Friday, January 25, 2019

వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 1. ఒక ధీర, ఇద్దరు అధీరులు


వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 

1. ఒక ధీర, ఇద్దరు అధీరులు




సాహితీమిత్రులారా!

విశ్వనాథవారి వేయిపడగలు నవలను, మార్గరెట్ మిచల్ (Margaret Mitchell) నవల గాన్ విత్ ద విండ్‌తో పోల్చడమా?! దానికదే ఒక ఆశ్చర్యం. రెండూ ఇంచుమించు ఏక కాలంలో వెలువడినవే కాని, రెండింటి భౌగోళిక తాత్విక నేపథ్యాలు వేరు. ఒకదానిది భారతీయ నేపథ్యం, ఇంకోదానిది అమెరికన్ నేపథ్యం. అలాంటిది, వాటి మధ్య పోలికలు ఒక ఆశ్చర్యమైతే, ఆ పోలికలలో కొన్ని తేడాలూ అంతే ఆశ్చర్యం. రెండు నవలలనూ పక్కపక్కన పెట్టి కాస్త నిశితంగా చూసినప్పుడు, ఇద్దరు రచయితలూ ఒకరికొకరి సమాధానంగానో, లేదా ఒకరినొకరు ఖండించడానికో ఈ రచనలు చేశారా అన్న చిత్రమైన భావన కలుగుతుంది.

వేయిపడగలులో ధర్మారావు నాయకుడు. అందులో ఎలాంటి సందిగ్ధత లేదు. అతని తర్వాత ప్రాధాన్యం ఉన్న పాత్రలన్నీ అతనిపట్ల ఆరాధనాభావమో, విధేయతో ఉన్నవే. అందులోనూ ఉన్నది జీవితచిత్రణే కానీ అది పూర్తిగా లౌకికమూ కాదు పారలౌకికమూ కాదు. అది వాస్తవికత అనే పునాది మీద నిలబడినట్టు కనిపిస్తుంది కానీ అది భ్రాంతిపూర్వక వాస్తవికత లేదా అధివాస్తవికత. దానికి వాస్తవిక ప్రపంచంతో అచ్చమైన బింబ-ప్రతిబింబ సంబంధం లేదు. అందులోని ఇతివృత్తం కానీ పాత్రలు కానీ వాస్తవికంగానే కనిపిస్తాయి కానీ వాటి నడక, వాటి గురించిన వ్యాఖ్యానమూ రచయిత ఊహాప్రపంచాన్ని, ఇష్టాయిష్టాలను, తాత్వికతను అనుసరించి సాగుతాయి. ఒక పోలికతో చెప్పాలంటే, రచయిత డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉంటాడు.

గాన్ విత్ ద విండ్ ఇందుకు పూర్తిగా భిన్నం. ఇందులో ఆష్‌లీ విల్క్స్ (Ashley Wilkes) దాదాపుగా ధర్మారావుతో పోల్చదగినవాడే కానీ నాయకుడు కాదు. ఆష్‌లీతో సమానమైన, బహుశా అంతకంటే ఎక్కువగా ప్రాధాన్యత కలిగిన పాత్రలు మరో మూడు కనిపిస్తాయి: స్కార్లెట్ ఓహారా (Scarlett O’HAra), రెట్ బట్లర్ (Rhett Butler), మెలనీ హామిల్టన్ (Melanie Hamilton). ఆష్‌లీతో వీరి సంబంధం, వేయిపడగలు లోని మిగతా ప్రధాన పాత్రలకు ధర్మారావుతో ఉన్న సంబంధం లాంటిది కాదు. రెట్ అయితే ఆష్‌లీని పూర్తిగా వ్యతిరేకిస్తాడు. ప్రియుడుగా స్కార్లెట్‌కు, భర్తగా మెలనీకి ఆష్‌లీ పట్ల అచంచలమైన ఆరాధనాభావం ఉంది. కానీ, స్కార్లెట్ అందులోంచి బయటపడీ మెలనీ అందులో ఉంటూనే అతన్ని దాటి వెళ్ళీ, సొంత వ్యక్తిత్వాన్ని స్థాపించుకుంటారు. వేయిపడగలకు భిన్నంగా గాన్ విత్ ద విండ్ లోని ఇతివృత్తం, పాత్రలు, వాటి జీవన సరళులూ పూర్తిగా వాస్తవికత అనే పునాదుల మీద నిలబడి ఉంటాయి. వాటి నడక, వాటి వ్యాఖ్యానమూ రచయిత్రి ఇష్టాయిష్టాలను బట్టి కాక వాస్తవికతను అనుసరించి సాగుతాయి. వాటిని అవే డ్రైవ్ చేసుకోడానికి రచయిత్రి వదిలేస్తుంది తప్ప తను డ్రైవింగ్ సీట్లో కూర్చోదు. ఆష్‌లీతో సహా నాలుగు ప్రధాన పాత్రలూ జీవితం పట్ల భిన్న దృక్పథాలకు ప్రాతినిధ్యం వహించేవి అయినా ఒకరి దృక్పథాన్ని ఆమోదించడం కాని, నిరాకరించడం కానీ రచయిత్రి చేయదు. చేయకపోగా వాటి మధ్య ఒక సమన్వయాన్నో సమాధానాన్నో సూచిస్తున్నదా అనిపిస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఆష్‌లీని రెట్ పూర్తిగా వ్యతిరేకిస్తే, నవలలో సగభాగం వరకూ అతని పట్ల ఆరాధనాభావంతో ఉన్న స్కార్లెట్ ఆ తర్వాత దానినుంచి బయటపడి రెట్ దృక్పథానికి దగ్గరవుతుంది. మెలనీ భర్త పట్ల ఆరాధనాభావాన్ని నిలుపుకుంటూనే అతనిని దాటి వెళ్ళి, మారిన పరిస్థితులలో కూడా తనదైన ఒక స్థానాన్ని సృష్టించుకుంటుంది. ఎటూ వెళ్లలేకుండా ఆష్‌లీ ఉన్నచోటే ఆగిపోయి జీవితేచ్ఛ నుంచే నిష్క్రమిస్తాడు. వేయిపడగలలో చిత్రితమైన మేరకు ధర్మారావూ అంతే. (ధర్మారావును భారతీయ సామాజిక, తాత్విక ధోరణులకు ప్రతినిధి పాత్రగా భావిస్తే, వేయిపడగలలో చిత్రితమైనది ఒక నిర్దిష్ట కాలానికి చెందిన అతని జీవిత పార్శ్వమే. భవిష్యత్తులో ఆ జీవితం మరో మలుపు తిరగడానికి అవకాశం ఉంది కనుక ‘వేయిపడగలులో చిత్రితమైన మేరకు’ అని ప్రత్యేకించి అనవలసివచ్చింది.) యుద్ధానికి ముందునాటి తమ జీవితం తాలూకు ఒక్కొక్క అందమూ వైభవమూ యుద్ధంతో అంతరించి పోతుండడాన్ని ఆష్‌లీ నిస్సహాయంగా, సాక్షిమాత్రుడుగా చూస్తూ ఉండిపోయినట్టే, వ్యవస్థ తాలూకు వేయిపడగలలో ఒక్కొక్క పడగే అదృశ్యమవుతుంటే ధర్మారావు కూడా నిస్సహాయుడిగా, సాక్షిమాత్రుడిగా చూస్తూ ఉండిపోతాడు.

ఆష్‌లీ ప్రభావం నుంచి స్కార్లెట్ ఎలా బయటపడిందో, మెలనీ అతనిని దాటి ఎలా ముందుకు వెళ్ళిందో, అతనిపట్ల రెట్ బట్లర్ వ్యతిరేకత ఎలాంటిదో చెప్పుకుందాం:

ఆష్‌లీ – స్కార్లెట్
తండ్రి జరాల్డ్ ఓహారా (Gerald O’Hara Jr.) స్వయంకృషితో పెద్ద ప్లాంటేషన్ యజమానిగా ఎదిగిన వ్యక్తి. మంచి పౌరుషం, తెగింపు, ఉత్సాహం ఉన్నవాడు. తల్లి ఎలెన్ (Ellen O’Hara) సాంప్రదాయికమైన కట్టుబాట్లపై అభిమానం, దైవచింతన ఉన్న వ్యక్తి. ఇలాంటి తల్లిదండ్రుల నీడలో, వారు కల్పించిన భద్రప్రపంచంలో, బానిస పరిచారకుల మధ్య, ఇద్దరు చెల్లెళ్లతో కలసి నిష్పూచీగా పెరిగిన ముగ్ధ స్కార్లెట్ ఓహారా. తమ భద్రప్రపంచం, తమ నివాసమైన టారా ప్లాంటేషన్; దాని చుట్టూ, తన తల్లిదండ్రుల చుట్టూ అల్లుకున్న తన మమకారం శాశ్వతమన్న అమాయకపు భరోసా తప్ప కథాప్రారంభంలో స్కార్లెట్‌కు లోకం తెలియదు. కౌమార-యవ్వన సంధి దశలో అందరు ఆడపిల్లల్లానే తనూ అందమైన కలలు కంటుంది. తమ అంతస్తుకు చెందిన యువకులను అయస్కాంతంలా తన చుట్టూ తిప్పుకోవడం గర్వంగా భావిస్తుంది. అయితే, తన వలపులూ మోహాలూ కుమ్మరించుకున్నది మాత్రం ఒకరిపైనే: అతను ఆష్‌లీ విల్క్స్.

ఆష్‌లీ ఎలాంటివాడంటే, ఏమీ చేయకుండా తమ తీరికను అంతులేని ఆలోచనల మధ్య, ఏమాత్రం వాస్తవికతాస్పర్శ లేని ఏడురంగుల కలలను కంటూ గడిపే మనుషుల పరంపరకు చెందినవాడు. జార్జియా కన్నా అందమైన తన ఆంతరిక ప్రపంచంలోనే సంచరిస్తూ ఎప్పుడైనా అతికష్టంమీద వాస్తవిక ప్రపంచంలోకి అడుగు పెట్టేవాడు. వేయిపడగలులో ధర్మారావూ అంతే. ఆష్‌లీకి తన సంగీతం, తన పుస్తకాలే లోకం. తనకు పూర్తిగా అపరిచితంగా, వింతగా తోచే ఈ బుద్ధిజీవి పట్ల తను ఎందుకు ఆకర్షితురాలైందో స్కార్లెట్‌కే తెలియదు. అతని మానసిక ప్రపంచాన్ని అర్థంచేసుకోగల లోతు తనకు లేదు. రచయిత్రి మాటల్లో చెప్పాలంటే, తాళమూ చెవీ లేని తలుపులా అతని చుట్టూ ఉన్న నిగూఢతే అతని పట్ల ఆమెలో కుతూహలాన్ని పెంచి, అతన్ని సొంతం చేసుకోవడం తప్ప తన జీవితానికి మరో లక్ష్యం లేదనే భావనకు దారి తీయించింది. అంతలో, తన దగ్గరి బంధువైన మెలనీ హామిల్టన్‌ను అతను పెళ్లి చేసుకోబోతున్నట్టు విని హతాశురాలవుతుంది.

ఆ సమయంలోనే ఆష్‌లీ నివాసమైన ట్వెల్వ్ ఓక్స్‌లో (Twelve Oaks) జరిగే బార్బిక్యూ విందుకు వెళ్ళిన స్కార్లెట్ తన ప్రేమ గురించి ఆష్‌లీకి చెప్పి పెళ్లి ప్రతిపాదన చేయాలనుకుంటుంది. అంతకంటే ముందే స్కార్లెట్‌ను కలసిన మెలనీ అన్న ఛాల్స్ హామిల్టన్ (Charles Hamilton) ఆమెతో పెళ్లి ప్రతిపాదన చేస్తాడు. స్కార్లెట్ అందరినీ తప్పించుకుని వెళ్ళి ఆష్‌లీని ఏకాంతంగా కలసుకుని తన ప్రతిపాదన చేస్తుంది. అప్పుడు, తమ ఇద్దరి స్వభావాలూ అతకవనీ తను మెలనీని పెళ్లిచేసుకోబోతున్నాననీ ఆష్‌లీ అమెతో చెబుతాడు. దాంతో ఆమెకు కలిగిన తీవ్ర ఆశాభంగమూ దుఃఖమూ తీవ్ర క్రోధంగా పరిణమించి, స్కార్లెట్ అతని చెంప మీద కొడుతుంది. సరిగ్గా అదే సమయంలో తాము ఇద్దరూ కాక, మూడో వ్యక్తి రెట్ బట్లర్ అక్కడ ఉన్న సంగతి స్కార్లెట్‌కు తెలియదు. స్కార్లెట్ వ్యక్తిత్వం రెట్‌ను ఆకర్షిస్తుంది. అతనిపట్ల ఆమెలో వైముఖ్యమూ అప్పుడే ఏర్పడుతుంది.

ఆష్‌లీ నివాసంలో జరిగిన ఈ బార్బిక్యూ విందు నవలలో అనేకవిధాలుగా కీలకమైన సందర్భం. అందులోనే నలుగురు ప్రధాన పాత్రల భవిష్యజీవన గమనాన్ని నిర్దేశించే పూర్వరంగం ఏర్పడుతుంది. అప్పటినుంచీ ఆష్‌లీని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న వాంఛ స్కార్లెట్‌లో మర్రి చెట్టులా ఎదిగి ఊడలు తన్నుకోవడం మొదలవుతుంది. రెట్ బట్లర్ ఆమెను ప్రతిచోట నీడలా అనుసరించడం, అతని పట్ల తనకు ఎంత వైముఖ్యమున్నా స్కార్లెట్ అతని నుంచి సహాయాలూ ప్రోత్సాహాలూ పొందడం, క్రమంగా అతనితో తన సంబంధం, వైముఖ్యమూ – ఒక్కోసారి వలపూ కలగలిసిందిగా మారడం నవల చివరివరకూ కొనసాగుతూనే ఉంటుంది. ఈ మధ్యలో అతన్ని పెళ్ళాడినప్పటికీ స్కార్లెట్‌లో అతనిపట్ల ఆ మిశ్రమ స్పందన అలాగే ఉండడమే కాక, దాదాపు నవల చివరివరకూ ఆష్‌లీ పట్ల ప్రేమ, అనంతర దశలో స్నేహభావనతో కూడిన అనురక్తీ అంతే పదిలంగా ఉంటాయి.

నవల ప్రారంభంలోనే యుద్ధ సన్నాహాలను రచయిత్రి పరిచయం చేస్తుంది. బార్బిక్యూ విందులో కూడా మగవాళ్ళు యుద్ధం గురించే అదేపనిగా చర్చించుకుంటారు. యువకులు తమ పౌరుషాన్ని, యుద్ధోత్సాహాన్ని చాటుకుంటారు. ఆ చర్చలో రెట్ జోక్యం చేసుకుని, బానిసల శ్రమ మీద వృద్ధి చేసుకున్న పత్తి ప్లాంటేషన్లు, అలవిమాలిన పొగరూ తప్ప ఉత్తరాది రాష్ట్రాలకు ఉన్నట్టు ఒక్క ఆయుధాల ఫ్యాక్టరీ కానీ మరో పరిశ్రమ కానీ ఏమీ లేని మీరు యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తారని ఎద్దేవా చేసి, అందరి దృష్టిలో విలన్‌గా మారతాడు. ఇక్కడే స్కార్లెట్ – బట్లర్ స్వభావాలలో ఉన్న సారూప్యతను రచయిత్రి పరిచయం చేస్తుంది. కారణం భిన్నమైనది కావచ్చు కానీ, స్కార్లెట్ కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంది.

అందరి తలపులనూ యుద్ధం ఆక్రమించుకున్న ఆ సమయంలో స్కార్లెట్ తలపులను మాత్రం ఆష్‌లీ ఒక్కడే ఆక్రమించుకుంటాడు. అతనికి గుణపాఠం చెప్పాలన్న క్షణికోద్రేకంతో ఛాల్స్ హామిల్టన్‌ను పెళ్లి చేసుకుంటుంది కాని, అది ఆష్‌లీకి గుణపాఠం ఎందుకు అవుతుందో ఆమెకే తెలియదు. పెళ్ళైన తర్వాత ఆమె నివాసం ఛాల్స్ స్వస్థలమైన అట్లాంటాకు మారుతుంది. యుద్ధం ప్రారంభమవుతుంది. దక్షిణాది రాష్ట్రాల యుద్ధానికి అట్లాంటా ఒక కీలక ప్రదేశం. స్కార్లెట్ గర్భవతి అవుతుంది. ఛాల్స్ యుద్ధానికి వెళ్ళి అస్వస్థతతో మరణిస్తాడు. ఇక్కడ స్కార్లెట్ కొడుకును కంటుంది. యాష్లీ, మెలనీల వివాహం జరిగి ఆష్‌లీ కూడా యుద్ధానికి వెడతాడు. మెలనీ అట్లాంటాలోని పుట్టింట్లో వదిన స్కార్లెట్‌కు తోడు అవుతుంది. మెలనీ అత్త మిస్ పిటీపాట్ (Aunt Pittypat) వారికి పెద్ద దిక్కు.

ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంటుంది. స్త్రీలతో సహా స్కార్లెట్ చుట్టూ ఉన్న మనుషులందరూ యుద్ధంతో, యుద్ధం గురించిన ఆలోచనలతో, యుద్ధంలో గాయపడిన సొంత కాన్ఫెడరేట్ సైనికులకు వైద్యసేవలు అందించడం వగైరాలతో పూర్తిగా మమేకమవుతారు. వయోభేదం లేకుండా అందరిలో యుద్ధోత్సాహం పొంగిపొర్లుతూ ఉంటుంది. ఈ మమేకతకు పెడగా ఉన్నది ఇద్దరే: స్కార్లెట్ ఓహారా, రెట్ బట్లర్. సాటివారు కళ్ళు వెలిగిపోతూండగా అదేపనిగా యుద్ధం గురించి మాట్లాడడం ఆమెకు విసుగనిపిస్తుంది. యుద్ధం మగవాళ్ళను మట్టుపెట్టే ఒక అర్థరహిత చర్య అనీ, విలాసవస్తువులను దొరకకుండా చేస్తుందనీ అనుకుంటుంది. మిగతా వాళ్ళకు తను భిన్నంగా ఉన్న సంగతినీ, వాళ్లలా ఎవరినీ, దేనినీ తను నిస్వార్థంగా ప్రేమించలేకపోతున్న సంగతినీ కూడా ఆమె గుర్తిస్తుంది. శారీరకంగా, మానసికంగా కూడా తను ఒంటరినయ్యాననిపిస్తుంది.

ఇదే సమయంలో స్కార్లెట్ కూడా తనదైన యుద్ధం ప్రారంభిస్తుంది. అయితే ఆ విషయం అప్పటికామెకు అంత స్పష్టంగా తెలియదు. అది తను కోరుకున్న జీవితాన్ని గెలుచుకోడానికి ప్రారంభించిన యుద్ధం. అందులో ఆమె గెలుపు లక్ష్యాలు రెండే. అవి: ఆష్‌లీ పొందు, టారా ప్లాంటేషన్‌తో ప్రగాఢంగా అల్లుకున్న తన గతజీవితం. నిజానికామెది అసలు యుద్ధానికి ఏ మాత్రం తక్కువైన యుద్ధం కాదు. ఇందులో ఆమె ప్రదర్శించే తెగింపు, పోరాటపటిమ, సాహసమూ కూడా అసలు యుద్ధంలోకంటే ఏమాత్రం తక్కువైనవీ కావు. యుద్ధం కొనసాగుతూ, నేరుగా అట్లాంటా లోకే అడుగు పెట్టే క్రమం లోనూ, ఆ తర్వాత యుద్ధానంతర పునర్నిర్మాణ ఘట్టం లోనూ స్కార్లెట్‌లో మానసికంగా, భౌతికంగా సంభవించిన సమూల పరివర్తన ఎలాంటిదంటే, కథాప్రారంభంలో పరిచయమైన స్కార్లెట్‌కూ ఈ స్కార్లెట్‌కూ ఎలాంటి పోలికా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధం ఒక వ్యక్తి జీవితంలో తెచ్చిపెట్టే మార్పుకు స్కార్లెట్ జీవితం దానికదే ఒక చిన్నసైజు విజ్ఞానసర్వస్వం.

యుద్ధ నేపథ్యం వివిధ దశలలో స్కార్లెట్‌లో తెచ్చిపెట్టిన మార్పును రచయిత్రి ఎప్పటికప్పుడు వ్యాఖ్యానిస్తుంది. యుద్ధపు విషపు కోరలనుంచి తాను అమితంగా ప్రేమించే జీవితాన్ని తిరిగి గుంజుకునే పంటిబిగువు ప్రయత్నంలో స్కార్లెట్ ఉల్లంఘించని కట్టుబాటు లేదు, నీతి లేదు, నియమం లేదు, సడలిపోని విశ్వాసం లేదు. అసలు సహజంగానే ఆమెది కట్టుబాట్లలో ఒదిగే స్వభావం కాదు. వితంతువు అయిన తర్వాత తమ టారాలోని తోటలో ఆమె ఉయ్యాల ఊగుతున్నప్పుడు, అది వితంతువుకు తగదనీ, నలుగురిలో నగుబాటు అవుతుందనీ తల్లి ఎలెన్ మందలిస్తుంది. ఒక అవివాహిత పొందగలిగిన సంతోషాలు, సంబరాలు వితంతువుకు నిషిద్ధాలు. అయితే అట్లాంటా వచ్చాక తను ఏం చేసినా తల్లిలా వారించగలిగినవారు ఎవరూ లేరు. తనవి నృత్యం చేయడానికి అలవాటు పడిన పాదాలు. సైనికుల సహాయార్థం అట్లాంటాలో ఒక చారిటీ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు అందులో తను నృత్యం చేయాలని స్కార్లెట్ సరదా పడుతుంది. అందుకు, తను ఏవగించుకునే రెట్ బట్లర్ నుంచి ఆమెకు ప్రోత్సాహం లభిస్తుంది. రెట్ ఆ సమయంలో హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమవుతాడు.

అట్లాంటా వచ్చాక చర్చికి వెళ్ళడం కూడా మానేస్తుంది. తను పాపం చేస్తున్నానా అని ఒకే ఒకసారి ఆమెకు అనిపిస్తుంది. తర్వాత ఆ పాపచింత కూడా ఉండదు. చెల్లెలు కరీన్ (Careen O’Hara) జబ్బు పడిందనీ, ఆమె స్వస్థత కోసం ప్రార్థన చేయమని తల్లి కోరిందనీ తండ్రి ఉత్తరం రాసినప్పుడు మాత్రం తన గదిలో మోకాళ్ళ మీద కూర్చుని హడావుడిగా ప్రార్థన చేస్తుంది. అయితే ఇంతకు ముందు ప్రార్థన చేసినప్పుడల్లా అనుభూతి చెందిన ప్రశాంతత ఈసారి ఆమెకు కలగదు. దేవుడు ఈ మధ్య తమను, తమ కాన్ఫెడరేట్ సేనను, మొత్తం దక్షిణాది రాష్ట్రాలను చల్లగా చూడడంలేదని అనుకుంటుంది. తల్లి అలవరచిన దైవభక్తిని యుద్ధం మింగేస్తుంది.

యుద్ధం, అది కలిగించే విధ్వంసం తీవ్రమవుతున్న దామాషాలోనే స్కార్లెట్‌లో నీతినియమాల పట్టింపు, మానవీయచింతన జారిపోతాయి. ఆష్‌లీ పొందు, టారాతో ముడిపడిన తన గత జీవితాన్ని గెలుచుకోవడం అనే రెండు లక్ష్యాలు మాత్రమే దూరంగా తళుకులీనే దీపాల్లా మారి ఆమెను అడుగడుగునా శత్రుప్రమాదం పొంచి ఉన్న యుద్ధక్షేత్రంలో ముందుకు నడిపిస్తాయి. యుద్ధం తన ముంగిటికి చేరి అట్లాంటా అట్టుడుకుతున్న సమయంలో ఆమె నొప్పులు పడుతున్న మెలనీ ప్రసవించిన ఘట్టంలో తనకు ఏ మాత్రం అనుభవం లేని మంత్రసానిత్వం కూడా చేస్తుంది. మెలనీని, ఆమె బిడ్డను, తన కొడుకును, ఒక బానిస బాలికను వెంట బెట్టుకుని బట్లర్ సమకూర్చిన ఒక బండి మీద పాతికమైళ్ళ దూరంలో ఉన్న పుట్టింటికి సాహసోపేత ప్రయాణం కడుతుంది.

అక్కడికి వెళ్ళాక ఆమె అన్నింటినీ కొత్త కళ్ళతో చూస్తుంది. టారాకు తను జరిపిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడో ఏ దశలోనో తనలోని బాలికత్వాన్ని కోల్పోయాననుకుంటుంది. ప్రతి కొత్త అనుభవమూ ముద్రపడడానికి తనిప్పుడు మెత్తని మట్టి కాదని, వెయ్యి సంవత్సరాలు గడిచాయా అనిపించే ఈ ఒక్కరోజులోనే గట్టిపడిపోయిన మట్టినని, ఇప్పుడు తను యవ్వనం గతించిపోయిన సంపూర్ణస్త్రీగా మారాననీ స్కార్లెట్ అనుకుంటుంది.

టారాకు చేరాక మరిన్ని కొత్త అనుభవాలు. తను ఏ తల్లి నీడ కోసం పరితపించి ప్రమాదభూయిష్ఠమార్గంలో ఇంత సాహసోద్విగ్న యాత్ర చేసివచ్చిందో ఆ తల్లి మరణించిన సంగతి తెలుస్తుంది. తండ్రి తను ఎరిగున్న వెనకటి తండ్రి కాదు. వెర్రి చూపులు నిండిన అతని ముఖంలో మతి చలించిన ఆనవాళ్ళు. జబ్బుపడిన చెల్లెళ్ళు. వ్యవసాయం మూలపడింది. ఇంట్లో తిండికి గడవని పరిస్థితి. తండ్రి, చెల్లెళ్ళు, మెలనీ పోషణ బాధ్యతను తన భుజాల మీదికి తీసుకుంటుంది. ఇంకొకరి దయాదాక్షిణ్యాల కింద జీవించడం ఓహారాలు ఎరగరని, తమ కాళ్ళ మీద తాము నిలబడతారని, తన భారాన్ని తనే మోస్తానని, జీవితంలో తనకు ఎదురుకాగల మొత్తం కష్టభారాన్ని ఇప్పటికే మోసి తన భుజాలు గట్టిపడిపోయాయి కనుక ఇప్పుడు దేనినైనా మోయగలవని, టారాను తను అనాథను చేయలేననీ అనుకుంటుంది.

ఇంట్లో ఆకలి కడుపులు, లేదా అర్ధాకలి కడుపులు. టారాకు వెలుపలి ప్రపంచం స్కార్లెట్ దృష్టిపథం నుంచి పూర్తిగా అదృశ్యమవుతుంది. తిండి, దానిని ఎలా సంపాదించడం అన్న రెండింటి చుట్టూనే ఇప్పుడామె ఆలోచనలు పరిభ్రమిస్తుంటాయి. అడుగులకు మడుగులొత్తే పరిచారకుల మధ్య అల్లారుముద్దుగా పెరిగిన తను చింకిపాతతో, జబ్బుపడిన వాలకంతో నిర్మానుష్యమైన పొరుగు ఇళ్ల తోటల్లో ఆహారపు వేట కోసం బయలుదేరింది. నృత్యం చేయడానికే రూపొందిన తన చిన్ని పాదాలతో ముతకదారిలో నడుస్తున్నప్పుడు గులకరాళ్ళు చేసిన గాయాలకు నొప్పితో విలవిలలాడుతుంది. ఆహారాన్ని వెతికి తెచ్చి కుటుంబ సభ్యుల కడుపు నింపడమే కాదు, ఇంట్లోకి జొరబడి తాము దాచుకున్న ఆహారాన్ని దోచుకోబోయిన ఒక శత్రుసైనికుని కాల్చి చంపడంలోనూ స్కార్లెట్ ఎంతో ధైర్యాన్ని చాటుకుంటుంది. అతని వద్ద దొరికిన డబ్బుతో కొన్ని రోజులు ఇల్లు గడుపుతుంది. అంతేకాదు, తమ దగ్గర పనిచేసే ఒక బానిస దొంగిలించి తెచ్చిన ఆహారాన్ని స్వీకరించడమూ ఇప్పుడామెకు తప్పనిపించదు. ఆమెలో నైతికమీమాంస పూర్తిగా అడుగంటిపోయి వుంటుంది. తల్లి బోధించిన మంచి, మర్యాద, గౌరవనీయత, ఔదార్యం, దయ, వినయం, సత్యనిష్ఠ మొదలైన సుగుణాలు ఇప్పుడు తనకు ఏ విధంగా సహాయపడతాయో ఆమెకు అర్థంకాదు. ఇంతకన్నా ఒక డార్కీలా పొలం దున్నడమో, పత్తి పనులు చేయడమో నేర్చుకుంటే మంచిది కాదా అనుకుంటుంది. తన కూతుళ్లను ఏ నాగరికతలో పెంచిందో ఆ నాగరికత కుప్పకూలిపోవడాన్ని, సమాజంలో ఏ స్థానాలను పొందడానికి వారికి తను శిక్షణ ఇచ్చిందో ఆ స్థానాలు చిటికెలో మాయమయ్యే పరిస్థితిని తల్లి ఊహించలేకపోయిందన్న వివేకం స్కార్లెట్‌కు లేదు. అలాగే, తల్లికి చెందిన వ్యవస్థిత ప్రపంచం అంతరించి కరకుదనం, కాఠిన్యం నిండిన కొత్త ప్రపంచం అవతరించిందని, ఈ ప్రపంచంలో ప్రతీ కొలమానం, ప్రతీ విలువ మారిపోయాయనీ అర్థంచేసుకునే ఆలోచనాశక్తీ ఆమెకు లేదు. తల్లి బోధించినదంతా తప్పు అన్న నిర్ణయానికి వచ్చింది. ఈ మారిన ప్రపంచంలో బతకడానికి అవసరమైన శిక్షణ, సంసిద్ధత తనకు లేకపోయినా సరే, దానితో ముఖాముఖి తలపడడానికి అవసరమైన మార్పును వెంటనే అందిపుచ్చుకుని రంగం లోకి దిగిపోతుంది. ఆమెలో మారనిది ఒకటే… అది టారా పట్ల వల్లమాలిన మమకారం!

యుద్ధాలు ఎందుకు జరుగుతాయో కూడా స్కార్లెట్ తనదైన కారణాన్ని చెప్పుకుంటుంది. డబ్బు కోసమే యుద్ధాలు జరుగుతాయన్న రెట్ అభిప్రాయం తప్పనుకుంటుంది. సువిశాలంగా వ్యాపించిన వ్యవసాయ భూములకోసం, ఆకుపచ్చని పచ్చికబయళ్ళకోసం, మందకొడిగా ప్రవహించే పసుపు నదులకోసం, చంపకాల చల్లని నీడ పరచుకున్న శ్వేతసౌధాలకోసమే యుద్ధాలు జరుగుతాయనుకుంటుంది. ఇప్పుడు తమకు, రేపు తమ సంతానానికి, ఆ తర్వాత వారి సంతానానికీ పత్తి సంపదను పండించి ఇచ్చే ఈ ఎర్రమట్టి కోసమే యుద్ధాలు జరగాలి తప్ప మరి దేనికీ అంత విలువ లేదని అనుకుంటుంది.

ఆష్‌లీ, స్కార్లెట్‌ల మధ్య ఇక్కడ ఒక పోలికే కాదు, ఒక కీలకమైన తేడా కూడా ఉంది. ఆష్‌లీ కూడా ట్వెల్వ్ ఓక్స్‌లో తన బాల్యం నుంచి గడిపిన అందమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని తిరిగి గెలుచుకోవడం కోసమే యుద్ధం చేస్తున్నానంటాడు. బహుశా అదే దేశభక్తి అని కూడా అంటాడు. యుద్ధాలకు అర్హమైనదిగా స్కార్లెట్ చెప్పిన కారణమూ ఇంచుమించు అలాంటిదే. తేడా ఎక్కడుందంటే, గతజీవితాన్ని తిరిగి గెలుచుకోలేమన్న నైరాశ్యంలోకి జారిపోవడం తప్ప, అందుకు అవసరమైన పురుషప్రయత్నం ఆష్‌లీలో లేదు. లౌకికంగా చూస్తే, వేయిపడగలలోని ధర్మారావులోనూ లేదు. అది స్కార్లెట్‌లో ఉంది.

ప్లాంటేషన్‌ను పునరుద్ధరించి టారాకు పూర్వవైభవం తేవడానికి స్కార్లెట్ వెంటనే నడుంకడుతుంది. ఆ ప్రయత్నంలో తను యజమాని బాధ్యత వహించి మరింత కరకుగా మారిపోయింది. చెల్లెళ్లతో, మెలనీతో పొలంలో కాయకష్టం చేయించింది. ఎంత గింజుకున్నా వినకుండా గృహబానిసల చేత కూడా పొలం పనులు చేయించింది. యుద్ధంలో ఒక కాలు కోల్పోయి, చావుబతుకుల మధ్య టారాకు చేరిన విల్ బెంటీన్ (William Benteen) అనే కాన్ఫెడరేట్ సైనికుడు క్రమంగా కోలుకుని అక్కడే ఉండిపోయి వ్యవసాయం పనులలో స్కార్లెట్‌కు చేదోడు అవుతాడు. అతను ఓహారాలలా ప్లాంటర్‌ల తరగతికి చెందినవాడు కాదు, అతను క్రాకర్ (Cracker), అంటే బీదవాడు, పూర్ వైట్ (po’ white). అర్ధవిద్యావంతుడు. మాటల్లో వ్యాకరణ దోషాలు దొర్లుతాయి. ఓహారాలు పాటించే మర్యాదలు, సంప్రదాయాలూ కొన్ని అతనికి తెలియవు. స్కార్లెట్ ఉద్దేశంలో అతను జంటిల్మన్ అనిపించుకోవడానికి కూడా తగడు. అయితే, క్రమంగా అతని అంకితభావం, వ్యక్తిత్వం స్కార్లెట్‌ను ఎంత ఆకర్షిస్తాయంటే, తమ అంతస్తుకు తగనివాడే అయినా, చిన్న చెల్లెలు కరీన్‌ను అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. నవలలోని విశిష్టపాత్రలలో విల్ బెంటీన్ ఒకడు. స్కార్లెట్‌కు అత్యంత కష్టకాలంలో సాయమందించి కృతజ్ఞత చాటుకున్న మేరకు చూస్తే, ప్లాంటర్‌ల తరగతికి చెందిన ఆష్‌లీ కన్నా కూడా అతను విశిష్టుడు. స్కార్లెట్ తండ్రి జెరాల్డ్ మరణించినప్పుడు విల్ బెంటీన్ చేసిన సంతాపప్రసంగం నవలలో ఒక హృద్యమైన సందర్భం.

యుద్ధం ముగిశాక మొదలైన పునర్నిర్మాణ ఘట్టం స్కార్లెట్‌తో సహా ప్లాంటర్‌ల తరగతికి తెచ్చిపెట్టిన విపత్తులు, మానసిక, భౌతిక కల్లోలాలు, యుద్ధం తెచ్చిపెట్టిన వాటికంటే ఏమాత్రం తక్కువవి కావు. రచయిత్రి ఇలా అంటుంది:

వారు ఆకారంలో వెనకటివారిలానే కనిపిస్తున్నారు కానీ, వెనకటివారు కాదు. ఏమిటా తేడా? వారి వయసు అయిదేళ్లు పెరగడం వల్ల వచ్చిన తేడానా? కాదు, కాలం దొర్లడానికి మించినదేదో వారిలో ఉంది. వారి లోంచి, వారి ప్రపంచం నుంచి ఏదో నిష్క్రమించింది. అయిదేళ్ల క్రితం వరకూ ఒక భద్రతాభావన వారి చుట్టూ మృదువుగా ఆచ్ఛాదించి ఉంది. ఆ సంగతి కూడా వారికి తెలియదు. ఆ భద్రతాభావన కల్పించిన చల్లని ఆశ్రయంలో వారు వికసించారు. ఇప్పుడది అంతరించింది…

అయిదేళ్ళ కాలంలో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్లాంటర్‌ల సమాజంలో వచ్చిన అనేకానేక సమూల పరివర్తనలను రచయిత్రి ఇంచుమించు నవల పొడవునా అద్భుతంగా చిత్రిస్తుంది. ప్రతీ దేశంలోను, ప్రతీ కాలంలోను, యుద్ధమధ్యంలో, యుద్ధానంతర తక్షణ నేపథ్యంలో ఒక సమాజంలో సంభవించే నైతిక, భౌతిక, మానసిక పరివర్తనల అవగాహనకు విశేషంగా తోడ్పడే ఈ చిత్రణ, ఈ నవలకు కేవలం నవల స్థాయిని మించిన ఒక వైజ్ఞానిక స్థాయిని కల్పిస్తుంది. నేను ఇంకొక వ్యాసంలో ప్రస్తావించినట్టు, మన మహాభారతాన్ని యుద్ధ, యుద్ధానంతర సామాజిక నేపథ్యాలనుంచి పరిశీలించాలన్న కుతూహలాన్ని మరింతగా కలిగిస్తుంది.

ప్రస్తుతానికి వస్తే, స్కార్లెట్‌లో విలువల పతనం యుద్ధానంతరం కూడా కొనసాగుతుంది. అది ఎంతవరకు వెళుతుందంటే, గతంలో జరాల్డ్ కింద పనిచేసిన వ్యక్తే ప్రభుత్వాధికారి అయి టారా మీద మోయలేని పన్ను భారం మోపినప్పుడు, టారాను కాపాడుకోడానికి, తమకంటే మంచిస్థితిలో ఉన్న చెల్లెలు సుఎలెన్ (Suellen O’Hara) ప్రియుడు ఫ్రాంక్ కెనెడీని (Frank Kennedy) తను పెళ్లి చేసుకుంటుంది. అతని మరణం తర్వాత, మొదటినుంచి తన వైముఖ్యానికీ వలపుకూ కూడా కేంద్రబిందువు అవుతూ వచ్చిన రెట్ బట్లర్‌ను పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అతనికి దూరమవడం స్కార్లెట్ అనంతర జీవితగాథ. అయితే, నవల చివరి వరకూ ఆమెకు దూరం కానిది, నిరంతరం నిలిచి వెలుగుతూ అంతులేని కష్టాల కత్తులబాటలో ఆమెను ముందుకు నడిపించినది – టారాతో, అక్కడ గడిపిన తన బాల్యకౌమార జీవితంతో గాఢంగా అల్లుకుపోయిన తన మమకారం. టారా పచ్చగా ఉన్నంతకాలం తను ఏమైనా సాధించగలనన్న భరోసా. నవలాంతంలో ఇవీ ఆమె అనుకున్న మాటలు: ఓటమి తమ మొహం మీద వేలాడుతున్నా సరే, ఓడిపోవడం ఎరగని తన పూర్వీకుల స్ఫూర్తితో తిరిగి తను తల ఎత్తుకుంటుంది. రెట్‌ను తిరిగి గెలుచుకుంటుంది. ఆ సంగతి తనకు తెలుసు. ఒకసారి తను మనసు పడిందంటే తను గెలుచుకోలేని మగవాడు అంటూ లేడు. దాని గురించి రేపు ఆలోచిస్తాను, టారాకు చేరాక. అక్కడే నేను నిలదొక్కుకోగలను. అతన్ని తిరిగి దగ్గరకు తెచ్చుకునే మార్గం గురించి రేపు ఆలోచిస్తాను. ఎంతైనా రేపు అనేది వేరొక రోజు.

వాస్తవానికి స్కార్లెట్ యుద్ధ లక్ష్యాలు రెండని మొదట్లో చెప్పుకున్నాం. మొదటిది, ఆష్‌లీ పొందును గెలుచుకోవడం, రెండోది, టారాను గెలుచుకోవడం. నవల మధ్యకు చేరుకునేవరకూ ఆష్‌లీ పొందే ఆమె ప్రథమలక్ష్యం, అందుకోసం అవసరమైతే టారాను వదలుకోడానికి కూడా సిద్ధమేననుకుంటుంది. ఆష్‌లీపై ఆమె మోహం ఎంతటిదంటే, యుద్ధం నుంచి మొదటిసారి అట్లాంటాకు తిరిగివచ్చిన ఆష్‌లీతో ఇలా అంటుంది: నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాను. ఇంకెవరినీ నేను ప్రేమించలేదు. నిన్ను నొప్పించేందుకే చార్లీని పెళ్లిచేసుకున్నాను. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, నీకు దగ్గరవడానికి వర్జీనియా నుంచి ఒక్కొక్క అడుగే వేసుకుంటూ నడిచి వస్తాను. నీకు వండిపెడతాను. నీ బూట్లు పాలిష్ చేస్తాను. నీ గుర్రాన్ని శుభ్రం చేస్తాను. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు. ఆ ఒక్క మాటమీద జీవితమంతా గడిపేస్తాను.

ఆష్‌లీ తనకు సుముఖుడైతే చాలు, తనను తోబుట్టువు కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తున్న మెలనీకి ద్రోహం చేయడానికి కూడా స్కార్లెట్ సిద్ధపడుతుంది. అంతేకాదు, చర్చ్, సమాజం తమను వెలివేసినా సరేననుకుంటుంది. ఎందుకంటే, ఆష్‌లీ తనకు దగ్గరవాలంటే మెలనీతో విడాకులు తీసుకోవాలి. విడాకులన్నది ఊహించడానికే వీలు కాని విషయం. తల్లి ఎలెన్, తండ్రి జరాల్డ్ నిష్ఠ కలిగిన కేథలిక్‌లు. విడాకులు తీసుకున్న వ్యక్తిని తనను పెళ్లాడనివ్వరు. పెళ్లాడితే వారికే కాదు, చర్చ్‌కీ దూరమవడమే. అయినా ఆష్‌లీ కోసం అందుకూ తను సిద్ధపడగలనని స్కార్లెట్ అనుకుంటుంది.

యుద్ధం అయిపోయాక ఆష్‌లీ టారాకు వస్తాడు. అప్పటికి విల్ బెంటీన్ సహకారంతో స్కార్లెట్ వ్యవసాయం పనులలో, కుటుంబపోషణలో తలమునకలవుతూ ఉంటుంది. ఆష్‌లీ రాక రెండు విధాలుగా ఆమెలో కొండంత ఆశ కలిగిస్తుంది. ఆష్‌లీ పొందు తనకు లభించడమే కాక ప్లాంటేషన్‌ను తిరిగి గాడిలోకి తెచ్చి, టారాకు పూర్వవైభవం చేకూర్చాలన్న తన సంకల్పం నెరవేరడానికి అతను అన్నివిధాలా కలిసి వస్తాడనుకుంటుంది. తీరా ఆష్‌లీ స్పందన చూడగానే కుప్పకూలిపోతుంది. అతనిపట్ల అంతకాలం పెంచుకున్న ఆశలు, భ్రమలూ అన్నీ పటాపంచలైపోతాయి. ఆష్‌లీని, తననూ కూడా అప్పటికిగానీ ఆమె పూర్తిగా అర్థం చేసుకోలేకపోతుంది.

ఆష్‌లీపట్ల స్కార్లెట్ భ్రమలు తొలగిపోయి అతని ప్రభావం నుంచి ఆమె బయటపడిన ఈ దీర్ఘ సంభాషణాఘట్టం నవలలో చాలా కీలకమైనది. అది సరిగ్గా నవల మధ్యభాగంలోకి వచ్చి స్కార్లెట్ పూర్వాపర జీవితాల మధ్య ఒకమాదిరి విభజనరేఖ అవుతుంది. టారాను తిరిగి నిలబెట్టే ప్రయత్నంలో ఆష్‌లీ నుంచి ఆమె సానుభూతిని, ఓదార్పును, మద్దతును కోరుకుంటుంది. తన కష్టభారంలో అతను పాలుపంచుకోవాలని ఆశిస్తుంది. అతను తన వెంట ఉంటే ఎంతటి క్లిష్టఘట్టాలనైనా అవలీలగా దాటగలననుకుంటుంది. కానీ ఆష్‌లీ మాటలు వినగానే ఆమె విస్తుపోతుంది. మొదటిసారి అతను తన మనోప్రపంచాన్ని తెరచి ఆమె ముందు పరచినప్పుడు అదామెకు ఏమీ అర్థం కాదు. తామిద్దరూ వేర్వేరు భాషల్లో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.

యుద్ధానికి ముందు వరకూ జీవితం తనకు తెర మీద ఆడించే నీడల్లా తప్ప వాస్తవికంగా ఎప్పుడూ కనిపించలేదని, అదే తనకు ఇష్టంగా ఉండేదని, ఆయా వస్తువుల బాహ్యరేఖలు మరీ ప్రస్ఫుటంగా ఉండడం తనకు నచ్చదని, అవి ఒకింత అవిస్పష్టంగా, మసక మసకగా ఉండాలని, అలాంటిది, యుద్ధం తనను విపరీత వాస్తవికతలోకి, తనతో ఏమాత్రం భావసారూప్యత లేని జనాల మధ్యకీ తీసుకువచ్చిందని, తనదైన చిన్న ఆంతరిక ప్రపంచాన్ని వాళ్లు తమ బురదకాళ్లతో తొక్కేశారనీ ఆష్‌లీ అంటాడు. నా ఇల్లు, సహజసిద్ధమా అన్నట్టుగా ఏనాడూ నా స్పృహలోకి కూడా రాని నా సంపద గతించాయనీ, ఈ నూతన ప్రపంచంలో నేను ఎక్కడా ఇమడలేననీ చెప్పి; చివరిగా నీకు నేను ఏవిధంగానూ సాయపడలేనని కుండబద్దలుకొడతాడు. వీలైనంతవరకు ఒక నాసిరకపు రైతుగా మారగలనని, అది టారా పునరుద్ధరణకు ఏమాత్రం తోడ్పడదనీ అంటాడు.

స్కార్లెట్ నీరుగారిపోతుంది. అప్పటికీ ఆష్‌లీ పొందుపై ఆమెలో ఆశ అణగారదు. టారాను, ఈ కుటుంబ భారాన్నీ అన్నింటినీ వదిలేసి ఏ మెక్సికోకో పారిపోదామని అంటుంది. మెలనీకి ద్రోహం చేసి నేనాపని ఎలా చేయగలననుకుంటున్నావని అతను అంటాడు. అయితే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? అని స్కార్లెట్ అన్నప్పుడు, నీలోని సాహసాన్ని, దృఢసంకల్పాన్ని, జ్వాలనూ ప్రేమిస్తున్నానని ఆష్‌లీ అంటాడు. ప్రేమించడానికీ పోరాడడానికీ నాకు ఇంకేమీ మిగలలేదని అంటూ స్కార్లెట్ తీవ్రనిస్పృహ లోకి జారిపోయినప్పుడు, అతను కిందికి వంగి ఎర్రని మట్టి తీసి ఆమె చేతిలో ఉంచి, నువ్వు ప్రేమించడానికి, పోరాడడానికీ ఇంకా ఇది మిగిలింది అంటాడు. చల్లని ఆ మట్టి స్పర్శతో ఆ క్షణంలోనే స్కార్లెట్‍లో జ్ఞానోదయమవుతుంది. ఆష్‌లీపై భ్రమలు అంతరించి, వివేకం మేలుకుంటుంది. అవును, నాకు ఇంకా ఇది మిగిలింది – అంటుంది.

ఇప్పుడామె పోరాట లక్ష్యాలలో టారా పునరుద్ధరణ ఒక్కటే మిగిలి ఉంది. యుద్ధం తన జీవితంలో తెచ్చిపెట్టిన మహోత్పాతాన్ని, విధ్వంసాన్ని గడిచి గట్టెక్కే మార్గంలో అంతవరకూ తనను మొక్కవోని ధైర్యసాహసాలతో ముందుకు నడిపించిన ఆష్‌లీ పట్ల తన మోహపాశం పుటుక్కున తెగిపోయింది. అతనిపై ఆమె వలపు కాస్తా స్నేహభావనగా మారిపోయింది. అప్పటినుంచి టారా పునరుద్ధరణ అనే ఏకైక లక్ష్యంతో స్కార్లెట్ ముందుకు సాగుతుంది. తన స్వభావానికి ఏమాత్రం నప్పని ఆష్‌లీ ప్రభావం నుంచి ఆమె బయటపడడమంటే, తన స్వభావానికి దగ్గరగా ఉండే రెట్ బట్లర్‌కు దగ్గర కావడమే. అదే జరుగుతుంది. అంతిమంగా ఆమె, శ్రేష్టతాభావన నిండిన ప్లాంటర్‌ల తరగతి నుంచి పూర్తిగా తప్పుకుని యుద్ధానంతరం అవతరించిన సామాన్య జనసందోహంలో చెరువులో చేపలా కలసిపోతుంది. అయితే ఆమెలోని ఈ మార్పు అంతా లక్ష్యరహితం కాదు; తల్లిదండ్రుల చల్లని నీడలో తను టారాలో ఆహ్లాదభరితంగా గడిపిన బాల్యకౌమార జీవితాన్ని తిరిగి గెలుచుకోవడం అనే లక్ష్యం ఆమెను వీడని నీడలా చివరివరకు వెన్నాడుతూనే ఉంటుంది.

స్కార్లెట్ గొప్ప జీవితేచ్ఛకు ప్రతీక. కోసినకొద్దీ మొలకెత్తే, తొక్కిన కొద్దీ తిరిగి తల ఎత్తే పచ్చికలాంటి జీవితేచ్ఛ ఆమెది. సిద్ధాంతాలను, ఆదర్శాలను, నీతి-అవినీతులను, యుక్తాయుక్తాలను, తనకు అడ్డు వచ్చే ప్రతిదానినీ పక్కకు నెట్టేసి మహోధృతంగా ముందుకు సాగే జీవితేచ్ఛ అది. జీవించడం అన్నది స్కార్లెట్‌లో ఒక సహజాతం లాంటిది. తను అమితంగా ప్రేమించిన ఆష్‌లీ తనకు ఏమాత్రం పనికిరాడనుకున్నప్పుడు అతనిని కూడా పక్కకు నెట్టేసి ముందుకు నడిపించిన సహజాతం అది. ఇందుకు భిన్నంగా ఆష్‌లీ మారిన పరిస్థితుల ముందు, నూతన వాస్తవికత ముందు ఓటమిని అంగీకరిస్తూ నిస్సహాయతలోకి, అకర్మణ్యతలోకి జారిపోయినవాడు, ఆగిపోయినవాడు. స్కార్లెట్‌కు ఉన్నట్టు అతనికీ అందమైన గతజీవితం ఉంది. కానీ స్కార్లెట్‌లో ఉన్నట్టు దానిని తిరిగి గెలుచుకోవడానికి అవసరమైన పోరాటపటిమ లేదు, సాహసం లేదు, తెగింపు లేదు. ఫలితంగా తన జీవితేచ్ఛను తనే హరించుకుని పరాజితుడిగా మిగిలిపోతాడు. జీవన యవనిక మీంచే వెనకకు తప్పుకుంటాడు.

లౌకిక జీవన క్షేత్రంలో వేయిపడగలలోని ధర్మారావూ అంతే. అది ఎలాంటిదన్నది వేరే విషయం కానీ, అతనికీ గతించిన లేదా గతిస్తున్న ఒక వ్యవస్థ గురించిన అందమైన ఊహ ఉంది. కానీ ఆష్‌లీలో లేనట్టే ఆ వ్యవస్థను గెలుచుకోడానికి అవసరమైన కార్యాచరణ, పోరాటశీలత అతనిలోనూ లేవు. యుద్ధమూ, అది జీవితాలలో కలిగించే విధ్వంసమూ ప్రత్యక్షంగా చూసిన ఆష్‌లీ, తను చేతులు ముడుచుకున్నా, కోల్పోయిన జీవితాన్ని ఎలాగైనా తిరిగి సాధించుకోడానికి బరిలోకి దిగిన స్కార్లెట్ పట్ల సానుకూల వైఖరితో స్పందించాడు, ప్రోత్సహించాడు. యుద్ధానుభవం లేని ధర్మారావుకు ఆ అవకాశం కూడా లేదు.
(2వ భాగం)
---------------------------------------------------------
రచన: కల్లూరి భాస్కరం, 
ఈమాట సౌజన్యంతో

No comments: