తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం
సాహితీమిత్రులారా!
ప్రథమాంధ్ర కవిజీవిత చరిత్రనిర్మాత శ్రీ గురజాడ శ్రీరామమూర్తి 1893లో ప్రకటించిన తమ కవిజీవితములు సంపుటంలో చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలోని వ్రాతప్రతుల ఆధారంగా, రామకృష్ణుని చాటుధారాపద్యములు అని ఉదాహరించిన వాటిలోని ఈ అందమైన పద్యం నిజానికి తెనాలి రామలింగకవి రచించిన కందర్పకేతు విలాసము లోనిది:
ఉ. ఆ నలినాక్షి వేనలికి _నంబుధరంబు సమంబు గామిచేఁ
దా నిరువ్రయ్యలై చనినఁ _ద ద్దశఁ జూచి దయార్ద్రులై బుధుల్
దాని పదాంతరంబునను _దారు వసించినవారు గావునన్
బూని తదంశమున్ సమతఁ _బోల్చిరి తత్సతి దృ క్కుచంబులన్.
శబ్దచిత్రానికి నిదర్శనార్హమైన మేలి రచనమిది. ఇటువంటి కూర్పును విద్యానాథుడు ప్రతాపరుద్రీయము లోనూ, విశ్వేశ్వర దేశికుడు తన చమత్కార చంద్రికలో ‘సతృణాభ్యవహారత్వం’ అన్నాడు. భావవ్యక్తి సుబోధం కానిదే దీనికి ప్రతిపదార్థం చెప్పటమూ, తాత్పర్యం రాయటమూ కొంచెం కష్టమే.
కందర్పకేతు విలాసము కావ్యనాయిక వాసవదత్త వేనలికి (అంటే జుట్టుకు) అంబుధరము (నీరు నిండి నలుపుతేరిన మబ్బు) తులనీయం కాలేక పోయినందువల్ల ఇరువ్రయ్యలు కాగా దాని దుర్దశను పరికించి దయగొన్న బుధుల సుకృతాచరణాన్ని వర్ణిస్తున్నది ఈ పద్యం.
ఆ పద్మాక్షి వేణీభరం నీలిమకు అంబుధరం సాటి కాలేకపోయింది. ఆ దుఃఖభారం వల్ల (ఏడ్చి ఏడ్చి గుండె పగిలి కాబోలు) అది రెండు ముక్కలయిపోయింది. ఆ దుఃస్థితిని చూసిన దేవతలకు — వారూ ఆ గగనపదంలోని వారే కనుక — జాలి కలిగింది. వేణీభరంతో ఉపమింప లేకపోతే ఏమయింది? ఆమె చూపులతో, వక్షోజాలతో తదంశమాత్రాన్నైనా పోల్చి చెప్పవచ్చును కదా! అని ఔపమ్యాన్ని ఘటించారు.
ఇంతకీ పద్యభావం ఇది:
బుధ శబ్దానికి 1) దేవత 2) కవి (లేదా) పండితుడు అని ఇక్కడ రెండర్థాలు. బుధ వృద్ధౌ పణ్డితేఽపి అని అమరకోశం. బుధః కవౌ అని విశ్వప్రకాశ కోశం. బుధౌ విద్వద్గ్ర హామరాః అని మంఖకోశం.
బుధుల్ – అంటే, దేవతలు. వారు — దాని పదాంతరంబున వసించినవారు కావునన్ — ఆ అంబుధర పదాంతరంలో, అంటే – మబ్బులకు ఉనికిపట్టయిన గగనతలంలో (దివియందు) నివసిస్తున్నవారు కాబట్టి, నాయిక వేనలితో సాటి కాలేక మనస్తాపం వల్ల దానికి కష్టకాలం దాపురించినప్పుడు వారికి దానియందు సానుభూతి.
బుధుల్ – అంటే, పండితులు కూడాను. ఆ పండితులు — దాని పదాంతరంబున వసించినవారు కావునన్ — ఆ అంబుధరమంటే వారికీ దయే. దాని పదాంతరంబున అంటే, ఆ అం బు ధ ర పదమధ్యంలో (అంతరంబున) ఉన్నవారు ఆ పండితులు. అందువల్ల వారికి దానియందు జాలి.
అంతే కాదు. అంబుధర శబ్దం ఇరువ్రయ్యలు అయి, అంబు – ధరగా విడిపోయినప్పుడు బు, ధ అనే అక్షరాలు కూడా చెఱొక పదంలోకీ పడిపోయినందువల్ల వీరూ బాధితులే. కనుకనే వీరికీ సానుభూతి.
ఇంతకీ జరిగిందేమిటంటే; అంబుధరం వేనలికి సాటి రాలేక ఇరువ్రయ్యలైనపుడు ఆ దేవతలూ, ఆ విద్వాంసులూ, తదంశముల్ పూని అంటే, ఆ విడిపోయిన పదాంతరాల అర్థాలను లేదా, ఆ పదాల అర్థాంతరాలను గ్రహించి, సమతఁ బోల్చిరి తత్సతి దృక్కుచంబులన్. వాటిని ఆమె చూపులతోనూ, ఆమె వక్షోజములతోనూ సాటి చేసి, ఎంతో కొంత ఊరటను కల్పించారు.
అంబుధర శబ్దం అంబు, ధరలుగా భిన్నత్వాన్ని పొందింది. అంబు అంటే నీరు అని అర్థం కదా. ఆ అంబు శబ్దానికి గల పర్యాయపదాల్లో ఒకటి అమృతం. అమృతం… తోయ పానీయ నీర క్షీరామ్బు శమ్బరమ్ అని అమరకోశం. అమృతమంటే నీరు అని అర్థం. అమృతమంటే దేవతలకు ఆహారమైన సుధ. న మృతా భవ న్త్యనేనే త్యమృతమ్. మృతి లేని శాశ్వతస్థితిని కల్పించే దివ్యమైన పానీయం. పీయూష మమృతం సుధా అని అమరకోశం. ఆ అమృతమును తత్ + సతి = ఆ పతివ్రతయొక్క (కందర్పకేతుని భార్య అయిన వాసవదత్త యొక్క), దృక్కులన్ = దృక్కులతో (కడకంటి చూపులతో), సమతన్ + పోల్చిరి = సమానధర్మం కలిగి ఉండటాన్ని ఉపమించారన్నమాట. కటాక్షామృతమని భావన చేశారని భావం.
ఇక, ఉత్తరపదమైన ధర అంటే భూమి. ధరా ధరిత్రీ ధరణిః. ఆ ధర శబ్దానికి గల అర్థాంతరం పర్వతం. మహీధ్రే శిఖరి క్ష్మాభృ దహార్య ధర పర్వతాః అని అమరకోశం. ఆ పర్వతమును తత్ + సతి = కుచంబులన్, సమతఁ బోల్చిరి = ధర్మసామ్యం మూలాన ఉపమించారన్నమాట.
పద్యం పూర్వార్ధంలో ఉపమేయమైన వేనలికి ఉపమానమైన అంబుధరము యొక్క ఆపకర్షను చెప్పి, ఉత్కర్ష సాధింపబడుతున్నది. ఈ ఉపమానాపకర్ష సాదృశ్యలోపం వలన సంభవించింది. అంబుధరమును ఇరువ్రయ్యలుగా చేసినప్పుడు అర్థాంతరాక్షిప్తి మూలాన సాదృశ్యం ఘటిల్లింది. మొదటిది శాబ్దమైన అపకర్ష. రెండవది ఆర్థికమైన ఔపమ్యం. ఇందులో వ్యంజన ఏమీ లేదు. పద్యంలో అంబుధర శబ్దాన్ని తీసివేసి దానికి పర్యాయంగా వేఱొక పదబంధాన్ని కూర్చితే పద్యంలోని చమత్కారం భగ్నమైపోతుంది. పదాలు పరివృత్తిని సహింపవు కనుక దీనిని ‘పరివృత్త్యసహిష్ణుత’ అంటారు. శబ్దచిత్రము యొక్క ప్రాథమికలక్షణం ఇదే.
ఉపమానోపమానాల విశేషణోపాదానం వల్ల వ్యతిరేకాలంకారం సిద్ధిస్తుందని అలంకారసర్వస్వకారుడు రుయ్యకుని నిర్వచనం. ఉపమానాని కంటె ఉపమేయానికి ఆధిక్యం సిద్ధించి, భేదప్రధానమైన సామ్యం గమ్యమానం కావటం వ్యతిరేకమని విద్యానాథుడు అన్నాడు. ఈ ఉపమేయానికి న్యూనతను ఆపాదించటం పరిపరి విధాలుగా ఉంటుంది. పైని పద్యంలో ఉపమానానికి విశేషణవిశిష్టమైన ఇతరధర్మి ప్రతిపాదింపబడినప్పుడు వ్యతిరేకానుప్రాణితమైన ఔపమ్యవ్యక్తి ఉన్నది. సామాన్యంగా వ్యతిరేకాలంకారం శ్లేషగర్భితంగానే ఉంటుంది. అయినా శబ్దచిత్రంలోని అలంకర్మీణతకే ప్రాధాన్యవివక్ష.
తెనాలి రామలింగకవి కందర్పకేతు విలాసం రచించిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు అదే కథను తీసికొని పెద్దాపురం సంస్థానంలోని వక్కలంక వీరభద్రకవి వాసవదత్తా పరిణయమును చెప్పాడు. అందులోని కల్పన ఇది:
ఉ. కొప్పు ఘనంబు; చూడ నల క్రొమ్ముడి కన్న సమున్నతప్రభన్
విప్పగుఁ గన్నుదోయి; కచవిభ్రమరోచి కెక్కుడై
యొప్పగుఁ జన్ను లున్నతి; సముజ్జ్వల కైశికదృక్కుచప్రభల్
గప్పుఁ బృథుత్వవైభవముఁ గాంచి కటిస్థలి, లేమ కెన్నఁగన్. – (2-64)
అయితే, తెనాలి రామలింగకవి చిత్రకర్మశిల్పం, సతృణాభ్యవహారత్వం, శబ్దగూఢత్వం, చమత్కృతధోరణి ఆయనకు పట్టుబడలేదు. తెనాలి రామలింగకవి అంతటి విశాలమైన పాండిత్యనైపథ్యం ఉన్నవాడు కాడు. అందువల్ల ఆయన కవిత్వం కథాకథనమాత్రం పర్యవసాయిగా మిగిలిపోయింది. ‘తత్సతి దృక్కుచంబులన్’ అన్న దళాన్ని మాత్రం ఒకపాటి చాయాసంవాదంగా అనుసరణిస్తూ ‘సముజ్జ్వల కైశిక దృక్కుచప్రభల్’ అన్నాడు.
ఇదొక అర్థనిర్ణయం దుష్కరమైన ప్రౌఢపద్యం. అయితే, చమత్కృతిమత్కృతి. ఆ చమత్కారం చిత్తవిస్తార రూపం అని పెద్దలన్నారు. చిత్తానికి విస్తృతిని సాధించిపెట్టే వ్యాసంగం అన్నమాట. అది విస్మయాపర పర్యాయం అని సాహిత్యదర్పణంలో విశ్వనాథు డన్నాడు. ఊర్జస్వలమైన ఆ వచశ్శోభకు పాఠకుడు ఆశ్చర్యచకితు డైనప్పటి ఆ స్థితి కవికీ, సహృదయుడికీ ఇద్దరికీ అభిలషణీయమే. తిక్కన నిర్వచనోత్తర రామాయణంలో వాడిన ‘ఆనంద సాంద్రస్థితి’ కవి-సహృదయు లిద్దరికీ అనుభవనీయమే. అది రసోత్తరం కాదనటం భావనీయం కాదు. కవిత్వమే జీవితంగా వెలసి విలసిల్లిన ఆ మహానుభావుల సరస్వతీతత్త్వం ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క రీతీమహితమై ఎన్ని భంగులలో సాక్షాత్కరించినదో తలచుకొంటే ఎటువంటివారికైనా హృదయోల్లాసంగా ఉంటుంది.
--------------------------------------------------------
రచన: ఏల్చూరి మురళీధరరావు,
ఈమాట అంతర్జాల మాసపత్రిక సౌజన్యంతో
No comments:
Post a Comment