Monday, January 7, 2019

బ్రౌన్‌ని సమగ్రంగా ఎవరూ చూడలేదు: పరుచూరి శ్రీనివాస్‌తో ఆకాశవాణి ముఖాముఖీ


బ్రౌన్‌ని సమగ్రంగా ఎవరూ చూడలేదు: 
పరుచూరి శ్రీనివాస్‌తో ఆకాశవాణి ముఖాముఖీ
సాహితీమిత్రులారా!

[పరుచూరి శ్రీనివాస్‌ మద్రాసులో చదివి పశ్చిమ జర్మనీలో ఆ భాషలోనే ప్లాస్టిక్స్ ఇంజనీరింగు డిగ్రీ పుచ్చుకొని కార్ల పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ తెలుగు భాష, చరిత్ర, పద్యనాటకం, తెలుగు పాటలపై లోతైన పరిశోధనా దృష్టిని పెంచుకొన్నారు. బ్రౌన్‌ జీవితం నుండి తెలుగు ప్రచురణల చరిత్ర వరకు అనేక విషయాలు ముచ్చటించారు. జనవరి 16, 2013న ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం చేయబడ్డ ఈ కార్యక్రమం నుంచి కొన్ని భాగాలు.]

మనం మన చరిత్రను పరిశోధించే పద్ధతులకు విదేశాలలో చరిత్రను అధ్యయనం చేసే పద్ధతులకు ఏమైనా తేడాలున్నాయా?

తేడా మన దేశానికి, విదేశాలకి అని కాదు. తేడా ఆధునిక కాలానికి, అంతకు ముందు కాలానికి. అంటే కొత్త పద్ధతులకి పాత పద్ధతులకీ మధ్య తేడాలున్నాయి. మరీ ముఖ్యంగా గత 20 సంవత్సరాల్లో చరిత్ర పరిశోధనలో వైధానికంగా పెద్ద మార్పులే సంభవించాయి. నాకు తెలిసినంతలో ముఖ్యంగా తెలుగుదేశంలో ఈ రకమైన కొత్త పద్ధతులు ఎవరూ అనుసరిస్తున్నట్లుగా కనిపించలేదు. ఇక్కడ ఇప్పటికీ ఏదో లిపిని చూడటం, శాసనాలు చదవటం లేకపోతే రాత ప్రతుల వంటి ‘ఆధారాలను’ మాత్రమే పరిగణన లోకి తీసుకుంటున్నారు. వీటినే నమ్మకమైన, ‘గట్టి’ ఆధారాలు అని అనుకుంటున్నారు — ప్రాచీన వస్తువులు, శాసనాలు, కావ్యాలు, పుస్తకాలు చరిత్ర అధ్యయనానికి పనికి వస్తాయి, అన్నట్లుగా. వీటినే ఆధారాలుగా చూసే పద్ధతి ఆధునిక చరిత్రకారుల్లో ఇప్పుడు అమల్లో లేదు. ఆధునిక చరిత్రకారులు వేరుగా చూస్తున్నారు. ఇప్పటి చరిత్ర రచనలో సాహిత్యం, సామాజిక శాస్త్రం, మానవ పరిణామ శాస్త్రం, సాహిత్యం – ఇలా వేరు వేరు రంగాల నుండి కూడా సమాచారాన్ని సేకరించి, వాటిని అన్వయించే పద్ధతిలో చాలా మార్పులు వచ్చాయి.

సంఘటిత చరిత్ర (కంబైండ్‌ హిస్టరీ), కనెక్టెడ్ హిస్టరీ, ఇంటిగ్రేటెడ్‌ ‌హిస్టరీ — ఈ మూడూ తరచుగా వినపడే పదాలు. వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్మన్, సంజయ్ సుబ్రహ్మణ్యం రాసిన టెక్స్‌చర్స్ ఆఫ్ టైమ్ ఈ ఆధునిక చరిత్ర రచనా పద్ధతులకి ఒక మంచి ఉదాహరణ. అలాగే చరిత్రాధ్యయనంలో కూడా మైక్రో, మాక్రో హిస్టరీ అని రెండు విభాగాలున్నాయి. తెలుగులో మైక్రో హిస్టరీ మీద ఎవరూ పనిచేస్తున్నట్లు లేదు. ఒడ్డెగిత్తని మొకద్దమా (2006) అనే పేరుతో లంక వెంకటరమణగారు రాసిన మంచి పుస్తకాన్ని గురించి ఎవరూ చర్చించలేదు.

మాటవరసకి మన కొండవీటి రాజుల చరిత్ర రాయాలనుకోండి, ఇపుడు ఎటువంటి పద్ధతులు అనుసరించాలంటారు?

రాజకీయంగా ఇప్పుడు దేశాలుగా యేర్పడిన ప్రాంతాలను మాత్రమే పరిగణించకుండా పాత శతాబ్దాలలో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి దగ్గరితనం వల్ల ఏర్పడిన చరిత్ర రాయడం ఇప్పటి పద్ధతి. ఈ ఊహలు చరిత్ర రచనలో కొత్త మార్గాలకి దారి తీశాయి. ఇప్పుడు ఒక దేశంలో ఉన్న ప్రజలు కొన్ని వేల సంవత్సరాలుగా ఇప్పటిలాగే కలిసి ఉన్నారని ఇప్పటి రాజకీయ కారణాలే వాళ్ళని వెనకటి కాలంలో కూడా ప్రేరేపించాయని నమ్మే అలవాటు మనకింకా పోలేదు. ఉదాహరణకు కృష్ణదేవరాయలు ఇప్పుడు తెలుగువాళ్లకి అవసరం కాబట్టి ఆయన పరిపాలించిన ప్రాంతమంతా తెలుగు రాజ్యంగా, హిందూ రాజ్యంగా గొప్పగా వర్ణించడం మనం ఇప్పటికీ మానుకోలేదు. అలాగే ఇంగ్లీషువాళ్ళు వచ్చి చరిత్రలేని మన దేశానికి చరిత్ర రచనా పద్ధతులు నేర్పారని అనే నమ్మకంతో ఆ పాత పద్ధతుల్లోనే చరిత్ర రాయడం మనం ఇప్పటికీ మానలేదు. మనం ఆ అలవాట్లు పోగొట్టుకోవాలి.

కానీ, ఇప్పటికీ ప్రామాణికంగా చెప్పుకోదగ్గ పుస్తకం మల్లంపల్లి సోమశేఖరశర్మ గారు రాసిన హిస్టరీ ఆఫ్‌ రెడ్డి కింగ్‌డమ్స్‌. అదే తెలుగులో కూడా ఈ మధ్యకాలంలో అనువాదమయింది. ఈ పుస్తకాన్ని ఆయన కూడా ఇందాక చెప్పినటువంటి గట్టి ఆధారాలతో రాశారు. తేదీలు, కర్తృత్వాలు, రాజుల పరిపాలనా కాలాలు గట్టి ఆధారాలతో నిర్ణయిస్తే తప్ప మనకి చరిత్ర లేదని పైగా అదే చరిత్రని మనం ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వచ్చామో ఆ దెబ్బతో ఒక్కసారిగా తెలుగు సాహిత్యవేత్తలంతా చరిత్రకారులయిపోయారు. పేర్లు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి తెలుగుదేశంలో ఇదొక వింతయిన పరిస్థితి. నాకు తెలిసినంతలో రెడ్డి రాజుల మీద ఇంతకు ముందు మనం అనుకున్న కొత్త పద్ధతుల్లో పనిచేసిన వాళ్ళు ఎవరూ లేరు.

ఉదాహరణకు హెర్మాన్ కుల్కె (Hermann Kulke) చిన్న రాజ్యాల (Little kingdoms) మీద ఆసక్తికరమైన మార్గంలో చరిత్ర రాశాడు. ఇంకొక సంగతేమిటంటే ఈమధ్యనే వెల్చేరు నారాయణరావు, డేవిడ్‌ షూల్‌మన్‌ కలిసి శ్రీనాథ – ద పొయెట్ హు మేడ్ గాడ్స్ అండ్ కింగ్స్ (2012) అని శ్రీనాథుడి మీద ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో రెడ్డి రాజుల చరిత్రని వేరే పద్ధతిలో చూడటానికి ప్రయత్నం చేశారు.

నిజానికి మనం మన వలసవాద ప్రభావంతో చరిత్రని చూడటం మానలేదంటారా?

మానలేదనే నేననుకుంటున్నాను. ఉదాహరణకి 20, 30 ఏళ్ళ క్రితం రణజిత్‌ గుహ, అతని శిష్యులు చరిత్రంటే రాజ్యాల చరిత్రే కాదు. చరిత్రంటే కింది స్థాయిలో వుండే మామూలు మనుష్యుల చరిత్ర అనే కొత్త ఆలోచనతో సబ్ఆల్టర్న్ హిస్టరీ రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు బలహీనపడినా ఆ ధోరణి బాగా సంచలనాన్ని సృష్టించింది. అయినా దాని ప్రభావం కూడా తెలుగుదేశంలో చరిత్రకారుల మీద కనిపించడం లేదు.

ఎంతో మంది తెలుగుకి బ్రౌన్‌ చేసిన సేవ గురించి చెప్తూ ఉంటారు. దానిమీద మీ అభిప్రాయం ఏమిటి?

బ్రౌన్‌తో చాలా సమస్యలు ఉన్నాయండీ. మనకి పొగడ్తలు, వ్యక్తి గౌరవాలే ప్రధానమయి సవిమర్శకంగా ఎవరి పనినీ అంచనా వేసే అలవాటు ఇప్పటికీ ఏర్పడలేదు. క్లుప్తంగా చెప్పాలంటే, అతన్ని ఇప్పటికి సవిమర్శకంగా ఎవరూ చూడలేదు. అతనికి తెలుగు గొప్పగా వచ్చని, అతను ఇంద్రుడని చంద్రుడని పొగుడుతాం. ఆరుద్ర ఐతే ఆయన అంత్యప్రాసల సరదాతో ‘బ్రౌన్ సాహిత్య క్రౌన్‌’ అన్నారు.

అతని జీవిత చరిత్రని, అతను చేసిన పనినీ విడివిడి భాగాలుగా చూడాల్సి ఉంది. అతను భారతదేశం వచ్చిన కొత్తలో ప్రాంతీయ భాషలకి తెల్లవాళ్ళ పరిపాలనలో ప్రాముఖ్యం ఉండేది. అందువల్ల తెల్లవాళ్ళకు తెలుగు నేర్పడానికి ఉపయోగపడే వ్యాకరణాలు, నిఘంటువులు, రీడర్లు తయారయ్యాయి. అవి రాసినవాళ్ళకి ఈస్టిండియా కంపెనీ వారు బాగా డబ్బు కూడా ఇచ్చేవారు. అందుకని చాలా మంది తెల్లవాళ్ళు ఒకరితో ఒకరు పోటీపడి ఇలాంటి పుస్తకాలు రాశారు. ఎ.డి.కాంప్‌బెల్‌, విలియమ్‌ బ్రౌన్‌, జె.సి. మోరిస్‌, వాళ్ళతో పాటుగా బ్రౌన్. వీళ్ళందరు వ్యాకరణాలు, నిఘంటువులు రాసి, సంకలించి తెల్ల వాళ్ళ స్కూళ్ళలో అవే పాఠ్య గ్రంథాలుగా నిర్ణయింప చేసుకోవటానికి ప్రయత్నం చేశారు. ఈ కాలంలో బ్రౌన్ తెలుగు మీద చేసిన కృషి ఇందులో భాగంగా చూడాలి.

బ్రౌన్‌ జీవితంలో రెండో దశ, అంటే అతను కొంత కాలం ఉద్యోగం పోయి 3 సంవత్సరాల పాటు ఇంగ్లండ్‌ వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత. అప్పటికి తెల్లవాళ్ళకి తెలుగు మీద ఆసక్తి పోయింది. మెకాలే మినిట్ అమలులోకి వచ్చేసింది. అప్పటికి సంస్కృతంలో పని చేసి తెల్లవాళ్ళలో పేరు తెచ్చుకున్న వారు విలియమ్‌ జోన్స్‌, హెచ్‌.టి. కాల్‌రిడ్జ్‌, లాంటి వాళ్ళు. ఈ కాలంలో బ్రౌన్‌కి తెలుగు పండితుడిగా గుర్తింపు పొందాలనే కోరిక బలపడింది. ఈ దృష్టిలో అతని పనిని పరిశోధించాలి. ఈ సందర్భంలో అతనికీ దేశంలో ఉన్న తెలుగు పండితులకీ వున్న సంబంధం ఎటువంటిది, వాళ్ళని ఆయన ఎలా చూశాడు, వాళ్ళు ఆయనని ఎలా చూశారు అన్న సంగతిని మనం పరిశీలించాలి. ఇంకా వివరంగా చెప్పాలంటే అతను తన దగ్గిర పని చేసే పండితుల చేత అనుసరింపచేసిన పాశ్చాత్య గ్రంథ పరిష్కరణ విధానాలు తెలుగు పుస్తక సంప్రదాయానికి ఎంత వరకు మేలు కలిగించాయి, ఎంత వరకు నష్టం కలిగించాయి అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ముఖ్యంగా చెప్పదలచుకున్నదేమంటే బ్రౌన్‌ని పొగడటం తగ్గించి ఆయన పనిని సవిమర్శకంగా చూడటం అలవాటు చేసుకోవాలి.

నాకు తెలియక అడుగుతాను. బ్రౌన్ అనుసరించిన పరిష్కరణ విధానాల వల్ల మనకి వచ్చిన నష్టం ఏమిటి? అలాంటి సాంప్రదాయాన్ని అనుసరించటం వల్ల ఎవరు నష్టపోయారు? మన విధానాలు ఏమైనా నష్టపోయాయా?

ఈ ప్రశ్నకి క్లుప్తంగా సమాధానం చెప్పలేను. కాని ఒక్క మాట సూచిస్తాను. ఆయన పద్ధతి వలన ఇంతకు ముందు లేనటువంటి ఒక రకమైన కృత్రిమమైన తెలుగు గ్రంథం ఒకటి పుట్టుకొచ్చింది. ఇంతకు ముందు విద్యంతా గురుముఖతః నేర్చుకున్నదే. రాత ఎప్పుడూ ఉంది. రాత పుస్తకం ఒకటి ఉంటుంది. కాని రాత పుస్తకం ముందు పెట్టుకుని అందులో ప్రతి పద్యం నెమ్మదిగా చదువుతూ మన పూర్వీకులు ఎవరూ గ్రంథం నేర్చుకోలేదు. మీరు రామాయణం, భారతం లేకపోతే తర్కం, మీమాంస ఏది చదివినా సరే – కావ్యం కావచ్చు, శాస్త్ర గ్రంథం కావచ్చు – అన్నిటినీ గురుముఖతః నేర్చుకున్నారు. పుస్తకం అనేది ఒకటి ఉంటుంది. అంత వరకే, కానీ ఆ పూర్తి పుస్తకంతో మీకు ఎప్పుడూ పని ఉండదు. మన దేశీయ గ్రంథ సంప్రదాయం వేరు. ఇక్కడ చదివే విధానాలు వేరు. ప్రతి పుస్తకానికి ఒక అధ్యయన సమాజం ఉంటుంది. కొన్ని పుస్తకాలు కొన్ని సమాజాల్లోనే చదవబడతాయి. ఇలాంటి ఈ సాంఘిక పరమైన సమాచారమంతా అతనికి తెలిసి ఉంటే అతను పుస్తక పరిష్కరణ వేరేగా చేసి ఉండేవాడు. అతను తయారు చేసిన క్రిటికల్‌ ఎడిషన్‌ అనేది మనకి నప్పని పద్ధతి. అన్ని పుస్తకాల ప్రతుల్ని కలిపేసి ఒక కలగాపులగపు ప్రతిని శుద్ధప్రతి అనడం వల్ల ఆ పుస్తకానికి అన్ని ప్రతులు ఎలా వచ్చాయి, ఎందుకొచ్చాయి, వాటి పుట్టు పూర్వోత్తరాలేమిటి అనే సంగతి ఆలోచనకు రాకుండా పోయింది.

బ్రౌన్‌ బొమ్మ గురించి అనేకమంది అనేకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అసలు ఎక్కడైనా వెదికారా? దొరికిందా? దొరకలేదా? దొరకదా?

అసలు ముందుగా, ఒక వ్యక్తి ఆరాధన మనలో ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి చూస్తే కొంచెం దిగులు కూడా వేస్తుంది. బ్రౌన్‌ బొమ్మ నాకు తెలిసినంతలో ఎక్కడా లేదు. అంటే అతని ఫొటో. బంగోరే బ్రతికున్న రోజుల్లో చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆరుద్ర 1980, 81 ప్రాంతంలో లండన్‌ వెళ్ళినప్పుడు వెతికారు. వాళ్ళ నమ్మకం ఏమిటంటే బ్రౌన్‌ చనిపోయే కాలం నాటికి, 1883-84, నాటికే ఫొటోగ్రఫీ వచ్చింది కాబట్టి ఎక్కడో ఒక ఫొటో ఉండి ఉండవచ్చు అని.

సరే, ఒక మనిషి ఫొటో ముఖ్యమా అన్నది ప్రక్కన పెడితే ఈ రోజున మనం చూస్తున్నది ఊహా చిత్రం. బ్రౌన్‌ తండ్రి బొమ్మ తైలవర్ణ చిత్రం కలకత్తా సీరాంపూర్‌ మిషనరీలో ఉంది. అది 1979లో భారతిలో ప్రచురితమయ్యింది. ఆ బొమ్మని ముందు పెట్టుకుని మైనేని వెంకటరత్నం అలాంటి పోలికలతో ఇంకొక బొమ్మ గీశారు. అది మిసిమి పత్రికలో 1997 చివరలో అనుకుంటాను ముఖచిత్రంగా ముద్రితమయ్యింది. దాన్ని ఈ రోజు బ్రౌన్‌ బొమ్మగా అందరూ తల మీద పెట్టుకొని తిరుగుతున్నారు.

సంస్కృత అధ్యయనం పట్ల జర్మనీదేశం, యూరప్‌లో అనేక ప్రాంతాలు ఎంతో ఆసక్తిగా గతంలో ఉండేవి కదా. ఇప్పుడు ఇంకా ఆ పరిస్థితి ఉందా?

రెండవ ప్రపంచ యుద్ధానికి ముందున్నంత తీవ్రంగా లేదు. దీనికి చాలా కారణాలున్నాయి. హెర్డర్‌ (Johann Herder), గోయతెల (Johann Goethe) కాలంలో – దీన్ని రొమాంటిక్ పీరియడ్ అంటారు – విలియమ్‌ జోన్స్‌ శాకుంతలం అనువాదం చదివి తూర్పు దేశాల్లోనే గొప్ప సంస్కృతి ఉందని ఒక అమాయకమైన ప్రేమతో ఇండియాని బాగా తలకెత్తుకుని విపరీతంగా చదివారు. ఆ భాగంలోనే ఇండాలజీ అని ఒక అధ్యయనశాఖ మొదలయ్యింది. ఇది సుమారు ఒక వందేళ్ళపాటు చాలా బలంగా సాగింది. రెండో ప్రపంచయుద్ధం తరువాత రాజకీయ ఆర్థిక సమీకరణాలు మారిపోవటం వల్ల ఇండాలజీకి క్రమంగా విశ్వవిద్యాలయాల్లో ప్రాముఖ్యం తగ్గుతూ వస్తోంది. గత 20 ఏళ్ళలోనే జర్మనీలో చాలా విశ్వవిద్యాలయాలలో ఇండాలజీ విభాగాలు మూతపడ్డాయి. ఇది కూడా ఒకరకమైన ట్రెండ్ అనుకుంటాను. ఒకప్పుడు ఇండియాను ఎలా ఒకరకమైన ప్రేమతో చూశారో ఈ రోజు టిబెట్‌ను అలా చూస్తున్నారు. ఇప్పుడు విపరీతంగా టిబెటాలజీ విభాగాలు పుట్టుకొస్తున్నాయి.

గణిత శాస్త్రంలో, ఖగోళశాస్త్రంలో వున్న సంస్కృత గ్రంథాలను చాలా లోతుగా చూస్తూ ఉంటామని జర్మన్‌లో కొందరు విద్వాంసులంటారు.

ఆ మాట నిజమే కానీ (ఫ్రాన్స్, అమెరికాల్లో సంఖ్యాపరంగా ఇంకా ఎక్కువ మంది పనిచేస్తున్నారు) ఇక్కడ కూడా వింతైన పరిస్థితి ఉంది. ఈ రోజు భారతదేశంలో ఉండి ఇలాంటి గణిత, ఖగోళ శాస్త్రాలని (హిస్టరీ ఆఫ్‌ సైన్స్) చూసే వాళ్ళు అతి కొద్దిమంది. వాళ్ళలో తెలుగు పేర్లయితే దాదాపుగా కనపడవు. నిజానికి ఇలాంటి శాస్త్రాల మీద పరిశోధన చేసే ఒకే ఒక్క తెలుగు వ్యక్తి శ్రీరాముల రాజేశ్వర శర్మగారు. ఆయన 50 ఏళ్ళ క్రితం మార్‌బుర్గ్ లో పిహెచ్‌.డి చేశారు. తరువాత 30 ఏళ్ళపాటు అలీగడ్‌ ముస్లిం యూనివర్శిటీలో సంస్కృతం, ఇండాలజీలు చెప్పి రిటైరయిన తరువాత కూడా ఇప్పటికీ ఇంకా చాలా చురుకుగా ఇలాంటి విషయాలమీద పరిశోధనలు చేస్తున్నారు.

సరే, సాహిత్య చరిత్ర గురించి ఆలోచించే మీకు సినిమా పాటల చరిత్ర మీద ఎలా ఆసక్తి కలిగింది? మన సినిమా పాటలకే కాదు మన తెలుగు పాటలకే సరియైన చరిత్ర లేదు. సమగ్రంగా కాదు కదా, అంశం మాత్రంగానైనా రాలేదంటారు?

ఈ సినిమాల యుగంలో పుట్టిన వాడిని కాబట్టి పాటలతోనే పెరిగాను. అదే ఒక రకమైన సాహిత్యం, అదే ఒకరకమైన వినోదం, అన్నట్లుగా పెరిగిన తరం వాడిని. కాబట్టి పాటలంటే చిన్నప్పటి నుంచి బాగా ఆసక్తి ఉండేది. బయటకు వెళ్ళిన తరువాత వీటిని కూడా శాస్త్రపరంగా చూడవచ్చు అని కొంత తెలుసుకున్న తర్వాత పాట చరిత్ర గురించి చదువుదామంటే సమగ్రమైన చరిత్ర లేదు అని అర్థమయ్యింది. ఇప్పటికీ తెలుగు పాట పుట్టుక గురించి, సినిమా పాట అనటం లేదు, అసలు ఆధునికమైన పాట ఎలా పుట్టిందో వివరించే ఒక సమగ్ర గ్రంథం రాలేదనే నేననుకుంటున్నాను.

పార్శీ నాటకాల ప్రభావంలోంచి పాట పుట్టి ఉండడానికి అవకాశం ఉందా?

తప్పకుండా ఉంది. 1860 నుండి 80 వరకు గల మధ్య కాలంలో పార్శీ నాటక సమాజాలు, ధార్వాడ, పూనాల నుండి మరాఠీ నాటక సమాజాలు నాటి కన్నడ, తెలుగు దేశాల్లో విస్తృతంగా పర్యటించాయి. జనాలు విపరీతంగా బళ్లు కట్టుకుని వెళ్ళి మరీ ఆ నాటకాలను చూశారు — ఇలాంటి మాటలు అందరూ చెపుతారు. కానీ ఈ నాటక సమాజాల ద్వారా సమాజంలో ఎలాంటి మార్పులు సంభవించాయి. అంతకు ముందు వినోదం కోసం ఏం చూసేవాళ్ళు, వీధి నాటకాలే చూసేవాళ్ళా? హరికథలు, బుర్ర కథలు చూసేవాళ్ళా? లేదంటే ఇలాంటి నాటక సాంప్రదాయం ఒకటి మనకు కూడా ఉందా? ఇది కచ్చితంగా ఎవరూ చెప్పలేక పోతున్నారు. 1860ల్లో కోరాడ రామచంద్ర శాస్త్రి మొదటి నాటకం రాశారు ఇలాంటి మాటలు చెప్పారే కాని అసలు ఈ మార్పు అనేది ఎలా సంభవించింది అని ఎవరూ చెప్పలేదు. దీని గురించి కూడా సరైన వివరాలు కూడా తెలియవు.

అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాట, ఈరోజు మనం పాట అని దేనిని అంటున్నామో అది, ఎలా పుట్టింది? ఉదాహరణకి కోలాచలం శ్రీనివాసరావు, ధర్మవరం కృష్ణమాచార్యులు బళ్ళారిలో ఉంటూ విస్తృతంగా నాటకాలు రాశారు. వీళ్ళ గురించి చాలా వివరంగా చరిత్రలు వచ్చాయి కానీ వీళ్ళు రాసిన నాటకాల పుస్తకాలు దగ్గర పెట్టుకుని చూస్తే, ప్రతి నాటకం చివర ప్రతి పాటకి సంబంధించి స్వరాలు ఇవ్వడం లేకపోతే రాగం పేరు చెప్పటం, పాశ్చాత్య ముసుగులో వుంటే బాండ్‌ మ్యూజిక్‌ అనే వాటికి స్వరలిపి ఇవ్వటం ఇలాంటివన్నీ 19వ శతాబ్దపు చివరి నాటికే కనపడతాయి. వీటిని కూడా కొంచెం లోతుగా చూడాల్సిన అవసరం ఉంది. ఇవి చూస్తే ఒక పాటకి వరుస కూడా ఎలా కట్టారు – ఇలాంటి విషయాలు అర్థమవుతాయి. అలాగే ఈరోజు మనం ‘సంప్రదాయ, జానపద’ పాటలు అనేవి కూడా సుమారుగా ఈకాలంలో పుట్టినవే. ఉదాహరణకు ‘రంగం’ (రంగూన్) పాటలు, వల్లూరి జగన్నాథరావు పాటలు.

వేదిక పైన శ్రోతల ముందు తెలుగు పద్యం అంతవరకు అంతకు ముందు పాడబడుతూనో వచనంగానో చెప్పబడుతూ ఉన్నది. చటుక్కున పాటలోకి ఎలా వచ్చింది? తెలుగు పాటతో సంబంధం లేకుండా పద్యం కూడా ఏదో రకంగా పాడబడుతూనో ఉచ్చరింప బడుతూనో ఉండాలి కదా?

ఇక్కడ రెండు వేరు వేరు విషయాలను ఈ రోజు కలిపేస్తున్నాం. ఒకటేమో ఇప్పుడు మనం నాటకాల్లోను సినిమాల్లోను విని చూసే ఈ పద్యపఠనం. ఈ పద్యం పాడటమనే దానిని కర్ణాటక దేశం నుండి తెచ్చుకున్నామని నాటక చరిత్ర పుస్తకాల్లో చెపుతారు. ఒకటి, రంగస్థలం మీద పుట్టిన పద్య పఠనం — మామూలు మనుషుల్ని రంజింప చేయటానికి రాగయుక్తంగా సాగదీసి పాడటం. రెండోది పండితులు పద్యాన్ని చదివే విధానం. విశ్వనాథ సత్యనారాయణ, మధునాపంతుల, ఇంకా చెళ్ళపిళ్ళ లాంటివారు పద్యం చదివే విధానం. కాని ఈ రోజు ఒక కవులు, పండితులు ఏ పద్యం చదివినా కూడా ఏదో ఘంటసాల పద్యం పాడినట్లుగా తెలుగు కావ్యంలో పద్యం పాడాలని ఊహించుకుంటున్నారు.

అయితే మనం ఏ రకమైనటువంటి మూలాల దగ్గరకు వెళ్ళాలి? పార్శీ వాళ్ళ మెట్లు ఇవి, తరువాత కపిలవాయి ఇలా పాడేవాడు అని ఏమైనా విడదీయగలమా?

కొంత వరకు చెయ్యగలం. ఇప్పుడు ప్రముఖ నాటక కళాకారుల గొంతులన్నీ గ్రామఫోన్‌ డిస్క్‌ల మీద దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళ బాణీల గురించి వివరంగానే తెలుసు మనకి. ఈలపాట రఘురామయ్య, జొన్నవిత్తుల శేషగిరిరావు లాంటి వారిపై ముఖ్యంగా మరాఠీ ప్రభావం కనపడుతుంది. వీళ్ళు పద్యం చదువుతుంటే హిందూస్థానీ రాగాల్లో మరాఠీ నాటక సంగీత ప్రభావం స్పష్టంగా కనపడుతుంది. వీటికి వ్యతిరేకంగా అద్దంకి శ్రీరామ్మూర్తి, సూరిబాబు లాంటి వాళ్ళు కర్ణాటక రాగాల్లో పాడారు. అలాగే తొలినాటి నాటక సమాజాల్లో పద్యాలకు, పాటలకు మెట్లు కట్టిన పాపట్ల కాంతయ్య లాంటి వారిని పరిశీలనగా చూడవలసి వుంది. ఉదాహరణకు కాంతయ్య గురించి మనకు తెలిసినది చాలా తక్కువ. భారతీయ భాషల్లో రేడియో ప్రసారాలు ప్రారంభం కాకమునుపు పాశ్చాత్య సంగీతాన్నే వినిపించేవారని మనకు తెలుసు. ఎలాంటి సంగీతం ప్రసారితమయ్యిందో తెలియదు. కానీ నేను చెప్పేదేమిటంటే నాటక ప్రదర్శనలో పద్యం పాడే పద్ధతి – ఒక పండితుడు వసుచరిత్రో, మనుచరిత్రో, లేకపోతే రామాయణమో, భాగవతమో చదువుకునే సమయంలో పద్యం చదివే విధానం — ఈ రెంటికీ పొంతన లేదనుకుంటున్నాను.

పార్శీ నాటక పద్ధతుల్లోను మరాఠీ నాటక రంగంలోను వాళ్ళ పద్యం గురించో పాట గురించో, వీటి చరిత్ర గురించో సమగ్రంగా అక్కడైనా అధ్యయనం చేశారా?

సమగ్రంగా వచ్చిందో లేదో నేను చెప్పలేను కానీ విశ్వవిద్యాలయాల్లో దాని గురించి అధ్యయనం జరిగింది. చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. పార్శీ నాటకం మీద టెక్సస్‌ విశ్వవిద్యాలయం- ఆస్టిన్‌లో పనిచేసే కాథరిన్‌ హేన్సన్‌ (Kathryn Hansen), చాలా మంచి పుస్తకాలు రాశారు. ఇప్పటికీ పార్శీ నాటకం మీద ఆవిడ చాలా లోతుగా పరిశోధనలు చేస్తున్నారు. అలానే మరాఠీ నాటక సంప్రదాయం గురించి ముఖ్యంగా 1890 నుండి 1930 మధ్య కాలంలో ప్రముఖులైన బాలగంధర్వ, ఆ తరువాత మాస్టర్‌ కృష్ణారావ్‌, గోవిందరావు తాంబే, నారాయణరావు వ్యాస్ మొదలైన వారి గురించి కూడా చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. ఈమధ్య కాలంలో శాంతా గోఖలే అని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రామాలో పని చేస్తారు. ఆవిడ ప్లేరైట్ ఎట్ ది సెంటర్ (2000) అని మంచి పుస్తకం ఒకటి రాశారు. ఇలాంటివి శాస్త్రీయంగా ఉన్నాయి. మనకి తెలుగులో వచ్చే పుస్తకాలలో సైద్ధాంతిక ప్రమాణాలు (ఎకడమిక్‌ స్టాండర్డ్స్‌) లోపిస్తున్నాయనేది నా ఫిర్యాదు. అంటే కథా వివరణగానే వస్తున్నాయి. మామూలు కబుర్లు చెప్పినట్లుగా చెపుతారు చరిత్రను కూడా! కాని ఇది కూడా ఒక సైద్ధాంతిక రూపంలో శాస్త్రీయంగా చూడవచ్చు. వీటికి కూడా విశ్వవిద్యాలయాల్లో గౌరవం ఉంది అని సరిగా గుర్తించి ఒక పద్ధతిలో పరిశోధిస్తే పరిస్థితులు మెరుగు పడతాయి అని అనుకుంటున్నాను. ఉదాహరణికి మనం స్థానం నరసింహరావు గురించి చెప్పుకోదగ్గ పనేమీ చేయలేదు.

అలాగే ప్రచురణ కర్తల చరిత్ర విషయాలలోనూ ఈ రకమైనటువంటి పరిస్థితే ఉన్నదేమో?

ఈ రోజుకి కూడా మనకి తెలుగులో అచ్చు చరిత్ర గురించి వివరాలు పెద్దగా తెలియవు. మనకున్న ఒకే ఒక్క మంచి పుస్తకం నా దృష్టిలో జోలిపాళయం మంగమ్మ గారు రాసిన హిస్టరీ ఆఫ్‌ ప్రింటింగ్‌ ఇన్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్‌ టు తెలుగు. దానిలో కూడా ఆవిడ కేవలం తొలినాడులో వచ్చిన పుస్తకాలు, వాటి పేర్లు తరువాత కొద్దిగా ఈ మిషనరీ ప్రెస్‌ల గురించే చెపుతారు. కానీ ఇక్కడ కూడా చూడవలసిన చరిత్ర బోలెడుంది. మొదటి అచ్చుయంత్రం ఎప్పుడు వచ్చింది. లేకపోతే తెలుగులో మొట్టమొదటి పుస్తకం ఎప్పుడు అచ్చయింది అన్నది ముఖ్యం కాదు నాకు. అసలు ఎవరు ప్రెస్‌లు పెట్టారు? ఎలాంటి పుస్తకాలు వేశారు? ఎలా వేశారు అసలు వీళ్ళు ఈ మూలగ్రంథాల్ని, వ్రాతప్రతులని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు – ఇలాంటి ప్రశ్నలకి జవాబులు ఈ రోజుకీ లేవు.

కొద్దో గొప్పో చెపితే ఎంత సేపటికీ వావిళ్ళ, వేదం వారి ప్రెస్సులు అంటే పూదూరి ద్రావిడులు నడిపిన ప్రెస్సులు గురించే మాట్లాడుతారు. కాకుండా ఎన్‌.వి.గోపాల్‌ & కో, లేకపోతే అద్దేపల్లి వీరవెంకయ్య, కొండపల్లి వీరాస్వామి, కర్నూలులో బాల సరస్వతి బుక్‌డిపో, వీళ్ళు చేసిన పుస్తక ప్రచురణ పూర్తిగా భిన్నమైంది. ఉదాహరణకి వావిళ్ళ వాళ్ళు ‘గౌరవనీయమైన కావ్యాలు’, శాస్త్ర సంబంధమైన పుస్తకాలు ప్రచురిస్తే, వీళ్ళు మామూలు మనుషులు చదువుకునే కాశీమజిలీ కథలు లాంటి అణా బేడాలకి ఒకప్పుడు రోడ్లు పక్కన అమ్మిన పుస్తకాలు ప్రచురించారు. ఎప్పుడూ ఏ కాలంలో అయినా బాగా అమ్ముడు పోయినది ఈ పుస్తకాలే! తెలుగు దేశంలోనే కాదు తక్కిన ప్రాంతాల్లో కూడా బాగా అమ్ముడుపోయిన పుస్తకాలెపుడూ ఇలాంటివే. వీటి గురించి భారతీయ పుస్తక ప్రచురణ చరిత్రలో భాగంగా చాలా మంచి పరిశోధనలు వెలువడ్డాయి. తెలుగులో మాత్రం వీటి మీద ఎవ్వరూ ఇంతవరకు పనిచేయలేదు.

వావిళ్ళ వాళ్లు లాభాపేక్షతో కాకుండా భాషాసేవ దృష్టితో ప్రామాణికమైన పుస్తకాలు వేశారు, కొండపల్లి వీరవెంకయ్య లాంటి వాళ్లు లాభాల కోసం చౌకబారు పుస్తకాలు వేశారు, అనవచ్చా?

అందరూ కేవలం వ్యాపారం కోసమే చేశారు. ఇక్కడ ఎలాంటి సైద్ధాంతికపరమైన ఆదర్శాలు అంటకట్టక్కర్లేదు. ఎవరైనా డబ్బు చేసుకోవాలనే ఏదైనా పరిశ్రమ పెట్టినా, ఖరీదైన ప్రెస్సు పెట్టినా. వావిళ్ళ వాళ్ళు కూడా వ్యాపారం కోసమే చేశారు. వావిళ్ళ వాళ్ళు ఒకలాంటి పుస్తకాలు వేస్తే అద్దేపల్లి లాంటి వాళ్ళు మరొకరకమైన పుస్తకాలు వేశారు. నేను అనేది ఏమిటంటే మనం ఒక పక్కనే చూస్తున్నాం. రెండో పక్క చూడటం లేదు. ఇది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న అన్ని విషయాలకూ వర్తిస్తుంది.
----------------------------------------------------------
రచన: పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, 
ఈమాట సౌజన్యంతో

No comments: