Tuesday, February 20, 2018

చంపక గర్భితోత్పలమాల


చంపక గర్భితోత్పలమాల




సాహితీమిత్రులారా!



"సుగ్రీవపట్టాభిషేకం" - అనే కావ్యం
"అబ్బరాజు హనుమంతరావు"గారు
కూర్చారు. ఇందులోని ద్వితీయాశ్వాసంలోని
120వ పద్యం గర్భకవిత్వం రకానికి చెందినది
"చంపక గర్భితోత్పలమాల" ఇందులో
ఉత్పలమాలలో చంపకమాలను ఇమిడ్చాడు
అబ్బరాజు హనుమంతరావుగారు.

చంపక గర్భితోత్పలమాల -
కుల్కుచుఁవారు తీరమున కుంజనిసార్ద్రపటమ్ములూడ్చి హొం
గొల్కుల పట్టుపుట్టములఁ గొబ్బునఁదాల్చి  సువర్ణభూషలం
దల్కుటొడళ్ళఁ బెట్టినృపపనందనమున్గయిసేసితేనెలే
యొల్కఁగఁ మాటనిచ్చిరి నవోత్పలచంపకమాలలామెకున్

దీనిలో గమనించవలసినదొకటి
ఇది ఉత్పలమాల దీనికి పాదానికి 20 అక్షరాలు
మరి చంపకమాలకు 21 అక్షరాలు పాదానికి
20 అక్షరాల ఉత్పలమాలలో 21 అక్షరాల చంపకమాల
ఎలాసాధ్యం ఇమిడ్చటానికి అంటే ఇందులో
కవి చమత్కరించినది ఒకటే మొదటి గణంలో
గురువు లఘువు లఘువు - భగణం కదా దాన్ని
నాలుగు లఘువులుగా మార్చిన చంపకమాల కనబడుతుంది.
ఇందులో కవి ప్రాసలో
కుల్కుచు అనేదాన్ని కులుకుచు - మొదటిపాదం
గొల్కుల - అనేదాన్ని - గొలుకుల - రెండవపాదం
దల్కు - అనేదాన్ని - దలుకు - మూడవపాదం
యొల్కఁగ - అనేదాన్ని - యొలుకఁగ - నాలుగవపాదం
మార్చిన చంపకమాల అవుతుంది గమనించండి.

కులుకుచుఁవారు తీరమున కుంజనిసార్ద్రపటమ్ములూడ్చి హొం
గొలుకుల పట్టుపుట్టములఁ గొబ్బునఁదాల్చి  సువర్ణభూష లం
దలుకుటొడళ్ళఁ బెట్టినృపపనందనమున్గయిసేసితేనెలే
యొలుకగఁ మాటనిచ్చిరి నవోత్పలచంపకమాలలామెకున్


No comments: