Thursday, March 28, 2019

ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల


ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల




సాహితీమిత్రులారా!


1.
సాహిత్యశాఖలో నవల కొత్తది. రెండు శతాబ్దాల క్రిందటనే రూపొందినా అన్ని సాహిత్యశాఖల సద్గుణాలను ఏకముఖం చేసి బహుముఖాల వర్ధిల్లినది. ఇంకా విజృంభించే అవకాశాలు కానవస్తూ, ‘నవలాంతమ్ సాహిత్యమ్’ అనిపిస్తున్నది.

నవలకు మూలభూతమైనది కథ. నవలలో కథాకథనంతో పాత్రసృష్టి చేయవచ్చు. సాంఘిక, ఆధ్యాత్మిక జీవితము చిత్రించవచ్చు. వాఙ్మయ సంఘర్షణలు ప్రదర్శించవచ్చు. నేటి జీవితాన్ని విమర్శించి ఆదర్శజీవితం సూచించవచ్చు. ఇంకా ఎన్నో సాధించి ఆనందం కలిగించవచ్చు. స్థూలంగా నిర్వచనం చేస్తే, పూర్వకాలానికి సంబంధించినదైతే చారిత్రక నవల అవుతుంది.

చరిత్రాత్మక నవల అనేది రెండు విరుద్ధ శబ్దాల సమ్మేళనమనే భ్రాంతి కలిగిస్తుంది. జరిగినదంతా వ్రాసుకుంటూ పోతే చరిత్ర కాదు. లోకానికో, దేశానికో, సంఘానికో, వ్యక్తికో, మంచికో, చెడుకో ప్రభావం కలిగించే సంఘటనలు వ్రాస్తేనే చరిత్ర. దానితో అనుగుణమైన కల్పన జోడిస్తే చరిత్రాత్మక నవల అవుతుంది. దానికి చరిత్ర బీజముంటే చాలును.

వేదవేదాంతాలలో, పురాణాలలో, కొన్ని కథలు వినీ వినడంతోనే ఎవరికో ఎప్పుడో తప్పక జరిగిన సంఘటనే అనిపిస్తవి. అది చరిత్ర బీజము. అగస్త్యుడు వింధ్యపర్వతము దాటి దక్షిణానికి వచ్చిన కథ దక్షిణాపథమంతా ప్రభావితం చేసి బహువిధాల రూపుదాల్చింది. రామాయణ మహాభారతాలను ఇతిహాసాలంటున్నాము. ఆ రెండు గ్రంథాలు భారత భూమినంతా ప్రభావితం చేసి నిత్యజీవితంతో పెనవేసుకొన్నవి. ఇతిహాసలక్షణ మిట్లా పెద్దలు చెబుతున్నారు:

“ధర్మార్థ కామమోక్షాణాం ఉపదేశ సమన్వితమ్
పురావృత్తం కథాయుక్తమ్ ఇతిహాసం ప్రచక్షతే (ప్రచక్ష్యతే?)”

కాబట్టి చరిత్రాత్మక నవలకు రామాయణ మహాభారతాలు మార్గదర్శకములుగా భావించవచ్చు.

చరిత్రకూ నవలకూ వైరుధ్యం లేదు. డాక్టరు గోపాలరెడ్డి ఒకచో “చరిత్రాత్మక నవల ఇతిహాసకత్వమూ కల్పనాసౌందర్యమూ సమరసమొందిన కూర్పు .. లేక సత్యసౌందర్యముల సమ్మేళనము” అన్నారు. అది ఒక మనోహర సూత్రప్రాయంగా గ్రహింపవచ్చు.

మనము ప్రత్యక్షముగా చూస్తూ వింటూ వున్న నేటి సంఘటనలను కథావస్తువులుగా గ్రహించి వ్రాయడము సులభ మనిపిస్తుంది. కాని ఆ సంఘటనల లోని ప్రధాన విషయాలు గ్రహించి రచన చేయడానికి కొంత ఆర్షదృష్టి ఉంటేనే కాని రాణించదు. అది లేకపోతే వార్తాలేఖనం లోకి దిగజారుతుంది. లేకపోతే ధనికులంతా దుర్గుణ పుంజాలుగానూ, దరిద్రులంతా సద్గుణమూర్తులుగానూ చిత్రిస్తూ పరశ్శతంగా ఈ కాలంలో వస్తున్న ప్రచార నవలలుగా రూపొందే ప్రమాద మెక్కువ ఉన్నది. కాబట్టి నేటికాలానికంటే గడచిన కాలాన్ని చిత్రిస్తేనే కొంత నిర్లిప్తతతో రచన చేసి సారస్వతసిద్ధి కలిగించేందుకు ఎక్కువ అవకాశమున్నదేమో!

చారిత్రక నవలాకారులను ఎదుర్కొనే ప్రమాదమొకటి ఉన్నది. ఇప్పటి తమ ఆదర్శాలూ, భావాలూ పూర్వకాలాలవారికి అన్వయించి చరిత్రను తారుమారు చేయడము. ముఖ్యంగా నేటి రాజకీయవాదులు చేస్తున్న దోషమిది. ఇట్టి రచనల వల్లనే నేటి సంఘంలో లేనిపోని ద్వేషాలు, కక్షలు ప్రబలుతున్నవి. సార్వకాలికమైన ధర్మసూత్రాలు బుద్ధిలో దృఢంగా ఉంచుకుంటేనే రచనలు ఉత్తమస్థాయి నందుకొంటవి.

పాశ్చాత్యులు శవాలను, శల్యాలను భద్రపరచినట్లే, జరిగిన సంఘటనలు వ్రాతపూర్వకంగా పదిలపరుస్తారు. అందువల్ల అక్కడ చరిత్ర శల్యాలకు ఎక్కువ ప్రాధాన్యముంటుంది. మన అదృష్టం వల్ల మన గతచరిత్ర వివరాలు అంత ఎక్కువగా లేనందువల్ల చారిత్రక నవలాకారులకు స్వతంత్ర కల్పనలు చేసేందుకు అవకాశా లెక్కువ ఉన్నవి. మన కావ్యాదులవల్ల ఆయా కాలాల సాంఘిక మతాచారాదులు తెలియవస్తున్నవి. వాటిని మాత్రము ఉల్లంఘించకుండా జాగ్రత్తపడితే చాలును. చరిత్రాత్మక నవల విశృంఖలంగా ఊహావీధులలో స్వైరవిహారము చేయవచ్చును.

2.
ఆంధ్రభాషలో నవలతో పాటుగానే చరిత్రాత్మక నవల కూడా క్రీ. శ. 19వ శతాబ్దము చివరి దశాబ్దంలో అవతరించింది. అప్పుడు టాడ్ సేకరించి ప్రచురించిన రాజస్థాన్ కథావళి దేశాన్ని ఆకర్షించింది. దాన్ని ఆంధ్రీకరించిన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహము, హేమలత అనే మొదటి చరిత్రాత్మక నవల వ్రాశారు. అది రాజపుత్ర స్థానానికి సంబంధించినదే. ఆ తర్వాత శివాజీ మొదలైన మహారాష్ట్ర వీరుల గాథలు ప్రచారంలోకి వచ్చినవి. హోల్కారు రాజ్యానికి సంబంధించిన అహల్యాబాయి అనే నవల కూడా చిలకమర్తివారే రచించారు. తర్వాత విజ్ఞాన చంద్రికా గ్రంథమండలివారు హిందూ మహాయుగము, మహమ్మదీయ మహాయుగము, చంద్రగుప్తుడు, శివాజీ చరిత్ర ప్రచురించినారు. శ్రీ చిలుకూరి వీరభద్రరావు ఎంతో పరిశ్రమచేసి ఆంధ్రుల చరిత్ర ప్రకటించారు. ఐనా మండలివారి ప్రథమ బహూకృతులందిన శ్రీ భోగరాజు నారాయణమూర్తి ‘విమలాదేవి’, శ్రీ వేలాల సుబ్బారావు ‘రాణీ సంయుక్త’ కూడా రాజస్థాన కథలకు సంబంధించినవే.

ఆంధ్రచరిత్రకు సంబంధించిన మొదటి నవలలు 1914లో వచ్చినవి. శ్రీ దుగ్గిరాల రాఘవచంద్రయ్య ‘విజయనగర సామ్రాజ్యము’, శ్రీ కేతవరపు వేంకటశాస్త్రి ‘రాయచూరు యుద్ధము’ – ఇవి కూడా మండలివారి బహూకృతులందినవే. ఐనా బహుకాలము వరకు ఆంధ్ర నవలాకారులకు రాజపుత్ర మహారాష్ట్ర వీరగాథలే అభిమానపాత్రమైనవి. ఆ రచయితలు ఆ దేశకాలాలతో గాఢపరిచితి లేనివారు గనుక అవి నామమాత్రానికే చారిత్రక నవలలు. శ్రీ వేంకట పార్వతీశ్వర కవుల వసుమతీ వసంతములో మౌర్య చంద్రగుప్తుడు ప్రధానపాత్రగా వచ్చుట ఒకటే కొంత మార్పు. అశోకచక్రవర్తి జీవితాన్ని చిత్రిస్తూ శ్రీ కేతవరపు వేంకటశాస్త్రి రచించిన ఇచ్ఛినీకుమారి అనే నవల చిన్నదైనా మొదట వచ్చిన చరిత్రాత్మక నవలలలో ఉత్తమమైనది.

మేధావులు స్వాత్రంత్ర్య సమరముతో సతమత మవుతున్నందు వల్లనేమి, రచయితల దృష్టి ప్రధానంగా కవిత్వరంగం మీద ప్రసరించినందు వల్లనేమి, వచన రచయితలు ప్రసిద్ధ నవలల ఆంధ్రీకరణాలతో తృప్తిపడుచున్నందు వల్లనేమి, బహుకాలము వరకు ఆంధ్రులచరిత్ర నవలాకారులను తగినంతగా ఆకర్షించలేదు.

3.
ఆంధ్ర చారిత్రక నవలకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ‘ఏకవీర’తో 1932 ప్రాంతాలలో కొత్తమలుపు ఇచ్చారు. అది తమిళదేశానికి సంబంధించినదైనా, మధుర నేలిన ఆంధ్ర నాయకరాజుల చరిత్రకు సంబంధించిన దైనందున ఆంధ్రుల చరిత్రకు గూడా సంబంధించినది. అందులో ప్రధాన పాత్రలు ఆంధ్రదేశం నుంచి వలసపోయిన కుటుంబాలవారు. ముద్దుకృష్ణప్ప నాయకుని మరణమూ, ఆ తర్వాతి తిరుమల నాయకుడు పట్టాభిషిక్తుడు కావడము జరిగిన కాలపు కథ. ఈ నవలలో ప్రధాన కథ ఇద్దరు మిత్రుల సాంసారిక జీవనానికి సంబంధించినదైనా సందర్భవశాత్తుగా అప్పటి సాంఘిక పరిస్థితులు, పోర్చుగీసువారి దుండగాలు-దోపిడులు, రాబర్టు నోబిలి తత్త్వబోధకస్వామి అనే సన్యాసి వేషంతో చేసిన దొంగమతబోధ, దేవాలయాలలోని శిల్పనైపుణ్యాదులు చక్కగా ప్రదర్శింపబడ్డవి. తమిళ కవయిత్రి అవ్వయారు వ్రాసిన ‘అతిచ్చూడి’ లోని ఆరంజేవిరుంబు (ధర్మము చేయుము) ఆరవదు శివం (కోపపడకుము) ఇత్యాది బాలబోధలు ప్రౌఢబోధలై ప్రధాన పాత్రలను ధర్మపథాన నడిపించడము రమ్యముగా చిత్రింపబడ్డది. ఆంధ్రులు తమ నివాసము ఎక్కడ ఏర్పరచుకొన్నా అక్కడ ఉత్తమ సంస్కృతిని స్వాయత్తము చేసుకొనే తీరు మనోహరంగా సూచించారు నవలాకర్త. ఏకవీరలో కల్పనకూ చరిత్రకూ మంచి కుదిరిక ఏర్పడ్దది.

ఆ తర్వాత శ్రీ విశ్వనాథ బద్దన్న సేనాని, ఇత్యాది చారిత్రక నవలలు వ్రాశారు. కాని అవి ఏకవీర స్థాయిని అందుకోలేదు. వారీమధ్య శరపరంపరగా ప్రచురిస్తున్న పురాణ వైర గ్రంథమాల లోని నవలలు ప్రత్యేకముగా ప్రస్తావిస్తాము.

ఇంతలో ఆంధ్రుల చరిత్రకు సంబందించిన ప్రామాణిక గ్రంథాలు ఎన్నో రాసాగినవి. శ్రీయుతులు చిలుకూరి వీరభద్రరావు, భావరాజు కృష్ణారావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, కురుగంటి సీతారామయ్య, డాక్టరు నేలటూరి వేంకట రమణయ్య, డాక్టరు మారేమండ రామారావు ఎన్నో ప్రత్యేకగ్రంథాలు ప్రచురించారు. ఐతిహాసిక మండలివారు రాజరాజ నరేంద్ర సంచిక, కళింగ సంచిక, రెడ్డి సంచిక, కాకతీయ సంచిక, శాతవాహన సంచిక మొదలైన అమూల్య గ్రంథాలు ప్రచురించి ఆంధ్రుల చరిత్రతో పాటు మూలాధారాలు కూడా పాఠకుల అందుబాటులోకి తెచ్చారు. కాని వాటినన్నిటినీ కొద్దిమంది నవలాకారులు మాత్రమే ఉపయోగించుకున్నారు. వారిలో గణింపదగినవారు ఆంధ్ర విశ్వవిద్యాలయం బహుమతు లందిన ముగ్గురూ, తక్కినవారిలో శ్రీయుతులు అడవి బాపిరాజు, నోరి నరసింహశాస్త్రి. ఈ ఐదుగురి నవలలతో ఆంధ్ర చరిత్రాత్మక నవల సంపూర్ణ పుష్టితో అవతరించినది.

4.
ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు ఇంటర్మీడియేటు క్లాసుకు ఉపవాచకాలుగా నిర్ణయించే నిమిత్తము ఆంధ్ర చరిత్రకు సంబంధించిన ఉత్తమ నవలకు ఒక్కొక్కదానికి వెయ్యి రూపాయలు బహుమతి ప్రకటించారు. 1951 నాటికి ఆంధ్రదేశములో నవలాకారులలో ఏ కొద్దిమందికో తప్ప అంత ప్రతిఫలము నవలారచన వల్ల ముట్టడము లేదు. ఇందువల్ల అంతకు ముందు నవలలు వ్రాయనివారు చరిత్ర శ్రద్ధగా పఠించి చారిత్రక నవలలు వ్రాయడానికి పూనుకొని మంచి నవలలు వ్రాశారు.

అట్టివారిలో అగ్రగణ్యురాలు శ్రీమతి మల్లాది వసుంధర. ఆమె మొదటి నవల తంజావూరు పతనము. ఆ బహుమతు లందిన నవల లన్నిటిలో సర్వవిధాల అగ్రగణ్యమైనది. ఆమె కాలేజీ విద్యార్థినిగా ఉన్నప్పుడే అటువంటి నవల వ్రాయడము ఆశ్చర్యకరమైనది. ఏకవీరలో వలెనే దీనిలోని కథాంశము కూడా తమిళదేశములో జరిగినదైనా, తంజావూరు పాలించిన ఆంధ్ర నాయకరాజులలో చివరివాడగు విజయరాఘవరాయల పాలనము చిత్రించినందువల్ల ఒకవిధంగా ఆంధ్రుల చరిత్రకు సంబంధించినదే. ఇందులో ఆ యాస్థానములో కవిత్వము, సంగీతము, నృత్యము, శిల్పము పరాకాష్ట నందుట చక్కగా పోషింపబడ్డది. కాని రాజు భోగలాలసత, వేశ్య రంగాజమ్మ యందు వ్యామోహము, ముఖస్తుతి యందు ప్రీతి, ఆస్థానకవులు స్తుతించుచున్నట్లు తాను నిజముగా భగవంతుడనే అనుకొనుట, శ్రీకృష్ణదేవరాయల యంతవాడనని గర్వించుట, తన అష్టమహిషులతో దక్షిణ నాయకత్వము సమర్థింపలేకుండుట, వెంకన్న కుట్ర కననగుట ఏవిధముగా రాజ్యపతనమునకు దారితీసినవో అద్భుతముగా చిత్రింపబడినవి. పరమభక్తుడైన పెద్దిదాసు పాత్ర, అమాయకుడైన ఎల్లు సోమయాజుల రాయబారములు, యువరాజును బంధించినందున కోపోద్దీపితయైన పట్టమహిషి రాజగోపాలాంబిక విజృంభణము, విజయరాఘవనాయకునకు ఉంపుడుకత్తెగా ఉన్న రంగాజమ్మ తనకు సోదరియని చివరకు తెలిసినందున కలిగిన నిర్వేదము, పాఠకుల హృదయములలో చిరకాలము నిలిచిపోవును. ఈ నవల వసుంధర సర్వతోముఖ ప్రజ్ఞకు ప్రతీక.

కాకతీయ రాజ్యపతనమును గూర్చి ఆమె రచించిన సప్తపర్ణి కూడా బహుమతి నందినది. ఇందులో గూడ కక్షలు, ద్వేషములు, దురభిమానము, ఆడంబరముల కాస్థాన గౌరవము ఏ విధముగా రాజ్యపతనమునకు దారి తీసినవో వర్ణించుటకు ప్రయత్నించినది. ఇందులో జక్కనాచార్యుడను మహాశిల్పి తన మంత్రతంత్రశక్తిని జోడించి సప్తపర్ణిని అష్టవర్ణినిగా చేసి రాజ్యము మరియొక తరము వరకూ నిలుపుటకు చేసిన ప్రయత్నానికి అవకాశము లభింపకపోవడమనే కల్పనమీద కథ నడచినది. ఈ భావనలోనే కొంత అసంబద్ధత ఉన్నందువల్ల హృదయానికి హత్తుకోదు. రాజవంశములో ఏడుగురు రాజులు ఉండిరనే విషయ మాధారము చేసుకొని సప్తపర్ణి కల్పన నడచినది. ఐనా ఈ నవల కూడా గణింపదగినదే.

ఆమెయే ఈమధ్య రచించిన రామప్పగుడి అనే నవల విశ్వవిద్యాలయ బహుమతు లందినది కాకపోయినా ఈ సందర్భములో ప్రస్తావింపదగినది. రామప్పగుడి లోని శిల్పసౌందర్యము అనన్య సామాన్యము!

శ్రీ ధూళిపాళ శ్రీరామమూర్తి రచించిన భువన విజయము, గృహరాజు మేడ, విశ్వవిద్యాలయము బహుమతు లందినవి. ఆయన సాహిత్యవేత్త. ‘భువన విజయము’లో శ్రీకృష్ణదేవరాయలు ఆదిల్షాను జయించుటతో ప్రారంభించి ప్రాచీ దిగ్విజయయాత్ర చేసి దుర్గములెన్నిటినో జయించి కటకము వరకూ యాత్ర చేసి గజపతి కుమార్తె యయిన తుఖాదేవిని వివాహమాడి భువనవిజయ సభా నిర్మాణము పూర్తిచేయించుటతో పర్యవసిస్తుంది. ఐనా ఈ కథయంతటిలో సూత్రరూపంగా నడిచిన కథ చిన్నాదేవి తిరుమలదేవితో పాటు శ్రీకృష్ణదేవరాయల మహిషిగా గౌరవింపబడిన వృత్తాంతము. ఆమె నిజముగా రాజపుత్రికయే ఐనను వేశ్యమాతచేత పెంపబడి ‘గాండ్లసంగి’ అను పేర రాయలకు ప్రేమభాజన మవుతుంది. ఆమె ప్రణయకోపము వల్ల రాయలకు ఆమె పైన అనుగ్రహము తప్పుతుంది. నందితిమ్మన అనే మహాకవి తన పారిజాతాపహరణ కావ్యము రచించి రాయలకు మరల అనుగ్రహము కలిగించినాడను ఐతిహ్యము మీద ఈ మూలకథ నడిచినది. ఇందులో శ్రీరామమూర్తి సూక్ష్మాతిసూక్ష్మ సన్నివేశములతో తన సాహిత్య వైశారద్యము ప్రదర్శించి ‘పారిజాత’ సౌరభము నవలలో అంతటా గుబాళింపజేసినాడు. ఈ నవలలో తిరుమలదేవి ఉదాత్తత, తిమ్మోజు కుండోజుల శిల్పప్రావీణ్యము, నంది తిమ్మన కవితా మాధుర్యము, పెద్దన మహాకవి సహృదయత హృదయంగమంగా రాణించినవి. రాయల వీణామధువగు కృష్ణపండితుని చక్రవాకరాగము తిరుమలదేవి కంఠములో విరహవేదనగా మధురాతిమధురంగా పొంగి పాఠకుల శ్రోత్రాలలో ప్రతిధ్వనిస్తుంది.

వారి గృహరాజు మేడలో కూడా సాహిత్య వైశారద్యము ప్రతిబింబిస్తున్నది.

మరొక విశ్వవిద్యాలయ బహుమతి నందిన నవల శ్రీ పాటిబండ మాధవ శర్మ ‘రాజశిల్పి.’ ఇది కొండవీటి రెడ్డిరాజ్యమును కుమారగిరి పరిపాలించిన నాటి చరిత్రను చిత్రించునట్టిది. కుమారగిరి జీవించియుండగానే కొండవీటి రాజ్యము నుండి రాజమహేంద్రవర రాజ్యము చీలిపోయినది. కొండవీటి రాజ్యానికి ఆయన దూరపు జ్ఞాతియైన పెదకోమటి వేమారెడ్డి, రాజమహేంద్రవర రాజ్యమునకు కుమారగిరి మేనల్లుడూ ప్రభువులైనారు. కుమారగిరి హృదయపూర్వకముగా రెండు రాజ్యములు అర్పించి తాను కొండలలో ఎక్కడనో శిల్పిగా ఉండుటకు నిశ్చయించుకొనడముతో నవల అంతమవుతుంది. కుమారగిరి భోగలాలసుడైన ప్రభువనీ, లకుమాదేవి అతని ఉంపుడుకత్తె యని చారిత్రకుల భావము. ఈ నవలలో కుమారగిరి మకరంద మధురమైన హృదయము గల ఉత్తమ వ్యక్తి గాను, లకుమాదేవి ఉత్తమాదర్శములు గల కేవల కళోపాసన చేయు నాతని సోదరి గాను చిత్రింపబడినది. ఆ తర్వాత వేమభూపాల చరితము సంస్కృత పద్యకావ్యముగా రచించి గద్యకవి సార్వభౌముడని, వామన భట్టబాణుడని బిరుదములందిన వామను డిందులో ఎక్కువ రాజనీతిధురంధరుడుగా భాసించును. ఆయన వైదుష్యము కంటె కాటయవేముని వైదుష్యము ఎక్కువ ప్రకాశిస్తున్నది. పెదకోమటి వేమారెడ్డి (వేమ భూపాల చరిత నాయకుడు) అల్పుడుగా భాసిస్తాడు. ఆయన రాజ్యకాలములో విద్యాధికారియైన శ్రీనాథ కవిసార్వభౌముడు కూడా ఈ నవలలో అల్పుడుగానే చిత్రింపబడ్డాడు. మంత్రిసింగన కూడా వీరశైవ కోలాహలముతో కలసినాడు. ఒకవిధంగా చూస్తే ఇది కుమారగిరి పక్షము వహించి వ్రాసిన నవల. అట్లా చేయడానికి నవలాకారులకు నిస్సందేహంగా స్వాతంత్ర్యమున్నది. మొత్తము మీద ఇందులో ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులు ప్రతిబింబించినవి. వెంకోజు ఇంద్రజాలము, తిప్పయశెట్టి సమ్మానము, మల్లాంబిక సంగీతము, లకుమాదేవి నాట్యము, వీరాస్వామి సన్నాయి వాద్యము నవల యంతటా ప్రతిధ్వనిస్తవి! సామాన్యముగా నవలలోని భాషకంటె ఇందులోని భాష ప్రౌఢతరమైనది.

5.
ఆంధ్ర చారిత్రక నవలను ఆంధ్ర సారస్వత పరిధిని దాటించిన వారిలో ప్రథముడు అడవి బాపిరాజు. ఆయన మూడు చారిత్రక నవలలలో ‘హిమబిందు’ నిస్సందేహంగా ప్రపంచ భాషలలోని ఉత్తమ నవలల స్థాయి నందుకొన్నది. బాపిరాజు కొంతకాలము లాయరు, కొంతకాలము జాతీయ కళాశాలలో అధ్యాపకుడు, కొంతకాలము దిన పత్రికా సంపాదకుడు, కొంతకాలము వెండితెర మీద చిత్రనిర్మాత. స్వయముగా చిత్రకారుడు, కవి, కథకుడు. మెత్తని హృదయము కలవాడు. తరుగని ఉత్సాహముతో పొంగులు వారేవాడు. ఆయన బహుముఖానుభవము, ఆర్ద్రహృదయము హిమబిందుగా రూపొందింది.

ఇది శ్రీముఖ శాతవాహన చక్రవర్తి కాలము చిత్రించును. చక్రవర్తి యాదర్శము తన రాజ్యము చతుస్సముద్రవలయిత మొనర్చి ధర్మము నాలుగు పాదముల నడిపించి రాజ్యము స్వర్గధామముగా చేయవలెనని. రాజగురువుల యాదర్శము శాతవాహన వంశమును నిష్కల్మషమొనర్చి, ప్రపంచమును విరించి యజ్ఞ యాగాదులతో దేవతాతృప్తి మానవ రక్తి ప్రసాదింప జేసి, వైదిక ధర్మమును నిరసించు బౌద్ధ జినములను నిర్మూలింపవలెనని. తుదకు ఇరువురి యాశయములు సిద్ధించును గాని చక్రవర్తి మతసహనము వల్లనే సాధ్యమవుతుంది కాని రాజగురువు మతద్వేషము వల్ల కాదు. ఈ నవలలో మూడు రకముల ప్రేమ కథలు కల్పింపబడ్డవి. విషకన్య శ్రీకృష్ణ శాతవాహనుని దైవముగా ప్రేమిస్తుంది. హిమబిందు సువర్ణశ్రీని ప్రేమించి భర్తగా భావించును. నాగబంధునికా సమవర్తుల ప్రేమ గుణసామ్యముచే పరస్పరాకృష్టలైన వారి ప్రాపంచిక ప్రేమ. పవిత్రప్రేమ సమస్తావరోధాలను అధిగమించి విజయము సాధిస్తుంది.

ముద్రారాక్షసములో విషకన్యాప్రయోగమే చెప్పబడినది. ఈ నవలలో చిన్ననాటి నుండి అభిచార హోమములయు, విషవైద్యుల యొక్కయు సహాయముచే విషకన్య ఎట్లయినదో అద్భుతముగా వర్ణింపబడినది. తుదకా విషకన్య శ్రీకృష్ణ శాతవాహనుని ప్రేమించి, తాతగారిని ప్రతిఘటించి అమృతకన్యగా ఎట్లు పరివర్తన మొందినదో అద్భుతతరముగా కల్పింపబడినది.

శ్రీ కురుగంటి సీతారామయ్య అన్నట్లు ఇందులో “బాపిరాజు ధర్మము నిర్వచించునపుడు ధర్మవేత్తయై, యుద్ధములు వర్ణించునెడల సమరశాస్త్ర విశారదుడై, ప్రేమికుల సంభాషణలలో రసమూర్తియై, శిల్పచాతుర్యము నుగ్గడించువేళ శిల్పియై, గానము పాడించునెడల గాయకుడై, బాలికల యాటల నిరూపించునెడల బాలుడై, శాస్త్రచర్చలు సల్పునెడల సకల శాస్త్రవేత్తయై, పాత్రోన్మీలనవేళలలో సహృదయుడై మొత్తముమీద నవలారచనమందు మహాకవియైనాడు!”

ఆయన మరియొక నవల అడవి శాంతిశ్రీ. ఇందులో కూడా బౌద్ధ వైదిక మతముల సంఘర్షణము చిత్రింపబడ్డది. కథ ఎక్కువ భాగము విజయపురిలో జరిగినది. నాగార్జున బోధిసత్త్వులు ధర్మబోధ చేయుచుండిన కాలమది. ఇందులో కూడా మూడు ప్రేమకథలున్నవి. కాని కథానాయిక శాంతిశ్రీ ప్రేమకథయే విశిష్టమైనది. ఆమె విజయపురి నేలిన శాంతిమూలుని పుత్రిక. ఆమె బౌద్ధ ధర్మముచే సంపూర్ణముగా ప్రభావితయై సన్యాసిని వలెనుండి ప్రేమస్వరూపమే ఎరుగనిది. తండ్రి యాజ్ఞకు బద్ధురాలై ఆమె కథానాయకుడగు బ్రహ్మదత్తుని వద్ద వైదిక ధర్మబోధ వినే శిష్యురాలవుతుంది. ఆయన ధర్మబోధ వల్ల కంటె సంఘటనల వల్ల ఆమెలో నెమ్మదిగా ప్రేమ అంకురిస్తుంది. బ్రహ్మదత్తుడు గాలివాన వల్ల కొట్టుకొనిపోయిన నౌకతో కొంతకాలము కనబడకపోగా ఆమె ఉద్విగ్నత పొందుతుంది. తర్వాత రాయబారిగా వెళ్లిన బ్రహ్మదత్తుని పులమావి బంధించినట్లు తెలిసిన వెంటనే ఆమె వీరాంగనాసైన్యము కూర్చుకొని నిరాఘాటముగా పులమావిపై దండెత్తుతుంది. ఆ విచిత్ర కథా ఘట్టము బాపిరాజు తన ప్రతిభచే సత్యమనిపించేట్లు చేసినాడు. బౌద్ధ ప్రచారమువల్ల జనములు సన్యసిస్తూ, గృహస్థాశ్రమ విముఖులు కాగా ధర్మబద్ధమైన కామముతో వైదికము దానిని లోగొన్నదన్న భావానికి ప్రతీకగా శాంతిశ్రీ ప్రేమకథ కల్పింపబడ్డది.

శాంతిమూలుడు వైదికమతనిష్ఠుడు. ఆయన పత్నులు బౌద్ధమత నిష్ఠులు. తుదకు అమరావతిలో శాతవాహనవంశ మంతరింపగా శాంతిమూలుడు సమస్తజనుల అభ్యర్థనము పాటించి, నాగార్జునుల ఆశీర్వాదముతో చక్రవర్తి పదవి స్వీకరించి ఇక్ష్వాకు రాజ్యస్థాపకుడు కావడంతో నవల ముగుస్తుంది. పై రెండు నవలలలోను బాపిరాజుకు బౌద్ధమందు అభిమానమూ, వైదికమందు గౌరవమూ ద్యోతమవుతవి.

ఆయన ‘గోన గన్నారెడ్ది’ కాకతీయ రుద్రాంబ కాలానికి సంబంధించిన కథ. రుద్రాంబ అంతరంగిక విప్లవములను అడచి, మహారాష్ట్రుల దండయాత్ర నెట్లు ప్రతిఘటించినదో దీనిలో వర్ణితమైనది. బాపిరాజు రచనలన్నిటిలో రెండు లక్షణములు ప్రాధాన్యము వహించును. మొదటిది ప్రేమికుల ప్రేమ. రెండవది అపరిమితమైన ఆంధ్రాభిమానము. ఈ నవలలో ఆ రెండు గుణాలు ప్రత్యేకముగా కానవస్తవి.

6
శ్రీ నోరి నరసింహశాస్త్రి ప్రకృతి ఒకవిధంగా బాపిరాజు ప్రకృతికి విరుద్ధమైనది. బాపిరాజు ఉత్సాహము నిరంకుశంగా పొంగులెత్తుతుంది. నోరి ఉత్సాహము సంయమనంతో నిండి ఉంటుంది. బాపిరాజుకు ఆంధ్రాభిమాన మెక్కువ. నోరికి మహాభారతాభిమాన మెక్కువ. బాపిరాజు నాయికానాయకులు ప్రేమావేశములతో తబ్బిబ్బులవుతారు. నోరి నాయికానాయకుల ప్రేమ సాంసారిక మాధుర్య మనుభవించే వారిది గానో, వీరనారులకు వీరులకు సంబంధించినది గానో ఉంటుంది. బాపిరాజుకు బౌద్ధమం దభిమానము, వైదికమందు బలవంతపు గౌరవము. నోరికి వైదికమతమందు నిష్ఠ, బౌద్ధాది సకల మతములందు ద్వేషములేని సహనము. దురాచారము లెవరిలో ఉన్నా సహించడు.

ఆంధ్రదేశము ఉత్తరదక్షిణ భారతములకు సంధి ప్రదేశముగా ఉన్నందున యావద్భారతమును ఏకముఖము చేయగల లక్షణాలు ఆంధ్రభూమిలో ఎక్కువ ఉన్నందుకే నోరికి ఆంధ్రదేశాభిమానముగాని తానీ జన్మలో అక్కడ పుట్టినందుకు కాదు. ఆంధ్రకవులకు పూజ్యతమమైన గ్రంథము కవిత్రయము ఆంధ్రీకరించిన వ్యాస మహాభారతము. కవిత్రయము కాలములు చిత్రించుచు నారాయణభట్టు, రుద్రమదేవి, మల్లారెడ్డి అనే నవలాత్రయము రచించినాడు. శ్రీనాథ కవిసార్వభౌముడు విద్యానగరయాత్ర చేసి డిండిమభట్టును జయించి ఆయన కంచుఢక్కను పగులగొట్టించిన వృత్తాంతము కవిసార్వభౌముడులో వర్ణించినాడు.

నారాయణభట్టు క్రీ. శ. 1053 సం. వృత్తాంతము. అప్పుడు ఉత్తరభారతము ఛిన్నాభిన్నమై విదేశీయుల దండయాత్రలకు అనుకూలముగా ఉన్నది. అప్పుడు దక్షిణమున చోళచక్రవర్తులు దక్షిణభూమిని ఏకచ్ఛత్రము క్రిందికి తెచ్చి భారతీయధర్మము పరిరక్షించుచున్నారు. గంగవరకు విజయయాత్ర చేసిన గంగైకొండ చోళుని అల్లుడగు రాజరాజనరేంద్రుడు కలికాల కలంకపంకము హరించుచు రాజమహేంద్రవరములో రాజ్యము చేయుచున్నాడు. అప్పుడు ఆంధ్రభూమి లోని బౌద్ధ సంఘారామములు తాంత్రిక దురాచారాలకు ఆటపట్టులై రాజకీయవిప్లవము సాగింపగా దానిని సకాలములో అడచి వేసి, సామాన్య ప్రజలకు సంస్కృత భాషలో నున్నందున అందుబాటులో లేని మహాభారత ధర్మమును మహాభారతాంధ్రీకరణముతో అందుబాటులోనికి తెచ్చుటతో ఈ నవల ముగియుచున్నది.

క్రీ. శ. 1248 నాటికి ఉత్తరభారతము తురుష్కాక్రాంతమైనది. ఢిల్లీ సుల్తానుల దృష్టి దక్షిణభారతము పైకి ప్రసరిస్తున్నది. కాకతీయ సామ్రాజ్యమును అన్ని వైపుల నుండి పొరుగురాజులు ముంచివేయుటకు యత్నింపగా రుద్రమదేవి రాజ్యరక్ష చేసినది. ప్రధానశత్రువైన దేవగిరి యాదవరాజును జయించినది. ‘ఆంధ్రులకూ మహారాష్ట్రులకూ తల్లులైన గోదావరీ మంజీరా నదులు సోదరు లిట్లా వృథా కలహాల పాలవుతున్నారే’ అని శోకిస్తున్నట్టుగా రెండు దేశాల ప్రభువులకు తోచి సంధి చేసుకుంటారు.

రుద్రమ భర్త వీరభద్రేశ్వరుడు. తనకు మరియొక పత్ని వలన కలిగిన సంతానానికి రాజ్యపదవి కావలెనని ఆశిస్తాడు. కాని చక్రవర్తి రుద్రమకే పట్టాభిషేకము చేస్తాడు. భర్త రుద్రమ మీద అంతఃకలహాలు ప్రేరేచి శత్రురాజుల దండయాత్రలు కూడా ప్రోత్సహిస్తాడు. రాజధర్మానికీ, వ్యక్తిధర్మానికీ రుద్రమలో ఘర్షణ ఉదయిస్తుంది. రాజధర్మం పాటించి నిర్దోషురాలైన సీతనే శ్రీరాముడు పరిత్యాగము చేసినది మనస్సుకు తెచ్చుకొని, దోషియైన భర్తను రాజధర్మాన్ని ఆశ్రయించి ప్రతిఘటిస్తుంది. భర్త అమాయకులైన జైనప్రజలలో విప్లవము తెస్తాడు. వారిలో నాయకులను మాత్రము కఠినముగా శిక్షించి, సామాన్య ప్రజలను పొరపాటున తప్పుచేసిన సంతానము వలె క్షమించి, వారిలో నిష్కల్మషులైన వీరభల్లటదేశికులను, సిద్ధినంది వంటివారిని పూజిస్తుంది.

సందర్భవశాత్తుగా ఆనాడు ఏకశిలానగరములో విలసిల్లిన అన్ని తరగతుల జనుల జీవితము చిత్రింపబడినది. తిక్కన సోమయాజి నిర్లిప్తుడై మహాభారత రచన కొనసాగిస్తూ, గడ్డు సమయాలలో రాజకీయనౌకను యోగ్యులైనవారి చేత నడిపిస్తాడు.

కొప్పెరుల జింగడు (రాజసింహుడు) అనే కాడవ ప్రభువు గోదావరీ తీరము వరకు భూసేనను, నౌకాసేనను నడిపించుకొంటూ దండయాత్ర సాగించాడు. అతనికి సాహిత్యమల్లుడు, ఖడ్గమల్లుడు, అనే బిరుదాలున్నవి. ఆంధ్రసేనలు గోదావరి వద్ద భూమి మీదను, సముద్రము మీదను అడ్డగిస్తవి. రాజసింహుడు తన సేనానులకు యుద్ధాలు నడపడానికి ఆజ్ఞలిచ్చి తన సాహిత్యమల్లత్వము గోదావరి పండితులకు ప్రదర్శించడానికి పూనుకుని ఇష్టదైవమైన కనకసభాపతి పూజకు అంగముగా భాసుని ‘ఊరుభంగము’ ప్రదర్శింపజేస్తాడు. భీమసేన దుర్యోధనుల గదాయుద్ధమునే ఆవల రెండు యద్ధములూ అనుకరిస్తవి. ఆంధ్రుల గజఘంటలకూ, కాడవుల అశ్వదళాలకూ, ఆంధ్రుల పెద్దనౌకలకూ, కాడవుల అసంఖ్యాకములైన చిన్ననౌకలకూ, యుద్ధాలు దుర్యోధనునికి ఊరుభంగమైనట్లే పరిణమించినది. వర్ణించిన ఘట్టము అద్భుతశక్తితో నిర్వహింపబడ్డది. సాహిత్య అకాడెమీవారు ఈ నవలను భారతీయ భాష లన్నిటిలోకి అనువదింప నిశ్చయించారు.

మల్లారెడ్డి క్రీ. శ. 1328 నాటిది. మహమ్మదు బిన్ తుఘ్లకు దక్షిణదేశములో అరాజకము ప్రబలజేసెను. అప్పుడు సామాన్య ప్రజలలో నుండి మహావీరులు పుట్టి విప్లవము సాగించి ధర్మబద్ధమైన రాజ్యాలు స్థాపించారు. మొదట విముక్తి సాధించినది కృష్ణానది దక్షిణతీరాన రెడ్డి ప్రభువులు. రెడ్ల కులదైవము నందికంత పోతరాజు అనే కఠారి దైవము వెలుస్తాడు. శ్రీ శంకరస్వామి చేయించిన సహస్ర చండీయాగముతో ధర్మవృషభము ఆవిర్భవించినట్లయి ప్రజలు నిర్భయంగా మహాయుద్ధాలు చేస్తారు. దేశాంతరాలలో, ద్వీపాంతరాలలో అనేక మహానౌకలతో వ్యాపారము చేసే అవచి దేవయ నౌకలు, గజాలు, హయాలు తెప్పించి సహాయం చేస్తాడు. కథా ప్రారంభంలో శ్మశాన సదృశంగా ఉన్న ఆంధ్రభూమి చివరకు సర్వసంపన్న మవుతుంది. ఎర్రయ మహాకవి మహాభారతరచన హరివంశముతో సహా పూర్తిచేస్తాడు.

కవిసార్వభౌముడులో శ్రీనాథకవి కొండవీటి నుండి క్రీ. శ. 1420 లో శ్రీవిద్యానగరానికి సాంస్కృతిక విజయయాత్రకై బయలుదేరి, యుద్ధయాత్రలలో వేసే ఎత్తులన్నీ వేసి అక్కడ డిండిమ భట్టారకుణ్ణి ఉద్భటశాస్త్ర వాదంలో జయించి ఆయన కంచుఢక్కను పగులగొట్టిస్తాడు. ఆ తర్వాత వారిద్దరికి పరస్పరమూ ఆదరగౌరవాలు కలుగుతవి. ఆస్థానములో శ్రీనాథుడు తన బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించి కవిసార్వభౌముడుగా కనకాభిషేకము పొందుతాడు. ఆనాడు శ్రీవిద్యానగరములో వేదవేదాంతములకు, దర్శనములకు ఉండిన ప్రాభవము సామాన్య పాఠకులకు కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. పర్వతమల్లుకూ, విద్యామల్లుకూ, వాళ్ల శిష్యులకూ జరిగిన మల్లయుద్ధాలు శాస్త్రవాదాల ప్రతిధ్వని వలె ఉండి నవలకు రమ్యత చేకూరుస్తుంది. రాజకీయముగా శ్రీవిద్యానగరానికి, కొండవీటికి, రాచకొండ, దేవరకొండలకు ఎన్నెన్ని స్పర్థలున్నా, విద్వాంసులను గౌరవించడములో విరోధ ముండేది కాదనీ, శాస్త్రవాదాలలో ధర్మదీక్షతో పరిషత్తులు నిర్ణయము చేసేవనీ ఇందులో ప్రదర్శింపబడ్డది. ఆ తర్వాత కొద్దికాలానికి ఆంధ్రులకు అభిమానపాత్రమైన భాగవతము వ్రాయనున్న పోతన, కన్నడములో ‘గదగిన భారత’ రచించి బాలవ్యాసుడనే ప్రసిద్ధి పొందనున్న నారనప్ప ఈ నవలాకథ నాటికి యువకులై ఉత్తమ కావ్యరచనకు ఎట్లా ఆదర్శపూరితు లవుతుండిరో ఇందులో చిత్రింపబడ్డది.

కవి, నాటికాకర్త, కథకుడు, సాహిత్య విమర్శకుడు, ధర్మదీక్షితుడు ఐన నోరి పరిణత వయస్సులో చారిత్రక నవలారచనకు పూనుకొని తన సర్వతోముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దానికి సంపూర్ణ వికాసము కలిగించినాడని విమర్శకుల నిర్ణయము!

7.
భారత చరిత్ర పరిధులను దాటి రచించిన ఆంధ్ర నవల తెన్నేటి సూరి ‘చెంఘిజ్‌ఖాన్’. ఆ నవల సర్వాంగ సుందరమై అడుగడుగునా గోబీ ఎడారి వాతావరణముతో అక్కడి జనముల తీవ్ర రాగద్వేషాలతో స్పందిస్తున్నది. ఎక్కా మంగోలుజాతి నాయకుడైన యాసుకై మెర్కెట్ తండాలోని వాళ్లనందరిని చంపి పెళ్లికూతురు యాలమను బలవంతముగా ఎత్తుకొని పోవడముతో కథ ప్రారంభిస్తుంది. యాలమ మొండిగా బహుకాలము యాసుకై భార్యగా ఉండడాన్ని ప్రతిఘటిస్తుంది. కాని సోదరుడైన కరాచర్ బోధ పాటించి చివరకు ఒప్పుకొని టెమూజిన్ను కంటుంది. యాసుకై మంగోలు తండాల నన్నిటిని ఐక్యము చేసి కెరెటు ప్రభువైన తుఘ్రలుఖానుకు సహాయము చేయగల స్థితికి వస్తాడు. యాసుకై అకస్మాత్తుగా మోసము పాలై శత్రునిచే హతుడవుతాడు. మళ్లీ మంగోలు తండాలు విచ్ఛిన్నము కాబోతున్న సమయంలో టెమూజిన్ ప్రభుత్వము చేబట్టుతాడు. యువకుడైనా, నయానా భయానా అతడు సమర్థతతో గోబి తండాలను కూడగట్టుకొని, తుఘ్రలుఖాను, చీనా చక్రవర్తి, టర్కీ ప్రభువు చేసే కుట్రలన్నిటినీ ఎదురెత్తులతోనూ, సాహసంతోనూ ఎదుర్కొని చెంఘిజ్‌ఖాన్ (జగజ్జేత) అవుతాడు. అతని సోదరుడు చమూగా చదువుకొన్నవాడు. వీరుడైనా శాంతిప్రియుడు. అతన్ని నైమాన్ ప్రజలకు ప్రభువుగా టెమూజిన్ పంపుతాడు. అతడు ప్రజల చేత ఆయుధ విసర్జన చేయించి దేశాన్ని సస్యశ్యామలంగా తాత్కాలికంగా చేయగలుగుతాడు. బౌద్ధము, ఇస్లాము, క్రైస్తవము ప్రచారము చేసేవారి ద్వారా శత్రురాజులు చేసిన ద్రోహము వల్ల చమూగా ప్రయత్నమంతా విఫలమైన ఘట్టము కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. క్రీ. శ. 1206లో వసంత ఋతువులో జరిగిన విజయోత్సవాలతో టెమూజిన్ చెంఘిజ్‌ఖాన్ ‘జగజ్జేత’ కావడంతో నవల పూర్తి అవుతుంది. ఈ నవల ఆనాటి అనాగరక సాహస వీర ప్రపంచాన్నే చిత్రించినా, ఈ కాలములో మనము ఎంత నాగరకులమని గర్విస్తున్నా జాతులను ఆడించే మూల మహాశక్తి ‘పశుశక్తే’ అనిపిస్తుంది. నవల చదువుతున్నంతసేపూ ఆంధ్రభాషలో పుట్టి ప్రాణవంతమైన ఉత్తమ నవలలలో దీనికి నిస్సందేహంగా స్థానమున్నది. ఈ ఒక్క నవలే వ్రాసి చిన్నతనములోనే తెన్నేటి సూరి గతించినందువల్ల నవలా ప్రపంచానికే తీరని లోటు కలిగింది.

8.
ఆంధ్రభాషలో ఇంకా ఎన్నో చారిత్రక నవలలు పుట్టినవి. వాటిలో శ్రీ వేదుల సూర్యనారాయణశర్మ ఆర్యచాణక్యుడు నవలని ప్రశంసించక తప్పదు. అందులో చారిత్రక విషయాలెన్నో ఉన్నవి. కాని అది చరిత్ర అనిపిస్తుంది. కాని నవల అనిపించదు.

ఆంధ్ర చరిత్రకారులలో ప్రామాణికులైన డాక్టరు నేలటూరి వెంకటరమణయ్య రచించిన పశ్చాత్తాపము, ఛత్రగ్రాహి, మధుమావతి, మొదలైనవి పెద్దకథ లనదగినవే కాని వాటికి నవల కుండవలసిన విస్తృతి లేదు. వారి కథలలో చరిత్ర-కల్పన ఎంత చక్కగా జోడింపవచ్చునో ఆదర్శప్రాయంగా ప్రదర్శించారు.

ఉన్నత పాఠశాలలలో పాఠ్యగ్రంథాలుగా ఉద్దేశింపబడి ఎన్నో చిన్న చారిత్రక నవలలు పుట్టినవి. అట్టివాటిలో శ్రీ వావిలాల సోమయాజులు రచించిన నాలందలో ఆనాటి ఆచార్య వైభవము చక్కగా పోషింపబడ్డది. అనవేమారెడ్డి జైత్రయాత్రను వర్ణించిన వసంతరాయలు, విహారి-శాతవాహన రచించినది, కూడా గణ్యమైనది. శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల అభయ ప్రదానము కూడా ఎన్నతగినది. ఇంకా ఎన్నో చిన్న నవల లున్నవి.

శ్రీ విశ్వనాథ సత్యనారాయణ నేటి ఆంధ్ర సారస్వత రంగములో సర్వతోముఖ ప్రతిభ ప్రకటించి ఎన్నో ఉత్తమ నవలలు వ్రాసిన తర్వాత ఈ మధ్య ‘పురాణవైరి గ్రంథమాల’ పేరుతో 16 నవలలు వ్రాయ సంకల్పించి చాలా భాగము పూర్తి చేశారు. ఈ వ్యాసము ఉపక్రమణములో మన పురాణాదులలో ఎన్నో చారిత్రక విషయాలు నిక్షిప్తములై ఉన్నవనీ, రామాయణ మహాభారతాలే ఐతిహాసిక నవలలకు మార్గదర్శకముగా ఉండదగుననీ సూచించినాము. ఈ గ్రంథమాల నవలలలో శ్రీ విశ్వనాథ ఒక అడుగు ముందుకు పోయినారు. పురాణకథలే చరిత్రగా గ్రహించి శ్రీ కోటవారు భారతజాతి చరిత్ర రచించారు. అదే నిజమైన చరిత్ర అని శ్రీ విశ్వనాథ నిశ్చయము. పాశ్చాత్యుల దృష్టితో ప్రారంభింపబడిన భారత చరిత్ర అత్యంతము పునఃపరిశీలన చేసి రచింపవలసి ఉన్నదనుటలో మాకెట్టి సందేహము లేదు. కాని శబ్దసామ్యాన్ని బట్టి హూణ మిహిరగులుడు హూణుడు కాడని, మిహిరకులుడైన ఆదర్శ భారతీయ వీరుడనేవరకూ మా బుద్ధి ప్రస్తుతము ప్రసరింపలేకున్నది. ఈ గ్రంథమాల నవలలలో రచనలోను, కల్పనలోను తొందరపాటు, విశృంఖలత్వము గోచరించడము సంతాపకరమైన విషయము. మధ్యమధ్య శ్రీ విశ్వనాథ మహాప్రతిభ తెరచాటు నుండి గోచరిస్తూ ఉండకపోతే వాటిని పరిగణించ వలసినది కాదు. ఏమైనా పురాణవైరి గ్రంథమాలలోని శ్రీ విశ్వనాథ నవలలు చారిత్రక నవలా రచయితలకు, విమర్శకులకు ఒక సవాలువంటివని మాత్రము అంగీకరించక తప్పదు!
----------------------------------------------------------
రచన: నోరి నరసింహ శాస్త్రి, 
ఈమాట సౌజన్యంతో

No comments: