పూతమెఱుంగులుం
సాహితీమిత్రులారా!
భువన విజయ సభలో ఒకమారు కృష్ణదేవరాయలు
కవితాకళగురించి ఆశువుగా చెప్పినవారికి గండపెండెరము
తొడుగుతానని ప్రకటించాడు దానికి ఎవరు స్పందించక
పోవడంతో కృష్ణదేవరాయలు ఈ విధంగా చెప్పాడు-
ముద్దుగ గండపెండెరమున్ గొనుఁడంచు బహూకరింపఁగా
నొద్దిక నాకొసంగుమని యొక్కరు గోరగలేరు లేరకో
దీనికి అల్లసానిపెద్దన లేచి -
పెద్దనబోలు సత్కవులు పృథ్విని లేరని నీవెరుంగవే
పెద్దనకీదలంచినను బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా
అని మిగిలిన పద్యం పూరించి ఈ విధంగా
రాయలువారు అడిగిన విధంగా కవితాకళను గురించి
ఆశువుగా చెప్పిన ఉత్పలమాలిక(29 పాదాలు)
- పూతమెఱుంగులుం బసరుపూపబెడంగులుఁ జూపునట్టి నా
- కైతలు జగ్గునిగ్గునెనగావలెఁ గమ్మునగమ్మనన్వలెన్
- రాతిరియుంబవల్ మఱపురాని హొయల్ చెలియారజంపు ని
- ద్దాతరితీపులంబలెను దారసిలన్వఁలె లోఁదలంచినన్
- బ్రాతిగఁబైకొనన్వలెను బైదలికుత్తుకలోని వల్లటీ
- కూతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
- జేతికొలందిఁ గౌఁగిటను జేర్చిన గన్నియచిన్నిపొన్నిమే
- ల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలె బట్టిచూచినన్
- డాతొడనున్నమన్నులమిటారపు ముద్దుగుమ్మకమ్మనౌ
- వాతెఱ దొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్
- గాతలదమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు
- న్మేతెలియబ్బురంపుజిగినిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం
- బూతల నున్నకాయ సరిపోడిమి కిన్నెరమెట్లబంతి సం
- గాతపు సన్నబంతి బయకారపుఁగన్నడ గౌళవంతుకా
- సాతతతానతానల వసం దివుటాడెడు కోటమీటుబల్
- మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చతెన్గు లీ
- రీతిగ, సంస్కృతంబు పచరించినపట్టున భారతీవధూ
- టీ తపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ
- భౌతికనాటకప్రకరభారతభారతసమ్మతప్రభా
- పాతసుధాప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
- జాతకతాళయుగ్మలయసంగతిచుంచువిపంచికామృదం
- గాతతతేహిత త్తహితహాదితదంధణుదాణుధింధిమి
- వ్రాతలయానుకూలపదవారకహూద్వహహారికింకిణీ
- నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళఝళీమరంద సం
- ఘాతవియద్దునీచకచకద్వికచోత్పలసాసంగ్రహా
- యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై
- చేతము చల్లఁజేయ వలెఁజిల్లునఁజల్లవలె న్మనోహర
- ద్యోతక గోస్తనీఫలమధుద్రవగోఘృతపాయసప్రసా
- రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్
దీనిలో ఉన్న ప్రత్యేకత మొదటంతా అచ్చతెనుగు పదాలతో కూర్చి
చివరికి సంస్కృతపదాలతో కూర్చారు పెద్దనగారు. కావున దీన్నిభాషాచిత్రంగా చెప్పవచ్చు
- పూతమెఱుంగులుం బసరుపూపబెడంగులుఁ జూపునట్టి నా
- కైతలు జగ్గునిగ్గునెనగావలెఁ గమ్మునగమ్మనన్వలెన్
- రాతిరియుంబవల్ మఱపురాని హొయల్ చెలియారజంపు ని
- ద్దాతరితీపులంబలెను దారసిలన్వఁలె లోఁదలంచినన్
- బ్రాతిగఁబైకొనన్వలెను బైదలికుత్తుకలోని వల్లటీ
- కూతలనన్వలెన్ సొగసుకోర్కులు రావలె నాలకించినన్
- జేతికొలందిఁ గౌఁగిటను జేర్చిన గన్నియచిన్నిపొన్నిమే
- ల్మూతల చన్నుదోయివలె ముచ్చటగావలె బట్టిచూచినన్
- డాతొడనున్నమన్నులమిటారపు ముద్దుగుమ్మకమ్మనౌ
- వాతెఱ దొండపండువలె వాచవిగావలెఁ బంటనూదినన్
- గాతలదమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు
- న్మేతెలియబ్బురంపుజిగినిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బపొం
- బూతల నున్నకాయ సరిపోడిమి కిన్నెరమెట్లబంతి సం
- గాతపు సన్నబంతి బయకారపుఁగన్నడ గౌళవంతుకా
- సాతతతానతానల వసం దివుటాడెడు కోటమీటుబల్
- మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చతెన్గు లీ
- రీతిగ, సంస్కృతంబు పచరించినపట్టున
ఇక్కడి (17 పాదాలు)వరకు అచ్చతెనుగు
ఈ దిగువ నుండి సంస్కృతం ( 12 పాదాలు)
- భారతీవధూ
- టీ తపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ
- భౌతికనాటకప్రకరభారతభారతసమ్మతప్రభా
- పాతసుధాప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
- జాతకతాళయుగ్మలయసంగతిచుంచువిపంచికామృదం
- గాతతతేహిత త్తహితహాదితదంధణుదాణుధింధిమి
- వ్రాతలయానుకూలపదవారకహూద్వహహారికింకిణీ
- నూతన ఘల్ఘలాచరణ నూపుర ఝాళఝళీమరంద సం
- ఘాతవియద్దునీచకచకద్వికచోత్పలసాసంగ్రహా
- యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై
- చేతము చల్లఁజేయ వలెఁజిల్లునఁజల్లవలె న్మనోహర
- ద్యోతక గోస్తనీఫలమధుద్రవగోఘృతపాయసప్రసా
- రాతిరసప్రసారరుచిరప్రసరంబుగ సారెసారెకున్
No comments:
Post a Comment