Thursday, February 15, 2018

దుర్గా శతకం


దుర్గా శతకం




సాహితీమిత్రులారా!



"కపిలవాయి లింగమూర్తి"గారు
చేసిన "దుర్గా శతకం"
చిత్రకవిత్వంలో చెప్పదగినది.
నిజానికి జంట శతకాలు
దుర్గ - భర్గ శతకాలు అని
కూర్చారు. మనం ఇక్కడ కేవలం
దుర్గ శతకాన్నే చెప్పుకుంటున్నాము.
ఒకవైపు దుర్గకు సంబంధించి
మరోవైపు అలంకారాలను వివరించడం
ఇందులోని చిత్రం. సంస్కృతంలో
కూర్తబడిన భట్టీ రావణవధ తదితర
కావ్యాల్లో ప్రధానకథ ఒక అర్థంగాను
మరో అర్థంలో వ్యాకరణం ఉండేవిధంగా
కొన్ని కావ్యాలున్నాయి. వాటికోవలో
ఈ శతకం ఒకవైపు దుర్గగురించి
మరోవైపు ఒక్కొక పద్యం ఒక్కొక అలంకారంగా
కూర్చారు కపిలవాయి లింగమూర్తిగారు.
ఇంకా వివరాల్లోకెళితే
తెలంగాణాలోని ఉమామహేశ్వర క్షేత్రంలోని
ఉమాదేవి త్రిపురసుందరి కనుక
అలంకారశతకంలో ఆమె సౌందర్యలీలలు
వర్ణిస్తూ ఆటవెలది స్త్రీ కావున అవ్నీ
ఆటవెదులుగానే కూర్చారు.
దుర్గ నవదుర్గ కావున నవ సంఖ్య వచ్చే విధంగా
వాటిని కూర్చారు.
ఇందులో వారు 109 పద్యాలను కూర్చారు.
దుర్గ అంగ వర్ణన             - 40 పద్యాలు
అష్టాదశ శక్తిపీఠ వివరం  - 18 పద్యాలు
అవతార కథనం              - 09 పద్యాలు
దుర్గ తత్వము                  - 19 పద్యాలు
అభ్యర్థనము                      - 23 పద్యాలు
                                              --- ------------
మొత్తం -                             109 పద్యాలు
                                              ------------

మొదటి పద్యం - అంగవర్ణనలో చూడండి-

అతసి కుసుమ కాంతి నవరాజితా సుమ 
చ్ఛవిని బొలుచు నీవు శివుని గూడి
గంగతోడనున్న కాళిందివలె నొప్పి
తివి మనోహరముగ నవని దుర్గ

ఇది ఉపమాలంకారంలో ఉన్నది.

అష్టాదశ శక్తిపీఠము వివరము లోని పద్యం -

లంకయందు నీవు శాంకరివనుపేర
వెలసితీవు భక్తసులభ - అయిన
లంక యిమిడినట్టి లవణాబ్దియందు నీ
యశము నిముడ జాలదయ్యె దుర్గ   - (41)

ఇది అధికాలంకారంలో ఉంది

అవతారకథనంలోని పద్యం-

విధిని వేధ వెట్టు మధుకైటభులఁబట్టి
నలిచినావు గుమిలి వలెనె యింక
శంబరాదు లెంత జగతి మహామాయ
వైన నాడు నీకు నవని దుర్గ  -  (59)

ఇది అర్థపత్తి అనే అలంకారంలో ఉంది.

ఈ విధంగా 109వ పద్యం -

సుఖమునిచ్చు సిరులు సుదతి మనోహరి
యరయకాపురంబె యవని స్వర్గ
మైననేమి బ్రతుకు లంగనాపాంగ చం
చలములగు గదమ్మ జగతి దుర్గ - (109)

ఇది విరుద్ధరససమావేశము అనే అలంకారంలో ఉంది.
ఇలాగా 109 పద్యాలు నూటతొమ్మిది అలంకారాల్లో కూర్చిన
ఈ కవిగారు ఎంతైనా అలంకారప్రియులకు అలంకారాలతో
విందు చేయించినారు. చాల చిన్న చిన్న మాటలతో కూర్చిన
ఈయనకు భాషపైనగల పట్టునకు నిదర్శనము.



No comments: