Sunday, March 10, 2019

విధి నా సారథి: పొత్తూరి వేంకటేశ్వరరావు ఆత్మకథ


విధి నా సారథి: పొత్తూరి వేంకటేశ్వరరావు ఆత్మకథ




సాహితీమిత్రులారా!


– చిన్న పత్రికలో చిన్న ఉద్యోగంతో మొదలై, దాదాపు తెలుగులో వెలువడే ప్రధాన పత్రికలన్నింటికీ సంపాదకుడుగా
– నక్సలైట్లకూ, ప్రభుత్వానికీ మధ్య చర్చల్లో అనుసంధానకర్తగా
– టి.టి.డి. వ్యవహారాలపై అధ్యయనం చేసే కమిటీ సభ్యునిగా
– ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సభ్యునిగా


ఎమెస్కో బుక్స్, రూ. 175
ఇలా ఒకదానికొకటి సంబంధం లేని రంగాలు. సంపాదకులుగా వారు సంతరించుకున్న వ్యక్తిత్వమే వారిని అంత సుదీర్ఘకాలంపాటు, రాజకీయాలతో సంబంధం లేకుండా, విభిన్న స్వభావాలు కలిగిన వ్యక్తులందరిలోనూ విశ్వసనీయత కలిగించి ఉంటుంది. అసలు సంపాదకుడు కావడానికి వారికున్న అర్హతలేవి? డిగ్రీ ఫెయిల్. పోనీ ఎవరైనా గురువువద్ద సంప్రదాయబద్ధంగా కుదురుగా విద్యనభ్యసించిన దాఖలాలు లేవు. అలాంటి వ్యక్తి అసలు జర్నలిస్టు కావడమే గొప్ప. ఇక సంపాదకుడుగా, అదీ అన్ని ప్రధాన పత్రికలకూ!

“తక్కిన వాటికంటే కూడా జీవితానికి సన్నిహితమైంది జర్నలిజం. తక్కిన వారికంటే జర్నలిస్టు, జీవితంతో మరింతగా సంబంధం పెట్టుకోవాలి. మరింతగా దానినుంచి పాఠాలు నేర్చుకోవాలి. రెండుతరాల క్రితంవరకు బ్రిటిష్ జర్నలిజంలో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల పట్టభద్రులకు స్థానం లభించేదికాదు. ఈ పెద్దచదువులు చదివినవారికి పుస్తకాలతో ఉన్నంత పరిచయం బ్రతుకుతో ఉండదని, వారు నిత్యజీవిత సమస్యలు, వాటి పరిణామాలు సరిగా అర్థం చేసుకోలేరని, తమ పాండిత్య ప్రదర్శనకు వారు అనవసర ప్రయత్నం చేస్తారని, సామాన్య పాఠకులకు అర్థంకాని పదజాలాన్ని వాడతారని, వారిని జర్నలిజంలోకి అడుగు పెట్టనిచ్చేవారు కాదు.“- ఇదీ తెలుగుకు సంబంధించి జర్నలిస్ట్ పితామహుడుగా ఎన్నదగ్గ నార్ల వేంకటేశ్వరరావుగారి అభిప్రాయం. ఈ దృష్ట్యా చూస్తే జర్నలిజం వృత్తికి పెద్దపెద్ద డిగ్రీలు, విస్తార పాండితి అర్హతలు కాదుగదా, ఒకవిధంగా అవి గుదిబండలే.

నేను ఒక పది దాకా స్వీయచరిత్రలు చదివాను.(అక్కిరాజు రమాపతిరావు మూడువందలదాకా చదివారట!) కానీ ఒక పత్రికా సంపాదకుడి స్వీయచరిత్ర చదవడం ఇదే ప్రథమం. తెలుగు సంపాదకులెవరైనా స్వీయచరిత్ర వ్రాసుకున్నారో, లేదో గూడ నాకు తెలియదు. స్వీయచరిత్ర చదివించాలి, చదివించే జీవశక్తి దానికి ఉండాలి. డైరీని ఎత్తి ముద్రించిన చందంగా ఉంటే, పత్రికల్లో వచ్చే ప్రకటనలకుండే విలువే దానికి. అలా చదివించాలంటే, ఆ ‘స్వీయం’ మరుగునపడి ‘చరిత్ర’ బయటకు పొంగాలి, పెరుగును చిలికితే వచ్చే వెన్న చందంగా. అలాటివాటిలో నేను చదివినవాటిలో అత్యుత్తమమైనది హంపీ నుంచి హరప్పా దాకా. ఎంత విస్తృతి! ఎంత విషయం! తిరుమల రామచంద్రుడు ఎక్కడా కనిపించడే!

నాటక రచయితలు తమ నాటకారంభంలో చేసే నాందీ ప్రస్తావనల ద్వారానే నాటక కథను చూచాయగా ప్రకటిస్తారట. విధి నా సారథి అన్న పేరుతోనే పొత్తురు వేంకటేశ్వరరావు స్వీయచరిత్ర, పుస్తకం తెరువకుండానే పాఠకులకు సూచనప్రాయంగా అవగతమవుతుంది. వారు ఎంత సాధారణంగా ఉంటారో నాకు స్వానుభవం. ఈ పుస్తకం చదివాక, ఇంతమంది హేమాహేమీలతో (మర్రి చెన్నారెడ్డి, ఎన్.టి. రామారావు, కోట్ల విజయభాస్కర రెడ్డి, రామోజీరావు, రామనాథ్ గోయెంకా లాంటి ఎందరో!) సన్నిహితంగా మెలిగిన వ్యక్తి ఎదురుగా ఒక అరగంటకు పైగా కూర్చుని (ఒకమారు కాదు, రెండుమార్లు.) మాట్లాడాను, అనే స్మరణే అతిశయాన్ని కలిగిస్తూ ఉంది. ‘విజయనగర్ కాలనీలో హర్షద్ అయుబ్ క్రికెట్ అకాడమీ నుంచి కొంత ముందుకు వచ్చాక ఫలానా నంబరు(గుర్తులేదు) గల పాత ఫియట్ కారు స్థిరంగా ఉంటుందండీ. అదే మాయిల్లు. మేడపైన నేను ఉంటాను.’ అని వారు ఫోన్లో చెప్పిన అడ్రస్ ఇప్పటికీ గుర్తే. ఇది 2002లో. ఆ ఫియట్ కారే అనుకుంటా వారు గోయెంకాల నుంచి కొన్నదీ, ఈ గ్రంథంలో ప్రస్తావించబడ్డదీ.

స్వీయచరిత్ర రచనకు వారిని ప్రేరేపించిన కారణాలను ప్రారంభంలోనే ఇలా చెప్పుకున్నారు.

మంచీ చెడూ, నాకు ఇష్టమైనవీ, ఇష్టం కానివీ చాలా జరిగాయి. వాటిలో నాపాత్ర ఎంత?
నేను చేసిన పొరపాట్లు, తప్పులు ఇతరులు చేయకుండా జాగ్రత్తపడమని చెప్పడం. నేను చేసినవేగాదు, ఇతరులు నా విషయంలో ఏ దురుద్దేశం లేకుండానే చేసిన పొరపాట్లు సైతం ఉన్నాయి.
జీవితంలో కొందరికి నేను చాలా ఋణపడి ఉన్నాను. అది చెప్పవలసిన అవసరం ఉంది.
సమకాలీన చరిత్రకు సంబంధించి నాకు తెలిసిన కొన్ని సత్యాలను గ్రంథస్థం చేయడం భవిష్యత్ తరాలకు మంచిదనే భావన.
ఇందులో ఒకటవ, మూడవ అంశాలు వారి వ్యక్తిగతం. అవి పాఠకునికి ఆసక్తికరంగా ఉండవచ్చూ ఉండకపోవచ్చూ. కానీ రెండవ అంశం, జర్నలిజంలోనే గాదు, మరి ఏ ఇతర రంగంలోనైనా ఎదగగోరేవారికి, ఇందులో అనుభవాలు కాగడాల్లా పనిచేస్తాయనడంలో ఏలాంటి అనుమానం లేదు. ఇక నాల్గవ అంశం చారిత్రికం. అలాంటివాటిని గ్రంథస్థం చేయకపోతే, భావితరాలకు అమూల్యమైన సమాచారం తెలియకుండా పోతుంది. ఆ విషయంలో పొత్తూరి చాలా నిష్కర్షగా, శషభిషలు లేకుండా భావితరాలకు వాస్తవాలను అందించడంలో కృతకృత్యులయ్యారు.

యౌవనంలో నాస్తికులుగా వారు చెప్పుకున్నారు. తరువాత అమ్మ ఒడి చేరినా, తమ హేతువాద దృక్పథం నుంచి ప్రక్కకు జరగలేదు.

-‘బ్రాహ్మణులు శాకాహారులు గనుక వారు స్వయంగా జంతువును ఇవ్వకపోయినా (బలి), జంతువును కొనడానికి డబ్బులు ఇవ్వడం, బలిని ప్రోత్సహించడం నాకు విడ్డూరంగా, తమనుతాము వంచించుకోవడంగా అనిపించింది.‘
-‘భర్త పోయిన స్త్రీలను వితంతువులుగా చేసే విధానం నాకు ఏహ్యభావాన్ని కలిగించింది.‘
-‘సమానావకాశాలని రాజ్యాంగంలో వ్రాసుకున్న ఎంతోకాలానిగ్గూడా పేదవర్గాల పిల్లలు ఇతర వర్గాలవారితో సమాన స్థాయికి కాకపోయినా దరిదాపులకు గూడ చేరలేకపోవడం గురించి నేను పెద్దయ్యాక తెలిసింది.‘

ఇలాంటి ఆలోచనలు ఏదో చప్పట్లకోసం చెప్పినట్లనిపించదు, వారు నిజంగానే తమ అంతరంగంలో అలాంటి ఆవేదన అనుభవించారనిపిస్తుంది.

ఒక పత్రిక సంపాదకుడికుండాల్సిన విశాలదృష్టి, నిష్పాక్షికత వారిలో పుష్కలంగా ఉండబట్టే, అన్ని ప్రధాన పత్రికల సారథ్య బాధ్యతలు సమర్థంగా నిర్వహించడం సాధ్యమయ్యుంటుంది. హేతువాద దృక్పథానికి అమ్మ ఒడి కూడ తోడవ్వడంతో, జీవితానికి సంబంధించి ఒక వాస్తవమైన అవగాహన వారికి ఏర్పడిందని చెప్పుకున్నారు. జీవితాన్ని పరిశీలించే దృష్టి నిశితమైంది. కాబట్టే ‘విజ్ఞానశాస్త్ర విజయాలను చూడడం, వాటివల్ల కలిగిన భౌతిక సుఖాలను అనుభవించడం వేరు, వాటిని అనుభవిస్తూ ఆనందంగా జీవించడం వేరు. చల్లని ఎయిర్ కండిషన్డ్ గదిలో ఉన్నవారు ఆనందంగా ఉంటారన్న పూచీ లేదు. ఇతరత్రా కష్టాలు కలిగితే శీతల సౌకర్యం సుఖాన్నీ ఆనందాన్నీ ఇవ్వలేదు.’ లాంటి నగ్న సత్యాలను చెప్పగలిగారు. హంద్రీ-నీవా ఒక విఫల పథకం అని నిష్కర్షగా భావిని ఆవిష్కరించారు. ‘నా మహా వైఫల్యాలలో ఒకటిగా ఈ స్వీయ చరిత్రలో వ్రాసుకోవడానికి శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పాలకమండలిలో నా సభ్యత్వం ఉపయోగపడింది.’ అని ఎంతో వినమ్రంగా తమ వైఫల్యం చాటుకుంటున్నా, దాని వెనుక వ్యవస్థకు పట్టిన తుప్పు గూర్చిన ఆవేదన నిశిత దృష్టికి గోచరం కాకపోదు.

ఏదో ఒకరంగంలో అత్యున్నత శిఖరాలకు చేరినవారందరూ ఉత్తమ సంస్కారులు, ఉన్నత వ్యక్తిత్వం కలవారూ కానక్కరలేదు. అప్పటి పరిస్థితులు, కలిసొచ్చిన అదృష్టం కూడా వారినా స్థాయికి చేర్చుండొచ్చు. అలాంటివారు తమ గురించి చెప్పుకునేప్పుడు వారిలో నిజాయితీలేమి బయటపడుతూనే ఉంటుంది. వైఫల్యాలకు ఇతరులను బాధ్యులను చేయడం, లోపాలను కప్పిపుచ్చుకోవడం జరుగుతూంటుంది. కానీ పొత్తురివారా స్థాయికి దిగే ప్రయత్నం ఎక్కడా చేయకపోవడం వారి ఉన్నత స్థాయినేగాక, ఉన్నత వ్యక్తిత్వాన్నీ తెలుపుతుంది. అమ్మను చేరిన తరువాత స్త్రీ విషయంలో తమ దృష్టిలో వచ్చిన మార్పును వారు వెల్లడించిన తీరు అద్భుతం.

-‘లైంగిక సంబంధమైన ఆలోచనలు చాలా చిన్న వయసునుంచే ఉన్నాయి. తప్పు చేయకూడదని కాదుగానీ, చేసే ధైర్యం లేకపోయిందనడం సత్యం. నికరంగా చెప్పాలంటే తప్పు చేశాను.’ ‘సెక్స్ పత్రికలు రహస్యంగా చదివేవాడిని. స్త్రీలను సెక్స్ దృష్టితో చూడడం మొదలైంది.‘
-‘తనకు కీర్తికాంక్ష లేదనీ, డబ్బుమీద వ్యామోహం లేదనీ, పరస్త్రీని కన్నెత్తి చూడననీ చెప్పేవారిలో ఎంతమంది నిజం చెబుతున్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. స్త్రీని శృంగార దృష్టితోగాక మాతృమూర్తిగా చూసే ఉత్తమ సంస్కారం అలవడడం సులభం కాదు.‘
-‘కట్నం తీసుకోగూడదని అనుకునేవాడిని. కానీ వారు ఇచ్చారు, మేము తీసికున్నాము. వారు ఇచ్చిన ఆరువేల రూపాయలు గాక, మేము మరో వెయ్యో, రెండువేలో అప్పు చేశాము కూడా.‘

ఇవన్నీ వారి నిజాయితీకీ, క్రమంగా పరిణతి చెందిన వ్యక్తిత్వానికీ దృష్టాంతాలే.

మామూలుగా చూస్తే పొత్తూరివారు చాలా లౌక్యులు, వ్యవహారజ్ఞాని అనిపిస్తుంది. అది నిజమే అయినా, వారి వృత్తివ్యాపకాలవరకే సుమా! వారి వ్యక్తిగత వ్యవహారాల్లో వారు చాలా అమాయకులనే విశదమవుతుంది. కాని పక్షంలో పంజాగుట్ట వంటి అతి విలువైన ప్రాంతంలో అత్యంత విలువైన స్థలాన్ని అంత అమాయకంగా పోగొట్టుకుంటారా! అదీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్. అధికారులెంతమందో సన్నిహితంగా ఉండి, తాము స్వయంగా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులై ఉండీ. పరపతిని వ్యక్తిగతంగా వాడుకోరాదనే వారి నిబద్ధతకు, వారు భరించిన ఆ నష్టమే నిదర్శనం. ఒక జిల్లా కేంద్రంలో స్టింగర్లుగా పనిచేస్తున్నవారు సాగించుకొనే పైరవీలు చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది, మరి వారి స్థాయికది ఓ లెక్కా! వారి నిబద్ధత అంత గొప్పది. వారి నిజాయితీ నిబద్ధతలకు తిరుగులేని సాక్ష్యం, ఐ.ఏ.ఎస్. అధికారి ఎస్.ఆర్. శంకరన్ తామేర్పాటు చేసుకున్న కమిటీ ఆఫ్ కన్సర్న్‌డ్ సిటిజన్స్‌లో వీరికి ప్రవేశం కల్పించడం. శంకరన్‌గారి నీతీనిజాయితీలను గురించి, నిబద్ధత గురించీ అనుమానాలెవరికీ ఉండవు.


ప్రభుత్వానికీ, నక్సలైట్లకూ మధ్య చర్చల గురించి వ్రాసిన విషయంలో భావితరానికి ఉపయోగపడే సమాచారం చాలా ఉంది. ప్రజాహక్కుల ఉద్యమకారులకా బాధ్యత తప్పదు, ఫర్వాలేదు గూడా, వాళ్ళకు వాళ్ళకు మధ్య కొన్ని రహస్య అవగాహనలు ఉంటాయి గనుక. కానీ ఎటూ మొగ్గుచూపని ఒక సంపాదకుని హోదాలో వేంకటేశ్వరరావు చాలా రిస్క్ తీసుకున్నారనిపించింది. అసలిలాంటి విషయాల్లో రాజకీయ ప్రయోజనాలకూ, బ్యూరోక్రాట్ల వ్యూహాలకూ మధ్య ఉండే విరుద్ధ ప్రయోజనాలు బాగా అర్థమవుతాయి. అవును మరి. సమస్య దీర్ఘకాలికం, దాన్ని ఎదుర్కొనే వ్యవస్థా దీర్ఘకాలికమే. రాజకీయాలు, రాజకీయ నేతలు తాత్కాలికం. చర్చల ఫలితం ఎలాగున్నా, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పొత్తూరి ఈ విషయంలో చూపిన చొరవ, తెగువ ప్రశంసనీయాలు.

ఇక, ఒక నాన్ బిలీవర్‌గా ప్రారంభమైన వీరి జీవితంలో, అమ్మపై భక్తితో ఆధ్యాత్మిక తేజం ప్రజ్వరిల్లి సన్యాసాశ్రమం దాకా నడిపించిన విధానం చలం, నండూరి రామ్మోహన్ రావు జీవితాల్లో గూడా కనిపించిన యూ-టర్న్ వంటిదే.

‘ఇవన్నీ ఎప్పటినుంచో చేస్తున్నారు, మనమూ చేద్దామని చాలామంది చేస్తుంటారు. దేవుడు సర్వత్రా ఉన్నాడంటూనే ఒకవైపు తిరిగి చేసే ప్రార్థనలూ, ఒకరి మతాన్ని ఒకరు హేళనచేసే విధానం, మతం పేరుతో జరిగే మారణకాండ… కాస్త సేపటికి తగలేయడమో, పూడ్చడమో చేసే శవానికి స్నానాలూ, అలంకరణలేమిటి? చనిపోయిన మనిషి నోటిలో బియ్యం పోసి దారిబత్తెమనడమేమిటి?’ ఇలాంటి ఆలోచనలు హేతువాదమార్గంలో వారి పరిణతిని, సంప్రదాయాల ఔచిత్యాన్ని వారు నిర్భయంగా ప్రశ్నించడాన్నీ ఆవిష్కరిస్తాయి. అయితే మరోమారు ‘శ్రీ వేంకటేశ్వరస్వామి తన కిరీటాలను, తను ఒకప్పుడు ధరించిన, ఇప్పుడు ధరిస్తున్న అన్ని ఆభరణాలనూ తాకి చూసే మహదవకాశాన్ని నాకు కలిగించాడు, నా జీవితంలో ఇదొక గొప్ప అనుభవం. అది స్వామి వైభవ స్పర్శ.’ అనడం పై పరిణతికి విరుద్ధంగా అనిపిస్తాయి. మర్రి చెన్నారెడ్డి వ్యక్తిగత బలహీనతల గురించి ఆయన్నే నేరుగా ప్రశ్నించడం, వై.ఎస్. రాజశేఖర రెడ్డిని వ్రేలు చూపిస్తూ మాట్లాడడం (వారి నేపథ్యం తెలిసికూడా), ఎన్.టి. రామారావు అహంభావం తెలిసీ ఆయన పథకాలను ఆయనెదుటే విమర్శించడం లాంటి సంఘటనలు అమాయకంగా, మెత్తగా కనిపించే వేంకటేశ్వరరావులో నిగూఢంగా ఉన్న ధీరగంభీరత్వాన్నీ, నిర్భీతినీ తెలియజేస్తాయి; మహాభారతంలోని ‘ధర్మరాజు మెత్తని పులి’ అన్న మాటను తలపింపజేస్తాయి.

– స్వాతంత్రసమర త్యాగాలను గానీ, ఆదర్శాలను గానీ శాసనసభల సభ్యత్వాలకు కాంగ్రెస్ పార్టీ యోగ్యతగా గుర్తించేకాలం అప్పటికే పోయింది. (1950-54 మధ్యకే)
– త్యాగధనులకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేకపోవడం అప్పటికే మొదలైంది. (అధరాపురపు శేషగిరిరావుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడం గురించి ప్రస్తావిస్తూ)
– పి.వి. నరసింహారావుగారు, వి.బి. రాజుగారు పొరబాటున కూడ సంజయ్ గాంధీని పొగడలేదు. అదీ వారి వ్యక్తిత్వం.

ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే, అదీ తనకు సన్నిహితంగా ఉండే చాలామంది నాయకులకివి రుచించవని తెలిసీ, చాలా ధైర్యం కావాలి. కొంతమందికి మ్రింగుడుపడకపోవచ్చుగానీ, హిందూయిజాన్నీ, దాన్ని విమర్శించేవారినీ కూడా కలిపి వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆసక్తిదాయకం.

– ఎన్ని యుగాలు గడిచినప్పటికీ దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న అలాగే నిలిచి ఉంటుంది. ఇది సమాధానం సాధ్యం కాని ప్రశ్న.
– వేదంలో లేని కులం అనే భావన మనువు మూలాన వైదిక సమాజాన్ని చీలికలు పేలికలు చేసింది.
– దేవుడు లేడని నమ్మేవారిలో కొందరు సైంటిఫిక్ ప్రూఫ్ లేదనే వాదనతో హోమియో వైద్యం మూఢ విశ్వాసం అంటారు. యోగాభ్యాసాన్ని వ్యతిరేకిస్తారు.
– ఆర్గనైజ్డ్ మతాలు కొన్నింటిపై ఎవరూ బహిరంగ విమర్శలు చేయరు. చంపుతారనే భయం వల్ల నోరెత్తరు. ఎంత తిట్టినా ఎవరూ ఏమీ అనరనే భరోసావల్ల వైదిక మతాన్ని తిట్టేవాళ్ళు ఎక్కువ. వైదిక మతానికి ఆధిపత్య వ్యవస్థ లేదు, వ్యక్తులు లేరు. పీఠాధిపతులలో ఒకరంటే ఒకరికి పడదు.

ఈ గ్రంథం నిండా ఇలాంటి అపూర్వ విశేష విషయాలెన్నో! పి.వి. నరసింహారావుతో అనుబంధం, మొరార్జీ దేశాయితో రష్యా పర్యటన, ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యునిగా వారి అనుభవాలూ… ఇలాంటివి లెక్కకుమించి. అయితే కొన్ని డామేజింగ్ సంఘటనల్లో సంబంధిత వ్యక్తుల పేర్లను గుంభనంగా ఉంచడం కొంత నిరాశకు గురిచేసినా, దాని వెనుక ఉన్న ఉదారభావన గూడ చాలా గొప్పదే అనిపిస్తుంది. ‘పీఠాధిపతుల సమావేశానికి గూడ పార్టీ అధినేత్రి (ఇందిరాగాంధీ కాదు) అనుమతి కావలసిందేనని అనుభవరీత్యా తెలిసిన రహస్యం’ అనడంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతనం; ‘రహదారిలో ప్రమాదం జరిగితే ఆగి సహాయం చేద్దామనుకునే పుణ్యాత్ములు తగ్గిపోతున్నారు. ఎవరి తొందర వాడిది. మనుషుల మధ్య ప్రేమలు తగ్గాయి. కుటుంబ వ్యవస్థ మరింత బలహీనపడింది.’ అనడంలో సామాజిక పరమైన ఆవేదన స్పష్టంగా కనిపిస్తాయి. ఆంధ్ర, తెలంగాణా సమస్యలో తెలంగాణావాదనే న్యాయం అని చెప్పడం కూడా సాహసమే. ఇక వారి జీవితంతోబాటు తెలుగు పత్రికారంగ క్రమ ఉత్థానమూ ఇందులో నిబిడీకృతమై ఉంది. ఈ వ్యాసంలో దాన్ని ప్రస్తావించకపోవడం అందుకే.

తెలుగు పత్రికల డిజిటైజషన్ ప్రక్రియ వేంకటేశ్వరరావు కృషినీ, కీర్తినీ తెలుగు జాతితో నిత్యం సజీవంగా ఉంచుతుంది. ఎవర్నో మెప్పించడానికో, లేక మరెవర్నో నొప్పించకూడదనో కాకుండా తాము నమ్మింది, అనుభవించింది నిర్భయంగా ప్రకటించిన మనీషి పొత్తూరి వేంకటేశ్వరరావు.
----------------------------------------------------------
రచన: ఇంద్రకంటి వేంకటేశ్వర్లు, 
ఈమాట సౌజన్యంతో

No comments: