Thursday, March 7, 2019

రంగులు


 రంగులు



సాహితీమిత్రులారా!

రంగు అన్న పదం సంస్కృత జన్యం. దీని మూలధాతువు √రఞ్జ్- యొక్క ప్రాథమికార్థం colorను సూచించేదే. ఈ ధాతువుకు సంబంధించిందే రాగ- అన్న పదం. సంధ్యారాగం, పుష్యరాగం అన్న పదాలల్లో కూడా రాగం అన్న పదాన్ని రంగు అన్న అర్థంలో వాడడం చూడవచ్చు. రంగు అన్న అర్థంలో అన్ని ద్రావిడ భాషలలో కనిపించే మూల ధాతువు లేదు. అయితే, మూల ద్రావిడంలో రంగు అన్న అమూర్త భావనకు పదం లేనంత మాత్రాన ఆ కాలంలో వివిధ రంగుల మధ్య తేడా చెప్పలేకపోయేవారని అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని చాలా భాషలలో రంగులను తెలిపే పదాలు ఉన్నా, రంగు అన్న భావనకు పదం కనిపించదు. ఉదాహరణకు, అమెరికాలోని నవాహో జాతి మాట్లాడే భాషలో వివిధ రంగులను తెలిపే పలు పదాలు ఉన్నా, రంగు- ‘color’ అన్న అర్థంలో పదం లేదు. తమిళంలో రంగును నిఱం అంటారు. ఇది నెఱ- ‘నిండు’ పదానికి సంబంధించింది కావచ్చు.

ప్రపంచంలోని అనేక భాషలలో రంగులకు సంబంధించిన పదాలను నిశితంగా పరిశీలించి, విశ్లేషించిన బెర్లిన్, కే అనే శాస్త్రవేత్తలు 1969లో వెలువరించిన పరిశోధనా ఫలితాలు* అందరిని అబ్బురపరిచాయి. వారి పరిశోధనల ప్రకారం, ప్రపంచంలోని అన్ని భాషలలోనూ రంగు పదాల పరిణామంలో ఒక రకమైన క్రమబద్ధత, సార్వజనీనత కనిపిస్తుంది. చాలా భాషలలో ఈ మధ్యకాలం వరకూ మూడు లేదా నాలుగు రంగులకు మించి పదాలు లేకపోవడం వారు తమ పరిశోధనల ద్వారా తేల్చిన ఆశ్చర్యకరమైన విషయం. ప్రపంచ భాషలలో రంగు పదాల పరిణామాన్ని వారు వివిధ అంచెల (stages) వారిగా సూచించారు.

స్టేజ్ 1: నలుపు, తెలుపు — రెండు పదాలు
స్టేజ్ 2: నలుపు, తెలుపు, ఎఱుపు — మూడు పదాలు
స్టేజ్ 3: నలుపు, తెలుపు, ఎఱుపు, పచ్చ (ఆకుపచ్చ/పసుపుపచ్చ) — నాలుగు పదాలు
స్టేజ్ 4: నలుపు, తెలుపు, ఎఱుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ — అయిదు పదాలు
స్టేజ్ 5: నలుపు, తెలుపు, ఎఱుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నీలం (blue) — ఆఱు పదాలు
స్టేజ్ 6: నలుపు, తెలుపు, ఎఱుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నీలం, గోధుమ రంగు — ఏడు పదాలు
స్టేజ్ 7: నలుపు, తెలుపు, ఎఱుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నీలం, గోధుమ రంగు, ఊదా రంగు, నారింజ రంగు, గులాబి రంగు, బూడిద రంగు — అనేక పదాలు
చారిత్రక భాషావేత్తలు చేసిన భాషా పునర్నిర్మాణం ద్వారా మూల ద్రావిడ భాష స్టేజ్-3కి చెందిందని చెప్పుకోవచ్చు. మూల ఇండో-యూరోపియన్ భాష కూడా నాలుగు రంగు పదాలతో లోనే స్టేజ్-3కి చెందిందిగా పరిగణిస్తారు. హోమర్ కాలంనాటి గ్రీక్ భాషలో కూడా నాలుగే రంగులు కనిపించినా, ఋగ్వేదం నాటి సంస్కృత భాషలో అయిదు నుండి ఆరు రంగు పదాలు కనిపిస్తాయి కాబట్టి, ఈ భాష స్టేజ్-4కు చెందిందిగానో, స్టేజ్-5కు చెందింది గానో పరిగణించవచ్చు. ఆ వివరాలు ఈ కింది విభాగంలో విపులంగా చర్చిద్దాం.

ఋగ్వేదంలో రంగుపదాలు
సూర్యకాంతిలో ఏడు రంగులుంటాయని ముందుగా ఎవరు కనిపెట్టారు? గూగులమ్మను ఈ ప్రశ్న అడిగితే, ఋగ్వేదంలో ఈ విషయం ముందుగా రాశారని కొన్ని వేల సైట్లను చూపుతుంది. అయితే, ఋగ్వేదంలో సూర్యునికి సప్తాశ్వాలు ఉన్నట్టుగా వివరించిన మాట వాస్తవమే గాని, ఆ ఏడు గుర్రాలను ఏడు రంగులుగా ఎక్కడా వివరించలేదు. సప్తాశ్వాల ప్రసక్తి ఉన్న శ్లోకం ఇది:

ఆ సూర్యో యాతు సప్తాశ్వః క్షేత్రం యద్ అస్యోర్వియా దీర్ఘయాథే|
రఘుః శ్యేనః పతయద్ అన్ధో అచ్ఛా యువా కవిర్ దీదయద్ గోషు గచ్ఛన్|| 5-045-09

ఇంతకు ముందు మనం కాలమానంలో సూర్యుడిని ఏడు రోజుల వారానికి ప్రతీకగా సప్తచక్రాలు ఉన్నవాడిగా అభివర్ణించినట్టుగానే, ఇక్కడ కూడా ఏడు అన్న సంఖ్యను అన్వయించుకోవాలి. అంతేకాని, సూర్యకాంతిలో గాని, ఇంద్రధనస్సులో గాని ఆధునిక విజ్ఞాన శాస్త్రం కనిపెట్టిన ఏడు రంగుల గురించి ఈ శ్లోకం వివరిస్తుందంటే నమ్మశక్యం కాదు. నిజానికి, ఋగ్వేద కాలం నాటికే ఇంద్రధనస్సులోని ఏడు రంగులకు ఏడు వేర్వేరు పేర్లుండేవని చెప్పగలిగే శ్లోకం ఏదీ మనకు ఋగ్వేదంలో కనిపించదు. ఋగ్వేదంలోని రెండవ మండలంలోనే సూర్యుని రథాన్ని వర్ణించే శ్లోకంలో శ్వావ, రోహిత, రక్త వర్ణాలు గల అశ్వాలు ఆ రథాన్ని అలరిస్తాయని వర్ణించారు.

శ్రూయా అగ్నిశ్ చిత్రభానుర్ హవమ్ మే విశ్వాభిర్ గీర్భిర్ అమృతో విచేతాః |
శ్యావా రథం వహతో రోహితా వోతారుషాహ చక్రే విభృత్రః || 2-010-02

ఇక్కడ ఏడు రంగుల ప్రస్తక్తే కాకుండా ఏడు అశ్వాల ప్రస్తావన లేదు.

నిజానికి, ఋగ్వేదం తరువాతి కాలంలో వెలువడినదిగా అందరూ ఒప్పుకొనే ఛాందోగ్యోపనిషత్తులో సూర్యకాంతిలో శుక్ల (తెలుపు), నీల (నలుపు), పీత (పసుపు/బంగారు), లోహిత (ఎఱుపు) వర్ణాలు కలిసి ఉన్నాయని వర్ణించారు.

అథ యా ఏతా హృదయస్య నాడ్యస్తాః పింగలస్యాణిమ్నస్
తిష్ఠంతి శుక్లస్య నీలస్య పీతస్య లోహితస్యేతి (ఛాందోగ్యోపనిషత్తు 8.6.1)

బృహదారణ్యోపనిషత్తులో (4.4.9) మనకు శుక్ల (white), నీల (black), హరిత (green), లోహిత (red), పీత (yellow) రంగుల పేర్లే మనకు కనిపిస్తాయి.

పై శ్లోకాల్లో నీలం అన్న పదానికి నేను నలుపు అని అర్థం ఇవ్వడానికి చాలా మంది అభ్యంతరం చెప్పవచ్చు. ఆధునిక కాలంలో blue అన్న పదాలకు మారుగా తెలుగులోనూ నీలి- అని, నీలం రంగు అని వాడుతూ ఉన్నా ఈ ప్రయోగం అర్వాచీనమైనది! ఋగ్వేదంలోనూ, సంస్కృతంలోని రామాయణ, భారత కావ్యాలలోనూ నీల- అన్న పదాన్ని dark, black అన్న అర్థాలలోనే తప్ప, blue ఆకాశాన్నో, blue సముద్రాన్నో వర్ణించడానికి ఉపయోగించలేదు. తెలుగులో కూడా ఈ మధ్య కాలం దాకా నీలి- అన్న పదాన్ని నలుపు అన్న అర్థంలోనే ఉపయోగించారు. నీలినీడలు- అంటే నల్లని ఛాయలు. నీలి కురులు అంటే నల్ల వెంట్రుకలు; నీలకంఠుడు అంటే నల్లని మచ్చ గల శివుడు. నీలిమేఘం అంటే నల్లమబ్బు. నీలిమ- అంటే నలుపు.

పోతన తన భాగవతంలో తనకు ప్రత్యక్ష్యమైన రామచంద్రమూర్తిని వర్ణిస్తూ చెప్పిన పద్యం ఇలా సాగుతుంది:

మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి
      నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండల సుధాసారంబు పోలిక
      ముఖమునఁ జిఱునవ్వు మొలచువాఁడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగిఁ
      బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు
నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి
      ఘన కిరీటము తలఁ గల్గువాఁడు

పుండరీక యుగముఁ బోలు కన్నులవాఁడు,
వెడఁద యురమువాఁడు విపుల భద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.(భాగవతం. 1-14)

ఆ రామచంద్రమూర్తి నల్లని శరీరానికి పెట్టిన ఘన కిరీటం నల్లని కొండ మీద సూర్యుని లాగా మెరిసిపోతుందట అని చెప్పడానికి “నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలఁ గల్గువాఁడు” అన్నాడు పోతన. పోతన దృష్టిలో రాముడు, కృష్ణుడు ఇద్దరూ నల్లని వారు, పద్మ నయనమ్ముల వారే కదా!

ఇక తెలుగు, తమిళాది ద్రావిడ భాషలలో రంగు పదాల గురించి పరిశీలిద్దాం.

ద్రావిడ భాషలలో ప్రాథమిక రంగు పదాలు
తులనాత్మకంగా పరిశీలించి భాషావేత్తలు పునర్నిర్మాణం చేసిన మూల ద్రావిడ భాషలో ప్రాథమిక రంగు పదాలు నాలుగు అని చెప్పుకున్నాం కదా. వాటి వివరాలు:

మూల ధాతువు తెలుగు                                      తమిళం                          కన్నడ

*వెళ్- ‘తెలుపు’ వెల్ల, వెఁలుగు, వెండి, వెన్న      వెళుప్పు, వెళ్ళి, వెణ్- బెళుపు, బెళకు

*కార్- ‘నలుపు’ కారు                                      కారు                                కారు

*కెమ్- ‘ఎఱుపు’ కెంపు, కెంజాయ,
                                కెమ్మోవి, చెంగావి                     చెమ్-, చేత్తు                 కెమ్-

*పచ్- ‘పచ్చ(ఆకుపచ్చ/పసుపుపచ్చ)’ పచ్చ  పచ్చ                          పచ్చ

ఈ రంగులే గాక తమిళంలో పసుపుపచ్చ రంగు అనే అర్థంలో మంజిల్ అనే పదం, బూడిద రంగు అర్థంలో నరై అన్న పదం సంగ సాహిత్య దశనుండి కనిపిస్తున్నాయి. సంస్కృతంలో కనిపించే మంజిష్ఠ అన్న పదానికి మంజిల్ పదానికి సంబంధం ఉండవచ్చు. నెరయు-, నెరసిపోవు- అన్న పదాల్లో వెంట్రికలు గ్రే (gray) రంగులోకి మారిపోయే అర్థం తెలుగులో ఉన్నా నెర- అన్న పదం రంగును సూచించే విశేషణంగా గానీ విశేష్యంగా గానీ అర్థ వ్యాకోచం జరగలేదు.

తెలుపు
తెలుపు రంగుకు సంబంధించిన అనేక పదాలు తెలుగుతో సహా అన్ని ద్రావిడ భాషలలో వెళ్-/వెణ్- ధాతువుకు సంబంధించి ‘వ’-కారంతోనో, లేదా బ- కారంతోనో ప్రారంభమయితే, తెలుగులో మాత్రం అసలు రంగుపదం మాత్రం వెళుపు/వెలుపు అని కాకుండా ‘తెలుపు’ అవ్వటం కొంత ఆశ్చర్యకరమైన విషయమే. తెళ్- అన్న ధాతువుకు తేటతెల్లమగు, అవగాహన కలుగు (తెలివి కలుగు) అన్న అర్థాల్లో ప్రయోగాలు అన్ని భాషల్లోను కనిపించినా, రంగుపదంగా త- కారంతో ప్రయోగాలు ఇతర భాషలలో కనిపించవు.

18వ శతాబ్దానికి చెందినదిగా భావించే సారంగపాణి పదాలలో కనిపించే వెళుపు- అన్న పద ప్రయోగానికి రవ్వ శ్రీహరి తెలుపు అన్న అర్థం చెప్పారు.

హరహర నీకు చిత్తజు భవనమింత వెళుపైతేనే. (సారంగ. 84)

ఇది నిజంగానే తెలుపు అన్న అర్థంలో వాడి ఉంటే, బహుశా, అది తమిళ భాషా ప్రభావం వల్ల కావచ్చు.

రంగు పదంగా కాకుండా వెళ్-/వెణ్- అన్న ధాతువు ద్వారా ఉద్భవించిన తెలుగు పదాలు కోకొల్లలు. వెల్ల, వెలవెలబోవు, వెలది (వెలయాలు అన్న పదంతో సంబంధం లేదు), వెన్నెల, వెన్న (‘వెల్- ‘white’ + నెయ్ ‘oil’), వెల్లుల్లి, వెలుగు, వెండి, వెలయించు, వెల్లిక, బెళుకు (తళుకు-బెళుకు), బొల్లి ‘తెల్ల మచ్చల వ్యాధి’ ఈ పదాలన్ని ఈ ధాతువుకు సంబంధించినవే.
నలుపు
*కార్-/కరు అన్న ధాతువుతో అన్ని ద్రావిడ భాషలలో నలుపు రంగుకు సంబంధించిన పదాలు కనిపిస్తున్నాయి. అయితే, ఇక్కడ కూడ, తెలుగులో ప్రత్యేకంగా ఇతర భాషల్లో లేని నలుపు అన్న పదం రంగు పదంగా కనిపించడం. తమిళంలో నల్లం అంటే బొగ్గు అన్న అర్థమే గాని రంగు పదం అన్న అర్థంలో స్థిరపడలేదు.

కారు- అన్న పదం విశేషణంగా ‘కారుమబ్బు’ అంటే నల్లటి మబ్బులు, ‘కారుమినుము’ అంటే నల్లని మినుములు అన్న పదాల్లో కనిపిస్తాయి. కారుకొను- అంటే నల్లబాఱు-; కగ్గు- అంటే నల్లబడు, రంగు తగ్గిపోవు మొదలైన అర్థాలున్నాయి.

కారు- అన్న పదం అర్థవ్యాకోచం చెంది అది వర్షకాలానికి, వర్ష ఋతువుకు సూచనగా మారిపోయిందని మనం ఇదివరకే కాలమాన పదాలను విశ్లేషించినప్పుడు వివరంగా చర్చించాం కదా! అదీ గాక, కారు- అంటే కాడు- అన్న అర్థం కూడా ఉంది. కారుచిచ్చు అంటే అడవిలోని చిచ్చు. అయితే, నలుపు అన్న అర్థంలో కారు-, కాడు- అన్న అర్థంలోని కారు రెండు వేర్వేరు ధాతువులకు సంబంధించినవి (మనకు తెలిసినంతలో).

కర్నాడు- (కర్నాటక) అంటే నల్ల నేల గల నాఁడు (దేశం) అని అనుకుంటే, మరి వెలనాడు తెల్ల నేల గల దేశం అనుకోవాలేమో!

కెమ్-/చెమ్-, ఎఱుపు
ఎఱుపుకు అన్ని ద్రావిడ భాషలలో కనిపించే ధాతువు కెమ్-. అయితే, తెలుగులోనూ, తమిళంలోనూ తాలవ్యాచ్చులముందు క-కారం చ-కారంగా మారింది కాబట్టి ఆ భాషలలో ఎఱుపును సూచించే పదాలు చెమ్- తొ ఉంటాయి. అయితే, ఈ రకమైన తాలవ్యీకరణకు ముందే ఏర్పడిన సమాసాలు కొన్ని తెలుగులో కొన్ని పూర్వ రూపంలోనే ఉండిపోయాయి. కెమ్- ధాతువుతో కనిపించే కొన్ని తెలుగు పదాలు:

కెంజాయ, కెంజిగి, కెంజిగురు, కెందలిరు, కెందళుకు, కెందామర, కెందొవ, కెంబట్టు, కెంబువ్వు, కెంబెదవి, కెన్నురువు, కెమ్మొక్క, కెమ్మోవి, కెంగేలు, కెంజడ,

అయితే, ఇందులో కొన్ని కన్నడ నుండి ఆ తరువాతి కాలంలో ఎరువు తెచ్చుకున్న పదబంధాలు కూడ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. తరువాతి కాలంలో చెన్- అన్న ఉపసర్గ తెలుగులో విరివిగా ఉపయోగంలో కనిపిస్తుంది. చెంగలువ, చెంగావి, మొదలైనవి కొన్ని ఉదాహరణలు.

వెలుగు, చీకట్లను తెలుపు నలుపులుగా మానవుడు ఊహించే మొదటి స్టేజికి, ఎఱుపును, తెలుపు, నలుపులతో పాటు ఒక రకమైన రంగుగా గుర్తించడానికి చాలా తేడా ఉంది. అందుకే, చాలా భాషల్లో ఎఱుపు రంగు పదానికి చాలా రకాలుగా అర్థవిస్తృతి కనిపిస్తుంది. సంస్కృతంలో రాగ అన్న పదానికి రంగు అన్న అర్థంతో పాటు ఎఱుపు అన్న అర్థం కూడ ఉంది. అలాగే, రాగము అంటే అనురాగము. సంగీత పరంగా రాగమ్ అన్న పదానికి ఉన్న అర్థ విశేషం అందరికీ తెలిసిందే.

తెలుగువంటి ద్రావిడ భాషలలో కూడా ఎఱ్ఱ రంగుకు ప్రాథమిక పదాలైన కెన్ను-/చెన్ను- అన్నవి ఆరోగ్యానికి, వెలుగును సూచించడానికి కూడా వాడే అర్థవిస్తృతి ఉంది. చెన్నుపడు- అంటే ప్రకాశించు, ఎఱ్ఱనగు, వన్నె కలుగు. చెన్నుడు అంటే అందగాడు.

ఎఱ్ఱ-, ఎఱుపు- అన్న పదాలు ఇతర ద్రావిడ భాషలో అంతగా కనపడవు. అయితే, ఇతర ద్రావిడ భాషలలో మాంసానికి కనిపించే పదాలైన ఇఱచ్చి, ఇఱ్ఱి, ఇఱచి, ఎఱచ్చి మొదలైన పదాలకు తెలుగులోని ఎఱ్ఱ పదానికి సంబంధం ఉండవచ్చునని నా ఊహ. లేదా, సాధు రేఫముతో కనిపించే ఎరువై (తమిళం. రక్తం), ఎరె (కన్నడ) పదాలకు సంబంధించింది కూడా కావచ్చు.

ఇవి కాక, ఎఱుపుకు సంబంధించి కావి, జేగురు, గవర వంటి అచ్చ తెలుగు పదాలు, అరుణ, రక్త, రోహిత, లోహిత, శోణిమ వంటి సంస్కృత పదాల ప్రయోగం తెలుగులో కనిపిస్తుంది. చెంగావి (చెన్- + కావి) అన్నది పునరుక్తి కావచ్చు. మనుచరిత్రలో వరూధిని కంటి ఎఱుపును కావి అని పెద్దన వర్ణించిన ఓ పద్యం మచ్చుకు చూడండి:

ఈ విధమున నతి కరుణము
గా వనరుహనేత్ర కన్నుఁగవ ధవళరుచుల్
కావిగొన నేడ్చి వెండియు
నా విప్ర కుమారుఁ జూచి యలమటఁ బల్కెన్

పచ్-, పచ్చ
పచ్- అన్న ధాతువు ద్రావిడ భాషల్లో ఎన్నో పదాలకు మూలమైనది. ఇది ఆకుపచ్చ (green) రంగుకు, పసుపుపచ్చ (yellow) రంగుకు కూడా వాడడం అన్ని ద్రావిడ భాషల్లోనూ కనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో ఈ రెండు రంగులను విభేదించడానికి కొన్ని భాషల్లో ప్రత్యేక విశేషణాలను ఉపయోగిస్తే (ఉదా: తెలుగు. ఆకు-పచ్చ, పసుపు-పచ్చ), మరి కొన్ని భాషల్లో ప్రత్యేక పదాల వాడకం కనిపిస్తుంది (ఉదా: తమిళం. మంజల్ ‘పసుపుపచ్చ’).

కొత్తగా చిగురించిన కొమ్మలు, ఆకులు, మొగ్గలలో కనిపించే రంగు పచ్చ. పచ్- అన్న ధాతువు సంబంధించిన కొన్ని పదాలను పరిశీలిద్దాం:

పసి: అప్పుడే పుట్టిన శిశువులలో కనిపించే లేతదనాన్ని పసి- అని పచ్చ రంగు అపాదించడం అన్ని ద్రావిడ భాషల్లోను కనిపిస్తుంది. ముక్కు పచ్చలు ఆరని, పచ్చగా పదికాలలు బతకటం వంటి జాతీయాల్లో కూడా లేతదనంతో పాటు, ఆరోగ్యంగా ఉండటం అన్న అర్థం స్ఫురించే ప్రయోగాలు ఇవి.

పసిడి: బంగారం పచ్చగా ఉంటుందని మనకు తెలుసు కదా! అచ్చులు మధ్య –చ-కారం, -స- కారంగా మారడం కొన్ని సార్లు, ఆ -స-కారం, -య-కారంగా కూడా మారిపోవడం ద్రావిడ భాషల్లో సహజం. అప్పుడు పసిడి- పయిడి (పైడి) అవుతుంది.

పసరు: ఆకుపచ్చ రంగు రసం.

పచ్చిక, పైరు: పచ్చదనానికి చెందినవే పచ్చిక. పసిరు > పయిరు > పైరు గా మారింది.

పాచి: ఆకుపచ్చటి నాచు, నీళ్లలోని పచ్చని మురికి

ఇతర రంగు పదాలు
ఊదా రంగు: సంస్కృతంలో అవదాత అంటే శుద్ధిచేయు, మెఱయు అన్న అర్థాలున్నాయి. అవదాత- ప్రాకృతంలో ఉద్దాత గాను, ఉద్దాయి గాను కనిపిస్తుంది. తరువాత హింది, గుజరాతి మొదలైన భాషలలో కనిపించే ఊదా రంగుకు ఈ పదాలే మూలమని భాషావేత్తల నమ్మకం.

ఖాకీరంగు: ఖాక్- అంటే పారశీక భాషలో ధూళి, మట్టి అని అర్థం. ఖాకి రంగు అంటే ధూళి రంగే. ఆగ్ల భాషలో కనిపించే ఖాకి అన్న పదానికి కూడ ఇదే మూలం.

గులాబి రంగు: గులాబి పువ్వు, రంగు- ఈ రెండూ మనకు ముస్లింల పాలన ద్వారా మనకు వచ్చినవే.

ప్రాథమిక రంగు పదాలే కాక, వస్తువును విశేషణంగా వాడుతూ చెప్పే రంగు పదాలు కోకొల్లలు: చెక్కరంగు, బెల్లపురంగు, పగడపురంగు, పసరురంగు, కచ్చకాయరంగు, మట్టిరంగు, మణిరంగు, గోపిరంగు, జాంబురంగు, మొగిలిరంగు, మొగులురంగు, సిమెంటురంగు, బూడిదరంగు, బూరారంగు, నాచురంగు మొదలైనవి కొన్ని ఉదాహరణలు.

అలాగే, పక్షుల ద్వారా సూచించే రంగు పదాలు: చిల్కపచ్చరంగు, పాలపిట్టరంగు మొదలగువని.

కూరగాయలు, చెట్ల పేర్లతో కూడిన రంగు పదాలకు ఉదాహరణ: బీరపువ్వురంగు, వంకాయరంగు, మానుగాయరంగు, మిరపపండ్లరంగు, పోఁకరంగు, రేలపూరంగు, పోకబంతిరంగు
--------------------------------------------------------
రచన: సురేశ్ కొలిచాల, 
ఈమాట సౌజన్యంతో


అదనపు సమాచారం -
1.అష్టదిగ్గజాలలో నొకఁడైన ధూర్జటి కాళహస్తిమాహాత్మ్యంలోని ఈక్రింది పద్యంలో నీటిబిందువులవల్ల విశ్లేషణంచెందే సూర్యరశ్మిప్రస్తావన ఈవిధంగా ఉన్నది.

ప్రాతఃకాలతుషారశీకరచయప్రాప్తిన్ లసన్మౌక్తికో
పేతాగారములట్లు చెల్వెసఁగి,తద్బిందుచ్ఛటాజాత ఖ
ద్యోతచ్ఛాయలఁ గొంతసేపు బహురత్నోదీర్ణగేహంబులై
లూతాకల్పితతంతుసద్మములు వొల్చుం, జెప్పఁ జిత్రంబులై.

ఈపద్యంలో తుషారబిందువులచేత విశ్లేషణం చెందిన (అంటే రంగులు రంగులుగా విడిపోయిన)సూర్యరశ్మివల్ల లూతాకల్పితతంతుసద్మములు బహు(వర్ణ)రత్నోదీర్ణమగునట్లు వెలుగొందుచున్నట్లున్నవని చెప్పడం జరిగింది. అంటే నీటిబిందువు పట్టకంలాగా సూర్యునిరంగులను విడగొట్టడం ఆనాటికే ఎందరో గమనించడంజరిగింది. కాని ఇందులో ఆవిడగొట్టఁబడిన రంగుల పట్టీలేదు గాని, అవి బహువర్ణములని గమనించినట్లు తెలుస్తున్నది.

2. గుప్తరాజులకాలంనాటిదిగా భావింపఁబడే అమరకోశంలో, తెలుపు, పసుపుతోఁ గూడిన తెలుపు (హరిణవర్ణము), ధూసర (బూడిదరంగు),నలుపు (కృష్ణే నీలాసిత శ్యామ కాల శ్యామల మేచకాః అని అమరం, ఇందులో నీలం అసితశబ్దానికి అంటే నలుపుకు పర్యాయంగా చెప్పఁబడింది), పీతము (పసుపుపచ్చ),హరితము (ఆకుపచ్చ), రక్తము (ఎఱుపు),శోణ, అరుణ, పాటల, కపిశ, ధూమ్ర,కర్బుర, పింగళవర్ణములకు పర్యాయపదము లున్నవి. నీలతివస్త్వన్తరమితి నీలః అంటే ఇతరవస్తువులను నల్లగఅంజేయునది అని నీలశబ్దమునకు వ్యుత్పత్తి. కాని ‘నీలీ’ ‘నీలినీ’ అని నిలిచెట్టుకు పేర్లు. అందుచేత మొదటినుండి నీలశబ్దం నలుపుకు, నీల(బ్లూ) వర్ణానికి వర్తించడం గమనించవచ్చు.
                               ----- దేశికాచారి
-----------------------------------------------------------
హంసవింశతిలో రంగులను గుఱించిన ఒక పద్యమును క్రింద చదువవచ్చును –

హరిత హారిద్ర కృష్ణ ర-క్తావదాత
శబల పాటల ధూమల – శ్యామ కపిల
వర్ణములఁ గూర్చి చిప్పల – వాగె లునిచి
చిత్తరువు వ్రాయు గుళ్లలోఁ – జిత్రఘనుఁడు
– అయ్యలరాజు నారాయణామాత్యుఁడు, హంసవింశతి, 3.008

(హరిత = ఆకుపచ్చని, హారిద్ర = పసుపు, కృష్ణ = నలుపు, రక్త = ఎఱుపు, అవదాత = తెలుపు, శబల = వివిధ వర్ణయుక్త spotted, పాతల = తెలుపు కలిసిన ఎఱుపు, ధూమల = నలుపు కలిసిన ఎఱుపు, శ్యామ = నలుపు, కపిల = గోరోజనము, మట్టి రంగు, వాగె = కుంచె)
                                  ------------మోహన

No comments: