Wednesday, March 13, 2019

అనువాద కళ నా అనుభవాలు


అనువాద కళ నా అనుభవాలు




సాహితీమిత్రులారా!


(వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు మదనపల్లి కళాశాలలో ఉపన్యాసకులు. కవిగా, కథకుడిగా, సాహితీ విమర్శకుడిగా సుప్రసిద్ధులు. “నవలా శిల్పం”, “కథాశిల్పం” వీరి విఖ్యాత రచనలు. “కథాశిల్పం” ఈ జనవరిలో సాహిత్య ఎకాడమీ అవార్డ్‌ను కూడా పొందింది. ఇంగ్లీషు నుంచి, కన్నడం నుంచి తెలుగులోకి ఎన్నో గ్రంధాలు, కథలు అనువదించారు. తస్లీమా నస్రీన్‌ రచించిన “లజ్జ”, బ్రిటిష్‌ రచయిత ఇ.హెచ్‌.కార్‌ (E.H. Carr) రచించిన “చరిత్ర అంటే ఏమిటి…?” ఆయన చేసిన అనువాద రచనలలో కొన్ని.)

రచన కత్తి మీద సామైతే, అనువాదం రెండు కత్తుల మీద సాము. ఒక భాష వచ్చిన ప్రతీవాడూ రచయిత కాలేడు. అలాగే, రెండు భాషలు వచ్చిన ప్రతీవాడూ అనువాదకుడు కాలేడు. కానీ అనువాదకునికి రెండు భాషలు ” బాగా ” వచ్చి ఉండక తప్పదు. అందులో ఒకటి మాతృభాష. రెండవది దాదాపు కృత్రిమంగా నేర్చుకొన్న ” పరాయి ” భాష. ఎవరైనా మాతృభాషలోకి మాత్రమే అనువాదం చెయ్యగలరని చాలా మంది నమ్ముతారు. ఇందులో సత్యం లేకపోలేదుకానీ, ఈ సిద్ధాంతానికి కొన్ని మినహాయింపులు లేకపోలేదు. అలాంటి మినహాయింపులుగా పి. వి. నరశింహారావు హిందీలోకి అనువాదం చేసిన ” వేయిపడగలు ” నూ, పుట్టపర్తి మళయాళంలోకి అనువదించిన ” ఏకవీర ” నూ, పి. ఎల్‌ రెడ్డి హిందీలోకి అనువదించిన తెలుగు కధలనూ, ఎస్‌ ఎస్‌ ప్రభాకర్‌ ఇంగ్లీషులోకి అనువదించిన తెలుగు కధలనూ చెప్పుకోవచ్చుననుకొంటాను. వీరి అనువాదాలు అంత బాగా ఉండటానికి కారణం బహుశా మనం పరాయి భాషలనుకొంటున్నవి వీరికి మరీ అంత ” పరాయి” వి కాకపోవటమేనేమో !

ఇప్పుడు భాష తెలియటం అంటే ఏమిటో ఆలోచిద్దాం. భాష ఆ భాషను మాట్లాడే ప్రజల సంస్కృతిలో ఒక ప్రధానమైన అంశం. అంతే కాదు ఆ సంస్కృతికి మాధ్యమం కూడా. కాబట్టి రెండు భాషలు తెలిసి ఉండటం అంటే రెండు సంస్కృతులు తెలిసి ఉండటం. రెండు జీవిత విధానాలు తెలిసి ఉండటం. భాషకు జీవం నుడికారం. ఏ భాష నుడికారం, ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిలో నుంచీ, భౌగోళిక పరిస్థితుల్లోంచీ, ఆ ప్రాంత ప్రజల ఆచార వ్యవహారాల్లోంచీ, ఆట పాటల్లోంచీ ఉద్భవిస్తుంది. ఉదాహరణకు, ఎస్కిమో భాషలో రకరకాలైన మంచును సూచించటానికి దాదాపు ఇరవై పదాలున్నాయట. మరాఠీ భాషలో యుద్ధరంగం ఆధారంగా పుట్టిన నుడికారం ఎంతో ఉందిట. ఇంగ్లీషు భాష నుడికారం వారికి ఆటలన్నా,నౌకాయానమన్నా ఉన్న ఇష్టంలో నుంచీ ఎంతో పుట్టింది. మన భాషలో చాలా నుడికారం మన వ్యావసాయక జీవితంలోనుంచీ పుట్టింది. భాషను తెలుసుకోవటమంటే దాని నుడికారం యొక్క మూలాలను తెలుసుకోవటం. వీటిని తెలిసి ఉండటం లేదా తెలుసుకోవాలని ఉండటం అనువాదకుని మొదట అర్హత.

అనువాదకుని రెండవ అర్హత మూలగ్రంధంలోని విషయాన్ని గురించి నిజమైన ఆసక్తి ఉండటం. అందరూ అన్ని విషయాలనూ అనువదించలేరు. ఆసక్తి లేని విషయాన్ని అనువదిస్తే, అది యాంత్రికంగా, నిర్జీవంగా ఉండక తప్పదు. వస్తువుకు సంబంధించిన మరొక ప్రధానమైన అంశం కూడా ఉంది. ఒకే వస్తువును అనేక దృక్పధాలనుంచీ చర్చించ వచ్చు. ఉదాహరణకు భారతీయ తత్వ శాస్త్రాన్ని గురించి గోళ్వాళ్కర్‌ లాగా రాయవచ్చు. రాధాకృష్ణన్‌ లాగా రాయవచ్చు. దేవీ ప్రసాద్‌ ఛటోపాధ్యాయ లాగా రాయవచ్చు. మూలగ్రంధ రచయిత అందులోని విషయాన్ని తనకు నచ్చిన, తాను నమ్మిన భావజాల ధృక్పధం నుంచి చర్చించి వుంటాడు. మూలగ్రంధ రచయిత భావజాల ధృక్పధం మీద కనీసం సానుభూతి కూడా లేకుండా ఆ గ్రంధాన్ని అనువాదం చేయటానికి అంగీకరించకూడదు.

అనువాదం ప్రారంభించటానికి ముందుగానే భాషకు సంబంధించిన కొన్ని క్లిష్టమైన నిర్ణయాలను అనువాదకుడు తీసుకోక తప్పదు.

అనువాదకుడు తాను చేయబోతున్న అనువాదంలో వాడదల్చుకున్న భాషాస్థాయిని గురించి ఒక ఖచ్ఛితమైన నిర్ణయానికి రావాలి. ఒకే భాషను అనేక స్థాయిలలో రాయవచ్చు. ” భాషాస్థాయి ” పదజాలానికి మాత్రమే కాకుండా వాక్యనిర్మాణానికి కూడా సంబంధించిన విషయం. భాషా స్థాయిని గురించి నిర్ణయం తీసుకోటానికి పూర్వం, మూలగ్రంధం విషయాన్ని గురించి, మూలగ్రంధం ఎవరికోసం ఉద్దేశించబడిందో ఆ పాఠకుల్ని గురించీ, అనువాదం ఎలాంటి పాఠకుల కోసం చేయబడుతోందీ వారిని గురించీ, అనువాదకునికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇది ఇంగ్లీషు నుంచి శాస్త్ర గ్రంధాలను అనువదించేటప్పుడు మరీ చిక్కు సమస్యగా మారుతుంది. దాదాపు ఆరులక్షల పదసంపద ఉన్న ఇంగ్లీషు నుంచి పాతికవేలు వ్యావహారిక పదజాలం కూడా లేని తెలుగులోకి శాస్త్ర గ్రంధాలను అనువాదం చేసేటప్పుడు, అనువాదకుడు అనేక పదాలనూ, పద బంధాలనూ సృష్టించుకోవలసి వస్తుంది. అవి తాను ఎన్నుకొన్న భాషాస్థాయిలో ఉండేలా జాగ్రత్త పడటం కత్తి మీద సాము వంటి క్లిష్టమైన పని.

భాషకు సంభందించిన మరొక ఇబ్బంది కంఠస్వరం. సమర్ధుడైన రచయిత శైలికి ” కంఠస్వరం ” ( Tone ) ఉంటుంది. అది రచయితకూ, విషయానికీ మాత్రమే కాకుండా, రచయితకూ, పాఠకునికీ మధ్య ఉన్న సంబంధాన్నివ్యక్తం చేస్తుంది. గొప్ప గాయకుని గొంతులో ఎన్ని భావాలు పలుకుతాయో, సమర్ధుడైన రచయిత శైలిలో అన్ని భావాలు పలుకుతాయి. అందులో కోపం ఉండవచ్చు, కసి ఉండవచ్చు, హాస్యం ఉండవచ్చు, వ్యంగ్యం ఉండవచ్చు.ఇంకా ఎన్నో భావాలూ, భావమిశ్రమాలూ ఉండవచ్చు.మూలరచయిత కంఠస్వరాన్ని పొరపాటు పడకుండా గుర్తించి దాన్ని లక్ష్య భాషలో వ్యక్తం చేయగలిగిన రంగు, రుచి,వాసన ఉన్న పదాలనూ, వాక్య విన్యాసాలనూ జాగర్తగా ఎన్నుకోవాలి.

వీటికితోడు మూలగ్రంధాన్ని అనేకసార్లు చదివి జీర్ణం చేసుకోవటం, గ్లాసరీని అనువాదం ప్రారంభించటానికి పూర్వమే తయారు చేసుకోవటం, పదప్రయోగస్థాయిని తరచుగా వెనుదిరిగి చూసుకుంటూ ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా సాపు రాసే పనిని తానే స్వయంగా చేయటం, అనువాదకుడు తీసుకోవలసిన మరికొన్ని ఇతర జాగ్రత్తలు. అనువాదకుని చివరి అర్హతను గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సృజనకు భావోద్రేకం, Inspiration అవసరమేమో కానీ అనువాదానికి పరిశ్రమే ప్రాణం. పరిశ్రమ చేసే ఓపిక లేనివాడు మంచి అనువాదకుడు కావటం అసాధ్యం.

అనువాద కళను గురించి ఇంగ్లీషులో కొన్ని మంచి పుస్తకాలు వచ్చాయి. 1791లోనే అలెగ్జాండర్‌ ఫ్రేటర్‌ టైట్లర్‌ అన్న వ్యక్తి “Essays on the principles of Translation ” అన్న గ్రంధాన్ని ప్రచురించాడు. ఆ తరువాత థియొడర్‌ సేవరీ, రెనెటో సోగియోలీ వంటి విద్వాంసులు కొన్ని గ్రంధాలు రాసారు. ఈ శతాబ్దంలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పాశ్చాత్యదేశాల్లో భాషాశాస్త్రం ప్రతిష్ట బాగా పెరిగింది. దీని ప్రభావం అనేక పరిసర రంగాలమీద ప్రసరించటం ప్రారంభించింది. జె. సి. కాట్‌ ఫోర్డ్‌ లాంటి భాషాశాస్త్రవేత్తలు ఈ రంగంలో చాలా కృషి చేసారు. అంతవరకూ ” కళ ” అని అందరూ భావిస్తున్నఅనువాదం ” శాస్త్రం ” గా పరిణామం చెందటం ప్రారంభించింది. కంప్యూటర్లను అనువాదాలకు కూడా ఉపయోగించుకోవచ్చునన్న అభిప్రాయం కూడా బలం పుంజుకొంటోంది. కానీ తెలుగులో అనువాదం మీద మంచి గ్రంధాలు ఇంతవరకూ రాలేదు. రా. రా. రాసిన ” అనువాద సమస్యలు “, పత్రికల వారూ, పత్రికారచయితలూ తయారు చేసిన కరదీపికలూ తప్ప తెలుగులో అనువాదాన్ని గురించి సమగ్రమైన, సాధికారమైన గ్రంధం రాలేదు.

000 000 000 000

వాదించుకోవటంలోనూ, అనువదించుకోవటంలోనూ తెలుగు వారు నిష్ణాతులు అని ఎవరో అన్నారు. వాదించుకోవటం మన రాజకీయ వ్యసనమైతే, అనువదించుకోవటం మన సాహిత్య వ్యాసంగం కావచ్చు. వాస్తవానికి తెలుగు సాహిత్యం అనువాదాలతోనే ప్రారంభమైంది. శతాబ్దాలపాటు అనువాదాలతోనే సంతృప్తి పడుతూ వచ్చింది.మన మహా కవుల్లో చాలా మంది కధనూ, కధా నిర్మాణాన్నీ, పాత్రలనూ, వారి మనస్తత్వాలనూ, ప్రాపంచిక దృక్పధాన్నీ, భావాలనూ, ఆలంకారికతనూ, కొంత వరకు శైలినీ మూలగ్రంధకర్తల నుంచి గ్రహించిన గొప్ప అనువాదకులే. అందుకు మనం సిగ్గు పడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. అత్యంత ప్రాచీనమైన సంస్కృత, గ్రీక్‌ ,లాటిన్‌ సాహిత్యాలవంటివి తప్ప ఇతర సాహిత్యాలలో చాలా భాగం అనువాదాలతోనే ప్రారంభమయ్యాయి.

20వ శతాబ్దంలో తెలుగు వారు అనువాదం పట్ల గొప్ప శ్రద్ధను చూపించారు. ప్రేంచంద్‌ , టాగోర్‌ , శరత్‌ ,గోర్కీ, రాహుల్‌ మొదలైన ఎందరో మహా రచయితలు తెలుగువారైపోయారు. 1930లలో అభ్యుదయ సాహిత్యోద్యమంతో ప్రారంభమైన శాస్త్రగ్రంధాల అనువాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంగ్లీషులో తగినంత ప్రావీణ్యం లేని తెలుగు రచయితలు అనువాదాల ద్వారానే ప్రపంచ సాహిత్య ధోరణులనూ, ఆలోచనా ధోరణులనూ ఎంతోకొంతగా అందుకోగలుగుతున్నారు. ” విపుల” వంటి అనువాద కధాసాహిత్య పత్రిక తెలుగులో మాత్రమే ఉందేమోనని నా అనుమానం.

000 000 000 000 000 000 000

అనువాదకుడుగా నా అనుభవాలను గురించి చెప్పేటప్పుడు నన్ను గురించి రెండు మాటలు చెప్పుకోవాలి.

నేను పద్యాలతో రచన ప్రారంభించాను. పద్యాలూ, గేయాలూ మాని కధలు రాయడం ప్రారంభించాను.కధలు రాస్తూనే మూడు నవలలు రాసాను. ఆ తరువాత రచనమీద ఆసక్తి కలిగి చదువుకుంటూ ఉండిపోయినకాలంలో నాకు తెలియకుండానే అనువాదకుణ్ణయ్యాను. 1981లో అనుకుంటాను హైద్రాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ (H.B.T.) ప్రారంభమైంది.దాని ట్రష్టీలలో ఒకరైన సి.కె. గారు అనువాదం చేయించటానికి ఏమైనా మంచి పుస్తకాలు సూచించమన్నారు.నేను సూచించిన రెండు పుస్తకాల్లో E. H. Carr రాసిన What is History ? ఒకటి. H.B.T. వాళ్ళు ఆ పుస్తకాన్ని అనువదింపచేయటానికి తీర్మానం చేసి,అనువాదకుడి కోసం వెదకటం ప్రారంభించారు.కొందరు ఆ పుస్తకాన్ని అనువాదం చేయటం అసాధ్యమన్నారు. మరి కొందరు వృధా అన్నారు. చారిత్రకశాస్త్రం (హిస్టరియోగ్రఫీ) మీద ఆసక్తి ఉండి, ఇంగ్లీషు రాని వాళ్ళు ఎవరూ ఉండరన్నారు. చారిత్రక శాస్త్రం మీద ఆసక్తి ఉండి, ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు మూలగ్రంధాన్ని చదువుకుంటారు గానీ, అనువాద గ్రంధాన్నిచదవరని వాదించారు. మొత్తం మీద What is History ? కి అనువాదకులు దొరకలేదు. ” నువ్వు సూచించావు కదా, నువ్వే చేస్తావా ?” అన్నారు సి. కె. గారు. అంగీకరించాను. సంవత్సర కాలం నా విశ్రాంతి సమయాన్నిఆ అనువాద కార్యానికే వినియోగించాను. అర్ధంకాని విషయాలను తెలిసిన స్నేహితుల వద్ద తెలుసుకొన్నాను.సంవత్సరం తరువాత అనువాదం పూర్తయింది.

అనువాదం జరుగుతుందగా నా దృష్టికి రాని స్పష్టంగా రాని రెండు లోపాలు నా అనువాదంలో కనిపించాయి.మొదటిది మూలగ్రంధ పాఠకులూ, తెలుగు అనువాద గ్రంధం పాఠకులూ ఒకేస్థాయికి చెందిన వారు కాకపోవటం. కార్‌ గ్రంధం కేంబ్రిడ్జి హిస్టరీ సొసైటీలో ఇచ్చిన ఉపన్యాసాల సంపుటం. శ్రోతలందరూ చరిత్ర విద్యార్ధులూ, చరిత్ర ఉపాధ్యాయులూ కావటం చేత కార్‌ చారిత్రక సంఘటనలనూ, తాత్విక సిద్ధాంతాలనూ ఎలాంటి వివరణా లేకుండా ఉటంకిస్తాడు. తెలుగు పాఠకుల్లో తొంభై శాతం మంది కేంబ్రిడ్జి హిష్టారికల్‌ సొసైటీస్థాయి వారు కారు. అందుచేత Foot notes ఇవ్వాలనుకున్నాను. కానీ,ప్రచురణ కర్తలు ససేమిరా వద్దన్నారు. Foot notes ఉన్న పుస్తకాలను సాధారణ పాఠకులు చదవరన్నారు.అందుచేత అనువాదాన్ని ఒక అతి సాధారణ పాఠకుడికీ, ఒక చరిత్ర విద్యార్ధికీ ఇచ్చి, తాము నోట్సు అవసరమని భావించే పదాలకింద గీతలు గీచి పంపమన్నాము. వాటిని సేకరించి రెండు భాగాలుగా విభజించాను.మొదటి వర్గం text లోకి వెళ్ళాల్సిన notes . రెండవ వర్గం గ్రంధం చివర ఇవ్వాల్సిన నోట్సు. ఈ విధంగా కేంబ్రిడ్జి హిష్టరీ సొసైటీ స్థాయి గ్రంధాన్ని సాధారణ తెలుగు పాఠశాల స్థాయికి తీసుకు వచ్చే ప్రయత్నం చేశాను.

రెండవలోపం మరింత ప్రమాదకరమైనది. అనువాదం పూర్తయిన తరువాత మూలాన్నీ, అనువాదాన్నీ మరొకసారి చదివి చూసి దిమ్మెరపోయాను. మూలగ్రంధంలోని tone ను పట్టుకోవటంలో నేను పూర్తిగా విఫలమయ్యాను. మూలంలో హాస్యవ్యంగ్య కంఠస్వరం అనువాదంలోకి రాలేదు. తెలుగు అనువాదంలోని కంఠస్వరం matter of fact గా neutral గా ఉంది. అందుచేత మళ్ళీ సాపు రాశాను. మూలంలోని కంఠస్వరాన్ని తెలుగు అనువాదంలోకి తీసుకు రావటానికి ప్రయత్నించాను. ఇంత శ్రమపడ్డా ” చరిత్ర అంటే ఏమిటి ?” ని వ్యాపార నవల చదువుతున్నంత అశ్రమంగా చదువుకోటానికి వీలుకావటం లేదని కొందరంటుంటారు. వారికి నా సలహా ఒక్కటే మూలగ్రంధాన్ని చదువుకోమని.

” చరిత్ర అంటే ఏమిటి ?” ఇప్పటికి మూడు ముద్రణలు పొందింది. దాదాపు పదివేల కాపీలు అమ్ముడైంది. చరిత్ర విద్యార్ధులు మాత్రమే కాకుండా రచయితలు ఆ పుస్తకాన్ని చాలా శ్రద్ధగా చదివారు.

” చరిత్ర అంటే ఏమిటి ?” మొదటి ముద్రణ ప్రతులు ఆరు నెలల్లో చెల్లిపోయాక వెరె గార్డర్‌ చైల్డ్‌ రాసిన ” What Happened in History ? ” ని తెలుగులోకి తేవాలని నిశ్చయించాం. ఈ రెండు పుస్తకాలూ ఒకసెట్‌ లాగా పరస్పర పూరకాలుగా ఉంటాయని HBT వారు భావించారు. ఈ పుస్తకాన్ని అనువదించటానికి నేను చాలా శ్రమ చేయ వలసి వచ్చింది. ఈ పుస్తకంలో గార్డర్‌ చైల్డ్‌ ఫిజిక్స్‌ , కెమిస్ట్రీ, గణిత శాస్త్రం మొదలైన అనేక శాస్త్రాలు చారిత్రక పరిణామ క్రమంలో ఎలా అభివృద్ధి చెందిందీ వివరంగా చెప్పాడు. ఆ శాస్త్రాలను గురించి నాకు సరైన జ్ఞానం లేకపోవటంచేత, తెలిసిన మిత్రులనుంచి ఆ సిద్ధాంతలను గురించి తెలుసుకొన్నాను. అలాగే పురాతత్వ శాస్త్రంలో ఉపయోగించే విధానాల గురించీ,ముఖ్యంగా కార్బన్‌ టెస్టుల్ని గురించీ తెలిసిన వారి వద్దనుంచీ తెలుసుకొన్నాను.

ఆ తరువాత నేను అనువదించిన సోయింకా నొబెల్‌ బహుమతి అంగీకరణోపన్యాసం నాకు అసంతృప్తినే మిగిల్చింది. ” నల్లవాడు ఈ వేదిక నెక్కకుండా తెల్లవాళ్ళైన మీరు ఎన్ని కుట్రలు పన్నారు. కానీ మీరు ఆపగలిగారా? చూడండి మిమ్మల్ని చీల్చి చెండాడి నొబెల్‌ బహుమతిని అందుకొంటున్నాను ” అన్న సోయింకాకసి బాగా నా అనువాదంలోకి రాలేదనుకుంటాను. సోయింకా ప్రస్తావించిన కొన్నిరెఫరెన్సులు కూడా నాకు అందలేదు. స్త్రీవాద దృక్పధం పై క్రిస్‌ బ్రెజియక్‌ రాసిన ” ప్రపంచచరిత్ర” ను అనువదించినప్పుడు కూడా అందులో వచ్చే కొన్ని పేరడీలు అనువాదం చేయటానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఉదాహరణకు ఈ గ్రంధం ” In the begining there was slime ” అన్న వాక్యంతో ప్రారంభమవుతుంది. అది ” In the begining there was the word ” అన్న బైబిల్‌ లోని St. John వాక్యానికి పారడీ. ఇలాంటి సూక్ష్మాతిసూక్ష్మమైన కొన్ని అందాలు అనువాదానికి అందకుండానే పోతాయి.

అనువాదకునిగా నాకు సంతృప్తి నిచ్చిన గ్రంధం S.G.Sardesai గారి ” Progress and Conservation In Ancient India “. ఆ పుస్తకాన్ని ఒంట బట్టించుకోడానికి దాన్ని అనేక సార్లు చదివాను. ఆ పుస్తకంలో మొదటినుంచీ చివరిదాకా భగభగలాడే సర్దేశాయి గారి కోపాన్నీ, అసహనాన్నీ అనువాదంలోకి తీసుకురాగలనన్ననమ్మకం కలిగిన తరువాత రచన ప్రారంభించాను. వైదిక సాహిత్యాన్నీ, సమాజాన్నీ అభివర్ణించటానికి సర్దేశాయిగారు ఉపయోగించిన ఇంగ్లీషు మాటలకు అసలు రూపాలైన సంస్కృత పదాలను గాలించి పట్టుకొని ఉపయోగించాను. ” ప్రాచీన భారత దేశంలో ప్రగతి, సాంప్రదాయ వాదం” అనువాదంలాగా కాకుండా మూల గ్రంధంలాగా చదివించిందని పెద్దలు అన్నప్పుడు చాలా సంతృప్తి కలిగింది.

ఈ గ్రంధాలు కాకుండా Ralph Fox రాసిన ” The Novel and the People “, R.S.Sharma రాసిన ” Ancient Indian History “, తస్లీమా సమీర్‌ రాసిన ” Lazza ” అన్న పుస్తకాలను కూడా అనువదించాను. వీటిలో మొదటిది నవలా సిద్ధాంతం గురించిన పుస్తకం. మూడవది నవల. వీటిలో “లజ్జ” అనువాదానికి అనువాదం. అనువాదం ద్వారా మూలగ్రంధంలోని శైలిని ఎంత కష్టపడి ఊహించుకున్నా, అనువాదానికి చేసిన అనువాదం అంత సంతృప్తిగా రాకపోవచ్చు. ఇవన్నీ నేను ఇంగ్లీషునుంచి అనువదించిన గ్రంధాలు. వీటికి తోడు, కన్నడం నుంచి ” ఒడలాళ” అన్న నవలికను కూడా అనువదించాను. అది కన్నడంలో చాలా ప్రసిద్ధ నవలిక. దాన్నిరాసిన దేవమారు మహాదేవను “ఒడలాళ మహాదేవ” అని కూడా పిలుస్తారు. ఈ నవలిక అనువాదాన్ని H.B.T. వారు ” బతుకంతా” అన్నపేరుతో ప్రచురించారు. అది ఎవరి దృష్టిని ఆకర్షించినట్టు లేదు. అందుకు కారణం కర్ణాటక, ఆంధ్ర సామాజిక జీవన చైతన్యంలో ఉన్న తేడాలని అనిపిస్తుంది. వారికి బాగా అభ్యుదయకరంగా కనిపించిన పుస్తకం, మనకు మరీ అంత అభ్యుదయకరంగా కనిపించక పోవటమే అందుకు కారణం. ఇది కూడా అనువాదకునికి ఒక పాఠమే. ఒక భాష వారిని ఆకర్షించిన పుస్తకం, మరొక భాషవారిని ఆకర్షించక పోవచ్చు. అందుకు ఒకే విషయానికి సంబంధించిందే అయినా వారి చైతన్య స్థాయిలోని తేడాలు కారణం కావచ్చు. అందుచేత అనువాదకుడు లక్ష్య భాషలను మాట్లాడే ప్రజల నాడిని పట్టుకోవటం చాలా అవసరం.

ఈలోగా అనువాదకుడిగా నేను మరో పాఠం కూడా నేర్చుకొన్నాను. ” Soil and civilization ” అన్న పుస్తకాన్ని పంపుతూ H.B.T. వాళ్ళు దాన్ని అనువదించమని కోరారు. ఆ పుస్తకాన్ని చదివి ఆశ్చర్య పోయాను.జీవావరణానికీ, సంస్కృతికీ ఉన్న సంబంధాన్ని మొత్తం ప్రపంచ చరిత్రను ఆధారంగా చేసుకొని చర్చించిన పుస్తకం అది. ఆ పుస్తకంలోని వస్తువు అర్ధమైందిగానీ ఆ పుస్తకం మొత్తంగా నా నరాలలోకి ఎక్కలేదు. అందుచేత ఆ పుస్తకాన్ని నేను అనువదిస్తే బాగా రాకపోవచ్చు ననిపించింది. సరైన అనువాదకుడు ఎవరా అని అలోచిస్తే తల్లావఝ్జుల పతంజలి శాస్త్రి గారు జ్ఞాపకం వచ్చారు. వారు చరిత్రను చదువుకొన్న వారు.సాంస్కృతిక అధ్యయనాలలో నుంచి పర్యావరణంలోకి వచ్చినవారు. పర్యావరణ కార్యకర్త. కధా రచయిత. ” మీరు ఆ పుస్తకాన్ని అనువాదం చేస్తారా ?” అని అడిగితే వారు సంతోషంగా అంగీకరించారు.ఇప్పుడు అనువాదం సాగుతోంది. రచయితకు కధా వస్తువుతో హృదయ సంవాదం కుదిరినట్టుగా అనువాదకునికి కూడా మూల గ్రంధంలోని విషయంతో హృదయ సంవాదం కుదరాలి. అందరు అనువాదకులూ అన్ని విషయాలనూ బాగా అనువదించలేరు. కొందరు కొన్ని విషయాలను ఇతరుల కంటే మెరుగ్గా అనువదించగలరు. ఈ సత్యాన్నిగుర్తిస్తే అనువాదం కొందరు భావిస్తున్నట్టుగా వృత్తిరచన కాదని అర్ధమౌతుంది.

ఇవి నేను ఇతర భాషల్లోంచి తెలుగులోకి చేసిన అనువాదాలకు సంబంధించిన అనుభవాలు. నేను తెలుగునుంచి ఇంగ్లీషులోకి కూడా కొన్ని అనువాదాలు చేశాను. కొంత కవిత్వాన్నీ, తిలక్‌ , పెద్దిభొట్ల, సింగమనేని, వివిన మూర్తి,వల్లంపాటి గార్ల కధల్ని ఇంగ్లీషులోకి అనువదించి వివిధ పత్రికల్లో ప్రచురించాను. ఆ అనువాద కార్యంలోని అనుభవాలూ, సమస్యలూ వేరు. వాటిని గురించి మరొక సారి మాట్లాడుకుందాం.

మొత్తం మీద అనువాదం రెండు భాషలకూ, రెండు సంస్కృతులకూ మధ్య అక్షరాల వంతెన. ప్రపంచంలోని అన్ని భాషల్నీ, సంస్కృతుల్నీ సర్వ మానవ జీవితానుభవాలనూ, విజ్ఞానాన్నీ ఏకం చేసే విశ్వకుటుంబీకుడు అనువాదకుడు.
----------------------------------------------------------
రచన: వల్లంపాటి వెంకట సుబ్బయ్య, 
ఈమాట సౌజన్యంతో

No comments: