Tuesday, June 26, 2018

చిత్రకవిత్వ పరిచయము


చిత్రకవిత్వ పరిచయము



సాహితీమిత్రులారా!




డా. ఏల్చూరి మురళీధరరావుగారి  ఒక వ్యాసం నుండి -
చిత్రకవిత్వ పరిచయాన్ని గురించిన ఈ చిన్నపాటి వివరణను
చూడండి-

చిత్రకవిత్వం ప్రధానంగా శబ్దచిత్రం, అర్థచిత్రం అని రెండు విధాలు. ఈ రెండింటి సమావేశం వల్ల ఉభయచిత్రం ఏర్పడుతుంది. కేవలం శబ్దవిషయకమైన గుణాలంకారచమత్కృతివిశేషాన్ని కలిగి, వ్యంగ్యప్రాధాన్యం లేకపోవటం శబ్దచిత్రమని, అర్థాన్ని పురస్కరించుకొన్న గుణాలంకారచమత్కారవిశేషవత్త్వం అర్థచిత్రమని, శబ్దార్థాలు రెండింటికి తుల్యప్రాధాన్యం ఉన్న వ్యంగ్యవైభవం తోడి గుణాలంకారచమత్కృతి ఉభయచిత్రమని అప్పయ దీక్షితులవారి చిత్రమీమాంసకు సుధా టీకను వ్రాసిన ధరానందుడు నిర్వచించాడు. అనుప్రాసము, లాటానుప్రాసము, ఛేకానుప్రాసము మొదలైన శబ్దాలంకారాలకు శబ్దచిత్రాలని సామాన్యవ్యవహారం. పువ్వులతో దండను కూర్చినప్పుడు, ముత్యాలతో హారాన్ని రూపొందించినప్పుడు రకరకాల పువ్వులలోని వర్ణసమ్మేళనను చూసి, ముత్యాల వరుసలోని ఆకర్షణీయమైన క్రమప్రథను తిలకించి ముగ్ధులయ్యే రసజ్ఞుల లాగానే శబ్దచిత్రాలలో స్వసమానవర్ణసన్నివేశం వల్ల – అంటే ఒకే అక్షరాన్ని, ఒకే అక్షరసంహతిని చిత్రచిత్రప్రకారాలుగా ప్రయోగించటం వల్ల పాఠకుల మనస్సులో ఒక విచ్ఛిత్తివిశేషం ఉదయిస్తుందని, ఆ విచ్ఛిత్తి (శరీరానికి సౌందర్యలేపనం వంటి అంగరాగం) విశేషాన్ని భావించే భావుకులకు రసభావసంపత్తి కంటె ఆ శబ్దచిత్రసామగ్రిపైనే అభిమానం ఏర్పడుతుందని విద్యాధరుని ఏకావళికి తరళ వ్యాఖ్యను వ్రాసిన మల్లినాథ సూరి అన్నాడు.

అర్థాన్ని ఆశ్రయించుకొన్న చమత్కృతులు అర్థచిత్రాలు. యమకాలంకారంలో అర్థమే ప్రధానం కాబట్టి అది అర్థచిత్రమని కొందరు, అర్థం శబ్దచమత్కారంలో అణిగిపోతున్నది కాబట్టి శబ్దచిత్రమని కొందరు లక్షణకారులు ఊహించారు. ఉపమ, ఉత్ప్రేక్ష, రూపకం, వ్యాఘాతం, అతద్గుణం మొదలైన అలంకారాలను చిత్రార్థవంతంగా ప్రయోగించటమే అర్థచిత్రం. శబ్దానికి, అర్థానికి తుల్యప్రయోజనం ఉన్న శ్లేష, వక్రోక్తి, విరోధాభాసం, సమాసోక్తి, అపహ్నవం వంటివి ఉభయచిత్రాలు.


No comments: