Thursday, June 7, 2018

ఉల్లిపాయ దండకం


ఉల్లిపాయ దండకం




సాహితీమిత్రులారా!

ఉల్లిపాయలు అప్పుడప్పుడూ ఆకాశాన్నెక్కి
వీరవిహారం చేస్తుంటాయికదా
అలా ఒకసారి అంటే 1998వ సంవత్సరంలో
ఉల్లిధర పెరిగిన సందర్భంలో 13 - 11- 1998 తేదీ
అద్దంకిలో జరిగిన ఒకసభలో ఇలపావులూరు
సుబ్బారావుగారు ఈ ఉల్లిదండకాన్ని చేశారు
ఆ దండకం -

శ్రీయుల్లిపాయా! నమో యుల్లిపాయా! నినుం బూజ గావింతు
నీవాసనల్లేక నేకూరయుం గూడ నేదో మఱో మట్టిఁ దిన్నట్లుగా
మాకగ డెందమ్మునం దోచు, మా పిల్ల వాండ్రందఱుం గూడ
నీ రాకకై రోజు వీక్షించుచున్ గాలమేదో ప్రకారమ్ముగా నెట్టుచున్
మమ్ములన్ దిట్టుచున్ తానిన్నెంతగానో మది న్నిల్పినారే
సవేగంబుగా నీకు నీవే విదేశమ్ములన్నుండియే నెఱ్ఱగా
నుండియైనం సరే తెల్లగా బల్లిగా పెద్దగా నెట్లుండినంగాని
యిచ్చోట నిన్నెవ్వరుం గూడ నేపోటు మాటైన నే తీరుగానైన
నిదించబోరగ మామాట పాటిెచి మా తప్పుమన్నించి మా
కోర్కెలందీర్ప వైళంబుగా నాంధ్రదేశానికిం రావె నీరాకకై మేము
వర్షించు మేఘాలకై కేకులంబోలె, సంతానముంగోరి
దేవాలయంబందు దైవమ్ము దర్శించి టెంకాయలం గొట్టి మాసంబు
మాసంబునుం పొట్ట నుంగాంచు గొడ్రాలి భంగిన్, ఋణాలిచ్చు
శాల నన్వేషణార్థమ్ము పర్యాటనల్ సేయు నాంధ్రా ప్రభుత్వమ్ము
చందాన. లంచంబులం గోరు యుద్యోగులంబోలె, తానాథు
జీతమ్ము మొత్తమ్ము పైనాసతో భార్య ఫస్టున్ నిరీక్షించుటంబోలె
పీఠమ్ముపై నుండు మంత్రి బదంబూడగాజేయు నాలోచనల్
సేయుచున్ గాలమున్ బుచ్చు ప్రత్యర్థి వర్గంబులంభంగి, నేదేని
బీమా నెదోరీతిగానైనా జేయించగాఁజూచు ఎల్లైసి
యేజంటునుంమాడ్కి, పళ్ళెంబులోచిల్లరేమైనా ప్రోగైనదోలేదో
యంచున్ మదిన్ సంశయంబందు చూజారిన్ మాడ్కి
వీక్షింతుమో తల్లి యోయుల్లిపాయా! భజే యుల్లిపాయా!
సరాగంబునన్ వచ్చి మా కాంక్షలం దీర్చవే, పూర్వకాలంబులో
రీతిగా కూరలన్నింటికిన్ క్రొత్తటేస్టుల్ ప్రసాదించి మా జిహ్వకుం
దృప్తిచేయంగదమ్మా నమస్తే నమస్తే నమస్తే నమః

(నవ్వులు పువ్వులు - 2000 పుట. 34)

No comments: