Wednesday, February 21, 2018

ఒకే పద్యంలో రామాయణం


ఒకే పద్యంలో రామాయణం




సాహితీమిత్రులారా!



వెల్లూరు నరసింగకవి కృత,
రాచకన్యాపరిణయం అనే కావ్యంలో
కవి దశావతార స్తుతి సందర్భంలో
చేసిన రామస్తుతి ఈ పద్యం.
ఈ పద్యంలో ప్రధానాంశాలతో
సంగ్రహ రామాయణంలా కూర్చాడు.
దీనిలో ప్రతికాండను గురించి కనబడుతుంది
కాని సుందరకాండను వదలివేశాడు
కారణం అందులో రాముడు చేసినదిగాని
అగుపించడంగాని లేదుకదా అందువల్లట.

గమి యాగాహితులం జయించి, హరకోదండంబు ఖండిం చి, సీ
తమనాసక్తి పరిగ్రహించి, భృగురామాటోపమున్ మాన్పి, శీ
ఘ్రమె సాకేతపుటాస బెంచి, వనులంగష్టించి, సుగ్రీవనా
మము హెచ్చించి, దశాస్యునొంచితివి రామస్వామివై మాధ వా!
                                                                                      (రాచకన్యా పరిణయము - 2- 157)
విశ్వామిత్రుని యాగం రక్షించి, శివధనుర్భంగము,
సీతాపరిగ్రహణము, పరశురామ గర్వభంగము, దశరథుని
రామపట్టాభిషేక ప్రయత్నము, అరణ్యవాసము,
వాలివధ, రావణసంహారము మొదలైన ముఖ్యాంశాలు వర్ణితాలు.
బాల అయోధ్యకాండలు, అరణ్యకిష్కింధకాండలు, యుద్ధకాండలు
ఇందులో కనిపిస్తాయి. సుందరకాండలో రామప్రసక్తి పరోక్షంలో
వుందికాని దాని విషయం ఇందులో ప్రస్తావించలేదు కవి.


No comments: