కఠోర జీవితం ఎందుకు గడపాలి? ఈ దీక్షా నియమాల చట్రంలోకి ఎందుకు అడుగు పెట్టాలి? దీని వల్ల ఏం ఒరుగుతుంది?

ఒక పక్క సుందరి లేకుండా జీవించలేడు – మరొక పక్క బుద్ధుని మాట జవదాటే ధైర్యం లేదు. అడకత్తెరలో పోక చెక్కలాంటి పరిస్థితి తనది.

బుద్ధుని ఆదేశానుసారం దీక్షని స్వీకరించాడే తప్ప మనస్సు మాత్రం సుందరి చుట్టూ పరిభ్రమిస్తోంది. శాంతి కరవయ్యింది !

” ఈ చందన చర్చితాలు ఆరేలోగా రావాలి సుమా? ” ప్రియురాలి మాటలు అతని చెవుల్లో గింగురుమంటున్నాయి.

ధ్యానముద్రలో కళ్ళు మూసుకుందామనుకుంటే సుందరి రూపమే కనిపిస్తోంది. ఆమె లేని జీవితం వ్యర్థం.

ఈ సృష్టిలో స్త్రీ సౌందర్యం మించింది ఉందా? మోహరహితంగా మగధీరులు జీవించడం సాధ్యమా? గురుపత్ని అయిన అహల్య అందానికి వ్యామోహం చెంది కామపీడుతుడిగా మిగిలిన అగ్నిదేవుని వల్లే కాని పని పని తన లాంటి సామాన్యుడి వల్ల సాధ్యమా?

మత్స్యకన్యతో సంభోగించిన మునీశ్వరుడు పరాశరుని వల్లే కదా వేద విభజనకర్త వ్యాసుడు జన్మించింది?

కఠోర తప్పస్సు చేసిన బ్రహ్మర్షి విశ్వామిత్రుడు మేనక సౌందర్య బాణాలకి చలింపలేదా? కామ క్రోధాల్ని జయించడం మహా మహా వ్యక్తులవల్లే సాధ్యపడలేదు, తన వల్ల ఎలా అవుతుంది?

‘నారీ సంగమం వల్ల మృత్యువస్తుందని తెలిసి కూడా శాపగ్రస్థుడైన పాండురాజు మాద్రిని రమించి మృత్యువుని కామ వశం చేయలేదా? మహనీయులే కామానికి దాసులయినప్పుడు తను సుందరీ వశుడు కావడంలో ఆశ్చర్యం లేదు కదా?

గృహోన్ముఖమయ్యింది అతని మనస్సు. విషయోపభోగాలు జయించకుండా ఈ భిక్షు వేషధారణ ఏమిటి?

చేతిలో భిక్షా పాత్ర పుచ్చుకొని, శిరోముండనం చేయుంచుకొని, కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన శాంతి లభిస్తుందా? వాస్తవానికి శరీర వేషధారణతో భిక్షువులా కనిపించవచ్చు, కాని చంచల మనస్సు ఎవరికి కనిపిస్తుంది? ఇంటిని విదిచి బంధువుల్ని విడిచి ఈ శరీరం రావచ్చు, కాని కామవాసనలు తప్పించడం ఎంత కష్టమో కదా? శరీరం భిక్షు వేషం వేసినా, మనస్సు మాత్రం గృహస్థు వేషం వదలకపోతే ఏం లాభం? అలా చేసి మనల్ని మనం మోసం చేసుకున్నట్లు కాదా?

ఇదంతా తన వల్ల సాధ్య పడదు. ఈ రోజు తధాగతుడు భిక్షకి వెళ్ళగా చూసి తను ఇక్కడనుండి పారిపోవాలి. తనని తను సమర్ధించుకుంటూ బుద్ధుడికి కనిపించకుండా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు నందుడు.

అతని చంచల మనస్సు కాషాయ రంగు వస్త్రాలు విసర్జించడానికి ఆయత్తమవుతోంది. అసలు ధరిస్తే కదా విసర్జించేది…….?

****************

సుందరి నిద్రాహారాలు మాని పిచ్చిదానిలా తయారయ్యింది. పరిచారికలు ఆమె పరిస్థితి చూసి బాధతో కలత చెందారు. జాలి పడుతున్నారు. నందుడిక తిరిగి రాడని వారందరికీ సుస్పష్టంగా తెలుసు. కాని సుందరికింకా ఆశ చావ లేదు. ఏ మూలో తన ప్రియుడ్ని కలుస్తానన్న నమ్మకం ఉంది.

ఏడ్చి ఏడ్చి ఆమె కన్నులు ఎరుపెక్కాయి. ముఖం ఉబ్బినట్లయ్యింది. ధైర్యం చేసి వయసు మీరిన ఒక పరిచారిక సుందర్ని ఓదార్చింది.

” అమ్మా ! మీకు చెప్ప తగ్గ దాన్ని కాదు. మీరిలా నిద్రాహారాలు మాని ఇలా ఉండడం భావ్యం కాదు. తోటి పరిచారికలెవ్వరూ పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్ట లేదు. మీ బాధే వాళ్ళ బాధలా అనుకుంటున్నారు. మా అందరికీ తెలుసు – మీ ఇద్దరి సహచర్యం. అయినా తప్పదు..విధి ఇలా రాసి ఉంటే…నాకెందుకో మహారాజు మిమ్మల్ని కలుస్తారని అనిపిస్తోంది. అయినా మీరిలా రోదించడవల్ల ఏం ప్రయోజనం? మహారాజుని కలిసే ప్రయత్నాం చేద్దాం? ఆయన ఏ పరిస్థితుల్లో భిక్షువు గా మారేరో తెలుసుకుందాం? ఇష్టపడే స్వీకరించారా? లేక..”

ఒక్క సారి తలెత్తి పరిచారిక వైపు చూసింది సుందరి. ఆ మాటల్లో ఆశ చిగురించింది. లేచి నిలబడింది. పరిచారిక మాటలు ధైర్యాన్నిచాయి.

ఇలా రోదించి ప్రయోజనం ఏమిటి? నందుణ్ణి కలవాలి. లేదా కలిసే ప్రయత్నం చేయాలి. తన బాధ వివరించాలి. ఎందుకు తనని త్యజించాడొ తెలుసుకోవాలి. రోజంతా తన చుట్టూ పరిభ్రమించే అతను ఒక్కసారిలా ఎందుకు మాయమయ్యడో కనుక్కోవాలి.

ఆహారం ఏర్పాటు చేయమన్నట్లుగా సంజ్న చేసింది సుందరి. పరిచారికల ముఖాలు విప్పారాయి.

“బాధపడకండమ్మ, మనం ముందుగా యశొధర మహారాణిని కలుద్దాం. ఆమె సలహా తీసుకొని ఒక్క సారి నండ మహారాజుని కలిసే ఏర్పాటు చేయమని అర్థిద్దాం. అసలు విషయం ఏమిటో తెల్సుకుందాం. ఒక్కసారి మహారాజుని కలిస్తే మన అనుమానాలాన్నీ వీడుతాయి…. మనకెవ్వరికీ ఆ భిక్షువలని కలిసే ఆస్కారం లేదు. కాబట్టి సం యమనంతో తెలివిగా ప్రవర్తించి మనకి కావల్సింది రాబట్టుకోవాలి….”

సరే అన్నట్లు తలూపింది సుందరి.

ఆమెకిప్పుడు ఒకటే దారి. ఎదురొడ్డి పోరాడైనా సరే తన నందుణ్ణి దక్కించుకోవాలి. తనకళ్ళలోకి సూటిగా చూసి నందుణ్ణి చెప్పమని అడగాలి – తనని త్యజించాడని.

ప్రస్తుతం తనకి యశొధరే దిక్కు….

చింపిరిగా ఉన్న కేశాల్ని ముడి వేసుకొని స్నానానికి ఉపక్రమిస్తుండగా ఆమె ముందు ఒక వ్యక్తి వచ్చి నిలుచుంది.

పరిచారికలు పక్కకు తప్పుకున్నారు. తనని తాను నమ్మలేనంత ఆశ్చర్యపోయింది సుందరి.

ఆ వచ్చిన వ్యక్తి ఎవరోకాదు – ఒకప్పటి సిద్ధార్థుని భార్య – యశొధర !

****************

వ్యాకుల మనస్కుడైన నందుని ముఖం వాడిపోయినట్లు గమ్ణించాడు ఒక భిక్షువు. అతని కళ్ళు కాంతి విహీనమగా ఉన్నాయి. మైత్రీ పూర్వకంగా ఆ భిక్షువు ఇలా అన్నాడు.

“ఆలోచన్లతో నీ మనస్సు ఎంత మైల పడిందో నీ కన్నీళ్ళు వ్యక్తపరుస్తున్నాయి. ధైర్యం గా ఉండు. మనస్సుని స్వాధీన పరచుకో ! కన్నీళ్ళూ, శాంతీ ఒకే చోట నిలవలేవు. ”

ఒక్కసారి తలెత్తి చూసాడు నందుడు.

“కలత రెండు విధాల ఉంటుంది – ఒకటి శారీరికం ఇంకొకటి మానసికం ! రెండింటికీ చికిత్సలు వేర్వేరుగా ఉంటాయి. మొదటి దానికి కావల్సింది వైద్యం – రెండవ దానికి యోగ జ్ఞానం ! శారీరిక రోగాలకి ఔషధాలు వాడితే తగ్గుతాయి. కాని మానసిక చింతనకి శ్రద్ధతో, సాధనతో కూడిన యోగ జ్ఞానం వల్లే క్రమేపీ తగ్గుతుంది.

మనసుని స్వధీన పరచుకోవడం అంత సులభం కాదు. ”

అతని మాటలు విన్నాడు నందుడు. పక్కనే ఉన్న మండపంలో కూర్చున్నరిద్దరూ. నందుడు తన మనస్సులో మాట చెప్పాడు.

” మిత్రుడా ! నువ్వు నా హితవు కోరే చెబుతున్నావని నాకు తెలుసు. నువ్వు సదాచార ధర్మ స్వరూపుడివి. ఈ సృష్టిలో ప్రాణులందరూ సమానమే నీకు ! కానీ నా పరిస్థితి వేరు. నా ప్రియురాలు సుందరి లేకుండా జీవించడం నాకు సాధ్యపడదు. మా ప్రేమ అటువంటిది. ఆమె లేకుండా ఒక్క క్షణం కూడా గడప లేక పోతున్నాను. మా సాంగత్యం మీకు కామంలా అనిపించవచ్చు. కాని అది స్వచ్ఛమైన ప్రేమ ! ప్రియురాలు లేకుండా ఈ ధర్మానుష్టానంలో నా మనస్సు నిమగ్నం కావడం లేదు. నేను రాజ మందిరానికి వెనక్కి వెళిపోదామనుకుంటున్నాను.”

నందుడు తన నిర్ణయం తెగేసి చెప్పాడు.

నందుడి మాటలు విన్న బౌద్ధ సన్యాసి మెల్లగా అన్నాడు.

“నాకు తెలుసు మీ చంచలమైన మీ మనస్సు పడే వ్యధ ! మనం ప్రేమ అనుకునేది ప్రేమ కాదు, వ్యామోహం. ఆ వ్యామోహపు వలలో చిక్కుకున్న పురుషులెవ్వరూ బయటకు రావడానికి ఇష్టపడరు. కామాంధ భరితమైన మనస్సుని జయించడమే ఈ బౌద్ధ సన్యాస ఏకైక లక్ష్యం ! అది జయిస్తే శాంతి లభిస్తుంది. శాంతి పూర్తిమైన మనస్సుతో యోగ సాధన సులభం అవుతుంది. విషయ వాంచలు చందన వృక్షాన్ని ఆవహించుకున్న మిన్నాగుల్లాంటివి. క్షణ క్షణం కాటేస్తూనె ఉంటాయి. కోరికల్లో విషం నింపుతూనే ఉంటాయి. లోభికి ధన సంపత్తి పైన, మూర్ఖుడికి కామసుఖాలపైన మక్కువ ఉంటుంది. కాని సత్పురుషులు జ్ఞానంతో భోగ విలాసాలను త్యజించి శాంతిపథం వైపు పయనిస్తారు. కనుక నువ్వు గృహోన్ముఖుడై ఇక్కడనుంది మరలడం అంత శ్రేయస్కరం కాదు. ఆత్మ విశ్వాసంతో ఉంటే బంధ విముక్తుడవ్వడం అంత కష్టతరం కాదు. ”

తన మాటలు నందుడి చెవెక్కడంలేదన్నిది అర్థమవుతోంది ఆ బౌద్ధ సన్యాసికి.

ఆఖరిప్రయత్నంగా మరలా చెప్పసాగేడు.

” స్త్రీ వాంచ పురుషుల్ని దహించివేస్తుంది. స్త్రీలు శరీరాన్నే ప్రేమిస్తారు, రూపాన్ని ఆరాధిస్తారు, ధనాన్ని కాంక్షిస్తారు. వాళ్ళ తియ్యని మాటలతో, శృంగార భరితమైన చేష్టలతో ఆకట్టుకొంటారు. చంచలమైన మనస్సుని స్వాధీన పరచుకోలేక అనేక విధాల ఆకట్టుకొనే ప్రయత్నాలు చేస్తారు. దేహ వాంచలతో మనస్సుని మైల పరుస్తారు. కనుక ఈ మలినాన్ని తొలగించుకొనే అవకాశందక్కింది నీకు. మనోధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగు. సత్వ రజ తమో గుణాలనుండి విముక్తుడువికమ్ము ! ”

అతని మాటలేమీ నందుడి మనస్సుపై ప్రభావం చూపలేకపోయాయి. తను వెళ్ళడానికే నిర్ణయించుకున్నట్లుగా చెప్పాడు.

ఆ భిక్షువు పరిపరివిధాల బోధ చేసాడు. అయినా నందుడి మనస్సు శాంతించలేదని గ్రహించాడు భిక్షువు. తన బోధల వల్ల నందుడిలో మార్పు రాలేదని గ్రహించాడు.

ఈ విషయం బుద్ధ భగవానునికి తెలియజేయాలి. ఎవరి ప్రభావం వలన భిక్షువుగా అంగీకరింప బడ్డారో వారికి నందుడు నిర్ణయం చెప్పాలి.

ఆ ఆఖరి ప్రయత్నమేదో ఆ తధాగతుని వల్లే సాధ్యం.

నందుడు భిక్షువుగా పరిత్యజిస్తున్నాడన్న విషయం బుద్ధునికి చేరవేస్తున్నట్లుగా పైకి అనలేదు.

శలవు తీసుకొని బుద్ధుని కుటీరం వైపుగా నడిచాడు భిక్షువు.
( ఇంకా ఉంది )
---------------------------------------------------------
రచన: సాయి బ్రహ్మానందం గొర్తి, 
ఈమాట సౌజన్యంతో

No comments: