Sunday, June 24, 2018

బహువిధ కందములు


బహువిధ కందములు



సాహితీమిత్రులారా!


ద్వివిధ కందములో పూర్వార్ధమును, ఉత్తరార్ధమును తారుమారు చేసినను పద్యము అర్థవంతముగా నుండవలయును. అదే విధముగా చతుర్విధ కందములో ఒక కంద పద్యములో నాలుగు విధములైన కందపు అమరికలు మనకు అర్థవంతముగా కనబడవలయును. నల చతుష్కందములో సరి పాదములలోని రెండవ గణము నలముగా నుండవలయును. అట్టి నలముతో మఱొక కంద పద్యము ప్రారంభము కావలయును. జ-గణ చతుష్కందములో బేసి పాదములలో రెండవ గణము, సరి పాదములలో మూడవ గణము జ-గణముగా నుండవలయును. సరి పాదములలోని రెండవ గణముతో నూతన కంద పద్యములను మొదలు పెట్టాలి. వీటికి క్రింద నా ఉదాహరణములు –

ద్వివిధ కందము
                                     మొదటి కందము
రాకేందుముఖీ వడి నీ
రాకకొఱకు వేచియుంటి – రంజిల రజనిన్
రాకేందుబింబ మతిగా
రాకొమరిత జూడు వెల్గె – రత్నాంబరమై

రెండవ కందము – పై కందపు పాదములు3,4,1,2 వరుసలో.


చతుర్విధ కందము-
చతుర్విధ కందమును మొట్ట మొదట నన్నెచోడుడు కుమారసంభవములో నుపయోగించెను. తఱువాత కావ్యాలంకార చూడామణిలో కూడ ఇట్టి పద్యము గలదు. అవి –

నన్నెచోడుని కుమారసంభవమునుండి (12.217)

చతుర్విధ కందము
                                       మొదటి కందము 
సుజ్ఞానయోగతత్త్వ వి-
ధిజ్ఞులు భవ బంధనములఁ ద్రెంచుచు భువిలో
నజ్ఞానపదముఁ బొందక
ప్రాజ్ఞులు శివుఁ గొల్తు రచల భావనఁ దవులన్

రెండవ కందము –
భవ బంధనములఁ ద్రెంచుచు
భువిలో నజ్ఞానపదముఁ బొందక ప్రాజ్ఞుల్
శివుఁ గొల్తు రచల భావనఁ
దవులన్ సుజ్ఞానయోగతత్త్వ విధిజ్ఞుల్

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణినుండి(6.48)

చతుర్విధ కందము – మొదటి కందము –
చాళుక్య విశ్వవిభునకు
వాలున్ బుధనుతియు సుగుణ – వర్గము నిధులున్
జాలుటయు నీతినిరతియు
మేలున్ మధురతయు నీగి – మీఱినవిధమున్

రెండవ కందము –
బుధనుతియు సుగుణ వర్గము
నిధులున్ జాలుటయు నీతి-నిరతియు మేలున్
మధురతయు నీగి మీఱిన
విధమున్ చాళుక్య విశ్వ-విభునకు వాలున్

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

నేను వ్రాసిన చతుర్విధ కంద మొకటి –

మొదటి కందము –
మిలమిల వెలుగులఁ గందము
గలిగెన్ బలు పలుకు విరుల – గమగమ లలరెన్
దెలుఁగున సొబగుల హారము
జెలగెన్ బలు ఛవుల హృదియుఁ – జిమ్మెను గళలన్

రెండవ కందము –
పలు పలుకు విరుల గమగమ
లలరెన్ దెలుఁగున సొబగుల – హారము జెలగెన్
బలు ఛవుల హృదియుఁ జిమ్మెను
గళలన్ మిలమిల వెలుగులఁ – గందము గలిగెన్

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

నల చతుష్కందము – మొదటి కందము –
భూమీశ దనుజ హారీ
శ్యామా నవమదనరూప – యవనిజభువనా
శ్రీమంత పరమ పురుషా
రామా పవనసుతపాల – రక్షితహవనా

రెండవ కందము –
నవమదనరూప యవనిజ
భువనా శ్రీమంత పరమ – పురుషా రామా
పవనసుతపాల రక్షిత
హవనా భూమీశ దనుజ – హారీ శ్యామా

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు

జ-గణ చతుష్కందము –
మొదటి కందము –
రావమ్మ నాదు సాలకు
దేవీ నిను గొల్తునమ్మ – దినమున్ మనమున్
భావింతు భక్తి మలహరి
నీవే నను గనుము రాగ-నిలయా జననీ

రెండవ కందము –
నిను గొల్తునమ్మ దినమున్
మనమున్ భావింతు భక్తి – మలహరి నీవే
నను గనుము రాగనిలయా
జననీ రావమ్మ నాదు – సాలకు దేవీ

మూడవ కందము – మొదటి కందపు 3,4,1,2 పాదములు
నాలుగవ కందము – రెండవ కందపు 3,4,1,2 పాదములు
-----------------------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

No comments: